కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?

| సాహిత్యం | వ్యాసాలు

కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?

- పాణి | 25.03.2020 06:44:48pm


ఈ మాట అంటే ʹఇలా లాఠీ ఛార్జ్ చేయాల్సిందేʹ అనేవాళ్లుంటారని నాకు తెలుసు. అలాంటి వాళ్లతో ఏం మాట్లాడతాం? కరోనాను కట్టడి చేయడానికి స్వయం నియంత్రణ విధించుకోవాల్సిందే. అంత మాత్రాన వీధుల్లోకి వచ్చిన వాళ్ల మీద పోలీసు రౌడీల్లా దాడి చేస్తారా? అని ప్రశ్నించడానికి వెనుకాడాల్సిన పని లేదు. పొలిటికల్‌ ఎమర్జెనీలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు రద్దు చేసినట్లు హెల్త్‌ ఎమర్జెన్సీలో కూడా ఇట్లా ప్రశ్నించే హక్కును రద్దు చేస్తామంటే కుదరదు. దేనికంటే పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నది పౌరుల మీద. వాళ్లు ʹనేరస్తులుʹ కాదు. రాజ్యానికి ʹప్రత్యర్థులుʹ కాదు. అలాంటి వాళ్లను కూడా ఇట్ల కొట్టే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు. అట్లాంటిది ఇండ్లలో ఉండకుండా బైటికి వచ్చారనే సాకుతో పోలీసులు రౌడీలుగా మారితే చూస్తూ ఊరుకోవాలా?

కరోనా సీరియస్‌గా ఉంది కాబట్టి పోలీసుల లాఠీచార్జికి కూడా చప్పట్లు చరిచేవారు ఉంటారు. నిజంగానే ప్రభుత్వానికి ప్రజారోగ్యంపట్ల శ్రద్ధ ఉంటే అవగాహన కల్పించాలి. సౌకర్యాలు సమకూర్చాలి. ఆదేశాలతో పనులు కావనే ఎరుక ఉండాలి. లాక్‌డౌన్‌ విధించడం, చప్పట్లు కొట్టించుకోవడం తప్ప వైద్యం కోసం ఏం చేసింది? ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ప్రభుత్వం ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది?

అసలు కరోనా ఎంత తీవ్రమైన సమస్యనో ప్రభుత్వానికి అవగాహన ఉందా? ఒక గంభీరమైన సమస్యతో తాను వ్యవహరిస్తున్నాననే స్పృహ ఉన్నదా? ఘోరమైన మానవ విషాదపు అంచు మీద నిల్చున్న దేశ ప్రజల సంరక్షణ కోసం తాను చిత్తశుద్ధితో పని చేస్తున్నాననే నమ్మకం ప్రజలకు కల్పించే స్థితిలో ఉన్నదా? ప్రభుత్వాలకు ఏ అవగాహన ఉన్నదని స్వయం నియంత్రణపై అవగాహన లేకుండా వీధుల్లోకి వచ్చే వాళ్ల మీద దాడులు చేస్తోంది? సంక్షోభవేళ కూడా ఎలా ఉండాలో ప్రజలకు తెలియదని ఒప్పుకుందాం. ప్రభుత్వాలకు తెలుసనడానికి ఆధారం ఏమిటి? పోలీసు లాఠీచార్జి చేయడమే రుజువు అంటే కుదరదు.

పని లేకున్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వీధుల్లోకి రావడం తప్పు. రెండో మాటే లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని నడి రోడ్ల మీద ఇష్టారాజ్యంగా దాడులు చేస్తారా? అసలు ఈ రెంటికీ పోటీ ఏమిటి? నూరుశాతం లాక్‌డౌన్‌ అమలు కావాల్సిందే. దీని కోసం నూరుశాతం ʹపోలీసింగ్‌ʹ నడిపిస్తారా? లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం లాఠీఛార్జ్ ఉంటుందా?

వైద్య ఆరోగ్య సంబంధమైన ఎమర్జెనీలో కూడా ప్రభుత్వం పోలీసుల మీద ఆధారపడటం ఏమిటనే ప్రశ్న ఎవరికైనా తలెత్తాలి. ఇది ఈ వ్యవస్థ స్వభావాన్ని తెలియజేస్తోంది. వైద్య రంగానికి వనరులు, సౌకర్యాలు కల్పించాలంటే ప్రజా దృక్పథం ఉండాలి. ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. ఇవి లేవని ఈ పరిస్థితుల్లో విమర్శించడం ఏమిటని అనవచ్చు. నిజంగానే ప్రజారోగ్యంపట్ల శ్రద్ధ ఉంటే వైద్యరంగాన్ని కార్పొరేట్లకు ఇచ్చేసేవాళ్లే కాదు. ఆరోగ్యాన్ని అంగడి సరుకు చేసేవాళ్లు కాదు. ఈ రోజు కరోనా వల్ల వీధుల్లో బతికే నిరాశ్రయులకు, ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో చేరిన వాళ్లకు అందరికీ ప్రమాదం ముంచుకొచ్చింది కాబట్టి వాస్తవాలన్నీ రద్దయిపోవు.

నిరంతరం చేతులు కడుక్కుంటే తప్ప బతుకు భరోసా లేని ఈ స్థితి రావడానికి దశాబ్దాల కిందే పాలకులు ప్రజావైద్యాన్ని వ్యాపారులకు ఇచ్చి చేతులు కడిగేసుకున్నారు. ఇక ఆ రంగం ఎలాగూ సమర్థవంతంగా పని చేయలేదు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక్కటి సమర్థవంతంగా పని చేస్తే చాలు. దానికి ప్రజల్ని కంట్రోలు చేసే పని, సర్వాధికారాలు ఇస్తే చాలు. లాఠీలు కూడా ఇవ్వనక్కరలేదు. ప్రజలతో ఎలా వ్యవహరించాలో ప్రభుత్వానికి తెలిసి ఉంటే లాక్‌డౌన్‌ ఇంకోలా ఉండేది.

ఈ సమస్య నిన్న ప్రధాని చెప్పిన మూడు వారాలతో తీరిపోతుందని గ్యారెంటీ ఏమీ లేదు. మొదట ఒక రోజు జనతా కర్ఫ్యూ అన్నారు. ఆ తర్వాత మార్చి 31 దాకా అన్నారు. ఇప్పుడు దాన్ని మూడు వారాలు చేశారు. ఇంకా పొడిగించాల్సి రావవచ్చు. ఇప్పటికిప్పుడు ఇంతకంటే వేరే పరిష్కారం లేనట్లే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాను ప్రజలతో వ్యవహరిస్తున్నాననే సంగతి ప్రభుత్వానికి తెలిస్తే బాగుండు. ప్రజతో ఎలా వ్యవహరించాలో పాలకులకు తెలియకపోవడమే మన ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద సమస్య.

జనం ఇండ్లలోంచి బైటికి రాకుండా చూడమని పోలీసులకు అప్పగిస్తే వైరస్‌ సమస్య పరిష్కారం కాదు. ఈ లాక్‌డౌన్‌ సందర్భంలోనే కాదు, ఎప్పుడైనా పోలీసులకు ఒకేలా పని చేయడం వచ్చు. తాము చేసే పనులు చట్టబద్ధంగా ఉండాలనే ఎరుక ఏ మాత్రం లేని పోలీసు వ్యవస్థకు ఇప్పుడు ప్రజారోగ్య సంరక్షణ అనే బాధ్యత అప్పగించారు. సమాజం నుంచి మద్దతు కూడా వస్తుంది. కాబట్టి ఇక పోలీసులకు సర్వాధికారాలు ఇచ్చేసినట్లే. కాబట్టి మామూలు పరిస్థితులు వచ్చే వరకు లాఠీఛార్జ్ చేస్తూనే ఉంటామంటే ఎలా? ఇది చాలదని సైన్యాన్ని దింపుతామంటున్నారు. కనిపిస్తే కాల్చేయడానికి సిద్ధమంటున్నారు. కరోనా సీరియస్‌గా ఉంది కాబట్టి ఇలాంటి హెచ్చరికలు తప్పడం లేదంటున్నారు. వాటి పర్యవసానాలను విస్మరించడానికి లేదు.

మనలాంటి దేశంలో అన్ని కొరతల్లాగే ప్రజలకు శాస్త్రీయ అవగాహన కొరత కూడా ఉంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వమే ప్రధాన కారణం. ఇంతకాలంపాటు ప్రజలకు ఏ విషయంలో అయినా శాస్త్రీయ అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏం చేసింది? కరోనాలాంటి ప్రమాదమే కాదు, సామాజిక జీవితంలో ఎలాంటి పరస్పర సంఫీుభావ చైతన్యంతో, సహకారంతో స్వీయ నియంత్రణ పాటించాలో మేధో సాంస్కృతిక శిక్షణ ఏమిచ్చింది? అలాంటి వాటి అవసరాన్ని గుర్తించిందా? ప్రజాస్వామ్య పాలనలో ఇవీ భాగమనుకున్నామని ప్రభుత్వం గుండె మీద చేయి వేసుకొని చెప్పగలదా?

అసలు ఇప్పుడు స్వీయ నియంత్రణ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా.. చట్టం, నాగరికత, రాజకీయ సంస్కృతి, సర్వామోదం పొందిన సాధారణ జీవన విలువల విషయంలో ఓట్ల పార్టీలు, వాటి నాయకులు, ప్రభుత్వాలు స్వీయ నియంత్రణ పాటించినట్లు ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా? స్వీయ నియంత్రణ బొత్తిగా లేని గుంపు వ్యాపింపజేసిన అరాచకంలో కొట్టుమిట్టాడుతున్న సమాజం మనది. అందుకే ఇండ్లలోంచి బైటికి వస్తే వైరస్‌సోకి ప్రాణాలు పోతాయనే అవగాహన ప్రజలకు కలగడం లేదనే వాదన చేస్తే సమాధానం ఏమిస్తారు?

స్వేచ్ఛ-నియంత్రణ అనేవి ఆధునిక జీవితానికి ఉండే రెండు అంచులు. పోలీసు వ్యవస్థకు చట్ట నియంత్రణే ఉండదు. ఇక మిగతా నియంత్రణలు దాన్నుంచి ఆశించలేం. అలాంటిది ప్రజల స్వీయ నియంత్రణ రాహిత్యాన్ని అరికట్టే పనిలోకి దిగితే ఇలాగే ఉంటుంది.

కరోనా విపత్తు స్వీయ నియంత్రణ గురించి అనేక రకాలుగా అలోచించాల్సిన సందర్భాన్ని ముందుకు తెచ్చిందని కూడా గుర్తించాలి. ఈ వైరస్‌ను కట్టడి చేయాంటే ఎవ్వరూ బైటికి రావడానికి వీల్లేదు. అన్నీ బంద్‌ పెట్టాల్సిందే. అయితే ఇది పోలీసులు లాఠీలు పట్టుకొని తిరిగితే పరిష్కారం కాదు. సామాజిక నియంత్రణ, స్వీయ నియంత్రణ, నిర్బంధం మొదలైనవి చాలా లోతైనవి. సామాజిక చింతన, హేతుదృష్టి లేకుండా స్వీయ నియంత్రణ ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రజలకు అవి కలగకపోవడానికి ప్రభుత్వం, అధికార వ్యవస్థలే కారణమైనా సామాజిక సాంస్కృతిక ప్రక్రియ ద్వారా వీటి కోసం కృషి జరగాల్సి ఉంది. ఇవేవీ లేని సమాజంలో ఏ ʹవిపత్తుʹకైనా ప్రభుత్వం పోలీసులనే వాడుకుంటుంది.

పోలీసులకు స్వయంనియంత్రణ అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం? ఎందుకు విఫమవుతోంది? లాంటి విషయాలు తెలిసే అవకాశమే లేదు. అందులో ఉండేది కూడా మనుషులే అయినా ఆ వ్యవస్థకు ఇలాంటి భాష రాదు. ఇవి తొసుకొనే జ్ఞాన క్రమం దానికి కష్టం. వ్యక్తులుగా ఎవరైనా దీనికి భిన్నంగా ఆలోచించవచ్చు. అది వేరే విషయం.

సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు సైన్యాన్ని కూడా దించేలా ఉన్నాయి. అన్ని రకాలుగా వాళ్లది వేరే భాష. అంటే కరోనా కట్టడి అయ్యే దాకా ఈ బెడద ఉండేదే. అసలు విపత్తుకు తోడు ఇదొకటి. దీన్ని పక్కన పెట్టడానికి లేదు. కాబట్టి ఈ విమర్శనాత్మక చర్చ కరోనా నివారణ సందర్భంలో అత్యవసరం. దీన్ని కూడా నియంత్రిస్తామని ప్రభుత్వం అనడానికి లేదు.

ప్రజలు స్వయం నియంత్రణ అవర్చుకోడానికి ముందు ప్రభుత్వం బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రిస్తానని హామీ ఇవ్వాలి. అమలు చేయాలి. కానీ ప్రజలకు ఆ నమ్మకం లేదు. ఒక్క రోజులోనే ధరలు ఆకాశాన్ని అంటాయి. సరుకుల కొరత ఏర్పడింది. ధరలు పెంచి అమ్మితే కేసులు పెడతామని ప్రభుత్వం అంటోంది. ఇలాంటి ప్రకటనలను ఎన్నో చూసిన ప్రజలు ఇప్పుడు మాత్రం ఎందుకు నమ్మాలి? ప్రభుత్వానికి ఈ మాత్రం నియంత్రణ సాధ్యంకాదుగాని ప్రజలకు స్వయం నియంత్రణ లేదని లాఠీ ఛార్జ్ చేస్తారా? అత్యవసర సేవల సిబ్బందికి రవాణా సదుపాదయం లేదు. రోజుకూలీ జీవితాలకు తిండి గింజలతో సహా కనీస అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వాలు తీసుకున్నది లేదు. ఇదేదీ చేయలేరు కాబట్టే లాఠీలు మాత్రం పుచ్చుకుని తిరుగుతారా?

వీటన్నిటినీ ప్రశ్నిస్తూనే ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లకే పరిమితం కావాలి. శుభ్రత పాటించాలి. తన జాగ్రత్త తన కోసమే కాదు, ఇతరుల కోసం అని కూడా అనుకోవాలి. అప్పుడే అది ఎంత గంభీరమైన బాధ్యతో అర్థమవుతుంది. ఇవన్నీ చేస్తూనే ప్రభుత్వ నియంత్రణరాహిత్యాన్ని ప్రశ్నించాల్సి ఉంది.

లేకపోతే మనకు రెండు రోజుకోసారి గంభీరమైన ప్రసంగాలు, పోలీసు లాఠీ ప్రదర్శన తప్ప ఇంకేమీ ఉండవు. ఎలాగూ ఇప్పట్లో చేతు కడుక్కుంటూ, ముక్కు, నోరు మూసుకొని బతకాల్సిందే. కానీ ఇలాంటి చర్చ కూడా లేకుండా నోరు మూసుకోమంటే ఎలా? దాన్ని ఎందుకు అంగీకరించాలి?

No. of visitors : 1399
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •