నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

- | 27.12.2019 12:31:08am

కామ్రేడ్ మావో సే-టుంగ్ (జననం: 26 డిసెంబర్, 1893 - మరణం: 9 సెప్టెంబర్, 1976)

కామ్రేడ్ మావో పేరు వినగానే అనేక విషయాలు గుర్తుకు వస్తాయి. చైనా విప్లవాన్ని విజయవంతం చేసిన కామ్రేడ్ మావో నేతృత్వం గొప్పది. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రను, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను, మావో జీవితాన్ని కలిపి ఆ విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంది.

"చైనా ప్రజలు చేపట్టిన మార్గం... చాలా వలస, పరాధీన దేశాల ప్రజలు తమ జాతీయ స్వాతంత్ర్యం కోసం, జనతా ప్రజాస్వామికం కోసం చేసే పోరాటంలో చేపట్టవలసిన మార్గంʹ అని 1950 జనవరి 27న కొమినిఫాం పత్రిక సంపాదకీయం రాసింది.

1949 అక్టోబరు విప్లవం విజయవంతం అయిన తరువాత చైనా పంథా అంతర్జాతీయ పంథాగా అనుసరించబడింది. కామ్రేడ్ మావో అంతర్జాతీయ నాయకుడుగా గుర్తింపు పొందాడు.

కామ్రేడ్ మావోగా ప్రసిద్ధి చెందిన మావో సే-టుంగ్ 1893 డిశంబర్ 26న హూనాన్ రాష్ట్రంలోని షావోషాన్ గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. ఒక ప్రైవేటు బడిలో ప్రాథమిక విధ్యను అభ్యసించిన తరువాత క్సియాంగ్ క్సియాంగ్ కౌంటీలోను, రాష్ట్ర రాజధాని చాంగ్సా స్కూలులోను, హునాన్ ఫోర్టు ప్రొవిన్షియల్ నార్మల్ స్కూల్ లోనూ ఉన్నత విద్య పూర్తి చేశాడు.

కుటుంబ సంబంధాల్లో పితృస్వామికంగా ఉండే తండ్రికి వ్యతిరేకంగా తల్లికి మద్దతుగా మావో పోరాటం చేశాడు. చిన్నతనం నుండి శారీరక దారుఢ్యం పట్ల శ్రద్ధ పెట్టేవాడు. ఈత కొట్టటంలో మంచి నేర్పరి. 18 ఏండ్ల వయస్సులో వ్యాయామ విద్య అవసరాన్ని చెబుతూ మంచి వ్యాసం రాశాడు. చిన్నతనం నుండి పెద్దవారు చెప్పిన కథలు వినడం వలన తైపింగ్ తిరుగుబాటులో రైతుల వీరోచిత పోరాటాలు, రైతాంగ పరిస్థితులను లోతుగా అర్థం చేసుకున్నాడు. ఇది తరువాత చైనా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంతో తోడ్పడింది. పెకింగ్ లైబ్రరీలో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పనిచేసిన కాలంలో మార్క్సిస్టు గ్రంథాలను అధ్యయనం చేసాడు. ఆ సమయంలో ఉన్న లైబ్రరీ నిర్వాహకుడు మార్క్సిస్టు కావడం, ఆయన కుమార్తె మావోకు చరిత్ర పట్ల అవగాహన కల్పించడంతో మావో అధ్యయనానికి ఎంతో ఉపకరించి విశాల దృక్పథం ఏర్పడడానికి, జీవిత లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడానికి దోహదపడింది.

చైనా ప్రాచీన సాంప్రదాయ తత్వవేత్త కన్ఫ్యూషియస్ నుండి పశ్చిమ దేశాల నియో హెగేలియన్స్ వరకు అనేక తాత్విక రచనలను చదివిన మావోలో దేశం పట్ల ప్రగాఢమైన ప్రేమ, విప్లవం పట్ల అచంచల విశ్వాసం ఉండేది. డాక్టరు సన్ యెట్ సేన్ నాయకత్వంలో 1911లో చైనాలో బూర్జువా విప్లవం విజయవంతం అయ్యింది. 1913లో ఆ తిరుగుబాటుదారులు నిర్మించిన నూతన సైన్యంలో మావో 6 నెలలు పని చేసి అనుభవం సంపాదించాడు. ప్రజలకు సైన్యం అవసరాన్ని గుర్తించాడు.

మావో తొలినాళ్ళ రాజకీయ జీవితం మార్క్సిజాన్ని అధ్యయనం చేయడం, ప్రచారాందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, అందుకు అవసరమైన పత్రిక నిర్వహణ, నిర్మాణ కార్యకలాపాలను స్వతంత్రంగా సృజనతో చేపట్టడంగా కొనసాగింది.

వివిధ సెక్షన్ల ప్రజలతో ప్రజాస్వామికంగా చర్చించి, రాజకీయంగా చైతన్యపరుస్తూ భావసారూప్యతను సాధించాడు. చింగ్ లో నూతన ప్రజా సమాజాన్ని (1918లో) ఏర్పాటు చేసి స్వతంత్రంగానే నడిపాడు. 1919 మే 4 ఉద్యమం నాటికి విద్యార్థి యువజన వర్గాల్లో గుర్తింపు పొందిన నాయకుడుగా చురుగ్గా పాల్గొన్నాడు. విప్లవ భావాల ప్రచారం కోసం "కియాంగ్స్ కియాంగ్స్ వ్యూʹ అనే పత్రికను నిర్వహించాడు. ఆ వెంటనే సాంస్కృతిక అధ్యయన సమాజాన్ని స్థాపించాడు. చాంగాలో కమ్యూనిస్టు గ్రూపును ప్రారంభించాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా కామ్రేడ్ మావో 1921లో జరిగిన మొదటి జాతీయ కాంగ్రెసులో ప్రతినిధిగా పాల్గొన్నాడు. హూనాన్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు.

పార్టీ నాయకుడుగా కామ్రేడ్ మావో చాంగా, అన్ హుయి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించాడు. 1923లో జరిగిన సి.పి.సి. 3వ జాతీయ కాంగ్రెస్ జాతీయ ఐక్య సంఘటనకు పిలుపునిచ్చింది. సన్ యెట్ సేన్ నాయకత్వంలోని కొమింగ్ టాంగ్ పార్టీతో కలిసి పని చేయడానికి నిర్ణయించింది. 1924, 26లలో జరిగిన రెండు కొమింగ్ టాంగ్ జాతీయ కాంగ్రెస్ లలో కామ్రేడ్ మావోను ఉన్నత నాయకత్వంలోకి తీసుకుని ప్రచారశాఖ బాధ్యతలు ఇచ్చారు. రాజకీయ పత్రికకు సంపాదకుడుగా ఉంటూ, రైతు ఉద్యమ శిక్షణలో నిర్దేశకత్వం అందించాడు. 1924-26 మధ్య కాలంలో కార్మిక వర్గం, రైతాంగం సాగించిన గొప్ప పోరాటాలతో చైనా విప్లవం వేగంగా పురోగమించింది. 1925 మే 30 సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో అన్ని సెక్షన్ల ప్రజలు పాల్గొన్నారు. ఆ పోరాటాలకు స్థానికంగా మార్గదర్శకత్వం అందిస్తూ కామ్రేడ్ మావో ఒక మంచి నాయకుడుగా అభివృద్ధి చెందాడు.

చాలా ప్రాంతాల్లో సాయుధ ఘర్షణలకు దారితీసిన కార్మిక వర్గ ప్రజా తిరుగుబాట్లకు తోడు లక్షలాది సభ్యత్వాలతో హూనాన్, హూపే, కియాంగ్సీ రాష్ట్రాల్లో రైతాంగ ఉద్యమాలు అభివృద్ధి అయ్యాయి. ఒక్క హూనాన్ రాష్ట్రంలోనే 3 లక్షల మందితో రైతుకూలీ సంఘం, లక్ష మందితో రైతాంగ ఆత్మరక్షణ పటాలం ఏర్పడ్డాయి.

1925లో డాక్టర్ సన్ యెట్ సేన్ మరణానంతరం కొమింగ్ టాంగ్ పార్టీ నాయకత్వాన్ని చాంగ్ కై షేక్ చేజిక్కించుకుని కమ్యూనిస్టు పార్టీపై ఊచకోతకు పూనుకున్నాడు.

చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి చెంటూషి మితవాద అవకాశవాదం కార్మిక వర్గ నాయకత్వాన్ని గుర్తించలేదు. బూర్జువా వర్గంపై భ్రమలతో, మొదటి అంతర్యుద్ధం కాలంలో తప్పుడు ఎత్తుగడల కారణంగా పార్టీ, విప్లవోద్యమం తీవ్రమైన నష్టాలకు, అనేక రకాల కష్టాలకు గురయ్యాయి. 1927 మొదటి అంతర్యుద్ధం వైఫల్యం తరువాత చైనాలో వర్గ సమీకరణలు మారాయి. బడాబూర్జువా వర్గం సామ్రాజ్యవాదంతోనూ, భూస్వామ్యం (యుద్ధ ప్రభువుల)తోనూ కలిసి విప్లవ ప్రతీఘాతుక శక్తిగా కమ్యూనిస్టు పార్టీపై దాడులు కొనసాగించింది. 1928 జనవరి నుండి ఆగస్టు వరకు 8 నెలల కాలంలో లక్ష మంది కార్మికులు, రైతులు హత్యకు గురయ్యారు. దారుణమైన నిర్బంధంతో పాటు ప్రజలు తీవ్ర స్థాయిలో దోపిడీకి గురయ్యారు. తరువాత చింగ్ కు వోటాంగ్ అతివాద విధానాలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం ఉద్యమానికి మరల తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలోనే చైనాలో రైతాంగ పాత్రను అధ్యయనం చేయడంతో కామ్రేడ్ మావో సైద్ధాంతిక, రాజకీయ కృషి ప్రారంభమైంది. అది మార్క్సిస్టు సిద్ధాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది.

1926 మార్చిలో చేసిన "చైనా సమాజంలోని వర్గ విశ్లేషణʹ ఆధారంగా 1927 మార్చిలో "హూనాన్ రైతు ఉద్యమంపై నివేదికʹను సమర్పించాడు. లెనిన్ థీసిస్ ʹవలసలలోని జాతీయ విప్లవం" పై ఆధారపడి సరియైన మార్స్సిస్టు, లెనినిస్టు దృక్పథం, పద్ధతులను అనుసరించి నూతన ప్రజాస్వామిక విప్లవానికి సంబంధించిన మౌలిక భావాలను అభివృద్ధిపరిచాడు.

వైఫల్యాల నుండి తీసిన గుణపాఠాల వెలుగులో ఎర్రసైన్యాన్ని నిర్మించేందుకు 1928లో కామ్రేడ్ మావో (చైనాలో ఎర్ర రాజ్యాధికారం ఎలా మనగులుగుతుంది?ʹ ʹచింకాంగ్ కొండల్లో పోరాటంʹ అనే చారిత్రక రచనలు చేసి సైద్ధాంతిక ప్రాతిపదికను ఏర్పరచాడు. అది వలస, అర్ధవలస దేశాల్లో దీర్ఘ కాల ప్రజాయుద్ధ పంథాకు పునాదిగా ఉంది. ఆ పంథాకు ఆచరణ రూపం ఇచ్చే క్రమంలోనే విప్లవ స్థావర ప్రాంతాలను నిర్మాణం చేసి సోవియట్లు ఏర్పాటు చేసి "చైనా సోవియట్ రిపబ్లిక్ తాత్కాలిక ప్రభుత్వాన్నిʹ ఏర్పరచాడు. 1930 నాటికి చింకాంగ్ పర్వతాల్లోని కేంద్ర స్థావర ప్రాంతం, అనేక
రాష్ట్రాల్లో స్థావర ప్రాంతాలు, ప్రజా సాయుధ శక్తులు 60 వేల సంఖ్యలో ఏర్పడ్డాయి. అతి కొద్దికాలంలోనే ఆ సంఖ్య లక్షకు చేరింది. చాంగ్ కై షేక్ యుద్ధ ప్రభువులకు మధ్యనున్న అంతరంగిక ముఠా కక్షల్ని, ఘర్షణలను వినియోగించుకుని విప్లవ శక్తులు బలపడ్డాయి.

ఈ విజయాలు మరల పార్టీలో అతివాదాన్ని తెచ్చి నష్టపరిచాయి. లీలీషాన్ నాయకత్వంలో పట్టణాల్లో తిరుగుబాట్లకు ప్రాధాన్యతనిచ్చిన దుస్సాహసిక పథకం, అలాగే వాంగ్ మింగ్ నాయకత్వంలోని 3వ అతివాద పంథా-గెరిల్లా యుద్ధతంత్రాన్ని, చలన యుద్ధతంత్రాన్ని నిర్లక్ష్యం చేసి స్థావర యుద్ధతంత్రం చేపట్టి అనేక నష్టాలకు గురిచేసాయి. 2వ అంతర్యుద్ధంలో 4 చుట్టివేత దాడులను ఓడించిన ఎర్రసైన్యం 10 లక్షల సైన్యంతో జరిగిన 5వ చుట్టివేతలో ఓటమి పాలైంది. 1927 నుండి 1935 మధ్య కాలంలో 3 లక్షల మంది ప్రజలు ఊచకోతకు గురయ్యారు. ఓటమి నుండి విజయాలవైపు పురోగమించే క్రమంలో 1934 అక్టోబరులో వ్యూహాత్మక మలుపుగా పిలువబడే చారిత్రక దీర్ఘ యాత్ర - లాంగ్ మార్చ్ కు పిలుపు ఇవ్వడంతో శతృ వలయాన్ని ఛేదించుకుంటూ ఎర్రసైన్యం ఉత్తరం వైపుకు పురోగమించింది. 11 రాష్ట్రాల్లో 12 వేల కిలో మీటర్ల దూరాన్ని 12 నెలల పాటు దీర్ఘయాత్ర చేసిన ఎర్రసైన్యం సంఖ్య రీత్యా బాగా తగ్గినా రాజకీయంగా, నిర్మాణపరంగా పటిష్టవంతం అయ్యింది. దేశవ్యాప్తంగా విస్తృత ప్రభావాన్ని వేసింది. సామ్రాజ్యవాద వ్యతిరేక
జాతీయ భావాన్ని కల్పించింది. ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ʹచైనా లాంగ్ మార్చ్ʹ ఒక గొప్ప ఉత్తేజకరమైన సంఘటనగా నిలిచిపోయింది. ఈ కాలంలోనే 1935 జనవరిలో జరిగిన సుయి మహాసభలో కామ్రేడ్ మావోకు పార్టీపై సంపూర్ణ ఆధిపత్యం లభించింది. లాంగ్ మార్చ్ కాలంలో దారి పొడవునా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ ʹవిత్తనాలను వెదజల్లిన యంత్రంʹగా రాజకీయ కృషి చేసింది.

చైనా కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల 3వ ఇంటర్నేషనల్ శ్రద్ధ చూపినా వలస, అర్ధ వలసల్లో విప్లవాలను అర్థం చేసుకోవడం, అభివృద్ధి చేయడంలో వెనుకబడి ఉంది. 1935లో మావో నాయకత్వం నెలకొనే వరకు చైనాలో ఆధిపత్యం వహించిన మితవాద, అతివాద పంథాలను సకాలంలో సరిదిద్దలేకపోయింది.

జపాన్ వ్యతిరేక ప్రతిఘటనా ఎత్తుగడలు :

కామ్రేడ్ మావో ఈ కాలంలో మార్క్సిస్టు, లెనినిస్టు ఐక్యసంఘటన ఎత్తుగడలను అభివృద్ధి పరిచాడు. చైనా అంతర్గత, బహిర్గత వైరుధ్యాలను అత్యంత ప్రతిభతో విశ్లేషించి జపాన్ దురాక్రమణతో ప్రధాన వైరుధ్యం మారిన విషయాన్ని చెబుతూ ʹజపాన్ వ్యతిరేక విశాల ప్రజా ఐక్యసంఘటన ఎత్తుగడలనుʹ రూపొందించాడు. మార్క్సిస్టు తత్వశాస్త్రంలో గతితార్కిక నియమాలను అందులో వైరుధ్య అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి విస్తృతంగా వివరించి వైరుధ్య నియమాన్ని అభివృద్ధి పరిచాడు.

ప్రధాన వైరుధ్యం మారిందని గుర్తించిన మావో వ్యూహాన్ని మార్చి నూతన ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా జపాన్ తో వ్యవహరించడంతో వేలసంఖ్యలో ఉన్న ఎర్రసైన్యం జపాన్ యుద్ధం ముగిసేనాటికి లక్షలలోకి పెరిగింది. (1937లో 20 వేల నుండి 1945 వరకు 10 లక్షలకు చేరింది.) మావో రాసిన "చైనా విప్లవ యుద్ధంలోని వ్యూహాత్మక సమస్యలుʹ మార్క్సిస్టు-లెనినిస్టు మిలటరీ విజ్ఞాన శాస్త్రాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయిస్తూ రాసినది. "జపాన్ వ్యతిరేక గెరిల్లా యుద్ధంలోని వూహాత్మక సమస్యలుʹ ʹదీర్ఘకాల ప్రజాయుద్ధం గురించిʹ చేసిన రచనలు మొత్తం కలిపి మార్క్సిస్టు మిలటరీ విజ్ఞాన శాస్త్రాన్నే నూతన స్థాయికి తీసుకవెళ్ళాయి. చైనా విప్లవానికి మార్గదర్శకత్వం అందించడమేగాక ప్రపంచ వ్యాప్తంగా జాతీయ విముక్తి యుద్ధాలకు పునాదులను వేశాయి. .

ఇదే కాలంలో పార్టీలో బలంగా ప్రభావం చూపుతున్న స్వీయాత్మక/పిడివాదం/ కార్మికవర్గేతర భావజాలాల్ని ఓడించడానికి మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్ని ఆచరణ అనే వ్యాసంలో వివరంగా చెప్పి సార్వత్రిక మార్క్సిస్టు తాత్విక భావనను అభివృద్ధిపరిచి, సరళ రీతిలో వివరించి అంతర్జాతీయ కార్మిక వర్గానికి ఎంతో దోహదం చేసాడు. సరైన భావాలు ఎక్కడ నుండి వస్తాయో వివరించాడు.

మావో దీర్ఘ దృష్టి గొప్పది. జపాన్ వ్యతిరేక యుద్ధం ముగిసిన వెంటనే జరిగిన సి.పి.సి. 7వ కాంగ్రెస్ లో ʹమిశ్రమ ప్రభుత్వం గురించిʹ అనే నివేదికను సవరిస్తూ కొమింగ్ టాంగ్ తో మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుకు నిర్దిష్ట కార్యక్రమాన్ని ఇచ్చాడు. అమెరికా అండతో చాంగ్ కై షేక్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించి 3వ అంతర్యుద్ధం మొదలు పెట్టాడు. ʹఅంతర్యుద్ధం వద్దని చాంగ్ కై షేక్ తో సహకరించాలి లేకుంటే చైనా జాతి నశించిపోతుందనిʹ స్టాలిన్ ఇచ్చిన సలహాను చైనా ప్రస్తుత పరిస్థితులకు పొసగదని గుర్తించిన మావో అంతర్యుద్ధాన్ని కొనసాగించాలనే నిర్ణయించాడు. చైనా
కమ్యూనిస్టు పార్టీ ఎర్రసైన్యం 4 సంవత్సరాల పాటు పోరాడి విప్లవ ప్రతీఘాతుక దాడులను ఓడించి దేశ వ్యాపిత విజయాన్ని సాధించింది.

1949లో సి.పి.సి. 28వ జన్మదిన వార్షికోత్సవంలో ʹప్రజల ప్రజాస్వామిక నియంతృత్వం గురించిʹ ప్రసంగిస్తూ మనం విప్లవ యుద్ధంలో మౌలిక విజయం సాధించామని ప్రకటించాడు. అయితే ఇది మొత్తం ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని గుర్తు చేశాడు. 1949 అక్టోబర్ 1న కొత్త రాజ్యం అవతరించింది. కామ్రేడ్ మావో ఈ సందర్భంగా యావత్ ప్రపంచానికి సందేశం ఇస్తూ చైనా ప్రజా గణతంత్ర స్థాపనని, కేంద్ర ప్రజా ప్రభుత్వ స్థాపనను ప్రకటించాడు.

ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఆధునిక రివిజనిజానికి వ్యతిరేకంగా జరిగిన సైద్ధాంతిక చర్చ "గ్రేట్ డిబెట్ʹగా ప్రసిద్ధి పొందింది. ʹశాంతియుత పరివర్తన, శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనంʹ అనే కృశ్చేవ్ వర్గ సంకర రాజకీయాలను ఖండిస్తూ, వర్గపోరాట ప్రాధాన్యతను వివరించాడు. పెట్టుబడిదారీ పునరుద్ధరణ ప్రమాదాన్ని గుర్తించి అంతర్జాతీయంగా మావో జరిపిన సిద్ధాంత పోరాటం మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కార్మిక వర్గ నియంతృత్వం ఆవశ్యకతను మరింత దృఢతరం చేసింది. సోవియట్ యూనియన్ లో కృశ్చేవ్ ముఠా కామ్రేడ్ స్టాలిన్ పై చేసిన దుష్ప్రచార దాడిని ఖండించి, కామ్రేడ్ స్టాలిన్లో ఉన్న విప్లవకర లక్షణాలను వివరిస్తూ, నిజమైన విప్లవకారుడుగా నిర్ధారిస్తూ ప్రపంచ సోషలిస్టు విప్లవంలో స్టాలిన్ పాత్రను గుర్తింపజేశాడు. -

అదే సందర్భంలో సోషలిస్టు సమాజంలోకి పరివర్తన చెందాక వర్గపోరాటాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని, ఉత్పత్తి శక్తుల సిద్ధాంతాన్ని ఖండిస్తూ, వాటికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడాడు. ʹసోషలిస్టు సమాజపు అభివృద్ధికి వర్గపోరాటం కీలకమనిʹ నొక్కి చెప్పాడు.

చైనాలో గొప్ప ముందంజ, ప్రజా కమ్యూన్ అవతరణ, దిద్దుబాటు ఉద్యమం పురోగమించడంతో పార్టీలోని లీషావ్ చీ లాంటి శక్తులు ఆత్మరక్షణలోకి నెట్టబడ్డాయి. ప్రజా కమ్యూన్లు సోషలిస్టు సమాజపు రాజ్యాధికార మౌలిక నిర్మాణంగా అభివృద్ధి చెందాయి.

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఆ ఉద్యమం కొనసాగింది. విప్లవంలో ప్రజాపంథాను అమలు చేయడం, అభివృద్ధి చేయడంతో పాటు రాజకీయాలను ఆధిపత్య స్థానంలో ఉంచడంతో కేడర్, సైన్యం, ప్రజల మధ్య త్రిముఖ మైత్రి అభివృద్ధి చెంది గొప్ప శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం పురోగమించింది. ఇది అంతర్జాతీయ కార్మిక వర్గ సిద్ధాంత ఆయుధాగారానికి సమకూరిన అత్యంత ముఖ్యమైన ఆయుధం అయ్యింది. వర్గపోరాటం, కార్మిక వర్గ నియంతృత్వాలతో పాటు ఉపరితలంలో వర్గపోరాటాన్ని గుర్తించడం విప్లవకారుల నేటి కర్తవ్యంగా గుర్తించబడుతుంది. .

సోషలిస్టు నిర్మాణ కాలమంతటా ప్రత్యేకించి సాంస్కృతిక విప్లవ కాలంలో ఆర్థిక పునాది-ఉపరితలాల మధ్య, ఆర్థిక రాజకీయాల మధ్య సరైన గతితార్కిక సమతులనాన్ని నెలకొల్పే వైఖరిని చేపట్టాడు. ప్రజల పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ ʹవిప్లవాన్ని అర్థం చేసుకోవాలి-ఉత్పత్తిని పెంచాలిʹ అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు.

ʹనూరు పువ్వులు వికసించనివ్వండి-వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీయండిʹ అనే దిద్దుబాటు ఉద్యమం, సోషలిస్టు ఎడ్యుకేషన్ ద్వారా ప్రజా బాహుళ్యాన్ని మితవాదులకు వ్యతిరేకంగా సమీకరించాడు. ʹప్రజల మధ్య వైరుధ్యాలతో సక్రమంగా వ్యవహరించే తీరుʹ అనే రచనలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం అమలుకు ప్రజాపంథా గ్యారెంటీ ఇస్తుందని స్పష్టపరిచాడు.

సోషలిస్టు సమాజ నిర్మాణం, కమ్యూనిజానికి పురోగమించడం గురించి చెబుతూ కామ్రేడ్ మావో రష్యా అనుభవంలో 5 ప్రధాన పొరపాట్లను పేర్కొన్నాడు.

1. ఉత్పత్తి సంబంధాలకు, ఉత్పత్తి శక్తులకు మధ్య ఉన్న వైరుధ్యానికి తగినంత ప్రాధాన్యతను ఇవ్వలేదు;
2. సోషలిస్టు నిర్మాణంలో ప్రజాపంథాను అనుసరించలేదు;
3. వర్గ పోరాటాన్ని నిర్లక్ష్యం చేశారు;
4. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతను ఇచ్చి అందులోని ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించలేదు. పరిశ్రమలకు, వ్యవసాయానికి మధ్య సమతులనం లేదు;
5. రైతుల పట్ల అపనమ్మకం కొనసాగింది.

రష్యా అనుభవం నుండే కాక చైనా అనుభం నుండి కూడా అనేక గుణపాఠాలు తీసి సోషలిస్టు నిర్మాణానికి అన్వయించడంతో మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతం గొప్పగా పురోగమించింది.

కార్మిక వర్గపు వర్గపోరాట ఎత్తుగడలను చైనా విప్లవ నిర్దిష్ట పరిస్థితులకు కామ్రేడ్ మావో శాస్త్రీయంగా అన్వయింపజేశాడు. నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఐక్యసంఘటన, సాయుధ పోరాటం, పార్టీ నిర్మాణం అనే మూడు మంత్రదండాలను గొప్పగా సమన్వయించాడు. ఐక్యసంఘటన అంటే సాయుధ పోరాటాన్ని నిర్వహించేందుకు ఉపయోగపడే ఐక్యసంఘటనగానూ, పార్టీ అంటే ఐక్యసంఘటన ప్రజా సైన్యం అనే రెండు ఆయుధాలను ధరించిన వీరయోధగా మావో వివరించాడు.

మూడు మంత్రదండాలను గొప్పగా అభివృద్ధి చేసి మార్క్సిస్టు అవగాహనను నూతన స్థాయికి అభివృద్ధి చేశాడు. పార్టీ పని విధానాన్ని తాత్వికంగా చర్చించి సరిదిద్దడంతో పాటు సూత్ర రీత్యా క్రమబద్దీకరించడం చేశాడు.

రెండు పంథాల మధ్య పోరాటానికి మావో ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. ʹవర్గాలు ఉన్నంత కాలం కమ్యూనిస్టు పార్టీలో సరైన భావాలకు, తప్పుడు భావాలకు మధ్య వైరుధ్యం సమాజం లోపల వర్గ వైరుధ్యాల తాలూకు ప్రతిబింబాలేʹ అని స్పష్టంగా చెప్పాడు.

"తత్వశాస్త్రం మాయజాలం కాదుʹ అని చైనా రైతాంగానికి వైరుధ్య నియమాన్ని సరళం చేసి అందించిన కామ్రేడ్ మావోకు ప్రపంచ పరిణామాల పట్ల సమగ్రత, శాస్త్రీయత ఎంత గొప్పగా ఉన్నాయో మనకు స్పష్టమవుతుంది. ప్రపంచ సోషలిస్టు విప్లవోద్యమంలో మార్క్సిజం-లెనినిజం అభివృద్దే మావోయిజంగా గుర్తించి ఆచరిస్తున్నాం. 1976లో సెప్టెంబర్ 9న కామ్రేడ్ మావో అమరుడయ్యాడు. ఆయన ప్రపంచ సోషలిస్టు విప్లవానికి చేసిన సైద్ధాంతిక రాజకీయ కృషి మనల్ని నడిపిస్తుంది.

మావో వ్యక్తిగత జీవితానికి వస్తే-మావోకు 14 సంవత్సరాల వయస్సులో తండ్రి అదే గ్రామంలో ఒక అమ్మాయితో వివాహం నిర్ణయం చేశాడు. ఆ వివాహాన్ని మావో ఎప్పుడూ గుర్తించలేదు. బీజింగ్ లో ఉన్నప్పుడు హైస్కూలు టీచరు కూతురు యాంగ్ కు యిహుయి అనే యూనివర్సిటీ విద్యార్థిని మొదటి పెండ్లి చేసుకున్నాడు. ఆమెను కొమింగ్ టాంగ్ బలగాలు హత్య చేశాయి. తరువాత హెలిజన్‌ను జియాంగ్సీలో ఉన్న కాలంలో పెండ్లి చేసుకున్నాడు. ఆమె సహకరించకపోవడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. తరువాత యానాలో ఉన్న కాలంలో నటి లాన్ పింగ్ ను పెండ్లి చేసుకున్నాడు. ఆమె తరువాత కాలంలో జియాంగ్ జింగ్ గా సాంస్కృతిక విప్లవ కాలంలో చురుగ్గా పని చేసిన విషయం తెలిసిందే.

కామ్రేడ్ మావో అంటే దీర్ఘకాల ప్రజాయుద్ధం, గెరిల్లా యుద్ధవ్యూహం, నూతన ప్రజాస్వామిక విప్లవం, లాంగ్ మార్చ్, మూడు మంత్రదండాలు, రెండు పంథాల మధ్య పోరాటం, ప్రజాపంథా, చైనా అక్టోబర్ సోషలిస్టు విప్లవం, గొప్ప శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం...ఇంకా గ్రేట్ డిబెట్, ఇలా ఎన్నో ఎన్నో విజ్ఞానాంశాల సమాహారం.

సోషలిజమే ప్రత్యామ్నాయం
ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి.

No. of visitors : 1530
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

యాభై వ‌సంతాల అజేయ‌శ‌క్తి న‌క్స‌ల్బ‌రీ

విర‌సం | 19.04.2017 12:26:24pm

ఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డ‌పాడులో విర‌సం బ‌హిరంగ‌స‌భ‌. కామ్రేడ్స్ వ‌ర‌వ‌ర‌రావు, పాణి, కాశీం వ‌క్త‌లు. ...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1

| 08.05.2017 09:37:50pm

When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry.....
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •