బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర

- పాణి | 04.03.2020 12:11:01pm

బస్తర్ లో మరోసారి శాంతియాత్ర చేశారు. ఇది ఎవరు చేశారో, ఎవరి కోసం చేశారో ఊహించడం కష్టం ఏమీ కాదు. హింసా హింసలతో, న్యాయా న్యాయాలతో సంబంధం లేని శాంతికి ఏ అర్థమూ లేదు. హింస మీద ఆధారపడిన వాళ్లు శాంతిని వల్లిస్తున్నారంటేనే సందేహించాలి. హింసకు, శాంతికి సహజమైన సంబంధం ఉండదు. అది వికృతంగా ఉంటుంది. అనాగరికంగా ఉ ంటుంది. రాజ్యం కోసం, రాజ్యం తరపున, రాజ్య వ్యక్తీకరణగా ఉండే పోలీసులు, పారా మిలటరీ పర్యవేక్షణలో శాంతి గురించి మాట్లాడటం కంటే జుగుప్సాకరం ఏముంటుంది? దోపిడీ కోసమే శాంతి అని వాళ్లు బరితెగించి చెప్పదల్చుకున్నారు.

బస్తర్ లో ఫిబ్రవరి 8న ఉదయం ఆరున్నర నుంచి మూడు గంటలపాటు శాంతి పరుగు నిర్వహించారు. ఇందులో ఒక్క ఆదివాసీ కూడా పాల్గొనలేదని పత్రికల్లో వచ్చింది. సుమారు 11 వేల మంది బైటి ప్రాంతాల వారు పాల్గొన్నారు. ఈ పరుగు పందెంలో పోటీలకు సుమారు 10 లక్షల బహుమతులు ప్రకటించారు. బస్తర్ లో శాంతి స్థాపన దీని ఉద్దేశం. దీని కోసం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం, కార్పొరేట్లు చేసిన హంగామా అంతా ఇంత కాదు.

ఇది చూస్తే ఎవరికైనా మన నగరాల్లో జరిగే వాకింగ్లు, పరుగులు గుర్తుకు వస్తాయి. ఏదో ఆశయంతో ఫలానాది కావాలనో, ఫలానా దాన్ని వ్యతిరేకిస్తూనో ఇవి జరుగుతుంటాయి. ఇలాంటివి ప్రజా దృక్పథంతో చేసే వాళ్లుంటారు. ప్రభుత్వం, అధికారులు పెద్ద పెద్ద సంస్థల ఆధ్వర్యంలో కూడా కొందరు ఇలాంటివి చేస్తుంటారు. ఇవే ఎక్కువ జరుగుతుంటాయి. ఆడంబరంగా సాగుతుంటాయి.

బస్తర్ పరుగు యాత్రలో విశేషాలు వేరే ఉన్నాయి. అవే అసలు ఉద్దేశం. ఆర్భాటంగా సాగిన పరుగు యాత్ర ఉద్దేశం ఏమంటే.. దాన్ని టూరిస్టు కేంద్రంగా మార్చడం. టూరిస్టు కేంద్రాలు కావాలంటే అక్కడ ʹశాంతిʹ ఉండాలి. ఇప్పుడు కశ్మీర్ ను చూస్తున్నాం కదా. ఏదైనా అట్లాగే ఉంటుంది. మాడ్ ను టూరిస్టు కేంద్రం చేయాలంటే ఆదివాసేతరులు, ప్రభుత్వ యంత్రాంగం, కార్పొరేట్ శక్తులు అక్కడికి వెళ్లాలి. అప్పుడు కాని అక్కడ శాంతి స్థాపన జరిగినట్లు కాదు. ఈ ప్రోగ్రాం పేరు అబూజ్ మాడ్ శాంతి పరుగు.

అబూజ్ మాడ్ అంటే తెలియని ప్రాంతం అనే అర్థం ఉండేది. దాన్ని ప్రపంచమంతా తెలుసుకోవలసిన విప్లవ నమూనాగా ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలో తీర్చిదిద్దుతున్నారు. దేశానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా? లేక బూర్జువా వర్గం చెప్పేది, చేసేది తప్ప మరే దారి ఏదీ లేదా? అనే సంక్షోభంలో అందరూ చిక్కుకున్న వేళ అబూజ్ మాడ్ ఒక ప్రయోగం చేస్తోంది. ప్రత్నామ్నాయాల గురించి కలలు గనేవాళ్లు ఉంటారు. అందమైన భాషలో పండిత చర్చలు చేసే వాళ్లూ ఉంటారు. కానీ మావోయిస్టులు తమకు వీలైన దండకారణ్య ప్రాంతంలో, అక్కడి నిర్దిష్ట స్థల కాలాల్లో ఒక ప్రత్నామ్నాయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు.

అందువల్ల అబూజ్ మాడ్ అంటే అందరూ తెలుసుకోవాల్సింది అనే కొత్త అర్థం స్థిరపడింది. దాని మీద ఎన్ని విమర్శలున్నా నిజాయితీతో కూడా అన్వేషణా దృష్టి ఉన్న వాళ్లకు అబూజ్ మాడ్ తప్పక తెలుసుకోవాల్సిన అంశం. ముఖ్యంగా మానవ కర్తృత్వంపట్ల నమ్మకం, గౌరవం ఉన్న వాళ్లకు అబూజ్ మాడ్ ఆసక్తికరరం. అబూజ్ మాడ్ మోడల్ దేశానికంతా పనికి వస్తుందని మావోయిస్టులు కూడా అనడం లేదు. వాళ్లు రూపొందించుకున్న ప్రత్నామ్నాయ విప్లవకర రాజకీయార్థిక సాంస్కృతిక నమూనాను దండకారణ్య నిర్దిష్ట పరిస్థితుల్లో అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో భాగమైన ఏ ప్రాంతానికైనా పనికి వచ్చే కొన్ని మౌలిక ప్రత్నామ్నాయ ప్రాతిపదికలు దండకారణ్యంలో ఉన్నాయి. దీనికి అబూజ్ మోడ్ ప్రతీక.

అందుకే అబూజ్ మాడ్ శాంతి పరుగు పేరుతో అక్కడికి వేలాది మందిని తీసికెళ్లి క్రమంగా దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం అనుకుంటోంది. అంటే విప్లవ కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం అనే వ్యూహం దీని వెనుక ఉంది.

అయితే ఇది అంత సులభమా? అబూజ్ మాడ్ ప్రాంతంలోకి వేలాది మందిని వెంటేసుకొని శాంతి యాత్ర ఎలా చేసి ఉ ండవచ్చు? ఎలా సాధ్యమైంది? ప్రతిఘటన ఏమిటి? అనే సమాచారాల్లోకి మనం వెళ్లలేకపోవచ్చు. కానీ అక్కడి బలాబలాల పొందిక ఎలాంటిదంటే సుమారుగా గత పదిహేనేళ్లుగా 7 లక్షల సైనిక, అర్ధ సైనిక, పోలీసు బలగాలతో నిత్యం ఆదివాసులు యుద్ధం చేస్తూ తమ స్థావరాన్ని కాపాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కోసం పాత రోజుల్లో ఆదివాసులు చేసిన యుద్ధాల్లాంటివి కాదు. ఆ భౌగోళిక ప్రాంతం ఒక విప్లవ రాజకీయార్థిక సాంఘిక పాలనా నమూనా కోసం ఆచరణాత్మక ప్రయోగం చేస్తున్నది. ఇంత భారీ బలగాలను ప్రతిఘటించి ఆదివాసులు ఆ నమూనాను కాపాడుకుంటున్నారు. ఇంత శక్తివంతమైన ప్రజా ఆచరణ ఉన్న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం పాలకులకు అంత సులభమా? అసలు పర్యాటక కేంద్రంగా మార్చడమంటే ఏమిటి? అందుకే ఈ శాంతి యాత్ర సందర్భంగా చత్తీస్ఘ్డ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ అక్కడ 235 కోట్ల ʹఅభివృద్ధిస‌ పనులకు భూమి పూజ చేశాడు. దండకారణ్యంలోని విప్లవ అభివృద్ధి నమూనాను ధ్వంసం చేయాలనుకొని తమదైన అభివృద్ధి సాధించేందుకే ఈ శాంతియాత్ర. అందుకే మావోయిస్టు రహిత మాడ్ అనే నినాదం ఈ శాంతియాత్ర ఇచ్చింది.

దండకారణ్యంలో కార్పొరేట్ల ఆగడాలను విప్లవోద్యమం నాయకత్వంలో ఆదివాసులు నిలువరిస్తున్నారు. కార్పొరేట్ తరహా అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. కార్పొరేట్ మైనింగ్ కు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్నారు. ఇది భారత రాజ్యం ఎంచుకున్న అభివృద్ధి నమూనాకు పూర్తి భిన్నమైనది. కాబట్టి పోలీసులు, కార్పొరేట్లు కలిసి శాంతి యాత్రకు సిద్ధమయ్యారు. అభివృద్ధి పేరుతో సాగుతున్న విధ్వంసాన్ని, యుద్ధాన్ని ప్రజాయుద్ధం ఎదుర్కొంటోంది. కాబట్టి వాళ్లకు శాంతి కావాలి. ప్రజా యుద్ధాన్ని దెబ్బతీయడమే వాళ్ల శాంతి. అంతకుమించి మరేమీ లేదు. ఆదివాసులు ఎంచుకున్న ప్రత్యామ్నాయ ప్రజా అభివృద్ది న్యాయమైనదా? లేక కార్పొరేట్ అభివృద్ధి న్యాయమైనదా? అనే ప్రశ్న వేసుకోకుంటే ఈ శాంతి సారం అర్థం కాదు. ఆదివాసులు అనుసరిస్తున్న అభివృద్ధి, పాలనా రూపమైన జనతన సర్కారు, దోపిడీ పునాది మీద ఉండే బూర్జువా రాజ్యాన్ని హింసా హింసల ప్రాతిపదికపైన విశ్లేషించుకోకుంటే ఈ శాంతి యాత్ర మర్మం అర్థం కాదు.

బస్తర్ లో గత ఏడాది కూడా ఫిబ్రవరి 22 నుంచి 28 దాకా శాంతి యాత్ర చేశారు. జగదల్‌పూర్ నుంచి రాయ్ పూర్ దాకా సైకిల్ యాత్ర ఇది. దండకారణ్యంలో విప్లవోద్యమానికి పోటీగా దీన్ని చేపట్టారు. కార్పొరేట్ మేధావులు ఇందులో భాగమయ్యారు. ఈ శాంతి దేని కోసమో మనం ఊహించవచ్చు. ఈ శాంతి వెనుక ఉన్నది హింస. గత బీజేపీ ప్రభుత్వం దగ్గరి నుంచి 2018లో చత్తీస్ ఘడ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాకా విప్లవోద్యమ నిర్మూలనకు ఎంచుకున్న ఆపరేషన్ సమాధాన్ ఉంది. బస్తర్ లో ఇప్పటికే ఉన్న 70 బెటాలియన్ల పారా మిలటరీ బలగాలను ఎత్తేసే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కొత్త పోలీసు క్యాంపులు వెలిశాయి. ఎన్నికల సమయంలో తీవ్రమైన నిర్బంధం కాంగ్రెస్ ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తోంది. గ్రామాలపై దాడులు తీవ్రమయ్యాయి. అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇక ఎన్ కౌంటర్ హత్యల గురించి అయితే చెప్పనవసరం లేదు. వీటికి కొనసాగింపే ఈ శాంతియాత్రలు. వీటి గురించి మాట్లాడుకుంటుంటే కొందరికైనా ఈ రెంటి కంటే ముందు జరిగిన శాంతి యాత్ర గుర్తుకు రావాలి.

అప్పుడు శాంతి యాత్ర పేరుతో చత్తీస్ ఘడ్ లో ప్రజాస్వామికవాదుల మీద దాడులు జరిగాయి. దానికి ముందు వెనుకలే నందినీ సుందర్ లాంటి వాళ్లు ఛత్తీస్ ఘడ్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆదివాసుల కోసం పని చేస్తున్న అలాంటి వాళ్లకు అక్కడ ఉండే వీలు లేకుండాపోయింది. అప్పుడే ఆపరేషన్ సమాధాన్ అనే అణచివేత అభియాన్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరంభించింది. ఇది దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు కేంద్రం కలిసి ప్రకటించిన యుద్ధం. దీని వెనుక మంద్రస్థాయి యుద్ధ తంత్రం ఉన్నది. ఎల్‌ఐసీగా ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. 2003 నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తున్నాయి. సల్వాజుడం, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ అగ్ని, ఆలౌట్ వార్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ హాకా.. ఒకటేమిటి ఆ చివర లాల్ గడ్ నుంచి ఈ చివరి పశ్చిమ కనుమల దాకా అనేక రూపాల్లో అణచివేత కొనసాగింది. ఈ అన్ని యుద్ధ రూపాల వెనుక ఉన్నది ఎఐసీ. వీటన్నిటినీ కలిపి ఆపరేషన్ సమాధాన్ తీసుకొచ్చారు.

గత పదిహేనేళ్లలో ఒక్క చత్తీస్ ఘడ్ లోనే కాదు, దండకారణ్యంలోనే కాదు, తూర్పు మధ్య దక్షిణ భారతదేశంలో అటవీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో సహా రివిజనిస్టు పార్టీల దాకా అన్ని ప్రభుత్వాలు అమలు చేసిన అణచివేత రూపాలను గుర్తు చేసుకోండి. ఈరోజు అందరూ అంటున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం వాటికి కొనసాగింపుగా వచ్చిందని అర్థమవుతుంది. మంద్రస్థాయి యుద్ధం కేవలం రాజకీయ సైనిక అణచివేత వ్యూహమే కాదు. అది సాంస్కృతిక, భావజాల యుద్ధం కూడా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో దీన్ని ముమ్మరం చేస్తూ పోలీసు అధికారులను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఒకపక్క సైనిక దాడి చేస్తూనే ప్రజల మనసులు గెలవాలి అనే సందేశం ఇచ్చాడు. ఎల్‌ఐసీలో ఈ ముఖ్యమైన కోణం ఉంది. ఆపరేషన్ గ్రీన్‌హంట్ 1,2,3 దశలను, సాల్వాజుడుం2ను దాటి దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన అణచివేత అభియాన్లను నడిపారు. ప్రత్యేకించి పట్టణ మేధావులను అణచివేయడానికి 2016లో ఆపరేషన్ అగ్నిని తీసుకొచ్చారు. వీటన్నిటినీ కలిపి ఆపరేషన్ సమాధాన్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అణచివేత ప్రారంభించారు. ఈ మొత్తం వెనుక మౌలికంగా మంద్రస్థాయి యుద్ధం ఉన్నది. ఈ ఆ రోజుల్లో విప్లవ శక్తులు మంద్రస్థాయి యుద్ధం గురించి మాట్లాడుతూ ఇది మావోయిస్టులను, ఇంకా అలాంటి మిలిటెంట్ ప్రజా ఉద్యమాలను అణచివేయడానికే కాదు, సమాజంలోని అన్ని రకాల పీడిత ప్రజలను అణచివేసే వ్యూహం ఇందులో ఉందని ప్రచారం చేశాయి. ఒక ప్రజా సమూహాన్ని మరో ప్రజా సమూహం మీదికి ఉసిగొల్పి సైనిక దాడులు చేయడం, అశాంతిని రెచ్చగొట్టడం దీని ఉద్దేశమని విశ్లేషించాయి. అంతిమంగా బూర్జువా రాజ్యం బలోపేతం కావడమే దీని ఉద్దేశమని చెప్పారు. బూర్జువా రాజ్యం బలపడటమంటే దోపిడీని సుస్థిరం చేయడం. దీని కోసం సామాజిక ప్రత్యేకతలు ఉండే ప్రజా సమూహాలను విడదీస్తారు. ఒకరికి ఒకరు పడకుండా దూరంపెంచుతారు. పరస్పర అనుమానాస్పద పరిస్థితి కల్పిస్తారు. ప్రజల మధ్య తరతరాలుగా ఉండిన విశ్వసనీయ సంబంధాలను కలుషితం చేస్తారు.

ఈ విశ్లేషణ ఇస్తూ ... ఈ రోజు సాయుధ విప్లవోద్యమాల మీద జరుగుతున్న దాడి ఇక్కడే అడిపోయేది కాదని, సామాజిక హింసగా, అణచివేతగా మారుతుందని అప్రమత్తం చేశాయి. విప్లవ శక్తులు చెప్పిన ఈ మాటను ఆ రోజు ప్రగతిశీల శక్తులు అంతగా పట్టించుకోలేదు. ముఖ్యంగా సామాజిక ఉద్యమకారులు స్వీకరించలేదు. మంద్రస్థాయి యుద్ధం, ఆపరేషన్ గ్రీన్‌హంట్ అనేవి రాజ్యాంగ పరిధికి బైట పని చేసే వాళ్ల తలనొప్పి మనకెందుకులే అనుకున్నారు. మనం రాజ్యాంగ బద్ధంగా పని చేసే వాళ్లం కాబట్టి మనకు ఏ సమస్యా లేదని అనుకున్నారు. అందుకే ఆపరేషన్ గ్రీన్ హంట్ దగ్గరి నుంచి సమాధాన్ దాకా విప్లవ శక్తుల ఎజెండా అయింది. సాయుధ విప్లవాన్ని కూడా ప్రజాస్వామికంగా గుర్తించిన కొందరు మేధావులు మాత్రమే వాటిని దృఢంగా వ్యతిరేకించారు. సహజంగానే అలాంటి వాళ్ల మీద కూడా రాజ్యం దాడులు చేసింది. ముఖ్యంగా బస్తర్ లో ఇలాంటి మేధావుల మీద దాడులు జరిగాయి. వీళ్లు శాంతిని భగ్నం చేసే వాళ్లని ప్రచారం చేస్తూ రాజ్యం శాంతియాత్రలు ఆరంభించింది.దేశంలో గత పదిహేనేళ్లలో ఇదొక ముఖ్యమైన పరిణామం.

ఇంతే ముఖ్యమైనది బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం. సనాతనధర్మం, కులవ్యవస్థ, హిందుత్వ మీద ఆధాపడిన ఆర్ఎస్ఎస్ పార్లమెంటరీ మార్గంలోకి వచ్చి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా ఎదిగింది. చాలా మంది మతతత్వమని, మతోన్మాదమని అంటున్న రోజుల్లోనే విప్లవ శక్తులు మత వర్గతత్వమని, హిందూ మతోన్మాదమని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజమని సూత్రీకరిస్తూ వచ్చాయి. భారత దోపిడీ రాజకీయార్థిక మూలాల మీది నుంచి, సామ్రాజ్యవాద సంబంధంలోంచి పార్లమెంటరీ మార్గంలో ఇది బలపడింది. బ్రాహ్మణీయ స్వభావం ఉన్న పార్లమెంటరీ పంథా ఫాసిజానికి రాజమార్గమైంది. అయితే ఇప్పుడు ఇది ఇంత మహమ్మారిగా మారడానికి కుడి, ఎడమ అన్ని ఎన్నికల పార్టీలు కారణం. దీనికి పెద్దగా చారిత్రక విశ్లేషణల్లోకి వెళ్లనవసరం లేదు. ఢిల్లీలో ఆప్ గెలిచాక జరిగిన సంబరాలను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఎన్నికల అంకెల గారడీలో బీజేపీ ఓడిపోవడం మినహా ఆప్ గెలుపుకు ఏ ప్రత్యేకతా లేదు. దీన్నడ్డం పెట్టుకొని పార్లమెంటరీ రాజకీయాల్లో ఎన్నెన్ని అద్భుతాలు చేయవచ్చో గౌరవనీయులనబడే వాళ్లు కూడా విశ్లేషణల్లో పోటీ పడ్డారు. ఆర్థిక విషయాల్లో ప్రత్యేకత ఏమీ లేకపోయినా సాంఘిక, పాలనా విషయాల్లో రాముడి పార్టీకి, ఆంజనేయుడి పార్టీకి తేడా చూడొచ్చని అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఈ వారంలో ఢిల్లీలో జరిగిన దాడుల్లో ఈ రెండు పార్టీలు ఒకటే అని తేలింది. ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చి నెల తిరక్కముందే పార్లమెంటరీ రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యం తాజాగా తన అసలు రంగు బైటపెట్టుకున్నది. పీడిత సమూహాలకు, వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగం ఎంతో కొంత ఆలంబనగా ఉందనే విషయం మర్చిపోకుండానే వలసానంత భారత దేశ చరిత్ర అంతా రాజ్యాంగ విధ్వంస చరిత్రే అనే సంగతి మర్చిపోడానికి లేదు. రాజ్యాంగాన్ని ఒక్క బీజేపీనే ధ్వంసం చేస్తోందని అనుకుంటే చరిత్ర మనకు ఏమీ తెలియనట్టే. అన్ని ఓట్ల పార్టీలు ఈ డెబ్బై ఏళ్లుగా తమ శక్తిమేరకు, అవసరాల మేరకు ధ్వంసం చేస్తునే ఉన్నాయి. కాకపోతే ఆ పార్టీలు కాస్త చాటుమాటుగా చేశాయి. బీజేపీకి ఏ దాపరికం లేదు. అంతే తేడా. ఇట్లాంటి పార్టీకి వ్యతిరేకంగా చాటు మాటుగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన పార్టీలతో కలిసి తక్షణ అవసరం కోసం పని చేయాల్సి వస్తే చేయవచ్చు కూడా. అది రోజువారి వ్యవహారం. అంత వరకే. దానికి సిద్ధాంత పునాదులు నిర్మించాల్సిన పని లేదు.

ఫాసిజం ఇక్కడి దాకా పార్లమెంటరీ మార్గంలోనే వస్తుందని, దీనికి రాజ్యాంగంలోకి సొంత ఆస్తి హక్కు, రాజ్యాంగయంత్రం మీద బూర్జువా వర్గ ఆధిపత్యం కారణమని విప్లవశక్తులు గత ఇరవై పాతికేళ్లుగా గట్టిగా చెబుతూ వచ్చాయి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఫాసిస్టు హింసోన్మాద పరిణామాలకు, మంద్రస్థాయి యుద్ధతంత్రానికి కూడా దగ్గరి సంబంధం ఉంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు వ్యూహం, మంద్రస్థాయి యుద్ధ తంత్రం కలిపి చదువుకుంటే ఇప్పుడు జరుగుతున్న భయానకమైన మానవ హనన దాడులు, మనుషుల అంతరంగాల్లో, చైతన్యాల్లో జరుగుతున్న సూక్ష్మ రూప విధ్వంస క్రమాలు అన్నీ స్పష్టమవుతాయి.

అందుకే ఈ అన్ని రకాల హింసా, దోపిడీ, వివక్షా పూరిత పరిణామాలన్నిటి మధ్య సంబంధం ఉంది. ఈ సంగతి ఇరవై ఏళ్ల నుంచి విప్లవ శక్తులు చెబుతూ వచ్చాయి. కానీ ఎవరి పోరాటం వాళ్లదే అనే సిద్ధాంతం మేధో ప్రపంచపు శిఖరాగ్రానికి చేరుకుంది. అందరికీ మధ్య దగ్గరి తనం పెరగాలని, ఉమ్మడి శతృవు ఉన్నాడని విప్లవకారులకంటే గట్టిగా చెప్పిన వాళ్లెవరూ లేరు. ఉమ్మడి శతృవు పేరుతో మా పోరాటాన్ని దెబ్బతీసే కుట్ర అన్న మేధావులు కూడా ఉన్నారు. ప్రతి పోరాటానికి ఉండే ప్రత్యేకతను గుర్తించాల్సిందే. కానీ ఈ మ్మడి పోరాటమంటే మండిపడ్డవాళ్లున్నారు. రాజ్యాంగానికి లోబడి పని చేసే వాళ్లను కూడా శతృవు ఒదిలి పెట్టడని, బూర్జువా నియంతృత్వం, పార్లమెంటరీమార్గంలో వస్తున్న ఫాసిజం అందరినీ నిర్మూలిస్తుందని చెబితే.. రాజ్యాంగం ద్వారా మాకు లభించే రక్షణను దెబ్బతీయడానికే ఇదంతా అన్న వాళ్లూ ఉన్నారు. వాళ్లే ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

ఇప్పుడు మిలిటెంట్ పోరాటాలపై జరుగుతున్న హింసే శాంతియుత ఆందోళనల మీద బాహాటంగా జరుగుతోంది. ఇప్పటికైనా హింసను తాత్వికంగా అర్థం చేసుకోవాలి. దానికి భారత రాజకీయార్థిక వ్యవస్థలో, హిందుత్వ ఫాసిజంలో, బ్రాహ్మణీయ పార్లమెంటరీ విధానంలో ఉన్నాయని తెలుసుకుంటామా లేదా? అనేదే ప్రశ్న. ఆదివాసీ ప్రాంతాల్లో జరిగిన హింస ఇప్పుడు దేశ రాజధానిలో కూడా జరుగుతోంది. దేశమంతా జరుగుతోంది. హింస ఇప్పుడు అన్ని పీడిత సముదాయాల మీద నిత్యకృత్యమైంది. ఆదివాసుల పక్షాన నిలబడ్డ మేధావుల మీద అమలైన హింస ఇవాళ దళితులు, ముస్లింలు, మహిళల పక్షాన నిలుచున్న మేధావుల మీద, రచయితల మీద, విద్యార్థుల మీద జరుగుతోంది. ఆ రోజు శాంతియాత్ర వంటి అనేక అభియాన్ల రూపంలో చత్తీస్ గడ్ లో మేధావులకు నిలువ నీడ లేకుండా చేశారు. ఇప్పుడు మహా నగరాల్లో కూడా రచయితలకు, మేధావులకు జీవించే స్వేచ్ఛ లేకుండా పోయింది. అందరూ అర్బన్ మావోయిస్టులుగా, దేశద్రోహులుగా, టెర్రరిస్టులుగా జైళ్లపాలవుతున్నారు. అక్రమ కేసుల్లో ఇరికించబడుతున్నారు. అనేక కొత్త రూపాల్లో ఫాసిజం తన నిజమైన అణచివేత, హింస, ఆధిపత్యం బట్టబయలు చేసుకుంటున్నది. ఆనాటి పీవీ నరసింహారావు, చిదంబరం దగ్గరి నుంచి మన దగ్గర చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మధ్యలో వాళ్ల నాయన రాజశేఖరరెడ్డి ... అందరూ కేంద్రంలో, రాష్ట్రాల్లో అనుసరించిన రాజకీయార్థిక దోపిడీ విధానం ఈ ఫాసిజానికి పునాది. ఇవాళ రాహుల్ గాంధీ, చిదంబరం సుద్దులు చెబుతుంటే వినడానికి అసహ్యంగా లేదూ.ఒకసారి మంద్ర స్థాయి యుద్ధ తంత్రాన్ని చదివితే బస్తర్ లో శాంతి యాత్రలు, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై కొనసాగుతున్న అణచివేత రూపాలు, సీఏఏ-ఎస్ఆర్ సీలను వెనక్కి తీసుకొనేదే లేదనే మోదీ బరితెగింపు కూడా అందులో భాగమని తెలుస్తుంది.

రాజకీయార్థిక, సైనిక, భావజాల, సాంస్కృతిక, చట్టపరమైన దోపిడీ, అణచివేత వ్యూహానికి.. బ్రాహ్మణ్యం, పితృస్వామ్యం, మెజారిటీవాదం మొదలైనవాటి అణచివేత రూపాల పనితీరుకు మధ్య ఉన్న సంబంధం చాలా సన్నిహితమైనది. మావోయిస్టు రహిత భారత్, ముస్లిం రహిత భారత్ అనే నినాదాల మధ్య పని చేస్తున్న భావజాలం, యుద్ధ తంత్రం గురించి తెలుసుకుంటే అంతిమంగా ఈ దేశ పీడిత సమూహాల ఎదుట ఉన్న సంక్షోభం కూడా అర్థం అవుతుంది. అందరూ ఐక్యం కావడానికి ఈ ఎరుక అవసరం.

No. of visitors : 599
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •