ʹUntouchability is the practice of discriminating various individuals and groups based on their cast and the jobs done by them. Untouchability is practiced for a very long time. It works on the Indian caste system hierarchy. The untouchables usually bear inhuman treatment because they Untouchabilityకి ఇచ్చిన నిర్వచనం. పై నిర్వచనంలో రెండో వాక్యం దగ్గరే అసలైన పేచీ అంతా. బహూశా ఈ నిర్వచనాన్ని రాసినవాళ్ళు కూడా అంటరానితనాన్ని అనుభవించినవారు కాదనేది సుస్పష్టం. ʹప్రపంచీకరణయుగంలో అన్‌టచ్‌బులిటీ ఏమిటండీ! నాన్సెన్స్ʹ అని కొట్టిపారేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడే అసలైన సమస్య, ఘర్షణ, ఆలోచన ప్రారంభమయ్యేది. పై నిర్వచనంలో చివరి వాక్యంలో చెప్పిన లోయర్ కాస్ట్లో పుట్టి, ఆ ఇన్హ్యూమానిటీని అనుభవిస్తే కానీ, వాట్సప్ తరంలోని అన్‌టచ్‌బులిటీ పొందిన రూప పరిణామం, దాని తీవ్రత, అర్థంకాదంటూ అనేక పుటల్లోని అంటరాని అక్షరాలు మొత్తుకుంటున్నాయి. స్వీయానుభవాలను చెబుతున్నాయి. సామూహిక అనుభవాలను రికార్డు చేస్తున్నాయి. ఆ అక్షరాలు ఇది ఒక అప్రకటిత సాంఘిక తిరస్కరణ, సాంస్కృతిక బహిష్కరణ అంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లోనూ ఈ అమానవీయ ఆచరణ ద్రవస్థితిలో ఎలా అమలవుతున్నదో డా. చింతకింది కాశీంగారి ʹఅకడమిక్ అన్‌టచ్‌బులిటీʹ వ్యాస సంకలనం వివరిస్తుంది. ఈ పుస్తకమంతా పై నిర్వచనంలోని రెండవ వాక్యాన్ని పరాస్తంచేయడానికి ఆధారాలు చూపుతున్నట్టుగా సాగుతుంది.
డా. చింతకింది కాశీంగారు ఈ గ్రంథంలో ʹఅన్‌టచ్‌బులిటీʹ అనే మాటను భారతీయ సమాజంలోని సాంఘిక దురాచారమైన ʹఅస్పృశ్యత, అంటరానితనంʹ అనే అర్థంలో మాత్రమే వాడలేదు. అన్ని విద్యాస్థాయిల్లో చదువుకుంటోన్న ఎస్సీ, ఎస్టీ, బి. సి. విద్యార్థులు క్రమక్రమంగా విద్యకు ʹఅంటరానివాళ్ళుʹగా ఎలా మారుతున్నారు అని చెప్పే విస్తృతార్థంలో ప్రయోగించాడు. ఈ పుస్తకం చదవనివారు, పుస్తకం శీర్షికను, డా. చింతకింది కాశీంగారి పేరును మాత్రమే చూసినవారు ఇదేదో దళిత విద్యార్థులకు, వారి విద్యాహక్కులకు సంబంధించిన విషయంగా అర్థంచేసుకుంటారు. ఈ పుస్తకాన్ని అలాగే కూడా కొంతమంది ప్రచారంలో పెట్టారు. పరిచయం చేసారు. ఈ సందర్భంగా నాకు నా చిన్ననాటి విద్యార్థి జీవితానుభవం గుర్తుకొస్తుంది. డా. బి. ఆర్. అంబేడ్కర్ దళితులకోసం మాత్రమే కృషిచేసాడని మా టీచర్లు బోధించారు. ఇంకా వివరంగా ఆయన మాల, మాదిగల మనిషి అని కూడా చెప్పేవారు. మేమూ అలాగే అనుకున్నాం. గాంధీ చిత్రపటాన్ని మాత్రమే పెట్టి, డా. బి. ఆర్. అంబేడ్కర్ చిత్రపటం లేకుండా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న దుస్థితి నేడు మరింత విస్తృతమైంది. అతిథుల ప్రసంగాల్లో ఎక్కడా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు ప్రస్తావనకు రాదు. ʹఅకడమిక్ అన్‌టచ్‌బులిటీʹ పుస్తకంలో కూడా డా. చింతకింది కాశీం దళిత జీవిత అనుభవాలను మాత్రమే రాసుకున్నట్టుగా చెబుతున్నారు. అంబేడ్కర్‌ను చదివిన తరువాత రిజర్వేషన్లను అన్ని కులాలవారికి అందివ్వడానికి అంబేడ్కర్ చేసిన కృషి ఎంటో అర్థమైనట్టుగా, డా. చింతకింది కాశీంగారి ఈ పుస్తకం చదివితేకానీ ఎస్సీ. ఎస్టీ, బి. సి. విద్యార్థుల అభివృద్ధికోసం ఎంత తపిస్తున్నాడో, రాస్తున్నాడో, సభల్లో ప్రసంగిస్తున్నాడో అర్థంకాదు. దళిత ఆచార్యుడిగా తన ముప్పయ్యేళ్ళ అనుభవంలో ఎదుర్కొన్న అవమానకర సంఘటనలను, విద్యారంగంలో చోటుచేసుకున్న దుష్పరిణామాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యపట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని పట్టిచూపే 20 వ్యాసాల సంకలనమిది. 175 పుటల ఈ పుస్తకం జనవరి 2020లో ముద్రితమైంది. వెల 120 రూపాయలు.
రచయిత ʹఅకడమిక్ అన్‌టచ్‌బులిటీʹ అనే ఈ పుస్తకంలో సాంఘిక దురాచారమైన అస్పృశ్యత విద్యాత్మక తలంలో ద్రవస్థితిలో అమలవుతున్న తీరును స్వీయానుభవాల్లోంచి వివరించారు. తన ఇరవై అయిదేళ్ళ విద్యాత్మక జీవితం(Academic life)లో విద్యార్థిగా, అధ్యాపకునిగా ఎదురొన్న అవమానాల, తిరస్కరణల, బహిష్కరణల సంకలనం ఇది. గ్రామాల్లో బహిరంగంగా అమలైన అంటారానితనం హైటెక్ నగరంలో రూపం మార్చుకొని వ్యక్తమవుతూ, గాయపర్చిన సన్నివేశాల కనబడని నెత్తుటి సంపుటి ఈ సంకలనం. ʹఅంటరానితనాన్ని అనుభవిస్తే తప్ప అది చేసే గాయాన్ని ఏ పదాలతో వ్యక్తంచేయలేం. దాని క్రూరత్వం ద్రవీభవంగా ఉంటుంది.ʹ అని రచయిత పుస్తకానికి రాసుకున్న ʹఅంటరాని వాక్యంʹలో అంటాడు. ఈ పుస్తకంలో రచయితకు ఎదురైన అనేక అవమానాలను నేపథ్యంగా తీసుకొని, దానికి గల తాత్త్వికతను, వికాసాన్ని కూలంకషంగా చర్చిస్తాడు. వ్యాసాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టిన పాఠకునికి ఇదేదో రచయిత స్వవిషయంగా అనిపిస్తుంది. తరువాత రచయిత ఎంచుకున్న సమస్య తాత్త్విక నేపథ్యాన్ని, రాజకీయ వ్యక్తీకరణను విశ్లేషించే పద్ధతి పాఠకున్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ రచనాశైలిని పట్టిచూపే వ్యాసాలనేకం ఈ సంకలనంలో ఉన్నాయి. ʹఇంటలెక్చువల్ అన్టచ్బులిటిʹ, ఫెలోషిప్ అన్టచ్బులిటిʹ, ʹజ్యుడిషియల్ అన్టచ్బులిటిʹ, ʹఅకడమిక్ అన్టచ్బులిటిʹ, ʹరిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు-అగ్రకులతత్వంʹ మొదలైన వ్యాసాల్లో ఈ పద్ధతిని చూడవచ్చు.
ʹఅకడమిక్ అన్టచ్బులిటిʹ అనే వ్యాసంలో రచయిత తాను అధ్యాపకత్వంలోకి ప్రవేశించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు పాచ్య కళాశాల మొదలుకొని నిజాం కళాశాలల్లో అమలవుతోన్న అంటరానితనాన్ని గూర్చి వ్యాఖ్యానించాడు. నిజాం కళాశాలలోనే ఒక దళిత మహిళ శాఖాధ్యక్షురాలైతే ఓర్వలేని అగ్రకుల బ్రాహ్మణ్యాన్ని సందర్భానువశంగా పాఠకులకు వివరిస్తాడు. వీటన్నింటికీ స్వీయానుభవాలు, సహానుభవాలే గీటురాయి. ʹచదువురానివాళ్ళే రిజర్వేషన్లో ఉద్యోగాలు సంపాదిస్తారు, వీరికి ప్రోజ్ (గద్యభాగం) చెప్పడంతప్ప మరేదీరాదʹనే అగ్రకులతత్వాన్ని ప్రదర్శించిన విధానాన్ని మనతో పంచుకుంటాడు. నిజాం కళాశాలలో సహాయ ఆచార్యులుగా ఉద్యోగం వచ్చినప్పుడు నెలరోజులపాటు తనకంటూ ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటుచేయలేని అగ్రకులనీతి వికృత రూపాన్ని మనకు పరిచయం చేస్తాడు. ఇటీవల నేను రాసిన వ్యాసాల్లో సంతృప్తినిచ్చిన వ్యాసం ʹఫెలోషిప్ అన్టచ్బులిటిʹ అని రచయితతో జరిపిన ప్రైవేట్ సంభాషణల్లో అన్నారు. ఈ వ్యాసంలో మూడు సంవత్సరాలుగా దళిత పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్‌లు విడుదలచేయడంలేదనే విషయాన్ని బలంగా నిరూపించారు. ʹఇంటలెక్చువల్ అన్టచ్బులిటిʹ అనే మరో వ్యాసంలో తాను పనిచేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ʹఅగ్రకులాధిపత్యంʹ ఎంత బలంగా ఉందో టీచర్స్ అసోసియేషన్-2019 ఎన్నికల్లో ఎదురైన అనుభవం ద్వారా వివరిస్తాడు. కులం గురించి మాత్రమే చెప్పకుండా అగ్రకులాధిపత్యాన్ని కాపాడుతూ వస్తోన్న ఔటా(ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్) నాయకత్వాన్ని, వారికి తాత్వ్తిక వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న సంఘ్‌పరివార్‌ను వారిరువురూ కలిసి విశ్వవిద్యాలయ అకడమిక్ ప్రమాణాలను ధ్వంసంచేసిన క్రమాన్ని సవివరంగా విశ్లేషిస్తాడు రచయిత. ఈ విశ్లేషణ పద్ధతే ఆయన రచనను సామూహికం చేయగల అద్భుత పరికరం. మొత్తంగా ఈ వ్యాసాలన్ని దళిత కులానికి చెందిన గాయపడ్డ విశ్వవిద్యాలయ ఆచార్యుని ʹవిద్యాత్మక స్వీయ చరిత్రʹ(Academic autobiography)గా అనిపిస్తాయి. ఆ స్వీయ చరిత్రకు సమాంతరంగా ఇరవై ఐదేళ్ళుగా పెనవేసుకొని పెరిగిన విద్యావ్యవస్థను, దాని ఉత్థాన, పతనాలను తెలియజేస్తాయి.
ప్రస్తుత వ్యాసం రెండవ పేరాలో ప్రస్తావించినట్టు ఈ పుస్తకం ʹఅన్‌టచ్‌బులిటీʹ అనే పదాన్ని ఎస్సీ, ఎస్టీ, బి.సి. విద్యార్థులు విద్యకు అంటరానివారవుతున్నారు అనే అర్థంలో కూడా ప్రయోగించబడింది. ఈ వ్యాఖ్యకు ఉదాహరణలుగా ʹమా క్యాంపస్‌లో అన్‌టచ్‌బులిటీ లేదుʹ, ʹయూనివర్సల్ అన్‌టచ్‌బులిటీʹ, ʹబీసీలకు సంపూర్ణ విద్య- పూలే ఆలోచనలుʹ, ʹసంక్షేమ గురుకులాలు క్షేమంగానే ఉన్నాయా?ʹ, ʹవిదేశీ విశ్వవిద్యాలయాలు ఎందుకు, ఎవరికోసం?ʹʹ అనే వ్యాసాలతోపాటు మరికొన్నింటిని చూపవచ్చు. 1990లనుంచే విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెట్టడం ప్రారంభమైన ఎస్సీ, ఎస్టీ, బి. సి. వర్గాల విద్యార్థులు చదువుʹకొనʹలేని పరిస్థితిని పాలకులు కల్పిస్తున్న తీరును గణాంకాల సహాయంతో విశ్లేషించారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ద్వారాలు తెరవడం, దేశీయ పెట్టుబడిదారులు విద్యారంగంలోకి ప్రవేశించి విద్యాకార్పోరేటీకరణకు తెరలేపడం, కేంద్ర ప్రభుత్వం యు. జి. సి. రద్దు ఆలోచన చేయడం, విశ్వవిద్యాలయాల ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానాన్ని అగ్రవర్ణాలవారికి అనుకూలంగా మార్చడం, జాతీయ విద్యావిధానంలో తెచ్చిన మార్పులు, విశ్వవిద్యాలయాల్లో అగ్రకులాలవారిని లేదా అగ్రకుల మనస్తత్వంగలవారిని నియమించడం, ఎమ్. హెచ్. ఆర్. డి.లో సమూల మార్పులు, విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, పాఠశాల విద్యనుంచి సంపూర్తిగా ప్రభుత్వాలు తప్పుకోవడం మొదలైన ఎన్నో ప్రజా వ్యతిరేక విద్యారంగ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బి. సి. విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సప్రమాణంగా నిరూపించాడు. ఈ రకమైన విద్యావిధానాలు కింది కులాల విద్యార్థులపై, వారి భవిష్యత్తుపై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయని తన ఇరవై ఐదేళ్ళ విద్యారంగ అనుభవంలోంచి మనతో రచయిత సంభాషిస్తాడు.
ఈ పుస్తకంలో ʹవిద్య: అంబేడ్కర్ ప్రాసంగికతʹ, ʹవిద్యార్థి చలనాలు-పాలకుల స్పందనʹ, ʹఎడ్యుకేషన్ ఈజ్ ది పవర్ఫుల్ వెపన్ʹ, ʹనాకు అమ్మానాన్న లేరుʹ వంటి వ్యాసాలు విద్యారంగంలోని అనేక పార్శ్వాలను మనకు పరిచయం చేస్తాయి. ʹనాకు అమ్మానాన్న లేరుʹ అనే వ్యాసంలో రచయిత విక్టోరియా మెమోరియల్ స్కూల్ విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పటి అనుభవాన్ని ఎంతో హృద్యంగా మనతో పంచుకుంటారు. ఆ స్కూల్లో అనాధలకు విద్యాబోధన జరుగుతున్న విధానాన్ని చెబుతూనే, అటువంటి ఉన్నత ఆశయాలతో నడుస్తున్న పాఠశాల భూములు క్రమక్రమంగా అన్యాక్రాంతమైన విధానాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని విమర్శిస్తాడు. ఈ రచయిత ఎక్కడకు వెళ్ళినా విద్యారంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చాలా నిశితంగా పరిశీలించే స్వభావంవల్ల తన ప్రతి అనుభవాన్ని వ్యాసంగా మలచటాన్ని ఈ పుస్తకంలో మనం గమనించవచ్చు.
డా. చింతకింది కాశీంగారి వ్యాస రచనా శైలి పాఠకున్ని వ్యాసంలోకి లాక్కుపోతుంది. వ్యాసాన్ని ప్రారంభించే విషయం, రచనా శైలి, ప్రయోగించే భాష ఈ మూడూ పఠితకు సులభగ్రాహ్యంగా ఉంటాయి. కథన పద్ధతిలో ప్రారంభమైన వ్యాసం, నిర్వహణలో వ్యాస విషయ (content of the essay) సంబంధిత పూర్వాపరాలను, దాని తాత్త్విక కోణాన్ని, తద్విషయమైన పాలకుల ప్రతిస్పందనలను ఒక క్రమ పద్ధతిలోగానీ, కలగాపులగంగా కానీ చెబుతాడు. తర్వాత వ్యాసాన్ని పఠితలో ఒక పోరాటస్ఫూర్తిని నింపుతూ ముగిస్తాడు. ఇది స్థూలంగా ఈ రచయిత ఎంచుకున్న వ్యాస స్వరూపం. రచనా భాషకూడా కథనంలో చాల సరళంగా మొదలై, విషయం చిక్కనవుతున్నకొలదీ గాంభీర్యతను, తాత్త్వికతను, సాంకేతికతను అందిపుచ్చుకొని, మరలా సరళమైన భాషలోనే ముగిస్తాడు. ʹ...కనుక ఎస్సీ, ఎస్టీ, బి. సి. ప్రజలు తమకు రాజ్యాంగం ప్రకారం దక్కవల్సిన అవకాశాల కోసం పోరాడుతూనే, సంపదపై హక్కు కోసం జరిగే పోరటాలలో భాగం కావాలి. ఈ వర్గాలు తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ విముక్తి కోసం చేస్తున్న పోరాటాలకు అగ్రకులంలో ఉండే పేదలు మద్దతుగా నిలబడి అగ్రకుల దోపిడీ పాలకులను ఓడించడంలోనే అందరి విముక్తి ఉందిʹ (కాశీం, చింతకింది. 2020:126-127) అంటూ బాధిత పక్షాల్లో పోరాటస్ఫూర్తిని నింపుతూ వ్యాసాన్ని ముగిస్తాడు. ఇలా ముగించే పద్ధతి ఈ పుస్తకంలోని 20 వ్యాసాల్లోనూ సమానంగా ఉండే లక్షణం.
రచయిత వ్యాసాన్ని కథనంతో చాలా సాదాసీదాగా ప్రారంభిస్తాడని చెప్పుకున్నాం. స్వానుభవంతో మొదలై సామూహికానుభవాలను కలుపుకొని, వాటికి చట్టబద్ధమైన ఆకరాలను, ఆయా చట్టాల నిర్మాణాలను, వాటికి కారణమైన సామాజిక సంఘటనలను ప్రస్తావిస్తూ చెప్పదలుచుకున్న విషయానికి పాఠకులనుంచి ఒప్పుకోలును, సమర్థతను సాధిస్తాడు. విషయానికి గణాంకాలను ఆధారంగా చూపిస్తూ, సాధికారికంగా చెప్పే నేర్పు ఈ పుస్తక రచయితలో కనిపిస్తుంది. ఈయన శైలి పాఠాలను బోధిస్తున్నట్టుగా మౌఖిక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ పుస్తకంలోని ఏ వ్యాసాన్ని తీసుకున్నా మనకు ఈ లక్షణం దర్శనమిస్తుంటుంది. తన ఈ ʹఅకడమిక్ అన్‌టచ్‌బులిటీʹ పుస్తకంలో ʹ1990లో నేను మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. చాలా నియమ నిబంధనలతో చదువు చెప్పేవాళ్ళు. పాఠశాల దాటి బయటికి వెళ్ళే అవకాశం దొరికితే మాకొక సంబురంʹ(కాశీం, చింతకింది. 2020:97)అంటూ వ్యాసాన్ని సాదాసీదాగా, కథనశైలిలో ప్రారంభించి, భారతదేశ ప్రధాన సమస్య అయిన కులవ్యవస్థ, రిజర్వేషన్ల పుట్టుక- చరిత్ర, అంబేడ్కర్-రిజర్వేషన్లు, రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు, అగ్రకులతత్వం ఇలా గంభీరమైన విషయాల్లోకి పఠితలను చేయిపట్టుకొని ఒక్కొక్క అడుగు వేయిస్తాడు. సంక్లిష్టమైన విషయాలను కూడా ఒక్కొక్క పొర విప్పుకుంటూ కన్నతల్లి పిల్లవాడికి నీతిబోధ చేస్తున్నదానివలె చెప్పడం డా. చింతకింది కాశీం ప్రత్యేకత. ఈ రచయిత మౌలికంగా గొప్ప ప్రసంగకర్త. ఆయన ప్రసంగాలను వినడానికి ప్రజలు గంటలతరబడి వేచిచూస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కనుక, ఈ మౌఖిక లక్షణంవల్లనేనేమో ఈయనకు ప్రత్యేక రచనాశైలి అలవడింది. ఇదే ఆయన కలానికి, గళానికి బలం.
ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బి. సి. మైనారిటీల రూపంలో ఉన్న నిమ్నవర్గాల పక్షాన నిలబడి కలబడినందుకు ఇప్పుడు ఈ రచయితను జైలులో బంధించింది తెలంగాణ ప్రభుత్వం. బహుశా అక్కడా అణగారిన కులాలు అనుభవిస్తున్న అంటరానితనాన్ని గూర్చే ఆలోచిస్తూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. అతడు జైలునుంచి వస్తూ వస్తూ ఊరికే రాడు తోటి ఖైదీలకు పంచిన ప్రేమను ʹరిటన్ గిఫ్ట్ʹ రూపంలో హృదయంలో భద్రంగా పదిలపరుచుకొనే వస్తాడు.
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |