కరోనా కాలంలో పోలీసు కాల్పులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

కరోనా కాలంలో పోలీసు కాల్పులు

- పాణి | 10.04.2020 01:19:05pm


సైనిక దాడులు నిలిపేస్తాం, మీరు సిద్ధమేనా అని ప్రభుత్వానికి మావోయిస్టుల ప్రతిపాదన

ఇది మానవాళిని చుట్టుముట్టిన కరోనా కాలం. అనేక ప్రశ్నలను, సందేహాలను ముందుకు తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ ఈ వ్యవస్థ గురించి, సామాజిక-వ్యక్తిగత జీవితం గురించి లోచూపును అందిస్తోంది. వ్యవస్థ మేడిపండు స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది. ప్రకృతి-మనిషి అనే మౌలిక విషయం దగ్గరికి అందరినీ తీసికెళ్లింది. ఈ విపత్తులోంచి మానవజాతి తేరుకుంటుందా? వ్యవస్థలు తిరిగి పని చేస్తాయా? అని కొందరికైనా సందేహం కలిగేలా చేసింది.

ఇది ఒక పార్శ్వం మాత్రమే. మానవజాతి గతంలో ఇలాంటి వ్యాధులను, మరణాలను ఇంత కంటే పెద్ద ఎత్తున అనుభవించింది. అయినా ఆ తర్వాత కొద్ది కాలానికే చిన్న చిన్న మార్పులతో అన్ని వ్యవస్థలు తిరిగి పని చేయడం మొదలు పెట్టాయి. దాని వల్ల ప్రజల జీవితం గాడిన పడి ఉండవచ్చు. దోపిడీ పీడనలు ఏవీ ఆగలేదు. అత్యంత నిర్దయగా, క్రూరంగా వ్యవస్థలన్నీ ప్రజల మీద సవారీ చేశాయి.

కాబట్టి ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇక అంతా అయిపోయిందని సాధారణ ప్రజలకు అనిపించవచ్చు. ఏమీ మిగల్లేదనిపించవచ్చు. అంతగా ప్రజా జీవితాన్ని ఈ సంక్షోభాలు కుదేలు చేస్తాయి. కానీ ఈ మరణాల్లో, కన్నీళ్లలో, కడుపుకోతల్లో, నిస్సహాయతలో వ్యవస్థ మరింత అమానవీయంగా తయారవుతుంది. అది దాని సహజ స్వభావం.

ఈ మాట చెప్పడానికి ఇది తగిన సమయం కాదని కొందరనవచ్చు. ఈ చర్చకు తొందరెందుకు అనవచ్చు. కానీ మన కళ్ల ముందే వైరస్ సంక్షోభం, వ్యవస్థ దుర్మార్గం రెండూ కనిపిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలకు మేలు చేసే ప్రక్రియలు ఆగిపోవచ్చేమోగాని వ్యవస్థలో భాగంగా నడిచేవన్నీ యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవస్థ తన మానాన తను నడుస్తూనే ఉంది. మనకు ఈ స్పష్టత ఉంటే చాలు.

దీనికి కొన్ని ఘటనలు ఉదహరిస్తాను.

రాజకీయాలకు అతీతంగా మానవులంతా ఐక్యమై కరోనాను కట్టడి చేయాలని పాలకులు అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వాళ్లను ఉద్దేశించి ఈ మాట అధికార వైసీపీ వాళ్లు రోజూ అంటున్నారు. ప్రజలకు ఇంత విపత్తు వచ్చిపడితే తలా ఒక చేయి వేసి ఆదుకోవాల్సిందిపోయి, మా మీద ఉండే రాజకీయ వ్యతిరేకతతో ప్రభుత్వ సహాయక చర్యలను విమర్శిస్తారా? అంటున్నారు.
ఇదే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో తమ రాజకీయ ప్రత్యర్థులైన మావోయిస్టుల పైన వేలాది మంది పోలీసులతో, పారా మిలటరీ బలగాల దాడులను మాత్రం ఆపలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది నడుస్తోంది. చంద్రబాబు చూపిన దారిలోనే వైసీపీ విప్లవోద్యమ ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తోంది. జగన్ కు ʹరివర్స్ సీఎంʹ అని టీడీపీ పేరు పెట్టింది. అంటే తమ పాలనా కాలంలోని విధానాలను, నిర్ణయాలను అన్నిటినీ ఆయన రివర్స్ చేస్తున్నాడని వాళ్ల ఆరోపణ.

కానీ విప్లవకారుల విషయంలో మాత్రం టీడీపీ విధానాలను జగన్ రివర్స్ చేయలేదు. ఇంకా ముందుకు తీసికెళుతున్నాడు. పైగా కరోనా సమయాన రాజకీయాలకు అతీతంగా పని చేయడానికి రమ్మని టీడీపీకి పిలుపు ఇస్తూ ఇంకో పక్క విప్లవకారుల మీద మాత్రం సైనిక చర్యలను కొనసాగిస్తున్నాడు.

ఇది జగన్ రాజనీతి. ఇది ఆయనదే కాదు. పాలకులందరిదీ. వాళ్లకు ఇది సహజమే.

ఈ కరోనా కల్లోలంలో ఒక వ్యవస్థగా రాజ్యం ప్రజలకు మాస్కులు ఇవ్వలేదు. మందులు ఇవ్వలేదు. వైద్యులకు సదుపాయాలు కల్పించలేదు. పారిశుధ్య కార్మికుల రక్షణ చర్యలు ఏవీ తీసుకోలేదు. కానీ ఏవోబీ ప్రాంతంలో మాత్రం కూబింగులు, దాడులు, ప్రజలపై వేధింపులు మాత్రం కొనసాగిస్తుంది.

వ్యవస్థ తన పని తాను చేసుకపోవడమంటే ఇదే.

ప్రజల ప్రాణాలను కాపాడటమే తన పరమ కర్తవ్యమని, ఇలాంటప్పుడు రాజకీయాతీతంగా ఉంటామని ప్రభుత్వాలు చెప్పుడం ఒట్టి బూటకం. ఈ పనులు పోలీసులు ఏదో అలవాటుకొద్దీ చేస్తారనుకుంటే పొరబాటు. వాళ్లు ʹచెడ్డవాళ్లుʹ కాబట్టి చేస్తారనుకుంటే మనం అమాయకులమైనట్లే. ఎలాంటి పరిస్థితుల్లోనయినా వ్యవస్థ తన పని తాను చేయడంగా దీన్ని అర్థం చేసుకోవాలి.

ఐదు రోజుల కింద సీపీఐ మావోయిస్టు మల్కన్ గిరి, కోరాపుట్, విశాఖ కమిటీ కార్యదర్శి కైలాసం ఒక ప్రకటన చేశాడు. అందులో ఆయన ఆ ప్రాంతంలో పోలీసుల దాడులను ప్రస్తావించాడు. దాని ప్రకారం.. ఏపీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు గాలికొండ ఏరియాలోని కొయ్యూరు, గూడెం కొత్త వీధి గ్రామాల్లో, పెద్దబయలు ఏరియాలోని ఇంజరీ పంచాయతీలోని కోండ్రు తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఇది ఎప్పటి మాటో కాదు. మార్చి చివర్లో కరోనా తీవ్రమయ్యాకనే. కోండ్రు గ్రామంలో అయితే తెల్లవారు జామున 3 గంటల నుంచి ఆరు గంటల దాకా బీభత్సం సృష్టించారు. అయితే ప్రజలు తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు.

ఇదే పరిస్థితి కటాఫ్ ఏరియాలో కూడా ఉంది. దార్లబెడ్డ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపులో మకాం వేసి బియ్యనకుడి, కొద్దర గూడ, సిమిలిపోదారి గ్రామాల్లో జనతా కర్ఫ్యూ రోజే నానా దుర్మార్గాలు చేశారు. నిర్దిష్టంగా మార్చి 11 నుంచి ఈ దాడలు తీవ్రమయ్యాయి. కరోనా కాని, లా డౌన్ కానీ వీటిని ఆపలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో భాగమైన కిమిడిపట్టు గ్రామం నుంచి బియ్యనకుడి, కొజ్జర గూడ, సిమిలిపొదొరి గ్రామాల ప్రజలు పోలీసుల వేధింపులు అనుభవిస్తున్నారు. సిమిలిపొదొరి గ్రామం నుంచి ఏడుగురిని పోలీసులు ఎత్తుకెళ్లారు. వాళ్లంతా మావోయిస్టులని, సరెండర్ అయ్యారని చూపించారు. వాళ్లలో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ తెలియదు. వాళ్లను సరెండర్ చేసి వదిలేశారా? నిర్బంధంలో ఉంచుకున్నారా? కాల్చేశారా? ఎవ్వరికీ తెలియదు.

ఇదే ప్రాంతంలోని ముకడపల్లి గ్రామం మీద దాడి చేసి ఆడవాళ్లను నానా ఇబ్బందులు పెట్టారు. వాళ్ల డబ్బులు కాజేశారు. దీంతో ఈ గ్రామాల ప్రజల రోజువారీ జీవితం డిస్టర్బ్ అయింది. చుట్టూ పోలీసులు, ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. తిండి సంపాదించుకోలేకపోతున్నారు.

నిజానికి కరోనా తీవ్రమయ్యాక ప్రజలను వైరస్ విషయంలో అప్రమత్తం చేయడం మీద, ప్రజలకు అవసరమైన సహాయక చర్యల మీద తమ పార్టీ కేంద్రీకరించిందని మావోయిస్టు నాయకుడు కైలాసం ఆ ప్రకటనలో అన్నాడు. ఈ పనులు చేయడానికి వీల్లేకుండా ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతమంతా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని చెప్పాడు.

అందుకే వైరస్ విస్తరిస్తున్న సమయాన పోలీసుల మీద, పారా మిలటరీ బలగాల మీద తాము దాడులు ఆపేస్తున్నామని, ప్రభుత్వం కూడా దీనికి సిద్ధం కావాలని మావోయిస్టు పార్టీ మల్క గిరి, కోరాపుట్, విశాఖ కమిటీ నుంచి ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. ప్రభుత్వం దీన్ని అంగీకరించకుండా దాడులు చేస్తే ఆత్మరక్షణ కోసం ప్రతిఘటిస్తామని చెబుతూనే, దీని మీద ఐదు రోజుల్లో ప్రభుత్వం తన వైఖరి తెలపాలని అన్నాడు.

ఇప్పటికీ ప్రభుత్వం దీని మీద ఏమీ మాట్లాడలేదు. బహుశా మాట్లాడకపోవచ్చు. సహజంగానే పోలీసు అధికారులు వెంటనే స్పందించారు. మావోయిస్టులు బలహీనపడినందు వల్ల ఈ ఎత్తుగడ వేశారని పోలీసు అధికారులు విశాఖపట్నంలో అన్నట్లు పత్రికల్లో వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏమీ కాదు. విప్లవోద్యమాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేని గడసరి మేధావులు కూడా ఈ ప్రకటనను ఇలాగే అర్థం చేసుకోవచ్చు.

అయితే విప్లవకారులు ఇలాంటి సంక్షోభ సమయంలో ఎలా ఆలోచిస్తారు? ఎలాంటి వైఖరి తీసుకుంటారనేదే ఈ ప్రకటనలో అతి ముఖ్యమైన విషయం .

పెట్టుబడి ప్రకృతిని విధ్వంసం చేసే విధానాల నుంచే కరోనాలాంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్లు పుట్టుకొస్తాయనే మౌలిక విషయాన్ని ఆ ప్రకటనలో మావోయిస్టు పార్టీ చెప్పింది. దీని వల్ల ప్రపంచ మానవాళి సంక్షోభంలో పడిపోయింది. ఇది లోతైన సమస్య. ఇలాంటప్పుడు సమస్యను రాజకీయార్థికదృష్టితో విశ్లేషిస్తూనే మరణాలు ఇంతగా పెరిగిపోయిన సమయంలో మానవీయంగా ఆలోచించాలి. విప్లవకారులే మావనీయతను దాని నిజమైన అర్థంలో అత్యున్నతంగా చూడగలరు. కరోనా బారినపడి చనిపోయేది ప్రజలే కాదు, రాజ్యం తరపున దాడులు చేయడానికి వస్తున్న పోలీసులకు, సైనికులకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది.

దేనికంటే దాడులకు వందల సంఖ్యలో వస్తారు. క్యాంపుల్లో రోజుల తరబడి మకాం వేసి మాటుకాస్తారు. కాబట్టి వాళ్లలో వాళ్లకు వైరస్ సోకవచ్చు. ఇంత మంది మకాం వేసినందు వల్ల, దాడులకు పాల్పడుతున్నందు వల్ల వాళ్ల వల్ల చుట్టు పక్కల ఉండే అటవీ గ్రామాల్లోని ప్రజలకూ వైరస్ సోకవచ్చు. వాళ్లు అక్కడి నుంచి తిరిగి వెళ్లాక ఇంకెంత మందికైనా అంటుకోవచ్చు. ఆ మధ్య దండకారణ్యంలో కూంబింగ్ వెళ్లిన పారా మిలటరీ వాళ్ల వల్ల స్థానికులకు కరోనా అనుమానాస్పద లక్షణాలు కనిపించాయని ప్రచారమైంది.

వీటన్నిటి దృష్ట్యా మావోయిస్టు పార్టీ తానుగా దాడులు చేయబోనని, తమ ఉద్యమ ప్రాంతంలో కరోనా విస్తరించకుండా చర్యలు చేపట్టడం, ఇలాంటి విషయాల్లో ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పించడమే ఇప్పుడు తమ ప్రధాన కర్తవ్యమని చెప్పింది. రాజకీయాలకు అతీతంగా తనకు సహకరించాలని కోరుకొనే ప్రభుత్వాలు రాజకీయ ఉద్దేశంతోనే ఒక పక్క విప్లవకారుల మీద దాడులకు పాల్పడుతోంది. ఆ వైపు నుంచి ఒక ప్రతిపాదన వస్తే దాన్ని మానవతా దృష్టితో చూడకుండా తన కుటిల రాజకీయ విశ్లేషణను పోలీసులతో ఇప్పిస్తోంది.

కరోనా తీవ్రమయ్యాక కూడా మావోయిస్టులపై దాడులు కేవలం ఏవోబీలోనే లేదు. దేశమంతా జరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి తీవ్రమయ్యాక కూడా ప్రభుత్వం దాడుల నుంచి వెనక్కి తగ్గలేదు. మార్చి 23న బస్తర్ లో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. సుమారు 800 మంది పారీ మిలటరీ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. పోలీసులు తామే ఆ ప్రాంతానికి దాడికి వెళ్లామని ఒప్పుకున్నారు. కాబట్టి మావోయిస్టులు ఎదురు దాడిలో 17 మంది జవాన్లు మరణించారు. మావోయిస్టులు కూడా ముగ్గురు చనిపోయారని పత్రికలు రాశాయి. ఇది ఆపరేషన్ ప్రహార్.

లాక్ డౌన్ వల్ల అన్ని వ్యవస్థలు దెబ్బతినిపోయాయని అనుకునేవాళ్లు ఈ విషయాలు గమనించాలి. నిజానికి కరోనా లాంటి విపత్తును నిలువరించగల వైద్య, పారిశుధ్య వ్యవస్థలు మన పాలకుల దగ్గర లేనేలేవు. వైద్య రంగాన్ని దశాబ్దాల కిందే కార్పొరేట్లకు అమ్మేసుకున్నారు. మాస్కులు కూడా అందించలేని స్థితికి ప్రజా వైద్యరంగం వెళ్లిపోయింది. పారిశుధ్య కార్మికులకు కనీస సదుపాయాలు ఎప్పుడూ ప్రభుత్వం కల్పించలేదు. అసలు ఆ పనులు చేసే వాళ్లను ప్రభుత్వాలు మనుషులుగానే భావించవు. ప్రజల ప్రాణాలను కాపాడటమే మా పరమ లక్ష్యమని కోతలు కోయడమేకాని ఇప్పటికిప్పుడు ఏదో చేయాలనే ఉద్దేశం, శక్తి ప్రభుత్వాలకు లేవు.

లాక్ డౌన్ వల్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనే ప్రభుత్వ యంత్రాంగం కుదేలైపోయింది. రైతులు నష్టానికైనా సరే పంటలు అమ్ముకోడానికి దారి మూసుకపోయింది. మొత్తం మీద సాధారణ సాధారణ ప్రజా జీవితమంతా అల్లకల్లోలమైపోయింది. ఇవన్నీ చూసేవాళ్లకు వ్యవస్థలన్నీ దెబ్బతినిపోయాయని అనిపించవచ్చు. పైకి ఇలా అనిపించడం సహజమే.

వ్యవస్థలంటే ఏమిటో మన అవగాహనలోనే లోపం ఉంది. కరోనా వైరస్ వల్ల ఏ మార్పులైనా జరగవచ్చు. ఏవైనా దెబ్బతినిపోవచ్చు. కానీ రాజ్య వ్యవస్థ చెక్కుచెదరదు. దాని విధానాలు మారవు. వాటి పనితీరులో ఇసుమంత తేడా రాదు. దాని దుర్మార్గం చెక్కు చెదరదు. నిజానికి ఈ విపత్తును అడ్డం పెట్టుకొని రాజ్య యంత్రాంగం మరింత బలపడుతోంది. విస్తరిస్తోంది. ప్రజలు ఇండ్లకే పరిమితమైపోయారు. ప్రజా ఆచరణ శూన్యమైపోయింది. కరోనా సోకకుండా చేతులు కడుక్కుంటూ ఇంట్లో ఉండటం తప్ప మరేమీ చేయలని ఒక ప్రత్యేక పరిస్థితి. దాదాపుగా సామాజిక జీవితం ఏమీ లేని ఎమర్జెన్సీ ఇది. రాజ్యంత తప్ప మరేమీ లేని దుస్థితి ఇది. కరోనా విస్తరణను నియంత్రిస్తుందో లేదోగాని రాజ్యం మాత్రం సమాజమంతా విస్తరించింది. కరోనా బెడద తీరాక రాజ్యం యథా స్థానం చేరుకుంటుందా? అనుమానమే. దేనికంటే కరోనాలాంటి వాటిని వాడుకొని బలపడటటానికి ఆధిపత్య శక్తులు, వాటి తరపున రాజ్యం సిద్ధంగా ఉంటుందని ఈ నెల రోజుల్లోనే అర్థమైంది. నిజానికి రాజ్యం ఇంతగా విస్తరించింది కరోనా నియంత్రణకు అనుకుంటే పొరబాటే. కలిసి వచ్చింది కాబట్టి సమాజం మీద పై చేయి సాధించడానికి అన్ని రకాలుగా ఈ సందర్భాన్ని వాడుకుంటున్నది. ఇలా ఈ పరిస్థితిని ఎన్ని కోణాల్లో అయినా విశ్లేషించవచ్చు. ఇప్పుడు ఈ వివరాల్లోకి వెళ్లలేంగాని, కరోనా విస్తరిస్తున్న సమయాన కూడా మావోయిస్టుల ప్రాంతాలపై రాజ్యం దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి పైన చెప్పిన బస్తర్ ఘటనకంటే ఉదాహరణ ఏం కావాలి?

ఆపరేషన్ కరోనా అని మీడియా వ్యవహరిస్తోంది. ప్రజా జీవితానికి అత్యవసరమైన ఈ ఆపరేషన్ ఎంత సొక్కంగ జరుగుతున్నదో చూస్తున్నాం. ఈ ఆపరేషన్ ఉందని రాజ్యం ఆపరేషన్ ప్రహార ను వదిలిపెడుతుందా? 2020 మొదలైన ఈ మూడు నెలల్లో, కరోనా దాడి తీవ్రమయ్యాకనే కొత్తగా బస్తర్ లో ఆపరేషన్ ప్రహార్ లో భాగంగా క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు అరవై ఐదు వేలకు పైగా పోలీసు, సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. ఇదంతా ఒక్క బస్తర్ పరిధిలోనే. పైగా ఈ బలగాలను ఇంకి పెంచుతామని బస్తర్ పోలీసు అధికారి సుందర్ రాజు ఈ మధ్యే ప్రకటించాడు.

ఇక గడ్చిరోలిలో అయితే లాక్ డౌన్ తర్వాత సి-60 బలగాల కూంబింగ్ తీవ్రంగా జరుగుతున్నది. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది దాడులు చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే జార్ఖండ్ లో ఏప్రిల్ 4న ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు మరణించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా తిర్యానీ అడవుల్లో, ఖమ్మం సరిహద్దు అడవుల్లో ఆపరేషన్ ప్రహార్ నడుస్తూనే ఉంది.

ఇట్లాంటి పనులను పోలీసు, సైనిక విభాగాల నుంచి మాత్రమే రాజ్య వ్యవస్థ నడుపుతుందనుకుంటే పొరబాటు.

న్యాయస్థానాలు కూడా యథావిధిగా తన అన్యాయ ప్రక్రియలను లాక్ డౌన్లో కొనసాగిస్తూనే ఉంటుంది. దీనికి కూడా రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

కరోనా బారి నుంచి ప్రజలందరినీ కాపాడుతామని అంటున్నారు కదా, పనిలో పనిగా జైళ్లలో ఉండే సాధారణ ఖైదీలను, రాజకీయ ఖైదీలను కూడా కాపాడండి.. వాళ్లూ మీ ప్రజల్లో భాగమే, ఈ దేశ పౌరులే అంటే దాన్ని మాత్రం పట్టించుకోలేదు.

భీమాకోరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లలో సగానికి పైగా వయో వృద్ధులు. ఈ సందర్భంలో వీళ్లు జెయిళ్లలో ఉంటే ప్రమాదమని వరవరరావు తరపున వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పైగా బెయిలు ఇవ్వడానికి ప్రత్యేక కారణాలు లేవని తేల్చేసింది.

కోవిడ్ 19 వైరస్ సందర్భంగా జైళ్ళలోని రద్దీని తగ్గించడానికి ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేయడానికి తగిన చర్యలు తీసుకోమని సుప్రీం కోర్టు మార్చి 23న ఒక తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఏర్పడిన ఒక కమిటీ ఊపాలాంటి చట్టాల కింద అరెస్టయిన వారు దీని పరిధిలోకి రారని మార్చి 25న నిర్ణయించింది. లా డౌన్లో కూడా రాజకీయ ప్రత్యర్థుల విషయంలో న్యాయస్థానం, దాని న్యాయ ప్రక్రియలు కూడా ఏ మాత్రం మారవు. వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడతాననే మాట పైకి ఉదార్త మానవీయʹ భావనగా కనిపిస్తుంది. ఇంకో పక్క లాక్ డౌన్ వల్ల న్యాయస్థానాల్లో కూడా పనులు జరగం లేదనే ఇంప్రెషన్ బైటికి కలిగేలా ప్రవర్తిస్తుంది. కానీ వాస్తవానికి తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మరింత అమానవీయంగా, కటువుగా ఉంటుంది.

అదే విప్లవకారులు ఎలా ఉంటారో చూడండి. ఏవోబీ నుంచి వచ్చిన దాడుల విరమణ ప్రకటన కేవలం ప్రజల కోసమే కాదు. పోలీసులను, సైనికులను, వాళ్ల కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వాళ్లను పరిగణలోకి తీసుకొని అసలైన మానవతావాద వైఖరిని ప్రతిబింబిస్తోంది.

రాజ్య వ్యవస్థ పని తీరు మాత్రం మారదు. న్యాయాన్యాయ విచక్షణ దానికి ఎన్నటికీ సాధ్యం కాదు. మానవతావాద వైఖరి వంటపట్టేది కాదు. ఈ సుగుణాలు తనకు లేవని న్యాయస్థానాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికైతే ఖైదీల సోయి ఉన్నట్లు కూడా లేదు. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి గంటలకొద్ది మానవత్వం, సంఘటితం, ప్రజల ప్రాణం విలువ గురించి లెర్చర్లిచ్చే కేసీఆర్ ఇప్పటికీ ఖైదీల గురించి ఒక్క మాట కూడా అనలేదు. ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లలో ఉన్నారు కాబట్టి వాళ్లు మనుషులే కాదని ఆయన వైఖరి. వాళ్లు కరోనాతో పోయినా ఫర్వాలేదని తన మౌనంతో ఆయన చెప్పదల్చుకున్నాడు.

తాను శిక్షలు వేసి, రిమాండ్ కు పంపిన ఖైదీలు జైళ్లలో ఉన్నారు కదా.. వాళ్లేమవుతారని న్యాయస్థానానికి కూడా గుర్తు రాలేదు. వ్యవస్థ తన లాజిక్ ప్రకారమే పని చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ.

కాబట్టి ఏవోబీ నుంచి మావోయిస్టులు చేసిన ప్రతిపాదనను అటు ఒడిషా ప్రభుత్వమైనా, ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా? పేర్లే తేడాగాని ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, కేంద్ర ప్రభుత్వానికైనా ఇలాంటి విజ్ఞాపనలను అందుకోగల మానవతావాద వైఖరి ఎందుకు ఉంటుంది? విజ్ఞత ఎందుకు ఉంటుంది? కాకపోతే ఆ దిశగా ప్రభుత్వాలు అలోచించాలని ప్రజాస్వామిక వాదులు చెప్పగలరు. అంతే.

No. of visitors : 956
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •