గత మూడు నెలలుగా ప్రపంచమంతా కరోనా చుట్టూ తిరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు. 35,000 పైగా ప్రజలు మరణించారు. వైరస్ వ్యాప్తి గురుంచి ముందే హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. వియత్నాం లాంటి చిన్నదేశం అందరి కంటే ముందుగా జనవరి 1 న లాక్ డౌన్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకుని అక్కడి ప్రజల ప్రాణాలను కాపాడుకుంది. అక్కడ 207 కేసులు నమోదు అయినప్పట్టికీ ఎవరూ మరణించలేదు. వారిలో 58 మంది కోలుకున్నారు. మన దేశంలో జనవరి 30న మొదటి కరోనా కేసు నమోదు అయింది. ఒక వైపు వైరస్ వ్యాప్తి తీవ్రత గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మార్చి 25 వరకు కూడా మోదీ, బిజెపి ప్రభుత్వాలు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. ఈ సమయంలో ట్రంప్ పర్యటన, ఢిల్లీ హింస, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉండి వారికి ప్రజలను పట్టించుకునే తీరిక లేకపోయింది. ప్రజలు ఎక్కువగా గుమికూడితే వైరస్ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని అప్పటికే కొన్నిదేశాలు, ముఖ్యంగా మన పొరుగు దేశం జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ట్రంప్ పర్యటనలో లక్షమంది ప్రజలను పోగుచేశారు.
మధ్యప్రదేశ్ వ్యవహారం పూర్తికాగానే తీరిగ్గా మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రకటించారు. అదే రోజు సాయంత్రం ఏప్రిల్ 15 దాక దేశవ్యాప్త లాక్ డౌన్ విధించారు. ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా చేసిన ఒక విఫల చర్య ఇది. వైరస్ వ్యాప్తి నివారించడానికి లాక్ డౌన్ తప్పనిసరి అయినప్పట్టికీ ముందస్తు చర్యలు తీసుకోకుండా అకస్మాత్తుగా ఇలా చేయడంతో ప్రజల జీవనం సందిగ్ధంలో పడిపోయింది. దేశంలో ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయారు. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు 21 రోజులు వరకు పని లేకుండా గడవడం సాధ్యం కాదు. ఇందులో ప్రధానంగా పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే ఎక్కువ. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి వీరిది. రవాణా అంతా ఆగిపోవడంతో పనిలేక ఉన్న కూలీలు తమ స్వస్థలాలకు కాలి నడకన బయలుదేరారు. తిండి, నీరు లేకపోవడంతో 22 మంది ప్రజలు దారిలోనే మరణించారు. కరోనా కారణంగా 35 మంది చనిపోతే ప్రభుత్వ ప్రణాళికలేని అసమర్థ నిర్ణయాల వల్ల 22 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కట్టడి చేయాల్సిన సమయంలో కట్టడి చేయకపోవడం, ప్రణాళికరహిత నిర్ణయాల వల్ల ఇంతమంది ప్రజలు ప్రాణాలొదిలారు. మోదీ ప్రభుత్వం మొదట ఇది చైనా పని అని, తరువాత ప్రజల నిర్లక్ష్యం వల్ల అని, ఇప్పుడేమో మర్కజ్ సమావేశం వల్ల వైరస్ వ్యాప్తి చెందిందని చెప్తున్నది. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రజల మీద నిందలు వేస్తున్నది. చివరికి మతం దగ్గరకు వచ్చింది. తమ చేతకానితనాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కప్పి పుచ్చుకోడానికి ఇంతటి స్థాయికి దిగజారారు పాలకులు.
సమాజంలోని వైరుధ్యాలు, పాలకుల వైఫల్యాలు కరోనా విపత్తు కాలంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో బయటపడ్డాయి. లాక్ డౌన్ తరువాత కాలి నడకన స్వస్థలాలకు బయలుదేరిన లక్షలాది కూలీల వలస వ్యవస్థ డొల్లను కళ్ళకు కట్టింది. దేశవ్యాప్తంగా 13.9 కోట్ల మంది ప్రజలు బతుకుతెరువు కోసం వలస వెళ్లారు. ప్రధానంగా అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలవైపు వలసలు సాగాయి. అసమ అభివృద్ధి కారణంగా జరిగే వలసలు ఒక విధమైనవి అయితే, సహజ వనరులను కొల్లగొట్టడానికి ప్రజలపై రాజ్యహింస ద్వారా జరిగే వలసలు రెండోవి. పోలీసు బలగాల దాడులను తట్టుకోలేక ఊర్లు విడిచిన వారికి మాములు కూలీలకు ఇచ్చే కూలి కూడా ఇవ్వకుండా, శ్రమను కారుచవకగా దోచుకుంటారు. బిజెపి ప్రభుత్వం దేశంలో 100 స్మార్ట్ సిటీలు నిర్మాస్తామని 2015 లో ప్రకటించింది. కానీ ఇవి మరింత దోపిడీని పెంచడం తప్ప వలసలను ఆపేవి కావు. స్థానికంగా ఉన్న వనరులను ప్రజల కోసం వినియోగంలోకి తీసుకురావడానికి బదులు వాటిని పెట్టుబడిదారులకు పాదాక్రాంతం చేస్తారు. స్పెషల్ ఎకనమిక్ జోన్ల పేరుతో జరిగింది ఇదే. దాదాపు 6 లక్షల మంది ప్రజలు కరోనా లాక్ డౌన్ కాలంలో తమ స్వస్థలాలకు బయలుదేరారని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. ఢిల్లి - యూపీ బార్డర్లో లక్షలాది ప్రజలు బారులు తీరిన దృశ్యాలు అందరం చూశాము. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే వలస కూలీల సంఖ్య 17 లక్షల దాక ఉంటుంది. ఇక తెలంగాణాలో అయితే హోలీ సందర్బంగా బీహార్ వెళ్లిన వారు కాక 3.5 లక్షల మంది వలస వచ్చిన వారున్నారని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఒక వైపు 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి గత కొంత కాలంగా మోదీ ఉదరకొట్టుకుంటూ వస్తున్నాడు. మనం అడగాల్సింది దేశంలో ఇంత మంది వలస పోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తున్నదని.
ఇక తూర్పు మధ్యభారతం అటవీ ప్రాంతం నుండి జరుగుతున్న మెజారిటీ వలసలన్నీ కూడా రాజ్యానిర్బంధం వల్ల జరుగున్నవే. ఆదివాసుల కాళ్లకింద ఉన్న సహజ వనరులను బడా కార్పొరేట్లకు అందించడానికి ఆదివాసులను వెళ్ళగొడుతున్నారు. మరోవైపు ప్రపంచీకరణలో భాగంగా మార్కెట్ విస్తరణలో, సామ్రాజ్యవాద సంస్కృతి ఆదివాసీ ప్రాంతాలకు విస్తరింపచేయడం కూడా వలసలకు కారణమైంది. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం కూంబింగులను ఆపలేదు. మనిషి నుంచి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని తెలిసినప్పటికీ ఆ పని చేయలేదు. దేశమంతా అమలవుతున్న సోషల్ డిస్టెన్స్ ఇక్కడ అమలు కావడంలేదు. దండకారణ్యంలో ఉన్న వందలాది పోలిసు, పారామిలటరీ క్యాంపులలో సోషల్ డిస్టెన్స్ అమలు కష్టమే. ఒక్క సారి ఆదివాసీ ప్రాంతాలకు బయట నుండి వెళ్లే పోలిసు బలగాల ద్వారా వైరస్ ఆదివాసీ సమాజానికి అంటుకుంటే జరిగే నష్టం ఊహించలేనిది. అసలే ఆదివాసీ ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువుగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వాలకు ఆదివాసుల మీద కానీ, సైనికుల పట్ల కానీ ఎటువంటి ప్రేమ లేవు.
ప్రభుత్వానికి కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యం అనడానికిది నిదర్శనం. కరోనా సంక్షోభ సమయంలో భారత వైద్యరంగ జాతీయకరణకు సంబంధించిన చర్చ కూడా సమాజంలో మొదలయింది. ఇది చాలా అత్యవసరమైన చర్చ. ప్రపంచంలోని ప్రజారోగ్య ప్రమాణాలలో మనదేశం 141 వ స్థానంలో ఉంది. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం మీద 0.75 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. మరోవైపు వైద్యరంగంలో పెరిగిపోతున్న కార్పొరేట్ ఆధిపత్యంతో ప్రజలు వైద్యం కోసం వీరినే ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రజలు తమ ఆదాయం నుండి దాదాపు 64 శాతం వైద్యం కోసం ఖర్చుపెడుతున్నారు. ఇక ఒక్కో కరోనా టెస్టుకు 5000 వరకు చెల్లించాల్సి వస్తుంది. వీటితో పాటు అవసరమైన టెస్ట్ కిట్లు కూడా మన దేశంలో అందుబాటులో లేవు. ఇప్పటిదాకా 40,000 టెస్టులు మాత్రమే మన దేశంలో నిర్వహించారు. 130 కోట్ల మందిలో 40,000 చిన్న మొత్తమే. మిగతాదేశాలు లక్షల్లో టెస్టులు నిర్వహిస్తుండటంతో అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఇక్కడ టెస్టుల సంఖ్య తక్కువుగా ఉండటంతో కేసుల సంఖ్య తక్కువుగా ఉంది. కానీ ప్రభుత్వం తమ వల్లే కరోనా వ్యాపించకుండా ఉన్నదని ఢంకాలు కొట్టుకుంటుంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ ను ప్రకటించాయి. సుమారుగా అన్ని దేశాలలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వస్తూత్పత్తి నిలిచిపోయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి కరోనా ప్రభావంతో ఇంకా తగ్గిపోతున్నది. ఇప్పటికే కరోనా కారణంగా మధ్యతరగతి జీవుల లక్షలాది సంపద స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయింది. రాబోయే ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచం ఎలా తట్టుకుంటుందో చూడాల్సిందే. ఇప్పటికే మరణశయ్య మీద ఉన్న పెట్టుబడీదారి వ్యవస్థ, సంక్షోభం నుంచి బయట పడటానికి మరింత క్రూరంగా ప్రజల మీద దాడిచేస్తుంది.
నిజానికి సంక్షోభం వ్యవస్థాగతమైనది. కరోనాతో వచ్చింది కాదు. గతంలో ఆర్బీఐ గవర్నరుగా పనిచేసిన దువ్వూరి సుబ్బరావుతో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రజలకు ఉపాధి హామీ పేరుతో డబ్బులు ఇస్తున్నాం కదా, మరి ద్రవ్యోల్బనం ఎందుకు తగ్గటం లేదు అని అడిగాడట. డబ్బులైతే ఇస్తున్నాం కానీ ఉత్పత్తిని మనం నియంత్రించటం లేదు కదా అని ఆయన అన్నాడట. ఈ విషయం మనదేశంలోకి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగుకు తెలియదనుకోవడం పొరపాటే. ఈ విషయం మన్మోహన్ కే కాదు బూర్జువా ఆర్థిక వేత్తలందరికీ తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తారు. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి ఉన్నపుడే ధరలు అదుపులో ఉంటాయి. కానీ పెట్టుబడిదారుడు డిమాండ్ సప్లయ్ సూత్రాన్ని అనుసరిస్తూ లాభాలు పొందాలనుకుంటాడు. అంతేకాని ప్రజల అవసరాల్ని, క్షేమాన్ని చూడడు. ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉంటాయో వారే ఉత్పత్తిపై అజమాయిషీ చేస్తారు. వైద్యం అయినా, ఇంకోటైనా సరుకు అయ్యాక అందులో వ్యాపారం ఉంటుంది కానీ సేవ ఉండదు. వైద్యరంగం ప్రభుత్వ అధీనంలో ఉన్న దేశాల్లో ఇప్పుడు కొంత మెరుగైన స్థితి ఉండడం అందువల్లే. అలా చూస్తే ఇండియాలో వైద్యరంగం అధమ స్థాయిలో ఉంది. వైద్యం, ఉపాధి, కూడు, గూడు వంటి మౌలిక అంశాల చర్చ కరోనా మన ముందు ఉంచింది. ఇంటువంటి కనీస అవసరాలను అడ్రెస్ చేయలేని ప్రభుత్వం తన చీకటి సైన్యాన్ని ఉపయోగించి కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నది. కోవిడ్ నుండి జాగ్రత్తలు తీసుకుంటూ, పౌరులుగా పరస్పరం సహకరించుకున్తూనే, కుట్రలను ఎదుర్కోవడం, మౌలిక అంశాల పట్ల ప్రభుత్వాలను జవాబుదారీ చేయడం కూడా ఇవాల మనముందున్న కర్తవ్యాలు.
Type in English and Press Space to Convert in Telugu |
స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులుస్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........ |
నేనూ అర్బన్ మావోయిస్టునేపూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు...... |
ఆ కాఫీ తోటలు ఎవరివి?విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ...... |
ప్రజల పై యుద్ధంప్రజలు,సామజిక కార్యకర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ... |
బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు...... |
హిందూ రాజ్యం దిశగాʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే.... |
కిసాన్ ముక్తి మార్చ్ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి...... |
వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులుతమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు...... |
చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ..... |
ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలేదేశ రాజధానిలో మృతదేహాలతో, కన్నీళ్లతో, దుఃఖంతో, భయంతో బతుకుతున్న ప్రజలు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని సూచిస్తున్నారు. ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |