నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు

| సాహిత్యం | వ్యాసాలు

నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు

- అరుణ్ | 04.02.2020 05:38:00pm

బాబు, జగన్ ల లక్ష్యమొక్కటే -వారి వారి సామాజికవర్గాల ప్రయోజనాలే

పోలవరం, అమరావతి తన రెండుకళ్ళు అంటూ నాడు చంద్రన్న రాష్ట్రం లోని మిగతా ప్రాంతాలపై శీతకన్ను వేసాడు. నేడు జగన్ అన్ని ప్రాంతాలను సమదృష్టి తో చూస్తానంటూ మూడు కాళ్ళ నడక మొదలెడుతానంటున్నాడు. కళ్ళు ఎన్నయినా దృష్టి ఒక దానిపైనే వుంటుంది. కాళ్లెన్నయినా చేర్చే గమ్యం ఒకటే. చంద్రన్న కళ్ళ సిద్ధాంతం, జగనన్న కాళ్ల లక్ష్యం ఒకటే –తమ, తమ సామాజిక వర్గాలకు, అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడమే. పొతే, నెహ్రూ కాలం నుండి ʹట్రికిల్ డౌన్ థియరీʹ అంటూ ఒకటేడ్చిందిగా. దాంట్లో భాగంగా కొంత లబ్ది వెనుక బడిన (నేట్టేయబడ్డ) ప్రాంతాలకు, ప్రజలకు చేకూరుతందనేది కాదనలేం.

అధికార వికేంద్రికరణ అంటూ ఈ వ్యవస్థలో ఊహించలేని విధానం ఒకటి ప్రకటించాడు జగన్. ప్రజాస్వామ్యం పేరుతో నియంతలు ఏలుతున్న రాజ్యమిది. ఏ నియంతను నెత్తి మీది నుండి దించి ఏ నియంతను నెత్తికెత్తుకోవాలో అని మాత్రమే నేటి నేతిబీరకాయ ప్రజాస్వామ్యంలో ప్రజలుకున్న ఒకే ఒక హక్కు. అందులోనూ, కులరాజకీయాల పాలనలో, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాలలో, వారు లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం కావచ్చు, బెహన్ మాయవతి కావచ్చు, దగ్గరలోని కెసిఆర్, జగన్ లు కావచ్చు అధికార వికేంద్రికరణ ఎండమావే. అధికార వికేంద్రికరణకాదు, పాలనా వికేంద్రికరణ పేరుతో జగనన్న తన సామాజిక సామ్రాజ్యానికి అన్ని ప్రాంతాలలో బలమైన పునాదులు వేస్తున్నాడు. తన శత్రుసామాజికవర్గ ఆధిపత్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి స్వభావమే కలవాడు కాబట్టే చంద్రన్న తెగ ఆందోళన పడుతున్నాడు. అయితే పాపం అమాయక ప్రజలు ముఖ్యంగా వెనుకకు నెట్టేయబడ్డ ప్రాంతాలవాళ్ళు తెగ మురిసి పోతున్నారు.
ఈ నేపథ్యంలో జగనన్న అధికార వికేంద్రీకరణ(?) ను పరిశీలిద్దాం.

మొదట వెనుకబడ్డ ప్రాంతమయిన రాయలసీమకు జరగబోయే లబ్ధిని చూద్దాం. రాష్ట్ర విభజన తర్వాత శ్రీబాగ్ ఒడంబడికను అమలుచేయాలంటూ, రాజధాని, హైకోర్ట్ తమ ప్రాంతం లోనే ఏర్పాటు చేయాలనే ఉద్యమాలు జరుగుతూవచ్చాయి. అంతేగాక కేంద్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా బుందేల్ ఖండ్ ప్యాకేజిని అమలు చేయాలనీ, కేంద్ర, రాష్ట్ర విద్యా, వైద్య సంస్థలు తమ ప్రాంతంలో నెలకొల్పాలనీ డిమాండ్లు వున్నాయి. చంద్రన్న రెండుకళ్ళ సిద్దంతానానికి ఇవేమీ కనపడక పోగా అనంతపురంలో నెలకొల్పాల్సిన కేంద్ర విశ్వవిద్యాలయాన్ని కోస్తాకు తరలించాడు. తిరుపతిలో ప్రారంభం కావాల్సిన కేన్సర్ ఇన్స్టిట్యూట్ ను తరలించాడు. ఇక సీమ సాగునీటి ప్రాజక్టులన్నీ పోలవరంలో కలసి పోయాయి. చంద్రన్న దిగిపోయాడు. జగనన్న సింహాసనం అధిష్టించాడు. తాను సీమ సాగునీటి ప్రాజక్టులన్నీ చేపడుతానంటూ ప్రకటనలపైన ప్రకటనలు రోజూ గుప్పించండంతో మోడుపడ్డ సీమప్రజల ఆశలు చిగురించాయి. మాటలు కోటలు దాటినా, చేతలు గుమ్మం దాటడం లేదు. ఎవరైనా ఎత్తి చూపుతే జగనన్న భక్తులు, అభిమానులూ ఆర్ధిక ఇబ్బందుల వల్లెవేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇంకా కొంతకాలం వేచి చూడాలంటున్నారు. నిజమేమరి. 110 కోట్లతో వేదవతి నదిపై ఎత్తిపోతల నిర్మాణం చేసి, అత్యంత కరువుపీడిత ప్రాంతమయిన కర్నూల్ జిల్లా పక్షిమ ప్రాంత ప్రజలను కరువునుండి రక్షించేందుకు ఆర్ధిక ఇబ్బందులున్నాయి. అదే విధంగా బ్రిజేష్ కమిటీ మంజూరు చేసిన రూ 400 కోట్ల ఆర్ డి ఎస్ కుడికాలువ పూర్తిచేసి 4 టి ఏం సి ల నీటిని సద్వినియోగం చేసుకొనేందుకు డబ్బుల కొరత. కాని బెజవాడ దగ్గర రూ.585 కోట్లతో మూడు అక్విడక్ట్ల నిర్మాణాలకు మాత్రం జగనన్న ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు లేవు.

ఇలాంటి దృష్టి కోణం వున్న పాలనలో, పాలనావిభాగపు వికేంద్రికరణ ప్రజలకు ఎంతమేలు చేస్తుందో చూద్దాం. తన పాలనవిభాగపు వికేంద్రికరణలో భాగంగా సీమకు హైకోర్ట్ కేటాయించారు. సంతోషమే. కాని, దాన్ని శ్రీబాగ్ ఒడంబడిక అమలు అంటూ ప్రచారం హేయమైనది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమకు రాజధానా, హైకోర్టా అని నిర్ణయించాల్సింది జగనన్నా కాదు. ఆయన ముసుగు సంస్థలు జి ఎన్ రావ్ కమిటీ, బోస్టన్ కన్సల్టేన్సి, హై పవర్ కమిటీలుకావు. ఆ నిర్ణయాధికారం సీమ ప్రజలది. అంతేగాక, శ్రీబాగ్ ఒడంబడికలో సీమకు అత్యంత ప్రాధాన్యమైన కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదులు జలాలలో ప్రధానవాటా, అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు-వీటిని విస్మరించి కన్నీటి తుడుపుగా హైకోర్ట్ ను కేటాయించి రాయలసీమ అభివృద్ధి అంటూ ఆడే దొంగ నాటకాలను సీమ ప్రజలు గ్రహించరనుకోవడం జగన్ అజ్ఞానమే అవుతుంది. అంతేగాక ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖలో పరిపాలన రాజధాని అంటూ రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర సంచాలకుల కార్యాలయాలు నెలకొల్పడం ద్వారా పాలనా వికేంద్రికరణ కాదు కదా, కేంద్రీకరణ జరిగి సీమ ప్రజలకు అందనంత దూరంగా వుంటుంది.

ఉత్తరాంద్ర ప్రజలేమైనా బాగుపడుతారా అంటే అదేమీ ఉండదు. విశాఖను, ఇప్పటికే ఇతరప్రాంతాలవారు కబ్జాచేసారని అక్కడి రచయితలూ, మేధావులు ఆరోపిస్తున్నారు. విలువైన భూములను మీరు కబ్జాచేసారంటే, మీరు కబ్జాచేసారని రెండు ఆధిపత్య సామాజిక వర్గాలు ఒకరిపైన ఒకరు దుమ్మేత్తి పోసుకుంటున్నాయి. వారి ఆరోపణలలో వాస్తవమున్నదని వారి చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు. పొతే ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయవలసినది విశాఖను కాదు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను. అభివృద్దికావాల్సింది, అభివృద్దికి నోచుకోని మశ్చ్యకారులు, ఆదివాసులే గాని రియల్ ఎస్టేట్ అధిపతులుగాదు. వారికి కావాల్సింది దశాబ్దాలుగా పూర్తిగాని సాగునీటి ప్రాజక్టులే గాని కాంక్రీట్ జంగిల్స్ కాదు. జగన్ నిర్ణయం నోరున్న మధ్యతరగతిని సంతృప్తి పరచవచ్చు. అతనికి నోట్లు, వోట్లు రాల్చవచ్చు గాని అక్కడి మెజారిటి ప్రజలకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. అయినా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు ఫైనాన్సియల్ రాజధానిగా వున్న విశాఖను జగన్ అభివృద్ధి చేయాడమంటే అక్కడ జరిగేది అభివృద్ధి వికేంద్రకరణ కాదు, అది అభివృద్ధి కేంద్రకరణ అని గ్రహించాలి. ప్రకృతి సంపదకు నిలయమైన ఉత్తరాంధ్రలో వాటిని సద్వినియోగం చేసే ప్రణాలికలు అవసరం. వాటి అమలుద్వారా అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించాలే గాని, విశాఖ అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ పేరుతో వారిని ఎండమావులవెంట పరిగెత్తించడం తగదు. వారు అలసిపోయి మౌనంగా వుంటారనుకుంటే అది భ్రమే. శ్రీకాకుళం నిప్పురవ్వ యిప్పటికీ ఆరిపోలేదని తెలుసుకోవడం మంచిది.

తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం చంద్రబాబు అమరావతి చుట్టుపక్కల గ్రామాల రైతాంగాన్ని ఆశల సంద్రంలో ముంచాడు.అదిప్పుడు ఉప్పునీరని తెలిసాక అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సామాన్య రైతాంగం, ఆందోళన చెందడం సహజమే. పాపం ఆకాశానికి నిచ్చన వేసారు, అది పాతాళం వైపు జగన్ మల్లిస్తాడని తెలియదు. నిజమైన ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలుంటాయిగాని నేడున్న బూటకపు ప్రజాస్వామ్యంలో వుండేది అధికార పక్షం, శతృపక్ష్యం మాత్రమే. రాజుల పాలనే గనుక, మంచీ, చెడూ చూడకుండా శతృశేషం లేకుండా చేయడమే అధికారపక్ష లక్ష్యం. అయితే ఈ యుద్ధంలో సామాన్యులే అత్యధికంగా బలయ్యేది. ఎవరు గెల్చినా నష్టపోయేది సామాన్య జనమే. గతంలో జరిగినది అదే, నేడు జరుగుతున్నదీ అదే. అమరావతి నుండి కార్యాలయాలన్నీ విశాఖకు తరలించాక ఇక అక్కడ మిగిలేది శ్రీమాన్ స్పీకర్ గారు చెప్పినట్టు స్మశానం లాంటిదే. ముక్కారుపంటలు పండే భూమి చంద్రబాబు సృష్టించిన వలయంలో పడి ఇప్పుడు ఇండ్ల ప్లాట్లుగా మారాక మరల సేద్యం చేసుకోమంటే సాధారణ రైతు సంగతేమిటి? వారికి జగన్ ఇచ్చే జవాబు చంద్రబాబును తప్పుపట్టడంతో సరిపోతుందా? అక్కడ పాలక పక్షం ఆరోపిస్తున్నట్టు అవినీతి జరిగింటే తగిన ఆధారాలతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, దానికి సామాన్య రైతాంగాన్ని బలిచేయడం తప్పు. అంతేగాక అమరావతి భూములిచ్చిన సామాన్య రైతాంగపు దుస్థితిని పట్టించుకోవడం ప్రభుత్వపు భాద్యత కాదా?

ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యకాలంలో రాయలసీమ సాగునీటి అవసరాలపై అత్యంత శ్రద్ద కనపరస్తున్నట్టు అతని ప్రకటనలు తెలియజేస్తున్నాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యంతో పాటు, తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్ ఆర్ బి సి కాలువల సామర్థ్యాన్నిపెంచడంతోపాటు, హంద్రి-నీవాకు సమాంతర కాలువ నిర్మాణం చేసి సీమను సస్యస్యామలం చేస్తానని చెప్పారు. కాని, దానికి చిన్న మినహాయింపు(caveat). ఇంతనీరు కృష్ణలో లభ్యం కాదు కాబట్టి గోదావరి-కృష్ణ అనుసంధానం ద్వారా సీమకు కావలసినంత నీరు అందిస్తారట. పాడినపాట పాడరా పాచిపండ్ల దాసరి అనే సామెత మనకు గుర్తుకు రావడంలో తప్పులేదనుకుంటా. గతంలో చంద్రన్న గోదావరి-పెన్నా అనుసంధానం అంటూ ఊరించాడు. కాని పట్టిసీమ నిర్మాణంతో ఆదా అయిన 80 టి ఎం సి లను సీమకు కేటాయించడం మరిచాడు. ఇప్పుడు జగనన్న గోదావరి-కృష్ణ అనుసంధానం అంటూ మబ్బుల్లో నీళ్ళను చూపి దాహం తెర్చుకోమంటున్నాడు.
కృష్ణలో జలాలు తగ్గిపోయాయని చెబుతున్న ఆయన సలహాదార్లు ఎవరో గాని వారు కృష్ణా జలాల లభ్యతపై ఈ మధ్యకాలంలో వెలువడిన నివేదికలను చదవకపోవడమో లేక ఉద్దేశ్యపూర్వకంగా పరిగణలోకి తీసుకోకపోవడమో జరిగిందని చెప్పవచ్చు. అయినా కేటాయించిన తుంగభద్ర జలాలను వినియోగించుకోలేని దుస్థితిలో వున్న తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువల, కేసి కాలువల ఆయకట్టుదారుల మాటేమిటి? దానికి కృష్ణ-గోదావరి అనుసంధానంతో పనిలేదుగా? అనంతపురం రైతాంగాన్ని కరువునుండి కాపాడేందుకు ఉపయోగపడే, దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న తుంగభద్ర ఎగువ సమాంతరకాలువ ఊసే జగన్ ఎత్తకపోవడానికి కారణమేమిటి?

తుంగభద్ర దిగువ కాలువల ఆయకట్టు స్థిరీకరణకు కరువుపీడిత కర్నూల్ జిల్లా పశ్చిమ మండలాలలో దాదాపు లక్షన్నర ఎకరాలకు నీరందించే వేదవతి ఎత్తిపోతలను నిలుపుచేసేందుకు కారణాలేమిటి?
కేసి కాలువ ఆయకట్టుదారులకు కేటాయించిన 39.9 టిఎంసి ల నీటిలో కనీసం 20 టిఎంసిల నీరు నిలవచేసే గుండ్రేవుల రిజర్వాయర్ జగన్ నిర్మిస్తానని నంద్యాల ఎన్నికల సమయం లో హామీ ఇచ్చాడు కదా. మాట తప్పను, మడమ తిప్పని జగన్ కు సీమ విషయం వచ్చేసరికి గుండ్రేవుల మరిచాడా? లేక ఎన్నికల ముందు చంద్రబాబు సంబంధిత ఉత్తర్వులు ఇచ్చాడని ఆ ప్రతిపాదనను తోక్కిపెట్టాడా? లేక తన తండ్రి దివంగత మహానేత రాజశేఖరరేడ్డి ప్రారంభించిన వాటినే పట్టించుకోవాలనుకున్నాడా? ఈ సాంప్రదాయం కొనసాగుతే, గుండ్రేవుల, ఆర్ డిఎస్ పతకాలు మొదలెట్టాలంటే సీమ ప్రజలు లోకేశ్ కొరకు ఎదురు చూడాలా? చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే అతనిపై చర్యలు తీసుకోవాలి కాని, తమ కక్ష్యసాదింపుకు అమాయక ప్రజల్ని బలిచేయడం సరైనదేనా? తుంగభద్ర జలాలను సద్వినియోగం చేయకుండా వాటిని కృష్ణలో కలిపి శ్రీశైలంద్వారా సాగర్, కృష్ణా డెల్టాలకు లబ్ది చేకూర్చే కుట్రకు గతంలో చంద్రన్న, ఇప్పుడు జగనన్నా పాల్పడుతున్నారని మేం భావిస్తే తప్పేమిటి?
గణాంకాలను పరిశీలిస్తే గత 34 సం.లలో (1984-85 నుండి 2018-19) శ్రీశైలం జలాశయం లో సంవత్సరానికి సగటున దాదాపు 1000 tmc లకు పైగా కృష్ణా జలాలు చేరినట్టు తెలుస్తూంది.. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు 599tmc లు కాగా అందులో నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకై మరియు కృష్ణా డెల్టాకై వదలవలసిన నీరు మొత్తం 344. 60tmc లు మాత్రమే. ఇక రాయలసీమకు కేటాయించినది 132 tmc లలో (బ్రిజేష్ కొత్తగా కేటాయించిన తెలుగుగంగ 25 tmc పోగా), కేసి కాలువ(39.9), తుంగభద్ర ఎగువ కాలువ(32.5), దిగువ కాలువ(29.5), భైరవాని తిప్ప(4.9) 106.8tmc లు తుంగభద్ర జలాలనే విషయం మరవరాదు. అంటే శ్రీశైలం నుండి రాయలసీమకందేది SRBC కి 19 tmc లు, చెన్నై తాగు నీరు1.46 tmc , తెలుగుగంగ 25 tmc పోగా మగిలినవి చిన్ననీటి వనరులు12.24 tmc , అన్యాయంగా చూపిన ఆవిరి నష్టం 11 tmc అంటే, మొత్తం 68.70 tmcలు మాత్రమే..

మరి ఏతావాతా తేలేదేమంటే శ్రీశైలం జలాశయం నుండి కేటాయింపులు నాగార్జున సాగర్+కృష్ణా డెల్టా (344. 60tmc)+ సీమ ప్రాజెక్టులకు(68.70) =412.70tmc లు మాత్రమే. మరి గత 34 సం.లలో (1984-85 నుండి 2018-19) శ్రీశైలం జలాశయంలో చేరిన నీరు సంవత్సరానికి సగటున దాదాపు 1000 tmcలు ఏమైనట్టు? మరో వైపు అవే గణాంకాలు శ్రీశైలం జలాశయం నుండి సాగర్ కు గత 34 సం.లలో (1984-85 నుండి 2018-19) సగటున సం.నికి 930 విడుదల అయినట్టు సూచిస్తున్నాయి. అంతేకాదు మొత్తం కృష్ణా నదిలో లభించే నీరు కూడా తగ్గలేదని, పైగా మరింత ఎక్కువుగా లభ్యమవుతున్నాయని ఈ మధ్యకాలం లో అంటే 2017లో నిర్వహించిన కేంద్రజలసంఘపు అధ్యయనం తెలపడం గమనార్హం.

గతంలో జరిగిన అధ్యయనాల ప్రకారం కృష్ణ నదిలో లభ్యమయ్యే సరాసరి నీటి లభ్యత ఈ కిందివిధంగా తెల్పబడివుంది.

1) మొదటి సాగునీటికమీషన్-(-1901-03 ) - 2,996.TMC
2) కొస్ల కమిటి- ( 1949) - 1,655.19 tmc
3) కృష్ణ-గోదావరి కమీషన్-- (1962 ) - 2,217.05
4) బచావత్ ( 1973 ) - 2,393.98 tmc
5) కేంద్ర జలసంఘం ( 1993) - 2,758.784 tmc
6) కేంద్ర జలసంఘం (2017) - 3,144.42 tmc

ఇక 75% నీటి లభ్యతను పరిశీలించినా బచావత్ -2,130 tmc, బ్రిజేష్-2,173 tmc, కేంద్ర జలసంఘం (2017 )-2,522.52 tmc గా తేలింది. దీనికి కారణం కృష్ణా పరివాహక ప్రాంత విస్తీర్ణ పెరుగుదల కావొచ్చు. గత అధ్యయనాలు కృష్ణా పరివాహక ప్రాంత విస్తీర్ణం 2,51,369 చ.మీ. గా తేల్చగా Geo-spatial డేటా ఆధారంగా కృష్ణా పరివాహక ప్రాంత విస్తీర్ణం 2,59,439 చ.మీ అని తేలింది ("ఈనాడు" 26/11/2017). ఏది ఏమైనా కృష్ణా నదిలో జలాల లభ్యత తక్కువయ్యిందనే ప్రస్తుతం ప్రచారాన్ని గణాంకాలు తప్పుపడుతాయి. జగన్ మాట్లాడుతున్నట్టు, శ్రీశైలానికి అందుతున్న నీరు కేవలం 500-600 టి ఎం సి లే అనుకున్నా, అక్కడినుండి కేటాయించినదే కేవలం 344. 60 tmc+68.70 tmc=412.70tmc మాత్రమేననే విషయం మరువరాదు. అంతేకాదు ప్రతియేటా 100 టిఎంసిల కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నాయనీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 10 సం.రాలకోకమారు నీరు తక్కువగా వచ్చిందనే (75% ఆధారిత జల కేటాయింపులు అంటే 100 సం.లలో 25 సం.లు తక్కువుగా లభ్యమవుతాయనే విషయం జగన్ సలహాదారులకు తెలియదని ఎలా అనుకోగలం) నెపంతో గోదావరి జలాలు తప్ప సీమకువేరే గత్యంతరం లేదని బుకాయించడం దుర్మార్గం.

అంతమాత్రాన గోదావరి జలాలు వృధాగాకుండా నదుల అనుసంధానం చేయడాన్ని మేం తప్పు పట్టడం లేదు. పోతే రాయలసీమ, దక్షిణ తెలంగాణా కరువు ప్రాంతాలకు నీరందించే ఏకైక మార్గం పై అనుసంధానమే అనే ప్రచారాన్ని లభ్యమవుతున్న కృష్ణా జలాలను సీమకు అందకుండా చేసే మరోయత్నంగా, కుట్రగా మేం భావిస్తున్నాం.రాయలసీమకు నీరందకపోవడానికి కృష్ణా జలాల లభ్యత తక్కువ కావడం కారణం కాదని, సీమ కరువుకు కారణం తరతరాలుగా ప్రభుత్వాలు సీమ పట్ల చూపిన, చూపుతున్న వివక్షత కారణమని భావించక తప్పదు.

ప్రస్తుతం కృష్ణ జలాల పంపిణీని పరిశీలిద్దాం. కృష్ణా డెల్టాకు కేటాయించిన 80 tmc లను పట్టిసీమ ద్వారా ఆ డెల్టా పొందుతున్నది. కాబట్టి ఇక శ్రీశైలం నుండి కృష్ణా డెల్టాకు ఆ నీటిని సరఫరా చేయాల్సిన అవసరం లేదు. అలా మిగిలిన జలాలు పట్టిసీమ 80tmc, పులిచింతల 54 tmc, చింతలపూడి 32tmc, శ్రీశైలం, నాగార్జునసాగర్ క్యారీ ఓవర్ నీరు 150 tmc లను, మొత్తం 311 tmc లను అటు దక్షిణ తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టంపాడు, శ్రీశైలం ఎడమ బ్రాంచ్ కాలువ(77 tmc), సీమ లోని హంద్రీ-నీవ, గాలేరు-నగరి, తెలుగంగ, వేలిగొండలకు (150.50 tmc) మొత్తం 227.50 tmcలను పుష్కలంగా నికరజలాలుగా అందివ్వవచ్చు. మధ్యలో వదిలేసిన దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ టైల్ పాండ్ ను పూర్తిచేయడం ద్వారా మరో 165 tmc లు లభ్యమవుతాయి కూడా.

పై ప్రయత్నాలేమీ చేయకుండా, కేటాయించిన నీటికన్న ఎక్కువ వాడుకుంటూ, మరల గోదావరి మళ్లింపు జలాలనూ (పట్టిసీమ, చింతపూడి) వాడుకుంటున్నవారి కాపుకాస్తూ, కృష్ణలో తగినన్నిజలాలు లభ్యం కావడం లేదు కాబట్టి కరువు సీమకు గోదావరి-పెన్నా/గోదావరి-కృష్ణా అనుసంధానాలంటూ "మబ్బులలో నీళ్ళు చూయించి, ముంతలో వున్న నీళ్ళను" కాజేసే మాయ మాటలను ఇంకెంతమాత్రం నమ్మే స్థితిలో సీమవాసులు లేరని పాలకులకు చెబుతున్నాం. ఆ అనుసంధానాల ద్వారా కృష్ణా, సాగర్ ఆయకట్టులను మరింత పెంచుకోవచ్చు. మరిన్ని చేపల, రోయ్యల చెరువులను పెట్టుకోవచ్చు. దానికేం అభ్యంతరం లేదు, ఉండదు కూడా. కాని అనుసంధానాల పేరిట ఎండమావుల్లో దప్పిక తీర్చుకోమంటే మాత్రం సీమ జనం ఊర్కోరు. ఇరువురు ముఖ్యమంత్రులు /గోదావరి-కృష్ణా అనుసంధానాలంటూ కాలక్షేపం చేయకుండా, ఇప్పుడు లభ్యమవుతున్న నీటిని కరువు ప్రాంతాలకు మళ్లిస్తే ప్రజలు హర్షిస్తారు.

నీటి విషయం అలావుంచుతే, అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేవలం పాలనా వికేంద్రీకరణ అంటూ కార్యాలయాలనన్నటినీ ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల జరగేదేమీ ఉండదు. అది పాలనా వికేంద్రీకరణ ఎలా అవుతుందో పాలకులకే తెలియాలి. ఆయా ప్రాంతాలలో లభ్యమయ్యే ప్రకృతి వనరులబట్టి సంబంధిత కార్యాలయాలను నెలకొల్పాలి. మినీ సెక్రటేరియట్ లను మూడు ప్రాంతాలలో ఉండేలాగా చూస్తూ, అసెంబ్లీ సమావేశాలను మూడు ప్రాంతాలలో జరిగేలా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలోనూ వెనుకబడిన ప్రాంతాలయిన ఉత్తరాంద్ర, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఉదాహరణకు కడప జిల్లాలో మైనింగ్ విశ్వవిద్యాలయాన్ని, సంబంధిత పరిపాలన కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అనంతపూర్ లో హార్టికల్చర్ శాఖను, ఐటి హబ్ ను, కర్నూల్ జిల్లా నంద్యాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన శాఖను ఏర్పాటు చేయడం, ఉత్తరాంద్రలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని, హైకోర్ట్ బెంచ్ ని రామయపట్నంలో నౌకాశ్రయం, దొనకొండలో రెండవ రాజధాని ఏర్పాటు చేయడంతోపాటు కేంద్ర, రాష్ట్ర విద్యా, వైద్య సంస్థలు నెలకొల్పడంలో ఉత్తరాంద్ర, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్దికి దోహదం చేయాలి తప్ప మూడు రాజధానులంటూ ప్రజల్ని మభ్యపెడితే తగిన మూల్యం చెల్లించక తప్పదు. అన్ని ప్రాంతాలలోని ప్రజాస్వామ్యవాదులందరూ పరిపాలన వికేంద్రీకరణ వెనుక వున్న కుట్రను బహిర్గతం చేసి ప్రజల్ని దానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్దంచేయాలి తప్ప ప్రాంతీయ దురభిమానంతో తమప్రాంతమే అభివృద్ధి చెందాలనుకోవడం పాలకుల కుట్రకు సామాన్యులను బలి చేయడమే అవుతుంది. ప్రాంతీయ అభిమానం వుండటంలో తప్పులేదు గాని, అది ఇతర ప్రాంతాల ప్రజలకు నష్టం కల్గించేలా వుండకూడదుకదా!

No. of visitors : 177
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి

ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

అరుణ్ | 16.08.2019 07:43:10pm

కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని .....
...ఇంకా చదవండి

దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

అరుణ్ | 17.11.2019 11:14:53am

ఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా?గతం లో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ.వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మం గా వుండే...
...ఇంకా చదవండి

నేరమే అధికారమైన వేళ

అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు బాంబులను పంచాలేధతడు బావాలను పంచాడతడు బావాలను బంధించాలనుకోకు అవి తేనేటీగలై ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •