జీవితం పరిమళించిన కథలు

| సాహిత్యం | వ్యాసాలు

జీవితం పరిమళించిన కథలు

- కుప్పిలి పద్మ | 17.12.2019 02:40:54pm

ʹదండకారణ్యంలో స్త్రీ పురుషుల మధ్య వో చక్కని ప్రజాస్వామికమైన అవగాహనా, వొకరి పట్ల వొకరికి బాధ్యతా, గౌరవం, ప్రేమ, మానవీయమైన అనుబంధం వున్నట్టు స్పష్టంగా కనిపించింది. కార్యాచరణకి వ్యక్తిగతానికి నడుమ యెలాంటి తేడా లేకపోవటం వల్ల సాధ్యమయిందా... యీ మానవీయ సుగుణాన్ని వారెలా నింపుకొన్నారని నాలో నేను పలుమార్లు అనుకున్నా..ʹ దండకారణ్య కథల అడవి పరిమళాన్ని ఆదివాసుల పోరాటంలో చూడాలని కుప్పిలి పద్మ అంటున్నారు. ʹనేను శ్వాసిస్తోన్న కాలంలోనే యీ భూమి మీద వో ఆకుపచ్చని స్వప్నం కోసం శ్వాసిస్తూ యెంతటి త్యాగానికైనా సంసిద్ధులైన కామ్రేడ్స్‌ రాస్తోన్న కథలివి..ʹ అని దండకారణ్య కథల ప్రత్యేకతను వివరిస్తున్నారు. ఈ కథల నిండా జీవితానుభావాలు జలజలలాడుతూంటాయని, మనుష్యులంటే నిండైన ప్రేమ, కరుణ ప్రతి వాక్యంలో జాలువారుతుంటాయని అంటున్నారు. విరసం 50 సందర్భంగా కుప్పిలి పద్మతో దండకారణ్య కథలపై ఇంటర్వ్యూ..

1.దండకారణ్య కథల్లో ఏమైనా ప్రత్యేకతలు కనిపించాయా!

అక్షరాలతో పరిచయం అయినప్పటి నుంచి కనిపించిన చిన్ని కాగితంలోని ప్రతి పదాన్ని కూడబలుక్కుంటూ వాక్యాలు వాక్యాలుగా అల్లుకొంటూ నమిలిమింగేసే నాకు చాలా చిన్న వయస్సు నుంచే తెలుగు, యింగ్లీష్‌ భాషల్లో పుస్తకాలు చదవటం మొదలైయింది. రష్యన్‌ సాహిత్యం, తెలుగు యింగ్లీష్‌ అనువాదాలు చదువుతూ నన్ను నేను మర్చిపోయిన సందర్భాలు అనేకం.

గోర్కీ, టాల్‌ స్టాయ్‌, దోస్తావిస్కీ, మార్క్వెజ్‌, నెరూడా, బెన్‌ వొక్రీ, విభూతిభూషణ్‌ బందోపాధ్యాయ యిలా యెందరో నాలోని చదువరి దాహాన్నీ పెంచుతూనే వున్నారు. సాహిత్యాన్ని చదవటం నాకు అత్యంత నిత్యావసరమైన ఆహారం. శ్రీకాకుళ వుద్యమ నేపథ్యంలో నుంచి గోదావరిలోయ బొగ్గుగనుల శ్రామికవర్గం నుంచి విప్లవ సాహిత్యం చదివిన తొలిరోజులు బాగా గుర్తున్నాయి. యిప్పుడు దండకారణ్యపు ఆదివాసి గ్రామాల్లోంచి యిలా వస్తున్న వుద్యమ సాహిత్యం చదువుకోవటం వో కొత్త అనుభవం.

సాధన గారి ʹరాగోʹ కలిగించిన యెరుక, అల్లయ్య రాజయ్యగారి కథల్లో ʹమధ్యవర్తులుʹ, ʹమనిషి లోపలి విధ్వంసంʹ, ʹఅతడుʹ చదువుకున్నప్పుడు ʹఅతడుʹ నన్ను నిద్రపోనీయలేదు. ʹమధ్యవర్తులుʹ లోలోపల నుంచి రేకెత్తించిన ఆలోచనల సుడి నాకింకా గుర్తే. ʹమనిషి లోపలి విధ్యంసంʹ యెప్పటికీ ఆరని జ్వాల.

వివి సర్‌ కవిత్వం, అరుణతారలో వస్తోన్న కథలు చదువుతోనే వున్నా. పాణీ గారు, కూర్మనాథ్‌ గారు, రుక్మిణీ గారు, కరుణ గారు యిలా అనేకమందివి, వేణుగోపాల్‌ గారి వ్యాసాలు మైదానప్రాంతం నుంచి విప్లవ తాత్వికతతో కూడి వుంటాయి.

దండకారణ్యం నుంచి వస్తోన్న కథలని అరుణతారలో చదువుతూనే వున్నా. వనజ గారి ʹఅడివి పుత్రికʹలో కనిపించిన జన జీవితం విప్లవోద్యమంలో వో రైతుకూలి బిడ్డ వొక గెరిల్లాగా యెదిగి నిర్వహించిన కర్తవ్యంని ఆ నవల్లో చదివినప్పుడు వుద్యమాల నుంచి వచ్చిన ప్రపంచ సాహిత్యంపు నవల అనిపించింది.

అయితే యిప్పుడు అరుణతార ప్రచురించిన సంకలనాలని, దండకారణ్య కథలని వొకేసారి వరుసగా చదివాను.

నేనెప్పుడూ అడుగుపెట్టని నేల నుంచి, నేనెప్పుడూ కలవని రచయితల నుంచి వచ్చిన ఆ కథా సాహిత్యం నన్ను విస్మయపరిచింది. కుతూహలం రేకెత్తించింది. నేను శ్వాసిస్తోన్న కాలంలోనే యీ భూమి మీద వో ఆకుపచ్చని స్వప్నం కోసం శ్వాసిస్తూ యెంతటి త్యాగానికైనా సంసిద్ధులైన కామ్రేడ్స్‌ రాస్తోన్న కథలివి. పోరుభూమిలోని అలుపన్నదే లేకుండా వువ్వెత్తున యెగసిపడే కెరటాల్లా నిత్యం నిరంతరం కామ్రేడ్స్‌ సాగిస్తోన్న జీవనపోరాటపు ఆకాంక్షలు, త్యాగం, సాహసం, కలలు, కన్నీళ్లు, యెడబాటు, నిరీక్షణ, సంతోషాలు, విధ్వంసం, నిర్బంధం, దు:ఖం, భయం, నిజాయితీ మొదలైన అనుభవాలు నిండిన కథలు యివన్నీ. దండకారణ్య కథలు తీవ్రమైన నిర్బంధం నుంచి అనుభావాలని అక్షరాల్లోకి అనువదించిన కథలు. యీ యితివ త్తాలు దండకారణ్య సమాజంలో జీవిస్తోన్న రచయితలు మాత్రమే రాయగలిగేవి.

దండకారణ్య కథల్లో పాత్రల్లో ప్రొటోగనిస్ట్‌ స్త్రీ అయినా పురుషుడు అయినా జీవితానుభవానికి అంతస్సూత్రపు తాత్వికత వొక్కటే విప్లవ రాజకీయాలు. అక్కడి విలువలు, నియమాలు.

2. కథా సాహిత్యం మానవ అనుభవాన్ని వున్నతీకరించేలా వుండాలని దాదాపు అందరూ అంగీకరిస్తారు. ఈ కోణంలో చూస్తే దండకారణ్య కథకులందరూ విప్లవ కార్యకర్తలు. యీ క్రమంలోనే కధలు రాశారు. వాళ్ళ అనుభవను మనకు కమ్యూనికేట్‌ చేయగలిగారా? పాత్రల స్వభావం చైతన్యం సంబంధాల చిత్రణ ఈ కథల్లో ఎలా వుందనిపించింది?

మైదాన ప్రాంతపు చదువరులకి దండకారణ్యంలో జరుగుతుంది యేమిటో స్పష్టంగా తెలీదు. తెలిసే అవకాశమూ పెద్దగా లేదు. కానీ విప్లవం కోసం స్వప్నిస్తున్నారని చాల మందికి తెలుసు. యీ రాజకీయ విశ్వాసాల పట్ల ప్రేమ, నమ్మకం, గౌరవం, విస్మయం వున్నవాళ్ళున్నారు. వ్యతిరేకత, అపోహలూ కలిగి వున్నవారూ వున్నారు. వోట్‌ రాజకీయాల్లోకి వీరు రావొచ్చు కదా... వచ్చి ప్రజలతో పని చెయ్యవచ్చు కదా అనేవారు, అనుకున్నవారూ వున్నారు. ప్రేముండొచ్చు లేదా అయిష్టతా వుండొచ్చు. తటస్థంగానూ వుండొచ్చు... కానీ దండకారణ్య సాహిత్యం పట్ల నిశ్శబ్దంగానో, నిర్లక్ష్యంగానో, నిర్లిప్తంగానో పాఠకులు, రచయితలూ వుండే పరిస్థితి, అవకాశం చాల తక్కువ. మైదాన ప్రాంతంలోని వారికి దండకారణ్యపు జనతన సర్కార్‌ ప్రజలకి యేమి చేస్తుందో తెలీదు. అక్కడ అమలవుతోన్న జీవన ఆధారం, అక్కడి చట్టాలు, విద్యా, వైద్యం, ప్రజల ఆకాంక్షలు, ఆశలు తెలీదు. వారి జీవన పద్ధతులు తెలియవు. కామ్రేడ్స్‌ రాజకీయ ఆలోచనలు, పాలనా పద్ధతులు, ఆచరణ, క్రమశిక్షణ, పిల్లల పెంపకం, పెళ్లి, మానవ సంబంధాలెలా వుంటాయి, పిల్లల చుట్టూ తల్లితండ్రుల ఆకాంక్షలు, పిల్లల్లోని ఆలోచనలు యెలా వుంటాయి -యిలా అనేక విషయాలు తెలియవు. అసలు ఆ గ్రామాలూ, యిళ్ళు, ఆహారం యిలా దాదాపు అనేక విషయాలతో ప్రత్యేక్షంగా సంబంధం లేనివారే యెక్కువ.

యీ కథా సాహిత్యం వల్ల యీ విషయాలకి సంబంధించి లీలగానైనా వొక ద శ్యం చదువరి కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ముఖ్యంగా అక్కడ సమిష్టి జీవనవిధానం యెలా కొనసాగుతుందో తెలుస్తుంది. అక్కడి ప్రజల్లో పని చెయ్యటం పట్ల వున్న యిష్టం, వుత్సాహం తెలుస్తాయి. పని విషయంలో సాధించిన సమానత్వం, కష్టాల్లో సుఖాల్లో వారందరి నడుమ వున్న మానవ సంబంధాలల్లోని ఆర్ద్రత, నిజాయితీ కనిపిస్తుంది. ʹసింపుల్‌ లివింగ్‌ʹ అని మైదాన ప్రాంతపు వాళ్ళంతా మాటాడుతోంది అక్కడ వారి జీవన విధానంలో మమేకమైపోయిందని అదే వారి వూపిరని అవగతమవుతుంది. అనేక విషయాల్లో నిజాయితీ, పట్టుదల కనిపిస్తాయి. విపరీతమై నిర్బంధం, కట్టడి నడుమ తమ కోసం పనిచేస్తున్న కామ్రేడ్స్‌ పట్ల ప్రజలకి వున్న ప్రేమ, గౌరవం కనిపిస్తాయి. కామ్రేడ్స్‌ కోసం ప్రాణాలని యిచ్చేసే సంసిద్ధత కనిపిస్తుంది. వ్యక్తుల్లోని మానసిక శక్తిసామర్ధ్యాల బట్టీ వారికి పార్టీలో పనిచేసే అవకాశం వస్తుంది తప్పా స్త్రీనా పురుషుడా అన్న భేదం వల్ల ఆ రోల్‌ ప్లే చెయ్యటం సాధ్యం కాదని అవగతమవుతోంది. దండకారణ్యంలో జనతన సర్కార్‌లో యే విషయంలోనూ జండర్‌ బయాస్‌ లేదని అర్ధం అవుతుంది.

అలానే ప్రజాతీర్పుల్లో ప్రజలందరికీ సమాన భాగస్వామ్యం వుంటుందని తెలుస్తుంది. యిక్కడ న్యాయం, శిక్షలు అమలు చెయ్యటంలో యెటువంటి చర్చ జరుగుతుంది... యిందులో ప్రజల భాగస్వామ్యం యేమిటన్న విషయాలు మిడ్కో గారి ʹʹశిక్షʹʹ కథలో కళ్ళకు కట్టినట్టు రాసారు. అదే కథలో, జనతన సర్కార్‌ హింసకి తావులేకుండా యేర్పడిందని, వున్నత సమాజం కోసం, విలువల కోసం పనిచేస్తుందని తెలుస్తుంది. ʹʹదెబ్బకు దెబ్బ పాత పద్ధ్దతి. మనం చరిత్ర, గతితార్కిక పద్ధతి తెలిసిన వాళ్ళం. మనం కమ్యునిస్టులంʹʹ అని దళ కమాండర్‌ మంగ్తు ʹʹశిక్షʹʹ కథలో వో సంఘటన నేపథ్యంలో అన్నప్పుడు మైదాన ప్రాంత పాఠకులకి వారి రాజకీయ తాత్వికత స్పష్టంగా తెలుస్తుంది.

3. పాత్రల స్వభావం చైతన్యం సంబంధాల చిత్రణ ఈ కథల్లో ఎలా ఉందనిపించింది?

యీ కథా సాహిత్యం భావజాల వ్యాప్తిలా లేదు. పాత్రలన్నీ జీవంతో నిండిన హృదయాలతో కాంతివంతంగా ఉన్నాయి. జీవితపు సంఘర్షణల నుంచి, తమతమ రాజకీయ విశ్వాసాల నుంచి రచయితలు రాసిన కథలు యివి.

4. స్త్రీకోణంలో చాల కథలు రాసిన మీకు ఈ కథల్లోని స్త్రీ కోణం ఏమనిపించింది!

ʹస్త్రీవాద రచయిత్రి అని నిన్ను నువ్వు చెప్పుకోకు... నీ రచనా నీ మనసూ చాలా సున్నితంʹ అని నాకు చాల మంది చెపుతుంటారు.

కావొచ్చు. అలా అనేవారికి యెక్కడో పెమినిజం అంటే బండరాయి అనే అభిప్రాయం వుంది... (చిన్ని నవ్వు) కానీ ఆ సున్నితత్వం, సౌందర్యం పట్ల వో ప్రేమ వుండటం వల్లే స్త్రీల చుట్టూ ఆవరించి వున్న హింసా, అసమానతా వుండకూడదని బలంగా నిజాయితీగా కోరుకోవటం వల్లే రాయగలుతున్నానని నాకనిపిస్తుంది.

దండకారణ్య రచయితలూ అక్కడ జీవితాలని కథలుగా రాస్తున్నప్పుడు వుద్యమ నినాదాలేం లేకుండా అక్కడి ప్రజల హ దయాల్లోకి వుద్యమం యెలా స్థిరంగా వుందో, యెందుకుందో సంఘటనలు, సన్నివేశాల నుంచి వారివారి హ దయపు లోతుల్లోంచి వచ్చిన కథలివి.

వాతావరణాన్ని పరిచయం చేస్తున్నప్పుడు యే వొక్క అనవసర వాక్యం లేదు. చిన్నిచిన్ని డీటెయిల్స్‌తో సహా రాయటంతో ఆ యిళ్ళు అప్పుడే అలికిన గచ్చు, పూసిన పూల పుప్పొడి, యింట్లో సామాను, వెలుగుతోన్న పొయ్యి, ఆరిన నెగడు, నక్షత్రాల మిలమిల, యింట్లో వేలాడే వూయల, నడిచే తోవ, నీటి చెలమా మొత్తంగా యిల్లు, వీధి రోడ్డు, అడివి యిలా మొత్తం వో కథ జరుగుతోన్న ద శ్యం కళ్ళ ముందు కదలాడుతుంది.

విద్వత్తు, సుషుప్తి, సుచేతనమయిన మనుషులు అనేక జీవన వలయాలైన యీ కథలు చదవటం సుసంపన్నమైన యెరెర్రనిరశ్మి హ దయమంతా పరుచుకొన్న అనుభవం.

మిడ్కో గారి ʹʹమెట్ల మీదʹʹ కథలో మిడ్కో గారు రవీందర్‌, లలితల తల్లి సరోజమ్మ పాత్రల నేపథ్యం వారిలోని ఘర్షణలకి మలిచిన తీరు యెంతో బాగుంది. తల్లి సరోజమ్మ తన పిల్లలు వుద్యమంని తమ జీవన చైతన్యంలోకి నింపుకొన్నప్పుడు వారి నిర్ణయాలని ఆమె గౌరవించారు. వారికి దన్నుగా నిలబడ్డారు. సరోజమ్మ తన పిల్లల నిర్ణయాలని వారివారి స్వభావాల నుంచి అర్థం చేసుకొన్న పద్ధ్దతి, వారి వైపు నుంచి ఆమె ఆలోచించి తన భర్తతో పిల్లల ఆశయాలని యెంచుకొన్న జీవన విధానాన్ని అర్థం చేయించటానికి ఆమె యెంతో ఆత్మవిశ్వాసంతో మాటాడారు. యీ కథలో లలిత తన జీవితానుభవాల నుంచి వొక్క రోజైనా కళ్ళ నిండుగా చైతన్యం నింపుకొని మిలమిలా జీవించాలని తన జీవన భాగస్వామిని యెంచుకొని వ్యక్తిగతం, ఆచరణ వొక్కటై బతకాలని అనుకున్నప్పుడు తన చెల్లెలి నిర్ణయం గురించి రవీందర్‌లో గతజీవితానికి వర్తమాన జీవితానికి నడుమ వున్న సంఘర్షణ అతనిలో నింపిన మౌనం చూసినప్పుడు, యెన్నెన్నో సంకెళ్ళతో యెంతగా చిక్కుముడి పడిపోయిందంటే నిర్బంధం వొక సంకెల విప్పుతుంటే మిగతావి మరింతగా బిగుసుకుంటున్నాయనిపించింది. గుండె చిట్లినట్టయింది.

5. వైరుధ్యాలు ఘర్షణ చిత్రణ గురించి చెప్పండి.

భూస్వామికి రైతు కూలీకి, యజమానికీ శ్రామికునికి, స్త్రీలకి పురుషులకి రెండు పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనలు ఘర్షించుకుంటున్నప్పుడు వైరుధ్యం కనిపిస్తుంది. జనతన సర్కార్‌ సమాజంలో యింటర్నల్‌గా వైరుధ్యం యేమీ లేదని చెపితే అది ఆలోచించాల్సిన విషయం.

జనతన సర్కార్‌ అంతర్గత వైరుధ్యాల రహిత సమాజం యేర్పడిందా? యేర్పడితే లేని వైరుధ్యాలని రాయలేరు. వొక వేళ అంతర్గతంగా వున్న వైరూధ్యాలని కథలో కనపడనివ్వకుండా రచయితలు రాసి వుంటే అది యే ప్రయోజనాన్ని ఆశించి చేసి వుంటారు. జనతన సర్కార్‌కి - బయట వున్న ప్రపంచానికి మధ్యన వున్న వైరుధ్యాలు మాత్రమే చూపించటం వొక రాజకీయ లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం అయితే మనం దాని నిర్మాణం, గమనం వివరాలు తెల్సుకోకుండా అర్ధం చేసుకోగలమా?

వొక వేళ నిజంగానే అంతర్గతంగా యే వైరుధ్యము లేనటువంటి వొక సమాజం వచ్చిందంటే భవితవ్యం యేమిటి? యిలాంటి ప్రశ్నలకు సాహిత్యపరంగా సమాధానాలు దొరకటం తేలిక కాదు. దీనికి సమాధానం పాఠకులు చెప్పుకోలేరు. యీ పరిమితులకు లోబడి సాహిత్యాన్ని చర్చించటం సాహసమే. జనతన సర్కార్‌ అంటే భారతదేశంలో యేదో వొక రాష్ట్రంలో యేర్పడి అక్కడికి పరిమితం అయ్యేటటువంటి విషయం అయితే దాన్ని మనం కన్నడ, తమిళ, మరాఠి భాషల్లో కథా సాహిత్యంని చూసినట్టుగానే, లేకపోతే నగరాల్లో, పల్లెటూళ్ళులో వొక యేదో వొక సామాజిక వర్గాన్ని చూసిన కథా సాహిత్యాన్ని చదువుకున్నట్లుగా చదివేసుకోవచ్చు. కానీ యీ సాహిత్యం అలాంటిది కాదు. దీనికి వున్నటువంటి ఆశ, ఆశయం వొక ప్రాంతం నుంచి వొక వర్గం నుంచి పుట్టినదైనప్పటికి ఆ ప్రాంతం ఆ వర్గపు పరిమితులని దాటుకొనిపోవాలి అన్నంత పెద్దది. అత్యంత విశాలమైనది. అందుకని చర్చని యీ కథలు నుంచి మనం యేవి నేర్చుకోవచ్చును అని మొదలుపెట్టడం పొరపాటు. యీ కథల్లో ఐదు దశాబ్దాల మీద విహంగ వీక్షణంగా చూస్తే తెలిసే విషయాలు కొన్ని వున్నాయి. అవి యెంతో విలువైనవి. అలానే తెలుసుకోవలసినవి మరెన్నో వున్నాయి. ముందుముందు వచ్చే సాహిత్యం వల్ల మరిన్ని విషయాలు తెలియవచ్చనుకొంటున్నా.

6. యీ కథల్లో కొట్టొచ్చినట్టు కనపడేది?

యీ మధ్య కాలంలో అస్థిత్వవాద వుద్యమాలు ʹయింటర్‌ సెక్షనాలిటీʹ అంటే వొకటికి మించిన అస్థిత్వాలు వాటి నుంచి వచ్చే ప్రశ్నలు వైరుధ్యాలు వొకేసారి ఆలోచించాలి, విడివిడిగా ఆలోచించడం పొరపాటు అన్న గ్రహింపుకి వచ్చాయి. యీ కథల్లో యీ ʹయింటర్‌ సెక్షనాలిటీʹ దాటిన తర్వాత ఆచరణలో జీవితం యెలా వుండవచ్చునో లీలగానైనా చూపిస్తున్నాయి. ముందు స్త్రీల గురించి తరువాత దళితుల గురించి తరువాత దళితుల గురించో లేక ముందు దళితుల గురించి తరువాత దళిత స్త్రీల గురించో ఆలోచించాలన్న ప్రశ్నలు ఆచరణని అంతులేని వొక నాభీకేంద్రణలోకి తోసేసే ప్రమాదం యెప్పుడూ వుంటూనే వచ్చింది. యీ ప్రశ్నని దాటి చులాగ్గా వొక ఆకళింపుతో జీవించటం అంటే యెలా వుంటుందో యీ కథల్లో సూచన ప్రాయంగా కనబడుతోంది.

1980లలో మధ్యతరగతి యూనివర్సిటీల్లో చదువుకొంటున్న యువకులు నాయకులు అయితే 90 ల్లో రైతాంగపు శ్రామిక వర్గపు నాయకులు కనపడితే, అడివిలో జీవితం వొక దళానికి సంబంధించిన కొద్దిపాటి రొమాంటిసిజంతో కనపడినట్లైతే యీ నాటి కథలు ఆ వర్గాలకి యీ స్థావరాలకు సంబంధించిన కథలు కావు. యీ కథలు ముఖ్యంగా ఆదివాసీ జీవితాలకి సంబంధించిన కథలు. యిందులో 80ల్లో యువతీయువకులుగా వుద్యమంలోకి వచ్చిన యువతీయువకుల్లో కొందరు యీ రోజు యెంతో పరిణితి చెందిన నాయకులు. వారి స్వప్నం కొంత మేరైనా నెరవేరిందని ప్రజలతో పనిచేస్తోన్న కాసింత త ప్తితో వున్నవారు వున్నారు. తమతో వుద్యమంలోకి వచ్చిన వారు అమరులైన విషాదం వారిని యెంతో దు:ఖానికి లోను చేస్తున్నప్పటికీ, ఆ అమరుల స్ఫూర్తితో వారి ఆశయాలను ముందుకు తీసుకెళుతునే ఉన్నారు.

అప్పటి తమ సహచరులని కోల్పోయిన దుఖంలోనూ వారి ఆశయాల సాధనకి కట్టుబడి వుంటామనే కమిట్మెంట్‌తో మరింత కమిటెడ్‌గా కలిసి నడుస్తున్నవారున్నారు.

యీ కథలు అడివి మీద ఆధారపడిన జీవితం నుంచి క్రమక్రమంగా వ్యవసాయంలోకి వస్తున్న యువతీయువకుల కథలు. అంతర్గతంగా వైరుధ్యం లేనటువంటి ప్రపంచం రూపుదిద్దుకొంటుంటే కన్నుకుట్టిన రాజ్యం దాన్ని కూలదోయడానికి చేసే ప్రయత్నాలు యెన్‌కౌంటర్ల రూపంలో, కూబింగ్‌ ఆపరేషన్‌ రూపంలో యెడతెగకుండా సాగుతూనే వున్నాయి. యింతటి దాడిని యెదుర్కొని యీ చిన్ని జీవితాలు కలలు, ఆశలు, ఆశయాల కోసం యెంతలా నిలబడతారు అన్న ఆలోచనలు యీ కథలు చదివిన వాళ్ళకి రాకమానవు. బయట ప్రపంచంతోటి వున్న వైరుధ్యం తాత్వికమైన వైరుధ్యం చర్చల రూపంలో పరిష్కరించుకొనే వైరుధ్యమో కాదు. ఆ వైరుధ్యపు పర్యవసానం ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని అతి బాధాకరమైన దాడి రూపంలోనే అనుభవింప చేస్తోంది. యెన్‌కౌంటర్‌ల్లో సహచరున్ని కోల్పోవటమో, శరీరపు అంగాలను నష్టపోవటమో జరిగినప్పుడు తిరిగి యెట్లా నిలడబగలుగుతారు అన్న ఆలోచనతో గుండె చెరువైపోతుంది.

7. ప్రతి కథా శిల్పానికి కొన్ని ప్రమాణాలు చెప్పుకుంటాం. ఈ వైపు నుంచి దండకారణ్య కథల్లో శిల్పం గురించి?

చాల సందర్భాల్లో వొక వాదం లేదా రాజకీయ ద క్పధం బలంగా చెప్పాలి అనుకున్నప్పుడు శిల్పంని పెద్దగా పట్టించుకోడానికి అవకాశం లేదని అంటారు. కావొచ్చు. కానీ యీ కథల్లో వస్తువు అనేక జీవన పార్శ్వాలకి సంబంధించినప్పటికీ ఆ జీవనం మొత్తం వర్గపోరాటానికి సంబంధించిన రాజకీయ తాత్వికతతో పెనవేసుకొన్నది. కొన్ని కథలు చెప్పిన పద్ధతి యెంతో నచ్చింది. సాధన గారి ʹప్రజా యుద్ధంలో మట్టి వాసనలుʹ వో డైరీ చదువుతున్నట్టే వుంది. మరిన్ని అనుభవాలని చదవాలనిపించింది.

8.ఈ కథల్లో మీకు నచ్చిన అంశం? ఈ కథల పాఠనానుభవం చెపుతారా...?

కథల నిండుగా జీవితానుభావాలు జలజలలాడుతూంటాయి.. మనుష్యులంటే నిండైన ప్రేమ, కరుణ. వారి అడుగుల్లో అరణ్యం పదిలం.

అనేకసార్లు డిస్ట్రబ్‌ అయ్యాను. మనసు చెమ్మగిల్లింది. యెంతో వుత్తేజం మనసు నిండుగా. వెలుగుని నింపుకొన్న మనుష్యులు వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని నింపుకొంటూ సమిష్టి జీవన అభివ ద్ధిని ఆకాంక్షించే ప్రేమాస్పదులు. వెన్నెలంత మ దువైన హాస్యంతో మాటాడేవారు. వొక్కో కథలో పరిచయం అయిన శక్తిమంతులు, విజ్ఞానులు, ధైర్యవంతులు, నిజాయితీపరులు, కరుణహ దయులు, సాహసవంతులు, పసిమనసులు యిలా యెందరో ఆత్మీయులు యిప్పుడు నా చిన్ని ప్రపంచంలో అపురూపంగా. సంతోషమూ... బెంగతో హ దయమంతా అరుణారుణ అరణ్య పరిమళ స్ఫూర్తి.

9.స్త్రీ కోణంలో చాల కథలు రాసిన మీకు ఈ కథల్లోని స్త్రీ కోణం ఏమనిపించింది?

స్త్రీ అంటే శరీర లక్షణాలని బట్టి వచ్చిన వొక అస్థిత్వం అని చాల మంది యిప్పటికీ అనుకుంటూనే వుంటారు. స్త్రీత్వం అనేది చుట్టూ వున్న సమాజం అందులో వున్న సంక్లిష్టత వీటిని బట్టి మారుతుంది. మైదాన ప్రాంతపు స్త్రీత్వం, అగ్రవర్ణ స్త్రీత్వం, ఆస్తి వున్న స్త్రీత్వం, ఆస్తిలేని స్త్రీలు, కులం, మతం, ప్రాంతం యిలా యివి వొకే స్త్రీత్వానికి వేరువేరురూపాలా లేక వస్తుత వేరువేరు స్త్రీత్వాలు అని అనుకోవాలా అన్న ప్రశ్నకి సమాధానం అంత తేలిక కాదు. వుద్యమప్రాంతంలో భిన్న స్త్రీత్వాల అస్థిత్వం వుందని లీలగానైనా కనపడుతోంది. ప్రజలకు సంబంధించిన అనేక విషయాల కోసం, ప్రపంచమంతా కమ్ముకొంటోన్న విధ్వంసకరమైన కొన్ని నిర్ణయాలకి వ్యతిరేకంగా ప్రగతిశీలతతో పని చెయ్యడానికి యేర్పర్చుకొన్న, వ్యవసాయం, రక్షణ, న్యాయం, విద్య, సంస్క తి ప్రచారం, వైద్యం, అటవీ రక్షణ, ఆర్ధికం, వ్యాపారం, లఘు పరిశ్రమలు - యీ తొమ్మిది శాఖల్లో స్త్రీలు చాల ముఖ్యమైన పొజిషన్‌లో వున్నట్టు యీ కథలు చదువుతుంటే తెలుస్తోంది. వారు ప్రతి శాఖలో అత్యంత ప్రధానమైన పాత్రని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.

యీ స్త్రీలలో మైదాన ప్రాంతం నుంచి వుద్యమంలోకి వచ్చిన స్త్రీలు, ఆదివాసీ స్త్రీలు వున్నారని తెలుస్తోంది. అయితే యెవరిది మైదాన ప్రాంతమో, ఆదివాసీ ప్రాంతమో తెలియనంతగా వీరిలో మమేకం కనిపిస్తోంది.

వీరందరి నడుమ వుద్యమం కోసం పనిచేస్తూ వో ప్రగతి శీలమైన ఆవరణని నిర్మించటానికి వివిధ అంశాలని బలంగా నిర్మించే పని చేస్తున్నప్పుడు వొక టీమ్‌గా వారి మధ్య చక్కని అవగాహన, నేర్పు, క్రమశిక్షణ, స్నేహం ప్రస్పుటంగా కనిపిస్తోంది. యిలా స్త్రీలు అన్ని శాఖల్లో పురుషులతో కలిసి పనిచేస్తున్నప్పుడు స్త్రీల నాయకత్వాన్ని పురుషులు గౌరవించటం, ఆమోదించటం కనిపిచింది. యీ సమభావంని అందరిలో రావటంతో యిక్కడ భిన్న అస్థిత్వాల మధ్య సంఘర్షణ, ఘర్షణ యీ కథల్లో పెద్దగా కనిపించలేదు. అయితే యివి సాధించడానికి గతంలో జరిగిన సంభాషణలూ, చర్చలు అందరిలో సమభావం వైపు ఆలోచించే విధంగా చేసుంటాయి. వొక పెద్ద మార్పు కోసం వారంతా యెంతో పరిణితితో యిష్టంగా, బాధ్యతతో కలిసి పనిచెయ్యటం కనిపిస్తుంది. యిదంతా వారికి ప్రజల కోసం పని చేసే విలువైన లక్ష్యంపై వున్న కార్యాచరణ మీద వున్న కమిట్మెంట్‌ వల్ల సాధ్యం అయిందనిపించింది. మైదాన ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీలు చదువుకొన్నవారైతే టీచర్లుగా, డాక్టర్లుగా, రచయితలుగా, పబ్లికేషన్‌ బాధ్యులుగా యిలా అక్షరాలతో సంబంధం వున్న పనులతో పాటు దళనాయకులుగా, ఆదివాసీ స్త్రీలు తుపాకీ పట్టుకొని నాయకత్వ లక్షణాలతో నాయకులుగా వ్యూహకర్తలుగా మిలటరీలో వుండటం కనిపిస్తోంది. యిది మైదాన ప్రాంతపు అనుభవానికి భిన్నంగా వుంది. మైదానప్రాంతపు స్త్రీలు దాదాపు అన్ని రంగాల్లో ప్రవేశించినప్పటికీ వొకప్పుడు స్త్రీలకి అధికారం వొస్తే యీ సమాజంలోని లంచగొండితనం తగ్గుతుందనే ఆలోచన అదో భ్రమగా తేలిపోయిన సందర్భాలే అనేకం.

స్త్రీల నడుమ యింటా బయటా వో ఆరోగ్యకరమైన సిస్టర్‌ హుడ్‌ వస్తుందన్న ఆశ యేమంతగా నెరవేరకపోగా పవర్‌ పాలిటిక్స్‌ ప్రతిచోట ఆపరేట్‌ అవుతూ స్త్రీ అయినా పురుషుడైనా అధికారంలోకి వచ్చేసరికి అన్ని రకాల అప్రజాస్వామిక పద్ధతుల్లోనే అధికారం ఆపరేట్‌ చేస్తూవుంటారు. మారాల్సింది సిస్టమ్‌ అని, ప్రక్షాళన సిస్టమ్‌లోనే జరగాలని పదేపదే అనుకొనే సందర్భాలని, సమయాల్ని, సంఘటనల్ని చూస్తూనే వున్నాం. ఆ నేపథ్యం నుంచి చూస్తే దండకారణ్యంలో స్త్రీ పురుషుల మధ్య వో చక్కని ప్రజాస్వామికమైన అవగాహనా, వొకరి పట్ల వొకరికి బాధ్యతా, గౌరవం, ప్రేమ, మానవీయమైన అనుబంధం వున్నట్టు స్పష్టంగా కనిపించింది. కార్యాచరణకి వ్యక్తిగతానికి నడుమ యెలాంటి తేడా లేకపోవటం వల్ల సాధ్యమయిందా... యీ మానవీయ సుగుణాన్ని వారెలా నింపుకొన్నారని నాలో నేను పలుమార్లు అనుకున్నా.

నిత్యా గారి ʹʹచాయ్‌ గ్లాస్‌ʹ ఫస్ట్‌ పర్సన్‌లో చెపుతోన్న యీ కథలో 1994లో రచయిత్రి దండకారణ్యంలోని దళంలోకి వెళ్ళినప్పుడు తొలిసారి వో వూరిలో మకాం వేసినప్పుడు వో బుడతడికి అతను తాగిన చాయ్‌ గ్లాస్‌ని అతన్నే కడుక్కురమ్మంటే ఆ బుడతడు చాయ్‌ గ్లాస్‌ని నేలకేసి కొడతాడు. అతనికి యెందుకు కోపం వచ్చిందా అని ఆమె ఆశ్చర్యపోతారు. మగపనులని ఆడపనులని అతనిలో నాటుకుపోయిన పిత స్వామ్య భావజాలమని ఆమె గుర్తిస్తారు. 2001లో యింద్రావతి యేరియాలో భూంకాల్‌ స్కూల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అప్పటికే యేర్పడిన జనతన సర్కార్‌ యేర్పాటు చేసిన ప్రజారోగ్యం, న్యాయం, వ్యవసాయం, రక్షణ, విద్యా, సాంస్క తిక శాఖల్లో అమ్మాయిలు అబ్బాయిలు యెలాంటి తేడా లేకుండా కలిసి పనిచేస్తుంటారు.

ʹʹఅమ్మ పొలం దున్నుతుంది

నాన్న ఊయల ఊపుతాడు

చందు అన్నం వండుతాడు

పెదనాన్న బియ్యం చెరుగుతాడుʹʹ అని పిల్లలు చదువుతుంటారు. స్త్రీల పని పురుషుల పని అని కాకుండా పని చెయ్యటానికి లింగభేదం లేదనే విషయం పిల్లలు చదువుకోవటం కనిపిస్తుంది.

2005లో భూంకాల్‌ వుత్సవంలో 1994లో టీ గ్లాస్‌ విసిరేసిన బుడతుడు నూనూగుమీసాల కుర్రవాడిగా తన పళ్ళెం తనే కడుక్కుంటూ యెదురవుతాడు. నేను మునిపటిలా లేనంటాడు. స్త్రీపని పురుషపని అని భావన నుంచి ఆ పిల్లవాడిలో పనిలో ఆడపని మొగపని అనే తేడా లేదనే యెరుక వో పదేళ్ళలో రావటానికి అక్కడ జనతన సర్కార్‌ పెట్టిన యెఫర్ట్‌ స్పష్టంగా కనిపిస్తుంది. పిత స్వామ్యభావాలని మగపిల్లల్లో చెరిగిపోయాయని చెప్పిన ʹʹచాయ్‌ గ్లాస్‌ʹʹ కథ నే చదివిన స్త్రీవాద సాహిత్యంలోనే భలే అద్భుతమైన కథ.

స్త్రీల సమస్యలనే కాదు వర్గపోరాటంకి సంబంధించిన విషయాలపై, రక్షణపై, న్యాయంపై యిలా యెన్నో అంశాలపై బ్లాక్‌ అండ్‌ వైట్‌ గా కాకుండా లేయర్స్‌ లేయర్స్‌గా సమస్త కోణాల నుంచి కథలని రాయటం, అదీ అంతటి నిర్బంధం నడుమ రాస్తున్నారంటే యీ రచయితలు యెంతో శక్తివంతులు. సాహితీచరిత్రలోనే అద్భుతమైన అపురూపమైన రచయితలు.

దండకారణ్యంలో స్త్రీల మధ్య వున్న యీ సిస్టర్‌ హుడ్‌ మీదా, అలానే ఆకాశంలో సగం అన్న భావంని స్త్రీ పురుషుల మధ్య యెలా వికసింపచేసారో, ప్రాక్టికల్‌గా యెలా రోజువారి జీవితంలోకి కార్యాచరణలోకి వచ్చిందో మరింతగా తెలుసుకోవాలనిపించింది.

ముందుముందు వచ్చే సాహిత్యంలో మరింత స్పష్టంగా యీ విషయాలు తెలుస్తాయని ఆశిస్తున్న.

నేనెప్పుడూ చూడని, కలుసుకోని ఈ స్త్రీలందరికీ ప్రేమ పూర్వకమైన కరచాలనాన్ని వినమ్రంగా యీ అక్షరాలతో యిస్తున్నా.

10. మీ కథనం సున్నితంగా సౌందర్యాత్మకంగా వుంటుందని అంటారు. ఈ కోణంలో మీకు దండకారణ్య కథల్లో సౌందర్యం కనిపించిందా.

వూ... నేను సౌందర్యానికి బానిసని... (చిన్ని నవ్వు)....

పొద్దున్నే తెలివి రాగానే పిట్టలు చిన్నగా కిచకిచమనగానే అవి నన్నే పలకరించాయి అనుకుంటా. ముందు నేను కదా లేచొచ్చింది వాటికి నేను చెప్పే గుడ్‌ మార్నింగ్‌ యెలా చెపితే చేరుతుందాని ఆలోచిస్తా. అలానే రాత్రంతా మంచు నెమరేసి వికసించే పువ్వుల్ని చూడటానికే ప్రతి ప్రభాతం నాక్కావాలనిపిస్తుంది. రోజువారి జీవితంలో ప్రతి నిమిషంలో వో అందాన్నే చూడటానికి అలవాటైన నాకు అడివి అంటే విపరీతమైన ప్రేమ. అడివిలోని వెన్నెల, వాన, సూర్యరశ్మి, వాన కురిసివెలిసాక అనేక ఆకులుపువ్వులు తడిసిన సమ్మిళితమై పరిమళం... అరణ్య సౌందర్యం నిరంతర మోహం. మరి యీ కథల్లో అరణ్యం మరింత వుత్తేజంగా, మార్మికంగా, మోహంగా కనిపించింది. పోరాటాల కెరటాల్లోని లేతాకుపచ్చ హ దయాల లేలేత కలలల్లోని వో సమ సమాజపు వాగ్దానం ప్రాచీన భూమ్యాకాశాలంత వాస్తవంగా సౌందర్యం యీ దండకారణ్యపు కథల్లో కనిపిస్తున్నాయి.

నిరంతరం ప్రాణాలని చేతివేళ్ళ అంచుల నుంచి కాపాడుకొంటూ సాగే దండకారణ్య రచయితలు పట్టి యిచ్చిన సౌందర్యం అత్యంత వుత్తేజపూరితమైనది. కొన్నిసార్లు వారి ఆత్మవిశ్వాసంకి నివ్వెరపోయా. ప్రజలందరి మృదువైన జీవనం కోసం ఆలోచించే హ దయాలే అత్యంత సౌందర్యవంతమైనవి.

షహీద గారి ʹప్రక తి బిడ్డలుʹ కథలో బెట్టుడుతను పెంచుతోన్నప్పుడు స్త్రీపురుషులు యిరువురూ ʹʹపెంపుడు తల్లులుʹʹ అవ్వటం భలే బాగుంది. ఆ సందర్భంలో బెట్టుడుతను పడుకోబెట్టే విషయంలో వొక క్యాంపు రెండుగా చీలి బెట్టుడుతకు సంబంధించిన సహజాతాన్ని, స్వేచ్ఛకి జరిగిన సంభాషణ, ఆ అభిప్రాయాలు, విద్యార్థి రంగం నుంచి వచ్చి ప్రజా గెరిల్లాగా మారిన సుధీర్‌ ʹʹమనం యీ హింసను ఎలా అనుమతిస్తాం? మనం అందరి స్వేచ్ఛ కోసం పోరాడతాం. మరి ఇప్పుడు దీని స్వేచ్ఛను యెందుకు అరికడుతున్నాం?ʹʹ అని అంటారు. - యెంతో చక్కని సున్నితత్వం కదా.

అలానే కొన్ని పనుల కోసం కలిసి కొద్దికాలం గడిపి విడిపోతోన్న ప్రతి సారీ మళ్ళీ యెప్పటికి కలుస్తామో అన్న బెంగతో వీడ్కోలు తీసుకొనే సందర్భాల్లోని వుద్వేగం నా కళ్ళల్లోకి ప్రవహించింది. చెమర్చింది చూపులు మాత్రమే కాదు... గుండె కూడా.

అలానే షహీదా గారి ʹʹచిన్ని రెడ్‌ గార్డులుʹʹ కథలో దండకారణ్యంలో పిఎల్‌ జిఎ యోధులకు శిక్షణ యిచ్చిన మహేందర్‌ మిలీషియా వారికి శిక్షణ యిచ్చే సందర్భాలు యెప్పటికప్పుడు రోమాంచితంగానే వుంటాయి అంటూ ʹʹఆ సందర్భాలు అతనికి నేరుగా మట్టితో సంభాషిస్తున్న అనుభూతిని కలిగిస్తుంటాయి. ఎక్కువ సమయం మిలటరీ క్యాంపులు నడుపుతూ గడిపే అతను మట్టిమనుషుల నాడిని తెలుసుకోడానికి ఉపయోగపడే సందర్భాల కోసం ఆత్రంగా యెదురుచూస్తుంటాడుʹʹ అన్నప్పుడు వొక వ్యక్తిలోని విభిన్న పార్శ్వాలు పరిచయం అవుతుండటం, మట్టిమనుషుల నాడి తెలుసుకోవాలి అనుకోవటంలో అతని హ దయ జీవన సౌందర్యం వొత్తుగా మనసుకి చుట్టుకొంది. యీ కథలో షహీదా గారు యెంతో నేర్పుతో అనేక లేయర్స్‌లో పాత్రల అంతరంగాన్ని అందించారు.

దండకారణ్యంలో తీవ్రమైన నిర్బంధంలో యే క్షణం యే హింస వారిని చుట్టుముడుతుందో తెలియని ఆదుర్దా, వుద్రిక్తత, భయం నడుమ రోజువారి జీవితపు క్రమశిక్షణ, సున్నితమై హాస్యం, సహచర్యపు లాలిత్యం, కామ్రేడ్స్‌ని కోల్పోయినప్పప్పటి దుఖం, యెదురు చూపులని పంటిబిగువున నొక్కి పెట్టిన కన్నీటి చెమ్మ యిలా యెన్నో యెన్నో భిన్న యిమోషన్స్‌ని అత్యంత బలంగా, లోతుగా చెప్పిన రచయితలు యీ దండకారణ్య కథల నిండుగా కథా సాహిత్యాన్ని వో ఆకుపచ్చ జ్వాలగా వెలిగిస్తూనే వున్నారు.

11. మొత్తంగా ఈ కథల నుంచి మీరేం కాప్చర్‌ చేస్తారు?

1969లో శ్రీకాకుళం వుద్యమం మొదలు, 80ల్లోని గోదావరి లోయ రైతాంగం, బొగ్గు గనుల శ్రామిక వర్గం నుంచి యిప్పుడు దండకారుణ్యపు ఆదివాసీ గ్రామాల్లోంచి యిలా వుద్యమ సాహిత్యం ప్రయాణించింది. వుద్యమకారులు, వారి ఆశలు, నడవడులు అనేక పార్శ్వాల నుంచి చూపించింది. సాహిత్యం లక్ష్యం 1969లో బోధించటం అయితే, 80ల్లో విశ్లేషించటం.

యిప్పటికీ కథలో సారాంశం, సందేశం వెతకటం వొక అలవాటుగా చాలమంది చేస్తుంటారు. కానీ వొక సారాంశం, సందేశం వుంటే అది ప్రచారం అవుతుంది కానీ సాహిత్యం కాదు.

90లలో షహీదా గారు, మిడ్కో గారు, సాధన గారు, నిత్యా గారు, టుంబ్రి గారు, ఎన్‌.డిగారు, బి. భానుమతి గారు, యామిని గారు యిలా యెందరో దండకారణ్య రచయితలు రోజువారి జీవనసారాన్ని కథాసాహిత్యానికి సంబంధించిన అన్ని యీస్థటిక్స్‌తో పాఠకులకి అందించటం యిప్పుడు ప్రగాఢంగా వచ్చిన మార్పు. వొక్కో కథా మనకి వుద్యమం బయట వున్నవారికి వుద్యమకారులు మా మనుష్యులు మా ఆత్మీయులు అని చెప్పే కథ టుంబ్రి గారి ʹసందెʹ. యెన్‌కౌంటర్‌ జరుగుతున్నప్పుడు దళం మొత్తం సామాను కిట్‌ బ్యాగులతో సహా వొదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ ఆ వూరికి రాలేని పరిస్థితి. వారి సామాను భద్రపరచాలని సందె అనుకుంటుంది. భయంతో యెవ్వరూ రానప్పుడు ఆమె పోనీలే అనుకోకుండా పట్టుదలతో ఆ సామానుని అక్కడ నుంచి భద్రపరిచి మళ్ళీ దళంకి అప్పచెపుతుంది. ప్రజల్లో విప్లకారుల పట్ల వున్న యీ గౌరవం, అభిమానం యీ కథలో చదివినప్పుడు నాకో విషయం గుర్తు వచ్చింది. అరుంధతిరాయ్‌ గారి పుస్తకంలో కామ్రేడ్‌ వేణూ గారు వాళ్ళంతా వుద్యమంలోకి వచ్చిన మొదట్లో తమని గ్రామాల్లో ప్రజలు నమ్మనితనం, తమని చూస్తే భయపడటం నుంచి మెల్లగా ప్రజలు తమని విశ్వసించటం, తమ వారిగా కలుపుకోవటం చెప్పిన సంగతులు యీ ʹసందెʹ కథ చదువుతుంటే నాలో మెదిలాయి. ʹసందెʹ లాంటి ప్రజల నమ్మకాన్ని పొందిన సందర్భాలు యెన్నో కనిపించే అపురూపమైన సాహిత్యం దండకారణ్య కథలు.

12.అసలు దండకారణ్య కథలని పాఠకులు ఎందుకు చదవాలి?

అందరికీ అన్ని భావజాలాల పట్ల, రాజకీయ విశ్వాసాల పట్ల ఆమోదం వున్నా లేకపోయినా యే వైరుధ్యాలు లేనటువంటి ప్రపంచం చివరిగా ఆశించదగ్గ ప్రపంచం. అది వొక కల. అలాంటి వొక కల నిజం కావొచ్చు అని మనకి మనం చెప్పుకొంటూ వుండాలి. అందుకోసం మనం సాహిత్యాన్ని చదువుతూవుంటాం. అందు కోసం యీ కథలు చదవాలి.

13. ఇంకేమైన చెపుతారా?


యీ దండకారణ్య సాహిత్యం గురించి, అద్భుతమైన రచయితల పట్ల నా హ దయంలో వున్న గౌరవాన్ని, స్నేహాన్ని, ప్రేమని యిలా చెప్పుకొనే అవకాశాన్ని కలిగించిన అరుణతార వారికి, వొపిగ్గా మాటాడిన మీకు నా హ దయ పూర్వక వినమ్ర కృతజ్ఞతలు.

No. of visitors : 518
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •