ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం

| సంపాద‌కీయం

ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం

- అరుణ్ | 15.04.2020 08:57:19pm

ʹDeath is a mighty Levelerʹ -Shakespeare.

చావు సమవర్తి. అవును, కాదనలేని వాస్తవమే. రాజూ పేదా, నవాబూ గరీబు, మంత్రులూ బంట్రోతులూ ఎవరయినా సరే, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా. సహజ మరణాల గురించి మాట్లాడడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు -కరువుకాటకాలు, వరదలూ, రోగాలూ రోస్టుల విషయంలో కూడా కొంతమేరకు, కేవలం కొంతమేరకే అది వాస్తవం. వాటి మరణాలవల్ల సంభవించే పరిణామాలు మాత్రం భిన్నంగా వుంటాయి. వాటిలో వర్గ స్వభావం కొట్టవచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఒక కోటీశ్వరుడు మరణిస్తే, అతని కుటుంబానికి జరిగే నష్టం, ఒక పేద కూలి మరణిస్తే అతని కుటుంబ పరిస్థితి విభిన్నంగా వుంటుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువుగా నష్టపోయేది పేదలే. మనదేశంలోనయితే నిమ్నకులాలుగా వివక్షతకు గురవుతున్నవారే. ఇక వారిలో ఎక్కువ బాధితులు మహిళలేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది కాదనలేని సత్యం. ఇప్పుడయితే మతవిద్వేషానికి గురవుతున్న ముస్లింలను కూడా ఆ బాధితుల జాబితాలో చేర్చాలి.

అసలు ప్రకృతి వైపరీత్యాలకు కారణం పెట్టుబడి దురాశే. మానవుడు ప్రకృతితో సహజీవనం చేస్తూ సఖ్యతతో దానిని తన జీవన సౌకర్యాలకు వినియోగించుకోవాలి. కాని నేడు అడవులను కొల్లగొడుతూ, నదులను కలుషితం చేస్తూ, ఏమాత్రం నిబంధనలను పాటించకుండా కర్మాగారాల ద్వారా గాలినీ కలుషితంచేస్తూ ప్రకృతిని విధ్వంసానికి గురిచేస్తున్న, దేశీయ, విదేశీయ కార్పొరేట్లు వాటికి గులాములై వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలు నేటి చాలా వ్యాధులకు, కరువుకాటకాలకు, వరదలకు కారణమని చెప్పవచ్చు. వారి ధనదాహానికి బలవుతున్నది సామాన్యమానవులే. సంప్రదాయ ఆయుధాలతో సరిపుచ్చక, మొత్తం ప్రపంచాన్ని శాసించేందుకు, నేడు సామ్రాజ్యవాద దేశాలు జన్యు పరమైన మారణాయుధాలను (Bio-War)తయారు చేస్తున్నాయి. దాని ఫలితమే నేటి కొవిడ్ వైరస్ అని నోమ్ చాంస్కీ, చౌడవిస్కి (Noamchomsky,Michael Chossudovsky) లాంటి చాలామంది ప్రపంచ ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. (అదొక పెద్ద వ్యాసం అవుతుంది)

Everybody Loves A Good Drought లో P. Sainath చెప్పినట్టు కరువు, క్షామం ప్రకృతి వైపరీత్యాలు అన్నీ వున్నవారికి లబ్ది చేకూర్చేవే, లేనివారిని కడతేర్చేవే ననేది సామాజిక అనుభవమే. కరువు వస్తే పేదప్రజలు ఆహారంకోసం అల్లల్లాడుతారు. నల్లబజారు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి లబ్దిపొందుతారు. వీరివెనుక రాజకీయనాయకులుంటారు. ఆహారం పంచుతూ వోట్లవేటలో పడతారు. వేసవిలో ప్రజలు తాగడానికి నీళ్ళు లేక సతమతమవుతుంటే టాంక్ లలో నీళ్ళందించి తమ ఔదార్యాన్ని చాటుకుంటారు గాని శాశ్వత పరిష్కారం మాత్రం చూపరు. ఇక వరదలొస్తే ఊళ్లకు ఊళ్లు, చేలకు చేలు మునిగిపోతాయి. గొడ్డూ గోదాము నష్టపోయి రైతాంగం నష్టపోతుంది. కొంత ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వాలు తమ చేతులు దులుపుకుంటాయి. ఈ వైపరీత్యాలను నిలువరించే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి లేవా? శాస్త్రవిజ్ఞానం అందుబాటులో లేదా? నిధులు లేవా? అంటే సమాధానం వున్నాయి అని చెప్పవచ్చు. ఒక్క యస్ బ్యాంక్ మన కార్పోరేట్ల బకాయీలు వసూలుజేస్తే ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూరుతాయి. ఆ కరువు కాటకాలకు, వరదలకూ కారణం వర్గ సమాజంలో మన ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మన ప్రభుత్వం అనుసరించే విధానాలెలా ఉంటాయంటే వైపరీత్యాలు సంభవించినపుడు చేసే హడావిడి ʹదప్పికయినపుడు బావి త్రవ్వినట్టుʹగా వుంటుంది. వాటికి కారణభూతులు వారే. వారి విధానాన్ని మనం కాళ్ళువిరగగొట్టి, చెక్క కాళ్ళు ఇచ్చేదిగా చెప్పవచ్చు. నదులను కలుషితం చేసేది వారే. ఆ తర్వతా చౌకగా మినరల్ వాటర్ ను అందిస్తామనేది వారే. ఒకవైపు పరిశ్రమలద్వారా గాలిని కలుషితంజేస్తూ మరోవైపు శ్వాసకోసవ్యాధులకు మందులు కనిపెడతారు. ఆస్పత్రుల కట్టించి ప్రజలను దోచుకుంటారు. ఇదీ మన పాలకుల వర్గ స్వభావం. వ్యవస్థ వర్గస్వభావాన్ని అర్థం జేసుకోకుండా ఇటువంటి వైపరీత్యాలు సంభవించినపుడు ఈ ప్రభుత్వం సరిగా చేయలేదనో, ఆ ప్రభుత్వం ప్రజలకు మేలు చేకూరుస్తుందనో విమర్శించడం, పొగడడం అమాయకత్వమే అవుతుంది.

పైన చెప్పినట్టుగా దేశంలో ఆరోగ్యవ్యవస్థను ప్రైవేటు రంగానికి అప్పగించి ప్రజల ఆరోగ్యాన్ని లాభనష్టాల జూదంగా మార్చి, ఇలాంటి సమయంలో ప్రజల్ని జాగ్రత్తగా వుండమని, వారి ఆరోగ్య బాధ్యతలను వారికే వదిలేస్తున్నాయి ప్రభుత్వాలు. ఏరోజూ ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు తగినంతమంది సిబ్బంది లేదు. పరికరాలు లేవు. మందులు అసలేవుండవు. ప్రజలకు మౌలికసదుపాయాలు లేవు. పౌష్టికాహారము శుభ్రమైన తాగు నీరు అందుబాటులోకి ఉండదు. ఇక పీల్చే గాలి సరేసరి. ఇవేమీ లేకుండా ప్రజలకు వ్యాధినిరోధక శక్తి ఎలా వుంటుంది. వారు, గాలి ద్వారా, నీటి ద్వారా సోకే వ్యాధులను ఎలా తట్టుకోగలరు? ముఖ్యంగా ఈ పోషకాహారలేమి వల్ల అత్యధికంగా భాధపడేది స్త్రీలు, పిల్లలే. ప్రపంచ ఆరోగ్య సూచికలో మన దేశ స్థానం 102 కావడంలో విడ్డూరం ఏముంది?

విద్యా, వైద్య రంగాలతో సహా దేశ ప్రజావ్యవస్థలన్నింటిని ప్రైవేట్ వ్యాపారులకు అప్పచేబుతూ, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వ్యవస్థ మనది. మనదేశంలో 38 వేల మందికి ఒక డాక్టర్, 64 వేలమందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వున్నాయి. 2019 జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ డేటా ప్రకారం మన దేశంలో వేయిమందికి అందుబాటులో వున్న ఆస్పత్రులలో లభ్యమయ్యే మంచాలు 0.55, అంటే 2 వేలమందిలో ఒకరికి మాత్రమే ఇన్ పేషంట్ గా చేరవచ్చు. దాదాపు 2 లక్షల వెంటిలేటర్లు అవసరంకాగా, అందుబాటులో వున్నది కేవలం 40 వేల వెంటిలేటర్లు మాత్రమె. ఒకవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ తగినన్ని వెంటిలేటర్లను, సర్జీకల్ మాస్క్ లను నిల్వవుంచుకోవాలని అన్ని దేశాలకు సలహానిస్తే మన కేంద్రప్రభుత్వం మార్చి 19 వరకు వాటి ఎగుమతులకు అనుమతినిచ్చింది. అంతే గాక ప్రాణాలొడ్డి రోగులకు సేవజేస్తున్న వైద్య సిబ్బంది తమకు తగినన్ని మాస్కులు, వ్యక్తిగత రక్షణ దుస్తులు(PPE) లేవని తెల్పితే, వారికవి సమకూర్చక పోగా వారిని సస్పెండ్ చేయడం ప్రభుత్వాలు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడమే కదా. ఇక కరోనా పరీక్షలు జరుపుతున్నది సగటున 10 లక్షలకు కేవలం 7 మందికి మాత్రమే. వారానికి 500మందిని మాత్రమె పరీక్ష చేయగల సామర్థ్యం మనకుంది. అదే ఇటలీలో 52 వేలు, దక్షిణ కొరియాలో 26 వేలమందికి పరీక్షలు జరపగలరు. అందుకేనేమూ అక్కడ ఎక్కువ కేసులు బయటపడ్డాయి. ఇంత విశాలదేశం లో 135కోట్ల జనాభాలో అంత తక్కువ సంఖ్యలో పరీక్షల జరపడం వల్ల కరోనా కేసుల వాస్తవ సంఖ్య మనకు తెలిసే అవకాశం లేదు. పలితంగా ఆ వైరస్ బారినపడ్డ అశేష పేద ప్రజల, ముఖ్యంగా వలస కార్మికుల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకునే అవకాశం శూన్యం. ఏమైనా వారు నోరున్న మధ్యతరగతి వారూ కాదు, డబ్బున్న మారాజులూ కాదుకదా. వారిలో 99% దళితులూ, బహుజనులే. ఉన్న వైద్య సదుపాయాలు పట్టణ ప్రాంత వాసులకు, నోరున్న వారికే లభిస్తాయనడంలో సందేహం లేదు. ఒక అంచనా ప్రకారం మే 15 నాటికి దేశంలో కరోనా కేసులు 2.2 మిలియన్లదాకా ఉండవచ్చు. కాని ప్రభుత్వ ఆస్పత్రులలో ఒక లక్షమందికి 3.63 Intensive Care Unit beds మాత్రమే వున్నాయి. అవీ పట్టణాలకే పరిమితం. ఇక ఆరోగ్య రంగంపై ప్రభుత్వ ఖర్చు మన స్థూల జాతీయాదాయంలో కేవలం 1% మాత్రమే. దీని పరిణామాలు ఇబ్బందికరంగా తయారయ్యేది పేదలకే, ముఖ్యంగా వలస కార్మికులకే.

ప్రభుత్వం అధార్ కార్డ్ వున్న ప్రతికుటుంబానికి వంట సామాగ్రి అందజేస్తానని చెబుతున్నా, అవి అర్హులందరికీ అందడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇందులోనూ రాజకీయ ఆశ్రిత పక్షపాతం కనపడుతూనే వుంది. ఇక దేశం మొత్తం పైనా ఆధార కార్డులు లేనివారు కోట్లాదిమంది వుంటారు. కార్మిక సంఘాల ప్రకారం దేశంలో భవన నిర్మాణ కార్మికుల సంఖ్య 6 కోట్లు కాగా, ప్రభుత్వ వెబ్ సైట్ ప్రకారం 5.1 కోట్లు మాత్రమే. అందులోనూ రిజిస్టర్ చేసుకున్న వారు కేవలం 3.2 కోట్లేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 3 కోట్ల భావన నిర్మాణ కార్మికులకు ఆధార్ కార్డులు వుండవు. ఈ విషయంలో నాకు వ్యక్తిగత అనుభవం కూడా వుంది. మా ఊర్లో వున్న దాదాపు వందమంది భవన నిర్మాణ కార్మికులను నమోదుచేయించి వారికి ప్రభుత్వ రాయితీలను అందుబాటులోకి తేవాలని, ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తులనిచ్చి భర్తీ చేయమని కోరాను. 15 రోజుల తర్వాత వారినుండి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు సంబంధిత అధికారినుండి నేను తీసుకున్న ధరఖాస్తులకు లెక్క చెప్పమని వత్తిడి వచ్చింది. రిజిస్త్రేషన రుసుం రూ.10/ కూడా నేనే చెల్లిస్తానని చెప్పాను కూడా. కాని ఫలితం లేకపోయేసరికి ఆ ఖాళీ ధరఖాస్తులను అధికారికి వాపసు ఇవ్వాల్సివచ్చింది. ఇక వలస కార్మికుల విషయానికొస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 13.9 కోట్ల మంది అంటే మొత్తం కార్మికులలో మూడవ వంతుకు పైగా వలస కార్మికులే. 2017 ఆర్థిక సర్వే ప్రకారం అందులో 90 లక్షలమంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారే. వారి పరిస్థితి ఏమిటి? వీరంతా ఏ కులాలకు, ఏ వర్గానికి చెందిన వారో చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ కరోన వైరస్ వ్యాప్తి, దానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముఖ్యంగా లాక్ డౌన్ లాంటి చర్యలన్నీ, ప్రభుత్వం తమ పాలనావైఫల్యాలను మననుండి దాచే ప్రయత్నంలో భాగమే. ʹఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ఈ వ్యవస్థ డొల్లతనం అందరికీ స్పష్టమవుతుంది. ప్రభుత్వం, మధ్యతరగతి బుద్ధిజీవులూ, సినీనటులూ, రాజకీయనాయకులూ టి వి యాంకర్లు చివరకు నిత్యం ప్రజల్ని మూఢవిశ్వాసాలకు బలిచేస్తున్న స్వామీజీలు అమ్మలూ చెప్పే జాగ్రత్తలు ఎంతమంది పాటించగలరు? వీరు చెప్పే చేతులూ, మూతులూ శుబ్రం చేసుకోవడం అదీ సబ్బులతో, శానిటైజర్లతో, మాస్కులు ధరించడం ఎంతమందికి సాధ్యం. వేసవిలో తాగునీరు లభించని గ్రామాలు వేలకు వేలు వున్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతంలో బిందెడు నీటికి గంటలకొద్దీ చేంతాడంత వరుసలో నిలుస్తున్న ప్రజలు నిత్యమూ దినపత్రికల్లో కనపడుతూనే వున్నారు. ఇక పాకీ పనివారలు, వీధులు శుబ్రం చేసే వారు, ఆదివాసీలకు ఎన్ని సబ్బులు లభ్యమవుతాయి? ఎన్ని శానిటైజర్లు కావాలి? బొంబాయిలోని దారవి మురికివాడలో వున్న లక్షలాది పేదలకు లభించే ముందు జాగ్రత్త వసతులేమిటి? ఇరుకిరుకు కొట్టాల్లో నివశించేవారికి ప్రభుత్వ సూచన మేరకు భౌతిక దూరం పాటించడం సాద్యమా? వారిద్వారా వైరస్ వ్యాప్తిచెందితే ఎవరిని నిందించాలి? వారినా? అలాంటి దుస్థితి కల్పించిన ఈ దుర్మాగపు వ్యవస్థనా?

ఇక లాక్ డౌన్ సమయంలో చిన్న వ్యాపారస్తులు, చాకలి, మంగలి లాంటి అనేక వృత్తి పనివారలు, రైల్వే బస్ స్టాండ్ లలో టీ, కాఫీ అమ్ముకునేవారు, కూలీలు, భిక్షకులు, గృహ నిర్మాణ రంగంలో వున్న లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక పట్టణాల్లో సైకిల్, స్కూటర్ మెకానిక్కులు, ఎలక్ట్రీషియన్లు, దర్జీలు, పూలు, పండ్లు ఇంటింటికి వెళ్ళి అమ్ముకునేవారు వీరిలో అందరూ పేదలే. అధికంగా కింది కులాలుగా పరిగణింపబడుతున్నవారే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదోది జిల్లా జహంగీరబాద్ గ్రామంలో రోజు కూలి అయిన ఒక మహిళ 5 రోజులుగా తిండి దొరకక అయిదుగురి పిల్లలతో గంగా నదిలో దూకింది. వ్యవసాయరంగం అతలాకుతలమైతే, ఆ రంగంలో పనిజేసే కూలీలలో దాదాపు 90% మహిళలే కాబట్టి ఏ సంక్షోభామైనా ప్రభావం చూపేది మహిళలపైనే. ఇక రైతులు నేడు అకాల వర్షంతోనే గాక, చేతికి వచ్చిన పంట రవాణా సౌకర్యం లేకపోవడంతో రోడ్లపాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యానవనపంటలు, బత్తాయి, అరటి, పూలు, మామిడి పండించిన రైతులు, టమోటా, ఉల్లి రైతులు పంటలు అమ్ముకోలేక నిల్వ వుంచుకోలేక దిగాలు పడుతున్నారు. వీరంతా చిన్న, సన్న కారు రైతులే. ఇక లాక్ డౌన్ అనంతరం ఏర్పడే ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగం, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల మూతతో చిరుద్యోగులు, దిన కూలీలపైన విపరీతంగా వుంటుంది. ఇప్పటికే డిమానిటైజేషన్ వల్ల లక్ష ఉద్యోగాలు పోయాయి. వేల పరిశ్రమలు మూత పడ్డాయి. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ఇప్పటికే అపారనస్టాలకు గురైన చిన్న, గృహ పరిశ్రమలు, తోళ్ళ, చెప్పుల పరిశ్రమలలాంటివి లాక్ డౌన్ తో మరింత కుదేలయ్యాయి. తర్వాత కూడా అవి కోలుకొనే పరిస్థితిలేదు.

ముస్లింలపై విద్వేషాన్నిగక్కడానికి, ఇప్పటికే వ్యాపించిన హిందూత్వ వైరస్ వ్యాప్తికి మన సంఘ్ పరివార్ కు దేశ సంక్షోభ సమయం కూడా వుపయోగాపడుతూంది. డిల్లీలోని తబ్లీగ్ జమాత్ మత సమావేశానికి హాజరయిన ముస్లింల వల్లే దేశంలో కరోనా వ్యాపించిందని అటుభక్తులూ, ఇటు మోడీ విధేయులైన మీడియా బహుళ ప్రచారం చేస్తున్నాయి. అదేదో ముస్లింలు దేశంలోని హిందువులనంతా బలిచేయడానికి ఒక వ్యూహం ప్రకారం మరణానికి సిద్దమయి కరోనాను అంటించుకొని దేశమంతా వ్యాప్తి చేసే ప్రణాలికను సిద్దం చేసారని నిత్యం సోషల్ మీడియాలో, టివి లలో విషం గక్కుతున్నారు. తాము ఆ సమావేశానికి అధికారులవద్ద అనుమతి తీసుకున్నామని, ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో విదేశాలనుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు, వారి వారి స్వగృహాలకు చేరే వీలులేకపోయిందని ముస్లిం మత పెద్దలు వివరణ యిచ్చినా మన మీడియా చెవికెక్కడంలేదు. చెవిటివానికి చికిత్స ద్వారా వినికిడి తెప్పించవచ్చుగాని, వినగలిగే శక్తి వుండి వినదలచుకోని వారికి ఏమి చికిత్స వుంది? చివరకు తాను దళితుడనని చెప్పుకుంటున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముస్లింల గురించి దుర్మార్గంగా మాట్లాడం, నిరసనల తర్వాత తన ఉద్దేశం ముస్లింలను కించపరచడం కాదని ప్రకటించడం అతని అహంకారానికి ప్రతీక. ఇక విదేశాల నుండి డిల్లీకి వచ్చిన వారికి విమానాశ్రయంలో ఎందుకు వైరస్ పరీక్షలు జరపలేదు అనే ప్రశ్నకు బదులు లేదు. అదే సమయంలో డిల్లీలోని మజ్నూ కా తిల్ల గురుద్వార్ లో 200 మంది సిక్కులు గుమికూడిన మాటేమిటి? ఒక సిక్కు మత గురువు విదేశాలనుండి తిరిగివచ్చి పంజాబ్ లో 20 గ్రామాలలో తిరిగి మతబోధనలు చేసాడు. మరి అతన్ని కరోనా వైరస్ పరీక్షలు చేసారా? జమ్మూ లోని వైష్ణో దేవి దర్శనంకై గుమికూడిన 400 మంది హిందూ యాత్రుకుల మాటేమిటి? ఆ తర్వాత గుజరాత్ లో ట్రంప్ ను మెప్పించడానికి లక్షలాదిమందిని పోగుచేసిన విషయం అందరికీ తెలిసిందే. మార్చి 15 వరకు తిరుపతిలో రోజూ వేలమంది యాత్రికులు దైవ దర్శనం చేసుకున్నారు కదా. ఏడుకొండలవాడు వారిని కొవిడ్ నుండి రక్షిస్తాడని ఈ సంఘ్ పరివార్, దాని మోచేతి నీళ్ళు తాగుతున్న మీడియా అనుకుంటుందా? మరి వీరందరికీ పరీక్షలు జరిపారా? వారిలో ఎవ్వరూ కోవిడ్ భాదితులు లేరని ఏ ప్రాతిపదికపైన చెప్పగలం? అసలు మనకేసుల పరీక్షా నిర్వహణే అసంతృప్తిగా వుందని కంటికి కనపడని, తెలియని కేసులు ఎన్నో ఉంటాయని చాలామంది డాక్టరు చెబుతున్నారు కదా! ముస్లింలపై ద్వేషాన్ని మరింత రెచ్చగొట్టి దాన్ని తన హిందూ వోట్ల బాంక్ గా మార్చుకొనే సంఘ్ పరివార్ కుట్రను అందరం బహిర్గతం చేయాలి.

చివరిగా మన దేశంలో కరోనా వైరస్ కన్నా భయంకరమైన ప్రమ్మదకరమైన వైరస్ వ్యాపించి వుంది. అది తరతరాలుగా మనలో జీర్ణించుక పోయింది. అదే కుల, మత వైరస్. ఈ రెండింటినీ మనం అనుదినం మనలో, మన చుట్టూ చూస్తూనే వున్నాం. అది మనల్ని భౌతికంగా చంపదు. మనలోని మానవత్వాన్ని చంపుతుంది. దానికి రెండు ఉదాహరణలను చెబుతాను. ʹవైద్యో నారాయణో హరిʹ అని గొప్పగా చెప్పుకుంటాం. మరి ప్రాణం పోయాల్సిన వైద్యుడు హిందూత్వ వైరస్ సోకి- రాజస్థాన్ లో నిండు గర్భిణి అయిన ఒక ముస్లిం మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరిస్తూ పసిపాప మరణానికి కారణమయ్యాడు. ఇక కుల వైరస్ అంటుకున్న వాళ్ళ ప్రవర్తన చూద్దాం. ఉత్తరప్రదేశ్ లో ఒక పాఠశాలను క్వారంటైన్ గా మార్చి 5 మంది కొవిడ్ భాదితులను అందులో ఉంచారు. అందులో ఇద్దరు అక్కడ పెడుతున్న భోజనం తినక రోజూ తమ ఇండ్లకు వెళ్లి తిని వస్తున్నారు. దీనికి అధికారుల సమ్మతి వుంది. అక్కడ మధ్యాహ్న భోజనం వండే సిబ్బంది వైరస్ భయంతో విధులకు రాకపోవడంతో, కొవిడ్ కు బయపడకుండా దయార్ధ హృదయంతో వారికి వండి పెడుతున్నది ఆవూరి సర్పంచ్. ఆమహిళ ఒక దళిత స్త్రీ. తమకు తాకిన కరోనా వైరస్ ఇంట్లోవారికి అంటుకుంటుందనే భయం లేని వారు, కులవైరాస్ అనే మానసిక జాడ్యంతో నిబంధనలనూ ఖాతరు చేయక, ఆ ఇద్దరు అగ్రకులాల వారు ఇంటివారిని, పోరుగువారిని మహమ్మారికి గురిచేయడానికి సిద్ధపడ్డారు. మరి ఏది మానవాళికి ఎక్కువ ప్రమాదకరం? ఏది ఎక్కువ కాలం అంటుకొని వుంటుంది? కుల వైరసా? కోవిడ్ వైరసా?

దేశంలో కులం-వర్గంతో పాటు మతతత్వంపై పోరాటం చేయకపోతే అవి వర్గపోరాటంలో భాగం గాకపొతే ఈ వైరస్ లు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే వుంటాయి, వేటాడుతూనే వుంటాయి. పీడితులందరూ చైతన్యంతో వర్గపోరాటంలో భాగస్వామ్యం అయినప్పుడు అన్నిరకాల వైరస్ లను వాటి మూలాలతో నాశనం చేయగలం.

ఇండియాలో కరోనా వైరస్ నివారణ చర్యలు తప్పనిసరిగా సామాజిక అసమానతలు సంధిస్తున్న ప్రశ్నలను అడ్రెస్ చేయాల్సి ఉంది అంటారు చత్తీస్ఘడ్ బిలాస్పూర్ లో పనిచేస్తున్న అనూప్ అగర్వాల్, యోగేష్ జైన్ అనే వైద్యులు. ʹవైరస్, బాక్టీరియాలు వివక్షత చూపవు. సమాజం చూపుతుంది. సమాజపు కులతత్వం, వర్గతత్త్వం, మతతత్వం, కులీనత, పితృస్వామ్యం లాంటి వ్యవస్థీకృత అణచివేత శక్తులు కొన్ని సమూహాలను నిస్సహాయులను చేస్తాయి. హెచ్ ఐ వి (HIV) సామాజికంగా అట్టడుగు వర్గాలను, మాదకద్రవ్యాలను వినియోగించే వారిని, పడుపువృత్తి చేసేవారిని, హోమో సేక్సువల్స్ ను అతిగా బాధపెడుతుంది. అదే విధంగా మలేరియా సమాజానికి దూరంగా వున్న ఆదివాసులను, అడవుల్లో వున్నవారినీ, క్షయవ్యాధి ఆర్థికంగా వెనుకబడినవారిని బాధిస్తాయి. కొవిడ్-19 వ్యాప్తికి పై వాటికి తేడా లేదు.ʹ

No. of visitors : 493
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

అరుణ్ | 16.08.2019 07:43:10pm

కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని .....
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి

దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

అరుణ్ | 17.11.2019 11:14:53am

ఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా?గతం లో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ.వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మం గా వుండే...
...ఇంకా చదవండి

నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు

అరుణ్ | 04.02.2020 05:38:00pm

, అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేవలం పాలనా వికేంద్రీకరణ అంటూ కార్యాలయాలనన్నటినీ ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల జరగేదేమీ ఉండదు. అది పాలనా......
...ఇంకా చదవండి

నేరమే అధికారమైన వేళ

అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు బాంబులను పంచాలేధతడు బావాలను పంచాడతడు బావాలను బంధించాలనుకోకు అవి తేనేటీగలై ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి...
...ఇంకా చదవండి

పాలకులకు అందివచ్చిన వరం కోవిడ్ 19

అరుణ్ | 15.05.2020 09:15:54pm

తనకు తాను పెట్టుబడిదారివ్యవస్థ మలినాలనుండి శుబ్రపరుచుకొనే ప్రయత్నాలలో భాగమే ఈ కోవిడ్ వైరస్ అని వైరాలజిస్ట్(వైరస్ అధ్యయన వేత్త) లు అంటున్నారు....
...ఇంకా చదవండి

ఆన్ లైన్ విద్య -వర్గస్వభావం - ఒక పరిశీలన

అరుణ్ | 01.07.2020 05:28:52pm

బడుగుబలహీన వర్గాలకు విద్యను దూరంజేసి, క్రమంగా సమాజ మార్పులో, అభివృద్ధిలో వారి పాత్ర, వాటా లేకుండా చేయడమే ఈ ఆన్ లైన్ విద్య లక్ష్యం. అంతేగాక విద్యారంగపు .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •