మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం

| సాహిత్యం | క‌విత్వం

మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం

- జి. వెంకటకృష్ణ | 17.12.2019 08:46:08pm


1. 50 ఏళ్ల విప్లవ కవిత్వ పరిణామ దశలను ఎలా చూస్తారు? వాటిని ఎలా విశ్లేషించవచ్చు?

విప్లవ కవిత్వ పరిణామ దశలన్నారు కాబట్టి ఈ ప్రశ్నకు రెండు, మూడు రకాల సమాధానాలు వున్నాయనిపిస్తుంది. ఏ ఉద్యమానికైనా హెచ్చు తగ్గులుంటాయి. అట్లనే విమర్శకులు అనబడేవాళ్ల పక్షపాతానికి కూడా గురవుతాయి. ఆరంభం నుంచి 1975 దాకా విప్లవ కవిత్వపు మొదటి దశ. డెబ్సైల కాలాన్ని విప్లవ కవిత్వానిదే అన్న తెలుగు విమర్శకులు డెబ్పై ఐదుకల్లా విప్లవ కవిత్వం ఫోర్స్‌ తగ్గిందని తేల్చేసారు. ఎమర్జెన్సీకి అటు ఇటూ దేశంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. 1985ల కాలానికి అస్తిత్వ వాద ఉద్యమాలు తెలుగు కవిత్వ రంగాన డ్రైవింగ్‌ ఫోర్స్‌ అయ్యాయి, కాబట్టి విప్లవ కవిత్వం వెనకబడ్డదని చెప్పారు. కానీ ఎమర్జెన్సీ కాలంలోనే విప్లవ కవిత్వం వైవిధ్యంగా బలంగా వచ్చిందని, వీవీ ʹʹఊరేగింపుʹʹ (1974) సంపుటైతేనేమి, కెవిఆర్‌, గద్దర్‌లాంటి వాళ్ల కవిత్వం అయితేనేమీ రుజువు చేసింది. ఆ తర్వాత 1980-90ల మధ్య ఉత్తర తెలంగాణా విప్లవవోద్యమం ముందంజ వేయడంతో విద్యార్థి వుద్యమంలో పాల్గొన్నవారు విప్లవ కవిత్వాన్ని సుసంపన్నం చేసారు. అజ్ఞాత సూర్యుడు, నారాయణ స్వామి, వేణుగోపాల్‌ లాంటి వాళ్ల కవిత్వాన్ని, ʹవిప్లవ కవిత్వం పని అయిపోయిందిʹ అన్నవాళ్లు చూడనేలేదని విప్లవ విమర్శకులు అంటుంటారు. ఇది నిజం. తెలుగు సాహిత్య విమర్శకులలో వున్న వైరుధ్యం యిదే. స్త్రీవాద దళిత వాద కవిత్వాన్ని ఆకాశానికెత్తడానికి అంతకుముందు నుంచి వుంటున్న విప్లవ కవిత్వాన్ని లేదనేసారు. వీళ్లు ఒకదానిని ఎత్తిపట్టడానికి మరొక దాన్ని శూన్యం చేస్తారు. ఆ తర్వాత 1992 నిషేధం మొదలైప్పుడు మూడు నాలుగేళ్లు విప్లవ కవిత్వం ఫోర్స్‌ తగ్గింది. మరలా పుంజుకొని 2000లకల్లా పునరుత్తేజం అయ్యింది. 2000-2008 మధ్య పదహైదు దాకా కవిత్వ సంపుటాలు వచ్చాయి. తర్వాత ఇప్పటి దాకా విప్లవ కవిత్వం ఆగకుండా వెలుబడుతూనే వుంది. ఇది మూడో దశ.

రెండో రకం సమాధానం పాణిగ్రాహి, శ్రీశ్రీ, శివసాగర్‌, చెరబండ రాజు, వివి, కెవిఆర్‌, నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి మొదటి దశ విరసం కవులైతే, గద్దర్‌, నారాయణ స్వామి, విమల, సౌదా, త్రిశ్రీ తర్వాత దశ కవులు. వడ్డెబోయిన శ్రీనివాస్‌, రివేరా, కాశీం, అరసవెల్లి కష్ణ, కెక్యూబ్‌వర్మ లాంటి తదితరులు నుంచి ఇప్పుడిప్పుడే రాస్తున్న క్రాంతి మొదలైన వాళ్ల దాకా మూడో దశ విప్లవ కవులు. బయటకు కన్పించే ఈ కవులే కాకుండా ప్రారంభం నుండే ఇప్పటి దాకా సుబ్బారావుపాణిగ్రాహి, శివసాగర్‌, కౌముది, సముద్రుడు, మంజీర, ఎమెస్సార్‌, షహీదా లాంటి అజ్ఞాత కవుల కవిత్వం ఉండనే ఉంది. బయటి మూడు తరాలకూ జవం జీవం అందించింది వీళ్లనే నా నమ్మకం. ఆ మేరకు విప్లవ కవిత్వానికి నిజమైన పరిణామ దశలను ఇంకో రకంగా చెప్పాలంటే శ్రీకాకుళోద్యమ దశ, ఉత్తర తెలంగాణా దశ, దండకారణ్య దశలుగా కూడా చెప్పొచ్చు.

2. కఠినమైన సాయుధ విప్లవానికీ సున్నితమైన కళకూ మధ్య విప్లవ కవులు ఎలాంటి సమన్వయం సాధిస్తున్నారు?

ʹకసితో స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరక గల్గినవాడే నేటి హీరో, ప్రజల గుండెల కొండల్లో మాటువేసి ట్రిగ్గర్‌ నొక్క గలిగినవాడే ద్రష్ట, ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేడు కవిʹ అని రాసిన శివసాగర్‌ను చదువుకున్నప్పుడు పాఠకుడిగా నాకు ఏం అన్పించిందంటే ʹఎంత కఠినమైన పనిని మీద వేసుకున్నారీ కవులుʹ అనే. నిజంగా విరసం కవులు కవిత్వాన్ని ʹసున్నితమైన కళʹ అనుకుంటారా? ప్రజలకు పోరాటాల గురించి చెప్పడం, సెన్సిటైజ్‌ చేయడం విప్లవ కవిత్వ లక్షణం కదా. వ్యక్తులుగా సున్నితత్వంగా ఉండొచ్చుగాని, సంప్రదాయార్థంలో ఈ కవిత్వం సున్నితమైనది కాదనే అనుకుంటాను. కౌముది, విమల, కెక్యూబ్‌వర్మ కవిత్వంలో ఈ సున్నితమైన కళా నైపుణ్యం కనిపిస్తుంది. కానీ సాధారణ విప్లవ కవిలో.. సున్నితమైన ప్రపంచ నిర్మాణం కోసం, కఠినమైన సత్యాలను అంతే కఠిన స్వరంతో మాట్లాడటమే యెక్కువగా ఉంటుంది. కరుణను చిత్రించిన వేళ్లతోనే వీరత్వాన్ని ప్రకటించారు, బీభత్సాన్ని ఎత్తి చూపారు. నినాదంగా కూడా (నినాదమంటే నిందార్థంలో కాదు) మిగిలారు.

అయితే ఈ ప్రశ్నకు ఇంకో తలం నుండి కూడా సమాధానం చెప్పవచ్చు. వ్యవస్థీకత దుర్మార్గం ఎదుట నిలబడి ఆ దుర్మార్గంతో పాటు కలగలసిపోయి ఉన్న వ్యవస్థలోని మంచినీ, చెడునూ పరిగ్రహించడానికి, ప్రాచీన కవి సమయంలో హంస పాలనూ నీటినీ వేరు చేసుకుంటుందాంటారే, అలాంటి విద్య విప్లవ కవులకు తెలుసని నాకనిపిస్తుంది. ʹఅది దక్పథ సమన్వయంʹ. ఒక పోలీసులోని మనిషి పోలీసు అయినందుకు వచ్చే క్రూరత్వమూ, వాడు మనిషైనందువల్ల సహజంగా ఉండే మానవత్వమూ వేరువేరుగా చూడ్డం లాంటిది ఇది. ఇక అజ్ఞాతంలో ఉండి దుర్భర పరిస్థితుల్లో సైనికులుగా తిరుగాడే వాళ్లు తమకు దొరికి కొద్దిపాటి విశ్రాంతిలో సజనకారులుగా మారడం అంటే సున్నితత్వంలోకి పరకాయ ప్రవేశం చేయడమే. ఇదంతా దక్పథం, ఆచరణ ఇచ్చే బలం.

3. విప్లవ లక్ష్యాన్ని, శిల్ప ప్రయోగాలనూ ఎలా పరిశీలిస్తారు?

విప్లవ కవిత్వ లక్ష్యం వర్గపోరాటాల పట్ల ప్రజలను సెన్సిటైజ్‌ చేయడమే. మొదట ఆ లక్ష్యంతో ప్రయోగాల మార్గం ఎంచుకోలేదు. సాధ్యమైనంత సరళంగా, రుజుమార్గంలోనే విప్లవ కవిత్వం సాగింది. సూటిదనం అనేది దానికదే శిల్పంగా కూడా ఉంటుంది. 70ల్లో ఈ ʹసూటిదనంʹ అనే విప్లవ కవిత్వ లక్షణం వల్లనే విమర్శకులు విప్లవ కవిత్వం పలచబారిందని అన్నారనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ʹసూటిదనంʹ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ ప్రత్యేక పరిస్థితులు లేనప్పుడు కవిత్వంలో సూటిదనం బోలాగా మారి, ʹఫోర్స్‌ʹ కానిదౌతుంది. సూటిదనంలో కూడా వస్తు వైవిధ్యత, శిల్ప వైవిధ్యత సాధించాల్సిన బాధ్యత విప్లవ కవులు తీసుకున్నారు. వి.వి. ఆ విషయంలో సక్సెస్‌ అయినట్టు నాకనిపిస్తుంది. సముద్రం దీర్ఘ కవిత తర్వాత వివిది ʹఉన్నదేదో ఉన్నట్లుʹ సంపుటి వచ్చింది. అందులో సూటిగా, సరళంగా ఉంటూనే కొత్తగా రాయడానికి కొన్ని ప్రయత్నాలు చేసాడు. కవిత్వంలోకి స్థానీయ ప్రతీకలను, నేటివిటీని తీసుకురావడం, వీరగాథల టెక్నిక్‌ను అనుసరించడం లాంటివి పాటించాడు. విప్లవ కవులు పాండిత్యాన్ని ప్రదర్శించరు. వాళ్లెట్లాగూ ʹపండితులుʹ కారు. ముఖ్యంగా కార్యకర్తలు. విప్లవ కవిత్వం ʹకార్యకర్తల కవిత్వంʹ. అందుకే విప్లవ కవిత్వంలో గేయం, పాట ప్రాధాన్యత కల్గి ఉంటాయి. మొదటి నుంచీ ఈ ప్రయోగం చేస్తునే ఉన్నారు. అట్లాగే మాండలికం. వడ్డెబోయిన శ్రీనివాస్‌ లాంటి వాళ్లు తెలంగాణ మాండలికాన్ని కవిత్వంలో ప్రభావంతంగా వాడారు. కొంత ʹఅతిʹ అన్పించేంతగా వాడారు.

4. అంతకు ముందుటి విప్లవ కవిత్వ శిల్పాన్ని, 1990ల తర్వాతి విప్లవ కవిత్వ శిల్పాన్ని ఎలా అంచనా వేస్తారు?

1990ల ముందుటి విప్లవ కవిత్వం గురించి ʹనినాద ప్రాయమైపోయిందనీʹ గిడసబారిపోయిందనీ, కొంత కఠినంగానే వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఇదంతా విమర్శకుల దష్టి లోపం వల్లే. అయితే ఇతర కవిత్వ ధోరణుల కంటే విప్లవ కవిత్వానికి కఠినమైన, భిన్నమైన నిర్దేశాలుంటాయి. విప్లవ కవులంటేనే కార్యకర్త కవి కావడం. వాళ్లు సున్నితమైన మానవ విలువల కోసం పోరాడేవారే కావొచ్చు. ఆ క్రమంలో యాంత్రికతకు గురయ్యే అవకాశం వుందేమో కూడా గమనించాలి. ఇక్కడ యాంత్రికత అంటున్నది ఒకే మూడ్‌లో వుండటంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో వొత్తిడులు పని చేస్తుంటాయి. అప్పుడు శిల్పాన్ని గురించి ఆలోచించగలరా? 80ల తర్వాత విరసం నుంచి కొత్తతరం కవులు కన్పిస్తారు. అజ్ఞాతం నుంచి అయితే శివసాగర్‌కు కొనసాగింపు లాంటి అజ్ఞాతసూరీడు ఉన్నారు. తమదైన ముద్ర కలిగిన ఎమ్మెస్సార్‌, సముద్రుడు ఉన్నారు. వీళ్లు విప్లవ కవిత్వాన్ని రొమాంటిసైజ్‌ చేసారు. 2000ల తర్వాత కౌముది ʹʹరాజ్యం గరకు పెదాలపై సుతారంగా సున్నితంగా పద్యం రాస్తానుʹʹ అనేంత కాల్పనికంగా కవిత్వం రాసాడు. రివేరా, శ్రీనివాస్‌ ఈ కాలం కవులే. విమర్శకుల చేత కూడా ప్రశంసించబడ్డారు. ఇక వివి రాస్తూనే ఉన్నాడు. ఎన్‌ వేణుగోపాల్‌ ʹపావురంʹ ఈ కాలానిదే. ఈ కాలపు వివి కవిత్వంలో (ఉన్నదేదో ఉన్నట్లు) మెచూర్డ్‌ శిల్ప విన్యాసం కనిపిస్తుంది. విప్లవ కవిత్వం సూటిదనంగా ఉంటుంది గదా. ఆ సూటిదనం మరింత నవ్యంగా కన్పిస్తుంది. 90ల తర్వాతి కాలం తెలుగు సాహిత్యంలో అస్త్తిత్వవాద ఉద్యమ కవుల కాలం. వాళ్ళు వేసిన ప్రభావం అంతా ఇంతా కాదు. వాళ్ళ ప్రభావం విప్లవ కవుల మీద ఉందనే అనుకుంటాను. అంతకుముందున్న ʹసూటిదనంʹ విప్లవ పదచిత్రాల్లోకి చేరింది. కొత్త పదబంధాల విస్తరణగా మారింది. మధ్య తరగతి జీవితం వేసిన ప్రభావం కూడా గమనించవచ్చు. ఈ కాలంలో విప్లవ కవిత్వంలో నెటివిటీ పెరిగిందనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ నెటివిటీ. కౌముది రాజ్య నిర్బంధాన్ని రాజ్యహింసనూ కేంద్రంగా చేసుకొని ʹతల్లి చెంగునుʹ మానవీయంగా ప్రకటిస్తారు. ఆ మేరకు విప్లవ కవిత్వాన్ని మానవ సంబంధాలమయం చేయగలిగాడు. ఇది ఒక రకంగా ఎక్స్‌టెన్షన్‌. విప్లవ కవిత్వాన్ని ʹమూసʹ అనే విమర్శకు కౌముది కవిత్వం పూర్తిగా సమాధానం చెప్పింది. అది శిల్ప వున్నతీకరణే.

5. ఈ కొత్తతరం విప్లవ కవిత్వంలోని వస్తు వైవిధ్యం?

1990ల తర్వాత తెలుగు కవిత్వం మొత్తంగానే వస్తు వైవిధ్యంలోకి అడుగుపెట్టింది. సూటిదనం తగ్గించుకొని విశాలతను చేరింది. కవిత్వంలోకి మానవ సంబంధాలు వచ్చాయి. విప్లవాన్ని ʹచనుబాల ధారʹ అని ఒక కవి అంటే, కవిత్వాన్నీ, విప్లవాన్నీ కలగలిపి మానిషికీ మనిషికీ మద్య ఉన్న అనుబంధం ʹపావురంʹ అని ఇంకొకరన్నారు. కోస్తా నుంచి ఒక కవి మరీ రొమాంటిక్‌గా ʹసగం కాలిన వెన్నెలʹ అన్నాడు. తెలంగాణను ఒక కవి ʹపడావుʹ పడ్డదని అన్నాడు. విప్లవ వస్తువు గ్లోబలైజ్‌ అయింది ఈ కాలంలోనే. దగ్ధమవుతున్న బాగ్దాదు నెలవంక అంటాడు వివి. రాజ్యహింసను కేంద్రం చేసుకుంటూనే గ్లోబల్‌హింసనూ ఎత్తి చూపడం ఈ కాలంలో జరిగింది. విమల ʹమగనʹలోని చాలా కవితలు 1990ల తర్వాతివే. ఈమెలో విప్లవ పలవరింతల పక్కనే స్త్రీవాద తాత్వికతా కన్పిస్తుంది.

6. మొత్తంగా విప్లవోద్యమం తెలుగు కవిత్వంలో తీసుకొచ్చిన మార్పులేమిటి?

సాయుధ పోరాట పరిభాషను తెలుగు కవిత్వంలోకి తీసుకొచ్చింది. విప్లవ అభివ్యక్తి ప్రధానంగా కవిత్వంలోనే కనిపిస్తుంది. కవిత్వ మౌలిక స్వరూపాన్ని విప్లవోద్యమం మార్చేసింది. సమాజంలో సంపూర్ణ మార్పును ఆశించే వర్గాన్ని గురించి సమాన్య పాఠకులకు కూడా అందేలా చేసింది. తుపాకీ గొట్టం ద్వారా వచ్చే రాజ్యాధికారం, రాజ్యహింసా రెంటినీ పరిచయం చేసింది. అస్తిత్వ వాద ఉద్యమాలు తలెత్తడానికి కారణమైంది. ఆ ఉద్యమాల ప్రభావానికి గురై విస్తరించింది.

7. దక్పథ వైశాల్యాన్ని శిల్ప ప్రయోగాల్లో ఎలా చూడవచ్చు?

నాకు అర్థమైనంత వరకు దక్పథం విశాలం అయ్యే కొద్దీ ప్రయోగశీలత కవిత్వ ఆకాంక్షలకు అనుగుణంగా మారుతుంది. ఎంత ప్రయోగశీలత అయినా సరే పాఠకులను చేరితేనే ఉన్నతమైనట్లు. ఆ ఎరుక కవికి ఉండటమే విప్లవ దక్పథ వైశాల్యం.

8. విప్లవ కవిత్వంలోని తాత్వికతను, దాని పరిణామాన్ని ఎలా చూడొచ్చు?

విప్లవోద్యమం ప్రారంభం నుంచి రాజ్యహింసనీ, నిర్బంధాన్నీ ఎదుర్కొంటూ ఉంది. దీన్ని ఎదుర్కొనే ప్రతిఘటనను విప్లవ కవిత్వం తన అన్ని దశల్లోనూ ప్రతిఫలిస్తోంది. దుఃఖం ఒక అనివార్యమైన స్వరం. దుఃఖం ఎప్పుడూ నిస్సహాయతగా కాకుండా క్రియశీలత్వాన్ని గుర్తు చేసే విషయంగానే విప్లవ కవులు చిత్రిస్తూ వస్తున్నారు. శివసాగర్‌ దగ్గర్నుంచీ కెక్యూబ్‌వర్మ దాకా దుఃఖం చుట్టూ ఎన్నో పదచిత్రాలు. రాజ్య స్వభావాన్ని వివరించే పద చిత్రాలూ, ఇవన్నీ అంతిమంగా మానవ జీవిత పరమార్థాన్ని అందిపుచ్చుకునేవే. మత్యువును కీర్తించిన కవిత్వం విప్లవ కవిత్వంలో చెప్పలేనంత. ఒక మనిషి మరణాన్ని ʹఅమరత్వంʹగా మార్చడమనేది విప్లవోద్యమంలోనే సాధ్యమైంది. ఇది అనివార్యంగా మానవజీవిత ʹఉన్నతీకరణకుʹ సంబంధించినది. నామవాచకాలను సర్వనామాలు చేసినది విప్లవ తాత్వికత. తల్లి చనుబాలను విప్లవ వెన్నెలగా రంగరించి గెరిల్లా దాహం తీర్చినది విప్లవ తాత్వికత. మనుషుల జ్ఞాపకాలను మనుషుల పునర్నిర్మాణంగా మలచింది విప్లవ తాత్వికత. వ్యవస్థలో, నాగరికతలో సంపూర్ణమైన మార్పును, ఆరోగ్యకరమైన మానవ అభివద్ధినీ ఆకాంక్షించే చింతన సామాన్యమైన మానవుల ఆలోచనల్లోకి కూడా ఇంక గలిగిందంటే విప్లవ కవిత్వం, ఈ తాత్విక భూమిక వల్లే.

9. ఘటనల మీద రాసేది కవిత్వం కాదనే వాళ్లు ఉన్నారు. సంఘటనలను వస్తువుగా తీసుకొని విప్లవ కవులు ఎలా వ్యవహరించారని మీరనుకుంటున్నారు?

వర్తమాన తెలుగు కవిత్వంలో ఘటనల మీద రాసిన కవిత్వమే ఎక్కువ. కవిత్వం ఆవేశప్రధానమైనది కదా, తక్షణ స్పందనగా కవిత్వమే జాలువారుతుంది. ఘటనల మీద ఒక్కోసారి గొప్ప కవిత్వం కూడా వచ్చింది. బాబ్రీ మసీద్‌ విధ్వంసం, గుజరాత్‌ గాయం. సద్దాం హుస్సేన్‌ మరణం, రోహిత్‌ మరణం, నోట్ల రద్దు ఇట్లా తెలుగు కవిత్వ ప్రయాణాన్ని చక్కగా వివరించేది ఘటనలే.

విప్లవ కవులకూ ఘటనలు ఎదురవుతాయి. రాజ్యహింస అనేక సార్లు ఎదురవుతుంది. తప్పకుండా ప్రతిస్పందించాల్సిందే. ఘటనల మీద రాయడం అనివార్యం. విప్లవ కవులను ఎన్‌కౌంటర్లు అనే ఘటన నడిపిస్తుంది. తప్పక స్పందించాల్సిన అవసరం అవుతుంది.

సంఘటన వస్తువుగా విప్లవ కవులు తక్షణ అవసరాల రీత్యా స్పందనా కవిత్వమూ రాసారు. ఘటనల తర్వాత ఘటన చుట్టూ ఉన్న సామాజిక రాజకీయ స్థితుల మీద బలమైన కవిత్వమూ రాసారు. ఉదాహరణకు వివి రాసిన ʹఏడుగురు అక్కా చెల్లెల్ల కథʹ గొప్ప కవిత కదా. అదొక వీర కావ్యంలా మలచాడాయన. అది ఘటన మీద రాసిందే. ఇట్లా గొప్ప విప్లవ కవిత్వంగా మలిచిన ఘటనలు చాలా చెప్పొచ్చు. విప్లవ కవుల చేత సంఘటన మీద కవిత్వం రాయించేది వాళ్ల దక్పథం. దక్పథం పదును వస్తువులోని బహుకోణాల్ని ఆవిష్కరించి వస్తువును చిరస్మరణీయం చేస్తున్నది.

10. రాజకీయ కవిత్వం అనే మాటను తిట్టుగా, చిన్న చూపుగా ఉపయోగించేవాళ్లు ఇంకా మన చుట్టూ ఉన్నారు. ఈ కోణంలో విప్లవ కవిత్వంపై మీ పరిశీలన..?

రాజకీయ కవిత్వం అనే మాటను నెగెటివ్‌గా వాడేవాళ్లు చేస్తున్నది కూడా రాజకీయమే. తెలిసో తెలియకో వాళ్ల వర్గ ప్రయోజనం కోసమే వాళ్లు అట్లా అంటూ ఉంటారు. రాజకీయం కానిది ఏదీ లేదు. ఈ వాదనను పట్టించుకోనవసరం లేదు. భారతదేశంలో ఆది కావ్యమని పొగుడుకునే రామాయణమే ఒక రాజకీయ కావ్యం. అది ఆర్య ద్రావిడ రాజకీయాలదని కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

విప్లవ కవిత్వం వర్గపోరాట రాజకీయాల ఎరుకతో, స్పహతో, సంయమనంతో, లక్ష్యంతో రాస్తున్నది. ఆచరణకు సంబంధించింది. మార్క్సిజం ఆచరణ శాస్త్రం. దాన్ని ఎత్తిపట్టే విప్లవ కవిత్వం కూడా మానవాచరణ నుంచే రూపుదిద్దుకుంటున్నది. మానవాచరణవల్ల రచయిత కార్యకర్త కావడమనేది రాజకీయమైతే అది జీవితమంత అనివార్యమైనది.

11. విప్లవ కవిత్వంలో అజ్ఞాత కవిత్వం స్థానం?

విప్లవ కవిత్వంలో అజ్ఞాతమే ʹడ్రైవింగ్‌ ఫోర్స్‌ʹ. ఒక పాఠకుడిగా నా పరిశీలన ఇదే. అజ్ఞాతంలో లేని కవులు విరసంలో ఉండవచ్చు, వాళ్లంతా ప్రశంసనీయులే కాదనఖ్ఖర్లేదు. బయట అనేక వెసులుబాటుల మధ్య తమను తాము ఉన్నతీకరించుకోవడానికి ఎన్నో అవకాశాలున్నవారు. వీళ్లు రాసిన దాంట్లో ఫలానా లొసుగులు ఉన్నాయని అనను కానీ, విమర్శ లేకుండా మాత్రం చదువుకోలేను. అయితే లోపలి కవులు రాసే ప్రతి అక్షరం విలువైందిగా అన్పిస్తుంది. ఆ అక్షరాలకు అంటిన ఆచరణ మోతాదు వల్ల ఈ గౌరవం కలుగుతుంది.

సుబ్బారావు పాణిగ్రాహి, శివసాగర్‌, సముద్రుడు, కౌముది, షహీదా లాంటి వాళ్ల కవిత్వమే నిజమైన విప్లవ కవిత్వం. వీళ్ల నుంచి బయటి కవులు స్పూర్తిపొందమన్నారే గాని, బయటి నుంచి లోపల వాళ్లకు అందాల్సినంత అవగాహన అందివ్వలేక పోతున్నారనే నా అభిప్రాయం. బయట 1975ల తర్వాత వేగవంతంగా జరిగిపోతున్న పరిణామాలైన స్త్రీ వాద దళిత మైనారిటీ వాదాలను అందించినట్లు, గ్లోబలైజేషన్‌ వ్యతిరేకతను అందించినట్లు, చాప కింద నీరు లాగా వ్యవస్థ, నాగరికత లోనవుతున్న మార్పులు, కొత్త మలుపులు, దక్కోణాలూ లోపలి వాళ్లకు అందివ్వవలసిన బాధ్యత సరిగా నెరవేరలేదనే అనుకుంటాను.

12. ఈ 50 ఏళ్లలో 3 తరాల కవులు కనిపిస్తారు. విప్లవ సాహిత్యోద్యమం - కవి రూపకల్పన అనే ప్రక్రియను ఎలా చూస్తారు?

50 ఏళ్లగా వివి కవిత్వం రాస్తూనే ఉన్నారు. శ్రీశ్రీ, శివసాగర్‌ గతించారు. వివి స్థాయి ఇంకో కవి విప్లవోద్యమంలో లేరు. 3 తరాల కవులలో ప్రతిభావంతులు ఉన్నారు కాదనను. అందరి వస్తువూ కొద్దిపాటి శిల్ప వైవిధ్యాలతో ఒకటే. కవి రూపకల్పన చాలా మందగొడిగానే ఉంది. ఈ స్థితి అన్ని ఉద్యమాలకు ఉంది. అస్తిత్వ వాద ధోరణులకూ ఉంది. వర్తమాన పరిస్థితులలో వివిధ ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో వందలాది కవులు కనిపిస్తారు. ఈ తరం కవులలో ఎక్కువ మందికి దళిత స్త్రీవాద ఉద్యమాల కనీస స్పృహ ఇంకి ఉంది. ఈ అస్తిత్వవాద ధోరణులు ఆ మేరకు ప్రభావం వేయగలిగాయి. ఒక బెంచ్‌మార్క్‌ స్థాయిని నిలుపుకోగలిగాయి. అదే స్థాయిని కొత్తగా పుడుతున్న కవులలో విప్లవోద్యమం వేయగలిగిందా? ఈ వైపు నుంచి చూసినప్పుడు సమాధానం నిరాశపరుస్తుంది. విప్లవోద్యమం వైపు అలాంటి మంద ఉండాలని నేను అనడం లేదుగాని 1990ల తర్వాత వచ్చినట్టు మళ్లా కొత్త కెరటం ఒకటి కొత్త నావికుల్ని తీసుకురావాలని మాత్రం ఆశిస్తాను. అనేక మంది సాధారణ కవులు కూడా విప్లవోద్యమ స్ఫూర్తితో, విప్లవోద్యమ సంబంధమైన ఘటనల మీద కవిత్వం రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాస్తున్న కవుల మీద కూడా ఈ ప్రభావం ఉండాలని కోరుకుంటున్నాను.

No. of visitors : 570
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.

వెంకట కృష్ణ | 02.11.2019 10:44:56pm

విశ్వకర్మలు తమ సమూహపు సారాంశాన్ని మరచి తమను తాము "విశ్వబ్రాహ్మణు" లమని అనుకోవడంలో హిందూమతం మనుగడ దాగివుంది. హిందూ మతం తనలోని ప్రతి సమూహాన్నీ నిచ్చెనమెట్ల.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •