విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు

- అల్లం రాజయ్య | 05.03.2020 12:30:34pm


దండకారణ్యంలో విప్లవోద్యమం విస్తరించి, నిలదొక్కుకొని కొనసాగుతున్న క్రమానికి దాదాపు నలభై సంవత్సరాలు (1980 - 2020). రైతాంగ పోరాటాలు 1977 అత్యవసర పరిస్థితి ఎత్తేసిన తరువాత కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతమైన క్రమంగా నిజామాబాదు, వరంగల్, ఖమ్మం నుండి అన్ని జిల్లాలకు సింగరేణి గనులకు విస్తరించాయి. బేస్ ఏరియా నిర్మాణం - అడవిలోకి విస్తరణ లక్షణంగా ఉద్యమ ప్రాంతాల నుండి ఎదిగిన విప్లవకారులు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ సరిహద్దుల గుండా - అటు మహారాష్ట్ర, దండకారణ్యంలోని 1980లో విస్తరించారు.

దాదాపుగా 1980 నుండి దండకారణ్య విప్లవోద్యమంలో నేరుగా పాల్గొంటున్న విప్లవకారుల నుండి అనేక సాహిత్య కళా రూపాలు వెలువడుతున్నాయి. వారి సాహిత్య కృషికి సంబంధించి ముప్పై ఏళ్ల దండకారణ్య సాహితీ, సాంస్కృతికోద్యమ చరిత్ర (1980 – 2010) పేరుతో విరసం ఒక పుస్తకంగా ప్రచురించింది. ఈ దండకారణ్య యుద్ధ క్షేత్రం నుండి తమ అనుభవాలను సుబ్బారావు పాణిగ్రాహిలాగా - ఒక చేత్తో పెన్ను, మరొక చెత్తో గన్ను పట్టి సాధన రాసిన నవలలు సరిహద్దు, రాగో, వనజ రాసిన భూమిపుత్రిక నవల విడుదలయ్యాయి. అదే క్రమంలో విరసం దండకారణ్య కథలు ప్రచురించాలనే సంకల్పంతో అరుణతారలో వచ్చిన కథలను 2005 - 2012, పదహారు కథలలో మొదటి సంకలనం, 2013-2015 ఎనిమిది కథలతో రెండవ సంకలనం తెచ్చింది. ఇప్పుడు 2016-2019 పదనాలుగు కథలతో మూడో సంకలనం తెస్తున్నది. ఇవికాక 1980 నుండి 2005 దాకా వచ్చిన కథలున్నాయి... అవి కూడా తేవల్సినవి. ఒక్క దండకారణ్యమే కాకుండా ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నేపథ్యంలో, నల్లమల నేపథ్యంలో, మైదాన ప్రాంతాలల్లో నుండి విప్లవోద్యమం నుండి వచ్చిన కథలున్నాయి. ఇవన్ని అందుబాటులోకి వస్తే - గత యాభై సంవత్సరాలుగా, మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్యపరంగా మరింత అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

దండకారణ్య కథల రెండు పుస్తకాలకు వివరంగా ముందు మాటలు రాశాను. అయితే యుద్ధరంగం నుండి కథలు రాయడం కుదిరే పని కాదు. వారికి దొరికిన కొద్ది సమయంలో రాసిన కథలివి. అందులో కూడా ముఖ్యంగా ఆదివాసీ రచయితలు రాసిన సాహిత్యం మనకు అందుబాటులో లేదు. ఈ కథలన్నీ మహిళా విప్లవకారులు ఎక్కువగా రాసినవి. అందులోను వారి వ్యక్తిగత అనుభవం, సామాజిక అనుభవం, విప్లవ అనుభవంగా పరిణామం చెందుతున్న అనేక దళాలకు సంబంధించి రాసినవి.

ఈ మూడో సంకలనంలోని కొన్ని కథల్లోని వస్తువు ఈ కాలానికన్నా ముందు కాలానికి - ముందు పరిస్థితులకు సంబంధించినవి. కారణాంతరాల వలన ఈ కాలంలో రాయడం, ప్రచురించడం జరిగినవి.

దండకారణ్యంలో ముఖ్యంగా చత్తీస్ ఘ్లో రమణసింగ్ సుదీర్ఘకాలం అంటే పదిహేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను ఒకే పార్టీ బిజేపి ఉండటం మూలకంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కూడా - అర్ధవలస - అర్ధ భూస్వామిక స్వభావం, దానికి తోడు కరుడుగట్టిన బ్రాహ్మణీయ హిందుత్వ పోకడలతో కొనసాగింది. దండకారణ్యం నిండా అంచెలంచెలుగా ఇప్పటి దాకా నాలుగు లక్షలకు పైగా సైన్యాన్ని, సిఆర్ పిఎసను, నాగా బార్డర్ ఫోర్సును, దించి ఏర్ బేసులు నిర్మించి అత్యంత అధునాతనమైన ఎం1-17 లాంటి హెలికాప్టర్లను దించి ఆదివాసీ గూడాలను రక్త సిక్తం చేశాడు. మరోపక్క దండకారణ్యంలోని విలువైన ఖనిజ సంపద తరలించుకపోవడానికి బహుళజాతి కంపెనీలు - మహేంద్ర కర్మలాంటి కాంగ్రెసు ఆదివాసీలకు లోపాయకారిగా డబ్బు పంచి సల్వాయిజుడుం లాంటి చట్టవ్యతిరేక సంస్థలను అత్యంత కౄరమైన గుండా గ్యాంగులను గూడేల మీదికి తోలాడు. గ్రామాలు తగులబెట్టి, వందలాది మందిని హత్య చేసి, ఆడవాళ్ల మీద హింసాకాండ జరిపి - ఆదివాసీలను విప్లవోద్యమాల నుండి దూరం చేయడానికి పోలీసులతో కలిసి నాజీ కాన్సంట్రేషన్ లాంటి శిబిరాలను నడిపాడు.
ఇలాంటి అన్ని రకాల నిర్బంధాలను, ఎత్తుగడలను విప్లవోద్యమం తిప్పికొట్టింది...

అంతిమంగా 2018 ఎన్నికలల్లో రమణ్ సింగ్ ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ కు సంబంధించిన భూపేశ్ బాగేల్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరు వేరయ్యా యి. గ్రీన్ హంట్ మూడో దశ ఇప్పుడు నడుస్తోంది. దండకారణ్యంలో కీలకమైన ప్రాంతాలల్లో ఏర్ బేస్లు నిర్మించి మహిళలు, యువకులకు గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వడం - మాడను క్రమంగా ఆక్రమించడం - అన్ని బార్డర్లను మూసేసి - విప్లవోద్యమాన్ని చుట్టుముట్టి ముట్టుబెట్టే ఎత్తుగడను అనేక మార్లు అమలు చేసినట్టుగానే ఇప్పటి ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నది. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, తెబాగా, నక్సల్బరీ, శ్రీకాకుళంల నుండే కాక - తరతరాలుగా తమ సమస్తాన్ని దోచుకుంటున్న బ్రాహ్మణీయ భూస్వామ్యంతో వలసదారులతో ఆదివాసులు చేస్తున్న పోరాటాల అనుభవం నుండి విప్లవోద్యమం నేర్చుకున్నది. గత యాభై సంవత్సరాలల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలల్లో కొనసాగిన విప్లవోద్యమాలల్లో ఎన్నో విధాల నిర్బంధాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నది.

భారత దేశ గతితార్కిక, చరిత్రను, సమాజాన్ని గతితార్కికంగా అధ్యయనం చేస్తూ - ఆచరణ ద్వారా ఎప్పటికప్పుడు తమ పోరాటాలను అధ్యయనం చేస్తూ పురోగమిస్తోంది.ఉత్పత్తి వనరుల పంపకం, ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి సంబంధాల ప్రజాస్వామీకరణ లక్ష్యాలతో, నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించే లక్ష్యంతో - భారతదేశంలోని దళిత, ఆదివాసీ, మహిళ, బహుజన, మత మైనారిటీలను విప్లవోద్యమంలో సమీకరిస్తోంది. ఈ కర్తవ్యంలోని భాగంగా - ప్రజల పార్టీ, ప్రజా సైన్యం, ఐక్యసంఘటనలను నిర్మిస్తోంది. దండకారణ్యంలో - స్థావర ప్రాంతంగా గత నలభై సంవత్సరాలుగా క్రమంగా అభివృద్ధి చేస్తున్నది. అందులో ముఖ్యమైంది. జనతన సర్కార్ పైన పేర్కొన్న మూడు లక్ష్యాలతో ఆదివాసి ప్రాంతాలల్లో భూమి పంపకం, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు, నీటి వనరులు, బావులు, కుంటలు, చెరువులు, తవ్వకం, భూమిని చదును చేయడం, సారవంతం చేయడం, సాంప్రదాయిక వ్యవసాయం స్థానే ఆధునిక వ్యవసాయం కూరగాయాల పెంపకం, రైతులకు శిక్షణ, పాత సాంప్రదాయిక తెగ పెద్దల అధికారాల తొలగింపు అభివృద్ధి నిరోధకమైన కోయిదాలు పద్ధతుల మార్పు, ఎన్నికల ద్వారా జనతన సర్కారు బాధ్యులు, స్త్రీ - పురుష సమానత్వం, గతితార్కిక,రాజకీయార్థిక శిక్షణ, విద్యా వైద్య నిర్వహణను జనతన సర్కార్ దండకారణ్యంలో కొనసాగిస్తున్నది. ఎప్పటికైనా దోపిడి, పీడన, హింస మరీ ముఖ్యంగా ఉత్పత్తి శక్తులను కులాలుగా విభజించి - పుక్కిటి పురాణాలతో హేతు విరుద్ధంగా - విధ్వంసం చేసిన హిందుత్వ బ్రాహ్మణీయ భూస్వామ్యాన్ని, దానితో మిలాఖతై - దోపిడి చేస్తున్న వలస సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించే దిశగా - వ్యూహంలోని భాగంగా ఎత్తుగడలు ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ యుద్ధరంగంలో విప్లవోద్యమం పురోగమిస్తోంది.

నలభై సంవత్సరాలుగా విప్లవోద్యమాలలో పాల్గొంటున్న ప్రజలు చేస్తున్న పోరాటాలు, తలెత్తుతున్న వైరుధ్యాలు, పరిష్కారం దిశగా నిర్మిస్తున్న కొత్త సమాజం - రూపొందుతున్న కొత్త ప్రపంచం - దాన్ని భావోద్వేగాలతో దండకారణ్య సృజనాత్మక సాహిత్యం చిత్రిస్తున్నది. కనుక దండకారణ్య కథలు విప్లవోద్యమ నిర్మాణ కథలు. గత భారతీయ సాహిత్యం కన్నా పూర్తిగా భిన్నమైనవి. పైగా ఇవి వైయక్తిక అనుభవాల నుండి సామాజిక అనుభవాలుగా, విప్లవానుభవాలుగా, గతితార్కిక, చారిత్రక తాత్విక నేపథ్యంలో రూపొందినవి. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులయ్యే క్రమానికి సంబంధించినవి. ఇలాంటి కథలను అధ్యయనం చేయడం ఒక గొప్ప అనుభవం, అవకాశం . ఈ సంకలనంలోని కథలు ప్రధానంగా సౌలభ్యం కోసం మూడు విధాలుగా నేను అర్థం చేసుకున్నాను. (1) క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తలెత్తే వైరుధ్యాలను పరిష్కరించడం (2) వైరుధ్యాలకు సంబంధించిన గతితార్కిక, చారిత్రక అంశాల అధ్యయనం - వైరుధ్యాల చలనాలను, కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయిలో ప్రజలకు అర్థం చేయించడం. (3) దండకారణ్యంలోని లోపలి శక్తులను అభివృద్ధి చేసుకుంటూ, యుద్ధంలో తర్పీదు చేసుకుంటూ - కాపాడుకుంటూనే వ్యూహంలోని భాగంగా దేశవ్యాపితంగా విస్తరించడం.

ʹసీతాబాయి గెలుపుʹ కథలో - సన్నావ్ గ్రామ జనతన రాజ్యం కమిటీ బాధ్యుడు. అతని సహచరి సీతాబాయి. ఆ ఊరి భూములన్ని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం - వాళ్ల గుండాలు గ్రామం మీద వొత్తిడి తెస్తాడు. సన్నావ్ గ్రామస్థులందరిని ఐక్యపరిచి ఎదిరిస్తాడు. సన్నాను మాయం చేసి ఎన్ కౌంటర్ కట్టు కథ అల్లువారు. సీతాలు సన్నావ్ సహచరి ఆఖరి దాకా పోరాడి - తను ఉ ద్యమంలో నిలబడుతుంది. ఆ మరోకథ ʹతొలి సంజʹ - సల్వాయిజుడుం గుండాలు గ్రామాలను నాశనం చేసి దండకారణ్యంలో భయానక వాతావరణం సృష్టించడం - జుడుం శిబిరం ʹరాహత్ʹ కాన్సంట్రేషన్ క్యాంపు - అందులోని అరాచకాలు చిత్రించిన కథ... ఈ తొక్కిసలాటలో ఆగమైన ఒక గ్రామం గురించి - మోహన్ లాల్ కుటుంబ నేపథ్యంలో చిత్రించిన కథ ఇది. ʹతెగింపుʹ కథ - కమాండరైన తన భర్త పూల్ సింగ్ దళ పోలీసులు పట్టుకొని చంపితే అతని సహచరి సుక్కో ఉద్యమంలోకి వెళ్లింది. ʹధిక్కారంʹ కథ గ్రామాల మీద జరిగే పోలీసు దాడులను ఎదుర్కోవడం - ʹఅమ్మ పాలు ఆయుధాలైన వేళʹ మహిళలు చైతన్యవంతమై పోరాడటం, కొన్ని కారణాలతో ప్రజా వ్యతిరేకులుగా, ఇన్ఫార్మర్లుగా మారిన వారి గురించి ప్రజలందరు చర్చించడం - ʹశిక్షʹ కథ. దండకారణ్యంలోని విప్లవ శక్తులను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించిన కథలు ఇవి. వైరుధ్యాలను ఆచరణ ద్వారా తమ పోరాట శక్తులకు కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఆచరించడం గురించిన కథలు ఇవి.

ʹవిప్లవంలో ఒక తల్లి - తండ్రి కొత్తగా గెరిల్లాగా రిక్రూటైన తమ కూతురు - గెరిల్లాగా ఆమె కర్తవ్యం - ఒక దాడిలో గాభరాలో తుపాకి పొలంలో దాచి పెడుతుంది గెరిల్లా కూతురు - అది మంచిది కాదని - ఇంకోలాగా ప్రవర్తించాలని, తుపాకి కాపాడుకోవాలని తల్లిదండ్రుల అవగాహన. ʹపీలుʹ కథ అలాంటిదే - యుద్ధరంగంలో పెరిగిన బాలుడు పీలు - అతనికి యుద్ధరంగం తుపాకి ద్వారానే అర్థమయ్యింది. తన తండ్రి చిన్న తరహా తుపాకి పట్టడం నుండి ఏకే దాకా నాయకుడుగా ఎదిగి కాల్పుల్లో అమరుడౌతాడు. ఏకే ఉండగా కూడా తన తండ్రి ఎట్లా చనిపోయాడో పీలును వేధించే ప్రశ్న. ఈ కథ అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. యుద్ధరంగం గురించి అనేక ఆలోచనలను కలిగిస్తుంది... ʹవిప్లవ తరంʹ కథలో పెళ్లి అమ్మాయిలు ఇష్టాఇష్టాలతో కాకుండా - పెద్దలు నిర్ణయించిన విధంగా ఒక పీడలాగా పరిణమించిన ఆదివాసీ ʹకోయిదానుʹ ఎదిరించి - అన్ని రకాలుగా తనను తాను విప్లవ కారిణిగా తీర్చిదిద్దుకున్న గెరిల్లా మహిళ కథ. యాభై సంవత్సరాల విప్లవోద్యమంలో - అడుగడుగునా స్త్రీ పురుష సంబంధాల గురించిన వైరుధ్యం చర్చలోకి, ఆచరణలో ఒక కీలకమైన అంశంగా ముందుకు వస్తూనే ఉన్నది. తొలి దశలో చదువుకున్న స్త్రీ పురుషులు ఉద్యమాలల్లోకి రావడం - అనేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆదిలాబాదు, కరీంనగర్ రైతాంగ పోరాటాలు ఉ వ్వెత్తున లేవడంతో తమ కుటుంబాలను వొదిలి - అనేక మంది రైతాంగ మహిళలు విప్లవోద్యమాలల్లోకి వచ్చారు. వాళ్లందరిని విప్లవోద్యమం తమతో పాటు విప్లవోద్యమంలో పురుషులు కలుపుకపోయి పరిస్థితి, అవగాహన, ఆచరణ ఏర్పడలేదు. కాని దండకారణ్యం మొరటు పితృస్వామ్యం గల ఆదివాసి సమాజాల నుండి పెద్ద ఎత్తున మహిళలు పోరాటంలోకి వచ్చారు. ప్రపంచంలో ఏ విప్లవోద్యమంలో లేని పరిస్థితి ఇది. దాదాపుగా పురుషులతో సమానంగా సగ భాగం మహిళలు చేరిపోయారు. ʹమహిళలుʹ సమాజంలో ఉన్న పితృస్వామిక వ్యవస్థ - అణచివేతకు సంబంధించి పెద్ద ఎత్తున ఆలోచించవల్సి వచ్చింది - అనురాధ గాంధీ లాంటి వాళ్లు - నాయకత్వం మహిళల గురించి గతితార్కికంగా, చారిత్రకంగా ఆలోచించి, కార్యకలాపాలు రూపొందించారు.

అయితే పోరాటంలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం జరిగింది కాని - విప్లవోద్యమంలో - తొలిదశలో, విప్లవోద్యమంలో, సమాజంలో పితృస్వామ్యాన్ని అడుగడుగునా మహిళలు ఎదుర్కున్నారు. పోరాడారు. కామ్రేడ్ శ్యామ్ అన్నట్లుగా పితృస్వామ్యంపై అందరం పోరాడినా ఆ పోరాటానికి నాయకత్వం అక్కలదే ఉండాలన్నారు. అట్లా సాకారమైన కథలివి. దాదాపుగా ఈ కథలు రాసిన వాళ్లందరు మహిళలు, కథల నిండా ప్రజా మిలిషియా నుండి, ప్లాటూన్, కమాండర్, డివిజన్ మెంబర్ల దాకా అందరు మహిళలే, ఎక్కువ భాగం కథలు మహిళ పాత్రలతో నడిచినవే. ఇలాంటి పితృస్వామ్య వ్యవస్థ మూలాల గురించి, ఆచరణలో అవి ఘర్షణ పడటం గురించి, అలాంటి వైరుధ్యాన్ని పరిష్కరించడానికి మహిళలు చేసిన పోరాటం, ఆచరణకు సంబంధించిన కథలు ʹసహచరులుʹ, ʹనూతన మానవుడుʹబహుశా భారతదేశ విప్లవోద్యమంలో, అంతిమంగా రాజ్యాధికారం సాధించడంలో మహిళలు కీలక పాత్ర వహించగలరేమో?ఇక మూడో అంశం విస్తరించడం, ఆదివాసీ పోరాటాలన్ని ఎందుకు విఫలమయ్యాయో? గుండాదుర్, బీర్సాముండా, రాంజీగోండు, కొమురం భీం దాకా ఆదివాసులకు తెలుసు. .

ఆర్యుల ప్రవేశం నుండి ఆర్యుల తొలి భూస్వామ్య ఆకాంక్ష, అడవులను నరికి మైదానాలుగా చేసి ఆక్రమించే దశ నుండి ఆదివాసులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఒక పక్క తాము నిర్మించుకున్న సంస్కృతిని కాపాడుకుంటూనే రకరకాల మార్పులకు లోనౌతూ కూడా అడవుల్లో నుండి పోరాడుతూనే ఉన్నారు. ఇంత కాలం మైదానంలో విస్తరించిన బ్రాహ్మణీయ కూర భూస్వామ్యం గురించి, రకరకాలుగా భారతదేశంలో వచ్చి - బ్రాహ్మణీయ భూస్వామ్యంతో రాజీపడ్డ వలస పెట్టుబడి గురించి, ఇప్పటి అర్ధవలస, అర్ధభూస్వామిక సంకర రాజ్యం గురించి ఆదివాసులకు గతితార్కికంగానూ, చారిత్రకంగానూ ఆచరణ ద్వారా, విప్లవోద్యమంలో గత నలుభై సంవత్సరాలుగా తర్ఫీదు పొందుతూనే ఉన్నారు. ఇవ్వాళ ఆదివాసులు ముఖ్యంగా నాయకత్వంలోకి వచ్చిన ఆదివాసులు, ఉత్పత్తి వనరులు, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల గురించి అధ్యయనం చేసినవారు. కనుక గతంలో ఆదివాసి ఉద్యమాలు మిగతా భారతదేశంలోని విస్తరించడం ఒక కలగానే మిగిలి పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన కథలు ʹమౌఖిక చరిత్రకారులుʹ, ʹఅమూల్యంʹʹకామ్రేడ్ పొట్టే ఉత్తరంʹ.

మౌఖిక చరిత్రకారులు - సంచార రాజకీయ తరగతులు, ఒక్క భారతదేశ చరిత్ర మాత్రమే కాదు, మార్క్సిస్టు తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం ఆఫ్రికా ఆదివాసీ సమాజాలల్లో ʹగ్రియేట్ʹ మౌఖిక చరిత్రకారుల్లాగా ఆదివాసులకు అందిస్తూ విప్లవోద్యమం కార్యక్తలు పని చేస్తున్నారు. తరతరాల పోరాటాలను అధ్యయనం చేస్తున్నారు.ʹఅమూల్యంʹ కథ కమ్యూనిస్టు మానవ సంబంధాల నిర్మాణంలో ఎదురయ్యే పాత - కొత్త వైరుధ్యాలను, సమస్యలను భావోద్వేగాల స్థాయి మించకుండా చిత్రించిన కథ. ఈ కథలో నిర్మాణంలోని వివిధ స్థాయిల ఆచరణలు, అనుభవాలుంటాయి. పూసు తను గతంలో తప్పు చేసిన కామ్రేడ్ మీద చేయి చేసుకున్న సంఘర్షణ నుండి కథ నడుస్తుంది. ఈ కథలో సందర్భవశాత్తు ʹరాయిని పొదుగుతే పిల్ల కాదుʹ తత్వశాస్త్రం.. పిల్లలను కొట్టని ఆదివాసీ సమాజం... కథ నిండా నిర్మాణ క్రమంలో పాత ఆదివాసీ సమాజం - బయటి భూస్వామిక సమాజం, కొత్తగా రూపొందుతున్న ప్రజాస్వామిక ఆచరణ మధ్య సంఘర్షణ.

ఇందులో భిన్నమైన కథా నిర్మాణం ఉంది. ఉద్యమ విస్తృతిలో విప్లవకారుల, ప్రజల వ్యక్తిగత అనుభవం, గతితార్కిక మానవ సంబంధాల అధ్యయనం, ఆచరణ ద్వారా దశలు దశలుగా ఎదగడం కనిపిస్తుంది. ఉద్యమ అంతర్గత శక్తికి, నిర్మాణానికి కీలకమైన కమ్యూనిస్టు మానవ సంబంధాల అభివృద్ధి క్రమం చిత్రించనైనది. పలు లోపలి నిర్మాణ సమస్యలు అధిగమించి, కమ్యూనిస్టుగా ఎదగడం, విప్లవోద్యమ విస్తరణలో కీలకమైనది.విస్తరణలో ఉండే సమస్యలను తన అవగాహనతో, చైతన్యంతో చర్చించడం, మధనపడటం ʹకామ్రేడ్ పొట్టే ఉత్తరంʹ కామ్రేడ్ పొట్టే - ఇరువై అయిదేండ్ల యువతి, తన జన్మస్థలం దక్షిణ బస్తర్ నుండి ఉద్యమ అవసరాల రీత్యా ʹమాడ్ʹకు మారింది.

ఆమె అన్న ఊళ్లోనే ఉద్యమ కార్యకలాపాలల్లో ఉన్నాడు. ఆమెకు అర్థమైనంత మేరకు - తను తన సహచరులైన సజాతి, రీహాలతో పాటు ప్లాటూన్ కమాండర్ మంగుతో తన ఆరాటాలను పంచుకుంటుంది. తన అన్న, సహచరులు ఉద్యమ అవసరాలకనుగుణంగా కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఎదుగాలని తాపత్రయం ...తమకన్నా వెనుక వచ్చిన వాళ్లకు సహాయం చేయి, సహకరించు, ఎప్పటికైనా లూటీ సర్కారు గెలుచుకున్నవన్నీ పోతాయి. ఆదివాసీల లడాయి తప్పకుండా విస్తరిస్తుంది. ఇది పొట్టై అవగాహన.మొదట మైదాన ప్రాంతాల నుండి విప్లవకారులు అడవిలోకి దండకారణ్యంలోకి వచ్చారు... ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నారు. విప్లవోద్యమాన్ని తమ త్యాగాలతో యాభై యేండ్లు, మూడు తరాలు నిలబెట్టారు. వేలాది మంది ఆదివాసీ ఆడ, మగ విప్లవకారులను దండకారణ్యం విప్లవకారులుగా తయారు చేసింది. వాళ్ళు కమ్యూనిస్టులు... అక్కడి నుండి 90 శాతం భారతదేశమంతా మైదాన ప్రాంతంలో విస్తరించి ఉన్న దళితులు, బహుజనులు, మహిళలు మత మైనారిటీలలోకి విస్తరించాలనే ఆతురత పొట్టే కల. అంతకంతకూ తమ పునాదులు కదిలిపోగా - నిస్సిగ్గుగా దళారులుగా మారి దేశసంపదను తరలిస్తున్న అర్ధవలస, అనేక రకాలుగా సమాజాన్ని విభజించి తమ హింసాత్మక పరిపాలన సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న బ్రాహ్మణీయ భూస్వాములు కలిసి ఫాసిస్టులుగా అణచివేతకు దిగుతున్నారు. మైదాన ప్రాంతాల ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి వస్తున్నారు.ఈ సందర్భంలో దృఢమైన, తర్పీదైన పొట్టే ఆదివాసీ విస్తరణ కలే భారతదేశ పీడితులందరి కల.అలాంటి కలలకు దారులు తెరిచిన దండకారణ్య కథలను అనుభవంలోకి తెచ్చుకుంటూ...

- అల్లం రాజయ్య

No. of visitors : 564
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెలుతురు న‌ది

అల్లం రాజ‌య్య‌ | 03.07.2016 02:04:45am

ʹʹదళితులు, బహుజనుల స్థితిగతులు, చరిత్ర గురించి పూలే, అంబేద్కర్‌ ఎంతో కొంత చెప్పిండ్లు. కాని మహిళల చరిత్ర ఉందా? లేదా? ఉందేమో తనకు తెలియదేమోʹʹ రాజు లోలోప......
...ఇంకా చదవండి

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 03:11:28pm

రాత్రులకురాత్రుల్లు పిచ్చివాడిగా అరిచినా కూడా వొడువుదు. దిగులుదిగులుగా- తనకే స్పష్టంగానిదేదో పూనినవానిలాగా విరసంలోతిరుగుతూ... తిరుగుతూ.. అప్పటికే విరసంలో.....
...ఇంకా చదవండి

మూడో తరానికి...

అల్లం రాజయ్య | 19.02.2020 03:00:32pm

ఐక్యంగా పురోగమనించడానికి దారులు వెతకడానికి విప్లవ కథ ప్రయత్నించడం కన్పిస్తుంది. ఇందులో కొత్త వస్తువులు, కాలానికి తగిన శిల్ప రీతులు కూడా కనిపిస్తాయి....
...ఇంకా చదవండి

తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం

అల్లం రాజయ్య | 17.12.2019 10:09:31pm

ప్రజాపోరాటాలను, ప్రజా జీవితం లోలోతులు చిత్రించడానికి ఇంత పెద్దఎత్తున రచయితలు, కళాకారులు పూనుకోవడం గతంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడం, క్రమంగా తగ్గడం, ఇప్టా.....
...ఇంకా చదవండి

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 08:48:11pm

కూర్మనాథ్‌ ఈ గడబిడలో ʹనగరంలో ఇంకోరోజుʹ గడవక మరింత పేరుకపోయిన వ్యక్తం గాని, విస్ఫోటనం చెందని అసహ్యాన్ని - భిన్న ప్రపంచాల క్రౌర్యాన్ని - పసిపిల్లల కలలను.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •