బుర్రతిరుగుడు కథలు
కొత్త సంవత్సరం వచ్చింది!
కొత్త తరం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది!
థర్టీ ఫస్ట్ నైట్ థియేటర్లో ప్రేక్షక కుర్రకారు వుర్రూతలూగింది! విషెస్ చెప్పుకుంది! ఎమోషన్స్ దాచుకోవద్దు అనుకుంది!
రెడీ... స్టార్ట్... వన్ టూ త్రీ...
సినిమా మొదలు కాబోయింది!
కొందరు కుర్రాళ్ళు తెరముందుకు వెళ్ళి రెండుపక్కలా అటూ యిటూ నిల్చున్నారు!
ʹఏంటిది?ʹ
ʹసినిమాʹని తిరగేస్తే ʹమానిసిʹ అన్నారు! మానిసి అంటే మనిషి అన్నారు! ఆడది అన్నారు! యోధుడు అని అన్నారు! భటుడు అని కూడా అన్నారు!
ʹసరే, తెర ముందు యేంటిది?ʹ
తెర వెనుక కథలు తెలుసన్నారు! తెరమీది కథలూ తెలుసన్నారు!
ʹమరి?ʹ
ఇది తెర ముందు కథ అన్నారు!
అల్లరి పిల్లలు అనుకుంటా సినిమా మొదలెట్టేసారు!
తెరమీద ʹఖైనీ గుట్కా తంబాకూ పాన్ పాన్‌మసాలా... మన దేశంలో వొక అతి పెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సరుకు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేం యితని స్వరపేటికను తొలగించాంʹ అని డాక్టర్లు అనగానే- ʹదేవుడిపైనే భారం వేశాంʹ అంది పూడుకుపోయిన గొంతుతో గోపాల్ భార్య సుశీల. ʹఈ పేషెంటు వొక ఫుట్ బాల్ ఛాంపియన్. ఇతనికి గొంతు క్యాన్సర్. ఇప్పుడది మెదడుకు కూడా సోకిందిʹ అని బాలూ మీద డాక్టర్ల వాయిస్ వోవర్ వస్తుంటే, ʹఆడిన ప్రతీచోటా తనే గెలిచేవాడుʹ బాధగా అన్నాడు బాలూ సోదరుడు దీప్. ʹపొగాకు కేవలం మగవారికి మాత్రమే సమస్య కాదు, రేఖకు నాలుకను క్రింది దవడనూ తొలగించాంʹ అని డాక్టర్ల మాటల మధ్య ʹతన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చిందిʹ రెండు వేళ్ళూ చూపిస్తూ మూక్కెగేసుకుంటూ చెప్పాడు ఆమె సోదరుడు శంకర్. ʹపొగాకు కుటుంబాలను నాశనం చేస్తుందిʹ మళ్ళీ అదే గొంతు!
ʹపొగాకు ప్రాణాలను తీస్తుంది. మానుకోండి నేడేʹ అనే పెద్ద అక్షరాల మధ్య ʹప్రజాహితం కాంక్షించి జారీ చేసిన వారు ʹమినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాʹ అని వచ్చింది!
రక్తమాంసాలు వస్తుంటే చూడలేక ʹవోʹ అని అరిచారు అమ్మాయిలూ అబ్బాయిలూ!
తెరమీది దృశ్యం ఆగింది!
ʹష్...ʹ
ʹగోపాల్ స్వరపేటికను యెత్తుకు పోయిందెవరు?ʹ
ʹఫుట్ బాల్ ఛాంపియన్ని ఆడకుండా చేసిందెవరు?ʹ
ʹరేఖ రెండుగాజులూ పట్టుకుపోయిందెవరు?ʹ
వరుస ప్రశ్నలు! అందరిదీ ఒకే గొంతు!
ʹఇంకెవరు? మన నాయకులే!ʹ అరుపులూ కేరింతలూ!
సినిమా ముందుకు నడిచింది!
ʹపొగ త్రాగడం కాన్సర్ కారకం మరియు ప్రాణాంతకంʹ అని వచ్చింది!
ఒక్కసారిగా యువతరం గగ్గోలు పెట్టింది! తెరమీది అక్షరాలు అలానే నిలచిపోయాయి!
ʹష్...ʹ
ʹకాన్సర్ కారకమైన ప్రాణాంతకమైన సిగరెట్ పాన్ గుట్కాలని యెవరు అమ్ముతున్నారు?ʹ తెరకు అటూ యిటూ నిల్చున్న కుర్రకారు అడుగుతోంది!
ʹప్రభుత్వమే అమ్ముతోంది!ʹ తెరముందు కూర్చున్న కుర్రకారు చెప్తోంది!
ʹమద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరంʹ... మద్యాన్ని యెవరు అమ్ముతున్నారు?ʹ
ʹప్రభుత్వమే అమ్ముతోంది!ʹʹ
తెరమీద ఫ్రేమ్స్ కదలబోయి గోలకు ఆగిపోయాయి!
ʹమాదక ద్రవ్యాలు మత్తు పదార్ధాలు ఆరోగ్యానికి హానికరం... అవి సేవించడం చట్టరీత్యా నేరంʹ తెరముందు కుర్రాళ్ళు వొక్కగొంతై చదివారు! తెరమీది వాయిస్ వోవర్ వెనకబడింది!
ʹసేవించడం చట్టరీత్యా నేరమైతే- సేల్ చేయడం? సేల్ చేసేవారికి కోపరేట్ చేయడం?ʹ
ʹనేరం కాదు, నడిపే నేతలకు అసలు చట్టమే లేదుʹ
ఒక్కగొంతై థియేటర్ దద్దరిల్లింది!
తెరమీది అక్షరాలు కదిలి ఆగాయి మళ్ళీ!
ʹఈ చిత్రంలో నటించిన జంతువులూ పక్షులూ హింసకు గురిచేయబడలేదు!ʹ
ʹఈ చిత్రం చూసినవారిని యెటువంటి హింసకూ గురిచేయబడలేదుʹ అని కదా వెయ్యాలి!ʹ
ఒక్కసారిగా నవ్వులు!
ʹసినిమాల్లోని పక్షులకీ జంతువులకీ వాటి ఆరోగ్యానికి డోకా లేదని వెటర్నరీ డాక్టరుతో సర్టిఫికేటు తీసుకోవడం మంచిదే, అలాగే సినిమా చూసిన మనుషుల ఆరోగ్యానికి డోకా లేదని కూడా సర్టిఫికేటు యిస్తే మరీ మంచిదిʹ అక్కడున్న అమ్మాయిలది వొకే మాట!
తెరమీది సినిమా మళ్ళీ కదిలి ఆగింది!
ʹఈ చిత్రంలోని సంఘటనలు, పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితములు మాత్రమేʹ
ʹకల్పితం కాదు, ఫలానా సినిమాకి కాపీ కదా?ʹ
ʹరీ మేక్ కాదు, ఫ్రీ మేక్... తెలుగీకరణ!ʹ
ʹవేరే చెప్పాలా? నిజ జీవితాలకుదగ్గరగా లేని పాత రోత కథʹ
కుర్రకారుది యెవరి వెర్షన్ వారిది!
సినిమా ఆపరేట్ చెయ్యడం మానేసి చుట్ట వెలిగించుకున్నాడు ఆపరేటర్, తేలాక చూద్దామన్నట్టు!
అభిమానులు తొలిసారిగా పాలాభిషేకాలు మానేసి పాలు కాచుకొని తాము తాగి ఆకలితో వున్న బీదాసాదలకు పంచారు! పళ్ళు కూడా!
కటౌట్ ని గెటౌట్ అనకుండానే బోర్లా పడింది!
పూలను చెవిలోంచి పూలదండలను మెడలోంచి తీసేసి అవతలకి విసిరేశారు! నెత్తికి కట్టుకున్న గుడ్డలు విప్పేశారు! నుదిటన రాసుకున్న రంగుల కుంకుమ చెరిపేశారు!
కళ్ళకు కట్టిన పొరలు తీసేశారు! అవి పొరలు కావు వెండి తెరలు అని విమర్శకులు సమీక్షలు రాసేశారు!
తమని తాము చూసుకొనే కథ కావాలన్నారు కొందరు కుర్రాళ్ళు!
కథ నాతో పాటు నేలమీద నడవాలన్నారు యింకొందరు కుర్రాళ్ళు!
కథ మానవమాత్రులది అయ్యుండాలని ఆశించారు మరికొందరు కుర్రాళ్ళు!
మొత్తానికి రేపటి కథ మారుతుంది! మారి తీరుతుంది! మారాలి! గట్టిగా అనుకున్నారు అంతా!
సినిమాలో కథే కాదు, మన కథనీ మనమిలాగే మార్చుకోవాలని కూడా అనుకున్నారు!
ఇప్పడు అసలు సినిమా మొదలైంది! అది నడుస్తుంది! నడిపిస్తుంది!!
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |