తెలుగు సాహిత్య రంగంలో కథ ,కవిత ,నవల, విమర్శ ఇలా ఏ ప్రక్రియ తీసుకున్నా, తనదైన ముద్ర వేసిన ప్రగతిశీల సంఘాల్లో విరసం పాత్ర విస్మరించరానిది. అధునాతన సాహితీ ప్రక్రియలో భాగంగా అంతర్జాల పత్రికను నడుపుతూ, విశ్వవ్యాప్తంగా ప్రజోపయోగకరమైన , విలువైన రచనలను ప్రపంచం ముంగిట తీసుకురావడంలో విరసం తన వంతు ప్రయత్నం చేస్తోంది. పత్రికా ప్రచురణ, అంతర్జాల పత్రిక నిర్వహణ మాత్రమే కాకుండా సీనియర్ రచయితలను, సీనియర్ సాహితీవేత్తలను విమర్శకులను కథల వర్క్ షాపులకు ఆహ్వానించి కొత్త కథకుల చేత కథలు రాయించి ,ఆ కథలను సమీక్షించి, సవరించి ,మళ్లీ రాయించి, ఆ కథలను ప్రచురించడమే కాకుండా, విలువైన చర్చను, కథల వర్క్ షాప్ లలో కథకుల అనుభవాలను సైతం ముద్రించడం ద్వారా కథల వర్క్ షాప్ లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎంతమేరకు వర్క్ షాపులు రచయితలకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాల్ని, కొత్త కథకుల బలాలను, బలహీనతల్ని ,సృజనాత్మకతను వెలికి తీసి, కొత్త కథకులను, కొత్త కథలలను విరసం పరిచయం చేస్తూ వస్తున్నది.
కథల పంట పేరిట కథల వర్క్ షాప్ లలో చదివిన కథలను సంకలనం చేసి ముద్రించడం ద్వారా ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాలలోని కొత్త కథకులను కొత్త కథలను పాఠకుల విరసం పరిచయం చేస్తూ ఉండటం మంచి విషయం.
ఇప్పటివరకు కథల పంట పేరిట మూడు కథా సంకలనాలు వెలువడ్డాయి. విరసం వర్క్ షాప్ కథలు 2008 పేరిట జనవరి 2009లో వెలువరించిన 18 కథలను చదవడం ద్వారా పాఠకులకు కొత్త కథలు, కథాంశాలు పరిచయం అవుతాయి.
కథకుల దృష్టి ఏ రకంగా ఉంది, కథకులు సామాజిక పరిణామాల పట్ల ఎంత వరకు అప్రమత్తంగా ఉన్నారు, సామాజిక దురాగతాల పట్ల ఎంతగా స్పందిస్తున్నారు, అసమానతల్ని ఏ స్థాయిలో తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు అనే విషయాలకు వివరణాత్మక ఉదాహరణలు ఈ కథలు. కథా సాహిత్యంలో విలువైన మేలిమి కూర్పుగా కథల పంట కథా సంకలనాలను ప్రస్తావించక తప్పదు.
ఈ మొదటి కథల పంటలో 18 కథలను, వీటితోపాటు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు ʹకథకులలోకం ʹ పేరిట రాసిన ముందుమాట చదవడం సీనియర్ రచయితలకు, యువతరం రచయితలకు, కొత్తగా కథలు రాయాలనుకునే వారికి కొత్త స్ఫూర్తి కలిగిస్తుంది.
సంవత్సర కాలంలో జరిగిన 6 కథకుల సమావేశాల్లో నలభైకి పైగా వచ్చిన కథల్లోంచి ఎంపిక చేసిన 18 కథలతో ఈ కథా సంకలనం వెలువడింది.
వీటిలో గీతాంజలి గారి కథ తప్ప మిగతావన్నీ కథకుల సమావేశాల్లో చదివినవి. వీటిలో ఎనిమిది కథలు ఆప్పటికే అచ్చుకాగా, తొమ్మిది నేరుగా సంకలనంలోకి వచ్చినవి. ఈ కథా సంకలనానికి ʹసందర్భంʹ పేరిట విరసం రాసిన నోట్ ఇలా ఉంది
...
నిజానికి రచయితలు తమ కథలకు తామే నిర్దాక్షిణ్యం అయిన తొలి విమర్శకులు అయితే చాలా వరకు సమస్య పరిష్కారం అయినట్టే. కానీ అది అనుకున్నంత సులువు కాదు.ఆ విమర్శనాత్మక దృష్టి కలవటానికి కూడా పక్క వాళ్ళ సహకారం సంభాషణ అవసరం. రచయితలకు సమాజంలో ఉండే సంబంధం వల్ల కలిగే అనుభవమే నేరుగా సాహితీకరణకు దారి చూపదు. ఆ అనుభవంలో నిగ్గుదేలే జీవిత దృక్పథం నుండి సాహిత్య ప్రక్రియలతో పెట్టుకునే సంబంధమే రచనకు అవసరమైన పునాదిని సమకూరుస్తుంది. తన దృక్పథం నుండి సమాజంలోని అసంబద్ధత దౌష్ట్యం అపక్రమం చూసి ఓర్వలేని స్థితికి లోనవడం వల్లనే రచన పుట్టుకొస్తుంది. దీన్ని మామూలు మాటల్లో చెప్పాలంటే లోపల అగ్ని ఉంటేనే కడుపు మండితేనే సాహిత్యం వ్యక్తమవుతుందంటారు. సమాజం పట్ల ఈ అసమ్మతి స్థితి నిత్యం కాపాడుకోవడంతో పాటు ప్రక్రియ ప్రత్యేకతలతో ప్రయోగ దృష్టితో సాగినప్పుడు సాహిత్యంలో మార్పు సాధ్యమవుతుంది.
జీవన వాస్తవికతను దాన్ని మార్చే ప్రజా ఉద్యమాల్లోని పోరాట అంశను భావజాల సంఘర్షణ సారంగా చూసినప్పుడు తప్పక సాహిత్యం పాత్ర నెరవేరుతుంది. ఇది ప్రతి రోజూ చేయవలసింది, ప్రతి తరం చేయవలసిందే. అలాంటి కృషి నుండి వచ్చిన కథలివి. వీటి మంచి చెడ్డల విశ్లేషణకు కూడా అదే ప్రమాణం అవుతుంది.
ఈ కథా సంకలనానికి రాసిన ముందుమాటలో తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు ఇలా అంటారు.
...
1984లో విశాఖపట్నంలో చలసాని ప్రసాద్, కృష్ణాబాయిగారు కథల వర్క్ షాప్ ను మొదటిసారి నిర్వహించారు. తర్వాత గత 20 ఏళ్లలో మహానంది, లోపూడి, అరకు, కీసరగుట్టలలో వరుసగా వర్క్ షాప్ లు జరిగాయి. నిర్వాహకులకు భారం కాకూడదని భావనతో ఒకసారి నిర్వహించిన వారు మరోమారు నిర్వహించగలగాలనే ముందుచూపుతో, కథకుల సమస్యలు ప్రత్యేకంగా చర్చించుకోవడం కోసం -ముఖ్యంగా కథలు రాయాలనుకునో, సహాయం కోసం చూస్తున్న వారి కోసం మాత్రమే నిర్వహించడం మంచిదనే పరిమితులు , లక్ష్యాలు పెట్టుకుని ఆ కథల బండి ఇప్పటిదాకా సాగుతోంది.
మలిదశలో ఈ రెండేళ్లలో ఆరు వర్క్ షాపులు- ఇదొక రికార్డు. రికార్డు మాత్రమే కాదని సరైన ఫలితాలే వచ్చాయని ఈ 18 కథలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఇటువంటి వర్క్ షాపులు నిరంతరం సాగాలి . సాగకపోతే ఏమవుతుందంటే చొరవ గల వ్యక్తుల
కృషి గానే మనకు కథాసాహిత్యం మిగులుతుంది. ఆ అపారమైన వ్యక్తి అనుభవాలను తిరిగి సమాజానికి అందించే ఏర్పాటు చేస్తే ఇదిగో ఇలాంటి సామూహిక కథల పంట మన చేతిలో ఉంటుంది.
ఈ మొదటి కథల పంట లోని కథకుల విషయానికి వస్తే ఆర్. శశికళ ,పి.వరలక్ష్మి ,డాక్టర్ పి . విజయలక్ష్మి ,డాక్టర్ కే సుభాషిని ,గీతాంజలి (డాక్టర్ భారతి) ,ఎం.ఏ.బాసిత్, ప్రశాంత్ , ఎ.వి. సుబ్బరాయుడు, జి వెంకట కృష్ణ, పి. మోహన్, పరిమళ్, ఉజ్వల్ ,ఉదయమిత్ర ,ఎం శ్రీనివాస్ ,పి. చిన్నయ్య, నల్లూరి రుక్మిణి ,కె.వి కూర్మనాథ్ ,పాణి.
***
2009 నుండి 2012 మధ్య వచ్చిన కథలతో కథల పంట రెండు 2013 జనవరిలో విడుదలైంది.
ప్రశాంత్, ఇక్బాల్, మార్క వెంకట్రాములు, డాక్టర్ పి .విజయలక్ష్మి , జి వెంకట కృష్ణ, ఆర్ రాఘవ రెడ్డి ,పి. చిన్నయ్య, గీతాంజలి, ఆర్ . శశికళ, వి.ప్రతిమ, ఉదయమిత్ర,బి. పద్మజ ,మహమూద్, కె.సుభాషిని, ఎం. ఏ. బాసిత్,వడ్డెబోయిన శ్రీనివాస్, పాణి, కె.వి కూర్మనాథ్ ,మంచికంటి, తాయమ్మ కరుణ, ఎం. శ్రీనివాసరావు, పి.వరలక్ష్మి , నల్లూరి రుక్మిణి రాసిన ఇరవై మూడు కథలతో బాటూ ʹకథల వ్యవసాయంʹ పేరిట అల్లం రాజయ్య గారి ముందు మాట తో ఈ కథా సంకలనం వెలువడింది.
పది పేజీల ʹకథల వ్యవసాయంలో ʹ అల్లం రాజయ్య గారు వివరణాత్మకంగా ఈ కథా సంకలనంలోని కథలు, వాటి లోతుపాతుల్ని సమీక్షించి విశ్లేషించారు. వ్యవసాయానికి సంబంధించిన చరిత్రను క్లుప్తంగా పాఠకులతో పంచుకున్నారు.
...
"1980 నుండి 2012 పొద్దుటూరు లో జరిగిన వర్క్ షాపు దాకా ఎక్కువ భాగం పాల్గొని- కథకు సంబంధించి, దృక్పథానికి సంబంధించి నేర్చుకున్న విద్యార్థిగా అందరికీ తెలిసినవే అయినా కొన్ని సంగతులు పాఠకులతో పంచుకుంటున్నాను"అని తెలిపారు.
1980లో విశాఖలో జరిగిన వర్క్ షాపు లో అప్పటికే సుదీర్ఘకాలంగా కృషిచేస్తున్న రచయితలు రావిశాస్త్రి కాళీపట్నం రామారావు మాలాంటి యువ రచయితలతో వారి అనుభవాలు పంచుకున్నారు. కథకు సంబంధించిన వస్తువు శిల్పం భాష విషయాలలో ఆయా రంగాల్లో బాగా కృషి చేసే వారితో ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. అప్పటికి అన్ని ప్రాంతాల్లో వస్తున్న కథలకు సంబంధించి వక్తలు మాట్లాడారు. అప్పటికే ప్రాచుర్యం పొందిన ధోరణులకు సంబంధించిన కథలు జిరాక్స్ కాపీలు ఇచ్చి ఒక్కొక్క కథను విశ్లేషించి చర్చించడం జరిగింది. అప్పటికే కథకు సంబంధించి తన పూర్తి కాలాన్ని వెచ్చిస్తున్న కాళీపట్నం రామారావు గారి ఆధ్వర్యంలో లోపూడిలో ఐదు రోజులు జరిగిన సమావేశంలో జిల్లాల వారీగా చర్చించి అన్ని జిల్లాల కు సంబంధించిన కథలను తవ్వి తీయడంతో పాటు, కథలలోని స్థల కాలాలకు సంబంధించి వివరంగా చర్చించడం జరిగింది. అరకులో పది రోజులు జరిగిన వర్క్ షాప్ లో కథలకు చరిత్రకు, నడుస్తున్న ఉద్యమాలకు, రాజకీయాలకు ఉండే సంబంధబాంధవ్యాలు చర్చకు వచ్చాయి. రాత్రిపూట దొరికిన విరామంలో కథకులు తమ కథలు చదవడం- అందరూ చర్చించడం... రచయితలకు నిర్మాణంలో ప్రత్యక్ష సమిష్టి అనుభవానికి తెర తీసింది. ఆ తర్వాత తెలుగులో కథా ప్రక్రియ గొప్ప ముందంజ తో విస్తరించింది.
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ లు ప్రతియేటా వస్తున్న ఎంచిన కథలతో కథల సంకలనాలు తేవడం ఆరంభించారు. కాళీపట్నం రామారావు మాస్టారు శ్రీకాకుళంలో కథానిలయం స్థాపించి తెలుగు కథలను వేలకొలదిగా సేకరించి భద్రపరచడం ఆరంభించారు. ఎక్కడికక్కడ కథల మీద వారి వారిస్థాయిలో సమావేశాలు -గోస్టులు- పెద్ద ఎత్తున కథల పుస్తకాల ప్రచురణ ఆరంభమయ్యింది. విరసం సభ్యులు ఈ అన్ని రకాల పరిణామాల్లో తమ వంతు కృషి కొనసాగించారు..
ఈ చర్చలలో కథానుసారం, సందర్భాన్ని బట్టి కథ అంగాలైన వస్తువు ,శిల్పం, భాష, దృక్పథం ,కథలు రూపొందే క్రమం, కథకు సమాజానికి ఉండే సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన, వస్తున్న కథలు, పరిస్థితులు- ఆయా దేశాలలో రచయితలు తమ దేశాల్లోని పరిస్థితులను కథలలో చిత్రించిన విధానం , జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులు సుదీర్ఘంగా, ప్రగాఢమైన మమేకత్వంతో చర్చించేవారు. నేను చాలా సార్లు కథలతో మమేకమైన ఒక ఉద్విగ్న వాతావరణాన్ని అందరు రచయితల్లో గమనించాను.
***
2015 జనవరిలో వెలువడిన ʹ కథల పంట 3ʹ కథా సంకలనంలో మొత్తం 19 కథలు ఉన్నాయి.
ʹకొత్త కథ ఆవరణంలోకి ʹ పేరిట అల్లం రాజయ్య గారు రాసిన ముందుమాటలో "ఈ 19 కథల్లో సంప్రదాయక పద్ధతులకు భిన్నంగా గతితార్కికంగా, మూలాల్లోకి వెళ్లి ఆలోచించే కథలు ఉన్నాయి. ఇది ఒక రకంగా విప్లవ కథా సాహిత్యంలో ఒక గుణాత్మకమైన మార్పు. సమిష్టి అధ్యయనం ద్వారా నేర్చుకోవడం కథలలో కనిపిస్తుంది . కొత్త కథా ఆవరణంలోనికి ముఖ్యంగా, ఎక్కువగా రచయిత్రులు ప్రవేశించి పరిపుష్టం చేయడం కనిపిస్తుంది " అనటం గమనార్హం.
కథల పంట 3లోని కథకులు..
ఉదయమిత్ర ,గీతాంజలి ,ఇక్బాల్ ,సోమయ్య, పి. చిన్నయ్య, బాసిత్, పి.వరలక్ష్మి, పి. విజయలక్ష్మి ,ఎం .శ్రీనివాసరావు , సుభాషిణి, నల్లూరి రుక్మిణి, తాయమ్మ కరుణ, బి అనురాధ ,ఆర్ .శశికళ ,స్వాతి, కె.వి కూర్మనాథ్ ,పాణి,జి. వెంకటకృష్ణ, పద్మ కుమారి.
***
కథల వర్క్ షాపులు కథకులకు మేలు చేస్తున్నాయనటానికి ఉదాహరణ ఈ కథా సంకలనాలు. అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలు, సమాజంలో వస్తున్న మార్పులు, సంఘర్షణ, ఒత్తిడికి గురవుతున్న మానవ సంబంధాలు, కథకులకు కొత్త కథా వస్తువుల్ని అందిస్తున్నాయి. సంఘటన సందర్భం వస్తువుగా, కథగా మారే క్రమంలో ఎంత మేరకు శిల్పం కథను పాఠకుడికి మరింత స్పష్టంగా దగ్గరగా అర్థం కావడానికి దోహదం చేస్తుందో, కథకు రచయితకు పాఠకుడికి మధ్య ఉండాల్సిన సహృదయ వాతావరణాన్ని ఏర్పరచడం లో రచయిత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, దేన్ని స్వీకరించాలో, దేన్ని వదులుకోవాలో ,దేన్ని విశ్లేషించుకోవాలో, దేన్ని సవరించుకోవాలో కథల వర్క్ షాపులలో అనుభవపూర్వకంగా రచయితలు తెలుసుకుంటున్నారు.
విప్లవ రచయితలే కాకుండా సృజనాత్మక యువ రచయితలకు కథల వర్క్ షాపులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతున్నాయి. వర్క్ షాప్ లలో జరిగిన విషయాలను, చర్చలను అరుణతార మాస పత్రికలో ప్రచురించడం ద్వారా ఈ విషయాలు విస్తృతంగా పాఠకలోకానికి తెలిసి వస్తోంది.
***
ఈ కథలిలేవీ అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడి పడిన కథలు కావు. దుఃఖితుల కథలివి. ఈ కథలలోని జీవనపోరాట దృశ్యాలు -సమకాలీన సంఘర్షణలకు నిలువుటద్దాలు
కథల పంట పేరిట వచ్చిన కథా సంకలనాలు కథ లోకంలో కొత్త ఒరవడికి, కొత్త కథ వస్తువులకు, విభిన్నకథా శిల్పాలకు మూలం అయ్యాయంటే అంటే ఒప్పుకోక తప్పదు.
కథకులలో ఉత్సాహాన్ని నింపడానికి, కొత్త కథల్ని ఆవిష్కరించడానికి విరసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటం కారణంగా, కథల పంట పేరిట వస్తున్న కథా సంకలనాలు, వాటి పై వస్తున్న విమర్శ, సమీక్ష లు పాఠకులకు రచయితలకు విమర్శకులకు పని పెడుతున్నాయి, నిరంతర చైతన్య స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఒక ప్రజాస్వామిక స్వేచ్ఛా వాతావరణాన్ని కథకులకు కలిగించడంలో కథకుల ఆలోచనా పరిధిని విస్తరింప చేయడంలో కథా వర్క్ షాపుల పాత్ర చరిత్ర విస్మరించలేనిది.
ముఖ్యంగా "నేలతల్లి విముక్తికోసం, కథా కెరటాలు ,కదిలే కథ "కథా సంకలనాలు కొత్త చరిత్రను సృష్టించాయి. మూస ధోరణులకు, అనుకరణ లకు కు భిన్నంగా సమాజాన్ని లోతుగా గమనిస్తూ ప్రజల వైపు నిలబడిన రచయితల నుండి వెలువడిన కథల్లోంచి ఎంపిక చేసిన ఉత్తమ కథలతో ఏరి కూర్చిన ఈ కథా సంకలనాలు ఎంతో విలువైనవి.
ʹకదిలే కథʹ కథా సంకలనం 2003 జనవరిలో వచ్చింది. ఇందులో ʹకదిలే కాలానికి సూచికʹ పేరిట సంపాదక వర్గం పేర్కొన్న అభిప్రాయాలు గమనిద్దాం.
" 1989 లో ప్రచురించిన నేలతల్లి విముక్తి కోసం కథాసంకలనం సామాజిక ఉద్యమ పరిణామాన్ని, మానవ చైతన్య క్రమాన్ని ఒక దశ దాకా చిత్రిస్తే, ʹకథా కెరటాలుʹ నూతన ఆర్థిక విధానాల దశాబ్ధి లోని అభివృద్ధి విధ్వంసాలను చిత్రించాయి. ఏటికి ఎదురీదగల తాత్విక సాహసాన్ని, నిర్మాణాత్మక ప్రతిభను ఈ దశాబ్దంలో విప్లవోద్యమం సాధించినట్టే, విప్లవ రచయితలు కథా సాహిత్యంలో ప్రదర్శించగలిగారు. దాదాపు పాతికేళ్ళ కిందట తెలంగాణ మారుమూల పల్లెల్లో పునర్నిర్మాణమైన విప్లవోద్యమ చలనాల దగ్గరినుండి, దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ రాజ్యాధికారం దిశగా పురోగమించిన నేపథ్యంలో ఈ రెండు సంకలనాలు మానవ సంబంధాలకు సృజనాత్మక రూపాలుగా నిలబడిపోయాయి.
ఇప్పుడు ఈ ʹకదిలే కథʹ సంకలనం మన కళ్లెదుట సమస్త సంక్లిష్టతలతో , వైరుధ్యాలతో రూపొందిన వర్తమాన సందర్భానికి కాల్పనిక వ్యక్తీకరణ. ఈ నేల మీద మట్టి మనుషులు, సృజనాత్మక జీవులు తమ జీవన్మరణ పోరాటాల ద్వారా నెలకొల్పుతున్న ఉన్నత సంప్రదాయాన్ని ఈ కథా రచయితలు తమ విశ్వాసంగా స్వీకరించి ప్రకటించే క్రమంలో కథలు రాశారు.
మానవ సంబంధాల విధ్వంసం దిశగా పెరిగిపోతున్న వ్యవస్థాగత దుర్మార్గాలను అనుభవించి ,దుఃఖించి, విశ్లేషించి ,నిలువరించే క్రమంలో ప్రజలు ఒక సంఘర్షణ క్రమాన్ని ముందుకు తీసుకుని వస్తారు .అదే చరిత్ర నిర్మాణానికి కేంద్రం .మానవ సంబంధాల ఉన్నతీకరణ కోసం జరిగే సంఘర్షణ , ఆచరణే సాహిత్యానికీ జీవధాతువు. రచయితలు చరిత్ర నిర్మాణాన్ని , మానవ సంబంధాల ఉన్నతీకరణ కోణంలో చూచి సాహిత్య సృజన చేస్తారు .అట్లా ఈ కథలు సామాజిక సంబంధాల చరిత్రకు కాల్పనిక రూపంగానే కాక విశ్లేషణ సాధనాలుగా కూడా నిలబడతాయి.
***
ఇవి కాక దండకారణ్య కథలు పేరిట 2005-2012, 2013-2015 వెలువరించిన కథాసంకలనాలు తెలుగు సాహిత్యానికి, ప్రపంచానికి అంతగా తెలియని సమకాలీన సంఘర్షణాత్మక జీవితాలను, సంఘటనలను, పరిణామాలను పరిచయం చేసాయి.
కథలపైన జరిగే చర్చలు , సమీక్షలు, సద్విమర్శ లు కథకులకు ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని ప్రేరణను కలిగిస్తాయి. ఈ రకంగా చూసినప్పుడు విరసం ప్రచురించిన కథా సంకలనాల్లోని కథలపైన సమగ్రమైన చర్చ జరగాల్సి ఉంది.ప్రత్యేకంగా ఈ కథలపైన అన్ని ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించినట్లయితే ఈ కథా సంకలనాల్లో ప్రచురించబడిన కథల ముందు తర్వాత జరిగిన వాస్తవ పరిణామాలను చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంమీద భవిష్యత్ పరిణామాలను ముందుగానే ఆలోచించి, ఊహించి చిత్రించిన రచయితల ప్రతిభను ప్రశంసించక తప్పదు.
విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక స్వాతంత్రం, అక్షరాస్యత, సమాన హక్కులు, వర్గ చైతన్యం, స్త్రీ సాధికారత, బాలల హక్కులు, మార్కెటీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, మానవీయత, ఆదివాసి జీవితాలు, దళిత గిరిజన బహుజన మైనారిటీ వ్యధలు, వెతలు, విధ్వంసం అవుతున్న పర్యావరణం, ప్రకృతి, కనుమరుగవుతున్న అడవులు, భాషలు, ఆదివాసీలు, సమకాలీన ప్రపంచానికి తెలియని ప్రపంచం, అందులోని సంఘర్షణలు సంక్షోభాలు, ఉద్యమకారుల జీవితాలు, గ్రామీణ పట్టణ మైదాన అటవీ ప్రాంతాల్లోని వైరుధ్యాలు విధ్వంసాలు, విభిన్న జీవితాలు మరెన్నో కారణాలు కారకాలు ప్రేరకాలు కథలు గా మారిన వైనం పాఠకులను ఉలికిపాటుకు గురి చేస్తుంది.
కఠినంగా అనిపించే వాస్తవాలను, నమ్మశక్యం కాని నిజాలను , దుఃఖ భరిత వాతావరణాన్ని పాఠకులకు ఈ కథలు పరిచయం చేస్తాయి. పాఠకులకు అనేక విషయాల పట్ల ఆసక్తిని అవగాహనను కలుగజేస్తాయి.
కథలు చదవడంతో పాఠకులు ఆగిపోకుండా, నిరంతర సృజనాత్మక, వాస్తవ, సంక్లిష్ట కథావరణంలోకి సాగిపోవడానికి కావలసిన ప్రేరక,ఛొదక, జీవశక్తిని ఈ కథలు కలిగిస్తాయి. అలా కలిగించాయంటే ఈ కథల, కథకుల, ప్రచురణకర్తల లక్ష్యం నెరవేరినట్లే. 50 సంవత్సరాల ప్రస్థానంలో అరుణతార ప్రచురించిన కథల ప్రత్యేక సంచికలు నిజంగానే ప్రత్యేకమైనవి.
కథల గూటికి (2018 జనవరి) రాసిన సంపాదకీయంలో పాణిగారు అభిప్రాయపడినట్లు " మార్పు కేంద్రంగా సాగే జీవన వాస్తవాన్ని ఉన్నతీకరించే లక్ష్యం ఉన్న సాహిత్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తానే ఒక ప్రమాణంతో బయలుదేరిన విప్లవ కథ తన ప్రమాణాలతోనే ఘర్షణ పడి, వాటిని మార్చుకుంటూ పురోగమిస్తోంది.నేల మీద మనుషుల మధ్య సాగే బహుముఖీన వర్గ పోరాటాన్ని విప్లవ కథ అంటి పెట్టుకున్నది. దీనివల్ల వైరుధ్యాల అన్వేషణ, వాటి సృజనాత్మక వర్ణన, వాటికి ఉండగల పరిష్కారాల ప్రతిపాదన అనే సుగుణం విప్లవ కథ సంతరించుకుంది. ఇదంతా జీవితానుభవం నుంచి జీవితానుభవం గా వ్యక్తమయ్యే ప్రక్రియ కాబట్టి తప్పక కళ అవుతుంది. జీవితాన్వేషణ, విలువల ప్రతిపాదన కళగా ఎలా మారుతుందో ఈ కథల్లో చూడవచ్చు".
***
సంవత్సరానికి ఒకసారైనా అరుణతార కథల ప్రత్యేక సంచికను, కొత్త కథకుల తొలి కథల ప్రత్యేక సంచికలను వెలువరించాల్సిన సాహిత్య అవసరం ఎంతైనా ఉన్నది. ఏ పత్రికలు ఇవ్వలేనంత స్థలాన్ని సమీక్షకు విమర్శకు చర్చకు కథల విశ్లేషణకు వర్క్ షాప్ ల వివరణకు అరుణతార పత్రిక ఇస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి కథలను కథా సంపుటాలను కథా సంకలనాలను పరిచయం చేయాల్సిన బాధ్యత సాహిత్య విమర్శకులదే.
ఈసారి కథల పంటలో సమీక్షించి చర్చించి తిరగ రాయించిన పూర్తిగా కొత్త కథకుల మొదటి కథలు అచ్చు వేసే ప్రయత్నం చేసినట్లయితే కొత్త కథకులను, కొత్త కథలను ఆవిష్కరించినట్లవుతుంది . కొత్త సృజనను స్వాగతించడం ఎప్పుడూ శుభపరిణామమే. తద్వారా అన్ని ప్రాంతాల్లో మరింతమంది కొత్త కథకుల ఉనికి తెలిసి వస్తుంది. ఇప్పటి కాలానికి సాహిత్యానికి సమాజానికి కొత్త కలాల అవసరం ఎంతైనా ఉన్నది .
ప్రతి ప్రాంతంలోని సీనియర్ కథా రచయితలు, విమర్శకులు పాఠకుల్లోని కొత్త కథకులను గుర్తించడం, వారి రచనల్ని వెలికితీయడం ,యువతరాన్ని కథారచన వైపు నడిపించడం కళాశాలలో విద్యార్థులకు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అన్ని వర్గాల అన్ని సంస్థల సంస్థాగత కార్యక్రమాల్లో సభల్లో అన్ని వృత్తులవారికి అవసరమైన స్ఫూర్తిని కలిగించే ప్రేరణ కలిగించే సత్య వంతమైన కథలను చదివి వినిపించటం అవసరం. ప్రతి మాసం ఒక కొత్త కథకుడి ఆగమనాన్ని అయినా ఆశించటం అత్యాశే అయినా , ఎప్పటికప్పుడు కొత్త కలాలకు స్వాగతం చెప్పటం ఒక చారిత్రక అవసరం. ఒక తరం మరొక తరాన్ని తయారు చేసుకోవలసిన తరుణం ఇది.
పరిమితులకు లోబడకుండా, ఎందరో ప్రజాస్వామ్య రచయితలను కవులను కలుపుకుంటూ విరసం తన లక్ష్యాలకు అనుగుణంగా విస్తృతమౌతూ ఉన్నది. ఈ క్రమంలో విరసం నిర్వహించే సదస్సులలో ,పుస్తకావిష్కరణ సభలలో, పుస్తక ప్రదర్శనలలో , వర్క్ షాపులలో రచయితలు ,కవులు, విమర్శకులు పాఠకులు ఎక్కువ మంది పాల్గొంటూ , తమ సలహాలు, సూచనలు, విలువైన విమర్శలు అభిప్రాయాలు తెలియజేస్తూ రచనా సహకారం అందజేస్తుండటం మంచి పరిణామం.
ఇప్పటివరకు అరుణతార మాస పత్రికలో, విరసం అంతర్జాల పత్రికలో వచ్చిన కథలు అన్నింటిలో మేలైన వాటిని ఏరి కూర్చి ముద్రణ రూపంలో కాకపోయినా అంతర్జాలంలో చదువుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.(చరిత) హైదరాబాద్ పరుచూరి సుబ్బయ్య గారు ప్రచురించిన చిన్న సైజు అరుణతార కథల సంకలనాలు పాఠకులకు నచ్చాయి. విస్తృతంగా ఉత్తమ కథలను చదివి సామాజిక పరిణామక్రమాలను, సామాజిక చరిత్రను, సంఘర్షణలను అర్థం చేసుకోవటానికి ఈ చిన్ని కథాసంకలనాలు ఉపయోగపడ్డాయి.
సమాజానికి మేలు చేసే క్రమంలో రచయితలకు పాఠకులకు విమర్శకులకు సరైన దారి చూపించి, అవగాహన కల్పించి, కథావరణంలో నిరంతరం సృజనకు, సజీవత్వానికి ,శక్తికి ,ప్రేరణకు అవకాశం కల్పించి, దిక్సూచిగా నిలవడమే 50 ఏళ్ల విరసం ప్రస్థానం .
Type in English and Press Space to Convert in Telugu |
పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానోకవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని ....... |
ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి కవిత్వంకాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి... |
సాహిత్య విమర్శకు కొత్త బలంఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే... |
ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులునమ్ముకున్న కలల్ని గాలికొదలి
ఇల్లు వదిలి, ఊరు వదిలి
పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి... |
మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹమనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ...... |
మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ
అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు...... |
స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ... |
ఒక మంచి రాజనీతి కథవ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు...... |
మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹసాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర..... |
వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..." కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న ..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |