సమస్యల పరిష్కారం సమాజంలో ఉంటుంది అంటున్న పాణి కథలు

| సాహిత్యం | క‌థ‌లు

సమస్యల పరిష్కారం సమాజంలో ఉంటుంది అంటున్న పాణి కథలు

- పలమనేరు బాలాజీ | 02.04.2020 12:13:44am

కథల స్వరూప స్వభావాలు మారినప్పుడల్లా విమర్శ తదనుగుణంగా మారాల్సిన అవసరం ఉన్నది. కథలో వస్తువు శైలి శిల్పం మారుతున్నప్పుడు, ఆ మార్పులకు అనుగుణంగా కథావస్తువు, శైలి శిల్పంలో వస్తున్న గుణాత్మకమైన మార్పులను గమనించి ఆదిశగా విమర్శ మరింత పదునుదేరాల్సిన సమయం వచ్చింది.

పాణి కథల్లో కథల నేపథ్యం విభిన్నంగా ఉంటుంది. కథలో వస్తువు ఫలానా అని పరిమితంగా చెప్పడం కష్టం. వస్తు,శిల్పాల ఐక్యత పాణి కథల ప్రత్యేకత.

తెలుగు సమాజాలకు కొత్త మేల్కొలుపులాంటి కథలను పాణి రాశారు .రచయితలు సామాజిక శాస్త్రవేత్తలు మేధావులు చర్చించాల్సిన ఎన్నో ప్రతిపాదనలను సూత్రీకరణలను, ప్రశ్నలను ఈ కథలలో చూస్తాం.

చరిత్ర పట్ల ఎరుక, సామాజిక పరిస్థితుల పట్ల అవగాహనతో ప్రజా పక్షం వహించే రచయితల రచనలు భిన్నంగా ఉంటాయి. చేసే ప్రతి పని పట్ల గౌరవం, నిబద్ధత ఉన్న వాళ్ల మాటలు, రాతలు ఆచరణాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉంటాయి. అలాంటి రచయితల్లో పాణి ముఖ్యులు.

కొందరు రచయితలకు, కొన్ని పుస్తకాలకు పరిచయం అవసరం ఉండదు. అలాంటి రచయిత పాణి అలాంటి పుస్తకం "నేరేడు రంగు పిల్లవాడు"(జనవరి 2020). ఈ కథా సంపుటిలోని పది కథలలో, విరసం పత్రిక అరుణతారలో తొమ్మిది కథలు, సాహిత్య గోదావరి పత్రికలో ఒక కథ అచ్చు కావటం గమనార్హం.విస్తృతంగా సమాజానికి చేరువ కావాల్సిన ఈ కథలు,రచయిత భావజాలం, సిద్దాంతరీత్యా ఒకే పత్రికలో అచ్చుకావడం అనే పరిమితి వల్ల ఇతర పాఠకులకు చేరలేకపోయిన కొరత ఇప్పుడిలా కథా సంపుటం అచ్చువేయడం ద్వారా కొంత మేరా తీరినట్లే !

దళిత గిరిజన బహుజన మైనారిటీ ఆదివాసీ సమూహాలకు దగ్గరగా జీవించడం, వాళ్ళ అనుభవాలను దగ్గరగా పరిశీలించడం, సమస్యల పరిష్కారానికి అన్ని వైపులా ఆలోచించడం, గత వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుని ఆర్ధిక, చారిత్రక, రాజకీయ అవగాహనతో వ్యక్తుల సమస్యల నుండి సామాజిక సమస్యలను గుర్తించడం, సమస్యలను వ్యక్తిపరంగా కాకుండా, సామాజికపరంగా బాధ్యతాయుతంగా సూచించటం, చర్చించడం లేదా ప్రతిపాదించడం పాఠకుడి ఆలోచనకు పదును పెట్టడం పాణి కథల్లో కనబడుతుంది.

మనుషుల్ని సమాజాన్ని ప్రకృతిని ప్రేమించేవాడు , మానవ సంబంధాల విలువ, సామాజిక శాస్త్రాలు తెలిసినవాడు రాసిన కథలు కనుక, మానవ సంబంధాల్లోని ఆర్తి, అణగారిన వర్గాలు, దుఃఖితులు, బాధితుల పోరాట పటిమ ,మరణానంతర స్ఫూర్తి ఈ కథల్లో కనపడతాయి.పాణి లాగా కథలు రాయటం ఒక పాణీ కే సాధ్యం.

వస్తువైవిధ్యం,నిరలంకార కథన శిల్పం, పాత్రోచితమైన సహజ సంభాషణ, సన్నివేశాల చిత్రీకరణ, దృశ్యమానంగా కథ చెప్పటం, గత వర్తమాన భవిష్యత్ కాలాలను చిత్రించే దిశగా అవసరమైనంతగా వైవిధ్య భరితమైన, చురుకైన వినూత్న కథన శైలిని ఎంచుకోవటం ఈ రచయిత ప్రత్యేకతలు.

కథలో చెప్పిన విషయాల కంటే చెప్పని విషయాలే కథకు కీలకం అనుకుంటే, ఈ కథలు చదువుతున్నప్పుడు కథలను చదివే పాఠకులు రచయితలు విమర్శకులు తమ అవగాహనను పునఃపరిశీలించుకోక తప్పదు.

తమ అధ్యయనాన్ని అవగాహనను అభిప్రాయాలను, ఆదర్శాలను ఆలోచనలను మరొకసారి సమీక్షించుకునే పరిస్థితిని ఈ కథలు కలిగిస్తాయి.

ఇతరుల అనుభవాలను చూసి లేదా కథలు చదివి లేదా ఊహించి కథలు రాసే మూస రచయితల కథల మధ్య, జీవితం, సాహిత్యం, సమాజం తెలిసిన రచయితల కథలు ప్రత్యేకంగా కనపడతాయి. ఈ కథలు చదవడం సులభమేమీ కాదు. శ్రద్ధతో స్పృహతో చదవాల్సిన కథలివి. నిస్తేజంగా నిరాసక్తంగా ఉన్నటువంటి పాఠకుడిలో కదలికను చైతన్యాన్ని తీసుకువచ్చే కథలను చదివే అనుభవం అపూర్వం.

సాధారణ పాఠకుడు ఉత్తమ పాఠకుడిగా మారటానికి ఎదగడానికి ఉపకరించే ఇలాంటి కథలను తెలుగు సమాజం, సాహిత్య విమర్శకులు విస్తృతంగా చర్చించాల్సి ఉంది.

సమాజంలోని జీవితంలోని వైవిధ్యాన్ని సంక్లిష్టతని వైరుధ్యాలను అర్ధం చేసుకోవడానికి, కొత్త దృష్టితో జీవితాన్ని చూడటానికి, తనను తాను ప్రక్షాళన చేసుకోవటానికి, చరిత్రను తిరగరాసుకోవటానికి, భవిష్యత్ పట్ల కొత్త ఆలోచనలు చేయడానికి ప్రేరణ కలిగించేవి మంచి కథలు. అలాంటి మంచి కథలు ఈ కథా సంపుటి నిండా ఉన్నాయి.

ఆలోచించకుండా, బాధపడకుండా, పోరాట స్ఫూర్తిని పొందకుండా ,మళ్లీ వెనక్కి వెళ్లి మొదటినుండి మరొకసారి చదవకుండా, ఈ పుస్తకంలోని కథలను చదవలేం అన్నది వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే ముగింపు లేని కథలు. పొరలు పొరలుగా అనేక కథలు ప్రతి కథలో అల్లుకుని ఉన్నాయి.

వస్తువు ఎంపికలో, కథనంలో, శైలిలో, పాత్రల సంభాషణలో, కథనంలో, సన్నివేశ చిత్రణలో ప్రారంభం, ముగింపు, కంఠస్వరం లో రచయిత సాధిస్తూ వచ్చిన అపారమైన పరిణితి ఈ కథల్లో గమనించవచ్చు. వ్యక్తి పరమైన కథాంశం సామాజికపరం కావడం ఎట్లాగో, సామాజిక పరమైన కథాంశం ఉద్యమ స్పృహతో ఊపందుకోవడం ఎలాగో, వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారానికి ఉద్యమ స్థాయిలో రాజ్యం పరంగా చేపట్టాల్సిన ముగింపు ఏమిటో విలక్షణమైన పద్ధతిలో చెప్పిన కథలివి.అవగాహన, అధ్యయనం, వివేచన, మనుషుల పట్ల, ప్రకృతి ,సమాజం పట్ల ప్రేమ,బాధ్యత కలిగిన రచయితగా పాణి ఈ కథల్లో అనేక అంశాలను పాఠకుల ఆలోచనలకు వదిలిపెడతాడు. ఈ కథలలో ఏ ఒక్క పేరా కూడా చదివి నింపాదిగా ముందుకు పోలేని పరిస్థితి పాఠకుడిది.

ఒక పుస్తకంలో చెప్పాల్సింది ఒక కథలో, ఒక కథలో చెప్పాల్సింది ఒక పేరాలో, ఒక పేరాలో చెప్పాల్సింది ఒక వాక్యంలో చెప్పగలగడం పాణి శిల్ప పరిణతికి నిదర్శనం.

విరసం క్రమంతప్పకుండా నిర్వహిస్తున్న కథల వర్క్ షాపులలో విస్తృతంగా పాల్గొని కథలను చర్చించడం, కథా విమర్శను గమనించటం, విస్తృతంగా సాహిత్య సామాజిక శాస్త్రాలను, విమర్శా సిద్ధాంతాలను అధ్యయనం చేయడం, సామాజిక మూలాల్లోకి వెళ్లి రావటం,పరిస్థితులను సమస్యలను పోరాటాలను దగ్గరగా గమనించడం, ఉద్యమంలో భాగస్వామ్యం కావడం, ఆచరణాత్మక సాహిత్యం ఈ రచయితచేత బలమైన కథా వస్తువులతో, చదివించే గుణంతో, పాఠకులకు స్పూర్తి ప్రేరణ కలిగించేలా, కొత్తగా ఆలోచించగలిగే, కథలు రాయించ గలిగాయి.

ఈ కథలోని పాత్రలన్నీ మన చుట్టూ ఉన్న మనుషులే. మనం ప్రేమించిన వాళ్ళు, మనం అపార్థం చేసుకున్న వాళ్లు ,మనం దూరం చేసుకున్న వాళ్లు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనల్ని దూరం చేసుకున్న వాళ్లు ,మనల్ని పోగొట్టుకున్న వాళ్లు, మనం పోగొట్టుకున్న వాళ్లు.

ఇంతమంది మనుషుల్ని ఇంత చిన్న పుస్తకంలో కలుసుకోవడం గొప్ప ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ఒక కథలో ఎన్నో జీవితాలు, ఎన్నెన్నో మలుపులు, ఏ కథను చదివినా అనేకమందిని కలసి వచ్చినట్లు ఉంటుంది. ఒకరితో ఒకరు చర్చించుకున్నట్లు ఉంటుంది. కొత్తగా ఆలోచించినట్లు, కొత్తగా ప్రతిపాదించినట్లు, కొత్తగా సమాధానాలను, పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం ఈ కథల్లో కనబడుతుంది.

మనిషి లోపలి మంచితనం,అమ్మతనం, బాల్యం, సున్నితత్వం చాలా పాత్రలను పాఠకులకు గుర్తుండి పోయేలా చేస్తుంది.ఇప్పటిదాకా మనం గుర్తించని మనుషుల్ని గుర్తించడానికి ఇష్టపడని మనుషుల్ని గౌరవించని వాళ్ళని గౌరవించటానికి, మనం ఇష్టపడని వాళ్ళని మనకే కొత్తగా ఈ కథలు పరిచయం చేస్తాయి.మనిషి లోపలి మనుషుల్నిలోతుగా పరిచయం చేస్తాయి ఈ కథలు.

ఒక మాటలో చెప్పాలంటే ఈ కథలు చదువుతుంటే మనకు మనం కొత్తగా పరిచయం అవుతాం. అనేక కారణాలతో సంవత్సరాలకు పైగా అణచివేయబడ్డ మనుషులకు ఏదో స్వేచ్చా, విముక్తి ఈ కథలు చదవటంలో ఉంది.

కథలను అర్థం చేసుకోవటం ఎలా అనేది కాదు గాని, మనుషుల్ని , ప్రకృతిని, పర్యావరణాన్ని,సమాజాన్ని ,ఆదివాసి జీవితాల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఈ కథలు చదివాక అర్థమవుతుంది.

మనుషులు లోపల యెట్లా వున్నా , పైకి ఎలా కనపడతారు? అలా కనబడటం వెనుక గల కారణాలు ఏమిటి ?నిజానికి మనిషి లోపల మనిషి ఎట్లా ఉంటారు ? ఏ కారణాల వల్ల ఈ రకంగా మనుషులు ఇట్లా ఉండగలుగుతారు అని ఆలోచించే పరిస్థితి వస్తే , అలాంటి సందర్భమే ఎదురైతే కొందరు ఎట్లా అమానవీయంగా మారగలుగుతారో, మరికొందరు ఎట్లా అద్భుతమైన మనుషులుగా మారగలరో ఈ కథల్లో తెలుస్తుంది.

" నేరేడు రంగు పిల్లవాడు"కథలో ఆదర్శాల మాటున తనను తాను హెచ్చించుకునే మనిషి, తనను తాను ప్రచారంలోకి పెట్టుకునే మనిషి ,తనకు తానే గుర్తింపును కోరుకునే మనిషి వ్యక్తిత్వవిలువల పట్ల ఎంత అమర్యాదగా ఉంటాడో ,తన మరుగుజ్జు మనస్తత్వం ఏమిటో తెలుస్తుంది.

మనుషులు ఎలా ఉంటారో, ఎందుకు అలా ఉంటారో తెలిసినాక ఎలా ఉండకూడదో తెలుసుకునే ప్రయత్నం ఈ కథలో గమనిస్తాం.

జీవితం తెలిస్తే మనుషులు ఎలా ఉంటారో, జీవితం తెలియకపోతే మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో, జీవితం విలువ తెలియకుండా జీవితాలను మధ్యలోనే తుంచేసుకుంటున్న వారి కుటుంబాల వ్యధ గురించి తెలుస్తుంది. మనల్ని నమ్మిన వాళ్లను ఒంటరి వాళ్లను చేసే బేలతనం ఎందుకూ పనికి రాదని, ఎవరికైనా జీవితం విలువ తెలియడం కంటే విలువైన సంపద ఏదీ లేదని డేవిడ్ వాళ్ళ అమ్మ అంటుంది.

ప్రమాదకరం లో ఉన్న పర్యావరణం గురించి డేవిడ్ ఎంత హెచ్చరించినా, నీవు చెప్పే విపత్తు ఇప్పుడే రాదు కదా అనే వాళ్లను చూసి కోపం వస్తుంది.

...కాదు విపత్తు వచ్చేసింది అంటే అంతకంటే జీవన్మరణ సమస్యలు గురించి ఏకరువు పెట్టి వాళ్ల గురించి బాధ కలుగుతుంది. ఉద్యోగం కంటే పర్యావరణం గురించి మాట్లాడటానికి మనిషి కావాలని అనుకునే మనిషి డేవిడ్.

బహుశా మనిషిలోని మూడు సమ్మిళిత వ్యక్తిత్వాలకు చిహ్నాలు డేవిడ్ , సుందర్ రాజు ఇస్మాయిల్. ఈ వ్యక్తిత్వంలోని వైరుధ్యాలు అంతరాలు ఆదర్శాలు చర్చించదగినవి.

చాలా సాధారణంగా కనిపించే అసాధారణత మనిషిని దగ్గర చేస్తుంది. మనం కోల్పోయిన మంచి వాళ్లను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాం. ఉన్నవాళ్లలో లేని వాళ్ళని వెతుక్కుంటాం. లేకుండా పోయిన వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. దూరమైపోయిన వారి చివరి కోరికలు తీరాలని కోరుకుంటాం.

తను ఎలా ఉన్నా, తను బాగున్నాను అని తల్లికి ధైర్యం చెబుతూ నేరేడు రంగు పిల్లవాడు రాసిన ఉత్తరం ఆ తల్లికి చేరిందా లేక ఎన్కౌంటర్ లో మరణించిన ఆ కుర్రవాడి చావు వార్త ముందు చేరిందా అని అయోమయంలో ఉండిపోతాడు ఇస్మాయిల్.

సరిగ్గా అలాంటి పిల్లవాడిని గుర్తుకు తెస్తాడు డేవిడ్. ఒక పర్యావరణ కార్యకర్తగా సామాజిక కార్యకర్తగా ఎంత చేస్తున్నా, కులం పేరుతో డేవిడ్ ను తక్కువ చేసిన సుందరరాజు వ్యక్తిత్వం ఇస్మాయిల్ ను కలవరపెడుతుంది.ఉత్తమ టీచర్ గా అవార్డు అందుకున్న భార్యను గౌరవించలేని గుర్తించలేని వ్యక్తిత్వం సుందర్ రాజుదని తెలిసాక ఇస్మాయిల్ అక్కడ ఉండలేక పోతాడు. బండిలో ఇస్మాయిల్ ఇంటి వద్ద వదిలి వెళ్లిన డేవిడ్ కు మళ్లీ ఫోన్ చేసి ,తిరిగి రమ్మని పిలిచి, సుందర్ రాజు ఇంటి నుంచి బయటపడతాడు ఇస్మాయిల్.

నేరేడు రంగు పిల్లవాడి గురించిన తలపోత అంతా విన్నాక, డేవిడ్ ఇస్మాయిల్ కళ్ళల్లోకి సన్నిహితంగా చూసి ఒక మాట అంటాడు.

" మనుషులు కలుస్తారు సార్ మనమే కాకపోవచ్చు..".

ఇదీ కథ! మే 2019లో అరుణతార లో ఈ కథ మొదట అచ్చయ్యింది.

" ఔట్ ఫ్లో" రాయలసీమ ఉద్యమానికి సంబంధించిన కథ.

మరణించిన వాళ్ల మనసులు మాట్లాడటం ఈ కథలో చూస్తాం. మనిషికి ఎంత విలువ ఉందో అంతకంటే ఎక్కువ విలువ మరణానికి ఉంటుంది. పెత్తర్లమాస్యకు సాంబ్రాణి వేయటానికి తల్లి రమ్మని పిలిస్తే "నాయిన ఆడెడా ఉంటడుమా. ఈడ్నే డ్యాం కాడ ఉండింటడు" అని సూర్యనారాయణ అన్నాడంటే దానికి బలమైన కారణమే ఉంటుంది .

"ఒక తూరి ఉరికి తీసక పో రా ...ఇల్లు కల్లం చూసి సచ్చిపోతా. గాడిపొట్లో ఎద్దులు ఎట్లుండాయో ఏమో చూద్దాం పారి.." అని మర్లు గమ్మి మాట్లాడేవాడు వాల్ల నాయిన సుంకులు.

నీళ్లు అంటే భయపడే అతడికి ఉద్యోగం డ్యాం పైనే రావటం విశేషం.

శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో మునిగి ఊరు అదృశ్యం కావడం ఒక విషాదం. ఎక్కడో కట్టాల్సిన డ్యాం ఇక్కడే కట్టడం కలిగించడం, కుటుంబం సహా ఊరు వదిలి రావటం ఒక్కటే సుంకులు బాధకి కారణం కాదు. జీవనాన్ని జీవితాన్ని పోగొట్టుకోవడం మాత్రమే నరకం కాదు.తమ ఉనికిని, మూలాల్ని పోగొట్టుకోవాల్సి రావడం ఒక మరణయాతన.

" ఇన్ని ఊర్లు ముంచి ఎంతమంది కడుపు కొట్టి దీన్ని కడుతుండేది తాగే కి, చేలకి నీళ్ళియడానికి కాదంట. కరెంటు తీస్తారంట...... కరెంటు..... "జనం గుండెల్లోని మంట అది.

ఇవన్నీ తెలిసిన వాడు కాబట్టే అతడి కంఠం అన్యాయానికి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతూనే ఉంటుంది.

" మొదట ఇండ్లకు, పొలాలకు, చెట్టు చేమకు ...ఒకటేంది.... మీ ఆస్తిలో పూచిక పుడక కూడా లెక్కగట్టి దుడ్లు ఇస్తామనిరి. ఏం లెక్కలేసిరో.... మనయి తీసుకొని మనల్ని అడక్కుండా లెక్కలేయడం ఎందో. ఏసిరి అదికూడా ఒక తూరి ఇచ్చిరా...? అదీ లేకపాయె. వాళ్ళ అబ్బ గంటు ఇస్తున్నట్లు రెండేళ్ల కింత, నాలుగేళ్ల కింత రాల్చిరి.

అది చేతికి నోటికి అందకపాయె. కడాకు ఇట్ల ఊర్లుబట్టుకొని అడక్కతింటుంటిమి... ఇంత డ్యాం కట్టిరి గాని చుట్టుపక్కల రైతులకు చారెడు నీళ్ళు ఇయ్యనీకపోయిరి. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు కట్టిరి. దాన్నించి నీళ్లు వచ్చే.. వచ్చే... అనిరి. తీరా నీళ్లు అందకుండా దాని తూము పైకి కట్టినారంట. "

ఏడాది కిందట డ్యాంలో 30 టీఎంసీల నీళ్లు కూడా లేక కాలువలు చెరువులు నెర్రెలు బారిన స్థితిలో కోస్తా వాళ్లకు మంచినీళ్ల కోసమని 10 టీఎంసీలు కిందికి వదలడం సూర్యనారాయణకు గుర్తుకు వస్తుంది.తాగడానికే అయితే ఇన్ని నీళ్లు ఎందుకు ?ఇదంతా చేపల చెరువుల కోసమే అని నాలుగు వేల మంది కర్నూలు రైతులు ధర్నా చేయడం ఒక చరిత్ర.

" పట్టిసీమ నీళ్లు వాళ్లకిస్తుండరు కదా.. ఈడి నుంచి ఇంకా చుక్క కిందకి వదలడానికి లేదు. " అనే నినాదాలు విన్నప్పుడు సూర్యనారాయణ ఏమనుకుంటాడో రచయిత స్పష్టంగా చెబుతాడు.

" నాయినే బతికింటే ఈ మాట విని ఎంత సంబరపడేటోడు.. ఇది బతికి ఉంది. ఇన్ని దినాలకు కదా ఒక మంచిమాట.. లోపల పూడుకుపోయినదంతా ఔట్ ప్లో అయ్యేమాట వింటున్నాం. "

ఒక్కదానివే ఎందుకు ఊర్లో ఉండిపోవడం ,తమ దగ్గరికి వచ్చేయొచ్చు కదా అని అని కొడుకు కోడలు ఎంత బ్రతిమలాడినా, బలవంత పెట్టినా సూర్యనారాయణ తల్లి కదలదు. వాన వచ్చి చెరువు తెగిపోయి ఊర్లోకి నీళ్ళు వచ్చినా ఆమె కదలదు. ఏ భయం లేదంటుంది.ఆమె వ్యధ ఆమెది.

"ఎందో ఈ డ్యాం తో మనకథ ముగిసేటట్లు లేదు.నీళ్లొచ్చి ఒక తూరి, నీళ్లు రాక ఇంగోతూరి, అన్నట్లు కుటుంబమంతా గుల్ల యిపోయే. నలభై ఏళ్ళ సంది కన్నగసాట్లు పడితిమి."

నీళ్లు నిండిన తర్వాత మంత్రి ఎమ్మెల్యేలు పూజ చేసి గేట్లు ఎత్తారు.ఆ ఉదయ కాలపు సౌందర్యంలో జలపాతం దుంకుతున్న హోరు ప్రకృతినంతా సచేతనం చేస్తోంది- అంటాడు రచయిత.

"చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతా చేపట్టిన జల హారతి ఫలితమే ఇది. వరుణదేవుడు కరుణించాడు. పట్టిసీమ నీళ్లు ఇవ్వనవసరం లేకుండా ఇక్కడ వానలు కురుస్తున్నాయి..." అని అంటాడు ఇరిగేషన్ మంత్రి పసన్నంగా.

సూర్యనారాయణ స్నేహితుడు- అనారోగ్యంతో అత్తగారిని పోగొట్టుకున్న విశ్వనాథం గురించి రచయిత ఇట్లా చెబుతూ కథ ముగిస్తాడు.

తల్లిని కోల్పోయిన బిడ్డ వలె విశ్వనాథన్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తనేమీ మాట్లాడలేకపోయాడు. విశ్వం ఏడుపు ఏ ఆగాథాల్లోకో జారిపోయింది. సూర్యనారాయణ కళ్ళల్లోంచి జలజలా ధారాపాతం... ఆ పక్క రెండు గేట్ల నుంచి దుముకుతున్న జలపాతం వలె...

అరుణతార నవంబరు 2017 లో ప్రచురితమైన "ఔట్ ఫ్లో" కథ.. ఒక ముగింపు లేని కథ .అందుకే చివర్లో కథాపారంభాన్ని మళ్లీ ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది.
ఏదోలా ఉంది. స్థిమితంగా లేదు. అటూ ఇటూ తిరుగుతున్నాడు. వాన సవ్వడి అలజడి రేపుతోంది. కిటికీ లోంచి తొంగి చూస్తే ఏమీ కనబడటం లేదు. అవతల దట్టమైన వాన పరదా. ఈ ఎడతెగని వానే కలతకు కారణమా?

ఈ రెండు కథలు కాక మరొఎనిమిది కథలు ఈ కథ సంపుటం లో ఉన్నాయి. అరుణతారలో వచ్చిన కథలు : రాకుమారుడు –కార్పేటమ్మ(2013) , శవాల ఖజానా(2018), అభాస(2012), తడి(2018), నది పారని నేల(2017),నీడల జాడలు(2017) ,రీ కనెక్ట్(2019). సాహితీగోదావరి-వరంగల్ కథల ప్రత్యేక సంచిక లో అచ్చయిన కథ : ఇన్ మోషన్(2016)

మనుషుల్ని నడిపించే వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే ఉద్వేగాలే మానవ సంబంధాల్లో కీలకం.ఈ కథల నిండా అల్లుకున్న ఉద్వేగాలు కొన్ని ఉత్తేజం కలిగిస్తాయి, కొన్ని భయాన్ని కలిగిస్తాయి, కొన్ని సమాజం పట్ల మన బాధ్యతని, ప్రేమని మనకు గుర్తు చేస్తాయి.

ఈ కథా సంపుటికి రాసిన ముందుమాటలో స్వామి ఇలా అంటారు.

" రాయలసీమ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ భూమికలను అధ్యయనం చేసిన రచయిత పాణి. స్థానిక సమస్యకు గల చారిత్రక కారణాలు ఇతనికి తెలుసు. స్థానిక సమస్య వెనకాల గల రాజకీయ విద్రోహాలు ఇతనికి తెలుసు."

" నిర్దిష్టతకూ మొత్తంకూ మధ్య జరిగిన రసాయనిక చర్య ఇతనికి కథా శిల్పం. ఇతని ʹకథాకళʹ ఈ ʹచర్యʹ తెలుగుకథకు కొత్త. అమూర్తమైన తన భావజాలాన్ని మూర్తిమంతం చేయడంలో ఈ రచయిత విజయం సాధించాడు.

" కూడలి " పేరిట రాసిన ముందు మాటలో అల్లం రాజయ్య గారు ఇలా అంటారు.

"...అందుకే పాణి కథలు రాయలసీమ నేపథ్యంలో మొదలై మొత్తంగా విప్లవోద్యమంలో అనేక రకాలుగా వ్యక్తమయ్యే వైరుధ్యాలు, సంఘర్షణలు, పరిష్కారాలతో మిళితమై ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ప్రత్యేక స్థితి నుండి మొదలై సాధారణ స్థితికి చేరుకునే ప్రయాణమే ఈ పది కథలు."

"..పాణి కథలు సాంప్రదాయిక తెలుగు కథలకు భిన్నమైనవి. ఒక ఇతివృత్తం, కొన్ని పాత్రలు, సన్నివేశాలు వగైరా వగైరాలతో ఒక ఆరంభం, ఒక విస్తృతి, ఒక వైరుధ్యం, ఆ వైరుధ్యం పరిష్కారం లాంటి శిల్పంతో నడిచిన కథలు కావు ఇవి. ఒకే సన్నివేశంలో అనేకం ఘర్షణలు పడటం, ఆ ఘర్షణలు ప్రవహించడం ఈ కథల ప్రత్యేకత. ముగియకుండా విస్తారమైన ఆలోచనలకు అవకాశమిచ్చే , ఎప్పటికీ ముగియని అనేక రూపాల్లో ఎదురయ్యే కథలివి."

ఈ కథలను శ్రద్ధగా చదవటం, చర్చించుకోవడం ద్వారా వినూత్న కథా వస్తువులు, ఉన్నత శైలి-శిల్పం పట్ల కొత్త కథకులకు అవగాహన కలుగుతుంది. సాహిత్య విమర్శకులకు మంచి అధ్యయనం, కొత్త కథకులకు అభ్యసనం ఈ కథా సంపుటం.

No. of visitors : 559
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •