మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు

| సాహిత్యం | క‌థ‌లు

మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు

- పలమనేరు బాలాజీ | 17.03.2020 02:15:53pm

తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనే కుతూహలం పాఠకులకు ఉంటుంది. కథలో తమకు తెలియని ప్రపంచాన్ని చదువుతున్న పాఠకులు భావోద్వేగాలకు లోనవుతారు. పాఠకులకు తెలియని ప్రపంచాన్ని తెలియజెప్పి వారిలో సంవేదనలు కలుగజేసే కథలు "అపురూప "కథలు. రచయిత్రి పద్మకుమారి గారు.

జనవరి 2020లో విరసం ప్రచురించిన ఈ కథా సంపుటం లోని కథావరణం, మనుషుల భావోద్వేగాలు, దుఃఖాలు , భావజాలం, ప్రశ్నలు, సూచనలు, ప్రతిపాదనలు పాఠకులకు కొత్తవి. ఇందులోని ప్రతి కథా మనల్ని ప్రశ్నిస్తాయి. రచయితకు తన వృత్తి కిటికీ లాంటిదని, సమాజాన్ని జీవితాన్ని గమనించే క్రమంలో తన వృత్తి ఒక కొత్త దృష్టిని కలిగిస్తుందని విమర్శకులు అంటుంటారు. కథా వస్తువుల ఎంపికలో రచయిత వృత్తి ఒక ప్రధాన భూమికగా కూడా చెబుతారు.

సామాజిక కార్యకర్తలుగా, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులుగా, వివిధ రంగాల్లో స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తులు, రాజకీయ కార్యకర్తలు రచయితలయితే వారి కథలు విభిన్నంగా ఉంటాయి. మామూలు రచయితలు చూడలేని వాటిని సామాజిక బాధ్యత గల రాజకీయ కార్యకర్తగా పనిచేసే రచయితలు ప్రత్యేకంగా చూడగలుగుతారు. కొత్త కథావస్తువులను సాహిత్యంలోకి తీసుకుని వస్తారు. అలాంటి ఒక ప్రత్యేకమైన రాజకీయ కార్యకర్త పద్మకుమారి గారు.

ఉద్యమాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఒక ఆసరాగా ఒక కుటుంబసభ్యురాలిగా ఆమెలా అపురూపమైన మానవతా ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు ఈ కథల్లో అడగడుగునా కనిపిస్తారు. అందరూ అందరినీ గౌరవించలేరు. అందరూ అందర్నీ ప్రేమించలేరు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సైతం మనుషుల పట్ల పరిస్థితుల పట్ల అపరిచితుల పట్ల స్నేహంతో మెలగటం మానవీయ కోణంలో మనిషితనంతో ,మంచితనంతో దుఃఖితులకు , వాళ్ళ బాషలు, పేర్లు, ఊర్లు తెలియకపోయినా, ఆసరాగా నిలబడటం చిన్న విషయం కాదు.

తెలిసిన జీవితం కన్నా తెలియని జీవితాలను తమకు పరిచయంలేని జీవితాలను తెలుసుకోవడంలో పాఠకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఉద్యమ జీవితాలకు సంబంధించిన వాస్తవిక అంశాలను ప్రధానంగా చేసుకొని, జీవితంలోని అలజడి సంఘర్షణలను, మరణం తర్వాత మరణాల కారణంగా మానవ సంబంధాల్లో ఏర్పడే సంఘర్షణలను, ఈ మరణాలు సంధించే ప్రశ్నలను ఈ కథల్లో గమనించవచ్చు. ఎవరైనా ఎవరికైనా ఏమవుతారు? పరిచయం బాంధవ్యం అంటే ఏమిటి ?. పరిచితుల మరణాలే దుఃఖాన్ని కలిగిస్తాయా? సామూహిక దుఃఖం అంటే ఏమిటి? తెలియని వాళ్ళ కోసం తమకు పరిచయంలేని వాళ్లకోసం ఏడ్చే వాళ్లను, మనుషుల్ని పోగొట్టుకున్న వాళ్ళను సముదాయించే వాళ్లను, ఉద్యమాల జీవితాల్లో అడుగడుగునా ఎదురయ్యే సంఘటనలను, పరిస్థితులను ఈ కథలలో రచయిత్రి చిత్రించారు.

భారతీయ సాహిత్య చరిత్రలో ఆదివాసి జీవితాలను, ఉద్యమ పోరాట జీవితాలను ప్రతిభావంతంగా చిత్రించిన రచయితలు కొంతమంది మాత్రమే.తెలుగులో అలాంటి సమకాలీన జీవితాలను సమర్థవంతంగా తన కథల్లోకి తీసుకు వచ్చిన అతి తక్కువ మంది రచయితలలో పద్మకుమారి గారు ఒకరు.

ప్రజాస్వామిక విలువల పరిరక్షణ ధ్యేయంగా, స్వేచ్ఛకు సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ సమభావంతో అభివృద్ధి దిశగా పరుగులు తీయాల్సిన సమాజం-అసమానతలతో హక్కుల ఉల్లంఘనలతో, కుల మత వివక్షతతో, అనారోగ్య కరమైన వాతావరణంలో మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసుకుంటూ వేగంగా వెనక్కి వెళుతున్న దశ ఇది.

ఈ క్రమంలో ఎవరి దుఃఖమైనా తగ్గించడం, ఎవరి బాధనైనా పంచుకోవటం మానవుల కనీస బాధ్యత గుర్తు చేస్తూ వర్తమాన తెలుగు కథా సాహిత్యంలో ఇప్పటి వరకు వెలుగు చూడని కొత్త కథా వస్తువులతో సంప్రదాయ మూస కథలకు భిన్నంగా, విభిన్నమైన కథాంశాలను విషాద జీవన దృశ్యాలుగా కళ్ళముందు నిలిపిన కథా సంపుటి "అపురూప".

పద్మకుమారి గారు ఇప్పటికే అరుణతార పత్రికల పాఠకులకు తన కథల ద్వారా సుపరిచితులు. ఒక ఆత్మీయుడిని కోల్పోవడం అంటే సమస్త మానవ సంబంధాలను కోల్పోవడమే.ఒక మరణం కలిగించే ఆవేదన ఒక మరణం వల్ల ఏర్పడే శూన్యం, ఒక మరణం తర్వాత సంభవించే అనేక మరణాలు,ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరి చావైనా నీలో దుఃఖాన్ని కలిగించే లేదంటే బహుశా నువ్వు అప్పటికే మరణించి ఉంటావు అనే కవితా సత్యవాక్యంలా.. ఈ కథలు మనకు తెలియని అనేక కొత్త విషయాలను కొత్తగా చెబుతాయి.

దుఃఖభరితమైన జీవితానుభవాలు కలిగిన రచయితలు మాత్రమే వైవిధ్యభరితమైన జీవితలోతుల్ని, చాలా మందికి తెలియని అజ్ఞాత జీవిత కల్లోలాలను సాహిత్యంలోకి తీసుకు వస్తారు. పైకి కనిపించే జీవితం వెనుక కనపడని జీవిత సంవేదనలను ఇలాంటి కథల ద్వారా పాఠకులందరూ తెలుసుకోగలుగుతారు.

తెలుగు సాహిత్యంలోకి కొత్త వస్తు శిల్పాలతో వస్తున్న రచయితలను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలుగు సాహితీ రంగంలో పేరుకుపోయిన అరిగిపోయిన కథావస్తువుల స్థానంలో ఇంతవరకూ పాఠకులకు విమర్శకులకు పరిచయం లేనటువంటి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న"అపురూప" కథా సంపుటి విలక్షణమైనది.

ఈ కథా సంపుటంలోని పదకొండు కథలలో పది కథలు అరుణతార మాసపత్రికలో వచ్చాయి. సాహితీ గోదావరి కథల ప్రత్యేక సంచిక(జూలై -డిసెంబర్ 2016)లో ప్రచురించిన 33 కథలలో "కడుపుకోత "కథ ప్రత్యేకమైనది.

ʹవారధి, ఉండవలసిన తీరు,పయనించిన పాట, వెలితి, ప్రయాణం, నిరీక్షణ, కడుపుకోత, తల్లి కోరిక, ముగ్గురు తల్లులు , కాంత పున్నం వెన్నెల, అపురూప ʹ ఇందులోని కథలు. ఈ కథలన్నీ 2013- 2019 మధ్యకాలంలో ప్రచురితమైన కథలు. సమకాలీన సమాజంలో ఉద్యమ జీవితం నేపథ్యంగా కలిగిన ఉద్యమకారుల జీవితాలలో జరిగిన జరుగుతున్న అనేక పరిణామాలను వాటికి గల కారణాలను ,మానవసంభందాల విశిష్టతను,సంక్లిష్టతను విశ్లేషిస్తూ అవగాహనతో స్పష్టమైన దృష్టికోణంతో బాధితుల పక్షాన, దుఃఖితుల పక్షాన నిలబడి సంధించిన ప్రశ్నలు ఈ కథలు. సమాజంలో అంతగా వెలుగులోకి రాని అనేక విశేషాలను, విషాదసంఘటనలను, సందర్భాలను చారిత్రక ప్రదేశాలను, చారిత్రక వ్యక్తులను చూపే దుఃఖాశ్రువులు ఈ కథలు.

ఈ కథా సంపుటికి ఎన్. వేణుగోపాల్ ,కాత్యాయని గార్లు ముందుమాటలలో చెప్పిన విధంగా తాత్విక దృక్పథం అపారమైన మౌలిక ఆచరణ కలిగిన రచయిత్రిగా పద్మకుమారి ఈ కథలు రాసారు. ఈ కథా సంపుటిలో అమర వీరులు ఉన్నారు. అమర వీరుల మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, సంఘటనలు వాళ్ల కుటుంబీకుల మధ్య , వారికీ ఇతరులకీ మధ్య చెలరేగే ఘర్షణలు, వూరి పెద్దలు, అధికారులతో గొడవలు , కాల్పుల్లో మృతి చెందిన వారిని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి సంకోచించే పెద్దరికాలు , అధికార వర్గాల నిర్బంధాలు ,ఆటంకాలు , ఉద్యమకారుల జీవనరేఖలు ఈ కథలు.

ఎన్ కౌంటర్ మృతదేహాల స్వాధీనకమిటీ తదనంతరం 2002లో మొదలైన అమరుల బంధుమిత్రుల సంఘం 18 సంవత్సరాల కాలంలో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్లడం,అమరవీరుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు చేర్చడం, కుటుంబం మిత్రులను పరామర్శించడం అంత్యక్రియలు, అంతిమయాత్రలు, సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం, వార్షిక సంస్మరణ సభలు నిర్వహించడం, దుఃఖితుల పక్షాన నిలబడడం మామూలు విషయం కాదని ఈ కథలు , ముందు మాటలు చెపుతున్నాయి. .

సమాజం కోసం పోరాడుతున్న వారి కుటుంబాలను, ఇంటిని పట్టించుకోకుండా సమాజాన్ని గురించి మాత్రమే పట్టించుకోవడానికి అజ్ఞాతవాసంలో ఉంటున్నవారి తరఫున ఒకరో ఇద్దరో మంచి మనసుతో నిలబడటం, వాళ్లు లేని లోటును తీర్చడానికి మానసికంగా భౌతికంగా, శ్రమించడం, బాధతో కాకుండా భాద్యతతో మెలగటం తమకు పరిచయం లేని వాళ్లకు తమ బంధువులు కాని వాళ్ళు, తమకు స్నేహితులు కాని వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే తమకు ఏమీ కాని వాళ్ళ కోసం అజ్ఞాతవాసం గడుపుతున్న వాళ్ల కుటుంబాల కోసం, అలాంటి వారి మరణం అనంతరం వారి అంత్యక్రియల కోసం ప్రశ్నల్ని, నిర్భందాలను ఎదుర్కొంటూనే శ్రమించే, వేదన పడే మనుషుల కథలివి.

మృత్యువు ప్రస్తావన లేకుండా గడవని జీవితాలు, సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా, ఆ కుటుంబ సభ్యులకు వీరిపట్ల చెక్కు చెదరని ప్రేమ మమకారం ఉండటం, తమ వాళ్ళ కోసం వాళ్ళు నమ్మిన సిద్దాంతాల కోసం ఎన్నో త్యాగాలు చేసే కుటుంభ సభ్యుల వేదనలు, ఉద్యమ స్పూర్తిని కొనసాగించడంలాంటి ,చాలా సున్నితమైన విషయాలను రచయిత్రి గ్రహించారు కాబట్టే ఈ కథలలో మానవాంశ ఎక్కువగా ఉంటుంది. అనుభూతులు సoస్పందనలు ఎక్కువగా ఉంటాయి. దుఃఖితుల కన్నీళ్లను పంచుకోవటం ఉంటుంది. అమరులపట్ల ప్రేమతో బాధ్యతతో దుఃఖంతో రచయిత్రి రాసిన కథలివి. ఆ ప్రేమ,ఆ దుఃఖం నిజం కాకపోతే ఈ కథలు ఇంత వాస్తవికంగా ఉండవు.

ఏమీ కాని వాళ్ళు అన్నీతామే అవటమే ఈ కథలు. మరణించిన వాళ్ళను గురించి, మరణం తర్వాత జరిగే విషాదకర పరిణామాల గురించి సంవేదనతో దుఖంతో రాసిన కథలే ఇవి.

ʹ వారధిʹ కథలో మామయ్య గురించి సరోజ పడే తపన, తన ఉద్యమ జీవితం కారణంగా, ఆయనకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నం గొప్పది. తండ్రి తన కొడును అర్థం చేసుకోవడం వేరు. కొడుకు కంటే ఎక్కువగా కోడలు కాని కోడలు సరోజ అతడ్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది.ఆ పెద్దాయన చేసిన ప్రయత్నం చివరి వరకు ఆమె అతన్ని, అతడు ఆమెను గౌరవించిన పద్ధతి విలక్షణమైన మానవ సంబంధాలకు ఒక చక్కటి ప్రతీక ఈ కథ.

ఆసుపత్రి వార్డు ఎలా ఉంటుందో, బంధువులు మృతి చెందినప్పుడు ఏడిస్తే ,అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరూ గట్టిగా ఏడవకుండా, ఎలా అడ్డుకుంటారో ,ఈ కథలో రచయిత్రి వివరించిన తీరు ప్రత్యేకమైనది. కొడుకు మధు ఏదో కేసులో అరెస్టయినట్లు పేపర్ లో చూసి సరోజకు ఫోన్ చేస్తాడు. సరోజ వివరాలు చెబుతూ ఏమైనా కంగారు పడ్డారా? ఏం కాదులే. త్వరలోనే బెయిల్ వస్తుంది అంటుంది సమాధానంగా.

దానికాయన" నాకేం భయం లేదులే. మా ఊరి వాళ్ళే ఒకరిద్దరు ఈ రాజకీయాల్లోకి రావడం ఏమిటి? ఇలా అరెస్ట్ కావడం ఏమిటని అడిగారు " అంటాడు.మరి మీరేమన్నారని అడుగుతుంది సరోజ. దానికి ఆ పెద్దాయన చెప్పిన సమాధానం ఈ కథాంశలో కీలకం. " ఏం చెబుతాను? మా పిల్లలు కమ్యూనిస్టులు. అరెస్ట్ కావడం వాళ్లకు మామూలే .వాళ్లు రాజకీయ ఖైదీలు అన్నా" అంటాడు అతను. కథలో రచయిత కంఠస్వరం రచయిత భావజాలాన్ని దృక్పధాన్ని తెలియజేస్తుంది అనడానికి ఈ కథ ఉదాహరణ.

అరుణతార పత్రికలో అచ్చయిన పది కథలు, సాహితీ గోదావరి (వరంగల్ )పత్రికలో అచ్చయిన కథ ద్వారా ఇప్పటికే పాఠకులకు రచయిత్రి సుపరిచితులు. వందలాది కథలు రాసినవాళ్లు ఒకవైపు, ఇప్పటివరకు సాహిత్యంలోకి రాని, కొత్త కథా వస్తువులను పాఠకులకు పరిచయం చేసి, తక్కువ సంఖ్యలో కథలు రాసిన రచయితలు ఒకవైపు. విస్తృతంగా రాయడం వేరు, నేరుగా జనం మధ్య తిరిగి, క్షేత్రస్థాయి అనుభవాల్ని కథలలోకి తీసుకు రావడం వేరు. ఊహించి రాయడం వేరు, జీవన సంవేదనలను దగ్గరగా చూసి, వేదనతో దుఃఖంతో కొత్త చూపుతో లోతైన విశ్లేషణతో కథలు రాయడం వేరు.

ప్రధానంగా ఇవన్నీ ఉద్యమజీవితాలకు సంబంధించిన కథలు. ఉద్యమజీవితాల్లోని ప్రేమను దుఃఖాన్ని త్యాగాన్ని స్ఫూర్తిని , మనుషుల కోసం పరిచయం లేని మనుషుల సoస్పందనలను ఈ కథల్లో చదివినప్పుడు వాస్తవ జీవితాలను, జీవిత వాస్తవాలను పాఠకులు బేరీజు వేసుకుంటారు.

లేకుండా పోయిన మనిషి కోసం "వెలితి" కథలో రాధమ్మ పడే బాధ పాఠకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈకథలో శరత్ గురించి వాళ్ళ వదిన ʹనువ్వు చాలా మంచివాడివని ʹ అంటుంది .అప్పుడు అతను ఇలా అంటాడు " నాలో ఏదైనా మంచితనం ఉంటే అది నాది కాదు. మా రాజకీయాలది. నేనేమిటి ?అవి ఎవరినైనా అద్భుతంగా తయారు చేస్తాయి"

"పయనించిన పాట"కథలో తల్లి తన బిడ్డ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో , తన బిడ్డల పట్ల తల్లి ప్రేమ ఏపాటిదో తెలుస్తుంది.బిడ్డ మరణించిన తర్వాత కూడా తన బిడ్డ ఎప్పటికైనా తిరిగి వస్తాడని, తలుపు తడతాడని అమ్మా అని పిలుస్తాడని ఆ తల్లి గుండె పరితపిస్తూనే ఉంటుంది. తల్లి హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది. తన బిడ్డ పాట ఎక్కడెక్కడో తిరిగినా, ఎంత
దూరం వెళ్ళినా తన బిడ్డ గురించి ఆ తల్లి కథ చివర్లో ఇలా అంటుంది.

" నా బిడ్డ ఆడ ఏడనో కాదు. ఇదిగో ఇక్కడ ఆడిపాడిండు.." అని అమ్మ గుండెల మీద చేయి పెట్టుకుంది. పెద్దగా రోదించసాగింది. ఆమె దుఃఖమే ప్రభాకర్ కోసం అల్లిన విషాద గీతికగా నాకు వినిపించసాగింది. అంటుంది రచయిత్రి. వాతావరణాన్ని స్పష్టంగా చిత్రీకరించి సూటిగా కథాంశం పాఠకుడికి చేరేలా క్లుప్తంగా సాగిన కథనం, ఈ కథలోని ముగింపు రచయిత్రి భావోద్వేగాలను తెలియజేస్తాయి.

మరణం తర్వాత జరిగే ప్రస్థానం చాలా విలువైనది. తన మరణం తర్వాత ఎలాంటి గౌరవం గుర్తింపు అంతిమయాత్రలో జరగాలని కోరుకుంటూనే రాజవ్వ తన శవ యాత్ర అందరికీ స్ఫూర్తి కలిగించిందో "తల్లి కోరిక "కథ చెబుతుంది.

ʹ అపురూప ʹ కథలో కొడుకును పోగొట్టుకున్న నానమ్మ తాతయ్యలతో ఉండిపోవడానికి సిద్దపడిన అపురూప తనను పెంచిన, తన బిడ్డను పోగొట్టుకున్న పెద్దవాల్లిదర్నీ చేరదిస్తుంది.కొడుకు గురించి మాట్లాడతా దుర్గమ్మ ʹ మనం చుసుకోవాలే కానీ అందరికీ అందరం అమ్మానాన్నలo, కన్నా బిడ్డలం కాలేమా ? అనే వాడమ్మా ..బిడ్డʹ అనే మాట అంటుoది.

కథ చివర్లో యువతరం ప్రతినిధిగా అపురూప అనే మాటలు ఈ కథకే కాదు అన్నికథలకు వర్తిస్తాయి.రచయిత భావజాలానికి చిహ్నాలు ఈ మాటలు ...

ʹ తాతయ్యా... మాములుగా కన్నవాళ్ళను బిడ్డలు చూసుకోవాలి. కానీ మీలాంటి వాళ్ళు ఉద్యమానికి పిల్లల్ని ఇచ్చి ఈ వయసులో మీరు పిల్లలుగా మారిపోతారు.మీకు తప్పక తోడు కావలి.ఇప్పుడు కొత్త సంప్రదాయాలు రావాలి.మనుషుల్ని కలపడమే మన పని. ఒకర్ని ఒకరికి ఆసరాగా నిలబెట్టడమే ఇక మనం చేయాల్సింది,మీలాంటి తాతయ్యలు,నానమ్మలు, అమ్మమ్మలు మనవాళ్ళు ఎందరో వున్నారు. అత్యంత సహజమమైన వృద్దాప్యం నైత సమస్యగా మారిపియింది కానీ మనకు అది సమస్య కాకూడదు కదా . ఇలాంటి వాళ్ళు ఒకరికి అండగా నిలబడి ఆసరా పొందలేమో..దీనికి మనం ఏమైనా చేయలేమా? తాతయ్యా.. ? ʹ స్పష్టం గా రచయిత్రి తనకు కావాల్సిసింది ఏమిటో ఈ పాత్ర ద్వారా తెలియ చేసారు.

"ముగ్గురు తల్లులు" కథ బహుశా తెలుగు సాహితీరంగంలో శాశ్వతంగా నిలిచిపోయే మంచికథల వరుసలో తప్పనిసరిగా స్థానం సంపాదించుకుంటుంది.

ఉద్యమకారుడు రవికి గౌరవంగా అంతిమయాత్ర చేయటానికి తన ఊరి వాళ్ళు తన ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోతే, పెంచిన తల్లి కన్న తల్లి రాలేకపోతే,తన కూతురి అంతిమ సంస్కారాల తోబాటు ఆ గౌరవాన్ని సమంగా రవికి కలిగించి పైడిపల్లి శారద అతడికి మూడో తల్లి అవుతుంది.

ఈ కథలో రవి అలియాస్ సుధాకర్ తనకు స్నేహితుడు అని లిఖితపూర్వకంగా రాసిచ్చి ,అతడి డెడ్బాడీని తీసుకోవడానికి అనుమతి తీసుకుంటుంది వసంత. ఈ కథలో రచయిత రాసిన ఈ వాక్యాలు రచయిత గుండె లోతుల నుంచి వచ్చిన దుఃఖ ప్రవాహాలు... కావచ్చు!

" అప్పుడు ఆమెలో ఎన్నడూ కలగని ఫీలింగ్ కలిగింది. చెట్ల కింద సంతకం చేశాక లేచి మార్చురీ లోకి వెళ్ళింది. రవి డెడ్ బాడీ దగ్గర నిలబడింది.ఇంకా పోస్టుమార్టం చేయలేదు. అతని పాదాలు, ఒక చేయి బయటికి కనిపిస్తున్నాయి. తెల్లని జుట్టుతో ఎముకలు తేలిన ముఖంతో అకాల వృద్ధాప్యం స్వీకరించిన వీరుడిలా కనిపిస్తున్నాడు. తన యవ్వనాన్ని ప్రాణాన్ని త్యజించిన ఆ యోధుడి కాళ్లను చేతిని నుదురును ముట్టుకుంది . పసిపాపను ముట్టుకున్నట్టనిపించింది. ఎన్నడూ చూడని మనిషి... వినటం తప్ప మరేమీ తెలియని మనిషి.

ఇలా మరణించాక నాకు సంబంధించిన మనిషి అయ్యాడు కదా .ఇతను మరణించాడా? లేక ఇప్పుడే నా చేతుల్లో పునర్జన్మిస్తున్నాడా? ఒక తల్లి కని, ఇంకో తల్లి పెంచి చివరికి ఇలా...ఆ తల్లులతో తెగిన బంధం, ఇలా మరణం తర్వాత నాతో ముడి వేసుకున్నది కదా... అనిపించింది.

వసంత ఆప్యాయంగా పసిబిడ్డ తలను నిమిరినట్లు అతని తల నిమిరింది. మృత్యు శీతలమైన ఆ స్పర్శ అపురూపం అనిపించింది. పొత్తిళ్ళలోని బిడ్డను గుండెలకు అదుముకోవాలనే మాతృత్వపు తడి కన్నీటి చెమ్మగా మారింది"

ఈ కథా సంపుటంలోని ఏ ఒక్క కథ గురించొ, ఏ ఒక్క పాత్ర గురించో చెప్పటానికి వీలు లేదు. ఈ రకం ప్రాతినిధ్య పాత్రల ద్వారా సమాజంలోని అనేక విషాదకర సంఘటనల గురించిన అవగాహన పాఠకులకు కలుగుతుంది.

ఈ కథల ద్వారా తెలియని ప్రపంచం తెలిసి వస్తుంది . కథలను చదివిన తర్వాత పాఠకులను ఒక సుదీర్ఘ దుఃఖం వెన్నాడుతుంది. అనేక ప్రశ్నలు కలవర పెడతాయి. కథ చదవక ముందు, కథ చదివిన తర్వాతా పాఠకులు ఉద్వేగానికి లోను కాక తప్పదు. చుట్టూ ఉన్న మనుషుల గురించి ఇప్పటిదాకా కనీసం ఆలోచించని వాళ్ళు, జరుగుతున్న సంఘటనల గురించి నామమాత్రంగా అయినా స్పందించలేని వాళ్ళు, ఎవరి మరణం అయినా తమను స్పందింప చేయలేదని తమను తాము మోసం చేసుకునే వాళ్ళు ;వాస్తవిక ధోరణితో అత్యంత సృజనాత్మకంగా సున్నితంగా సునిశితంగా చెప్పిన
ఈ కథల పట్ల, స్పందించక తప్పదు.

బహుశా ఈ దుఃఖం ఒక్క రచయితది మాత్రమే కాదు. ఈ దుఃఖం సామూహికం, సామాజికం.!

ఈకథలన్నీ చదివాక జీవితాలే కాదు, మరణాలు, మరణానంతర దుఖాలు కూడా జీవితాలoత విలువైనవే అని అనిపించక తప్పదు.

No. of visitors : 584
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •