తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం

| సాహిత్యం | వ్యాసాలు

తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం

- అల్లం రాజయ్య | 17.12.2019 10:09:31pm

భూమిక

గత యాభయేండ్లుగా ఘనీభవించిన సాంప్రదాయకతతో బిగుసుకు పోయిన భారతీయ సమాజంలో నెహ్రూ మార్కు సోషలిజం విఫలమైన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విఫలమైన సందర్భంలో నక్సల్బరీ లోలోపల రగిలే లావా. అనేక ఆటుపోటులకు లోనై వేలాదిమంది విప్లవకారుల రక్తతర్పణంతో ఎగిసింది నక్సల్బరీ. ఆదివాసీ, రైతాంగ, విద్యార్థి, యువ, కార్మిక తదితర మైనారిటీ ప్రజల పోరాటాల్లో భాగమై సుదీర్ఘ విముక్తి పోరాటంలో అనేక దశలను ఎదుర్కొన్నది నక్సల్బరీ భావజాలం. భారతదేశంలోని అన్నిరకాల వైరుధ్యాలను అధ్యయనం చేయడంలో మార్క్సిజం-లెనినిజం- మావోయిజం ప్రాతిపదికగా ముందుకు సాగుతున్నది. వైరుధ్యాల పరిష్కారంలో అర్ధభూస్వామ్య, అర్ధదళారీ బూర్జువా శక్తులను కూలదోయడానికి నక్సల్బరీ ఒక ప్రేరణ అయ్యింది. పీడిత ప్రజానీకం - ముఖ్యంగా ఆదివాసీ, రైతాంగ, కార్మిక పోరాట శక్తులతో పటిష్టమైన పార్టీని, ప్రజాసైన్యాన్ని నిర్మించడానికి నక్సల్బరీ ఒక ప్రేరణ అయ్యింది. శత్రువుకు బలహీనమైన ప్రాంతాలను బేస్‌ ఏరియాలుగా చేసుకొని, అంతిమంగా నగరాలను చుట్టుముట్టి, పోరాటంలో కలిసివచ్చే దేశంలోని ప్రజారాశులందరితో ఐక్యసంఘటనగా ఏర్పడి, ప్రజా రాజ్యాధికారం దక్కించు కునేందుకు, నూతన ప్రజాస్వామ్య విప్లవం దిశగా పోరాడే శ్రేణుల అభివద్ధికి నక్సల్బరీ ఒక ప్రేరణ అయ్యింది. నక్సల్బరీకి అర్ధ శతాబ్దం నిండింది. యాభయేండ్ల సుదీర్ఘకాలం సాయుధ పోరాటం కొనసాగించడం ప్రపంచ విప్లవంలో - నక్సల్బరీదే మొదటిది.

మూడు తరాల ప్రజలు - భిన్న జాతులకు, భిన్న ప్రాంతాలకు, భిన్న సంస్కతులకు, భిన్న కులాలకు చెందిన ప్రజలు పాల్గొన్న పోరాటం. ముఖ్యంగా 2,500 యేండ్ల బ్రాణీయ కులవ్యవస్థలో గిడిసబారిన భూస్వామ్య భావజాలంతో, జిత్తులమారి దళారీ పెట్టుబడిదారీ వర్గంతో... ఇలాంటి వ్యవస్థలకు అంటకాగే సామ్రాజ్యవాదులతో సుదీర్ఘకాలం అనేక సిద్ధాంత, ఆచరణాత్మక అతలాకుతలతో కొనసాగుతున్న నక్సల్బరీ పోరాటం ప్రపంచంలో మొదటిది. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగి, ప్రపంచ ప్రజలు సాధించిన విప్లవ విజయాలైన సోవియట్‌ రష్యా, చైనా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడి... అవి కూలిపోయి... ఒక నిరాశామయమైన వాతావరణంలో ప్రజావిముక్తి యుద్ధం, నూతన ప్రజాస్వామిక విప్లవ నిర్మాణం ఏకకాలంలో చేపట్టవల్సిన స్థితిలో... ప్రపంచ వ్యాపితంగా అన్ని వ్యవస్థలు పెను సంక్షోభంలో మునిగిపోయిన తరుణంలో... సామ్రాజ్యవాద దోపిడీ, ప్రపంచీకరణ అనే మార్కెటు విస్తరణ దోపిడీలో ఊపిరాడని కాలంలో... ప్రపంచ యుద్ధ పరిణామాలకు దూరంలో ఉన్న భారతదేశంలో... ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య.... నూతన ప్రజాస్వామిక విప్లవం, సోషలిస్టు కమ్యూనిస్టు సమాజాల నిర్మాణ లక్ష్యంతో సాగుతున్న నక్సల్బరీ ప్రజాయుద్ధ సన్నివేశమిది.

యాభయేండ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్ళు, అనేక వైఫల్యాలు - ప్రజలు, ప్రజలకు నాయకత్వం వహిస్తున్న కార్మికవర్గ పార్టీ గుణపాఠాలతో ముందుకు సాగుతుంటే.... అదే స్థాయిలో ఆస్తి చుట్టు అల్లుకున్న ప్రభుత్వాలు, వాటిని నిలబెట్టే చట్టాలు అధికార యంత్రాంగం తన అణచివేతకు దోపిడీకి మెరుగు పెట్టుకుంటూనే ఉంది. అనేక దఫాలుగా, అనేక రాష్ట్రాలల్లో భీతావహం సష్టిస్తూ ఊచకోతకు దిగుతూనే ఉన్నది.

బెంగాల్‌, బీహార్‌లలో మొదటి ఊచకోత నక్సల్బరీ మీద ఆరంభమైంది. అదే సమయంలో శ్రీకాకుళం మీద రెండో ఊచకోత. అయినా పోరాటాలు అన్నిచోట్ల విస్తతమయ్యాయి.

మొత్తంగా ఘనత వహించిన భారత సైన్యం... ప్రజలను ఇతర దేశాల యుద్ధాల నుండి రక్షించాల్సిన సైన్యం తన పిల్లల మీదనే, తన ప్రజల మీదనే యుద్ధానికి సిద్ధపడి దండకారణ్యం మీద మూడో విడత గ్రీన్‌హంట్‌ కొనసాగిస్తోంది.

బహుశా, ప్రపంచ దోపిడీదారుడైన అమెరికాతో కలిసి వియత్నాంలో లాగా ఆకాశం నుండి భారతదేశ ప్రజల మీద యుద్ధానికి దిగే సన్నివేశంలో ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది.

చాలా భాగం చర్చలు... ఉద్యమ నాయకులు చేయ్యాల్సిన పనుల గురించి జరుగుతున్నాయి, చేసి డక్కామొక్కీలు తిని అనుభవాలు గడించిన వాటిమీద గుణపాఠాలేమిటి అనేదాని మీద జరగాలి.

ఇంతకాలం కొందరికే పరిమితమైన, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన విప్లవం - యుద్ధం అందరిది కాబోతున్నది. అలాంటి తరుణంలో మన అనుభవాలను కలబోసుకొని, విస్తత ప్రజారాశాలను తమదైన విప్లవంలో భాగస్వామ్యం చేయడానికి దారులు వెతుకుదాం.

అన్నిరకాల భ్రమలు తొలిగిపోయి వ్యవసాయరంగం కూడుబెట్టనిదై, దోపిడీ అన్ని రంగాల్లో విస్తతమై, నిరుద్యోగం.. వ్యవస్థాగతంగాని కోపోద్రిక్త స్థితి నక్సల్బరీ నాటికి తెలుగు సాహిత్య కళా రంగాలల్లో చోటు చేసుకున్నది. దిగంబర, తిరుగబడు, శ్రీశ్రీ లాంటి కవులు, కొ.కు, కాళీపట్నం, రావిశాస్త్రి, దాశరథి రంగాచార్య లాంటి రచయితలు అప్పటి సంక్షోభాన్ని తమ సాహిత్యంలో చిత్రిస్తున్న సమయం.

ప్రపంచ వ్యాపితంగా నిర్మాణం కాని ఆగ్రహావేశాలు యువతరాన్ని అతలా కుతలం చేస్తున్న కాలం... చెరబండరాజు, నగ్నముని, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, భైరవయ్య, మహాస్వప్న లాంటి యువ కవులు దిగంబర కవులుగా సమాజంలోని కుళ్లును ఎత్తి చూపుతూ తీవ్రమైన పదజాలంతో కడిగేస్తున్న కాలం. వరవరరావు, లోచన్‌, ఎన్‌.కె. లాంటి కవులు నక్సల్బరీ ప్రేరణతో తిరుగబడు కవులుగా కవిత్వం రాస్తున్న కాలం. అప్పటికే సృజన మాసపత్రిక ఆరంభమయ్యింది.

శ్రీకాకుళంలో బద్ధలైన ఆదివాసీ సాయుధ పోరాటంలో పాల్గొన్న వెంపటాపు సత్యం, ఆధిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి మైదాన ప్రాంతపు తెలుగు ప్రాంతపు యువకులను చేరుకున్నారు. దేశవ్యాపితంగా ఉక్కుపాదం... 1970 వరకు ఎన్‌కౌంటర్లలో నాయకులను చంపగా శ్రీకాకుళం నెత్తుటేర్లలో ముగిసిపోయింది. కాని ఆ పోరాటపు వేడి తెలుగు సాహిత్యంలో, కళారంగంలో అనేక ప్రశ్నలు రేపింది. శ్రీకాకుళంలో సుబ్బారావు పాణిగ్రాహి ఆలపించిన పాటలు అన్ని ప్రాంతాలకు చేరడం, విశాఖ విద్యార్థుల పేర ʹరచయితలారా మేరెటు వైపు? - పోరాటం వైపా? ప్రభుత్వం వైపా?ʹ కరపత్రం రచయితలకు, కళాకారులకు సూటిగా తాకింది. కల్పిత గాథలకు కాలం చెల్లింది. 1970 జులై 4 నాడు విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. అప్పటికి ఊగిసలాడుతున్న రచయితలు ప్రజల వైపుకు నిలబడ్డారు. అంతకుముందే మొదలైన సజన పత్రిక, ఆ తరువాత మొదలైన విద్యుల్లత రాతపత్రిక కవిత్వం, పాటలు ప్రచురించాయి.

కవిత్వం, నాటకాలకు పరిమితమైన ʹసెవన్‌స్టార్‌ సిండికేటుʹ సంస్థ ప్రజల్లోకి వెళ్లింది. గద్దర్‌ గళం కొత్త పాటల నెత్తుకున్నది. జననాట్యమండలి రూపుదిద్దుకున్నది. శివసాగర్‌, చెరబండరాజు కొత్తపాటలు రాశారు. యాభయేండ్ల విస్తృతమైన బహుముఖాలుగా సాగిన సాహిత్యం గురించి మాట్లాడటం అంటే సాహసమే...


సాహిత్యంలో అనేక పాయలు

కవిత్వం, పాట, నాటకం, బ్యాలేలు, కథ, నవల, విమర్శ, ఉపన్యాసం లాంటి అనేక ప్రక్రియలు ప్రజా పోరాటాల నేపథ్యంలో స్థల కాలాల్లో పోరాటం అభివద్ధి చెందినా కొద్ది అనేక దశలను, సంక్లిష్టతలను చిత్రించాయి. ఏ ప్రక్రియ తీసుకున్నా యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కొన్ని వందల మంది కవులు, కొన్నివేల కవితలు, వందల సంఖ్యలో కవిత్వ సంకలనాలు, వేల కథలు, వందల నవలలు, పాటలు వచ్చి ఉంటాయి. ఆయా చారిత్రక సందర్భంలో అవి పోషించిన, చిత్రించిన జీవితం గురించి ప్రజా పోరాటాల నేపథ్యంలో వివరించాలి - విశ్లేషించాలి.

అట్లాగే చిత్రకళ, పెయింటింగు లాంటివి విప్లవ కాలంలో పోరాటంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. పత్రికలు, సంకలనాలు, అనేక ప్రజాసంఘాలు, పుస్తకాలు, ప్రసార మాధ్యమాలు - ఈ యాభయి సంవత్సరాల్లో అనేక ఉద్యమాల నేపథ్యంలో రూపుదిద్దుకున్నాయి.

సినిమా మాధ్యమం, టీవీ లాంటి మాధ్యమాలు అనివార్యంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నక్సల్బరీ ప్రభావానికి లోనైనవే. పూర్తిగా, సమగ్రంగా ఈ యాభయి సంవత్సరాలలో తెలుగు సాహిత్య కళారంగాల గురించి అనేక రకాలుగా ఆయా సందరాల్లోే అవసరాల రీత్యా చాలామంది మూల్యాంకనం చేశారు. స్వతంత్రంగా నైతేనేమి, ఒక చారిత్రక సందర్భంలో తప్పనిసరిగా నైతేనేమి విశ్వవిద్యాలయాలు సాహిత్యం మీద, కళారూపాల మీద అనేక సెమినార్లు ఏర్పాటు చేశాయి. తెలుగు ప్రాంతం వారు మాత్రమే కాదు, ఇతర భాషల విశ్వవిద్యాలయాలు కూడా సాహిత్యంలో నక్సల్బరీ ప్రభావం గురించి పరిశోధనలు చేశాయి.

విరసం లాంటి రచయితల సంఘాలు, అరుణతార, సజన పత్రికలు ఉద్యమాలు ఎప్పటికప్పుడు సాహిత్యం, కళల మీద నిరంతరం మూల్యాంకనం చేస్తూనే ఉన్నాయి. కాకపోతే కాలంతోపాటు, సందర్భంతోపాటు విప్లవ పోరాటంలో దశలకు సంబంధించి అలాంటి మూల్యాంకనాల్లో అనేక భిన్న ధోరణులు ఉండటం సహజం. ఇలాంటి వాటి ఆధారంగా, మౌలికమైన గుణాత్మకమైన మార్పులను గురించి, ఆయా సందర్భాలల్లో వ్యక్తమైన కళారూపాల గురించి సంక్షిప్తంగా చెప్పడానికి నా ప్రయత్నం.

ఇలాంటి ప్రయత్నం సమిష్టిగా జరుగవల్సిన పని. భిన్న అభిప్రాయాలను క్రోడీకరించి, గ్రంథస్తం చేయవల్సిన అవసరం చాలా ఉన్నది.

పరిశోధక విద్యార్థులు ఇలాంటి సాహిత్యం మీద పత్రాలు, సిద్ధాంత పుస్తకాలు ప్రచురించారు. లోగడ దండకారణ్య సాహిత్య కళారూపాల మీద వేసిన పుస్తకం లాగా వీలైనంత మేరకు సమగ్రంగా జరుగాలని కోరుకుంటున్నాను.

కొన్ని ధోరణులను నా పరిమితి మేరకు మాత్రమే ప్రస్తావించడం సాధ్యమవు తుంది. ఇలాంటి పరిమితిలో తప్పిపోయిన ప్రస్తావనల గురించి విచారించవల్సిందే. మొదటి ప్రయత్నం కనుక తరువాత సూచనల మేరకు అలాంటి వివరాలన్ని జత చేయాలి.

పోరాటాన్ని, కాలంతోపాటు ఒక పద్ధతిలో వివరించడానికి కొన్ని భాగాలుగా విభజించి మాట్లాడుతున్నా.

శ్రీకాకుళ పోరాటం - సాహిత్యం కళలు (1967-70)

మార్క్సిజం ప్రాతిపదికగా జరిగిన విప్లవ పోరాటాలన్ని సామాజిక శాస్త్రాలన్నింటిని, వాటి మధ్య ఉండే గతితార్కిక సంబంధాలను అవగాహనలోకి తీసుకుంటారు కనుక పునాది - ఉపరితల అంశాలన్నిటిని అధ్యయనం చెయ్యడమే కాక, వాని పోరాటాలను నిర్మించుకోవడంలో ఉపరితల అంశాలైన సాహిత్యానికి కళలకు విడదీయరాని అనుబంధంగా అర్థం చేసుకుంటారు. కావున విప్లవ పోరాటాల దారి పొడుగునా ప్రజలతో మమేకమవడానికి సాహిత్యం కళలు వారి వెంట నడుస్తాయి. కనుక - విప్లవ పోరాటాల స్వభావం వాడి, వేడి ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవ పోరాటాల సిద్ధాంతము, ఆచరణ సజనాత్మకంగా వైరుధ్యాలతోపాటు విప్లవ సాహిత్యం, కళల్లో వ్యక్తమవుతూ వుంటుంది.

స్థల కాలాల్లో జరిగే విప్లవ పోరాటాలను అర్థం చేసుకోకుండా, అలాంటి పోరాటాలలో వ్యక్తమైన అనేక వైరుధ్యాలను, వాటి గతి క్రమాన్ని అర్థం చేసుకోకుండా... విప్లవ సాహిత్యం, కళలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.

తమ తమ కాలాలకు సంబంధించిన సాహిత్యం, కళల గురించి, ప్రజా పోరాటాలకు సాహిత్యం కళలకు సంబంధించిన గతితార్కిక సంబంధం గురించి - మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, మావో - తెలుగు ప్రాంతంలో అనేకమంది విప్లవకారులు విశ్లేషించారు.

భూస్వామ్య భావజాలం ముఖ్యంగా రెండువేల అయిదు వందల సంవత్సరాలు బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో భారత ప్రజలు మగ్గడం ఒక కఠోర వాస్తవం. ప్రపంచ వ్యాపితంగానేమి, భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు వర్గ పోరాటాలు ఒదిలేసి వర్గ సామరస్య సిద్ధాంతంలో కూరుకుపోయిన సందర్భంలో ఊపిరి సలుపనివ్వని పేదరికం దోపిడీ మూలంగా అనివార్యంగా నక్సల్బరీలో రైతులు భూస్వాముల భూముల్లోని పంటలను 1967లో స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే చైనాలో ఆర్థిక రంగంలో సోషలిస్టు ఉత్పత్తిలోకి మారే క్రమం ప్రతిష్టంభనకు గురై రాజకీయ రూపం తీసుకొని చైర్మన్‌గా రాజీనామా చేసిన మావో పార్టీ మీద తిరుగుబాటు ప్రకటించారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌.. పార్టీలోని మితవాదుల మీద పోరుగా అతివాద దుందుడుకు చర్యలకు దిగారు. తగిన నిర్మాణం లేకుండా బద్దలైన స్థితి అనివార్యంగా ఒక రొమాంటిక్‌ తిరుగుబాటుగానో, లేదా త్వరలో చల్లారడమో జరుగుతుంది.

తమకాలం, ప్రాంతం గురించిన వైరుధ్యాలను గుర్తించడంలో, పరిష్కరించడంలో తగిన నిర్మాణం, అనుభవం లేనందున చైనా పరిణామాలను ఒక రొమాంటిక్‌గా స్వీకరించడం ద్వారా -అనేక ఇతర కారణాలతో పాటు- నక్సల్బరీలో సాయుధ పోరాటానికి పిలిపివ్వడం జరిగింది. దేశవ్యాపితంగా వర్గ శత్రు నిర్మూలన, చైనా మార్గంలో విముక్తి అతి దగ్గరలోనే (1975) అనే ఊహాత్మక వైఖరితో, దేశవ్యాపితంగా విప్లవ పరిస్థితి ఉండి కూడా దుందుడుకు చర్యల వలన, తగిన ప్రజా పోరాట నిర్మాణంలోకి పరివర్తన చెందక, ప్రభుత్వ దమనకాండతో నక్సల్బరీ పోరాటం వెనకడుగు వేసింది. అయితే ఇది భారతదేశ కోపోద్రిక్త యువకులలో ముఖ్యంగా విద్యావంతులైన యువకులలో ఒక కుదుపును, అలజడిని కలిగించింది. ఒక నిప్పు రవ్వ దావానలమయ్యింది. ఈ లక్షాణాలన్ని అప్పటి భారతీయ సాహిత్యంలోని అన్ని భాషల్లో వచ్చిన ముఖ్యంగా కవిత్వంలో కనిపిస్తుంది. సరోజ్‌దత్తా లాంటి కవులు, ప్రతిద్వంది లాంటి నవలలు ఈ ధోరణికి సంబంధించినవే. మహాశ్వేతాదేవి, సత్యజిత్‌రాయ్‌ లాంటి వాళ్ల నక్సల్బరీ మీద ప్రభావం చూపాయి.

అన్ని భాషల్లో ప్రాంతాల్లో వచ్చిన సాహిత్యం గురించి విశ్లేషించాలి. అప్పటికే తీవ్రమైన అసంతప్తితో, అలజడితో, ఆగ్రహంతో ఉన్న దిగంబర కవులు, తిరుగబడు కవులు, కొడువటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, బి.నర్సింగరావు, గద్దర్‌, చంద్ర, దాశరథి రంగాచార్య, వరవరరావు, లోచన్‌, జ్వాలాముఖి, నగ్నముని లాంటి అనేకమంది కవులు, రచయితలు, కళాకారులను నక్సల్బరీ తీవ్రమైన భావావేశాలకు గురిచేసింది.

భావపరంగానే కాక, ప్రక్రియపరంగా, శిల్పపరంగా పాత వ్యక్తీకరణ సరిపోదనే, ఇంకా ఆరంభం కాని ప్రజా పోరాటాల మూలంగా కొత్త వ్యక్తీకరణల కోసం తెలుగు సాహిత్యం పురిటినొప్పులు పడుతున్న కాలమది.

దాదాపు నక్సల్బరీలాంటి పరిస్థితుల్లోనే వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం నాయకత్వంలో శ్రీకాకుళం అటవీ ప్రాంతాల్లో, ఆదివాసీ రైతాంగానికి భూస్వాములు, షావుకార్లకు మధ్య (బుగతల) పోరాటం ఆరంభమయ్యింది. నక్సల్బరీ ఆరంభానికి ఆరు నెలల తరువాత మొండెంకల్‌ ఊరేగింపుకు పోతున్న కోరన్న, మంగన్నలను లేవిడిలో భూస్వాములు కాల్చి చంపారు.

పార్టీ సాయుధ పోరాటానికి పిలుపిచ్చింది. అనేక ఘటనలు, తమ పరిధిలో పోరాట విస్తరణకు అనేక ప్రయత్నాలు... ప్రభుత్వం పన్నెండువేల మంది సీఆర్‌పీఎఫ్‌ పోలీసులను మోహరించి, చుట్టుముట్టడంతో తగినంత విస్తరణ లేక 1970 జూలై 10న వెంపటాపు సత్యం, కైలాసం, పంచాది నిర్మల, సుబ్బారావు పాణిగ్రాహి ఎన్‌కౌంటర్‌తో శ్రీకాకుళ పోరాటం విరమణ జరిగింది. ఆదివాసీ ప్రాంతాలు నెత్తురుటేర్లలో మునిగిపోయాయి. రాజ్యం అడవుల మీద పాశవికంగా దాడిచేసి అణచివేసింది. శ్రీకాకుళ పోరాటం తమదైన సాహిత్య కళారూపాలను తమ కాలంలో సష్టించుకోవాల్సి వచ్చింది. తమ రాజకీయాలను, వ్యూహాన్ని, ఎత్తుగడలను ప్రచారం చేయాల్సిన తక్షణ అవసరంరీత్యా ఆదివాసులకు సులభంగా చేరడానికి పాటను తమ విప్లవకారులు ఆయుధంగా మలుచుకున్నారు. ఈ కర్తవ్యంలో భాగంగా విప్లవకారులే రచయితలు, కళాకారులయ్యారు. ఈ కాలంలో అనేక పాటలు వచ్చాయి.

1. కమ్యూనిస్టులం - కష్టజీవులం

ఔనన్నా కదన్నా - అదే యిష్టులం

2. సుత్తీ కొడువలి

గుర్తుగ వున్నా

ఎర్రనిజండా! ఎగురుతున్నది.

3. ఎరుపంటే కొందరికి

భయం - భయం

పసిపిల్లలు వారికన్న

నయం - నయం

సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, చినబాబు బృదం ప్రదర్శనకు, ప్రయాణాలకు, ప్రేక్షకులకు చేరడానికి అనువైన కళారూపంగా జముకుల కథను ఎంచుకున్నారు. జముకుల కథ ఒక పోరాట కళారూపంగా ఆవిష్కరింపబడినది. కల్పిత గాథలకు, ఊహాత్మక భావధోరణులకు భిన్నంగా సాహిత్యం ప్రజాపోరాట ఆయుధంగా ఒక కల్పనగా గాక ఒక ఆచరణ పరంపరగా రూపుదిద్దుకున్నది.

ఆదివాసీ ప్రాంతంలో దోపిడీ, వివక్షను రూపుమాపే పోరాట నేపథ్యంలో అనివార్యంగా బయటి ప్రపంచానికి అలాంటి పోరాటాన్ని చాటడానికి, పోరాటంలో మైదానం నుండి వెళ్లి పాల్గొంటున్న అన్ని ప్రాంతాల పోరాటయోధులకు నాటి సంక్లిష్ట స్థితులు అర్థం చేయించడానికి భూషణం చాలా కథలు రాశాడు. తీర్పు, అడవంటుకున్నది, పులుసు, ఇదే దారి, ఉద్దరింపు ఆ కోవకు చెందిన కథలే. శ్రీకాకుళోద్యమం గురించి ʹకొండగాలిʹ భూషణం నవల పూర్తిగా చిత్రించింది.

భారతదేశంలో ప్రజా పోరాటాలను విస్తరించడానికి చారుమజుందారు, తరిమెల నాగిరెడ్డి, చండ్రపుల్లారెడ్డి, శ్రీకాకుళపు పోరాటంలో పాల్గొన్న అప్పలసూరి లాంటి వాళ్లతో పాటు కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి లాంటివాళ్లు కృషి చేశారు. 1969లో విప్లవకారుల సమన్వయం కోసం దేశవ్యాప్త విప్లవ పరిస్థితుల గురించిన అధ్యయనం కోసం గుంటూరు దగ్గరి గుత్తికొండ బిలంలో అఖిల భారత విప్లవకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చారుమజుందారు హాజరయ్యి మాట్లాడారు. శ్రీకాకుళ ఉద్యమం సుబ్బారావు పాణిగ్రాహి, చినబాబు లాంటి కవుల ఎన్‌కౌంటర్‌ అణచివేయడంలో ప్రభుత్వం అనుసరించిన పద్ధతి తెలుగు కవులు, రచయితలు, కళాకారులను తీవ్రంగా కలిచివేసింది... ప్రజాస్వామ్యం ముసుగులో కొనసాగుతున్న రాజ్య స్వభావం, - ప్రజల గురించి వల్లిస్తున్న కల్లబొల్లి మాటల మాయాజాలం తొలిసారిగా తెలుగు ప్రాంతపు మేధావులకు, ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు అర్థమై భూస్వామ్యం మీద భ్రమలు తొలిగాయి.

విశాఖ విద్యార్థులు రచయితలారా మీరెటువైపు? పోరాడే ప్రజల వైపా? ప్రజలను హత్య చేసే ప్రభుత్వం వైపా? కరపత్రం విడుదల చేశారు. దీంతో రచయితలు, కళాకారులు తమ వైఖరి తేల్చుకోవాల్సిన స్థితి వచ్చింది. సంఘటితం కావాల్సి వచ్చింది.

సత్యం ఎన్‌కౌంటర్‌ కన్నా వారం ముందే అనగా1970 జులై 4నాడు విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఇది తెలుగు సాహిత్య కళారంగాలు నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటపు ప్రభావంతో తీసుకున్న చారిత్రాత్మకమైన గుణాత్మకమైన పెద్దమలుపు.

శ్రీకాకుళ పోరాటపు నేపథ్యంలో నక్సల్బరీ ఊపిరితో 1970 దాకా చాలా కవిత్వం తెలుగులో వచ్చింది. 1966లో మాసపత్రికగా ఆరంభమైన సృజనలో ఇలాంటి సాహిత్యం విరివిగా అచ్చయింది. తొలిసారిగా విప్లవ సాహిత్యం మౌఖిక పాటగా మాత్రమే కాకుండా అచ్చురూపంలో కోస్తాంథ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణలోని యువకులకు రచయితలకు చేరింది. అయితే ఈ ప్రభావం అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో ఒకేలాగ లేదు. ఎందుకంటే, ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన ప్రజాపోరాటాలు ఆర్థిక, రాజకీయ రంగాలల్లో జరిగిన మార్పులు కారణం.

తెలంగాణలో రైతాంగ (11-9-147 నుండి 21-10-1951 వరకు) సాయుధ పోరాటం యొక్క ప్రభావం కమ్యూనిస్టు భావజాలం ప్రభావం తెలంగాణ సమాజం మీద, సాహిత్యం మీద అదివరకే ఉంది.

తెలంగాణ సాయుధ పోరాటానుభవం తెలంగాణ ప్రజలకు ఒక మాయని పుండు. ఆ పుండు మీద కారంలాగా మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండి అనేక రకాలుగా తెలంగాణ కన్నా భిన్న జీవితం, సంస్కతి, పరిణామ క్రమం, బూర్జువా రాజకీయాలతో రాటుదేలిన ఆంధ్ర ప్రాంతం.. 1956లో తెలంగాణతో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడింది. అది ప్రజలకు ఏ మాత్రం యిష్టంలేకుండా అగ్రకుల నాయకులు పెద్దమనుషులుగా ఒప్పందం చేసుకున్న ఒక అసంబద్ధ కలయిక. ఈ చర్య సలిపి సలిపి 1969 నాటికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా లక్షలాది మంది విద్యార్థుల ఉద్యమంగా ఆరంభమై, ʹఆంధ్ర గో బ్యాక్‌ʹగా 1970 నాటికి హింసాత్మక రూపం తీసుకున్నది. సుమారు 300 మంది విద్యార్థుల బలిదానానికి కారణమయ్యింది.

ఆంధ్ర నాయకత్వంలో కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నవాళ్ళు తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని మొదట పట్టించుకోలేదు. అందువల్ల తెలంగాణలో మెజారిటీ యువకులు ముఖ్యంగా నక్సల్బరీ, శ్రీకాకుళం రాజకీయాలపట్ల తక్షణ ప్రతిస్పందన తెలుపలేదు. మేధావులు రచయితలు అప్పటికి మార్క్సిజం పరిచయమున్న వరంగల్‌, హైదరాబాద్‌ లాంటి చోట్లనే కొంత ప్రతిస్పందన వచ్చింది. మొత్తానికి భిన్న తాత్విక నేపథ్యాల మధ్య తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమం అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. తెలంగాణా గ్రామీణ వ్యవస్థ గురించి - అధ్యయనానికి పునాది వేసింది.

రాయలసీమలో అప్పటికి వ్యక్తంకాని కోపోద్రిక్తం ప్రజల్లో మొరటు భూస్వామ్యపు ముఠాలు, మరొకపక్క ప్రకతి వనరులు, రాజకీయ వైఫల్యాలలతో ఉన్న రాయలసీమలో ప్రజలు మొదట నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలను పట్టించుకోలేదు. పొద్దుటూరులో యం.వి. రమణారెడ్డి ప్రభంజనం పత్రిక, తిరుపతిలోని త్రిపురనేని మధుసూదన్‌రావు లాంటి వారు ప్రతిస్పందించారు. రావిశాస్త్రిగారు రాసిన పళీళీక్కులు, ఆరు సారా కథలు, పిపీలకం లాంటి కథలుబీ రాజు మహిషి నవల ఈ కాలంలో రాసినవే.

విశాఖలోని రచయితలు కాళీపట్నం రామారావు, చలసాని ప్రసాద్‌,కృష్ణాబాయి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) లాంటి వారు శ్రీకాకుళాన్ని ఎత్తి పట్టారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరుదాకా ఐ.వి. సాంబశివరావు, సి.యస్‌.ఆర్‌ ప్రసాద్‌, కె.వీ. రమణారెడ్డి లాంటి వాళ్లు శ్రీకాకుళ ఉద్యమానికి దన్నుగా నిలిచారు. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, కె.జి. సత్యమూర్తి, నగ్నముని, చెరబండరాజు, తిరుగబడు కవులు వరవరరావు, లోచన్‌, ఎన్‌కె, కెవీ రమణారెడ్డి, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, చలసాని ప్రసాద్‌, త్రిపురనేని మధుసూదన్‌రావు, యంవీ రమణారెడ్డి - అప్పటికి తెలుగు సాహిత్యంలో అత్యధిక మంది కవులు, కళాకారులు విరసంలో చేరారు. ప్రజాపోరాటాలను, ప్రజా జీవితం లోలోతులు చిత్రించడానికి ఇంత పెద్దఎత్తున రచయితలు, కళాకారులు పూనుకోవడం గతంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడం, క్రమంగా తగ్గడం, ఇప్టా (ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ థియేటర్‌ అండ్‌ ఆర్ట్స్‌) ఏర్పాటు తర్వాత విరసం ఏర్పడడం భారతదేశంలోనే ఒక చారిత్రాత్మక సందర్భం.

(2017 సెప్టెంబర్ 9,10 లలో జరిగిన నక్సల్బరీ సెమినార్ ప్రసంగ వ్యాసంలో కొంత భాగం )


No. of visitors : 523
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెలుతురు న‌ది

అల్లం రాజ‌య్య‌ | 03.07.2016 02:04:45am

ʹʹదళితులు, బహుజనుల స్థితిగతులు, చరిత్ర గురించి పూలే, అంబేద్కర్‌ ఎంతో కొంత చెప్పిండ్లు. కాని మహిళల చరిత్ర ఉందా? లేదా? ఉందేమో తనకు తెలియదేమోʹʹ రాజు లోలోప......
...ఇంకా చదవండి

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 03:11:28pm

రాత్రులకురాత్రుల్లు పిచ్చివాడిగా అరిచినా కూడా వొడువుదు. దిగులుదిగులుగా- తనకే స్పష్టంగానిదేదో పూనినవానిలాగా విరసంలోతిరుగుతూ... తిరుగుతూ.. అప్పటికే విరసంలో.....
...ఇంకా చదవండి

విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు

అల్లం రాజయ్య | 05.03.2020 12:30:34pm

ఇందులో భిన్నమైన కథా నిర్మాణం ఉంది. ఉద్యమ విస్తృతిలో విప్లవకారుల, ప్రజల వ్యక్తిగత అనుభవం, గతితార్కిక మానవ సంబంధాల అధ్యయనం, ఆచరణ ద్వారా దశలు దశలుగా ఎదగడం కనిప...
...ఇంకా చదవండి

మూడో తరానికి...

అల్లం రాజయ్య | 19.02.2020 03:00:32pm

ఐక్యంగా పురోగమనించడానికి దారులు వెతకడానికి విప్లవ కథ ప్రయత్నించడం కన్పిస్తుంది. ఇందులో కొత్త వస్తువులు, కాలానికి తగిన శిల్ప రీతులు కూడా కనిపిస్తాయి....
...ఇంకా చదవండి

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 08:48:11pm

కూర్మనాథ్‌ ఈ గడబిడలో ʹనగరంలో ఇంకోరోజుʹ గడవక మరింత పేరుకపోయిన వ్యక్తం గాని, విస్ఫోటనం చెందని అసహ్యాన్ని - భిన్న ప్రపంచాల క్రౌర్యాన్ని - పసిపిల్లల కలలను.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •