జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?

| సాహిత్యం | వ్యాసాలు

జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?

- పి.వరలక్ష్మి | 19.12.2019 04:58:28pm

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం 2014 కన్నా ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ల నుండి భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందూ, బుద్ధిస్ట్‌, సిక్కు, జైన, పార్సీ, క్రైస్తవ మతాలకు చెందినవారికి భారత పౌరసత్వం వస్తుంది. దీనిని జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు -సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ (CAB) రూపంలో ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొంది దీని మీద రాష్ట్రపతి కూడా సంతకం చేశారు. అందువల్ల ఇది చట్టరూపం పొంది, సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌గా (CAA) అమలుకు సిద్ధంగా ఉంది. ఈ చట్టం ముస్లింలకు తప్ప అన్ని మతాలకు చెందిన వలస ప్రజలకు మన దేశ పౌరసత్వం ఇస్తుంది. ఇలా మత ప్రాతిపదికన హక్కులు కల్పించడం భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధం. ఆర్టికల్‌ 14 ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంతాల ఆధారంగా పౌరుల మధ్య ఎలాంటి బేధాలు చూపరాదు. 2016లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే రాజ్యసభలో అది ఆమోదం పొందకుండా ఆగిపోయింది.

ఆ మూడు దేశాల నుండి వచ్చిన ముస్లిమేతరులకే ఎందుకు పౌరసత్వం కల్పించాలి అంటే బిజెపి వాళ్ళు ఒక విచిత్రమైన వాదన చేస్తున్నారు. పై మూడు దేశాలు ముస్లిం దేశాలు కాబట్టి అక్కడ వివక్షకు గురై ఆ దేశం వదిలి వచ్చిన ఇతర మతాల వాళ్ళకు మానవతా దృక్పథంతో ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నామట. పొరుగు దేశాలైన చైనా, మయన్మార్‌, శ్రీలంక నుండి వచ్చిన వాళ్ళకు ఈ చట్టం వర్తించదు. శ్రీలంక నుండి వేలాది మంది తమిళులు ప్రాణాలరచేతబట్టుకొని ఇండియా వచ్చారు. వాళ్ళు హిందువులైనా ఈ మానవతా దృక్పథం వాళ్ళకు వర్తించదు. మయన్మార్‌లో దారుణ మారణకాండకు గురవుతున్న రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఇక్కడ పెద్ద ఎత్తున విషప్రచారం జరుగుతుంది. వాళ్ళను పాపం అనకూడదంటారు. పాకిస్తాన్‌లోనే మైనారిటీ ముస్లిం సమూహాలైన అహ్మదియాల పట్ల, బెలూచీల పట్ల ఈ కనికరం లేదు. ఈ చట్టం పక్కాగా మతం ఆధారంగా భారతీయులను విడగొట్టేది. ఆ మూడు ఇస్లాం దేశాలను చూపి ఇక్కడ ఈ నేలతల్లి బిడ్డలైన ముస్లింల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టేది.

ఇప్పుడు ఉన్నట్లుండి ఈ చట్టాన్ని ఎందుకు తెస్తున్నట్లు?

మొట్టమొదట జాతీయ పౌరసత్వ చట్టం 1955లో వచ్చింది. 1947 ముందు అవిభక్త భారతదేశంలో పుట్టినవాళ్ళను, లేదా వారి సంతతిని భారతపౌరులుగా గుర్తిస్తారు. సరైన పత్రాలు లేకుండా (పాస్‌పోర్ట్‌ వంటివి) నిర్ణీత గడువుదాటి ఇండియాలో ఉంటున్న బైటి దేశాల పౌరులను అక్రమ వలసదారులు అంటారు. మామూలుగా వారిని అరెస్టు చేసి, విచారించి సొంతదేశానికి పంపిస్తారు. జాతీయ పౌరసత్వ చట్టానికి చిన్న చిన్న సవరణలు కూడా జరిగాయి. ఇప్పటికి ఉన్న చట్టం ప్రకారం 2004 తర్వాత ఇండియాలో పుట్టినట్లైతే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయులై ఉండాలి, మరొకరు అక్రమ వలసదారు కాకుండా ఉండాలి. ఇక్కడి వారిని వివాహం చేసుకుంటే వచ్చే పౌరసత్వం గురించి మరికొన్ని నిబంధనలున్నాయి. అయితే ఇప్పుడు చేసిన చట్ట సవరణ పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ నుండి వచ్చిన వలసదారులకు (అది అక్రమమా, సక్రమమా అన్న దాంతో సంబంధం లేకుండా) మత ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇస్తుంది.

బిజెపి ప్రభుత్వం ఇలాంటి సవరణ చేయడానికి కారణం ఏమిటి? సింపుల్‌. ఆ పార్టీ, దాని అనుబంధ సంస్థలు నిరంతరం ఇస్లాం దేశాలను, ముఖ్యంగా పాకిస్తాన్‌ను తిడుతూ ముస్లింల మీద ద్వేషాన్ని ప్రచారం చేస్తూ, హిందువులకు అన్యాయం జరుగుతోందని వాపోతుంటారు. బిజెపి ఓటు బ్యాంకు ప్రధానంగా అదే. బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇస్లాం దేశాల దుర్మార్గాలకు బలైనవారిని మేం ఆదుకుంటామని చెప్పారు. పైన చెప్పినట్లు మన ఇరుగుపొరుగు ఇస్లామేతర దేశాల్లో అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి. కానీ బిజెపి ఉద్దేశం ముస్లింలను మాత్రమే విలన్లను చేయడం. ఇది మతాల పట్ల ఒక స్పష్టమైన విభజన రేఖ గీస్తుంది. అయోధ్య అయిపోయాక, ప్రజల మధ్య మంట పెట్టడానికి ఇంకో ఇంధనం దానికి అవసరం.

CAA ముందూ, వెనకా NRC అనే మరో ముఖ్యమైన అంశం ఉంది. దాని గురించి దేశవ్యాప్తంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. NRC ప్రక్రియను ఆస్సాంలో చేపడితే లక్షలాది ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. దానినిప్పుడు దేశవ్యాప్తంగా చేపడతామని హోం మంత్రి అమిత్‌ షా అంటున్నాడు.

జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియ- అస్సాం సమస్య

నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ను మొదట 1951లో ఏర్పాటు చేశారు. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాలు ప్రధానంగా ఆదివాసీ తెగలతో తమదైన ప్రత్యేక జాతుల అస్తిత్వం కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోకి బ్రిటీష్‌ కాలం నుండి కొనసాగిన వలసల వల్ల తమ జాతుల భాషా సంస్కృతులు, అస్తిత్వం దెబ్బతింటున్నాయని ఇక్కడి ప్రజల్లో ఆందోళన ఉంది. తమ జాతి ఆకాంక్షల పట్ల భారతదేశం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్న భావన ఉంది. ఈశాన్య రాష్ట్రాల హద్దులను ఇష్టం వచ్చినట్లు గీసి వేరువేరు జాతుల్ని బలవంతంగా కలిపి ఉంచేలా రాష్ట్రాలు ఏర్పాటు చేశారని వారికి ఆగ్రహం ఉంది. అందువల్ల ఇక్కడి నుండి అనేక ఉద్యమాలు కూడా పెల్లుబికాయి.

అస్సాం రాష్ట్రంలోకి బెంగాలు నుండి వేరువేరు దశల్లో ఎక్కువగా వలసలు సాగాయి. 1947 విభజన తర్వాత పశ్చిమ బెంగాల్‌ ఇండియాలో, తూర్పు బెంగాల్‌ పాకిస్తాన్‌లో భాగమయ్యాయి. అస్సాం ప్రజల దృష్టిలో ఇండియా అయినా, పాకిస్తాన్‌ అయినా అస్సాం బైటి ప్రాంతాల నుండి వచ్చినవాళ్ళంతా వలసదారులే. తమ ప్రాంతం మీద తమ హక్కులు స్థిరపరిచేలా ప్రత్యేక రక్షణలు కల్పించాలని వీరి డిమాండ్‌. తెలంగాణ వాళ్ళు ఎట్లాగైతే తమ వనరులు, తమ ఉద్యోగాలు తమకే దక్కాలని పోరాడారో సుమారుగా అలా అనుకోవచ్చు. దేశ విభజన తర్వాత తూర్పుబెంగాల్‌ (పాకిస్థాన్‌) నుండి వలసలు పెరిగాయి. కారణం అక్కడి ఆర్థిక స్థితి దిగజారడం, మెరుగైన అవకాశాల కోసం ఎప్పటి నుండో అలవాటైన వలసలు మరింత అధికమవ్వడం. 1971లో తూర్పుబెంగాల్‌ పాకిస్తాన్‌ నుండి విడిపోయి ఇండియా అండదండలతో బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. విముక్తి యుద్ధం బంగ్లాదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. నిరుద్యోగం, పేదరికం పెరిగి వలసలు తీవ్రమయ్యాయి. ఈ దశలో వలసలు విపరీతంగా పెరిగాయి. ఇలా వలస వచ్చినవాళ్ళలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ వలసల వల్ల స్థానికుల్లో అంతృప్తి పెరిగిపోయి 1979-1985 మధ్య అస్సాంలో చారిత్రక విద్యార్థి ఉద్యమం ఎగిసిపడింది. ఫలితంగా 1985లో కేంద్ర ప్రభుత్వం అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం 1971 మార్చి 24 (ఆ మరుసటి రోజు పాకిస్తాన్‌ నుండి బంగ్లాదేశ్‌ విడిపోయింది) తర్వాత వలస వచ్చిన వారిని గుర్తించి అస్సాం నుండి పంపించివేయాలి. అందుకోసం అస్సాంలో NRC ప్రక్రియ చేపట్టాలి. ఒప్పందం అయితే చేసుకున్నారుగాని అనేక సమస్యల వల్ల ఈ ప్రక్రియ నత్తనడకన నడుస్తూ పెండింగ్‌లో ఉండిపోయింది.

అస్సాంకు వలసవచ్చిన వారిలో అన్ని మతాల వాళ్ళు ఉన్నా, బిజెపి శక్తులు మాత్రం అధిక సంఖ్యలో ముస్లింలు అక్రమంగా చొరబడ్డారని విపరీతంగా ప్రచారం చేశాయి. అస్సాం ప్రజల అసంతృప్తికి, మత రాజకీయాలను కలిపి బిజెపి అక్కడ బాగా లాభపడింది. ఎన్నికల్లో హామీ పడినట్లుగా అస్సాంలో NRC ప్రక్రియను చేపట్టింది. అది ఎలా చేసిందంటే అస్సాంలో ఉంటున్నవాళ్ళందర్నీ తమ పౌరసత్వాన్ని నిరూపించుకోమంది. నాలుగేళ్ళపాటు ఎన్‌ఆర్‌సి సేవా కేంద్రాల వద్ద 3 కోట్లా 29 లక్షల అస్సాం ప్రజానీకం తమ పౌరసత్వ దరఖాస్తుల కోసం క్యూలు కట్టారు. పౌరసత్వ గుర్తింపుకోసం దరఖాస్తుతో పాటుగా 1971 మార్చి 24 అర్ధరాత్రికి ముందు తాము లేదా తమ తల్లిదండ్రులు ఇక్కడ నివసిస్తున్నట్లు ప్రభుత్వం సూచించిన 14 డాక్యుమెంట్లలో ఏదో ఒకదానిని చూపాలి. అలా చూపలేని వారికి పౌరసత్వం నిరాకరించబడింది. NRC కేంద్రాల వద్ద 1971నాటి డాక్యుమెంట్లు ఇవ్వలేని వాళ్ళలో ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు, మహిళలు, ఇళ్ళు వాకిలి అడ్రస్‌ కూడా లేని బిచ్చగాళ్ళు ఎంతో మంది దగ్గర అటువంటి కాగితాలు లేనేలేవు. అంటే చట్ట ప్రకారం వీళ్ళందరూ భారతదేశ పౌరులు కారన్నమాట. మరి వీళ్ళందరినీ ఏం చేశారు? సింపుల్‌గా అరెస్టు చేసి నిర్బంధ శిబిరాల్లోకి తరలించారు.

NRC ప్రక్రియ మొత్తం పరమ అస్తవ్యస్తంగా చేపట్టడం వల్ల ఒకే కుటుంబంలో భార్య పేరు ఎన్‌ఆర్‌సిలో ఉంటే భర్త పేరు లేకపోవడం, అన్నదమ్ముల్లో ఒకరి పేరుంటే మరొకరి పేరు లేకపోవడం వంటి విచిత్రాలెన్నో జరిగాయి. సైన్యంలో పరిచేసిన మహమ్మద్‌ సనావుల్లా పేరు ఎన్‌ఆర్‌సీలోకి రాకపోవడం వల్ల ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించారు. కిందామీదా పడి ఆయన ఎలాగో బెయిల్‌ సంపాదించుకున్నాడు. మాజీ భారత రాష్ట్రపతి, న్యాయమూర్తులు, మంత్రుల పౌరసత్వ దరఖాసుల్ని కూడా ఎన్‌ఆర్‌సి ట్రిబ్యునళ్ళు తిరస్కరించాయి. ఇట్లా ఆస్సాంలో ఎన్‌ఆర్‌సి 40 లక్షల మందిని అక్రమ వలసదారులుగా తేల్చింది. దీనిమీద గగ్గోలు పుట్టేసరిగి సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. దరఖాస్తుల్ని మళ్ళీ సమీక్షించాలని ఆదేశిస్తే సెప్టెంబర్‌లో మళ్ళీ కొత్త పౌరజాబితా ప్రకటించారు. చివరికి 19.5 లక్షల మందికి పౌరజాబితాలో చోటు దక్కలేదని తేలింది. వీరంతా ఇప్పుడు వేరు వేరు నిర్బంధ శిబిరాల్లో ఉన్నారు. వీళ్ళను ఎక్కడికి పంపాలో ప్రభుత్వం ఇంకా తేల్చలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరిలో అత్యధిక సంఖ్యాలు హిందువులే. అంటే అస్సాంలోకి అధిక సంఖ్యలో ముస్లింలు అక్రమంగా చొచ్చుకువచ్చారని ఇన్నేళ్ళుగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేసిన ప్రచారం పచ్చి అపద్ధమని తేలింది. ఇప్పుడు దాన్ని నిస్సిగ్గుగా కప్పిపుచ్చి వలసొచ్చిన ముస్లిమేతరులందరికీ పౌరసత్వం ఇస్తామని చట్టం తెచ్చింది. అంటే అస్సాంలో పౌరసత్వం నిరూపించుకోలేకపోయిన ముస్లింలను మాత్రమే ఇప్పుడు బైటికి తరిమెయ్యాలని నిర్ణయించారన్నమాట!

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ

ఇంత వరకు ఎన్‌ఆర్‌సీ అస్సాంకు చెందిన వ్యవహారమని అందరూ అనుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని తీసుకొస్తామని బిజెపి ప్రకటించింది. అందుకు సన్నాహకంగా నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ను సిద్ధం చేయమని రాష్ట్రాలను ఆదేశించింది. NRC ఇక్కడ అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి పంపించివేయడానికైతే మరి CAA ఎందుకు? ముస్లిమేతర వలసదారులకు CAA పౌరసత్వం ఇచ్చినట్లయితే NRC ఇక ముస్లింల పౌరసత్వాన్ని పరీక్షకు పెట్టడానికా? పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవరసం ఫలానా మతం వాళ్ళకే ఉండేలా చేయడం ఏ రాజ్యాంగ సూత్రం? మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేస్తారా? వీళ్ళను ప్రజలెన్నుకున్నది రాజ్యాంగాన్ని పరిరక్షించడానికా కాలరాయడానికా?

నిజానికి ఇది ముస్లింల సమస్య మాత్రమే కాదు. ఈ కుటిల విభజన నీతి హిందువులను మోసగించడానికి కూడా. దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి యదేచ్ఛగా దేశ సంపదను కొల్లగొట్టడానికే. ఒకసారి ఆలోచించండి. పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు ఏం చెప్పారు? నల్లధనం, తీవ్రవాదం రూపుమాసి పోతుందన్నారు. చివరికి జరిగింది ఏమిటి? అమిత్‌షా కొడుకు బ్యాంకుకు కుప్పలుగా డబ్బు వచ్చి చేరింది. ఇప్పుడు కూడా ఏ మతానికీ సమస్య ఉండదు అంటున్నారు. అయితే మరి అస్సాంలో చేసినట్లు దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు పౌరసత్వ దరఖాస్తులు పట్టుకొని క్యూలో నిలబడాలా? ఓటువేసి గద్దెనెక్కించిన పాపానికి కోట్లాది జనాన్ని మీరు భారతపౌరులా కాదా అని ప్రశ్నిస్తున్నారు డిల్లీ పాలకులు. వాళ్ళకా అధికారం ఎవరిచ్చారు? ఓటు గుర్తింపు కార్డులు, ఆధార్‌ కార్డులు పౌరసత్వానికి ప్రమాణం కాదు అంటున్నారు. మరి ఏ ప్రమాణాలు లేకుండా వాటిని ఎలా జారీ చేశారు? తాత తండ్రుల నాటి వారసత్వపు కాగితాలు లేని ప్రజలు ఏమైపోవాలి? అస్సాంలో మాదిరిగా శరణార్థి శిబారాల్లో ఖైదీలు కావాలా?

దేశాన్ని మతప్రాతిపదిక చీల్చే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం గొంతెత్తిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీసుల దాడిలో ఎంతో మంది ఎబివిపి గూండాలు పాల్గొన్నారని రుజువైంది. అంటే మతపరమైన దాడులు అప్పుడే మొదలుపెట్టారని అర్థం. యూనివర్సిటీలోకి దౌర్జన్యంగా ప్రవేశంచి లైబ్రరీ మీద, అమ్యాయిల హాస్టళ్ల మీద కూడా దాడులు చేసి టియర్‌ గ్యాస్‌ షల్స్‌ పేల్చారంటే, పేరు అడిగి మరీ విద్యార్థులను కొట్టారంటే పరిస్థితి ఎక్కడికొచ్చిందో అర్థమవుతోంది. భారతదేశం తన ఉనికి కోసం కొట్లాడాల్సిన దశకు చేరుకుంది. అందుకే కాళ్లు, చేతులు విరగ్గొట్టినా, తలలు పగలగొట్టినా, తూటాలు పేల్చినా, జైళ్ళలో తోసినా విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. మా దేశాన్ని మతపరమైన అత్యాచారం నుండి కాపాడుకుంటాం అంటున్నారు. మేధావులు, రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు సిఎఎ కి, ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటకే బెంగాల్‌, కేరళ పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు సిఎఎని గాని ఎన్‌ఆర్‌సీని గాని తమ రాష్ట్రంలో అమలు చేయం అని స్పష్టంగా చెప్పాయి. ఎపిలో వైసిపి, తెలుగుదేశం పార్టీలు మాత్రం జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటువేసి కేంద్ర ప్రభుత్వానికి సాగిలపడి రాజ్యాంగానికి, ప్రజలకు తీరని ద్రోహం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి క్యాబ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసి కొంత నయం అనిపించుకుంది గానీ ఎన్‌ఆర్‌సీ గురించి మాట్లాడలేదు. తెలంగాణలో నిరసనల మీద పోలీసు జులం నడుస్తోంది. దేశవ్యాప్త ఉద్యమంతో గొంతుకలుపుతూ, మా రాష్ట్రంలో కూడా ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించేలా ప్రజలు పోరాడాల్సి ఉంది. భయాందోళనలకు గురవుతున్న ముస్లిం సమూహం పక్కన తక్కిన ప్రజలందరూ నిలబడితేనే దేశాన్ని కాపాడుకున్నవాళ్ళవుతారు.

No. of visitors : 1100
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •