స్థాపన, పునః స్థాపనల అద్భుత ప్రయాణం – విరసం

| సాహిత్యం | వ్యాసాలు

స్థాపన, పునః స్థాపనల అద్భుత ప్రయాణం – విరసం

- కాత్యాయనీ విద్మహే, కె. ఎన్. మల్లీశ్వరి | 17.01.2020 01:33:59pm

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో వచన ప్రక్రియకి అయిదు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అయినప్పటికీ ఆ సాహిత్యం, మామూలు ప్రజలకి త్వరగా చేరువ కావడానికి పునాది పడింది మాత్రం స్థూలంగా 1850 తర్వాతే. ఆధునిక శబ్దాన్ని కాలవాచిగా తీసుకున్నట్లయితే ఈ నూట డెబ్భై ఏళ్ల ఆధునిక వచన సాహిత్య చరిత్ర, పొడుగూతా కొన్ని మేలి మలుపులు ఉన్నాయి. అందులో ఒకటి కన్యాశుల్కం కాలం నాటిది. మరొకటి రాజకీయ లక్ష్యంతో నిర్మితమైన విప్లవోద్యమం ప్రారంభ దశ నాటిది. విప్లవోద్యమం, అందులో భాగమైన విరసం, తెలుగు వచన సాహిత్యానికి చేసిన దోహదం – చారిత్రిక దృష్టితో చూసినపుడు ఒక పరిణామ క్రమం కనపడుతుంది. రాజకీయ లక్ష్యాలు సాంస్కృతిక రంగంలో అనువర్తితమైనపుడు అనివార్యంగా వచ్చే మార్పులు సాహిత్యానికి సృజనాత్మకమైన మేలూ చేయవచ్చు, యాంత్రికమైన కొన్ని మూసలను కూడా తయారు చేయవచ్చు. మార్పు, వైవిధ్యం, స్వేచ్ఛ, అవసరం, మనోలోకాల సంచలనం, భౌతిక స్థితిగతుల వివక్ష - వాటి సాధన, పోరాటం అనేవి సాహిత్యాన్ని జవజీవాలతో నిలబెడతాయి. ఇటువంటి పలు క్రమాల్లోకి ప్రవహించిన విప్లవోద్యమం, అనేక కళారూపాలను విప్లవీకరించింది. ఇందులో వచన సాహిత్యం కూడా ముందు భాగాన ఉంటుంది.

మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం దేన్నయినా ఎక్కడ లొకేట్ చేస్తున్నామన్నది చాలా ప్రాధాన్యం ఉన్న అంశం. ఈ గుర్తింపుకి ఒక చూపు అవసరం. ఆ చూపు ఎవరి గమన గమ్యాలను బట్టి వారిని నిర్దేశిస్తుంది. పశ్చిమ బెంగాల్ నక్జల్ బరీలో మొదలైన భూస్వామ్య వ్యతిరేక పోరాటం శ్రీకాకుళ గిరిజనోద్యమ పోరాటంగా రూపు తీసుకుంది. పోరాటం, తిరుగుబాటు, విప్లవం లాంటివి విశ్వవ్యాపిత విషయాలు. కనీసపు అవసరాలు తీరని చోట, స్వేచ్ఛా సమానత్వపు భావనలు ఉనికిలో లేని చోట, బలవంతునిదే రాజ్యమైన చోట, బలహీనుల మనుగడ కష్టమైన చోట – పిపీలకాలన్నీ కలిసి బలవంతమైన సర్పాన్ని చిక్కించుకోవడానికి తగవు పెట్టుకుంటాయి. సర్వకాలాల్లో, సర్వ ప్రదేశాల్లో, సర్వ ప్రజానీకంలో ఈ తగవు నడుస్తూనే ఉంటుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయించినంత సత్యం. ఈ సత్యం శ్రీకాకుళ గిరిజనోద్యమ పోరాటం వంటి స్థానిక సమస్యలలో లొకేట్ చేసినపుడు అక్కడ అన్ని రంగాల్లో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పు సాంస్కృతిక రంగంలో మరీ ముఖ్యంగా సాహిత్య రంగంలో అత్యంత సృజనాత్మకంగా వ్యక్తీకరించబడుతుంది. నిలువనీడ లేని చోట ఆ పీడనని గుర్తించడం, ఆ గుర్తింపుని ఒక పోరాట రూపంలోకి మళ్ళించడం, వాటి విజయ వైఫల్యాలు – మనుషుల్ని నిలువనివ్వవు. ఒక పువ్వు పూస్తేనో, ఆకాశం ఉరిమితేనో, పసిపాప నవ్వితేనో పరవశించే మనుషులు తన చుట్టూ ఆవరించిన ఇంతటి సంచలనాలకి తమదైన బాణీలో స్పందిస్తారు. ప్రత్యేక పండిత వర్గం నుంచో శిష్ట పద్ధతుల నుంచో కాక ప్రజల రోజువారీ జీవితం నుంచి కూడా బలమైన సాహిత్యం పుడుతుందన్న విషయం ఈ ఉద్యమం నిరూపించింది.
జానపదులు సృష్టించిన మౌఖిక వచన సాహిత్యంతో పాటు లిఖిత సాహిత్యం కూడా జన జీవితంలోనుంచి ఊపిరి పోసుకుంది. విరసం ఏర్పడిన కొత్తల్లో భూషణం కథల సంపుటి ʹన్యాయంʹ (01/01/1972) వెలువడింది. అందులోని నూకాలీయం, న్యాయం, తీర్పు, చావు, ధర్మం, పాపం వంటి కథలు, 1974 లో విరసం మాసపత్రిక అరుణతారలో వచ్చిన పులుసు కథలు – వచనరచనలకి కొత్తదనాన్ని అద్దాయి. ఈ కొత్తదనం కేవలం వస్తువుకి సంబంధినదే కాదు అనేక శిల్ప విశేషాలకి సంబంధించినది కూడా. ఆ కాలపు వచన రచనల్లో ʹపెట్టుడుʹ నేపథ్యం కాకుండా స్థానిక పరిమళంతో కూడిన ఆవరణం కథనమంతా పరుచుకునేది. ప్రజలు మాట్లాడే పలు మాండలిక భేదాల, యాసల జీవభాషని రచయితలు ఒడిసి పట్టుకుని విస్తృతంగా వాడుతూ రచనా గౌరవం కల్పించారు. ప్రజల్లో వాడుకలో ఉండే మౌఖిక జానపద కథన ధోరణులని అలవోకగా రచనలలోకి తెచ్చారు. ప్రజలకి చెందినది ఏదైనా రచనకి అర్హనీయమే అన్న గట్టి నమ్మకంతో విరసం వచన రచనలని విప్లవీకరించింది. వస్తు శిల్పాలను ప్రజల వద్ద లొకేట్ చేయడం విరసం సాధించిన పెద్ద విజయం.

1969 నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం తీవ్రంగా అణచి వేసిన తర్వాత ఉద్యమ శక్తులు అలజడిలో, అసంతృప్తులుగా ఉన్న కాలమది. ఒక ప్రాంతీయ ఆకాంక్ష కోసం రూపు కట్టిన చైతన్యమంతా తదనంతర కాలంలో విప్లవోద్యమంలోకి దారి తీసుకుంది. ప్రాంతీయ అస్తిత్వపు పోరాటంలో కలిగిన ఆశాభంగానికి మందులాగా వర్గపోరాటం అతి పెద్ద ఆశని కళ్ళముందు నిలిపింది. స్థానిక అస్తిత్వ ఆకాంక్ష నుంచి విశాలమైన ప్రయోజనాలున్న లక్ష్యం వైపు ప్రయాణం అత్యంత సహజంగా జరిగింది. ఒక సిద్ధాంతాన్ని రచించి దాని కోసం జరిగిన ఏకీకరణలా కాకుండా సమాజపు ఒరవడిలో భాగంగా జరిగిన ఈ పరిణామాలు స్థానిక అస్తిత్వ ఆకాంక్షలకి వర్గపోరాటానికి మధ్యనున్న సహజ సంబంధాన్ని సూచిస్తాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలోని గిరిజనోద్యమ పోరాటం ఇచ్చిన చైతన్యం, తెలంగాణలో అప్పటికే సిద్ధంగా ఉన్న విప్లవ భూమికకి మరింత బలాన్ని, లక్ష్యాన్ని సమకూర్చి పెట్టింది. భూస్వామ్య పీడనకి వ్యతిరేకంగా రైతాంగం ఏకీకృతం కావడమన్నది ఆ దశాబ్దంలో అన్నిచోట్లా ప్రబలంగా కనిపించిన ధోరణి. అప్పటికే చాప కింద నీరులా ప్రవేశించిన పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖం ఆధునికంగా గొప్ప మార్పులు తెచ్చేదిగా ఉక్కిరిబిక్కిరి చేసేదిగా ఉంది. తమ సాధారణ జీవితంలో ఆ వ్యవస్థ తెస్తున్న మార్పులు సామాజిక అధ్యయన శీలురే కనిపెట్టలేని రూపంలో ఉండేవి. అప్పటికి వివక్షలు అత్యంత మొరటు రూపంలో ప్రజలను మధ్య యుగాల నాటి బాధలకి గురి చేస్తున్న దశ మీద పోరాటం మొదలైంది.

ఇటువంటి చైతన్యంలోకి సమాజం ప్రవేశించడాన్ని సాహిత్యం ద్వారా సులువుగా గుర్తు పట్టగలం. ఉత్తరాంధ్రలో మాదిరిగానే సాహిత్యపు వస్తు శిల్పాలు గుణాత్మకమైన మార్పుకి లోనవడం తెలంగాణ కథలు, నవలల్లో, ముఖ్యంగా అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచనల్లో చూడొచ్చు. అక్కడి ఉద్యమ స్ఫూర్తి ఇక్కడి స్థానిక సమస్యలలో పునః స్థాపితమయింది. విరసం తొలి దశకంలో రాజయ్య రాసిన సంఘం, సృష్టికర్తలు, కుంపటి, గోడ, చేపలు వంటి కథలు తెలంగాణ పల్లె జీవనాన్ని అందులోని పీడనని సృజనాత్మకంగా కళ్ళకి కట్టాయి. జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాటాలు తెలంగాణ వచన సాహిత్యం మీద తిరుగులేని ప్రభావాన్ని చూపాయి. తెలంగాణ మాండలికం పాత సంకెళ్ళను తెంచుకుని మరింత ప్రభావవంతంగా కథల్లోకి నవలల్లోకి వచ్చింది. చాలాకాలం పాటు విస్మృతికి గురైన తెలంగాణ సాహిత్యాన్ని తప్పనిసరిగా గుర్తించగలిగేలా చేయడంలో విప్లవోద్యమ దోహదం చాలా ముఖ్యమైనది.
మలిదశకంలోకి వచ్చేసరికి ఉద్యమం మీద రాజ్య నిర్బంధం మొదలైంది. ఉత్తరాంధ్రలో తెలంగాణలో తనని తాను స్థిరపరుచుకుంటూనే నిర్బంధాలను అధిగమించడానికి గిరిజన ప్రాంతాలలోకి విస్తరించుకుంది. అటవీ వనరులను కొల్లగొట్టే దళారులు, సొండీల నుంచే కాకుండా ఖనిజ వనరులను పెట్టుబడిదారుల హస్తగతం చేయడానికి దారులు తెరిచిన ప్రణాళికలను ఎదుర్కోవడం ఉద్యమానికి అతి పెద్ద సవాలు అయింది. ʹఅడవిలోనుంచి నక్సలైట్ ని తీసేస్తే బాక్సైట్ వస్తుందిʹ అని ఒక వ్యాసకర్త వ్యాఖ్యానించినట్లు – ఆ తీసివేయడానికి సొంత ప్రజల మీదనే యుద్ధ తరహా అణచివేత సాగుతోంది. ఇంతటి నిర్బంధంలోనూ విప్లవోద్యమం అన్ని రంగాల్లోనూ ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచి దుర్మార్గ ప్రభుత్వాలకి కంటగింపు అయింది. ఈ దశలో గిరిజనుల జీవితాలతో మమేకం అయి కొంత మంది రచనలు చేసారు. అల్లం రాజయ్య రాసిన ʹకొమురం భీంʹ ఆయా రచనలకి ప్రాతినిధ్యంగా నిలబడ గల శక్తివంతమైన నవల. ఎన్. వేణుగోపాల్ చెప్పినట్లు, ʹకొమురం భీం నాయకత్వం వహించిన, వేలాది మంది గోండులూ, కోలాములూ, ఇతర తెగలూ పాల్గొన్న, కనీసం మూడు సంవత్సరాలు నడిచిన పోరాటం 1940 లో అణచివేతకు గురైంది. అది అంత ప్రభావశీలమైన తిరుగుబాటు అయినప్పటికీ ఆదివాసుల సామూహిక జ్ఞాపకంలో తప్ప భీం మరెక్కడా లేకుండాపోయాడు. ఈ ప్రాంత సామాజిక చరిత్రలో భాగం కాకుండా పోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భీం విస్మృత గతంగా మారిపోయాడు. ఆ గతాన్ని తవ్వితీసినదీ, వర్తమానంతో సంభాషింప జేసినదీ, భీంను పునరుజ్జీవింపజేసినదీ విప్లవోద్యమం.ʹ ఇట్లా రీ లొకేట్ చేయడం ద్వారానే విప్లవోద్యమ వచన సాహిత్యం కూడా ఎప్పటికపుడు తనని తాను కొత్తగా వ్యక్తీకరించుకుంటూ వస్తోంది.

ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలనేవి ఎప్పటి నుంచి భారతదేశంలో మొదలయ్యాయన్న దాని మీద కొత్త పరిశోధనలు వస్తున్నాయి. అయితే వాటి పరిణామాలను బుద్ధిజీవులు, ప్రజలు కూడా గ్రహించగలిగింది 1990 ల కాలం నుంచే. వాటి ప్రభావంతో తలకిందులవుతున్న జీవితాలను విరసం రచయితలు ఏ ఒక్కరికన్నా ముందుగానే గ్రహించారు. బమ్మిడి జగదీశ్వరరావు ʹపిండొడింʹ, ʹరెక్కల గూడుʹ ʹమట్టితీగలూ – వానపాములుʹ లాంటి సంపుటాల్లో ఉత్తరాంధ్ర శ్రామిక మహిళా జీవితాలను అక్షరబద్ధం చేసారు. సువర్ణముఖి కూడా ఈ దశకంలోనే గిరిజనుల జీవితాల మీద గిరిజన మాండలికంతో అద్భుతమైన కథలు రాసారు. ʹవెన్నెల, సవరోడి గోసిగుడ్డలాʹ ఉందని సువర్ణముఖి చెప్పిన ఒకే ఒక వాక్యం చాలు విప్లవోద్యమపు ఈస్తటిక్స్ మన అనుభవంలోకి రావడానికి.

కొత్త మిల్లీనియంలోకి ప్రవేశించినా జీవితాల్లోకి కొత్త సంతోషాలు లేవని, ఈ ప్రభుత్వాలతో రావన్న గ్రహింపు మధ్య తరగతి ఉదారవాద మేధోవర్గానికి అర్థమయ్యాక ఉద్యమం మైదాన ప్రాంతానికి, చిన్న చిన్న టౌనుల్లోకి నడిచింది. ఈ దశలో విప్లవోద్యమ వచన రచనలకి వస్తు వైవిద్యం పెరిగింది. ఇదే సమయంలో అంతకి ముందు దశాబ్దాల నుంచీ కూడా మూస ఎత్తుగడలు, నడక, ముగింపుల మీద విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అనేక సాహిత్య కార్యశాలల ద్వారా తనని తాను మెరుగు పర్చుకునే ప్రయత్నం ఇంతకు ముందుకన్నా వేగవంతమైంది. జి. కళ్యాణరావు రాసిన ʹఅంటరాని వసంతంʹ తెలుగు నవలా సాహిత్యానికే కొత్త వ్యాకరణాన్ని పరిచయం చేసింది.

2005 లో ప్రత్యేక ఆర్థిక మండళ్ళ రాకతో అసంఘటిత కార్మిక రంగం మరింత పెరిగింది. స్వదేశంలో విదేశం లాంటి సొంత చట్టాలతో వీటి పరిధిలోని కంపెనీలు కార్మికుల జీవితాలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాయి. అమానవీయమైన పని గంటల వల్ల పట్టణాలలోని చిరుద్యోగుల జీవితాలు కష్టాల మయమయ్యాయి. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా వారిని ఆర్గనైజ్ చేయడానికి ఉద్యమం ప్రయత్నాలు మొదలుపెట్టింది. విరసం నుంచి ఇటువంటి ఆర్థిక విధానాల మీద మంచి సాహిత్యం వచ్చింది. ʹక్వీన్ విక్టోరియా మళ్ళీ నవ్విందిʹ లాంటి కథలు ప్రజలకి అసలు వాస్తవాలను పరిచయం చేసాయి.

హిందూత్వ, బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పని చేయడమూ అంటే మత ప్రాతిపదికన పని చేసే సంస్థలూ, రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వాల నుంచీ నిర్బంధాలను, హింసను ఎదుర్కోవడం. కడచిన రెండు దశాబ్దాలుగా మత రాజకీయాలు దేశంలో కొత్త విభజనని తీసుకువచ్చాయి. స్త్రీల మీదా దళితుల మీదా మైనార్టీల మీదా గిరిజనుల మీదా దాడులు విపరీతమయ్యాయి. ఆహార సంస్కృతి మీద నిషేధాలు దేశంలో కనీసహక్కుల లేమిని సూచిస్తుంది. ఈ వివక్షన్నిటి వద్దా విరసం బలంగా నిలబడింది. రాసింది. భిన్న అణచివేత అస్తిత్వాల మీద సాగుతున్న దాడుల నేపథ్యంలో ఆయా అస్తిత్వ శ్రేణులకి ధీటుగా విరసం ఎప్పుడూ అండగా నిలబడుతుంది. ఆ దాడులకి మూలాలను నిజాయితీగా అన్వేషిస్తుంది. పోరాట మార్గాలను నిర్వచిస్తుంది. భిన్న అస్తిత్వాల ఏకీకరణకి ఈ దశాబ్ద కాలంగా విరసం చేస్తున్న కృషి అరుదైనది.

ఇపుడు ముగుస్తున్న ఈ దశాబ్దం, విరసం విస్తరణకి, నగరాలలో తనని తాను లొకేట్ చేసుకున్న పద్ధతులకి గొప్ప మలుపు. ʹఅవును, మేము అర్బన్ నక్సల్స్ʹ నినాదం నిర్భయంగా ప్రజానీకంలోకి చొచ్చుకు పోవడంలో విప్లవోద్యమం సఫలత ఉన్నది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో విరసం ముందడుగులో ఉంది. సంస్థలోని యువతరం కొత్త డిక్షన్ తో వస్తుబలంతో రాస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలనుంచి, గిరిజన ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి, నగరాల నుంచి – అన్ని సందర్భాల నుంచి విరసం తనని తాను స్థాపించుకుంటూనే ఉంది. ఇతరేతర శక్తులు బలహీనపడిన చోట పునః స్థాపన చేసుకుంటూనే ఉంది. విరసం విస్తరిల్లిన కాలాలు, స్థలాలు, సందర్భాలు, సమూహాలు – ఎప్పటికపుడు ఒకదానికి మరొకటి బలమైన చేర్పులే.

No. of visitors : 417
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


చీక‌టి కాలంలో అరుణారుణ అక్ష‌ర వెలుగుదారి

విర‌సం | 17.01.2020 01:50:17pm

విర‌సం 50 ఏళ్ల చ‌రిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంత‌కంటే ఎక్క‌వ స్పూర్తి మంత‌మైన ప్ర‌యాణం అని యాభై వ‌సంతాల విప్ల‌వ సాహిత్యోద్య‌మంపై మాట్లాడిన కాశీం అన్...
...ఇంకా చదవండి

Message from US Coalition to Free Professor Saibaba

US Coalition to Free Professor Saibaba | 17.01.2020 01:43:27pm

Virasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ...
...ఇంకా చదవండి

Noam Chomsky Message

Noam Chomsky | 17.01.2020 01:36:26pm

the 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies....
...ఇంకా చదవండి

నా ఆలోచ‌న‌లు, ఉద్వేగాలు మీతోనే

వరవరరావు | 17.01.2020 01:55:30pm

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ...
...ఇంకా చదవండి

సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

విరసం | 17.12.2019 01:51:02pm

యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక.....
...ఇంకా చదవండి

యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

అనిశెట్టి రజిత | 17.01.2020 01:19:33pm

ఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత...
...ఇంకా చదవండి

మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

కుప్పిలి పద్మ | 17.01.2020 01:22:39pm

యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య...
...ఇంకా చదవండి

మూడు తరాల నవయవ్వనం

పాణి | 17.01.2020 01:40:43pm

ఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ...
...ఇంకా చదవండి

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

బాలసుధాకర మౌళి | 17.01.2020 01:30:04pm

ఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ...
...ఇంకా చదవండి

గోడ మీది బొమ్మ

దాదా హయత్ | 17.01.2020 01:25:42pm

ఈసారి వెకిలి నవ్వు కాదు. గర్జించడానికి రష్యా లేదు. గాండ్రించడానికి చైనా లేదు. అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •