• బుర్రతిరుగుడు కథలు
ఈ భూమ్మీద మూడు వంతులు నీళ్ళే అంటారు, వొక వంతే నేలని అంటారు! నేనయితే నాలుగు వంతులూ భక్తే అంటాను! అసలు భక్తి అంటేనే భాగం అని కదా అర్థం? భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు భక్తి మాత్రం సర్వాంతర్యామి యెందుకు కాదు?- అని కూడా అనుకుంటాను!
మనిషి శరీరంలో సుమారుగా మూడింట రెండు వంతులు నీళ్ళే అంటారు, అయితే కావచ్చును కాని మూడుకు మూడొంతులూ భక్తే అంటాను! అసలు భక్తి అంటేనే భయంతో కూడిన స్నేహమని కదా అర్థం? దేశభక్తుల దేవరాజ్యంలో ప్రజలు దైవభక్తులుగా వుండకపోవడం నేరమని, వుండడం అనివార్యమైన అవసరమని కూడా సరిపెట్టుకు సమర్ధించుకుంటాను!
సర్వాంతర్యామి అయిన భక్తి సహజంగానే మనసు మూలల్లో బందీయై యిమడలేకపోయింది! ఇంట్లోని దేవునిగది యిరుకైపోయింది! భక్తి బహిరంగమై యిళ్ళూ గుళ్ళూ గోపురాలూ మసీదులూ చర్చిలూ దాటి రోడ్డెక్కింది! బడ్లూ రోడ్లూ దాటి మైదానాల్లో విస్తరించి కోటి దీపాల కాంతి వుత్సవమయ్యింది! భక్తి పారింది! పోటెత్తింది! పరిమళించింది! ప్రదర్శనీయమయ్యింది! పరమ మురుగయ్యింది! కర్ణభేరుల డప్పుల మీద భజన కీర్తనల హోరయ్యింది!
నిండింది! నిండా మునిగింది! గట్టు తెగింది!
నేను కొట్టుకుపోతూనే వున్నాను!
భక్తి కాలువలు కట్టింది! డ్రైనేజీ పోటీ పడలేక వెనక్కి తగ్గింది!
గంధం దుర్గంధమయ్యింది! మూఢనమ్మకం విశ్వాసమయ్యింది! ఆధ్యాత్మికం ఆత్మ లేనిదయింది!
అలాంటి వుప్పెనలో వూపిరాడక వొడ్డు దొరక్క అవస్థ పడ్డాను! ఆపసోపాలు పడ్డాను! మురుగులో అందరిలా కొట్టుకుపోకుండా పక్కదారి పట్టినందుకు నన్ను నేను నిందించుకున్నాను!
ʹదేవుడా.. నన్ను కాపాడు... నన్ను రక్షించు... నన్ను నీ వొడ్డుకు చేర్చు...ʹ గొంతెత్తి అరిచాను!
అంతే... నా పంట పండినట్టు వొక దేవుడు కాదు, దేవుళ్ళంతా కట్టగట్టుకు వుమ్మడిగా వొకేసారి ప్రత్యక్షమయ్యారు!
నాలాంటి భక్తులంతా యెవరి దేవుళ్ళ దగ్గరకు వాళ్ళు పరిగెత్తారు!
ప్రజలు కులం పేరుతో విడిపోవడం నాకు తెలుసు! ప్రాంతం పేరుతో విడిపోవడమూ నాకు తెలుసు! దేవుడి పేరుతో విడిపోవడం వింతగా చూస్తున్న నా టెంకి మీద దేవుడు జెల్ల కొట్టాడు! నేను గిర్రున నాలుగు చుట్లు తిరిగి మరీ నిలబడ్డాను!
ʹనీ పేరేంటి?ʹ అడిగాడో దేవుడు!
ʹఅన్నీ నీ పేర్లే కదా?ʹ అన్నాను!
ఆ మాటకు దేవుళ్ళంతా దేభ్యం ముఖాలేసుకు నా వంక చూశారు! మరో వంక భక్తకోటి పెట్టుకున్న వరాల అలిఖిత అర్జీలు అందుకున్నారు!
ఏ కోరికా కోరని భక్తులు మాత్రమే వుండి మిగతా భక్తులంతా వెళ్ళిపోవాలని దేవుళ్ళు ప్రకటించారు!
అంతే... భక్తులంతా మాయమై వింతగా గుప్పెడుమంది మాత్రమే మిగిలారు!
ʹశుభం... మీరు యే కోరికా కోరలేదుʹ దేవుళ్ళు ముక్కున వేలేసుకున్నారు!
ʹమా కోరిక చెపితే తప్ప తెలుసుకోనివారు కారు మీరుʹ అన్నారు అతివిశ్వాసంతో గుప్పెడు భక్తుల్లో కొందరు!
ʹఅంతే తప్ప కోరిక లేక కాదన్నమాట?!ʹ అవాక్కయ్యాను నేను!
ʹమీ మనసులోని కోరిక తెలుసుకొని తీర్చే బాధ్యత కూడా మాదేనా?ʹ- అన్నట్టు దేవుళ్ళు తెల్ల మొహాలు వేశారు!
నా వెనుకన నిలబడ్డ కొందరు ʹదేవుడు లేడుʹ అన్నారు!
ʹనీ యెదురుగా వున్నా నీకు కనపడడం లేదా?ʹ అని యే వొక్క దేవుడూ యెందుకో అనలేదు?!
ʹదేవుడు వుంటే యెంత బాగుణ్ణుʹ ఆశగా అన్నాడొక నాస్తికుడు!
నేను వెర్రి చూపులు చూస్తుంటే మళ్ళీ ʹనీ పేరేమిటి?ʹ అని అడిగారు దేవుళ్ళు!
ʹనాకు అల్జీమర్స్... నా పేరు కూడా నాకు గుర్తు లేదుʹ అన్నాను! ʹనాకు ఆధార్ కార్డు లేదు, తెచ్చుకోలేదుʹ గొణుగుతున్నాను!
ʹనీ తలిదండ్రులెవరు?ʹ వోపికగా దేవుళ్ళడిగారు!
ʹమీరే నాకయినా నను కన్నవాళ్ళకయినా తల్లీదండ్రీʹ అన్నాను!
ʹఈ శరీరం నీకెవరిచ్చారు?ʹ యింకా వోపికగా దేవుళ్ళడిగారు!
ʹమీరిచ్చిందే... మీ చేతి మట్టి ముద్దను నేను... మట్టి బొమ్మను నేను...ʹ అన్నాను!
దేవుళ్ళు ముఖా ముఖాలు చూసుకు అడిగారు!
ʹనీ కులం?ʹ
ʹప్చ్ʹ తెలీదన్నట్టు పెదవి విరిచాను!
ʹనీ మతం?ʹ
ʹనాకు అల్జీమర్స్... నాకేది గుర్తు లేదుʹ మళ్ళీ చెప్పాను! ʹఎందుకు?ʹ అన్నట్టు చూశాను!
ʹనీ కోరికలు తీర్చడానికి!ʹ దేవుళ్ళది వొకే గొంతు!
ʹమీలో యే దేవుడు నా కోరిక తీర్చినా చాలుʹ అన్నాను!
దేవుళ్ళంతా అడ్డంగా తలలూపారు! నా పుట్టుపూర్వోత్తరాలు రికార్డుల్లో వెతికి తీయబొతే, వద్దన్నాను!
ʹనువ్వెవరో తెలిస్తే కదా- మాలో యెవరు నీ కోరిక తీర్చాలో వరాలివ్వాలో తెలుస్తుందిʹ అని దేవుళ్ళందరిదీ వొకే మాట!
ʹమీలో యెవరు నా కోరిక తీర్చినా వొకటేʹ నాకభ్యంతరం లేదన్నట్టుగా అన్నాను!
ʹమాకు అభ్యంతరమేʹ అన్నట్టు యే దేవుడూ యెందుకో ముందుకు రాలేదు?!
ʹనేను హిందువులకు దేవుణ్ణిʹ అన్నాడు యీశ్వరుడు! నేను ముస్లింలకు దేవుణ్ణిʹ అన్నాడు అల్లా! ʹనేను క్రైస్తవులకు దేవుణ్ణిʹ అన్నాడు యేసు! అలా దేవుళ్ళందరూ మతాధిపతుల్లా మాట్లాడుతూ ʹనీదే మతంʹ అని అలవాటుగా మళ్ళీ అడిగారు!
ʹనాకు అల్జీమర్స్... నాకేది గుర్తు లేదుʹ అలవాటుగా నేనూ అన్నాను!
ʹనువ్వు నాస్తికుడివి అన్నాకా... ఆస్తికుడివి అన్నాకా... పరవాలేదు, కాని మతం లేకుండా యెట్లా?ʹ దేవుళ్ళు ఘొల్లుమన్నారు!
ʹనాదొక విన్నపంʹ అన్నాను!
చెప్పమన్నట్టు దేవుళ్ళంతా వొకేసారి చూశారు!
ʹపోనీ నాకు లాగే మతం లేని దేవుడు వుంటే ముందుకు వచ్చి నాతో మాట్లాడితే చాలు...ʹ అన్నాను!
ఎందుకో యేవొక్క దేవుడూ ముందుకు రాలేదు?!
ʹఅదే నా కోరికʹ అని ఆశగా చూశాను!
అంతే! దేవుళ్ళంతా టక్కున మాయమైపోయారు!
ఔను, నేనిప్పుడు దేవుడు లేని అనాధని!!*
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |