నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

| సాహిత్యం | వ్యాసాలు

నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

- ఏకే ప్ర‌భాక‌ర్‌ | 17.12.2019 07:11:54pm

ʹయాభై యేళ్లుగా అనేక జీవన పార్శ్వాల్ని ప్రభావితం చేసిన ప్రజా ఉద్యమాల చరిత్రని విప్లవ కథ నమోదు చేసింది. సొంత ఆస్తి లేని సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమాల్లో సాయుధులై ప్రాణాలు సాలుపోసిన అమరుల త్యాగాలని యెత్తిపట్టింది..ʹ అని సాహిత్య విమర్శకుడు ఏకె ప్రభాకర్‌ అంటున్నారు. విప్లవ కథను విప్లవోద్యమ నేపథ్యంలో పరిశీలిస్తూ తెలుగు కథను విరసం విప్లవీకరించిందని విశ్లేషిస్తున్నారు. దళితులపై, ఆదివాసులపై, ముస్లింలపై, స్త్రీలపై అమలయ్యే అణచివేత, కుల - మత - జెండర్‌ ఆధిపత్య రాజకీయాల దుర్మార్గాలను విప్లవ కథకులు కాల్పనీకరిస్తున్నారని ఈ ఇంటర్వ్యూలో ఆయన అంటున్నారు.

1 : విప్లవ కథకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

విప్లవం అన్న పదం చాలా దుర్వినియోగం అవుతోంది. సస్య విప్లవం నుంచి సాంకేతిక విప్లవం వరకూ. పాలకుల పరిభాషలో ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవాలు కూడా వున్నాయి. అందుకు భిన్నంగా విప్లవాన్నీ విప్లవ కథనీ నిర్వచించుకోవాలి. విప్లవ కథ మౌలికంగా సమాజంలో మార్పుని కోరుకుంటుంది అని స్థూలంగా చెప్పొచ్చు. కానీ ఎటువంటి మార్పు అన్నది ప్రధానమైన ప్రశ్న. ముందుగా మన సమాజాన్ని వర్గ సమాజం అని గుర్తించాలి. వర్గ సమాజంలో వుండే సమస్త అసమానతలనూ తిరస్కరించి సమూలమైన మార్పుని ఆశించేది విప్లవ కథ. అసమ సమాజంలో వుండే వైరుధ్యాల్ని గుర్తించి వాటిని పరిష్కరించుకునే చైతన్యాన్ని కలిగిస్తూ పీడన దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు భావజాల రంగంలో మద్దతునిచ్చే పని విప్లవ కథ చేస్తుంది. పాత సమాజంలోని అభివృద్ధి నిరోధకమైన అంశాల్ని నిరసిస్తూ, సామాజిక ఆర్ధిక రాజకీయపరమైన వైరుధ్యాల్ని గతితార్కికంగా అర్థం చేసుకుంటూ, వాటిని అధిగమిస్తూ, కుల - మత - లింగ ఆధిపత్యాల్ని తొలగించుకుంటూ, కొత్త సమాజ నిర్మాణానికి అవసరమైన అన్ని పోరాట మార్గాల్ని బలపరుస్తూ అందుకు అవసరమైన ఆలోచనల్నీ ఆచరణనీ ప్రచారం చేయడానికి విప్లవ కథ పూనుకుంటుంది. ఆ విధంగా నూతన ప్రజాతంత్ర దృక్పథం విప్లవ కథ వూపిరి. ప్రజా యుద్ధ పంథా దాని గమనం. స్వేచ్ఛా సమానత్వాలు దాని గమ్యం. నూతన మానవ ఆవిష్కరణ దాని అంతిమ లక్ష్యం.

2 : విప్లవ కథ ప్రవేశపెట్టిన కొత్తదనం ఏమిటి?

వ్యవస్థలోని అసమానతల్ని చిత్రించడం దగ్గర విప్లవ కథ ఆగిపోలేదు. అభ్యుదయ రచనల కాలంలో భూస్వామ్య సమాజంలోని పీడనని, హింసని యథాతథంగా వర్ణించడం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు హింసని ప్రతిఘటించడం సాయుధ పోరాటంగా పర్యవసించిన తీరుని చెప్పిన కథలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలంలో సైతం వచ్చాయి గానీ విప్లవ కథ ఆ పోరాటానికి మరింత రాజకీయ తాత్వికతని జోడించింది. ఉత్పత్తి సంబంధాల్లో చోటుచేసుకునే ఘర్షణని ఆర్థిక పోరాటాలుగా మాత్రమే గాక రాజ్యాధికార లక్ష్యం వైపు సాగాల్సిన అవసరాన్ని గుర్తించింది. అట్లా చూసినప్పుడు విప్లవ కథ విరసంతోనే/ విరసంలోనే మొదలు కాలేదు అని చెప్పాలి. శ్రీకాకుళోద్యమానికి ముందూ వెనకా కొకు ʹబకాసురʹ, కారా ʹతీర్పుʹ, రావిశాస్త్రి ʹలాభంʹ, ʹపిపీలికంʹ లాంటి కథలు విప్లవ కథకి రాజకీయ తాత్త్విక నేపథ్యాన్ని యేర్పాటు చేశాయి. ఆ ఉద్యమ ఘటనలకి కాల్పనిక రచనా రూపం యిచ్చిన భూషణం లాంటి కథకులు తరతరాల పీడనని గిరిజనులు సాయుధమై ప్రతిఘటించిన వైనాన్ని కథా మాధ్యమంగా తెలియజేశారు. కన్నీటి కథలు/ ఫిర్యాదు కథలు విరసం నుంచి సైతం వచ్చాయి గానీ శ్రీకాకుళం నుంచి ఉత్తర తెలంగాణ నల్లమలల మీదుగా దండకారణ్యం వరకు రైతాంగం కార్మికులు ఆదివాసీలు భూమి కోసం విముక్తి కోసం జీవించే హక్కుకోసం చేసిన పోరాటాల్ని విప్లవ కథ అందిపుచ్చుకుంది. యాభై యేళ్లుగా అనేక జీవన పార్శ్వాల్ని ప్రభావితం చేసిన ప్రజా ఉద్యమాల చరిత్రని నమోదు చేసింది. సొంత ఆస్తి లేని సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమాల్లో సాయుధులై ప్రాణాలు సాలుపోసిన అమరుల త్యాగాలని యెత్తిపట్టింది. దీర్ఘకాల పోరాటాల్లో సాధించిన గెలుపు వోటముల్ని సమీక్షించింది. విప్లవం ప్రజా జీవితానికి చెందిన అన్ని రంగాల్లో భిన్న కాలాల్లో భిన్న తలాలపై చూపిన ప్రభావాల్ని, మానవ సంబంధాల్లో తెచ్చిన గుణాత్మకమైన మార్పుల్ని విశ్లేషించింది. అయితే ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ వుద్యమం దగ్గరనుంచి జగిత్యాల జైత్రయాత్ర మీదుగా యివాళ్టి దండకారణ్యంలో జల్‌ జమీన్‌ జంగిల్‌ కేంద్రంగా ఆదివాసీల స్వావలంబన సాధన లక్ష్యంగా నిర్మితమైన జనతన సర్కార్‌ వరకు ప్రజాయుద్ధపంథాలో సాగిన పోరాటాలను, రాజ్య హింస, నిర్బంధాలను మాత్రమే విప్లవ కథ చిత్రించింది అనుకుంటే పొరపాటే.

3: ఫలానా ఇతివృత్తం ఉన్నదే విప్లవకథ అనే అభిప్రాయం ఇప్పటికీ కొందరు సాహిత్య విమర్శకుల్లో ఉన్నది. దీన్ని విప్లవ కథకులు ఎలా బద్దలుకొడుతూ వచ్చారు?

అదే చెప్పబోతున్నాను. ఆ అభిప్రాయం తప్పు. విప్లవకథ సాయుధపోరాటాలకో దళచర్యలకో పరిమితం కాలేదు. పునాది ఉపరితలాల్లో చోటుచేసుకున్న ఘర్షణలన్నింటినీ బహుముఖీనంగా విశ్లేషించింది. గత ఐదారు దశాబ్దాలుగా దేశంలో సంభవించిన రాజకీయార్థిక పరిణామాల్నీ, సాంస్క తిక - సామాజిక చలానాన్నీ, మార్పుల్నీ విప్లవ కథ లోతుగా పరిశీలించింది. నిర్దుష్టంగా వ్యాఖ్యానించింది. ప్రతి సామాజిక చలనానికీ వున్న కార్యకారణ సంబంధాన్ని సూక్ష్మంగా వివేచించింది. దళితులపై, ఆదివాసులపై, ముస్లింలపై, స్త్రీలపై అమలయ్యే అణచివేత, కుల - మత - జెండర్‌ ఆధిపత్య రాజకీయాలు, వ్యవసాయ సంక్షోభం, అడ్డగోలు పారిశ్రామికీకరణ, ప్రాంతీయ ఉద్యమాలు, జాతుల సమస్య, స్వదేశీ విదేశీ సెజ్‌లు, వాటి కారణంగా జరిగిన విధ్వంసం, అప్రజాస్వామిక కార్మిక చట్టాలు, పెచ్చుపెరిగి పోతున్న పర్యావరణ సమస్యలు, అమానవీయతని పెంచి పోషిస్తున్న కార్పొరేట్‌ విద్యా వైద్య రంగాలు ... యిలా అనేక అంశాల్ని యితివృత్తం చేసుకుని కథలు వచ్చాయి. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతంగా అమలుజేసే ప్రజావ్యతిరేక విధానాల కారణంగా సామాన్యుల జీవితాలు ధ్వంసమైన తీరుని విప్లవ కథకులు పట్టించుకున్నారు. మతతత్వ రాజకీయాల్ని ఎండగట్టారు. బ్రాహ్మణీయ పిత స్వామ్య భావజాలాన్ని ఖండించారు. మార్కెట్‌ మాయాజాలాన్ని బహిరంగపరిచారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, మైనింగ్‌ కారణంగా సొంత నేలకు దూరమైన నిర్వాసితుల దైన్యాన్నీ పోరాటాల్నీ కథలుగా కట్టారు. సాంస్కృతిక సామ్రాజ్యవాదానికీ జాతీయవాదానికీ మధ్య వున్న సంబంధాన్ని విడమర్చి చెప్పారు. అందుకు అవసరమైన దృక్పథాన్ని, కథా నిర్మాణ పద్ధతుల్ని సమకూర్చుకున్నారు. ఇదంతా యేటికి యెదురీతే. సంక్షుభిత సమాజంలో మానవ జీవితానుభవానికి సంబంధించిన ప్రతి పార్శ్వాన్నీ యీ కథకులు స్పృశించారు. అయితే అది కేవలం పైపైన తడమడం కాదు. మూలాల్లోకి దృష్టి సారించడం. స్థూలంగా సమాజాన్నీ, సూక్ష్మంగా వ్యక్తుల్నీ వారి జీవితాల్నీ పోరాటాలనీ విడి విడిగా కాకుండా సమగ్రంగా కలగలిపి చూసే మార్క్సిస్టు దృక్పథం గత అయిదు దశాబ్దాలుగా యీ కథకుల్ని నడిపించింది. అందువల్ల మూడుతరాల పాటు నేలతల్లి పడిన పురుటి నొప్పుల చప్పుడును విప్లవ కథలో వినగలం. స్థానికంగా రూపుదిద్దుకున్న వుద్యమ చరిత్రే కాదు మొత్తం యాభై యేళ్ళ మానవ సమాజ చరిత్రని ప్రజల పరంగా నిర్మించడానికి విప్లవకథలు గొప్ప వనరుగా వుపయోగపడతాయి.

4 : విప్లవ కథలో అజ్ఞాత కథ స్థానం ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏమున్నాయి?

విప్లవ కథలో అజ్ఞాత కథని రెండు విధాలుగా పేర్కోవాలి. రచయిత యెవరో తెలీని అజ్ఞాత కర్తృకాలు. అజ్ఞాతంలో వున్న కథకులు రచించిన కథలు. రచయితలపై నిత్య నిర్బంధాల కారణంగా చాలా మంది రచయితలు మారుపేర్లతో కథలు రాశారు. కల్లోల దశాబ్దాల్లో కలం పట్టి కథని విప్లవోద్యమ చరిత్రకు ప్రతీకగా మలచిన అల్లం రాజయ్య డజనుకు పైగా మారుపేర్లతో రచనలు చేశాడు. తొలినాటి సాహు దగ్గర నుంచి కొత్తగా రాస్తున్న శృతి వరకూ యేది మారుపేరో సొంత పేరో తెలీదు. ఉద్యమంలో సర్వస్వాన్నీ త్యాగం చేసినట్టే కథకులు స్వీయ అస్తిత్వాన్ని వదులుకున్నారు. ఈ సంప్రదాయం విప్లవోద్యమ సాహిత్యానికే ప్రత్యేకం. అడవిలో వెన్నెల బొగ్గుపొరల్లో లాంటి సంకలనాల్లో వచ్చిన కథలు సామూహిక కర్తృత్వంలో వెలువడ్డాయి. కార్మిక, కర్షక లాంటి పేర్ల వెనక వున్న రచయితలెవరో యిటీవలి దాకా తెలీదు. సాహిత్యాన్ని వ్యక్తి ఆస్తిగా కాకుండా సామూహిక సంపదగా సామాజిక వనరుగా పరిగణించే సంప్రదాయాన్ని విప్లవ కథ ప్రపంచానికి అందించింది. విప్లవ కథా రచయితల్లో చాలా మందికి కథా రచన విప్లవాచరణలో భాగం. ఒక చేత్తో కలం మరో చేత్తో ఆయుధం పట్టిన పాణిగ్రాహి వారసత్వంలో నిబద్ధత నిమగ్నతలకు నిలువెత్తు సాక్ష్యంగా నిర్మాణంలో దళంతో ఫార్మేషన్‌లో కథలతో కదం తొక్కిన రచయితలు లెక్కలేనంతమంది. ఈ రచయితల కథల్ని లోపలి నుంచి వచ్చినవిగా పేర్కొంటారు. వాటినే అజ్ఞాత కథలు అని భావిస్తాం.

విప్లవంలో అజ్ఞాత కథలు ప్రధానంగా పోరాటంలో ప్రజల సమీకరణని చిత్రించాయి. సాధారణ రైతాంగం కార్మికులు గిరిజనులు మిలిషియాగా మారి మెరుగైన జీవితం కోసం ప్రగతిశీలమైన సమాజం కోసం స్థిరంగా నిలబడ్డ వైనాన్ని కీర్తించాయి. ప్రభుత్వ దళారీలకూ, భూస్వామ్య కిరాయి హంతకులకూ, పోలీసులకూ, మిలటరీకీ, కార్పొరేట్‌ గూండాలకూ, కోవర్టులకూ వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో వ్యూహాలూ యెత్తుగడల గురించి దళ చర్యల గురించి వర్ణించాయి. ఉద్యమకారులు నీళ్లలో చేపల్లా ప్రజల్లో కలసిపోయిన తీరునీ ప్రజలు ఉద్యమకారుల్ని కడుపులో పెట్టుకుని కాపాడిన సందర్భాల్నీ లోపలి కథకులు కథలుగా మలిచారు. ఎన్‌కౌంటర్‌లనూ అణచివేత ప్రతిఘటనల్నీ ఉద్యమ విస్తరణనీ గెరిల్లా పోరాటాలనీ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా కథా మాధ్యమంగా రిపోర్ట్‌ చేశారు. పాత సమాజంలోని అభివృద్ధి నిరోధక భావజాలాన్నీ ఆచారాల్నీ సంస్కృతీ సంప్రదాయాల్నీ (కాయిదాలనీ) తొలగించుకోవడంలో యేర్పడే చిక్కుల్ని పరిష్కరించుకున్న పద్ధతుల్ని గతితార్కికంగా చర్చకు పెట్టారు. ఉద్యమంలోకి వచ్చాక సాధారణ వ్యక్తుల అలవాట్లలో ఆలోచనల్లో సంభవించే అసాధారణమైన ప్రగతిశీలమైన మార్పునీ వికాసాన్నీ బలంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా పితృస్వామ్యం కోరలనుంచి మహిళలు బయటపడటానికి విప్లవ భావజాలం, ఆచరణ యెలా తోడ్పడ్డాయో వివరించారు. నిర్మాణంలో మహిళల పాత్ర గణనీయంగా పెరిగినట్టే అజ్ఞాత కథా రచయితల్లో సైతం మహిళల సంఖ్య పెరిగింది. దండకారణ్య కథా రచయితల్లో సాధన వంటి వాళ్ళు 80ల నుంచీ రాస్తున్నారు. లక్ష్మి, నిలోవ్నా, కరుణ, మిడ్కో, షహీదా, యామిని, దమయంతి, భానుమతి,నిత్య, మైనా, నిర్మల, కవిత, సోని, రేలా, స్వాతి, శృతి ... యిలా ఎందరో రచయిత్రులు (వీళ్లలో మారుపేర్లతో మగవాళ్ళు కూడా ఉన్నారేమో) విప్లవ సంస్కృతి నిర్మాణంలో చోదక శక్తిగా పనిచేస్తున్నారు. శాంతి అభియాన్‌, సల్వాజుడుం, గ్రీన్‌హంట్‌, సమాధాన్‌ పేరు యేదైనా అటవీ ఖనిజ సంపదని కార్పొరేట్‌ హస్తగతం చేయడానికి దళారీ పాలకులు అడవి బిడ్డలమీద భూమ్యాకాశ మార్గాల గుండా హింసాత్మకంగా దాడులు జరుపుతున్నప్పుడు యుద్ధక్షేత్రంలో నిలబడి దొరికిన కాస్తంత తీరికలో రాసిన ప్రత్యక్ష కథనాలు యీ కథలు. నిత్యనిర్బంధాల మధ్య దాడుల మధ్య మానని గాయాలతో తెలీని రోగాలతో బాధలతో సలిపే నొప్పులతో సాహసోపేతంగా ప్రతిఘటిస్తూ - కొత్తగా నిర్మాణం చేస్తూ విప్లవాచరణలో పనుల వొత్తిడిలో తమ సామూహిక అనుభవాలను కొత్త సమాజపు కలల్నీ వాటిని సాకారం చేసుకోడానికి చేసే ప్రయత్నాల్నీ భవిష్యత్తుపై ఆశల్నీ యీ రచయితలు కథల్లో చిత్రించారు. సాహిత్య చరిత్రలో నెత్తుటి సంతకాలివి. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని విప్లవాశయాన్ని గుండెల్లో వెలిగించుకొని పీడితుల ఆశలనే తమ ఆశలుగా కళ్ళలో నింపుకుని రాసిన యీ కథలు ప్రపంచ సాహిత్యంలోనే ప్రత్యేకంగా నిలుస్తాయి. జనతన సర్కారులో విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల వంటి రంగాల్లో మానవీయంగా అమలయ్యే ప్రత్యామ్నాయ పద్ధతుల మీద, విలువల మీద అజ్ఞాత కథకులు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ కథకులు వస్తు శిల్పాల్లోనే కాదు భావజాలపరంగా కూడా మూస పద్ధతుల్ని బద్దలు కొట్టారు. సాహిత్యాన్ని సామాజిక ఆచరణలో భాగం చేశారు.5 : తెలుగు కథకు ఉండిన భావజాల చట్రాలను మార్చడంలో విప్లవకథ పాత్రను మీరెలా గుర్తిస్తారు?

తెలుగు కథకే కాదు మొత్తం సమాజంలోని భావజాల చట్రాలని మార్చడానికి విప్లవ కథ తోడ్పడింది. స్తబ్దుగా వున్నా సాహిత్య వ్యవస్థలోకి ఒక పెను తుఫానులా ఝంఝానిలంలా చొచ్చుకువచ్చింది విప్లవభావన. రచయితల్ని ఎటువైపు నిలుస్తారో తేల్చుకొమ్మని సవాలు విసిరింది. ఉపరితల సంస్కరణలకూ పునాదినుంచి దూరమైన కృతక వైరుధ్యాలకూ అంతే కృత్రిమ పరిష్కారాలకూ కాలం చెల్లింది అని ప్రకటించింది. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో బ్రాహ్మణ పండిత అగ్రహారాల నుంచి అదే వర్గానికి చెందిన మధ్య తరగతి రచయితల డ్రాయింగ్‌ రూంల వరకూ సాహిత్యం పయనించి ఆగిపోతే - దాన్ని అక్కడి నుంచి చెమటతో రక్తంతో తడిసిన నాగేటి చాళ్ళలోకి మట్టి పేడా కలిసిన గంజుతో నిండిన గుడిసె వాకిళ్ళలోకి గొడ్డు మాంసం కసరు కంపుతో కూడిన వాడల్లోకి గుంజుకొచ్చిన ఘనత విప్లవ సాహిత్యోద్యమానికి దక్కుతుంది. స్వాతంత్య్రానంతరం అక్షరాస్యులై యెదిగొచ్చిన అణగారిన కులాలకు చెందిన రచయితల చేతిలో కథ చైతన్య సాధనమైంది. ఈ రచయితలు కొత్త జీవితం కొత్త భాష కొత్త వ్యక్తీకరణలు కథల్లోకి ప్రవేశపెట్టారు. విరసం ఆవిర్భావం నుంచి అందులో భాగమైన కొకు, రావిశాస్త్రి, కారా వంటి సీనియర్‌ రచయితలు సైతం కొత్త తరం వైపు ఆశగా చూశారు. ఆచరణకు దూరమైన ఆదర్శవాదానికి గుడ్‌ బై చెప్పారు. కూడులోకి ʹపులుసుʹ(భూషణం) రావాలంటే కర్ర పట్టుకోక తప్పదనీ, ʹఎదురు తిరిగితేʹ (రాజయ్య) పోయేది బానిస సంకెళ్లేననీ, పేదవాడికి ʹన్యాయంʹ (తిరుపతయ్య) దక్కాలంటే అడవిబాట పట్టాలనీ గ్రహించారు. జీవితాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌గా (పోతరాజు) సాక్షాత్కారింపజేశారు. విప్లవ కథ సాహిత్యంలో భావవాదం స్థానే సోషలిస్టు సామాజికతకి పీటవేసింది. సామాజిక న్యాయానికి పట్టం గట్టింది. బిగిసిన పిడికిలికీ, ధిక్కార స్వరానికీ చేదోడు వాదోడుగా నిలిచింది. వ్యక్తివాదం నుంచి సామూహిక భావనకూ ఆచరణకీ పురిగొల్పింది. వర్గ సామరస్యాన్ని బోధించే ఉదార వాదం నుంచి బయటపడి వర్గ పోరాటమే సమస్త ఆధిపత్యాలకు అంతం పలకగలదనీ హెచ్చరించింది. విప్లవ కాల్పనికత నుంచి విప్లవ వాస్తవికత వైపు నడవడానికి, భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పథాన్ని పెంపొందించడానికి విప్లవ కథ యెంతగానో దోహదం చేసింది.

అయితే వొకానొక కాలంలో విప్లవ కథ సైతం మూస పాత్రలకు, పునరుక్తులకు, కృత్రిమ ముగింపులకు గురైంది. ఆత్మ విమర్శతో దృక్పథ బలంతో తనను తాను దిద్దుకొని యీ ధోరణి నుంచి బయటపడి కొత్త శిల్ప రీతులతో ముందుకు నడిచింది అనడానికి నిదర్శనాలు కూడా వున్నాయి. గమనం కుంటువడిన ప్రతి సందర్భంలోనూ కుదుటబడి తనను తాను పునర్నిర్మించుకొని రూప సారాల మధ్య సమన్వయానికి విప్లవ కథ ప్రయత్నించిది.

చాలా కాలం వస్తు రూపాలమధ్య ప్రాధాన్యతలను నిర్ధారించడం లోనే తెలుగుకథ గిరికీలు కొడుతుండేది. విప్లవ రచయితలు కూడా రూపవాదాన్ని తిరస్కరించడానికి మొదట వస్తువుకే ప్రాధాన్యం యిచ్చారు. కానీ తర్వాత వస్తు శిల్పాల సమప్రాధాన్యాన్ని గుర్తించారు. ఆ రెండిటినీ నిర్దేశించేదీ నిర్ణయించేది దృక్పథమేనని గ్రహించారు. శుద్ధ కళా వాదాన్ని తిరస్కరించారు. వస్తు - శిల్ప -దృక్పథాలు విడి విడి అంశాలు కావనే స్పృహని అందుకోవడంలో, అందించడంలో విప్లవ కథ ముందుపీఠిన నిలబడింది.6 : కథకు - పాఠకులకు సంబంధంలో విప్లవ కథ ఏమైనా మార్పులు తెచ్చిందని అనుకుంటున్నారా?


ఒక మేరకు తెచ్చింది. కథా రచనలో శుష్క ప్రయోగాలకు తావు లేదని విప్లవ కథ గ్రహించింది. సరళత, సూటిదనం కథని పాఠకులకి దగ్గర చేస్తుందని కథకులు గుర్తించారు. మౌఖిక శైలినీ కథన రీతుల్నీ స్వీకరించారు. సంప్రదాయ భాషా వ్యక్తీకరణ పద్ధతుల్ని విడిచిపెట్టారు. కథకు పాఠకులకు బదులు శ్రోతల్ని తయారు చేసుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు అది సామూహిక ప్రదర్శనగా మారి ప్రభావ శీలం కాగలదని ఆశించారు. కథని సమూహాల ముందు వినిపించారు. జానపద మౌఖిక కథన సంప్రదాయాన్నీ అనుసరించారు. ఉప్పల నరసింహం ʹముద్రʹ కథలు ఆ క్రమంలోనే వచ్చాయి. అయితే తర్వాతి కాలంలో అతనే విప్లవ కథకు దూరమయ్యాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత రఘోత్తం రెడ్డి ఆడియో కథలు ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగానికి కూడా కొనసాగింపు లేకుండా పోయింది. కానీ యీ ప్రయత్నాలన్నిటి వెనక విప్లవ భావజాలాన్నీ కథనీ విస్తృత ప్రజా సమూహాలకు చేర్చాలనే తపన వుంది.

7 : విప్లవ కథను విశ్లేషించడానికి ఏ కొత్త పరికరాలు అవసరం అయ్యాయి? లేదా విప్లవ కథ తనతోపాటు కథా విమర్శలో ప్రవేశపెట్టిన కొత్త పరికరాలు, పద్ధతులు ఏమిటి?

విప్లవ కథని విశ్లేషించడానికి కొత్త పరికరాల అవసరం వుంది అని ఆలోచన రావడమే గొప్ప విషయం. మొదట్నుంచీ సామాజిక శాస్త్రాల వెలుగులోనే విప్లవ కథావిమర్శ పయనిస్తోంది. పాఠ్యాన్ని గతితార్కికంగా చారిత్రికంగా పరిశీలిస్తుంది. అయితే మార్క్సిస్టు విమర్శ సూత్రాలని సరైన రీతిలో అర్థం చేసుకుని అన్వయించే విమర్శకులు కూడా మనకు తక్కువయ్యారు. మారిన ఉత్పత్తి సంబంధాల్ని అర్థం చేసుకోడానికి ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజానికి మార్క్సిస్టు విమర్శకూ కొత్త జోడింపులు వస్తున్నాయి. వాటిని మన విమర్శకులు అందిపుచ్చు కోవాల్సిన అవసరం వుంది. పునాది - ఉపరితలాలు పునర్నిర్వచనానికి గురవుతున్నాయి. ఆర్ధిక అసమానతలతోపాటు సామాజిక అంతరాలు సమాజంలో సాహిత్యంలో బలంగా చర్చకు వచ్చాయి. వర్గ పోరాటాలనీ కులపోరాటాలనీ జమిలిగా అధ్యయనం చేయాల్సిన అవసరం యేర్పడింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక రాజకీయ సామాజిక పరాయీకరణ మాత్రమే గాక సాంస్కృతిక పరాయీకరణ సైతం అజెండా మీదకి వచ్చింది. మత ఆధిపత్య రాజకీయ కేంద్రాలు బలపడుతున్నాయి. జాతీయ వాదం పేరున మూకస్వామ్యం ఆమోదాన్ని సంపాదించుకోడానికి ప్రయత్నం చేస్తోంది. దోపిడీ పీడనల స్వరూపం మారింది. అణచివేత పద్ధతులు మారాయి. వాటికి వ్యతిరేకంగా పోరాట పద్ధతులు మారుతున్నాయి. వాటికి సాహిత్య ప్రతిఫలానాలు మారుతున్నాయి. వీటిని అర్థం చేసుకోడానికి ముందుగా మనకు అందుబాటులో వున్న పరికరాలకు సానబెట్టాలి. కొత్తసంక్లిష్టతలను కొత్తగా చూడాలి. ఇన్నాళ్ళూ ప్రాంతాలకు గురై పీడనని అనుభవించిన జాతులు కులాలు అస్తిత్వ పోరాట మార్గాలు పట్టిన చోట కొత్త అధ్యయనం మొదలు పెట్టాలి. కొత్త దార్శనికతని అలవర్చుకోవాలి. కొత్త మెథడాలజీని చేపట్టాలి. జీవితానుభవ సారంనుంచి రూపొందే ప్రమేయాల ద్వారా దేశీయ ఉద్యమ నిర్మాణ అవసరాలరీత్యా యేర్పరచుకునే సిద్ధాంతాల నుంచి కొత్తపరికరాలను తయారుచేసుకోవాలి.

8 : నిర్దిష్టత - సాధారణీకరణల మధ్య సమన్వయాన్ని విప్లవ కథకులు ఎలా సాధించారు?

వైయక్తిక అనుభవాలు సామూహిక అనుభవాలుగా సామూహిక అనుభవాలు సామాజిక జ్ఞానంగా రూపొందే ప్రక్రియలో అనేక దశలు వున్నట్టే సాహిత్యంలో నిర్దిష్టత నుంచి సాధారణీకరణ ప్రయాణంలో కూడా వొక క్రమం వుంటుంది. ఆ క్రమాన్ని అర్థం చేసుకోడానికి శాస్త్రీయమైన సైద్ధాంతిక దృక్పథం తోడ్పడుతుంది. దృక్పథ పటిమ వున్నచోట నిర్దిష్టత సాధారణీకరణల మధ్య సమన్వయం కుదురుతుంది. లేకుంటే సంఘటనలు సంఘటనలుగానే మిగిలిపోతాయి. పాఠకులకు పాత్రలు దగ్గర కాకుండా దూరంగా వుండిపోతాయి. ప్రాచీన ఆలంకారిక శాస్త్రం ప్రకారం పాఠకులు పాత్రలతో కనెక్ట్‌ అయి లీనమైనప్పుడే వొకానొక నిర్దిష్టత సాధారణీకరణమైనట్టు. ఉదాహరణకి కన్యాశుల్కం నాటకం. కన్యాశుల్కం సమాజంలో అందరి సమస్యా కాదు. కానీ గురజాడ మనుషుల కార్పణ్యాది బలహీనతల్ని, కరుణ ప్రేమ మొదలైన మానవీయ విలువల్ని హాస్య వ్యంగ్య మాధ్యమంగా అద్భుతంగా ఆవిష్కరించి దాన్ని సాధారణీకరించాడు. ఇటువంటి సమన్వయాన్ని సాధించడానికి కథకులు కథానిర్మాణపు మెళకువలు తెలుసుకొని ఉండాలి. విప్లవకథ తొలిరోజుల్లో ఎన్నెస్‌ ప్రకాశరావు రాసిన పేపర్‌ టైగర్‌ లాంటి కథలు చూడండి. ఆ కథలో ఆయన వర్గ వైరుధ్యాల్ని యెంత చక్కగా కళ్ళకుకట్టాడో!

విప్లవం సమాజంలో తొంభై శాతం ప్రజలకు సంబంధించిన విషయం. కానీ దోపిడీ పాలకవర్గం దాన్ని పిడికెడు మంది యెక్కడో ఒకమూల చేపట్టే దుడుకు చర్యగా భావించేలా చేస్తుంది. దీన్నుంచి బయటపడటానికి విప్లవ కథకులు అత్యంత జాగరూకులై ఉండాలి. సమాజాన్ని శకలాలుగా మార్చి పాలకులు పబ్బం గడుపుకుంటున్న సందర్భంలో నిర్దిష్టత దగ్గరే ఆగిపోయే ప్రమాదం విప్లవ కథకులకే కాదు తక్కిన అస్తిత్వ రచయితలు అందరికీ వుంది. అందువల్ల మానవ జీవితానుభవాల్లో సాధారణంగా కలిగే ఉద్వేగాల్ని ఆలోచనల్ని సంవేదనల్ని కథల్లోకి తీసుకురావడం ద్వారా విప్లవకథకులు యీ సంక్లిష్టతని అధిగమించగలుగుతున్నారు. అయితే ఈ పని మరింత కళాత్మకంగా జరగాల్సి వుందని విప్లవ కథకులు గుర్తించాలి.

9: మన సామాజిక సాంస్కృతిక రంగాల విస్తరణకు విప్లవ కథ తెచ్చిన ఇతివృత్తాలు, భాషా మాండలికాలు, పాత్రోన్మీలన చేసిన దోహదం ఏమైనా ఉన్నదా?

ఖచ్చితంగా వుంది. అది బలంగా కూడా వుంది. సామాజిక సాంస్కృతిక రంగాలపై విప్లవ కథ చూపిన ప్రభావం అపరిమేయం. వాటి విస్తరణకు కథ మాత్రమే కాదు విప్లవ సాహిత్యం మొత్తం యెంతగానో దోహదం చేసింది. ఒక ఉదాహరణ చూద్దాం: ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమ నేపథ్యం నుంచి ʹఎత్తున్రి పిడికిళ్ళుʹ అన్న కథ వచ్చింది. రచయిత చుక్క (ముప్పాళ లక్ష్మణరావు). తెలంగాణ పల్లెల్లో శ్రామిక కులాల్లో బతుకమ్మ పండగకి చాలా ప్రాశస్త్యం వుంది. ఈ కులాల స్త్రీలు దొర గడీలో దొర ముందు బతుకమ్మ ఆడటం నిర్బంధ వెట్టిలా అమలయ్యేది. దొర చూపులకు స్త్రీలు సిగ్గుతో చితికి పోయేవారు. గ్రామాల్లో రైతు కూలీ సంఘాలు బలపడే క్రమంలో దొరల ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగానే గాక ఫ్యూడల్‌ సంస్క తికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించడం మొదలైంది. అందులో భాగంగా దొర సమక్షంలో బతుకమ్మ ఆడకూడదని సంగం పిలుపునిచ్చింది. గడీల సాంస్క తిక ఆధిపత్యంపై యిది గొప్ప తిరుగుబాటు. బతుకమ్మ వొక ఆయుధమైంది. పోరాట రూపమైంది. ఇదీ ఆ కథ యితివృత్తం. మలిదశ తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర వుద్యమంలో ప్రాంతీయ అస్తిత్వ చేతనకు బతుకమ్మ పర్యాయ పదమైంది. వలస ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగా స్త్రీలు బజార్లలో బతుకమ్మ ఆడారు. తెలంగాణ రాష్ట్రం యేర్పడిన తర్వాత బతుకమ్మ ఆధికారికంగా రాష్ట్రోత్సవమైంది. ఇప్పుడు బతుకమ్మ ట్యాంక్‌ బండ్‌ యెక్కింది. దొరల విలాస ప్రదర్శనగా మారింది. బతుకమ్మ పూలను మార్కెట్‌ పురుగు ముట్టింది. అందుకు ప్రత్యామ్నాయంగా నిరసనగా బహుజన బతుకమ్మ మరోసారి ముందుకు వచ్చింది. దళిత కులాలకు బతికమ్మ ఎక్కడిది అన్న ప్రశ్న సైతం ముందుకు వచ్చింది.

విప్లవ కథ ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా అన్ని విధాలా వుత్తర తెలంగాణాలో పురివిప్పిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకి అండగా నిలబడింది. నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగానికి తోడు నీడయ్యింది. గిరిజనుల రక్తంతో తడిసిన అడవితల్లి గుండె చప్పుడు వినిపించింది. రాక్షసి బొగ్గుగుట్టల్లో నిప్పురవ్వై మెరిసింది. తెలుగు కథకి విప్లవ పంథా పరచింది. నూతన ప్రజాస్వామిక శక్తులతో పదం కలిపి నడిచింది. పౌరహక్కుల నినాదాలతో గొంతు కలిపింది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికి భావజాల ప్రచార సాధనమైంది. ఉత్తమ తెలుగు కథకు ఊపిరిపోసింది. వార్షిక కథలకు ప్రాణాధారమైంది. జీవధార అయ్యింది.

రాజయ్య ʹఅతడుʹ కథ వస్తు శిల్పాల పరంగా విరసం బయటా లోపలి కథకులకు దారి దీపమైంది. పాత్రోన్మీలన పద్ధతికి పాఠ్య గ్రంథమైంది. మహాశ్వేత బషాయిటుడులా సికాస ఉద్యమ శ్వాస రమాకాంత్‌ ʹఅతడుʹ కథ ద్వారా మళ్ళీ మళ్ళీ జన్మించాడు. విప్లవోద్యమ త్యాగాల చరిత్రలో ʹఅతడుʹ అనేక నామవాచకాలకు సర్వనామమైంది. వస్తు పరంగా నిర్మాణ పరంగా కాల్పనిక సాహిత్యంలో అతడుకి అనేక ʹరిప్లికాʹలు పుట్టాయి. అదే విధంగా సాధన ʹరాగోʹ విప్లవ సంస్క తికి నిండైన నిలువెత్తు నిదర్శనమైంది. ఆదివాసి పోరాట మహిళకు ప్రతిరూపమైంది. కరుణ ʹతాయమ్మʹ పురుషస్వామ్య నిరసనకు ప్రతీకయ్యింది. విరసం కథకులకు రచనా నిర్మాణ కళా కౌశలాలను నేర్పే సాహిత్య పాఠశాల అయ్యింది.

విప్లవ కథల్లో వాడిన భాష కథా నిర్మాణ సూత్రాలు సాహిత్య ప్రమాణాలు వంటి విషయాలు సాహిత్యకారుల్లో చర్చకి దారితీశాయి. సృజన, జీవనాడి, అరుణతార, ప్రజాసాహితి, నూతన మొదలైన పత్రికలూ అటువంటి కథలకీ చర్చలకీ వేదికలయ్యాయి. ముఖ్యంగా కథల్లో వాడిన ప్రజల సాంస్కృతిక భాష చర్చకు కేంద్ర బిందువైంది.

ప్రజా సంస్కృతిలో భాగమైన సజీవమైన భాషే విప్లవ కథకులకు రచనా మాధ్యమంగా గోచరించింది. దానిపై ఆంక్షలు విధించే ఆధిపత్యాల్ని నిక్కచ్చిగా తిరస్కరించి శ్రమజీవుల భాషకి యీ కథకులు సాహిత్య గౌరవం కల్గించారు. భాషకి గొప్ప ప్రజాస్వామిక ద క్పథాన్ని జోడించారు. ప్రజల సాహిత్యానికి ప్రాణం ప్రజల భాష అని శాస్త్రీయంగా నిరూపించారు. అందుకు సర్వ శక్తులూ వొడ్డి పోరాడారు. ప్రజల జీవన్మరణ పోరాటాన్ని తమ నెత్తుటి భాషలో చెమట భాషలో గాక మరే విధంగానూ రాయలేమని తెగేసి చెప్పారు (రాజయ్య). భాషా సమస్య జాతుల సమస్యలో భాగం అని రచయితలు (బి ఎస్‌ రాములు) గ్రహించి ʹమాభాషలో మేం రాస్తాం అది మా న్యాయ సమ్మతమైన హక్కుʹ అని ప్రకటించారు.

భాషా విషయికంగా విప్లవ కథకులు ఆవిష్కరించిన శాస్త్రీయ దృష్టి తెలుగునేల మీద అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఆయా మాండలికాల్లో కథలు రావడానికి కారణమైంది. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో పెను మార్పు , మలుపు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమంలో భాష కీలక పాత్ర పోషించింది. సొంత భాషలో చేసే సాహిత్య సృష్టి ఆత్మగౌరవ ప్రకటనకి అస్తిత్వ సోయికి మారుపేరయ్యింది. ఇదంతా కళ్ళముందు జరిగిన వర్తమాన సామాజిక రాజకీయ సాంస్కృతిక చరిత్ర.

అఖిల భారత సాంస్కృతిక ఉద్యమానికి తెలుగునేల మీద పెల్లుబికిన విప్లవోద్యమం దిగ్దర్శనం చేసింది. అగ్రగామిగా నిలిచింది. పాణిగ్రాహి వారసత్వాన్ని అందుకున్న జననాట్య మండలి పాటలు అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. కళా ప్రదర్శన రీతులు అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శమయ్యాయి. ఇవ్వాళ దేశ వ్యాపితంగా జరుగుతున్న దళిత ఆదివాసీ బహుజన ఉద్యమాలకు తెలుగునాట పుట్టిన విప్లవ సాహిత్యమే సాంస్కృతిక స్ఫూర్తిని అందిస్తుందంటే తప్పుకాదు.

(ఇంకా ఉంది )

No. of visitors : 463
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •