ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ

| సాహిత్యం | క‌విత్వం

ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ

- పి.వరలక్ష్మి | 05.03.2020 02:04:25pm

ఆదివాసులు అభివృద్ధి చెందకూడదా? నాగరిక ప్రపంచానికి దూరంగా వాళ్ళెప్పటికీ అడవుల్లోనే ఉండిపోవాలా? అంటుంటారు బూర్జువా మేధావులు. చదువుకున్న సామాన్య మధ్యతరగతి కూడా సుమారుగా ఈ వాదనను మోస్తూ ఉంటుంది. ఆదివాసులు విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారని, కౄర జంతువులు, విషపురుగులు తిరుగాడే అడవుల్లో చిన్న గుడిసెలు వేసుకొని అత్యల్ప జీవన ప్రమాణాలతో బతుకుతుంటారని మైదాన ప్రాంతం వాళ్ళు అనుకోవడం సహజం. ఇందులో నిజం లేకపోలేదు. అయితే పెట్టుబడికి అడవి కావాల్సి వచ్చినప్పుడు, అడవి నుండి ఆదివాసులను బైటికి పంపించెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు గుర్తిస్తారు. పట్టణాలు, నగరాలు అంటేనే అభివృద్ధి అని, మనుషులు సౌకర్యవంతగా జీవించడానికి అన్ని సదుపాయాలు అక్కడ ఉంటాయని కళ్ళు మూసుకుని ప్రవచిస్తుంటారు. ఇందులోనూ కొంత నిజం ఉంది. కానీ వాస్తవానికి నగరాల స్వరూపం ఏమిటి? ఆధునిక విజ్ఞానం, సాంకేతికత పోగేసిన సకల భాగ్యాలతో నిర్మించుకున్న ఆవాసాలు ఒక వైపు. అవి మానవ శ్రమను, ప్రకృతిని పీల్చుకుని వదిలిన విసర్జితాల నడుమ మురికి బతుకులు ఒకవైపు. స్వేచ్ఛాజీవులు, ప్రకృతి ఒడిలో పసిపాపల వంటి ఆదివాసులు విస్థాపితులైతే నగరాల్లో వారికి దొరికే చోటు ఎక్కడో ఊహించవచ్చు. ఈ పుస్తకంలో ఓ ఆదివాసీ అమ్మాయిని సిటీ ఎలా ఉందని అడిగితే గబ్బుకొడుతోందని చెప్తుంది. అంతే కాదు, ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ అంటుంది.

తమ అడవుల్ని కొల్లగొట్టే పెట్టుబడికి వ్యతిరేకంగా శతాబ్దాలుగా ఆదివాసులు పోరాడుతూనే ఉన్నారు. అయితే పెట్టుబడి బుల్డోజర్లతోనే రాదు. సరుకులతో కూడా వస్తుంది. ఎల్లలు లేని పెట్టుబడిదారీ మార్కెట్ అడవుల్లోకి, ఆదివాసీ గూడేల్లోకి ప్రవహించింది. సరుకులు అమ్మింది. కొత్త అలవాట్లను, సరదాల్ని పరిచయం చేసింది. పెట్టుబడి ప్రవాహం వలసల్ని తెరిచింది. పెట్టుబడిదారీ అభివృద్ధి కేంద్రాలైన పట్టణాలు, అత్యంత ప్రాచీన సమాజ అవశేషాలున్న ఆదివాసీ గూడేల మధ్య మానవ సంచారం, పెట్టుబడి ప్రవాహం ఒక ఆసక్తికరమైన అధ్యయనం. దీనిని అర్థం చేసుకోడానికి వలసలు బాగా దోహదపడతాయి.

మెరుగైన జీవితం కోసం కొందరు, పొట్ట కూటి కోసం కొందరు ఊర్లు దాటి, దేశాలు దాటి వలసలు పోవడం ప్రపంచమంతటా ఉంది. అసలు మానవ నాగరికతా చరిత్రంతా వలసలతో ముడిపడి ఉంది. వలసలన్నీ ఒకటి కాదు. దోపిడి చేయడానికి వలస వచ్చిన వాళ్ళు, దోపిడికి గురై వలసపోయిన వాళ్ళు వ్యవస్థలోని పరస్పర వ్యతిరేక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తారు. దోపిడి మూలంగా వలసలకు నెట్టివేయబడిన వాళ్ళు వలస కూలీలుగా మరింత దోపిడికి గురవుతారు. ఈ పుస్తకం కూలి పనుల కోసం తాత్కాలిక వలసలు పోతున్న చత్తీస్ ఘడ్ ఆదివాసీలను పరిచయం చేస్తుంది. పెట్టుబడిదారుల దురాక్రమణ వల్ల అడవుల అండ కోల్పోయి చెల్లాచెదరయ్యే ఆదివాసులు ఏమవుతారో మనకు తెలీదు. ఇక్కడ కొన్ని నెలల పాటు పనులకోసం పోయి వచ్చిన ఆదివాసులు తాము చూసిన పట్నం గురించి చెప్తారు. అది మనం కలలో కూడా ఊహించలేనంత భయానకంగా ఉంటుంది. పట్టణ నాగరికత, అభివృద్ధి ఆదివాసులకు ఏమిస్తుంది అనే విషయం మనకు తేటతెల్లం అవుతుంది.

వర్గపోరాట ఆచరణలో ఉన్న విప్లవోద్యమం ఈ వలసలను ఎలా అర్థం చేసుకుంటోంది? ఒక ప్రత్నామ్నాయ అభివృద్ధి నమూనా ఆచరణలో ఉన్న ఏకైక ఉద్యమం వలసలకు చూపుతున్న పరిష్కారం ఏమిటి? ఈ ఆసక్తులే చత్తీస్ ఘ్రడ్ అటవీ ప్రాంత వలస కూలీల మీద అధ్యయనం చేయడానికి రచయితను ప్రేరేపించాయి. చత్తీస్ ఘడ్ ఆదివాసులు రాష్ట్రాలే కాదు, దేశాలు కూడా దాటిపోయారు. మలేసియాలో నిర్బంధ కూలీల దయనీయ స్థితి అంతర్జాతీయ స్థాయిలో వార్త కథనం అయింది. అసలు వాళ్ళెందుకు వలసలు పోవలసి వస్తోంది అక్కడ భూమి లేని వాళ్ళు ఎవరూ లేరు. వ్యవసాయం కాక 27 రకాల అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా ఉపాధికి కొదవ లేదు. ఆకలి చావులు లేవు. వ్యవసాయ సంక్షోభం లేనందున ఆత్మహత్యలు లేవు. కారణం ఒకటే. మార్కెట్. అది అడవి బిడ్డల చమటా, నెత్తురూ జుర్రుకునే విధానం ఈ పుస్తకం మనకు కళ్లకు కడుతుంది. గమిత 2016-17 మధ్య తయారు చేసిన ఈ రిపోర్టు నేరుగా ఆదివాసీల అనుభవాలను రికార్డు చేసింది. దానితో పాటు విప్లవోద్యమం వలసల మీద నిర్వహించిన వర్క్ షాప్ విశ్లేషణలను కూడా అధ్యయనం చేసి రచయిత తన పరిశీలనలు పొందుపరిచారు. మొత్తంగా వలసల అధ్యయనానికి ఆదివాసీ సమాజం వైపు నుండి చేసిన ఈ పరిశీలన అవసరమైన చేర్పునిస్తుంది.

సాధారణంగా వ్యవసాయ, చేతి వృత్తుల సంక్షోభం నుండి ఉపాధి లేమి నుండి కూలి పనులు వెదుక్కుంటూ వలసలుపోతారు. కానీ ఇక్కడి వలసలకు కారణాలు వేరు. సాధారణంగా చూసినప్పుడు ఎక్కడైనా వలసలను తయారుచేసేది వర్గ దోపిడియే. అయితే ఇక్కడ దాని రూపం, స్థాయి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆదివాసుల శ్రమను మార్కెట్ అత్యంత చవకగా కొల్లగొట్టేస్తుంది. అటవీ ఉత్పత్తులకు గాని, వ్యవసాయ ఉత్పత్తులకు గాని ఊహించలేనంత తక్కువ ధర చెల్లించి వ్యాపారస్తులు మోసం చేస్తారు. కొలతలు, తూకాల్లో మోసం సర్వసాధారణం. సరుకుల మార్కెట్ సాధారణ గ్రామీణులకే మాయాజాలంలా ఉంటుంది. ఇక ఆదివాసులకు చెప్పనక్కర్లేదు. తమ శ్రమని డబ్బు రూపంలో మారకం చేసుకునే క్రమంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ దోపిడికి గురయ్యేది ఆదివాసులే. తిండి, నీరు, నివాసం ప్రకృతి తల్లి ప్రసాదిస్తుంది. జీవన శైలి వల్ల ఇతర అవసరాలు వీళ్లకు చాలా తక్కువ. అయితే ఆ కనీస అవసరాలు తీర్చుకోవాలంటే బైటి మార్కెట్ మీద ఆధారపడాల్సిందే. మైదాన ప్రాంతంలో నెత్తురు పీల్చే మార్కెట్ ఆదివాసీ ప్రాంతాల్లో మనుషుల్ని నిలువునా పీక్కు తింటుంది. ఇక్కడ వ్యవసాయానికి చెప్పుకోదగ్గ పెట్టుబడి ఏమీ ఉండదు.

కానీ భూమి చదును చేసుకోడానికి, ఎడ్లు కొనుక్కోడానికి డబ్బుల్లేక, వాటిని సంపాదించుకోడానికి వలసపోవడానికి సిద్ధపడతారు. ఎప్పుడూ పట్టణం చూడని ఆదివాసులు ఏజెంట్ల మీద ఆధారపడతారు. ఏజంట్లు వీళ్ళను కాంట్రాక్టర్లకు అమ్మేస్తారు. ʹఅమ్మేస్తారుʹ అనే మాట విని మొదట ఈ పుస్తక రచయిత చాలా ఆశ్చర్యపోతారు. కానీ ఒకసారి వలస కూలీ అయ్యాక ఆ వ్యక్తి యజమానికి బానిసే అవుతాడని అర్థమవుతుంది.

మొదట ఆదివాసుల శ్రమను అడవిలోకి ప్రవేశించిన పెట్టుబడి కొల్లగొడుతుంది. అదే పెట్టుబడి బైటి నుండి తన సరుకుల్ని అమ్మి మరోసారి కొల్లగొడుతుంది. అట్లా దోపిడికి గురైన ఆదివాసీ తన అవసరాల కోసమో, ఆసక్తుల కోసమో పట్టణానికి వలసపోయి మరింత ఎక్కువ దోపిడికి గురవుతాడు. ఉదాహరణకు మొబైల్ ఫోన్ కొనుక్కోడానికి డబ్బు సంపాదించాలని కూలిపనికి పోయిన ఆదివాసీ నెలరోజుల పాటు రెక్కలు ముక్కలు చేసుకుంటేగాని వెయ్యిరూపాయిలు సంపాదించడు. అట్లా ఓ నాలుగు నెలలు పనిచేసి ఫోను కొంటే అది నెలరోజులకే పాడైపోతుంది. స్వేచ్చగా అడవిలో తిరుగాడిన ఆదివాసీ స్త్రీ పురుషలు కిక్కిరిసిన పని స్థలాల్లో 12 నుండి 24 గంటల వరకు పనిచేస్తూ దుర్గంధం వెదజల్లే మురికివాడల్లో జీవించాల్సి వస్తుంది. నాగరిక చట్టాలేవీ ఆదివాసుల దరిచేరవు సరికదా పోలీసులు, ఏజెంట్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పారిపోను కూడా వీల్లేకుండా వీళ్ళను నిర్బంధిస్తారు. ఒప్పుకున్న కాంట్రాక్టుకు రెట్టింపు పనిచేసి ఇస్తామన్న డబ్బుల్లో సగానికన్నా తక్కువ చేతిలో పెట్టినా అడగడానికి ఏ దిక్కూ ఉండదు. అనారోగ్యాలు, ప్రమాదాలు, చావులకు ఎవరూ బాధ్యత వహించరు. ప్రకృతి బిడ్డలపై ఇంతటి అమానుషత్వాన్ని ప్రదర్శించే పెట్టుబడి ఇంకో పని కూడా చేస్తుంది. అది ప్రవహించనమేరా ప్రకృతిని ధ్వంసం చేస్తుంది. ʹఒక్క చెట్టు కూడా లేనిʹ పట్టణాలను తయారుచేసి ఆ పట్టణాలను అభివృద్ధి చేయడానికి అడవుల మీదికి దండెత్తుంది.

చత్తీషుడ్ ప్రాంతం నుండి వలసలు పెరగడానికి ఒక కారణం మార్కెట్ విస్తరణ అయితే మరో ముఖ్య కారణం పోలీసుదాడులు. తమ అడవిని కాపాడుకోడం కోసం కార్పొరేట్ శక్తులకు ఎదురొడ్డి పోరాడుతున్న ఆదివాసులపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఆదివాసీ గూడేల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న రాజ్యం వారిని అడవుల నుండి తరిమెయ్యాలనే లక్ష్యంతోనే సైన్యాన్ని మోహరించింది. ఇట్లా దాడులకు గురై ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వలస వచ్చిన ఆదివాసులపై తిరిగి దాడులు చేసిన ఉదాహరణలు కూడా ఎన్కో ఉన్నాయి. అరెస్టులు, అక్రమ కేసుల నుండి బయటపడడానికి లాయర్ ఫీజులు చెల్లించి అప్పులపాలైన వాళ్ళు, వాటిని తీర్చడానికి వలస కూలీలుగా మారాల్సి వస్తుంది.

ప్రకృతిని పరిరక్షిస్తూ జీవజాల మనుగడకు దోహదం చేస్తున్న ఆదివాసులకు నాగరిక సమాజం ఇచ్చేది దోపిడి, పీడన, అవమానాలు, అత్యాచారాలు. ఇది తెలుసుకున్న ఆదివాసీలు అడవి కన్నా సురక్షితమైన ప్రాంతం మరోటి ఉండదు అంటారు. అందుకే జిల్ జంగల్ జమీన్ ఇజ్జత్ కోసం వారి పోరాటం ఎంత అనివార్యమో అర్థం చేసుకున్నారు. పోరాటం, ప్రత్యామ్నాయ అభివృద్ధికే కాదు మరెన్నో విషయాల్లో ఆదివాసుల నుండి ʹనాగరీకులుʹ నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మనం కోల్పోయిన ప్రకృతి, సహజ సిద్ధ ఆహారం, స్వచ్ఛమైన నీరు ఆదివాసులు కాపాడుకుంటున్నారు. గాలి, నీరు, ఆహారం పెట్టుబడి పాలుచేసి తమ స్వేచ్ఛకు సంకెళ్ళు తగిలించుకుని ఆదివాసులు అభివృద్ధి చెందాలి కదా అని మాట్లాడేవాళ్ళకన్నా ఆదివాసులు అమాయకులా అనే ప్రశ్న ఈ పుస్తకం సంధిస్తుంది. అయితే ఆదివాసులకు అన్నీ ఉన్నాయని, ఆ ప్రాచీన జీవన విధానం చక్కగా హాయిగా ఉందని, పాత సమాజమే మెరుగైనదని నిర్ధారణ వస్తే పొరపాటు. మనుగడ కోసమే కాదు, ప్రగతిశీల మార్పు కోసం కూడా ఆదివాసులు పోరాడుతున్నారు. ఆదివాసీ సమాజంలోని ప్రగతి నిరోధక సంప్రదాయాలను, కట్టుబాట్లను ఛేదించుకొని సమష్టితత్వం, పోరాటశీలత కాపాడుకుంటూ మెరుగైన సమాజాన్ని నిర్మించుకుంటున్నారు. విప్లవోద్యమంలో భాగమై ఒకవైపు పెట్టుబడి ప్రవాహాన్ని, విధ్వంసాన్ని ఎదుర్కునే వీరోచిత పోరాటం చేస్తూనే సమానత్వం, స్వయంపాలన పునాదుల మీద కొత్త సమాజాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యమం ఎదుర్కునే ఎన్నో సవాళ్లలో వలసలు కూడా ఒకటని అది అంగీకరిస్తుంది. దానికీ పోరాటమే పరిష్కారం. కానీ అడవి నుండి వలస వచ్చే ఆదివాసులు అర్ధబానిసల్లా, ఒళ్ళు గగుర్పొడిచే దోపిడి, పీడనకు గురవుతున్న విషయం ప్రజాస్వామికవాదులు గుర్తించాలని, వారి పక్షాన నిలవాలని కోరుకుంటోంది. అందుకు ఈ పుస్తకం దోహదపడుతుందని ఆశిద్దాం.

No. of visitors : 302
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •