బరువెక్కిన
హృదయం కదా
మాటలు
పెగలడం లేదు
గాయాలతో నెత్తురొడుతున్న మాటలు
కాగితం మీదో గాలి పైనో దొర్లడం దుర్లభం
ఇపుడు మాట ముఖ్యం కాదు భాష కూడా కాదు
భావస్ఫూర్తి అందితే చాలు
గాయాలు గాధల నదులై పారిన చోట నిలబడ్డాను
గొంతుకడ్డం పడడం దుఃఖానికి కొత్తకాదు
అదెప్పుడూ మాకంఠం మీది కత్తే
ఊహించిన దృశ్యం వాస్తవమై కనులెదుట రెపరెపలాడుతూ ఉంది
పదాలు పెగలకపోయిన అవ్యక్తానుభవపు
మెరుపు మేనంతా పాకుతుంది
దాన్ని
చూపున్న ప్రతి కన్ను
స్పందించే ప్రతి హృదయం
పసిగడుతుంది
మాటలదేముంది ఎపుడైనా దొర్లుతాయి
చెమ్మ నిండిన చూపు
వేడి కరచాలనం
గాడమైన కౌగిలింత
గొప్ప భావ వ్యక్తీకరణలే కదా
అనుభవాల అనుభూతి వర్షంలో అపుడపుడూ తడవాలి కదా
ఒకరి కన్నుల తడి
ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య
సందర్భం కంటున్న కల ఒకటి కావడం
ఎంత కాకతాళీయం
ఒకటే బరువు ఇన్ని గుండెలు
ఇన్నాళ్ళుగా ఎలా మోస్తూ వచ్చాయో
ఇక్కడ చేరిన జనం స్వప్నం గాలితో కదులుతున్న నిశ్శబ్దమై శిలాఫలకంలా నిలబడిపోయింది
ఒక్క సారిగా బరువంతా దిగిపోయినట్టో
ఊహ ఎడారిలో ఒయాసిస్సై ఎగురుతోంది
ఏనభై ఏళ్ళ వృధ్ధులు కర్రల ఊతంగా
దూరాన్ని అధిగమిస్తూ కదులుతుంటే
తూర్పు కనుమలను ఎవరో తూర్పారబెట్టినట్టు
నివ్వెరపోయాయి
జోడెద్దులను అనుసంధానించే కాడి లాగా
రెండుకొండల మధ్య నుంచి పారుతూ క్రిష్ణమ్మ
ఆత్మీయ పలకరింపు అనంతమైన ఆశ్వాసనైపోయింది
ప్రాణాలు
కణకణాలుగా విడిపోతూ అడుగుల్లో అడుగులేస్తూ
మానవ పాదాలు వామనుడి పాదాలై కొండలను గుట్టలనూ కప్పేస్తూ
అనిర్వచీనీయ ఆనందపు
సంతకం
ముఖంమ్మీద నర్తిస్తున్నపుడు
నన్ను నేను మరిచిపోక ఏం చేస్తాను
నాలాగే కనబడుతున్న ఇతరులలో నన్ను నేను చూసుకోక ఏం చేస్తాను
ఒకరి నుంచి ఒకరిలోకి విద్యుత్తేదో పాకుతున్నట్టు
అన్ని అడ్డంకుల్ని దాటేసే తెగింపు కట్టలు తెంచుకొని
వడివడి అడుగుల మధ్య అలుగు ప్రత్యక్షమై స్వాగతం పలుకుతున్నట్టు
నా ఉనికి తారసపడూతున్న ప్రతిఒక్కరిలో చూసుకుంటూ
కరచాలనాలే సంభాషణలై
ముఖమ్మీద ప్రకటితమౌతున్న భావావేశపు పరిచయాల్లో
నిశ్శబ్దం అతి పెద్ద నినాదమయ్యింది
ఏ ఒక్క ముఖమూ తెలిసినది కాదు
కానీ అందరూ నా వాళ్ళేనన్న భరోసా
ఒకరినొకరు
చూపులతోనే పలకరించుకుంటూ
మౌనంగా కార్యంలో నిమగ్నమై
చాన్నాళ్ళు
గొర్రు రుచి ఎరుగని నేల
తడిపుష్పాలని జల్లుతున్న ఆకాశాన్ని
చూసి
మౌనపు ముద్దులను పైకి విసిరేసినప్పుడు
మేఘాల పెదవులు ఎర్రగా కందినపుడు
తొలి రాత్రి తొలి అనుభవపు మైకం వొదలని కొత్త పెళ్ళికొడుకులా కాలంవళ్ళువిరుచుకుంటుంది
అలాంటి
దివ్యానుభవ ఊయలలో
ఊగూతూ ఉన్నాను
దాహం మనుషులను విడగొట్టలేదు
దాహం మనుషుల మధ్య ప్రేమ పంచుతోంది
దాహం మనుషులకు కర్తవ్యం బోధిస్తుంది
దాహం వారధిపై జనసంద్రం కదులుతూ లక్ష్యం వైపు అడుగులేస్తూ
అలసిగుండెలు మ్రోగిస్తున్న కసి దండోరా
తరతరాల
నరాల్లో నెత్తురై ప్రవహిస్తూన్నట్టుంది
కంట్లో ఎర్రజీరై నిలబడిపోయిన దాహం
చెవుల వద్ద రొద చేసే జోరిగలాంటి దాహం
జనం వలస వెళ్ళినపుడు పల్లెల్లో
ఒంటరిగా నాట్యం చేసే దాహం
రైతు ఆత్మహత్య చేసుకున్నపుడు ఆలి తాళి ని ఎగతాళి చేసే ఉరితాడూ దాని చుట్టూ ముడులు వేసిన అప్పు లాంటి దాహం
పిల్లల చదువు అటకెక్కి భుజం మీద నాగలెక్కి
బతుకును బంజరులో తవ్వితీయడానికి ప్రయత్నిస్తున్నపుడు కంఠానికడ్డుపడే దాహం
వలస వెళ్ళిన జనం తిరిగొస్తారో లేదో తెలియని సందిగ్ధంలో ఇంటిగడపల పై తాళపు కప్‌పై వేలాడే దాహం
యువశక్తి మాయమై ముదసలి శ్వాసల తేలిక దనాన్ని మోసే నవారు మంచాల పై పాతదుప్పటిలా పరుచుకున్న దాహం
దాహం దావానలపు మంటల్లా చుట్టుముట్టినపుడు
పీడకలల కంచెం పూట పూట ఎదురుపడుతుంటుంది
నాలుక మీది దాహపు ముళ్ళను తుంచడం కోసం
నీళ్ళొక్కటే నిజఖఢ్గం
తరతరాల కంటి కొలనుల్లో మంచై నిలిచిపోయిన జలం
వాస్తవరూపం దాల్చి
చెరువుగానో సెలయేటి నడకగానో
బ్రహ్మోత్సవాల్లో అన్నమయ్య కీర్తనలా
చెలరేగి పారే కాలువ గానో
కలలు కనడంలో వయసు మీద పడ్డ శతాబ్దాల కళ్ళ కలతకి
ఫుల్స్టాప్ పెట్టేలా కదిలిన రైతు దండు
జన విస్ఫోటనంలో నేనో తునకనై
నేల తల్లి బిడ్డలు
నిలువెత్తు ఆకాశాలైనపుడు
ఆశల రంగువిల్లుల పడువల్లో
నక్షత్రాలు సెదదీరుతాయి
వెలుతురి విస్తరణ గురించేం
బెంగలేదు
సీమంతా నెలవంకలు
కొడవళ్ళు తీసుకొని బయలుదేరాయి
నా ఎదురుగ్గా కదులుతున్న జల తరంగాల సముదాయంలో తన ప్రతిబింబాన్ని తదేకంగా
చూసుకుంటున్న పెద్దాయన భుజాలు
పట్టుకొని ఏం చూస్తున్నావు తాత అని అడిగితే
నేనెప్పుడూ నన్ను నేను నీళ్ళలో చూసుకోలేదు మనవడా అంటూ విసిరిన చిరునవ్వు
పచ్చని పొలంమీది చల్లగాలై చుట్టుముట్టింది
నమ్మకం కంటే గొప్ప విజయం ఉంటుందా.
Type in English and Press Space to Convert in Telugu |
తలపుల తోవలోకి స్వాగతంఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం... |
డ్రాక్యులా నీడదశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని
ఎడారి దేహం
ఒయాసిస్సుల తడి కోసం
వెదుకులాడుతుంది
ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది... |
వారిద్దరూకాలాన్ని
మండించాలి
లేదా
మనమే
మంటలమవ్వాలి... |
సజీవ జ్ఞాపకమై…వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే
తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు
నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన
గాలి... |
డెన్ ఆఫ్ లైఫ్వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ
ప్రేమించడం నేర్చుకోవాలి
కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ
రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కాన... |
పరిమళభరిత తావుల్లోంచినీకోసం నేను ఎదురుచూసేది
ఓ కొత్త యుధ్ధ వ్యూహం కోసమే కాదు
కొత్త జ్ఞానం పొందడం కోసమే కాదు
సహచరీ!
నీ నవీన జీవన ఆవిష్కరణల్లో
నన్ను నేను భాగం చేసుకుందామని.... |
చూపులుఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని
ఒకవిప్లవాన్ని నా చూపు
కలగా ధరించింది
... |
బందిష్ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో
నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి
మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి
... |
ఇంతెహా ఇంతెజార్ కీ..నింగి మీద పొడిచిన ఆ నెలవంక
వంపులో ఏదో వెలుతురు కబురు
అతడు
పంపాడేమో
లేకుంటే
ఎందుకలా వెన్నెల ఆమె కప్పుకున్న చాదర్లా
ఆమె పలికే దువాలా ఇలపై వర్షిస్తుంది... |
వెల్తుర్ధ్వనినీవెపుడూ నాకు దూరం కావు
నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు
నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు….... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |