వెలుతురు న‌ది

| సాహిత్యం | క‌థ‌లు

వెలుతురు న‌ది

- అల్లం రాజ‌య్య‌ | 03.07.2016 02:04:45am

తెలంగాణ ఫాస్టు ప్యాసింజరు రైలు జనగామ స్టేషన్‌ దాటి కాజీపేట వైపు దూసుకపోతున్నది. ఎండాకాలం, పెండ్లిల్ల సీజన్‌ కావడంతో యమరద్దీగా ఉంది. సీట్ల మధ్య, దారిలో చాలా మంది నిలబడి ఉన్నారు. ఊపిరి సలుపని అంత రద్దీలో కూడా సమోసాలు, పండ్లు అమ్మేవాళ్ళు బోగీల్లో తిరుగుతున్నారు.

కొత్తగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వలన, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రావడం తోటి- రైలు పెట్టెలో మొగవాళ్ళు చాలామంది ఎన్నికల గురించి, రాజకీయ పార్టీల గురించి గరం గరంగా వాదించుకుంటున్నారు. షటిల్‌ రైలు గనుక బస్సులో లాగా సీట్లు ఇరుకిరుగా ఉన్నాయి. ఎవరెవరు, ఎవరెవరితో, ఏం మాట్లాడుతున్నారో తెలియకున్నది? ఆ రొదలోనే పళ్ళు అమ్మేవాళ్ళ అరుపులు- మొత్తంగా బోగీలో విచిత్రమైన స్వర సమ్మేళనం.

కిటికీ పక్కన కూర్చున్న యువతి ఒళ్లో నోటుబుక్కు, పుస్తకం మీద చేతులుంచుకొని వెనక్కి పరుగెత్తుతున్న బోడికొండలను, బీడుపొలాలను, సుదూరంగా కనిపించే ఆకాశాన్ని చూస్తున్నది.

ఆమె పక్క ఒదిగి మధ్యలో కూర్చున్న యువకుడు ఆమెతో మాట కలపాలని ఎప్పటినుండో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అబ్బాయికి మరోపక్క కూర్చున్న ఒక నడీడు షావుకారి అంతులేని నిద్రలో జోగుతున్నాడు.

ʹʹఏం చదువుతున్నారు?ʹʹ యువకుడు.

ʹజవాబు చెప్పాలా వద్దాʹ నిర్ణయించుకునేందుకు యువతి, యువకుని కేసి చూసింది. తీక్షణమైన మెరిసే కళ్ళు, మెరిసే శుభ్రమైన బట్టలు, ʹపర్లేదు మాట్లాడచ్చుʹ నని మనసులో అనుకొని ʹʹబి. యే.ʹʹ అన్నది.

మాటలు పొడిగించడానికి అవకాశం దొరికినందుకు అతని ముఖంలో చిన్న వెలుగు.

ʹʹఅందరు ఇంజెనీరింగు, డాక్టర్‌ కోర్సులు చదివితే- మీరు బి. యే?ʹʹ

ʹʹఅందరి తీర్గనే నాకుంటదమ్మా- కాని కష్టపడి చదువొద్దు? చదివినా అది మన తలకెక్కద్దూ! అసలే నాది మట్టిబుర్ర- అందులో బోలెడు చెత్త చెదారంʹʹ

ʹʹఅసలు మీరు ఏం చదువాలనుకున్నరు?ʹʹ

ʹʹనాకేడ గంత గనం తెలుసుగని? అయినా మా కులాలల్ల ఆడపిల్లలకు ఏ చదువు కావాలో ఎవరాలోచిస్తరు? పాపం మా డాడీకి నేను డాక్టరు కావాలని ఉండెʹʹ

ʹʹమరి. .ʹʹ

ʹʹఇంటర్‌లో బైపీసీ తీసుకున్నమనుకో మటాష్‌ గదʹʹ

ʹʹఅదే! ఎందుకు?ʹʹ

ʹʹనాలాంటి ఎక్స్‌ట్రాలకు అటు డాక్టరుకు సీటు రాదు, పోనీ పార్మసీ చేద్దామనుకున్న మళ్ళే రూటుకు పోరాదుʹʹ

ʹʹసో ఆఖరుకు బి. యే. సెలక్టు చేసుకున్నారన్నమాటʹʹ

ʹʹఅట్లయ్యింది- మా నాన్న నర్వస్‌. మా అమ్మ ఫుల్‌ ఖుష్‌ʹʹ

ʹʹమీ అమ్మెందుకు కుష్‌?ʹʹ

ʹʹమా నాన్న మా అమ్మకు తెలివి లేదంటడు. పాపం తనొక్కతే తెలివిలేనిదయితదని నేను జత కల్సినʹʹ

ʹʹఅట్లెందుకనుకుంటరు? బి. యే. అన్నిటికి రూటు. పైగా సొసైటి గురించి తెలుస్తుందిʹʹ

ʹʹఅదే బోర్‌. నాకు రాజకీయాలంటే బోర్‌ʹʹ

ʹʹఔనా! ఎందుకంటరు?ʹʹ

ʹʹప్చ్‌! తెలియదు. ఎప్పుడు సీరియస్‌గ ఆలోచించలేదు. ఔను మీ బాయ్స్‌కు రాజకీయాలంటే ఇష్టమా?ʹʹ

ʹʹఇష్టమే! అయితే మీరు ఓటు ఏ పార్టీకి వేస్తరు?ʹʹ

ʹʹఓటంటే.. చూడాలి. మీరు?ʹʹ

ʹʹఎలక్షన్ల పోటీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు దొరలవే. పూటకోమాట. తెలంగాణ ప్రజలు కొట్లాడ్తరు. పానాలు దీసుకుంటరు. ప్రతిసారి ఫలితం దొరలనుభవిస్తరు. అందుకే నేను ఓటు వెయ్యనుʹʹ

ʹʹమీరు సీరియస్సున్నట్టున్నది గదా?ʹʹ

ʹʹసీరియస్సా పాడా! పోనీ మీరు దేని గురించి ఆలోచిస్తరు?ʹʹ

ʹʹఅమ్మాయిలకు లక్ష సమస్యలుంటయమ్మా?ʹʹ

ʹʹమీకు బోర్‌ కొట్టిస్తున్ననా?ʹʹ

ʹʹపర్వలేదు మాట్లాడుʹʹ

ʹʹసరే! తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమాలు చేసిండ్లు- కాలేజీలు బందయినయ్‌. చాలామంది తెలంగాణ కోసం చనిపోయిండ్లు గదా!ʹʹ

ʹʹఔను పాపం ఆత్మహత్యలు చేసుకున్నరు. మన తెలంగాణ మనకు గావాలె. వచ్చింది ఇష్టమేʹʹ

ʹʹటాపిక్‌ మారుద్దాం. బి. యే. తరువాత?ʹʹ

ʹʹఎంబియే చేద్దామనుకుంటున్నʹʹ

ʹʹఎందుకు?ʹʹ

ʹʹఎందుకంటే మేనేజుమెంటు స్కిల్స్‌ వస్తయి. దేన్నయినా ఎదుర్కోవచ్చు- అంటే టోటల్‌గా ఒక లైను ఏర్పడుతదిʹʹ

ʹʹమంచి ఆలోచనే- కాని అట్ల చెయ్యాలంటే సమాజం గురించి తెలువాలెʹʹ

ʹʹఔను సమాజమే. సమాజంలో ఎట్లనైతె తెలంగాణల మనమున్నమో. మనకో కులమున్నది. ఆ కులాన్ని బట్టే సమాజంలో మన స్థానం నిర్ణయమైందిʹʹ

ʹʹఔనా! ఇదంత ఎంబియేలో ఉంటుందా?ʹʹ

ʹʹనాకేడ తెలుస్తది. బి. యే. ల ఏమన్న ఉన్నదా?ʹʹ

ʹʹలేదుʹʹ

ʹʹఅయితే ఈ పుస్తకం చదవండి.ʹʹ అత్యుత్సాహంతో ఆ యువకుడు తన బ్యాగులో నుండి ʹసామాజిక కోణంʹ అనే పుస్తకం తీసి ఇచ్చిండు.

యువతి మొహమాటానికి పుస్తకం తీసుకొని పేజీలు తిరుగేసింది. ఇంతలోనే కాజీపేట స్టేషన్‌ వచ్చింది. యువకుడు రైలు కిందికి దిగిండు. మరింతమంది రైలు పెట్టెలోకి తోసుకు వచ్చారు. ఆ గడబిడలో యువకుడు రైలెక్కేసరికి అతని స్థలంలో మరో యువతి కూర్చున్నది.

మొదటి యువతి ఏదో చెప్పగా- రెండో యువతి సీట్లో నుండి లేవడానికి సిద్ధపడ్డది.

ʹʹపర్వాలేదు కూర్చోండ్లి- నేను నిలబడతానుʹʹ యువకుడు సీటుపక్క దారిలో నిలుచున్నాడు.

రెండో యువతి కొంచెం ఇబ్బంది పడుతూనే కూర్చున్నది. రైలు కదిలింది. రైలు పెట్టెలో మళ్ళీ రొద మొదలయ్యింది. రకరకాల మనుషులు మాటలన్నీ ఇప్పుడే గుర్తొచ్చినట్టు అనేక స్వరాలలో మాట్లాడుతున్నారు. నేపథ్య సంగీతంలాగా రైలు పట్టాల చప్పుడు. మధ్య మధ్య చాయ్‌, పండ్లు, సమోసాలు అమ్మేవాళ్ళ కేకలు. ఎవరిగోల వాళ్ళదే.

ʹʹఏదో పుస్తకం చదువుతున్నవ్‌?ʹʹ రెండో యువతి.

ʹʹసామాజిక కోణంʹʹ మొదటి అమ్మాయి.

ʹʹఔనా! నాకు సోషలంటే బోర్‌ʹʹ

ʹʹనాకు అంతే! నీకు సీటిచ్చిన అబ్బాయి నాకు ఈ బుక్‌ ఇచ్చిండు. పాపం మంచోని తీరున్నడుʹʹ

ʹʹఔనా!ʹʹ

ఇంతలోనే మొదటి యువతి మిత్రడు వెతుక్కుంటూ ఆ బోగీలోకి వచ్చిండు.

ʹʹనేనెంత వర్రి అయిననో తెలుసా! ట్రేన్‌ ఫుల్‌ ప్యాక్‌. నిలబడేందుకే చోటు లేదు. నువ్వు లక్కీ!ʹʹ

ʹʹఅంతే మరి. అమ్మాయిలు ఆల్‌వేజ్‌ లక్కీ- అబ్బాయిలు నిలబడి సీటిస్తరు తెలుసా?ʹʹ

ʹʹఅందరు బకరలుండరమ్మ- అబ్బో అదేం బుక్కుʹʹ

ʹʹసామాజిక కోణంʹʹ

ʹʹఅంటే?ʹʹ

ʹʹనాకేం తెలుసు అబ్బాయిలకు తెలువాలెʹʹ

ʹʹపాపం నీకు పుస్తకమిచ్చిన అబ్బాయి ముకం చూడవే!ʹʹ

ʹʹకొందరంతే పవన్‌ కళ్యాణ్‌ తీర్గ ఏదో మార్చాలని ఆరాటం!ʹʹ

ʹʹపవన్‌ నటుడు. ఇతను అట్ల లేడుʹʹ

ʹʹఔను అది నిజమేʹʹ

ఇంతలోనే జమ్మికుంట స్టేషన్‌ వచ్చింది. తోపులాట మధ్య మొదటి అమ్మాయి దిగిపోయింది. పోతూ పోతూ ʹసామాజికకోణంʹ రెండవ అమ్మాయికి ఇచ్చి పోయింది. ఆమె ఫ్రెండు ఆమెతో పాటె దిగిపోయాడు. రెండవ అమ్మాయి తనకు సీటిచ్చి నిలబడిన యువకున్ని పిలిచింది. అతను వచ్చి మధ్యలో అమ్మాయి పక్క కూర్చున్నాడు. రెండవ అమ్మాయి కిటికీ పక్క సీట్లోకి జరిగింది.

ʹʹనాకోసం ఇంతసేపు నిలబడ్డరుʹʹ

ʹʹఇట్స్‌ ఓకే. పైగా మీరు కొంచెం నీర్సంగా కూడా కన్పించారుʹʹ

ʹʹకాదు అమ్మాయినని ఫేవరు చేసిండ్లు కదూ!ʹʹ

ʹʹఅట్లా అడుగుతే చెప్పడం కొంచెం కష్టమే!ʹʹ

ʹʹనిజం కదా!ʹʹ

ʹʹఆ పిల్ల ఇచ్చిందీ పుస్తకం. నీకు సోషల్‌ అంటె ఇష్టమా?ʹʹ

ʹʹమీకుʹʹ

ʹʹఅస్సలు ఇష్టముండదుʹʹ

ʹʹఔనా మీరేం చేస్తుంటరు?ʹʹ

ʹʹమీరు కాదు నేను, నేను కాకతీయ యూనివర్సిటీలో పి. జి. చేస్తున్నʹʹ

ʹʹఔనా! ప్రాపరెక్కడ? సెలవులకు ఇంటికి వస్తున్నవా?ʹʹ

ʹʹమందమర్రి మార్కెట్‌ ఏరియా- రోజు అప్‌ అండ్‌ డౌను చేస్తున్నʹʹ

ʹʹఅబ్బో! కష్టం కదా!ʹʹ

ʹʹమా పిన్ని హన్మకొండలుంటది. అప్పుడప్పుడు పోత. అయినా రోజు ఇంటికి రావాలన్పిస్తదిʹʹ

ʹʹఅమ్మ కూచీనా..ʹʹ

ʹʹకాదు- అదంతె గని ప్రీగా కూర్చో- నువ్వే చేస్తున్నవ్‌?ʹʹ

ʹʹఉస్మానియాలో పి. హెచ్‌. డి. చేస్తున్నʹʹ

ʹʹఅబ్బో! పి. హెచ్‌. డి. అంటే- డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ కదా. నీకు మనుషుల గురించి బాగా తెలుసు. ఏది మాట్లాడుతె అవతలి వాళ్ళకు బాధ కలుగుతదని కూడా తెలుసుʹʹ

ʹʹఏమో తెలవదిగని కంచె ఐలయ్య పుస్తకాలు చదువుతʹʹ

ʹʹఆయనెవలు?ʹʹ

ʹʹమా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. రిటరయ్యిండు. దళితులు, బహుజనులు ఈ సమాజాన్ని నిర్మించిన ఇంజెనీర్లు. అట్లాంటి దాన్ని ఆక్రమించుకున్న వాళ్ళు అగ్ర కులాలు అంటాడుʹʹ

ʹʹఔనా! నిజం చెప్పాలంటే నాకు అర్థం కాలేదుʹʹ

ʹʹమీదే కులం?ʹʹ

ʹʹఔను గుర్తొచ్చింది. ఇందాక నాకు పుస్తకమిచ్చి దిగిపోయిన అమ్మాయి కులమడిగిన- మాదిగʹʹ

ʹʹఔనా! నాకన్న మీరే పాస్టున్నరు గదʹʹ

ʹʹనా పేరు స్రవంతి. మాది యాదవ కులం. మీ పేరు?ʹʹ

ʹʹఅంటే! నా పేరు రాజు. పద్మశాలిʹʹ

ʹʹస్రవంతి అంటే ప్రవాహంʹʹ

ʹʹపేరు చాలా బాగున్నది. ఒక్కొక్క సారి పేరు తీర్గనే ఉంటరు మనుషులుʹʹ

ʹʹలడ లడ వాగుతున్ననా? మరి కంచె అయిలయ్యంటె?ʹʹ

ʹʹఅబ్బో! నీతో మాట్లాడటం కష్టమే!ʹʹ

ʹʹతను అదే అంటడుʹʹ

ʹʹమీకు పెళ్ళైందా?ʹʹ

ʹʹఆకు- నాలుగు నెల్లయ్యింది. తను బెంగళూరులో ఎలక్ట్రికల్‌ ఇంజెనీరు. నేను ఎక్కువ మాట్లాడ్తనంటడు. తనేమో అతి తక్కువ మాట్లాడ్తడు. మీ తీర్గనే రాజకీయాలంటే చచ్చేంత ఇష్టం. అంత దూరం నుండి అంత కష్టపడి వస్తడా? ప్చ్‌. ఎంతసేపు టీవీ ముందు కూసుండి వార్తలు చూస్తడుʹʹ

ʹʹనువ్వు వార్తలు సూడవా!ʹʹ

ʹʹఅయిదు నిమిషాలు వార్తలు చూస్తే పిచ్చుక్కుతది. టోటల్‌గ అబద్ధాలు. మా డాడికి వార్తలు గావాలె. ఇంతకాలం తెలంగాణ- తెలంగాణ మారుమోగిపోయింది. మా మమ్మికి సీరియల్స్‌ గావాలె- తమ్మునికి కొత్త సాంగ్సు కావాలె- టీవీని చూస్తే భూతం గుర్తొస్తుంది. టీవీలు లేని కాడికి పారిపోతే బావుండు. ఇంతకూ- ఎక్కువ మాట్లాడటం మంచిదా? కాదా?ʹʹ

ʹʹచిల్లర పైసలకు అల్లరి ఎక్కువంటరుʹʹ

ʹʹఅంటే నేను చిల్లర అని కదా? మీరేమన్నా అనుకోండి! నోట్లె నాలిక ఎందుకున్నది? మాట్లాడేటందుకే గదా? మాట్లాడితేనే గదా ఏదైనా తెలిసేదిʹʹ

ʹʹపుస్తకాలు చదివితే తెలుస్తదిʹʹ

ʹʹపుస్తకాలు చదువుతే ఏం తెలుస్తది?ఎందుకు చదువాలె?ʹʹ

ʹʹమనం మన కులం గురించి తెలుసుకోవాలె. సమాజం గురించి తెలుసుకోవాలిʹʹ

ʹʹపుస్తకాలు చదివితేనే మన కులం తెలుస్తదా? లేకపోతే తెలువదా?ʹʹ

ʹʹతెలుస్తదనుకో విద్య ద్వారా వికాసం- వికాసం ద్వారా సంపద- సంపద ద్వారా సామజిక హోదా!ʹʹ

ʹʹనాకు సోషల్‌ అర్థం కాదుʹʹ

ʹʹనువ్వు ఇప్పటిదాకా మాట్లాడినదంతా సోషలే కదా?ʹʹ

ʹʹకొట్లిండ్లు దెబ్బ. ఇంతకూ బాగా మాట్లాడమే మంచిది అంట. నువ్వు ఒప్పుకుంటవʹʹ

ʹʹమౌనం కూడా ఒక భాషేనేమొ?ʹʹ

ʹʹతను అదే అంటడు. అయినా మాట్లాడటం నా కలవాటు. నేనొప్పుకోనుʹʹ

ʹʹఇంతకూ మీ మ్యారేజి అరేంజుడా, లవ్వాʹʹ

ʹʹసగం లవ్వు, సగం అరేంజుడుʹʹ

ʹʹఅదెట్ల?ʹʹ

ʹʹమా చుట్టాలే. ఎప్పుడో నన్ను చూసిండట. వన్నియరు నుండి లవ్వు చేస్తున్నడట. మధ్యవర్తుల ద్వారా తనే ప్రపోజు చేసిండు. నేను సరెనన్న. పెళ్ళికి ముందు చెప్పిండు. వన్‌సైడు లవ్వుʹʹ

ʹʹనీకు లవ్వంటే ఇష్టంలేదా?ʹʹ

ʹʹచెప్పలేను. నాకు కరక్టుగ తెలువదు. అబ్బాయిలు లవ్‌ చేస్తున్నమని ఉత్తగ అంటరు. అమ్మాయిలకు అబద్ధాలు చెప్పుతరు. నేను నిజమే చెప్పడానికి ఇష్టపడుత. అది సరే నీకు పెళ్ళైందా?ʹʹ

ʹʹలే. మా చెల్లె కయినంక చేసుకుంటʹʹ

ʹʹఅదే మంచిది. నీది నువ్వు చూసుకునే రకం కాదు. పట్టింపు ఉన్నోనివే. మీ చెల్లెకు ఎంత వయస్సుʹʹ

ʹʹఇరువై అయిదుʹʹ

ʹʹఆగకుండ చెయ్యాలె. ఏడనన్న పిలగాన్ని ఎదుకుతండ్లా?ʹʹ

ʹʹమా మేనమామే ఉన్నడుʹʹ

ʹʹమామ వరుస చేసుకుంటర? ఏం చేస్తండు?ʹʹ

ʹʹపైనాన్సు పెట్టుకున్నడుʹʹ

ʹʹపార్టునర్సా! పార్టునర్స్‌ అయితే గోవిందాʹʹ

ʹʹఅట్లేం కాదు. పార్టనర్‌ డీడ్‌ ఉంటది. పర్వాలేదు బాగ నడుస్తన్నదిʹʹ

ʹʹపైసల మనిషె. కట్నమెంత?ʹʹ

ʹʹమేము ముగ్గురన్నదమ్ములం. ఒక్కతే చెల్లె. నాకు అయిడియా లేదు కాని ఇరువై లక్షలిస్తరేమొʹʹ

ʹʹమీరు కట్నం తీసుకుంటరా?ʹʹ

ʹʹలేదుʹʹ

ʹʹనీకు రాబోయే పిల్ల అదృష్టవంతురాలు. ఒక్కొక్కసారి పెళ్ళికి ముందు మొగోళ్ళు అట్ల కూడా డామినేషన్‌ చేస్తరు. పెళ్ళైనంక మల్ల కట్నం తీసుకుంటరుʹʹ

ʹʹనువ్వు సూటిగ మాట్లాడి మొత్తానికి నన్నెప్పుడో పడేసినవ్‌ʹʹ

ʹʹలేదు, లేదు- నువ్వు మొగోల్లల్ల మంచోనివిʹʹ

ʹʹఎట్ల తెలుస్తది?ʹʹ

ʹʹపుస్తకాలు చదువుతెʹʹ

ʹʹనాకే కొట్టిండ్లు దెబ్బ. చదువనన్నరు గాదʹʹ

ʹʹపోనియ్యి. నాకు ముఖాలు చదివే అలవాటున్నదిʹʹ

ʹʹఉత్త గ్యాస్‌. అగో, అక్కడ డోరు దగ్గర కూచున్న భార్యాభర్తల గురించి చెప్పుʹʹ

ʹʹచెప్పుమంటవ. ఆమె అట్టకట్ట ఉన్నది గాని నా తీర్గనే బోలా బాలా! కుటుంబం కోసం గొడ్డులాగా కష్టపడుతది. ఆమె మొగుడు ఆమె పక్కన లేకపోతే రూపాయికి గొరగాడు. డైరక్షనంత ఆమెదే. అయినా అది ఒప్పుకోడు. ఆమెను గెలవడానికి తాగుతడు.. మన పక్కన కూచుని లేచిపోయిన షావుకారికి డబ్బు తప్ప మిగతా అంత ఫాల్తు. ఇప్పుడు నీ పక్క కూచున్న పిలగానికి ఫోను, పాటల పిచ్చి. అదో తాగుడులా నశా! అంతకు ముందే లావటామె భర్త పక్క సీటతనితో కొట్లాడిండు.

ఆ గొడువకు ముక్తాయింపుగా అతని భార్య ʹʹఫాల్తు మనిషి- మాది వికారాబాదు దగ్గర, సానా దినాల కింద పొట్ట గడువక మరాఠా దేశం పోయినం. పని చేసుకు బతుకుతం. ఆడ గిదే ఉల్సెకొక్కు సాప తీర్గ ఎగ్తుడు. మా తమ్ముడు మంచి ఇకుమతున్న మనిషి. మా తీర్గ దేశాలు బట్టుక తిరుగక, వికారబాదులనే మంచిగ బతుకుతండుʹʹ

ʹʹమీ తమ్ముని జోలి తీత్తె తంతʹʹ

ʹʹఎహెకు సప్పుడు సెయ్యకుʹʹ గద్దించింది.

మొగనికి ఆ క్లిష్ట పరిస్థితిలో- అంతమంది ముందు పెండ్లాన్ని ఉరుకుతున్న రైల్లో ఏం చేయాలో తెలియలేదు. పండ్లు కొరుకుతూ ఎవరి ముఖం చూడకుండ కూర్చున్నాడు.

ఆమె సమోసాలు కొని నములుతోంది. దేన్నయినా ఎదుర్కునే ధీమా ఆమె ముకంలో, రాటుదేలిన శరీరంలో.

ʹʹఅదే సామాజిక దృష్టి కోణం అంటేʹʹ రాజు.

ʹʹఔనా! ఈ పుస్తకంలో ఇవన్నీ ఉంటయా?ʹʹ

ʹఉంటాయనిʹ గట్టిగా చెప్పలేకపోయాడు.

ʹʹఇంతకన్నా ఎక్కువే రాసుంటరులే. పి. హెచ్‌. డి. చేసే వాళ్లకు ఇట్లాంటివి బోలెడన్ని తెలుస్తయిగదా!ʹʹ ఈసారి స్రవంతి మనస్ఫూర్తిగా అంది.

అతనేం మాట్లాడలేదు. ఆదరువు లేని, దారి దరువులేని చదువులు గుర్తొచ్చాయి. పెద్దపల్లి స్టేషన్‌ వచ్చింది. పెద్ద పెద్ద గ్రానైటు రాళ్ళు లోడింగు యార్డులో పడి ఉన్నాయి. ఖాళీ వ్యాగన్లు లోడింగుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు మాటల రొద. మళ్ళీ సర్దుకొని రైలు వేగం అందుకున్నది. అందరిలో ఏదో కదులుతోంది.

ʹʹమీకు ఇరువైఏడేళ్ళ వయస్సుంటదా? అటెన్క పిల్ల దొర్కది. జెప్పన పెండ్లి చేస్కోండ్లి. ఇరువైఅయిదు సంవత్సరాల ఆడపిల్లలు పెండ్లి లేకుంట చాలా తక్కువుంటరు. నాకు ఇరువై అయిదు, ఆయనకు ఇరువైఏడు. నిన్ను చేసుకునే పిల్ల అదృష్టవంతురాలుʹʹ

ʹʹఅర్థం కాలేదుʹʹ

ʹʹఅర్థం కాకపోవడానికేమున్నది? నేను మనస్ఫూర్తిగనే అన్నʹʹ

ʹʹమాటలకు సప్త స్వరాలుంటాయని, అవి ఆకాశమంత మార్మికంగా ఉంటాయని.. పోనీయ్‌. నీ గురించి చెప్పు.. పెండ్లయినంక ఈ చదువు .. బెంగుళూర్లో తను. . అత్తగారింటికి పోతవా?ʹʹ

ʹʹనువ్వు కవివా? ఇంకా పోలే. బెంగళూరుకు పోతే, నేను మందిల నడువలేక మందితో నడువలేక పడిపోయిన. ప్రతి ఓటమిని కడుపుల పెట్టుకున్న. నా పుట్టిన ఊరు మందమర్రిని- అమ్మ, నాన్నను ఒదిలిపెట్టి పోవాలంటే ఒక్కసారిగా ఆ ట్రాన్స్‌లోకి పోలేకపోతున్న. పెద్దయినందుకు దిగులు. పెండ్లెందుకు చేసుకున్నననే దిగులు. అండర్‌ గ్రౌండ్‌ బగ్గు బాయిలు పోయి, ఓపెన్‌కాస్టు లయినందుకు దిగులు. వాగు, వంక, చెట్టు-పుట్ట, ఊళ్ళు సర్వం మింగుతున్న ఓపెన్‌కాస్టులు ఎందుకాపరో దిగులు. ఆ లావటామె- ఆమె భర్తల మధ్య కిరికిరికి దిగులు. నా దిగుల్లు వింటే బట్టలు చింపుకుంటవ్‌ʹʹ

ʹʹఅట్లంటవేంది? ఎప్పటికైనా భర్త దగ్గరికి పోవాలెగద?ʹʹ

ʹʹకదా! అదే నా సమస్య. భార్య మాత్రమే భర్త ఇంటికి ఎందుకు పోవాలె? భర్తే భార్య దగ్గరికి రావచ్చు గదా! మొగవాళ్ళకు ఈ రంధి ఎప్పటికీ సత్తె తెలువదిʹʹ

ʹʹనిజమే! ఆలోచించలేదు. మీ దిగుల్లు నాకెందుకు లేవు. నేను ఔట్‌సైడర్‌నాʹʹ

ʹʹనువ్వేం చేస్తవు? ఒకటి భూమి, రెండు ఆకాశం, ఎక్కడ కలుస్తయి. ఆడమగ అంటే రెండు వేరువేరు లోకాలు. నా ఆరోగ్యం బావుంటలేదు. నీర్సం. ఏ పని చెయ్యబుద్ధి కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈ చదువు, ఈ రైలు ప్రయాణం, లేపోతే పిచ్చిదాన్నైపోదును. క్లియరుగ చెప్పొస్తలేదు. మాకు తెలిసిన డాక్టరున్నడు. వారానికి మూడుసార్లు నాకు సెలైన్‌ పెడుతడు. రక్తం తక్కువున్నదంటడు. పదకొండు పర్సంటేజు పైన ఉండాలట. ఏడున్నదటʹʹ

ʹʹఔనా! మంచి ఆహారం తీసుకోవాలె. ఆచరణ లేని ఆలోచనలు మనిషిని పీల్చి పిప్పి చేస్తాయంటాడు మా గురువుగారుʹʹ

ʹʹఇన్ని రంధులున్న మాకు సమాజం గురించి ఎట్ల, ఎప్పుడు తెలుస్తది? నా మెదడు చీకటిగది. విద్య వచ్చింది గాని వికాసం రాలేదు. హోదా అంటారా? ఎంతపెద్ద పదవిలో ఉన్నా ప్రపంచంలో ఆడదానికి హోదా ఎప్పుడు రావాలె? ఆడవాళ్ళకు ఆచరణ లేకపోతే, ఈ ప్రపంచం కుప్ప కూలదా? మొగాళ్ళు తాగుబోతులై, పిల్లలు బిచ్చమెత్తుకోరా?ʹʹ

ʹʹనువ్విట్ల ఇంకాసేపు మాట్లాడితే, నా పి.హెచ్‌.డి టాపిక్‌ దండుగనిపిస్తంది. చూస్తే నేనే ఇంకా చీకట్లో ఉన్నాననిపిస్తోందిʹʹ

వాళ్ళిద్దరి పక్కన కూర్చున్న పిల్లగాడు ఒక నిమిషం ఇయర్‌బడ్స్‌ చెవుల్లో నుండి తీసి ʹʹఈ చీకటేందో?ʹʹ అర్థంగాక మళ్ళీ చెవుల్లో పెట్టుకున్నాడు.

ʹʹఅట్లనకు. పి. హెచ్‌. డి, పి. హెచ్‌. డి. యే. మీరు మనుషుల గురించి సమాజం గురించి పరిశోధిస్తరు. కారణాలు తెలుసుకుంటరు. మాదేమో మాయిగాని సవాలక్ష భీతిగొలిపే వెంటాడే పనులు. అడుగడుగున మమ్ముల్ని మేము దాచుకోలేక, దాక్కోను చోటులేక, ఇంతగా పెరిగిపోయిన ప్రపంచంలో మాకంటూ ఏదీ లేక, వద్దు రాజు..ʹʹ

ʹʹదళితులు, బహుజనుల స్థితిగతులు, చరిత్ర గురించి పూలే, అంబేద్కర్‌ ఎంతో కొంత చెప్పిండ్లు. కాని మహిళల చరిత్ర ఉందా? లేదా? ఉందేమో తనకు తెలియదేమోʹʹ రాజు లోలోపల చీకటి వెలుగులు. ఈత చెట్ల మీదుగా ఎటో చూసిండు. రైలు పెద్దంపేటలో ఒక నిముషం ఆగింది. ఎవరూ దిగలేదు. మరెవరూ ఎక్కని స్టేషన్‌లో దిగాలుగా లైట్లు వెలుగుతున్నాయి.

ʹʹనువ్వు మంచిర్యాలలో దిగిపోతవా?ʹʹ

ʹʹఔనుʹʹ

ʹʹనీకో విషయం చెప్పాలి. నాకు నెల తప్పిందిʹʹ

ʹʹఔనా! నువ్వు చెప్పేదాక నీకు పెళ్ళైనట్లే తెలువలేʹʹ

ʹʹఅదేగదా! సిన్మాలల్లో, టీవీలల్ల ఆడవాళ్ళు ధగధగ మెరిసిపోతూ కన్పిస్తరు. ఎవరో కవి చెప్పినట్టు పిల్లంగొయ్యకు నిలువెల్ల గాయాలే. నెత్తురు కారే శరీరం మాది. ఎప్పటికీ ఆడది మొగోనికి తెలువదిʹʹ

ʹʹనాకు ఇప్పటికే దిగిపోయింది. నా పరిశోధన కకావికలైంది. మెదడు ఖరాబయ్యింది. మా అమ్మ గురించి, మా చెల్లె గురించి నాకేమీ తెలువదని అర్థమయ్యింది. పోనీ! ఈ సంగతి మీ ఆయనకు చెప్పినవా?ʹʹ

ʹʹచెప్పనుʹʹ

ʹʹఅదే ఎందుకు?ʹʹ

ʹʹనాకు, మీ అమ్మకు, నీకు తప్ప మరెవ్వరికి తెలువదుʹʹ

ʹʹనాకెందుకు చెప్పినవు తల్లీʹʹ

ʹʹఅదేగదా! లోపల కిక్కిరిసి పోయిన దిగుల్లు జాగా సరిపోక అట్ల బయటపడుతయి. ఇంకో అయిదు నిముషాల్లో నువ్వు దిగిపోతవు. ఇంత ఓపెన్‌గ ఫ్రెండ్లీగ భర్తతో మాట్లాడగలమా? మాట్లాడనిస్తరా? నువ్వుంటే ʹబకరాʹ తీర్గ అన్నీ విని వాస్తవాల్ని ఒప్పుకున్నవ్‌. వాస్తవాల్ని భర్తలు ఒప్పుకోరు. అందుకే భార్యలు భర్తలకు అజ్ఞాతంగా బతుకుతరుʹʹ

రైలు గోదావరి బ్రిడ్జి మీద ధనధన లాడుతూ పరుగెత్తుతోంది. మూడో వంతెన నిర్మాణ పనులు నదిలో లైట్ల వెలుతురులో ముమ్మరంగా నడుస్తున్నాయి. రైలు బ్రిడ్జి దాటింది.

ʹʹమాట్లాడు రాజుʹʹ

ʹʹఈ గోదావరి సముద్రంల ఎక్కడ కలుస్తదా అని ఆలోచిస్తున్నʹʹ

ʹʹఈ స్రవంతికి ఎక్కడి కక్కడ కట్టలు కడుతండ్లు గద. పోలవరంల మూడు లక్షల ఆదివాసుల ఊళ్ళు మునిగిపోతయని వెల్లగొడతరట గద, ఆగమైతరట గద. ఇదేంది తల్లి నుంచి పిల్లను వేరు చేయడం గద?ʹʹ పక్కాయన న్యూజు పేపరు చదువుతంటె విన్న ఈ మాట నా చీకటి గదిలో కలిసిపోయింది. నా దుంపతెంచే కలలు. సరెగని, ఔను గోదావరి సముద్రంలనే ఎందుకు కలువాలె. సముద్రమే గోదావరిని వెతుక్కుంట రాకూడదా?ʹʹ

ʹʹతల్లీ వస్తే ప్రళయం. మొత్తం మునిగి ముతమాయమైపోతది. నాకింక పెండ్లి కాలె. బహుశా బతికుంటె బలుసాకు తిన్నట్లు, ఈ షాక్‌లు పనిచెయ్యకపోతే పెండ్లి. లేపోతే ఏమైపోతనో తెలువది. అయిలయ్య తీర్గ సుక్కల్‌ సూపిచ్చినవ్‌. పుసుక్కున ʹచిల్లరʹ అన్న ఒక్కమాట.. నా దిమ్మ తిరిగేటట్లుʹʹ

ʹʹకోతలు కొయ్యకు రాజు. నీకు మనుషులతో కల్మషం లేకుంట కలువాలని ఉంది. ఈ రైలు డబ్బాలో నాతో సహా ఎవరి సోది వాళ్ళు చెప్పుకున్నరు. నువ్వొక్కడివే నా సోది విన్నవ్‌. సరే! ఈ నెలలో నాదగ్గరికి వత్తె తనకు చెప్పుత. తనెప్పుడు సర్‌ప్రైజు గిఫ్టని ఎలక్ట్రానిక్‌ వస్తువులు తెస్తడు. అతను నీలాగా మంచోడె. కాని ఆ వస్తువులు తెచ్చినపుడు అతని ముఖంలో ఆ ఫీలింగు.. ఇతను అంత దూరం బెంగుళూరు నుండి నాకోసం వచ్చిండా? లేదా ఆ ప్రాణంలేని పిచ్చి వస్తువులు ఇచ్చి నా మీద డామినేషన్‌ చేయడానికి వచ్చిండా? అన్పిస్తుంది. నాకు సోషల్‌ అర్థం కాదుʹʹ

ʹʹఇంకేం సోషల్‌ నా బంద సోషల్‌. ప్రేమమ్మా ప్రేమ..ʹʹ

ʹʹనేను ఈ భూ ప్రపంచంలో ఎవరు ఎవరికివ్వని అద్భుతమైన ఒక ఆత్మీయమైన సర్‌ప్రైజు గిఫ్టు అతనికి ఇస్తున్నానని చెప్పుతాను. రాజూ! నువ్వే చెప్పు ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వజాలని అపురూప కానుకలు- కానుకలు కాదేమో. ఊపిరి.. ఓహ్‌- భాష కూడా లేదు. తమ సమస్తం మీకు, ఈ ప్రపంచానికి ఇస్తున్నరా లేదా? మొగవాళ్ళెప్పుడు తెలుసుకుంటరో?ʹʹ

ʹʹస్రవంతీ నాకు అబద్ధం చెప్పాలని లేదు. నిన్నిప్పుడు ముద్దు పెట్టుకోవాలన్పిస్తోందిʹʹ రాజు కళ్ళనిండ నీళ్ళు నిండగా.

ʹʹమా కండ్లల్లో నీళ్ళింకిపోయినయ్‌. నా ఫీలింగు అర్థం చేసుకున్నందుకు థాంక్యూ రాజూ! కాని రాజూ అదే గదా! శరీరంతో తప్ప మగవాళ్ళకు చెప్పరాదు. అది కూడా ఉత్త శరీరపు మొరటు భాష. ఈ రెండు గంటల కాలంలో నా అదృష్టమో, దుస్థితో నువ్వు, నేను అంతకన్నా ఎక్కువగా సన్నిహితులయ్యాము కదా! నాకు నువ్వు జీవితకాలం గుర్తుంటావు. అంతకన్నా ముద్దు గొప్పదా? చాలా చాలా ఎమోషనల్‌ ఫీలింగే నీది కాదనను. కాని దాన్ని తీసుకొని అనుభవించే స్థితి కాదు నాదిʹʹ స్రవంతి కంఠస్వరంలా రైలు నెమ్మదిగా మంచిర్యాల స్టేషన్లో ఆగింది.

మాటలన్నీ ఘనీభవించి, రాజు లేచి నిలబడి నెమ్మదిగా డోరు కేసి నడిచాడు. స్రవంతి ఇబ్బంది పడగలదని రాజు కేసి చూడలేదు. నిజాలు మాట్లాడటం, వినడం ఎంత కష్టమో, నొప్పో మొదటిసారిగా స్రవంతికి, రాజుకు అనుభవంలోకి వచ్చింది.

స్రవంతిని చూసే ధైర్యం లేక రైలు దిగి, తలవంచుకొని రాజు మందిలో క్రీనీడలో కలిసిపోయాడు.

స్రవంతి కూడా రాజు కోసం వెతకలేదు. యుగయుగాలుగా పేరుకుపోయిన గట్టిపడిన గుండె దిటవది. అయినా ఆమె కళ్ళల్లో అనుకోకుండా నీళ్ళూరినయ్‌. ఆ కన్నీటి ఉద్విగ్న మౌన భాష సృష్టి, ప్రతిసృష్టిలో రాటుదేలిన మహిళలకు మాత్రమే తెలుసు. ఒక్క దేహం మాత్రమే పంచుకోవడానికి అలవాటుపడిన పురుషుడికి ఈ భాష ఎన్నటికీ అర్థం కాదు. తన కడుపులో రూపు దిద్దుకుంటున్న శిశువులాగా.

వెలుతురులో నుండి రైలు చీకట్లోకి దూసుకుపోతోంది. విచిత్రంగా, వేగంగా వెనక్కిపోయే ఎత్తైన నాగరిక హైటెక్‌ సిటీ భవనాలు, దుమ్ము చిమ్మే సిమెంటు ప్యాక్టరీ గొట్టాలు, థథఅనేక మాటలు, శబ్దాలు, ఆమె ఒళ్ళో రాజు ఇచ్చిన పుస్తకం ʹʹసామాజిక కోణంʹʹ.

No. of visitors : 1273
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 03:11:28pm

రాత్రులకురాత్రుల్లు పిచ్చివాడిగా అరిచినా కూడా వొడువుదు. దిగులుదిగులుగా- తనకే స్పష్టంగానిదేదో పూనినవానిలాగా విరసంలోతిరుగుతూ... తిరుగుతూ.. అప్పటికే విరసంలో.....
...ఇంకా చదవండి

విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు

అల్లం రాజయ్య | 05.03.2020 12:30:34pm

ఇందులో భిన్నమైన కథా నిర్మాణం ఉంది. ఉద్యమ విస్తృతిలో విప్లవకారుల, ప్రజల వ్యక్తిగత అనుభవం, గతితార్కిక మానవ సంబంధాల అధ్యయనం, ఆచరణ ద్వారా దశలు దశలుగా ఎదగడం కనిప...
...ఇంకా చదవండి

మూడో తరానికి...

అల్లం రాజయ్య | 19.02.2020 03:00:32pm

ఐక్యంగా పురోగమనించడానికి దారులు వెతకడానికి విప్లవ కథ ప్రయత్నించడం కన్పిస్తుంది. ఇందులో కొత్త వస్తువులు, కాలానికి తగిన శిల్ప రీతులు కూడా కనిపిస్తాయి....
...ఇంకా చదవండి

తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం

అల్లం రాజయ్య | 17.12.2019 10:09:31pm

ప్రజాపోరాటాలను, ప్రజా జీవితం లోలోతులు చిత్రించడానికి ఇంత పెద్దఎత్తున రచయితలు, కళాకారులు పూనుకోవడం గతంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడం, క్రమంగా తగ్గడం, ఇప్టా.....
...ఇంకా చదవండి

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 08:48:11pm

కూర్మనాథ్‌ ఈ గడబిడలో ʹనగరంలో ఇంకోరోజుʹ గడవక మరింత పేరుకపోయిన వ్యక్తం గాని, విస్ఫోటనం చెందని అసహ్యాన్ని - భిన్న ప్రపంచాల క్రౌర్యాన్ని - పసిపిల్లల కలలను.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •