తీవ్రతరమౌతున్న నిర్బంధాన్ని ప్రతిఘటిద్దాం!

| క‌ర‌ప‌త్రం

తీవ్రతరమౌతున్న నిర్బంధాన్ని ప్రతిఘటిద్దాం!

- ప్రొ.జి. హరగోపాల్, కన్వీనర్, నిర్భంధ‌వ్య‌తిరేక వేదిక‌. | 19.02.2020 09:49:07am

ప్రియమైన ప్రజలారా!

దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న అసమానతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి, వ్యవసాయ సంక్షోభానికి మూలాలలోకి వెళ్ళి పరిష్కారాలు వెతికే బదులు, తీవ్రతరమౌతున్న ప్రజల అసంతృప్తిని నిర్బంధం ద్వారా అదుపు చేయాలని పాలకులు చట్టబద్ధ పాలనను రాజ్యాంగ ప్రమాణాలను కూడా తుంగలో తొక్కుతున్నారు. ప్రజల ఆగ్రహాన్ని మతద్వేషంగా మార్చి దళితులు, మైనార్టీలు, ఇతర పేద వర్గాలపై దాడులు చేస్తున్నారు. అల్లరి మూకలని, మాఫియాని రెచ్చగొడుతూ జెఎన్‌యూ,
జామియా మిలియా, విశ్వభారతిలాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలలో చొరబడి బాహాటంగా విద్యార్థులమీద, అలాగే అధ్యాపకుల మీద దాడులు చేస్తున్నారు. టి.వి. కెమెరాల ముందే మనుషులను ఏదో మిష మీద కొట్టి చంపుతున్నారు. మాట్లాడితే దేశ ద్రోహం కేసు పెడుతున్నారు. బీదర్ లో ఒక చిన్న పిల్లల బడిలో పౌరసత్వం చట్టాన్ని విమర్శిస్తూ పిల్లలు చేసిన ఒక ప్రదర్శనలో ప్రధానమంత్రిని విమర్శించారని స్కూలు పిల్లలని, ఉపాధ్యాయులని, స్కూలు యాజమాన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం, ప్రభుత్వ విధానాలను చర్చించడం, విమర్శించడం సర్వసాధారణం. ఇప్పుడు ప్రభుత్వాల చేతిలో ప్రజాస్వామ్య సంస్కృతి నిర్వచనమే మారిపోతున్నది.

ప్రజాస్వామ్య వ్యవస్థకు భావ ప్రకటనా స్వేచ్చ గుండెలాంటిది. రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడి ప్రపంచ ప్రజలు ఉదాత్త ప్రజాస్వామ్య వ్యవస్థలను సాధించుకున్నారు. ఈ మార్పు కొరకు రాజీలేని పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసారు. భారతదేశంలాంటి దేశాల్లో వలస పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి పోరాడారు. వేలాది మంది జైలు జీవితాలని భరించారు. భగత్ సింగ్ లాంటి వారు దేశ ప్రజల స్వేచ్చ కొరకు, సమసమాజం కొరకు భవిష్యత్ తరాల కొరకు ఉరిశిక్షను నవ్వుతూ ఎదుర్కొన్నారు. రైతాంగం, కార్మికవర్గం, దళితులు, ఆదివాసీలు చేయని పోరాటం లేదు. విశాల ప్రజానీక పోరాటాలలో నుండే భావ ప్రకటనా స్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, మతపర స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రుత్వం లాంటి ఉదాత్త విలువలు, ప్రమాణాలు పెంపొందాయి.

భారత రాజ్యాంగ రూపకల్పన స్వాతంత్ర్యోద్యమ వెలుగులో ఆ నేపథ్యంలో జరిగింది. దాదాపు రెండున్నర సంవత్సరాలు విస్తృత చర్చల ద్వారా, ప్రజల అభిప్రాయ సేకరణ ద్వారా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింపబడింది. రాజ్యాంగంలో ప్రజల స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు, రాజ్యానికి ఉండే అధికారాలు పొందుపరచబడి ఉంటాయి. రాజ్య అధికారం చట్టానికి కట్టుబడి ఉండాలి. నాగరిక పరిపాలన అంటే రాజ్యం , చట్టాలని గౌరవించాలి. ప్రజల హక్కులను కాపాడడమే కాక పౌరుల స్వేచ్ఛ పరిధి నిరంతరంగా విస్తృతం కావాలి. ప్రభుత్వాలు తప్పుడు విధానాలు అమలుపరచినప్పుడు దానిని ప్రతిఘటించే హక్కు ప్రజలకుంటుంది. చట్టబద్ధ పాలన అంటే చట్ట నిరంకుశత్వం కాదు. సమాజం పరిణామ క్రమంలో పెంచుకున్న ఉన్నత ప్రమాణాలను గౌరవించి, ఆ ప్రమాణాల ప్రకారం పాలన చేయడం.

స్వాతంత్ర్యానంతరం ప్రగతి సాధనలో మౌలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ వచ్చాయి. రాజ్యాంగం ప్రవేశికలో భారత పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, అలాగే భావ ప్రకటనలో, ఆలోచనలో, విశ్వాసాలలో, నమ్మకాలలో, ప్రార్థనా పద్దతిలో స్వేచ్ఛను, అంతస్తుల్లో, అవకాశాల్లో అందరికీ సమానత్వం,జాతి సమైక్యత, వ్యక్తి ఆత్మ గౌరవం కేంద్రంగా సౌభ్రాతృత్వాన్ని కాపాడుతామని వాగ్దానం చేసింది. అంతేకాక సార్వభౌమత్వం కలిగిన ఒక ప్రజాస్వామ్య, లౌకిక, సోషలిస్టు సమాజాన్ని స్థాపించి ఒక కొత్త సమాజాన్ని నిర్మిస్తామని కూడా రాజ్యాంగం హామీపడుతున్నది. ఈ విలువలన్నీ ప్రపంచ ప్రజలు అలాగే మన దేశ ప్రజలు చేసిన పోరాటాల నుండి వికసించిన ఉదాత్త విలువలు. ఇవ్వాళ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణం చేస్తున్నారు కానీ వాటిని నిలబెడుతున్నారా? ఆ విలువలు ఆచరణలో పాటించి వాటిని పెంపొందించడానికి కృషి చేస్తున్నారా అన్నది దేశం ముందు ఉండే ప్రధాన సవాలు. పాలకులు తమ వాగ్దానాలు నెరవేర్చనప్పుడు, విలువలు కాపాడనప్పుడు ప్రజలుగా మనం ఆ విలువలను ముందుకు తీసుకుపోవడానికి ఉద్యమించవలసిన చారిత్రక అవసరం ఏర్పడుతుంది.

స్వాతంత్ర్యానంతరం స్వేచ్చ పరిధి నిరంతరంగా పెరిగే బదులు అణచివేత చట్టాలను ఒకదాని తర్వాత ఒకదానిని ప్రజల మీద రుద్దుతున్నారు. వలస పాలన కాలంలో ఉండే ప్రివెంటివ్ డిటెన్షన్ మొదలు సెడిషన్ లాంటి చట్టాలను రద్దు చేసే బదులు వాటిని కొనసాగిస్తూ 1950లలోనే సైన్యానికి ప్రత్యేక అధికారాలిస్తూ ʹఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆక్ట్ʹ తీసుకొచ్చి, ప్రజలు ఎంత ప్రతిఘటించినా ఆ చట్టాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రజా పోరాటాలను అణచడానికి చట్టాలను రూపొందించారు. రాను రాను టాడా, పోటా లాంటి చట్టాలు చేస్తూ రాజ్యం విచ్చలవిడి అధికారాలు పొందుతూ ప్రజల స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నది. ఈ చట్టాల్లో అతిక్రూరమైన చట్టం ʹఊపాʹ. ఈ చట్టం చాలా నిరంకుశమైన చట్టం. ఇందులో ఎవ్వరినైనా ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఆరు నెలలు జైల్లో నిర్బంధించవచ్చు. ఇందులో అరెస్టు అయిన వారికి కనీసం బెయిల్ కు కూడా అవకాశం తక్కువ. ఇది పోలీసుల చేతిలో ఒక తిరుగులేని ఆయుధంగా మారడంతో ఎవ్వరిని పడితే వారిని, ప్రజాస్వామికవాదులను, ప్రజా సంఘాల బాధ్యులను ఈ చట్టం కింద సునాయాసంగా అరెస్టు చేస్తున్నారు. గతంలో టాడా, పోటాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిఘటన రావడంతో ఈ చట్టాలు రద్దయ్యాయి. ఈ రెండు చట్టాలలో ఉండే దుర్మార్గ అంశాలను ఊపా చట్టంలో చేర్చారు. టాడా, పోటాకు ఒక కాలపరిమితి ఉండేది. ఊపాకు అలాంటి పరిమితి లేకపోవడంతో అది భారతదేశ శిక్షాస్మృతిలో భాగం కావడం ఒక భయంకర పరిణామం. ఈ చట్టానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం ఇప్పుడు ప్రజల బాధ్యత.భారతీయ జనతా పార్టీ భావజాలంలోనే అణచివేత ఒక అంతర్భాగం. ఆ పార్టీ ఎప్పుడూ ప్రగతిదాయక హక్కుల గురించి, స్వేచ్చ గురించి మాట్లాడదు.

జాతీయత పేర, దేశభక్తి పేర ఎంత నిర్బంధం ఉపయోగించినా ఆ పార్టీకి సమ్మతమే. ఆరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక వైపు రాజ్యం , పోలీసులు మరో వైపు రాజ్యాంగేతర శక్తులు ప్రజల స్వేచ్ఛపై దాడులు చేస్తూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ల రాజకీయాలతో విభేదించే వాళ్ల మీద దేశద్రోహ నేరం కేసులు పెడుతున్నారు. దానికి తోడు అర్బన్ నక్సల్ అనే ఒక వినూతన పదాన్ని సృష్టించి తమ విధానాలను తప్పు పట్టే ఎవ్వరిమీదైన ఈ ముద్ర వేసి జైల్లల్లో తోస్తున్నారు. చివరికి ప్రియాంక గాంధీని కూడా అర్బన్ నక్సల్ అనేదాకా వెళుతున్నారు. దేశంలో పది మంది ప్రజాస్వామ్య వాదులను ప్రధానమంత్రి హత్యకు కుట్ర చేస్తున్నారని అరెస్టు చేస్తే, గత ఒక సంవత్సరంగా వీళ్లు జైళ్లల్లో ఉన్నారు. వీళ్ళల్లో ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్య హక్కుల కొరకు, దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన స్వచ్ఛమైన చరిత్ర ఉంది. అందరికీ వ్యక్తిగత నిజాయితీ ఉంది. అందరూ అత్యంత ప్రతిభావంతులు. ప్రజల తరఫున మాట్లాడే ప్రజాస్వామ్య గొంతుకలు. నిజానికి వీళ్ళు, వీళ్ళలాగే ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు సమాజానికి గొప్ప నైతిక వనరులు. నైతికంగా దిగజారుతున్న రాజకీయ, సామాజిక సందర్భంలో ఈ నైతిక వనరులను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది.

ఇక తెలంగాణకి వస్తే, ఇది ప్రజా ఉద్యమాల నుండి ఆవిర్భవించిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటాల వలన చాలా మాట్లాడే గొంతులున్నాయి. ఈ పోరాటల నుండి ఎన్నో ప్రజా సంఘాలు పుట్టి పెరిగినవి. ఇవ్వాళ హిందూమతోన్మాద రాజకీయాలకు భావజాల పరంగా ధీటైన జవాబు ఇవ్వగలిగే రాజ్యాంగంలోని లౌకిక ప్రజాతంత్ర విలువలకు నిలబడే సంఘాల్లో పని చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బాసటగా నిలబడ్డ వారే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రెండుసార్లు తొలుత 1969లో మళ్లీ 1994 నుండి పెల్లుబికింది. రెండవ పర్యాయం విస్తృత ప్రజా భాగస్వామ్యంతో పోరాడడం వల్లే రాష్ట్రం ఏర్పడిందన్న చరిత్ర తెలంగాణ పాలకులు ఇంత తొందరగా మరచిపోయారు. తెలంగాణ ఉద్యమ కాలంలో విస్తృతమైన ప్రజాస్వామిక చర్చ జరిగింది. భౌగోళిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అనే రెండు భావనలు ముందుకు వచ్చాయి. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమాలు కొనసాగించవలసే ఉంది. ఉద్యమంలో నుండి ఎదిగిన నాయకులు అధికార పీఠం మీద కూర్చుంటూనే ప్రజాస్వామిక తెలంగాణ ఏమయ్యిందో కానీ, ఆ భావాలని గౌరవిస్తూ ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షని కాపాడుతున్న వారి మీద రాజ్యం రోజు రోజుకూ నిర్బంధాన్ని పెంచుతున్నది. గత నాలుగు ఐదు దశాబ్దాలుగా పని చేస్తున్న ప్రజా సంఘాలు ఇప్పుడు సంఘ వ్యతిరేక శక్తులుగా పాలకులకు, పోలీసులకు కనిపించడం విచిత్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రయోగించని నిర్బంధాన్ని ఇప్పుడు ప్రజాసంఘాలు ఎదుర్కొంటున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమా లేక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడా అనే అంశం అటుంచి ఈ నిర్బంధానికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మతతత్వ రాజకీయాలకు భావజాలపరంగా తెలంగాణ ప్రజాస్వామ్య సంఘాలు వ్యతిరేకం. ప్రజాసంఘాలు లేవనేత్తే సమస్యలకు పరిష్కారాల కోసం రాజకీయ ఆర్థిక మూలాలలోకి వెళ్ళే సృజనాత్మక, క్రియాశీల రాజకీయాలు కొరవడడంతో పాలకులు నిర్బంధాన్ని మార్గంగా ఎన్నుకొంటున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో కూడా దాదాపు యాభై మంది ప్రజాస్వామిక వాదుల మీద, ప్రజాసంఘాల బాధ్యుల మీద ఊపా చట్టాన్ని ప్రయోగించడం జరగలేదు. ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫాసిస్టు విష సంస్కృతిలో తెలంగాణ పాలకులు క్రమక్రమంగా భాగమయ్యారు. ఇది తెలంగాణ ప్రజాస్వామిక చైతన్యానికి పూర్తి విరుద్ధం. తెలంగాణ ప్రజలు దీనిని సహించరు. సహించకూడదు.

పెరుగుతున్న నిర్బంధాన్ని ప్రతిఘటించకుంటే రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులు హరించుకుపోతాయి. ఎవ్వరినో పట్టుకుపోయారు మనకెందుకులే అని ఆలోచించటం సమాజానికి చాలా ప్రమాదం. ఇది ఎవ్వరి ఇంటి తలుపులైనా తట్టవచ్చు. మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర నిర్వహించిన కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొడుతూ ప్రవేశించింది. ప్రజలందరికీ సుపరిచితమైన అరుణోదయ (విమల) కార్యాలయంలోకి ప్రవేశించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా లక్షలాది మందికి తెలంగాణ ఉద్యమంలో తన ఉపన్యాసాల ద్వారా స్పూర్తినిచ్చిన చింతకింది కాశీం ఇంట్లోకి ప్రవేశించింది. గత ఈ ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచిన వి.వి. మీద పడింది. ప్రజాస్వామ్య సంస్థలైన తెలంగాణప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదిక, చైతన్య మహిళా సంఘం, పౌర హక్కుల సంఘం తదితర సంఘాల బాధ్యుల మీద ఉపా చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. కోర్టులలో నిరంతరంగా ప్రజాస్వామిక హక్కుల కొరకు గాలిస్తున్న లాయర్లను కూడా వదిలి పెట్టడం లేదు. ఎం.ఆర్.పి.ఎస్., వామపక్ష, విప్లవ, కాంగ్రెస్ పార్టీ - ఇలా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను వదలడంలేదు. ఇది మొత్తం తెలంగాణ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఒక పెద్ద వ్యూహంలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి.

ప్రజాస్వామ్యం పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండదు. అది ప్రజల చైతన్యం నిర్ణయిస్తుంది. గతంలోనైనా ఇప్పుడైనా ప్రజా ఉద్యమాలే ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసి సజీవంగా నిలబెడతాయి. తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు చేయడం కొత్త కాదు. ఇప్పుడు రోజు రోజుకి తీవ్రతరమౌతున్న నిర్బంధాన్ని మనం ప్రతిఘటించాలి. ఈ సామాజిక అవసరం మేరకు కృషి చేయడానికి నిర్బంధ వ్యతిరేక వేదిక ఏర్పడింది. వేదిక చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మద్దతివ్వడమే కాక ఆ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలి. తెలంగాణలోని ప్రజాస్వామిక విలువలను, వారసత్వాన్ని అలాగే భవిష్యత్తును కాపాడుకుని, భావితరాలకు మరింత మానవీయమైన, మెరుగైన, ప్రజాస్వామిక వారసత్వాన్ని అందిద్దాం. తెలంగాణ, అలాగే దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. 25 ఫిబ్రవరి 2020న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాం.

స్థలం : ఇందిరాపార్క్ - ధర్నా చౌక్ హైదరాబాద్
నిర్బంధ వ్యతిరేక వేదిక


No. of visitors : 242
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఊళ్ల‌కు ఊళ్ల‌ను ముంచి తెచ్చే నీళ్లు ఎవ‌రి కోసం: కాశీం

విర‌సం | 23.07.2016 11:05:18am

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ముంచి కోస్తాంధ్ర కాంట్రాక్ట‌ర్ల‌కు లాభాలు చేకూర్చేందుకు ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ఈ ప్రాజెక్టును ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకించాల్సిన........
...ఇంకా చదవండి

ʹమానాలʹ దీర్ఘ క‌విత‌

కాశీం | 02.08.2016 11:49:55am

మానాల అమ‌రుల‌ను స్మ‌రించుకోవ‌డంటే.. విప్ల‌వోద్య‌మంలో అమ‌రులైన వేలాది విప్ల‌వ వీరుల‌ను స్మ‌రించుకోవ‌డమే. అమ‌రుల వారోత్స‌వాల సంద‌ర్భంగా దీర్ఘ క‌విత పాఠ‌కుల......
...ఇంకా చదవండి

విప్లవ ప్రజాస్వామ్యమే ప్ర‌త్యామ్నాయం

కాశీం | 08.07.2016 12:44:22am

ʹబూర్జువా ప్రజాస్వామ్యం - అభివృద్ధి నమూనా - విప్లవ ప్రజాస్వామ్యంʹ పై విర‌సం కార్య‌వ‌ర్గ స‌భ్యుడు కామ్రేడ్‌ కాశీం ప్ర‌సంగం........
...ఇంకా చదవండి

రిజ‌ర్వేష‌న్ వ్య‌తిరేక ఆందోళ‌న‌లు - అగ్ర‌కుల త‌త్వం : కాశీం ఉప‌న్యాసం

కాశీం | 02.06.2016 10:54:27am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విర‌సం 25వ రాష్ర్ట మ‌హాస‌భ‌ల్లో ʹరిజ‌ర్వేష‌న్ల‌పై, కామ్రేడ్ కాశీం ఉప‌న్యాసం...
...ఇంకా చదవండి

గురిచూసే పాట గూడ అంజ‌య్య‌

కాశీం | 02.07.2016 11:47:06pm

ఊరుమనదిరా పాటను వేటూరి సుందరామ్మూర్తి కాపి కొట్టి వక్రీకరించి రాసాడు. అప్పుడు గద్దర్‌, గూడ అంజయ్య పత్రికా సమావేశం పెట్టి ప్రజలపాటను కాపీ కొట్టి సినిమా.......
...ఇంకా చదవండి

భూమికి సరే, జ్ఞాపకాలకు నష్టపరిహారం ఇవ్వగలరా?

కాశీం | 01.08.2016 12:48:58am

చారెడు భూమి ఉంటే తప్ప జీవించలేని మమ్ముల్ని భూమి నుంచి వెళ్లిపొమ్మంటే ఎట్లా? అని ఆ తల్లి ప్రశ్నిస్తున్నది. కేసులు పెట్టి బెదిరిస్తే అదురుకునేది లేదు.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •