గురిచూసే పాట గూడ అంజ‌య్య‌

| సంపాద‌కీయం

గురిచూసే పాట గూడ అంజ‌య్య‌

- కాశీం | 02.07.2016 11:47:06pm

ఇవ్వాళ మధ్యాహ్నం(29 జూన్‌ 2016) ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను చూసాను. ఆ వీడియోలో గద్దర్‌, సంజీవ్‌, డప్పు రమేశ్‌, రాజనర్సింహ్మ బృందగానం చేస్తున్నారు. ఒక చరణాన్ని గద్దర్‌ ప్రారంభించి పక్కకు జరగగానే మరో చరణాన్ని అందుకున్న సంజీవ్‌ వీరరసాన్ని ప్రదర్శించాడు. వెంటనే డప్పు రమేశ్‌ అద్భుతాన్ని పలికించాడు. రాజనర్సింహ్మ విస్మయం గొలిపేలా పాడాడు. వీళ్లు జననాట్యమండలి కళాకారులు. విప్లవోద్యమానికి సాంస్కృతిక చరిత్రలో జననాట్యమండలి మేరు పర్వతం.

ఎనభయోవ దశకంలో జననాట్యమండలి నోట ʹʹఊరు మనదిరా| ఈ వాడ మనదిరాʹʹ పాటను విన్నాను. బాల్యంలో దొర కనిపిస్తే కసి తీరా ఈ పాటను పాడటం మాకొక వింత అనుభూతి. అట్లా దొరపై ఉండే మా కోపాన్ని, వ్యతిరేకతను వ్యక్తం చేసేది. ఆ పాట మా జీవితాలలో భాగమయింది. మా జీవితాలకు అక్షరరూపం ఇవ్వటం వలన ఆ పాటకొక జీవితం వచ్చింది. మట్టిని ఇతివృత్తంగా శ్రమను రూపంగా ఎన్నుకోవటం వలన ఆ పాటకొక ప్రత్యేకత ఏర్పడింది. ఇంతటి శ్రమ జీవిత కావ్యాన్ని అల్లింది ఎవరనే విషయం మాకు తెలియదు. 90వ దశకంలో రామోజీరావు నిర్మాణంలో ʹపీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ʹ అనే సినిమా వచ్చింది. రాడికల్‌ కనకన్నను చంపి రక్తం బొట్టు పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన ఎన్టీరామారావుకు సాధికారికతను కల్పించడం కోసం రామోజీ ఈ సినిమాను తీసాడు. పోలీసుల మధ్యన నక్సలైట్ల మధ్యన సామాన్య ప్రజలు నలిగిపోతున్నారనే ప్రచారాన్ని ఈనాడు పత్రికాధిపతి ఈ సినిమా ద్వారా చెప్పి రాజ్యహింసను సాపేక్షికం చేయదలిచాడు.

ఈ సినిమాలోనే ʹʹఊరుమనదిరాʹʹ పాటను వేటూరి సుందరామ్మూర్తి కాపి కొట్టి వక్రీకరించి రాసాడు. అప్పుడు గద్దర్‌, గూడ అంజయ్య పత్రికా సమావేశం పెట్టి ప్రజలపాటను కాపీ కొట్టి సినిమా వ్యాపారానికి ఉపయోగించటాన్ని ఖండించారు. నిజమైన ఆ పాట రచయిత గూడ అంజయ్య అనే విషయం ప్రపంచానికి అప్పుడు తెలిసింది. ఆ పాటను పాడి దేశ వ్యాపితంగా విస్తృత ప్రచారం కల్పించింది గద్దర్‌, జననాట్యమండలి కావటం వలన కూడా ఆ పాటను గద్దర్‌ రాసాడని అనుకునేవాళ్లు. ఇంతటి అద్భుతమైన పాటను రాసింది గూడ అంజయ్య అనే విషయం నాకు అప్పుడు తెలిసింది. దేశంలో 16 భాషలలోకి ఒకే ట్యూన్‌తో అనువాదం పొందిన విప్లవ పాట ఇదేననుకుంటాను.

గూడ అంజయ్య తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా(లింగాపురం గ్రామం, దండపల్లి మండలం)లో 1954లో పుట్టాడు. నోట అక్షరమొక్కటైన నోచుకోని దళిత కుటుంబంలో జన్మించాడు. చదువు నేర్చుకోవాలనే తపనతో అంజయ్య తండ్రి లసుమయ్య అంగి జేబుకు పెన్ను పెట్టుకొని తిరిగేవాడట. అట్లా తన కొడుకును చదివించాలనే గట్టి పట్టుదలతో గూడ అంజయ్యకు అక్షర జ్ఞానం వచ్చింది. అంజయ్యను బడిలో చేర్పించటానికి తీసుకెళ్తే మాలోడికి చదువు చెప్పటం ఎట్లా? అని ఊరి పెత్తందారులు అభ్యంతరం చెబితే కానిగి బడిలో ముస్లీం పంతులు చేరదీసి చదువు చెప్పాడు. తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్లారుస్వామికి కూడా ముస్లీం పంతులే చదువు నేర్పాడు. దళితులను, బ్రాహ్మణులను సమానంగా ఆదరించి అక్షరాలు నేర్పిన సంస్కారం తెలంగాణ నేల మీద ముస్లీంలకే దక్కింది. అక్షరాలు నేర్చుకోవటం వలన అంజయ్య ప్రపంచాన్ని చదివాడు. కన్నీళ్లు, కడగండ్లు అంజయ్యకు మాత్రమే కాదు ప్రపంచమంతా ఉన్నాయని అర్థమయింది.

నవంబర్‌ 1న పుట్టిన అంజయ్య జీవితంలో విషాదమున్నట్లే 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి తెలంగాణకు విషాదాన్ని మిగిలించింది. తెలంగాణ ప్రజలు ఈ విషాద క్షణాల నుంచి తేరుకొని జై తెలంగాణ నినాదాన్ని అందుకోవడానికి పదమూడేళ్లు పట్టింది. ఆ నినాదంలో అంజయ్య భాగమయ్యాడు. రాజ్యం కన్నెర్ర చేసింది. తెలంగాణ ఆకాంక్ష రక్తపుటేరులై పారింది. నిరాశ ఆవరించిన రోజులలో పై చదువుల కోసం అంజయ్య హైదరాబాద్‌ వచ్చి చంచల్‌గూడ జూనియర్‌ కాలేజీలో చేరాడు(1971-73) అంజయ్య లాంటి యువత ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తిరుగుతున్న రోజులవి. నక్సల్బరీ(1967) శ్రీకాకుళం(1969) పోరాటాలు యువతరాన్ని కొలిమిలో కాలిన ఇనుములా మార్చాయి. విరసం ఏర్పాటు తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగంలో పెనుమార్పును తీసుకొచ్చింది. ఈ ప్రభావాలన్ని అంజయ్య మీద ఉన్నాయి. అడివంచు గ్రామం నుంచి వచ్చిన అంజయ్యకు జీవితం తెలుసు- జీవితంలోని ఘర్షణ తెలుసు కనుక సహజంగానే విప్లవ రాజకీయాల వైపు వచ్చాడు.

నిజానికి దళిత కులంలో పుట్టడం, అడివంచు గ్రామంలో ఉండటమంటేనే తెలియకుండానే పోరాట జీవితంలో భాగం కావటమని అర్థం. సమస్యను-దానికి పరిష్కారాన్ని జీవిత అనుభవం నుంచి చెప్పే వాళ్లు శ్రమజీవులు. ఈ అనుభవానికి శాస్త్రీయత జోడిస్తే విప్లవం అవుతుంది. కనుక విప్లవోద్యమం పరిచయం కాకముందే అంజయ్య విప్లవ దృక్పథంతో జీవితాన్ని చిత్రించాడు. ఆయన రాసిన మొదటి పాటను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ʹʹఊరిడిసి నేబోదునా అయ్యో!

ఉరిపెట్టుకొని సత్తునా?ʹʹ(1971) పాట ఎత్తుగడలో అంజయ్యది ప్రత్యేక శైలి. ప్రజల నోటి నుంచి జారిపడిన మాటలను పాటకు పాదాలుగా ఎన్నుకుంటాడు. ఒక రైతు తన బాధను అంజయ్యకు చెప్పిన తీరును పాటగా మలిచాడు. ప్రజల జీవిత అనుభవం నుంచి రూపొందిన సామెతలను, సూక్తులను, నడికారాలను, జాతీయాలను యధాతథంగా వాడుకోవటం తెలుగు కవిత్వంలో మొదటి నుంచి ఉంది. నన్నయ తన కవితా లక్షణాలను ప్రసన్నకథ, అక్షర రమ్యత, సూక్తి నిధిత్వం అని చెప్పుకున్నాడు. ఈ మూడు లక్షణాలు అంజయ్య కవిత్వంలో ఉన్నాయి. ఒక రకంగా నన్నయది మార్గ కవిత. కాని తెలంగాణ నేలలో దేశి కవిత సంప్రదాయం నుంచి పాల్కుర్కి సోమనాధుడు దేశి కవిత్వానికి సాహిత్య గౌరవాన్ని తెచ్చాడు. పాల్కుర్కికి వారసత్వాన్ని కొనసాగింపుగా తెలంగాణలో పాట కవిత్వం వచ్చింది. ఈ పరంపరలోని వాడే అంజయ్య. అయితే అంజయ్యకు విప్లవ రాజకీయాలు పరిచయం కావటం వలన రచనలో ఉండవల్సిన దృక్పథం ఏర్పడింది.

ʹʹనేను పుట్టింది అడవి పక్కలో ఉన్న చిన్న పల్లె. నా సిన్నప్పుడు మా ఊళ్లో భాగోతాలు, జంగాల కథలు చెప్పేవాళ్లు. వాటిని చూడడం నా జీవితంలో భాగమైంది. పదో తరగతి అయిపోయినంక ఇంటర్మీడియట్‌ చదువడానికి హైదరాబాద్‌ పోయాను. అయితే అక్కడికి పోయేసరికి విద్యార్థుల్లో కాలేజీల్లో ఎన్నో మార్పులచ్చాయి. అన్యాయాలను ఎదుర్కోవడం, సమాజంలో మార్పు రావాలనుకునే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. అటువంటి మిత్రులతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకవైపు పల్లె పాటలు, కష్టించే వాళ్ల బతుకులు, రెండోవైపు మార్పును కోరే భావాలు తోడై నన్ను పాటలు రాయడానికి పురికొల్పాయిʹʹ (గూడ అంజయ్య బయోడేటా 2012 పుట.18)

పుట్టి పెరిగిన ఊరును వదిలేసి పోవాలని అన్పించటమే పెద్ద విషాదం. ఏ మనిషి అలా కోరుకోడు, కోరుకున్నాడంటే ఏదో కారణం, ఏమై ఉంటుంది?

ʹʹఎప్పుడో ఒకప్పుడు
ఆరేండ్ల కిందట
బిడ్డ పెండ్లికి ఆరునూర్లపైకం
అప్పుదెచ్చుకుంటిʹʹ

ఇక్కడి వరకు అంజయ్య చెప్పి ఆగిపోతే పాటలో ప్రత్యేకత ఉండకపోవచ్చు. కవిలో ఉండే నిజాయితే రచన విలువను పెంచుతుందంటారు. మరి కవికి నిజాయితీ సమాజం నుంచి వస్తుందనేది సత్యమే కదా! అందుకే అంజయ్య తర్వాతి చరణాలు చూస్తే అర్థమవుతుంది.

ʹʹఅప్పుదెచ్చిన మాట నిజమే
అది వడ్డీకి తెచ్చింది నిజమే
ఆరేండ్లు పనిచేసిన బాకీ దీరలేదు దొరది

బాధతప్పలేదు నాదీʹʹ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రించి పాఠకుడు తనదిగా భావించేటట్లు చేయటం గొప్ప శిల్పం. ఈ శిల్ప నైపుణ్యం అంజయ్య పాటలలో కన్పిస్తుంది.

అంజయ్య పాటల్లో మనో పలకం నుంచి చెదిరిపోని మరో పాట

ʹʹభద్రం కొడుకో
నా కొడుకో కొమురన్న
జరపైలం కొడుకో
నా కొడుకో కొమురన్న
మన వూరుగాని వూరు
మన పల్లెగాని పల్లె
యిది పట్నం కొడుకో

నా కొడుకో కొమురన్నʹʹ ఊరు ఒకటే పట్నమొకటే బాధలన్ని మనకొకటే, పేదలున్న గుడిసెలల్ల బాధలెన్నో ఉన్నాయి, బాధలన్ని పోయేటి బాట ఒకటి ఉన్నది. ఎత్తుగడ ఎంత బలంగా ఉంటుందో అంజయ్య పాటల్లో ముగింపు కూడా అంతే బలంగా ఉంటుంది. కవిత్వంలోనైనా, కావ్యంలోనైనా వస్తువైక్యత ఉండాలని అలంకారికులంటారు. ఇది అంజయ్య కవిత్వంలో ఉంటుంది.

విప్లవోద్యమ నేపథ్యంలో సారభూతమైన పాటలు రాసిన అంజయ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అంతే బలమైన పాటలు రాసాడు. పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు. చస్తూ వర్గ శత్రువును ఒక్కడినైనా వెంట తీసుకెళ్లాలనే సందేశం అంజయ్య పాటలో ఉంటుంది.

ʹʹపుడితొక్కటి
సత్తెరెండు
రాజిగ ఒరి రాజిగʹʹ
ʹʹఅయ్యోనివా నీవు అమ్మోనివా
తెలంగాణోనికి తోటి పాలోనివాʹʹ

పాటలు ధూం ధాం వేదికల మీద దుమ్మురేపాయి. ʹʹనా తెలంగాణʹʹ అంటూ ఆర్తగీతం పాడిన అంజయ్య తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసాడు.

అంజయ్య కేవలం పాట కవి మాత్రమే కాదు, తెలంగాణలో బలమైన కథా, నవలా రచయిత కూడా. విప్లవ, దళిత జీవితాల సమ్మేళనంతో ఐదు దళిత కథలు రాసాడు. అదే విధంగా ఎమర్జెన్సీ నేపథ్యంలో పొలిమేర(నవల) రాసాడు. బహుముఖ ప్రక్రియలలో ప్రవేశించి సాధికారికంగా రాయటం కొందరికే సాధ్యమవుతుంది. అందులో అంజయ్య ఒకరు. ఒక తరాన్ని అంజయ్య దొరల మీద గురిచూసి పాడిన పాట ప్రభావితం చేసింది. ముందుకు నడిపించింది. సామూహిక తిరుగుబాటుకు నినాదమైంది. ఒక కాలానికి ఒక పాటే నిలబడుతుంది. ఆ పాట ఊరుమనదిరా. అంజయ్య లేడు, ఆయన పాట ఉంది.

No. of visitors : 2957
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఊళ్ల‌కు ఊళ్ల‌ను ముంచి తెచ్చే నీళ్లు ఎవ‌రి కోసం: కాశీం

విర‌సం | 23.07.2016 11:05:18am

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ముంచి కోస్తాంధ్ర కాంట్రాక్ట‌ర్ల‌కు లాభాలు చేకూర్చేందుకు ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ఈ ప్రాజెక్టును ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకించాల్సిన........
...ఇంకా చదవండి

ʹమానాలʹ దీర్ఘ క‌విత‌

కాశీం | 02.08.2016 11:49:55am

మానాల అమ‌రుల‌ను స్మ‌రించుకోవ‌డంటే.. విప్ల‌వోద్య‌మంలో అమ‌రులైన వేలాది విప్ల‌వ వీరుల‌ను స్మ‌రించుకోవ‌డమే. అమ‌రుల వారోత్స‌వాల సంద‌ర్భంగా దీర్ఘ క‌విత పాఠ‌కుల......
...ఇంకా చదవండి

విప్లవ ప్రజాస్వామ్యమే ప్ర‌త్యామ్నాయం

కాశీం | 08.07.2016 12:44:22am

ʹబూర్జువా ప్రజాస్వామ్యం - అభివృద్ధి నమూనా - విప్లవ ప్రజాస్వామ్యంʹ పై విర‌సం కార్య‌వ‌ర్గ స‌భ్యుడు కామ్రేడ్‌ కాశీం ప్ర‌సంగం........
...ఇంకా చదవండి

రిజ‌ర్వేష‌న్ వ్య‌తిరేక ఆందోళ‌న‌లు - అగ్ర‌కుల త‌త్వం : కాశీం ఉప‌న్యాసం

కాశీం | 02.06.2016 10:54:27am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విర‌సం 25వ రాష్ర్ట మ‌హాస‌భ‌ల్లో ʹరిజ‌ర్వేష‌న్ల‌పై, కామ్రేడ్ కాశీం ఉప‌న్యాసం...
...ఇంకా చదవండి

భూమికి సరే, జ్ఞాపకాలకు నష్టపరిహారం ఇవ్వగలరా?

కాశీం | 01.08.2016 12:48:58am

చారెడు భూమి ఉంటే తప్ప జీవించలేని మమ్ముల్ని భూమి నుంచి వెళ్లిపొమ్మంటే ఎట్లా? అని ఆ తల్లి ప్రశ్నిస్తున్నది. కేసులు పెట్టి బెదిరిస్తే అదురుకునేది లేదు.......
...ఇంకా చదవండి

తీవ్రతరమౌతున్న నిర్బంధాన్ని ప్రతిఘటిద్దాం!

ప్రొ.జి. హరగోపాల్, కన్వీనర్, నిర్భంధ‌వ్య‌తిరేక వేదిక‌. | 19.02.2020 09:49:07am

. తెలంగాణ, అలాగే దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. 25 ఫిబ్రవరి 2020న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్న...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •