ఏడాది క్రితం - యాభయేండ్ల విరసం సాహిత్యం గురించి ఆలోచిస్తున్న క్రమంలో విప్లవ రచయితలు రాసిన కథల గురించి సమాలోచన జరిగింది. విప్లవ రచయితలు 1980 నుండి నిర్వహిస్తున్న కథా వర్కుషాపులతో సహా ఈ యాభై యేండ్లలో వచ్చిన అనేక కథల గురించిన ప్రస్తావన వచ్చింది. విరసం 1970లో ఏర్పడి యాభై యేళ్లయింది. ఈ కాలమంతా అనేక ఆటుపోట్ల మధ్య, విప్లవోద్యమాలు తెలుగు ప్రాంతంలో, దేశవ్యాపితంగా అనేక మలుపులతో, పరిణామాలతో విస్తరిస్తున్నాయి. అలాంటి పరిణామాత్మక మార్పులు, గుణాత్మక మార్పులవుతున్న క్రమంలో వైరుధ్యాలు, సంఘర్షణలు ఎన్నో. పాత సమాజం, ప్రజలకు పనికి రాని సమాజం కూలిపోవడం, కొత్త సమాజాన్ని, ప్రపంచ విప్లవాల అనుభవంతో నిర్మిస్తున్న విప్లవాలయుగం ఇది. భారతీయ సమాజాన్ని గతితార్కికంగా, చారిత్రికంగా అధ్యయనం చేసి, గుణపాఠాలు తీసుకొని, తెలంగాణ సాయుధపోరాటం, నక్సల్బరీ, శ్రీకాకుళం, కరీంగనర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు నుండి దండకారణ్యం దాకా విప్లవోద్యమాలు నిర్మించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రపంచ విప్లవాలల్లోనే అరుదైన మన కాలపు, మన దేశపు, అర్ధ శతాబ్దాపు, మూడు తరాల విప్లవోద్యమ సుదీర్ఘ ప్రయాణం. ముప్పై వేల మంది విప్లవకారుల త్యాగంతో నిర్మిస్తున్న దారి ఇది. ఇలాంటి సుదీర్ఘ పోరాటంలో విరసం రచయితలు భాగమయ్యారు. స్థల కాలాల్లో వ్యక్తమైన ప్రజల అనుభవాలను, త్యాగాలను, ఉద్వేగాలను సృజనాత్మక సాహిత్యంగా ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తున్నారు.
ఇప్పుడు భారతదేశంలో అటు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం కుప్పకూలి, లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలారు. ఈ రెండు రంగాలను దోపిడి చేస్తూ సర్వీసు రంగం సుమారు 60 శాతం విస్తరించి, ఏ హక్కులు లేని అనియత కార్మిక రంగంలో అతి తక్కువ వేతనాలతో చాలీచాలని బతుకీడుస్తున్నారు. ఈ దోపిడీని, అర్ధ వలస భూస్వాములు, వలస పెట్టుబడిదారులు, భారతీయ సమాజాన్ని, కులాలు, మతాలు లాంటి అనేక రకాలుగా విభజించి తరతరాలుగా కొనసాగిస్తూ కొల్లగొడుతున్నారు.
ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకొని, భారతదేశంలో ఉత్పత్తి వనరులను ప్రజలకు పంచి, ఉత్పత్తి శక్తులను ఆధునీకరించి, కుల, మత, లింగ, వర్గ అంతరాలు లేని ప్రజాస్వామిక సంబంధాలను నెలకొల్పడానికి, నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా విప్లవోద్యమం పని చేస్తున్నది. ఇవి సాధించాలంటే ప్రజలను సమీకరించే పార్టీ, దోపిడీ శక్తులతో పోరాడే ప్రజా సైన్యం, వివిధ రకాల ప్రజా సమూహాల మధ్య ఐక్య సంఘటన అనివార్యం. ఈ దిశగా అవసరమైన నిర్మాణాన్ని దండకారణ్యంలో విప్లవోద్యమం చేపట్టింది.
దేశ వ్యాపితంగా మరో పెను వెల్లువ తప్ప సరైన స్థితి - వివిధ ప్రజారాశుల తిరుగుబాట్లు తప్పని స్థితి ఇది. దళారీ ప్రభుత్వాలు ఇలాంటి తిరుగుబాట్లను కూరంగా అణచివేయడానికి తన అన్ని ముసుగులు తొలగించుకొని ఫాసిస్టుగా విరుచుకుపడుతున్న కాలం.
భారతదేశ ప్రజలకు ఈ దశలన్నీ కొత్త కాదు. ఎన్నో అనుభవాలు గడించినవారు. ఈ దశలో విప్లవ రచయితలు - యాభై యేండ్లలో ఎన్ని కథలు రాశారు? అనే శోధన మొదలైంది. పాణి, పి. చిన్నయ్య, బాసిత్ - నేను ఒకసారి కలిసి చర్చించాం. అసలు కథలు సేకరించి కనీసం డిజిటల్ రూపంలోనైనా భద్రపరిస్తే ఇప్పటి తరానికి పనికి వస్తాయని అనుకున్నాం. అలాంటి పని చేయాలనుకున్నాం. పని మొదలు పెట్టిన తరువాత ఇది చాలా పెద్ద పనిగా అర్థమయ్యింది. కథల లిస్టు సేకరించడానికే నెల రోజులు పట్టింది. వివిధ పత్రికలల్లో వచ్చిన కథలే సుమారుగా రెండు వేల దాకా ఉంటాయి. ఇతర సంకలనాలు సుమారు 150 నుండి 200 దాకా ఉంటాయి. ఈ లిస్టు తుదిరూపానికి తేవడానికి - సుమారు ఇరవై అయిదు వేల కథలు సేకరించి డిజిటల్ చేసిన కారా మాష్టాలు ʹకథా నిలయంʹ సహకారం తీసుకుందామనుకున్నాం. ఈ పనంతా సమయం తీసుకునే పని.
విరసం యాభై వసంతాల సభలు జనవరిలో జరుగుతున్నాయి. ఆ నాటికైనా 2003 - 2010 ఒక సంకలనం, 2011 - 2019 రెండో సంకలనం తేవాలనే నిర్ణయించుకున్నాం. గతంలో నేల తల్లి విముక్తి కోసం, ఆ తర్వాత కథా కెరటాలు, ఆ తర్వాత కదిలే కథ సంకలనాలు వచ్చాయి. అనేక విడి సంపుటులు, వేర్వేరు ప్రాతిపదికల మీద సంకలనాలు వచ్చినా కదిలే కథ సంకలనానికి కొనసాగింపుగా ఈ రెండు సంకలనాలు ఇప్పుడు అవసరం అనిపించింది.
ఇది విప్లవ కథ 2003 - 2010. ఈ కాలంలో వచ్చిన కథలు దాదాపుగా మూడు వందలకు పైనే ఉంటాయి. ఇందులో విరసం సభ్యులు రాసిన కథలు మాత్రమే ప్రచురించాలనుకున్నాం. ఈ కాలంలో ఒక్కొక్కరు చాలా కథలు రాశారు. స్థల, కాలాలు, వైవిధ్యం, కొత్తదనం, వస్తువు, శిల్పం, భాషలు ననుసరించి - మా అవగాహన మేరకు, అసమగ్రమే అని తెలిసినా కూడా, ఒక్కొక్కరిది ఒక్కో కథ ఎంపిక చేసి 21 కథలతో ఈ సంకలనం తెస్తున్నాం. తెలంగాణలో ప్రజా ప్రతిఘటనోద్యమాలు సుదీర్ఘ కాలం అనేక రకాల నిర్భందాలలో కూడా నిలదొక్కుకున్నాయి. 1999 డిశంబర్ దాకా మైదాన, అటవీ ఉద్యమాలు కీలకమైన శక్తిగా ఎదిగాయి. తీవ్రమైన నిర్బందాన్ని తట్టుకొని - వ్యూహంలోని భాగంగా రాజకీయకంగా ఎదిగి ప్రజారాజ్య కమిటీలుగా పరిణామం చెందే క్రమంలో అగ్ర నాయకత్వం శ్యామ్, మహేశ్, మురళిల ఎన్ కౌంటర్ జరిగింది. దీంతో విప్లవోద్యమానికి తక్షణమే నాయకత్వం అందడం ఆలస్యమైంది. ఫలితంగా శత్రువు అన్ని జిల్లాలల్లో హత్యాకాండకు పూనుకున్నాడు.
ఫలితంగా 2003 నాటికి ఆంధ్రప్రదేశ్ నుండి విప్లవోద్యమం ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనేక పోరాట రూపాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఊపందుకున్నది. అనేక చోట్ల వేలాది మంది ప్రజలు ఉద్యమాలల్లోకి వచ్చి వంటా వార్పు, రాస్తా రోకో లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాయలసీమలో తమ అస్థిత్వానికి సంబంధించి, వనరుల రక్షణ గురించిన శోధన మొదలయ్యింది. మొత్తంగా అన్ని చోట్ల అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి. రాయలసీమ వ్యవసాయరంగం నుంచి ʹఆయికంʹ, ʹప్రేమ దుఃఖపు పొరʹ, తెలంగాణ వ్యవసాయ నేపథ్యంలో ʹమెట్టభూమోడుʹ లాంటి కథలు వచ్చాయి. పారిశ్రామిక రంగపు విధ్వంసకర విస్తరణ - బహుళ జాతి కంపెనీల ప్రవేశం లాంటి విషయాల పట్ల రచయితల స్పందించారు... శ్రీకాకుళ పోరాటం నుండి, తడుముతూ, కంపెనీల ఆక్రమణ ʹఎర్రబడ్డీ సెంటర్ʹ పర్యావరణాన్ని విషతుల్యం చేసే - లాభాపే గల ఫార్మా కంపెనీల ప్రభావం గురించి ʹఆఖరి కుందేలుʹ, ʹపోలేపల్లి సెజ్ʹ పంట భూములను కబలించి రైతులను దిక్కులేని వారిగా చేసిన వైనాన్ని ʹఆఖరి వడ్ల గింజలుʹ - ప్రాజెక్టుల వలన నిర్వాసితమౌతున్న గ్రామాల విషాద నిష్క్రమణ చరిత్ర ʹకాలువ మింగిన ఊరుʹ కథ, అనేక ఊళ్లను, అడవిని మింగేసి, ఒక పర్యావరణ విధ్వంసంగా మారిపోతున్న పోలవరం ప్రాజెక్టు గురించి ʹనెగడుʹ లాంటి కథలు వచ్చాయి.
శ్రామిక వర్గ జీవితాలు - సాహిత్యంలోకి రావడం, ముఖ్యంగా ʹబెస్తవారి బతుకుʹ, దళిత జీవితం - చుట్టు అల్లుకున్న బతుకున్న అర్థం చేసుకునే క్రమం ఆరంభంగా ʹఅ,ఆ, ఇ, ఈ, ఉ, ఊʹ ముస్లిం జీవన నేపథ్యంలో ʹచష్మాʹ, ʹదర్జ్ కే సవాల్ʹ, ʹఈద్ నమాజ్ʹ మహిళల జీవితంలోని అన్ని రకాల సామాజిక, రాజీకయ, ఆర్థిక విషయాలను చిత్రించే ʹకవులమ్మ ఆడిదేనా?ʹ కథలు వచ్చాయి. పిల్లల మనోభావాలు, రకరకాల వైరుధ్యాలు కుల, వర్గ, లింగ వివక్షతలు గల సమాజంలో చదువు గురించి ʹకమల కలʹ, ʹమా కిట్టు యమ సెక్టుʹ కథలు ఎంపికయ్యాయి. పర్యావరణం విధ్వంసం జీవజాలం మీద చూపుతున్న ప్రభావం గురించిన కథ ʹపొదగని గుడ్లుʹ ఇందులో ఉంది. అట్లాగే విప్లవోద్యమంలోని త్యాగాల గురించి ʹఇది వర్గ పోరుʹ లొంగుబాట్లు, త్యాగం - పెద్ద కొడుకు, ప్రేమలు, లొంగుబాట్ల గురించి ʹఒక తడి చూపుʹ లాంటి కథలు సంకలనంలో చేరాయి. అధికారంలో కొనసాగుతున్న నాయకుల విధానాల వల్ల భూస్వామ్యం, వలస బహుళ జాతి కంపెనీల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తే, అవి ఎంత కృరంగా ఒడుపుగా నాయకులను అంతం చేస్తాయో ʹఒక పక్షి కథʹ చిత్రించింది.
మొత్తంగా, ఈ కాలమంతా మరింత లోతుగా వర్తమాన చరిత్రను అధ్యయనం చేసి, మరింత శక్తివంతంగా, ఐక్యంగా పురోగమనించడానికి దారులు వెతకడానికి విప్లవ కథ ప్రయత్నించడం కన్పిస్తుంది. ఇందులో కొత్త వస్తువులు, కాలానికి తగిన శిల్ప రీతులు కూడా కనిపిస్తాయి. ఈ దశకు సంబంధించిన ఈ కథలను మూడో తరం అధ్యయనం చేయాలని కోరుతున్నాం. విప్లవోద్యమాలను మరింత విస్తృత పరిచి వేగవంతం చేయడంలో, ఈ కథలు ఏ మేరకు స్ఫూర్తి నిచ్చినా - సంకల్పం నెరవేరినట్లే.
Type in English and Press Space to Convert in Telugu |
వెలుతురు నది
ʹʹదళితులు, బహుజనుల స్థితిగతులు, చరిత్ర గురించి పూలే, అంబేద్కర్ ఎంతో కొంత చెప్పిండ్లు. కాని మహిళల చరిత్ర ఉందా? లేదా? ఉందేమో తనకు తెలియదేమోʹʹ రాజు లోలోప...... |
ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు రాత్రులకురాత్రుల్లు పిచ్చివాడిగా అరిచినా కూడా వొడువుదు. దిగులుదిగులుగా- తనకే స్పష్టంగానిదేదో పూనినవానిలాగా విరసంలోతిరుగుతూ... తిరుగుతూ.. అప్పటికే విరసంలో..... |
విస్తరణ - కలలకు దారులైన దండకారణ్య కథలుఇందులో భిన్నమైన కథా నిర్మాణం ఉంది. ఉద్యమ విస్తృతిలో విప్లవకారుల, ప్రజల వ్యక్తిగత అనుభవం, గతితార్కిక మానవ సంబంధాల అధ్యయనం, ఆచరణ ద్వారా దశలు దశలుగా ఎదగడం కనిప... |
తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావంప్రజాపోరాటాలను, ప్రజా జీవితం లోలోతులు చిత్రించడానికి ఇంత పెద్దఎత్తున రచయితలు, కళాకారులు పూనుకోవడం గతంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడం, క్రమంగా తగ్గడం, ఇప్టా..... |
ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలుకూర్మనాథ్ ఈ గడబిడలో ʹనగరంలో ఇంకోరోజుʹ గడవక మరింత పేరుకపోయిన వ్యక్తం గాని, విస్ఫోటనం చెందని అసహ్యాన్ని - భిన్న ప్రపంచాల క్రౌర్యాన్ని - పసిపిల్లల కలలను..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |