డిసెంబర్ 2019 అరుణతార మాసపత్రికలో కే.వీ. కూర్మనాథ్ గారు రాసిన "వారియర్" కథ చదువుతుంటే అన్ని భాషల్లోకి అనువదించ తగిన అనువదించాల్సిన అరుదైన మంచి తెలుగు కథల్లో ఈ కథ ఒకటని అనిపించింది.
ఇట్లా అనిపించే తెలుగు కథలు నిజంగానే చాలా అరుదుగా ఉంటాయి.
కథలు ఎలా పుట్టుకొస్తాయి ?కథలు ఎందుకు ఎలా ఎవరికోసం పుడతాయి? కథ ఆయుష్షు ఎంత? కథ ప్రయోజనం ఏమిటి? ఎవరికి?అంతిమంగా కథ తాలూకు ప్రయోజనం, ఫలితం ఏమిటి? ఇవన్నీ ముఖ్యమైన విషయాలు అనుకుంటే వాస్తవిక అనుభవం నుంచి పుట్టిన కథకు ,ఊహాజనితమైన కథలకు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది.
వారియర్ కథలో కథానాయకుడు ఎవరో కాదు, పాఠకుడే ఈ కథలో కథానాయకుడు.!
పాఠకుడు తనను తాను కథలో ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఏ తరగతి పాఠకుడికైనా , కథ మంచి అనుభవాన్ని కలిగిస్తుంది.
ఈ కథలో ఉటంకించిన చాలా పదాలు మంచి కథా శీర్షికలు గా అనిపిస్తాయి. ఒక కథలో రచయిత వాడిన పదాలు అనేకం కథా శీర్షికలు గా కథాంశాన్ని బలపరిచే విధంగా ఉదహరించడం రచయిత ప్రతిభకు నిదర్శనం.
రచయిత యొక్క పరిశీలనా శక్తి బలంగానూ , మనస్తత్వ పరిశీలనా సామర్థ్యం చాలా శక్తివంతం గాను ఉన్నదని ఈ కథ లోని ప్రతి వాక్యం తెలియజేస్తుంది.
ఈ కథ చదువుతున్నప్పుడు ఈ కథ స్థల కాలాలకు అతీతమైన కథగా నిలిచిపోతుంది. ఈ కథ ప్రపంచంలో ఎక్కడైనా జరగడానికి సంభావ్యత కలిగిన కథ. చాలా సాధారణమైన విషయంగా అనిపించినప్పటికీ చాలా అసాధారణమైన చాలా ప్రమాదకరమైన ధోరణి లోకి మానవుడు ఎలా మారిపోతున్నాడు ?
మానవ సంబంధాలు ఎలా మారిపోతున్నాయి? స్పందన ,ప్రతిస్పందనకు అర్థం వర్తమాన కాలంలో ఎలా మారిపోతుందో ఈ కథ చెబుతుంది. ఈ కథ సంపూర్ణంగా చదివాక కొత్త ఆలోచనలు వస్తాయి.
సాధారణంగా మంచి కథ చదివాక పాఠకుడికి ఆ కథ గురించి ఆలోచించటానికి గాను కథకుడు కొంత ఖాళీ స్పేస్ ను వదిలిపెడతాడు. అట్లా ఈ కథలో కొంత స్పేస్ పాఠకుడికి వదిలివేయడం జరిగింది. కథ కి వారియర్ అనే పేరు ,ఈ కథకు వేసిన చిత్రం ఈ కథ పాఠకులకు నేరుగా సూటిగా స్పష్టంగా వెంటనే చేరే విధంగా ఉంది.
ఈ కథలో కథా శీర్షికలుగా స్పురించే పదాలను చూద్దాం.
"పోనీలే ఇప్పుడు ఎందుకు,
ఒకసారి చూసి పడుకుందాం,
అమ్మయ్య, సగమే ఉంది, నోటిఫికేషన్స్, likes, ప్రతిస్పందన, వైరల్, సూపర్ ,అదిరి పోయింది, చాలా బాగుంది, చాలా అవసరమైన పోస్టు, ఇన్బాక్స్, బొటనవేలు, అన్యాయం, ఎంత చూసినా ఇంతే, పెంట కుప్ప, ట్విట్టర్ ,వాట్సాప్, టిక్ టాక్, పనిలేదు జనాలకు ,ఫేస్బుక్ , కామెంట్లకు వచ్చిన కామెంట్లు, ట్యాగ్ లు, అనవసరంగా హారన్లు కొట్టేవాళ్ళు గాడిదలు, హింస ,ఏమైంది సార్, న్యూసెన్స్, అవును, పేపర్ ని చూడలేదా?, లాగిన్ ,టైం లైన్, షేర్ ,కామెంట్, ట్రాఫిక్, ఊ..ఇక ఇంతే మారడు, నటనలు, ఏం జరుగుతుందో?, మళ్లీ అక్కడే నా, రేపు కూడా.., ట్రాఫిక్ జామ్..".
***
ఈ కథలో మొదట ఆకర్షించే అంశాలు సూటిదనం, క్లుప్తత పదాల సరళత, శిల్పం.
సరిగ్గా ఎక్కడ మొదలు కావాలో అక్కడే ప్రారంభమై ,ఎంత చెప్పాలో అంతే చెప్పి, ఎక్కడ ఎలా ముగించాలో అక్కడ అలాగే ముగించడంలో కథకుడి నైపుణ్యం తెలుస్తుంది.
నిర్వికారంగా చెప్పిన ఈ కథలో కథకుడు కనపడడు కానీ ,కథ ఆద్యంతం పాఠకుడు కథలో తనను తాను చూసుకుంటాడు.
మనుషులు మనుషులతో కాక సెల్ఫోన్లతో వాట్సాప్ ల తో ఫేస్బుక్ ల తో ట్విట్టర్ల తో అంతర్జాల మాధ్యమాల్లో బ్రతికేస్తూ ఒక ఇంట్లోనే ఉంటూ లే ఒకర్నొకరు పలకరించుకోవా లంటే సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం ద్వారానో, సంక్షిప్త సమాచారాన్ని చేరవేయడం ద్వారానో సమాచారాన్ని పంపిణీ చేసుకోటానికే పరిమితమై, అనుభూతుల ప్రవాహానికి దూరమవుతున్న సత్యాన్ని
ఈ కథలో చాలా స్పష్టంగా రచయిత తెలియజెప్పాడు.
మనుషుల స్పందనలు, ప్రతిస్పందనలు, ఆలోచనలు,అనుభూతులు సమస్తం బొటనవేలికి చూపుడు వేలు కే పరిమితమై పోవడం లోని విషాదాన్ని ఈ కథలో గమనించవచ్చు.
రోజువారీ జరుగుతున్న అనేక అనేక సంఘటనలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాక్షిగా నిలిచే మనిషి -చర్య ద్వారా మనసుతో స్పందించాల్సిన మనిషి కేవలం వాట్సాప్లో ఫేస్బుక్లో అంతర్జాలంలో తన స్పందన తెలియజేయడానికే పరిమితమై పోతున్నాడు. సమూహం కావాల్సిన మనిషి ఏకాకి అవుతున్నాడు. రాత్రయినా పగలైనా ఏ స్థాయి మనిషి అయినా తడుము కుంటున్నది తన సహోదరులని కాదు, సహచరులని కాదు, తలిదండ్రులను కాదు, పిల్లలను కాదు..
కేవలం సెల్ ఫోన్లుని మాత్రమే.
అవి మాత్రమే మనిషిని శాసిస్తున్నాయి. మనుషుల మధ్య దూరం తగ్గించేందుకు బాగానే ఉపయోగపడ్డాయి కానీ అదే సమయంలో మనసుల మధ్య విపరీతమైన దూరాన్ని పెంచడానికి కూడా డ
సెల్ ఫోన్స్ కారణమవుతున్నాయి.
మనుషులు తమ చర్యల ద్వారా, కార్యాచరణ ఆచరణ ద్వారా, జీవిత విధానం ద్వారానో కాక, కేవలం సెల్ ఫోన్స్ లో తమ స్పందనను, భావ ప్రకటను ప్రదర్శించడం ద్వారా అంతర్జాలంలో గుర్తింపు కోరుకుంటున్నారు. సమాజంలో కంటే ఎక్కువగా గ్రూపులు అంతర్జాలంలో ఏర్పడ్డాయి. ఈ గ్రూపుల మధ్య మనుషుల మధ్య ప్రమాదకరమైన పోటీ ఏర్పడింది. ఎంతమంది తమ భావప్రకటనని చూశారు? ఎన్ని లైక్స్ వచ్చాయి ?
జీవితంలో అనూహ్యంగా ఎదుటి వారి యొక్క గుర్తింపును, ఎదుటి వారి నుండి గౌరవాన్ని ఫేస్బుక్లో వాట్సాప్ లో వెతుక్కోవడం ఒక విపరీత పరిణామం.
బస్టాండ్ లో బస్సుల్లో రైళ్లల్లో రైల్వే స్టేషన్స్ లో, కళాశాలలలో కార్యాలయాలలో, ఆసుపత్రులలో,ఎక్కడైనా సరే, ఆఖరికి అది స్మశానం కావచ్చు పడకగది కావచ్చు లేదా నడిరోడ్డు కావచ్చు. చేతిలో సెల్ఫోన్ ఉండాల్సిందే. మాటిమాటికి సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూసుకోవాల్సిందే. లైక్స్ వెతుక్కోవాల్సిందే.
మనుషుల సంతోషాలు ప్రశాంతత ఇప్పుడు కేవలం సెల్ ఫోన్స్ పైన మాత్రమే ఆధారపడి ఉన్నాయి.
ఉన్నత తరగతుల- రద్దీ
మనుషుల ఆకలిదప్పులను సెల్ఫోన్ తీరుస్తున్నాయి. అన్ని అవసరాలకు ఇప్పుడు సెల్ ఫోన్ అత్యంత నిత్యావసరమై పోయింది.
ఇంట్లో జరిగే సంఘటనలకు ఇంటి చుట్టుపక్కల జరిగే సంఘటనలకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు ఏ మాత్రం స్పందించని మనుషులు ఇప్పుడు ప్రపంచ పరిణామాల పట్ల జాతీయ స్థాయి విషయాల పట్ల అంతర్జాతీయ సమస్యల పట్ల, వారి ఉచిత అభిప్రాయాలను ఉచితంగా పంపిణీ చేసుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
ఈ విషాదకర విపరీతమైన ప్రమాదకరమైన పరిణామాలే ఈ కథాంశం.
ఇదంతా ఒక వైపు. మరోవైపు ఒక గొప్ప సామాజిక విప్లవానికి సెల్ఫోన్ నాంది పలికింది. భావ ప్రకటనకు భావాల వ్యాప్తికి తక్షణ సమాచార పంపిణీకి సెల్ఫోన్ అత్యంత కీలకమైన పోయింది.
సమాజంలో వచ్చిన, మనిషి మనస్తత్వం లో వచ్చిన మార్పుకు చక్కటి నిదర్శనం ఈ కథ. ఈ కథలోని కథ ఏమిటో చూద్దాం!
****
అర్ధరాత్రి నిద్ర లేచిన అరుణ్ సెల్ఫోన్ కోసం తడుముకుంటాడు.
మొదట పోనీలే ఇప్పుడు ఎందుకు అనుకుంటాడు.
సోషల్ మీడియాలో నిన్న జరిగిన చర్చలు కలవరపెట్టతాయి.
ఒక్కసారి చూసి పడుకుందాం అని కూడా అనుకుంటాడు. నిద్రలేచిన అతను ఫోన్ వెతికి చేతిలోకి తీసుకోగానే అమ్మయ్య అనుకుంటాడు.
బ్యాటరీ అప్పటికీ సగమే ఉంటుంది. నోటిఫికేషన్స్ బటన్ నొక్కుతాడు.
పడుకోబోయే ముందు తను పెట్టిన పోస్ట్ కి వచ్చిన లైక్స్ చూసుకుంటాడు. ఎవరెవరు ఏమేం కామెంట్ పెట్టారో చూసుకుంటాడు.
తను ఇతర పోస్ట్ ల కింద పెట్టిన కామెంట్ కి ప్రతిస్పందన చూసుకుంటాడు. తన కామెంట్ కి ఏ రకం చిహ్నాలను బదులుగా ఇచ్చారో చెక్ చేసుకుంటాడు.
ఇక ఫేస్బుక్ చాలు చాలా ఎక్కువైంది ఎంత చూసినా ఇంతే అనుకుంటాడు. తర్వాత ట్విట్టర్ లోకి వెళ్తాడు.
నోటిఫికేషన్లు చూడటం అయ్యాక వాల్ మీద పోస్టులు చదవటం మొదలు పెడతాడు. ట్విట్టర్లో స్పందనలు ప్రతిస్పందనలు అయ్యాక, అప్పుడిక చాలనుకుని వాట్స్అప్ లోకి వస్తాడు. ఓ పక్క చూడాల్సింది చూశాక టిక్ టాక్ ఓపెన్ చేస్తాడు. "అసలు ఇంత టైం ఉంటుందో ఇన్ని వీడియోలు చేయటానికి. పనికి వచ్చేవి ఏమన్నా పెట్టొచ్చుకదా " అనుకుంటాడు.
పడుకుని దుప్పటి కప్పుకొని మరోసారి ఫోన్ తీస్తాడు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు
." పనిలేదు జనాలకు" అని అనుకుంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటాడు.
***
ఉదయం డోర్ బెల్ మోగితే గాని తెలివి రాలేదు అతడికి . హాల్లోకి వచ్చి కూర్చుని ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు, ట్విట్టర్ ఓపెన్ చేస్తాడు, వాట్స్అప్ ఓపెన్ చేస్తాడు, ఫోన్ చూసుకుంటూ టిఫిన్ చేస్తాడు ,టీ తాగుతాడు.
***
యధావిధిగా సెల్ఫోన్ చూసుకుంటూ .. బయలుదేరుతాడు. ట్రాఫిక్ విసుగు తెప్పిస్తుంది ."ఎన్ని రోజులు ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు ఈ హింస" అనుకుంటాడు.
చూసి చూసి న్యూసెన్స్ అని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. పక్క సీట్లో కొలిక్కి రమణ ఆఫీసులో అంటాడు ట్రాఫిక్ గురించి మాట్లాడుతూ..
" అవును పేపర్లు చూడలేదా దారి మళ్లిస్తున్నారు ఇచ్చారు కదా "అంటాడు రమణ.
అదీ కథ. కేవలం ఫోన్ మాయలో పడిపోయి రోజువారీ జీవితంలో పట్టించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలను కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆఫీసు సమయంలో వరుసగా మళ్లీ అంతర్జాల మాయ లోకి వెళ్ళిపోతాడు. లైక్స్ కామెంట్స్ షేర్సు..
లంచ్ టైంలో కూడా సెల్ ఫోన్ తోనే. లంచ్ తర్వాత రివ్యూ మీటింగ్ ఆ తర్వాత సెల్ ఫోన్. ఇల్లు చేరుకొనే సరికి ఎనిమిది అవుతుంది. భార్య ఏదో చెబుతూ ఉంటుంది.ఊ.. కొడతాడు. కొన్నిటికి ఊ.. కూడా కొట్టడు. భార్య అనుకుంటుంది.. అసలు
తను చెప్పేది వింటున్నాడా లేదా అని ఆమెకు అనిపిస్తుంది."ఇక ఇంతే లే మారడు"అనుకుంటుంది.
పడుకోబోయే ముందు ఇంట్లో చేయాల్సిన పనుల్లోకి ఆమె మునిగిపోతుంది.
భోజనం తర్వాత టీవీ ఆన్ చేస్తాడు. చానల్స్ మార్చిమార్చి తిప్పితిప్పి చూస్తాడు.
టైం చూస్తాడు .పదకొండు అవుతుంది."ఇక పడుకుందాం" అనుకుంటాడు.
బాత్రూంకి వెళ్లి వచ్చి మళ్లీ సెల్ ఫోన్ ఆన్ చేస్తాడు."ఒక్కసారి ఏం జరుగుతుందో చూసి పడుకుందాం"అని అనుకుంటాడు.
వాట్సాప్ లో మిత్రుడు పంపిన సందేశం చూస్తాడు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు నిరసనగా జరిగే ధర్నా కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది.
"అబ్బా మళ్లీ అక్కడేనా ?అంటే రేపు కూడా ట్రాఫిక్ జామ్ అన్నమాట"అనుకుంటాడు.
ఇది సంక్షిప్తంగా కథ!
పాఠకుడు కథలో తనను తాను చూసుకుని ప్రశ్నించుకొని ,
సంస్కరించుకునే దిశగా కథ రాయడం రచయిత సునిశితమైన దృష్టి కి నిదర్శనం. కథ లో నుంచి బయటికి రావడం కాదు ఈ కథ చదివిన తర్వాత పాఠకుడు మళ్ళీ కథ లోకి ప్రవేశిస్తాడు. తనను తాను పరీక్షించుకుంటాడు.
అట్లా... కథ చదివాక మళ్లీ కథలోకి పాఠకుడిని చేయి పట్టుకొని లాక్కోవడమే రచయిత పరిణిత శిల్పం.
Type in English and Press Space to Convert in Telugu |
చనుబాలధార లాంటి ప్రేమను అందించిన కథ "అర్బనూరు"కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రదేశాలు, కొన్ని సంఘటనలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని పేర్లు సైతం మనిషిని బ్రతికిస్తాయి. అది ఊరి పేరు కావచ్చు మనిషి పేరు కావచ్చు,చన... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |