మత ప్రాతిపదికన జాతీయ పౌరసత్వ బిల్లు

| సాహిత్యం | వ్యాసాలు

మత ప్రాతిపదికన జాతీయ పౌరసత్వ బిల్లు

- ఎ. నర్సింహా రెడ్డి | 17.12.2019 02:08:58pm

నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సి) అనేది అస్సాం రాష్ట్రంలోని భారతీయ పౌరులను గుర్తించడానికి భారత ప్రభుత్వం నిర్వహించే రిజిస్టర్‌. ఈ రిజిస్టర్‌ ప్రారంభంలో, ప్రత్యేకంగా అస్సాం రాష్ట్రం కోసం తయారు చేయబడింది. 1951 భారత జనాభా లెక్కల తరువాత ఈ రిజిస్టర్‌ మొదట తయారు చేయబడింది మరియు అప్పటి నుండి ఇది ఇటీవల వరకు నవీకరించబడలేదు. అస్సాం రాష్ట్రంలో ఎన్‌ఆర్సి యొక్క రాష్ట్ర భాగాన్ని నవీకరించే ప్రక్రియ 2013 లో ప్రారంభమైంది. భారత సుప్రీంకోర్టు దాని నవీకరణ కోసం ఒక ఉత్తర్వును జారీ చేసింది. అప్పటి నుండి, సుప్రీంకోర్టు (భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ మరియు రోహింటన్‌ ఫాలి నరిమన్‌ ధర్మాసనం) దీనిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ మొత్తం ప్రక్రియను ఇండియన్‌ అడ్మినిస్ట్రేషవ్‌ సర్వీస్‌ కేడరుకు చెందిన ప్రతీక్‌ హజేలా, అస్సాంలోని జాతీయ రిజిస్ట్రేషన్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌గా నియమించారు.

భారత పౌరసత్వ చట్టం, 1955లో చేసిన సవరణ కారణంగా, అస్సాం రాష్ట్రానికి చెందిన పౌరుల రాష్ట్ర రిజిస్టర్‌, ఇది జాతీయ పౌరుల రిజిస్టర్‌లో భాగంగా ఉంది. ఇది పేర్లను కలిగి ఉండటానికి చట్టబద్దంగా ఉంది. మార్చి 24, 1971 అర్థరాత్రి వరకు అస్సాం యొక్క ప్రాదేశిక పరిమితుల్లోని అప్పటి అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ప్రచురించబడిన ఏలక్టోరల్‌ రోల్స్‌లోనైనా పేర్లు ఉంటే అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్నట్లు తన పేరును రిజిస్టర్‌లో నమోదు చేయడానికి అర్హులు. అతను లేదా ఆమె ఓటరు నమోదు వివరాలను రిజిస్ట్రేషన్‌ అథారిటీకి సమర్పించినట్లయితే, మార్చి 24, 1971 అర్థరాత్రి వరకు జారీ చేసిన కొన్ని నిర్దిష్ట పత్రాలు అతని లేదా ఆమె పేరు లేదా అతని లేదా ఆమె పూర్వీకుల పేర్లలో, ప్రస్తుత అస్సాం రాష్ట్ర ప్రాదేశిక పరిమితుల్లో హోల్టర్‌ లేదా పూర్వీకుల ఉనికిని రుజువు చేస్తుంది.

జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సి) తేనెటీగల తుట్టెను ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మళ్లీ కదిలించారు. అసోంలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా పౌర జాబితాను తయారు చేస్తామని 2019 నవంబర్‌ 20 నాడు రాజ్యసభలో ఆయన ప్రకటించారు. అదే సమయంలో అసోం జాతీయ పౌరసత్వ జాబితాను తిరస్కరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి సంకల్పాన్ని చీల్చి చెండాడారు. అసోంలో ఎన్‌ఆర్‌సి తయారీ నిర్వాకం అత్యంత లోపభూయిష్టంగానూ అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో వడ్డించిన చందంగానూ ఉందని సందేహాతీతంగా రుజువైన తర్వాత అటువంటి విధి విధానాన్నే దేశ వ్యాప్తంగా చేపట్టదలచామని దేశీయాంగ మంత్రి పార్లమెంటు వేదిక మీద నుంచి జాతికి తెలియజేయడంలోని తెగువను ఏమనాలి?

ఇంతకాలమూ మిగతాదేశం ఈ పౌర రిజిస్టర్‌ ప్రక్రియను అసోంకు పరిమితమైన వ్యవహారంగానే చూసింది. దేశపౌరులుగా రుజువు చేసుకోవడానికి అసోం వాసులు పడిన కష్టాలు చూసి వేదన పడింది. ఏళ్ళ తరబడి సాగిన ఆ వడబోత అంతిమంగా అందించిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ బాధ తమకు రానందుకు మనసులోనే సంతోషించింది. ఇక ఇప్పుడు ఎవరూ ఎన్నార్సీ నుంచి తప్పించుకోలేరు. అసోం విధానాన్నే దేశవ్యాప్త ఎన్నార్సీలోనూ పాలకులు అమలుచేస్తారో, లేక దానిమీద అసోం ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నందున ఓ కొత్త విధానాన్ని కనిపెడతారో తెలియదు. మరోపక్క, దేశవ్యాప్త ఎన్నార్సీనుంచి అసోంను మినహాయించబోమని ప్రకటించడం ద్వారా, పాత ఎన్నార్సీ వద్దనీ, కొత్త వడబోత విధానం కావాలన్న అసోం బిజెపి డిమాండ్‌ను కూడా హోంమంత్రి స్వీకరించినట్లయింది. పౌరసత్వ పరీక్షను దాటేందుకు ఇక దేశవాసులంతా పరుగులు పెట్టాల్సిందే, చెమట చిందించాల్సిందే.

వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్రమంత్రి వర్గం డిసెంబర్‌ 9న ఆమోదించింది. ఎవరికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా అనుమానాలు, భయాలు ఉన్నా ఏమాత్రం వెనక్కు తగ్గవద్దని మోడీ ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లుంది. దేశ వైవిధ్యాన్ని చిత్రవధ చేసి జాతి లౌకిక స్వరూపాన్ని సమాధిగతం గావించి మత దురహంకారానికి దూరంగా ఉండే మెజారిటీ హిందువులలో ఆ ఉన్మాదాన్ని దట్టించి బహుళ భారతాన్ని కరడుగట్టిన హిందూత్వ దేశంగా మలచాలని హోంమంత్రి అమిత్‌షా సైద్ధాంతిక సారథ్యంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. డిసెంబర్‌ 9న పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. డిసెంబర్‌ 11న రాజ్యసభ ఆమోదించింది. ఇక రాష్ట్రపతి సంతకం చేస్తే నూతన జాతీయ పౌరసత్వ బిల్లు (ఎన్‌ఆర్‌సి) చట్టంగా ఉనికిలోకి వస్తుంది. ఈ బిల్లు 6వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాంతాలను, ఇన్‌ల్యాండ్‌ పర్మిట్‌ అమలవుతున్న ప్రాంతాలను మినహాయించింది.

పార్లమెంట్‌ ఉభయసభలు పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఈశాన్య రాష్ట్రాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఓ వైపు మోడీ సర్కార్‌ పౌరసత్వ బిల్లు సవరణకు బిజెపి మందబలం ఇతర పార్టీలను బెదిరించే ధోరణితో చట్టసభల్లో చిచ్చురేపింది. దీనికి నిరసనగా బిజెపి పాలిత ఈశాన్య రాష్ట్రాలు అగ్గిలా మండుతున్నాయి. కేంద్రంలోని బిజెపి సర్కార్‌ భారీ స్థాయిలో బలగాలను రంగంలోకి దించి అట్టుడుకుతున్న నిరసనలపై ఖాకీలను ఉసిగొల్పుతున్నది. శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలపై లాఠీలతో పోలీసులు వీరంగం సృష్టిస్తున్నారు. నిరసనలు ఉధృతం కావటంతో రబ్బరు బుల్లెట్లు భాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నారు. అసోం, త్రిపుర రాష్ట్రాల్లో క్యాబ్‌ వ్యతిరేక ఆందోళనల్ని అదుపుచేయటం అక్కడి ప్రభుత్వాలకు సాధ్యం కావటం లేదు.కశ్మీర్‌లోని బలగాలను ఆయా రాష్ట్రాలకు తరలించేలా మోడీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఎన్‌ఆర్‌సి కల్లోలాన్ని దేశమంతటా సృష్టించి తాము పరిష్కరించలేకపోతున్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరి కొంత కాలం పాటు పక్కదారి పట్టించడానికి, అలాగే దేశ ప్రజల మధ్య మతపరమైన ఒక కల్పిత చీలికను సృష్టించాలనే దురుద్దేశ్యం ఆయన ప్రకటన వెనుక దాగి ఉందన్న సందేహాం కలుగుతున్నది. ప్రజల ఆలోచనలను దారి మళ్ళించు చైతన్యాన్ని నీరుగార్చు ఇదీ కమలనాథుల సిద్ధాంతం! ప్రజల మౌలిక సమస్యలకు మసిపూసి, ప్రధాన సమస్యలను అప్రధాన సమస్యలుగా, అప్రధాన సమస్యలను ప్రధాన సమస్యలుగా చిత్రీకరించి, ప్రజల్లో భ్రమలు కల్పించి తమ పబ్బం గడుపుకోవడం వారి ఎత్తుగడ. నిరుద్యోగం, ఆకలి, అవిధ్య, అనారోగ్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయాల సమాహారమైన ప్రజల మనుగడ సమస్యను ముట్టుకోకుండా, ఆ మనుగడ సమస్యను పరిష్కరించేందుకు కించిత్‌ ప్రయత్నం చేయకుండా అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రజలను భావోద్వేగాలలో, భ్రమల్లో ముంచెత్తుతూ తమ అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ తద్వారా దోపిడీ పీడనను శాశ్వతం చేసుకునేందుకు సాహసిస్తున్నాయి సంఘ్‌ పరివార్‌ శక్తులు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు రంగం మీదకు తెచ్చిన దేశవ్యాప్త పౌర నమోదు ప్రక్రియ (ఎన్‌ఆర్‌సి). భారత రాజ్యాంగం అభయమిస్తున్న సర్వసమానత్వ సిద్ధాంతానికి విరుద్ధమైనది. కేవలం ఒక మతం వారిని లక్ష్యంగా చేసుకొని జాతీయ పౌరసత్వ జాబితాను తయారు చేయబోతున్నారని బోధపడుతున్నది. ఇది తన హిందూత్వ వ్యూహానికి ఉపయోగపడుతుందని పాలక భారతీయ జనతా పార్టీ బావిస్తూ ఉండవచ్చు. ఇటువంటి చర్యల ద్వారా హిందూ మెజారిటీని మరింతగా అనుకూలం చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని అది ఆశిస్తూ ఉండవచ్చు. కాని ఇంత కాలం దేశం నిర్మించుకున్న సెక్యులర్‌ ప్రజాస్వామిక స్వరూపానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. భిన్న వర్గాల ప్రజల మధ్య వర్ధిల్లుతున్న సహజీవనం సిరి దెబ్బ తింటుంది.

నిజానికి ఈ ప్రక్రియ జనాభా గణన కాదు. ఇంటింటికీ వచ్చి పౌరుల వివరాలడిగి, అవసరమైన పత్రాలు చూపమని ఎవరూ అడగరు. ఎవరికి వారు తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాలి. అందుకు అవసరమైన పత్రాలేమిటో తెలుసుకుని వాటిని ఎన్‌ఆర్‌సి సేవా కేంద్రాలకు తీసుకుపోవాలి. అధికారుల అనుమాన దృక్కుల నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత పౌరులదే. ఇది అచ్చంగా అస్సాంలో అమలు చేసిన విధానం. అస్సాంలో 1971 మార్చి 24ను కటాఫ్‌ తేదీగా లెక్కేసి, ఆ తేదీ నాటికి నివాసం ఉన్నట్టు చూపే పత్రాలను సమర్పించమని పౌరుల్ని కోరారు. అలా చూపలేనివారిని ఈ దేశ పౌరులుగా ప్రకటించడం సాధ్యం కాదని ప్రకటించారు. జాబితాకెక్కని పౌరుల వివరాలు చూస్తే ఏ వర్గాలు ఇందువల్ల చిక్కుల్లో పడ్డాయో తెలుస్తుంది. నిరుపేదలు, నిరక్షరాస్యులు, మహిళలు వీరిలో అధికంగా ఉన్నారు. ఇంకా లోతులకు పోయి చూస్తే బిచ్చగాళ్లు, ఇల్లూ వాకిలీ లేనివారు ఎక్కువ.

చిత్రమేమంటే ఒకే కుటుంబంలో భార్య ఎన్‌ఆర్‌సీలో ఉంటే... భర్తకు అందులో చోటు దక్కలేదు. అన్నదమ్ముల్లో కొందరు జాబితాలోకెక్కితే మరికొందరికి ఆ అవకాశం దక్కలేదు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే మహమ్మద్‌ సనావుల్లా ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన పేరు గల్లంతు కావడంతో అరెస్టు చేసి నిర్బంధ శిభిరానికి తరలించగా, జాబితాలో చోటు సంపాదించుకున్న కుటుంబసభ్యులు లబోదిబోమంటూ గౌహతి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్‌ దొరికింది. ఇప్పుడు జాబితాలో చోటుదక్కని వారంతా వేర్వేరు నిర్బంధ శిబారాల్లో ఉన్నారు. వీరి విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేయాల్సి ఉంది.

కాషాయ నేతలకు నచ్చని జన సముదాయాలను దేశమంటూ లేని వారుగా పౌరసత్వ రహితులుగా చేయడానికి ఎన్‌ఆర్‌సి నిర్ధేశిస్తుంది. మరోవైపున పౌరసత్వ సవరణ బిల్లు (సిఎబి) ఇష్టమైన వారికి పౌరసత్వం ధృవపరిచేందుకు బాట వేస్తుంది. చొరబాటుదార్లంతా బంగ్లాదేశీయులని (అంటే ముస్లిములని) వారికి ఓటు హక్కు తొలగించి ఏదైనా చట్టవిరుద్ధ పద్ధతులలో వారు గనుక ఎలాంటి పౌరసత్వ గుర్తింపులైనా పొందివుంటే వాటిని లాగేసుకోవడం ఎన్‌ఆర్‌సి అంతరార్థం. ఇక పౌరసత్వ సవరణ బిల్లు చేస్తున్న బహిరంగ వాగ్దానం ఏమంటే ముస్లిములు తప్ప మిగిలిన మత బృందాల వారికి ఆగమేఘాల మీద పౌరసత్వ ప్రధానం చేయాలన్న సంకల్పం. వారంతా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల వేధింపులకు గురైన మైనార్టీలై ఉంటారన్న వాదన ఇందుకు ఆధారం. నిజంగా వారు ఆ విధమైన వేధింపునకు గురైనారని చెప్పడానికి ఏదైనా ఆధారం చూపించాలా అన్నది బిల్లులో పొందుపర్చలేదు. మరోవైపు పొరుగు దేశాలలో మతపరపమైన వేధింపులకు గురై వచ్చిన రోహింగ్యాలు, అహ్మదీయాలు వంటి వారికి అదే విధమైన వెసులుబాటు కల్పించకపోవడం బిజెపి మతతత్వానికి పరాకాష్ట.

ఎన్‌ఆర్‌సి, సిఎబిలకు ఎలాంటి సంబంధం లేదని పార్లమెంటులో నిర్ద్వంద్వంగా అమిత్‌ షా ప్రకటించారు. జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ బిల్లు అనే రెండు అంశాలు ఆయన చెప్పినంత తేలికైనవి కాదు. ఈ బిల్లులకు గల ప్రాతిపదికలే భిన్నవర్గాలకు అభ్యంతరకరంగా ఉన్నాయి. పౌరసత్వ బిల్లుకు సవరణ తెచ్చి దేశమంతటా అటువంటి జాబితాను చేపట్టడమంటే రాజ్యాంగ హామీ ఇస్తున్న సమానత్వ సూత్రానికి తూట్లు పొడవడమే అవుతుంది. భారత దేశంలో నెలకొన్న విస్త్రుత వాతావరణం అలాంటి భరోసా ముస్లిం మైనార్టీలకు కల్పించేదిగా కనిపించదు. మతపరమైన వేగులు మైనార్టీలపై సాగించే హింసాకాండ, అందుకు బాధ్యులైన వారు చట్టం ముందు నిక్షేపంగా తప్పించుకోవడం, తలాక్‌ బిల్లు, 370కి తూట్లు పొడవడం వంటి వన్నీ కూడా భారతదేశంలో మైనార్టీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాలని హిందూత్వ ఫాసిస్ట్‌ రాజ్యం భావిస్తోంది.

ఈ పరిణామాలన్నీ కలిసి ఇస్తున్న దృక్పథం స్వాతంత్య్ర సమయంలో పౌరసత్వం పట్ల ఉన్న భావనకు విరుద్ధమైంది. దీనిపై రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగింది. పుట్టిన స్థలాన్ని బట్టి పౌరసత్వం ఇచ్చే ʹజుస్‌ సోలిʹ అనే విధానం చైతన్యవంతమైందనీ ఆధునికమైందనీ నాగరికమైందనీ ఆ సమావేశం భావించింది. అందుకు భిన్నమైన సూత్రం ʹజుస్‌ సాంగినిస్‌ʹ అంటే జాతిని బట్టి పౌరసత్వం అన్న బావనను తోసిపుచ్చింది. భారత దేశంలోనే పుట్టినా తల్లిదండ్రులలో ఒకరు గనుక స్వతహాగా అక్రమ చొరబాటుదారులైతే (అంటే బంగ్లాదేశీ ముస్లింలని భావం) ప్రత్యేక పౌరసత్వం ఇచ్చే పద్ధతిని 2004లో ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగం తిరస్కరించిన ʹజుస్‌ సాంగినిస్‌ʹ సూత్రానికి సంపూర్ణ బదలాయింపును సిఎబి, ఎన్‌ఆర్‌సి ప్రతిబింబిస్తున్నాయి.

రాజ్యాంగ రీత్యా భారతదేశం ఒక రాజకీయ సముదాయం. దాని పౌరులు జాతీయ పౌర గుర్తింపు కలిగి ఉంటారు. అంతే తప్ప జాతి, ఉపజాతి విబేధాలను బట్టి కాదు. ఎన్‌ఆర్‌సి, సిఎబి ఈ పౌర జాతీయత దృక్పథం నుంచి జాతి దేశీయత దృక్పథం వైపు తీసుకుపోతుంది. జాతిని బట్టి పౌరులలో శ్రేణీకరణ లేదా దొంతరలు ఏర్పరుస్తుంది. చివరగా చెప్పాలంటే రాజకీయ దుస్సాహక లక్షణాలు మూట కట్టుకున్నది. ఈ దేశంలో సున్నితంగా ఉన్న బహుళత్వంలో కూడిన సామాజిక నిర్మాణం పైన ఇవి ఎలాంటి అనర్థదాయకమైన ప్రభావం చూపిస్తాయనేది అన్నిటికన్నా తీవ్రమైన అభ్యంతరం. మన చరిత్రలో కనిపించే సామరస్యం, ఆతిథ్యశీలత వంటి లక్షణాలుఏమవుతాయి? అన్నిటినీ మించి జాతి మతాలకు అతీతంగా మన రాజ్యాంగం హామీనిచ్చిన సమాన పౌరసత్వం ఏమవుతోంది?

అసోం పౌరసత్వ విషయంలో 2013లో సుప్రీంకోర్టు ఒత్తిడి చేయకపోతే అదింకా ఆ స్థితిలోనే ఉండేది. కానీ అస్సాంలో ఎన్‌ఆర్‌సి అమలు చేసి తీరాల్సిందేనంటూ సుప్రీంకోర్టు పట్టుబట్టడంతో దానికి కదలిక వచ్చింది. 2015 జూలైలో ధర్మాసనం మార్గదర్శకాలు విడుదల చేశాక ఈ ప్రక్రియ రాష్ట్రమంతటా మొదలైంది. మొదటినుంచీ దీనిపై పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ ఎన్‌ఆర్‌సిని ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన మౌలిక పత్రమని ప్రశంసించి ఉండొచ్చు... కానీ అస్సాంలోని బిజెపి ప్రభుత్వ పెద్దలకే ఆ జాబితా మింగుడుపడటం లేదు. ఉండకూడని వాళ్లంతా ఆ జాబితాకెక్కగా, అర్హులైనవారెందరో దానికి వెలుపల ఉండిపోయారని హిమంత బిశ్వశర్మ ఆక్రోశిస్తున్నారు.

ఎన్‌ఆర్‌సి జాబితాను అస్సాం సర్కారే తయారు చేసిందని దేశమంతా అనుకుంటుండగా, ఎన్‌ఆర్‌సి రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసి రిటైరైన ప్రతీక్‌ హలేజా ప్రభుత్వానికి ఏ దశలోనూ, ఏమీ చెప్పలేదని ఆయన ఆరోపిస్తున్నారు. బిశ్వశర్మ కోరుకున్నట్టు ప్రభుత్వ ప్రమేయం ఉంటే ఆ జాబితా ఎవరిని ఒడ్డుకు చేర్చేదో... ఎవరిని వీధులపాలు చేసేదో! అనుభవం గడించాకైనా తత్వం బోధపడాలి. అస్సాంలో జరిగిన గందరగోళ పర్వం గమనించాకైనా, జాబితాలో చోటు సంపాదించలేనివారి బాధామయ గాధలు చూశాకైనా దేశవ్యాప్తంగా దీని అమలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో పాలకులు గ్రహించాలి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక చిన్న రాష్ట్రంలో సాగిన ప్రక్రియే ఇంత తప్పుల తడకగా ఉంటే... దేశమంతా ఎన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయో ఊహించుకోవాల్సిందే.

2021 జనాభా లెక్కల కోసం రిజిస్ట్రార్‌ జనరల్‌, జనగణన విభాగం కమీషనర్‌ దశాబ్ది ప్రణాళిక సిద్ధం చేశారు. జనాభా లెక్కలతో పాటు జనాభా రిజిస్టర్‌లో నమోదుకు వ్యక్తిగత వివరాల సేకరణకు సంబంధించిన ప్రక్రియ కూడా వచ్చే వేసవిలో మొదలు పెట్టాల్సి ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే మొన్న పార్లమెంటులో జనగణనకు సంబంధించిన మరో కసరత్తు ప్రతిపాదించారు. అదే దేశ పౌరుల జాతీయ రిజిస్టర్‌ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సి) ఇదివరకు ఈ పని చేసిన వారు పౌరులనే పేరుతో గాక నివాసులుగానే లెక్కలు తీశారు. కానీ ఈ కసరత్తు ఉద్దేశం మాత్రం పౌరులను లెక్క కట్టడమంటున్నారు. అంటే నిర్దిష్టంగా కొంతమంది పౌరులను గుర్తించి, పౌరులు కాని వారిని వేరుచేయడం దీని ధ్యేయం. చొరబాటుదారులనే వారిని ఏరి పారేయడం కోసం ఇదంతా చేసిన తర్వాత వారిని నిర్బంధ శిభిరాలకు తరలించడం లేదా దేశం నుంచి పంపేయడం జరగొచ్చు.

దేశ వ్యాపితంగా ఈ ఎన్‌ఆర్‌సి తతంగం, దాని సాధ్యాసాధ్యాలు, అన్నిటినీ మించి నైతిక చట్టబద్ధత ప్రశ్నార్థకమైనవి. 1947 విదేశీయుల చట్టం ప్రకారం విదేశీయుడుగా ఆరోపణకు గురైన వ్యక్తి తన గుర్తింపును తానే రుజువు చూపుకోవలసి ఉంటుంది. పరాయి దేశస్తులను గుర్తించేందుకు పౌరసత్వ చట్టంలో ఎలాంటి యంత్రాంగం లేదు గనుక ఇలా చేయక తప్పదంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు అక్రమ వలసదారుల చట్టం (ట్రిబ్యునల్‌ ద్వారా గుర్తింపు) ʹఐఎండిటి-2005ʹను కొట్టి వేసింది. పరాయి వారెవరో గుర్తించేందుకు, సాధనాలే లేని ఒక రాజ్యం వారి చొరబాటును అడ్డేందుకు సరిహద్దు రేఖలు కూడా రూపొందించుకోలేని ఒక ప్రభుత్వం తొలగింపు ప్రక్రియ ద్వారా వారిని గుర్తించబూనడం ఎలా సమర్థనీయం? వివాదస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లును విరమించుకోవాలని 1000 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు బహిరంగ లేఖలో కోరారు. అలాగే ప్రముఖ రచయితలు, కళాకారులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులు, సినీనిర్మాతలు, మేధావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ముందుగా, పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంతో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి వలసవచ్చిన హిందూయేతర మతాలవారికి పౌరసత్వాన్ని ప్రసాదించి, అనంతరం ఆ సేతు హిమాచలం ముస్లింలు లక్ష్యంగా దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సి అమలు చేయాలన్నది పాలకుల ఆలోచనగా కనిపిస్తున్నది. అక్రమవలసదారులందరినీ ఏరివేయాలన్న ఈశాన్య రాష్ట్రాల డిమాండను పౌరసత్వ సవరణ బిల్లుతో వమ్ముచేయడమే కాక, ఈ రెండింటినీ యావత్‌ దేశం మీద ప్రయోగించాలన్నది ప్రమాదకరమైన నిర్ణయం. నిజానికి హిందువులైనా, ముస్లింలైనా స్థానికేతరులు పెద్ద ఎత్తున రావడాన్ని ఈశాన్య రాష్ట్రాల వారు వ్యతిరేకిస్తున్నారు.సవరణ బిల్లు ఆమోదంపై ఈశాన్య భారతం మళ్లీ మండిపడ్డది. దీని ద్వారా సంఖ్య రీత్యా గరిష్టంగా లబ్దిపొందేది హిందువులే కనుకు, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా చొరబడినవారిని అధికారికంగా స్థిరపరచి, అక్రమవలసదారుల ఏరివేత కోసం దశాబ్దాలుగా తాము చేసిన పోరాటాలను వమ్ము చేయబోతున్నారని వారి ఆగ్రహం. ఎటువంటి అధికారిక పత్రాలూ లేకున్నా 2014 డిసెంబర్‌ 31 వరకు వచ్చి నివాసం ఉన్న వారికి ఈ బిల్లు ద్వారా పౌరసత్వం దక్కుతుంది కనుక, ఎన్నార్సీలో అక్రమవలసదారులుగా నిగ్గుతేలిన ముస్లిమేతరులంతా దేశపౌరులు అవుతారు. అందువల్లనే ఈశాన్యంలో నిరసనలు సాగుతున్నాయి.

సెక్కులర్‌ జాతిగా వర్థిల్లుతామని రాజ్యాంగపరంగా ప్రమాణం చేసిన మన పాలకులు దేశ ప్రజల్లో మతపరమైన చీలికలు తెచ్చి సౌభాతృత్వ విలువకు చితిపేర్చడం ఎంతమాత్రం సహించడానికి వీలులేనిది. ఆర్థిక మాంద్యం సహా సర్వరంగాలూ దెబ్బతినిపోయిన ప్రస్తుత తరుణంలో ఈ చర్య ప్రజల దృష్టిని మరల్చేందుకు పాలకులకు ఉపకరించవచ్చును. కానీ, భరించగలిగే స్థితిలో ప్రజలు మాత్రం లేరు. ఇదీ ఎన్‌ఆర్‌సి అసలు కథ. ఇలాంటి కాకమ్మ కథలు, కట్టు కథలు కష్ట జీవుల కడుపు నింపలేవు. నిజమైన సంఘ విద్రోహ శక్తుల పీక నొక్కలేవు. నేరస్తులే న్యాయమూర్తులై నేర నిర్థారణ చేస్తున్న నికృష్ట కాలమిది. ప్రజాద్రోహులే పాలకుల అవతారమెత్తి దండనలను అమలు చేస్తున్న దౌర్భాగ్య తరుణమిది. ఈ నిర్ణయాత్మక సమయంలో నిబ్బరంగానే ఉందాం. నిలకడగానే ఉందాం. నిజమైన సమస్యలవైపు దృష్టి సారించి, వాటి పరిష్కారం వైపు అడుగులు సాగిద్దాం.

No. of visitors : 274
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •