ʹ వేర్లున్న మనిషిలా జీవించి, లోకానికి వెన్నెముకలా నిలబడాలంటున్న..సుంకోజి దేవేంద్రాచారి "

| సాహిత్యం | క‌థ‌లు

ʹ వేర్లున్న మనిషిలా జీవించి, లోకానికి వెన్నెముకలా నిలబడాలంటున్న..సుంకోజి దేవేంద్రాచారి "

- పలమనేరు బాలాజీ | 15.04.2020 10:02:29pm

ప్రపంచం మొత్తం ఇప్పుడు మనిషి వైపు చూస్తోంది. ఎటూ దిక్కుతోచని మనిషి మౌనంగా ప్రకృతి వైపు చూస్తున్నాడు. నియంత్రణే తెలియని వాడిప్పుడు స్వీయ నియంత్రణలో ఉండక తప్పని స్థితి! ఎంతో బలవంతుడని తనకు ఎదురే లేదని, ప్రకృతి పైనా , ప్రపంచంపైనా ఆధిపత్యం తనదే అని విర్రవీగిన మనిషిప్పుడు అయోమయంలో ఉన్నాడు. అతడి కళ్ళకు ఇప్పుడుఅతడే కొత్తగా కనిపిస్తున్నాడు. ఎక్కడినుంచి వచ్చాడో ఆ మూలాల గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఐక్కడి దాకా యెట్లా వచ్చాడో, ఇలా వెడితేఎక్కడిదాకా వెడతాడో, చివరికి ఏమవుతాడో అని తనను తానుప్రశ్నించుకుంటున్నాడు. సహజత్వం గురించిన అలోచనల, ఆచరణల కాలమిప్పుడు మొదలయ్యింది. .

మనిషి దేనికి దూరమయ్యాడో, మరి దేనికి దగ్గరయ్యాడో, ఇప్పుడు దేన్నీ వదిలించుకోవాలో , దగ్గరగా తీసుకోవాల్సింది ఏమిటో మనిషిలో కొత్త ఆలోచనలు కొత్తగా మొదలవుతున్నాయి.తన మూలల వైపు అనివార్యంగా వెనుతిరిగి చూడడం మొదలు పెట్టిన మనిషికి ఇప్పుడు సంపదలు, ఆస్తులు బలాలుగా కనిపించడం లేదు. తన బలాలు అని అనుకున్నవన్నీ బలాలు కావని తేలిపోయింది. తన బలం ఆరోగ్యంలోవుందని, ఆరోగ్యకరమైన సమాజంలో వుందని, తను బావుండటం అంటే తానూ ఒక్కడే బావుండటం కాదని , సామాజికంగా సామూహికంగా బావుండటం అని అర్థం చేసుకునే పరిస్థితి లోకి ఇప్పటికి వచ్చాడు ఆధునిక సమాజపు మానవుడు.

ఇప్పుడు మనకు కావలసింది పర్యావరణ స్పృహ కలిగించి, ప్రకృతి విలువ తెలియజెప్పే కథలే. ఇలాంటి కథలకు ఇప్పుడు మంచి కాలం వచ్చింది. మనిషి తనగురించి తాను తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, ప్రకృతి గురించి తెలుసుకోవడం కూడా మరింత ముఖ్యం అనే పరిస్థితి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది..ఇలాంటి సందర్భంలో మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజెప్పే సుంకోజి దేవేంద్రాచారి రాసిన " ఆకుపచ్చని రాగం " కథను కథావరణంలో పరిశీలిద్దాం.

దేవేంద్ర రాసిన "ఆకుపచ్చని రాగం" కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం , దీపావళి ప్రత్యేకసంచికలో (04.11.2018 ) ప్రచురితమైంది. భావుకతతో మనిషి పట్ల ప్రేమతో ప్రకృతి పట్ల గౌరవంతో సమాజం పట్ల బాధ్యతతో అందరికీ అర్థమయ్యేలా సులభమైన పదాలతో అనుభూతి ఐక్యత క్లుప్తత ముఖ్య లక్షణాలుగా రాసిన ఈ కథ ఒక మంచి ప్రకృతి కథ, పర్యావరణ కథ, మనిషి కథ.! పొలంలో హృదయాన్ని ఉంచిన ఒక సామాన్యుడైన నిఖార్సైన రైతు కథ.

సాధారణంగా ఎవరైనా ప్రశ్నిస్తే మనకు కోపం వస్తుంది. ప్రశ్నతరువాత ప్రశ్న వేస్తే మరింత కోపం వస్తుంది అయితే కాలం అడిగే అన్ని ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. మనిషికి ఎదురుపడి ప్రశ్నించే మనిషి నుండి తప్పించుకున్నా , కాలం -ప్రకృతి అడిగే ప్రశ్నల నుండి ఎవరూ తప్పించుకోలేరు.

సమాజంలో మనుషులు మాత్రం ఉంటే సరిపోదని, ప్రకృతికి మనిషి ఎప్పుడూ యజమాని కాలేడని, మనిషి ఈ భూమి మీదకు ఒక అతిథిలాగా మాత్రమే వచ్చాడని, ప్రకృతి శాశ్వతం అని, మనిషే అశాశ్వతం అని , మొక్కలు పిట్టలు, ఈ నేలా, ఆకాశం, గాలీ,నీరూ జగత్తులో ముఖ్యమని నమ్మినవాడు కాబట్టే, దేవేంద్ర ఈ కథను రాయగలిగాడు.ఎలాంటి ఉపోద్ఘాతాలు , వర్ణనలు లేకుండా అనుభూతి ఐక్యత ప్రధానంగా ఏకత్వంతో కథను చాలా సూటిగా నడిపించాడు. వేగవంతమైన కథాగమనంతో, అనుభూతి ఐక్యత ప్రధానంగా సాగిన ఈ కథ ఇలా మొదలవుతుంది...

" ఒరే చిన్నోడా..నే నీడ వద్దనే పుట్టే సూర్యుడితో ..సందేళ చిలక నవ్వుల చందమామతో.. రేత్రి గుసగుసలాడుకునే లక్షల చుక్కలతో మాట్లాడతా.. ఇంటి నుంచి అడుగు బయటేస్తే చాలు, ఈధిలో ఎవరో ఒకరుంటారు. యాడికప్పా ఎలబారినావని పలకరిస్తారు. ఇంట్లోనే దూరుకోనున్నే ఎవరో ఒగరొచ్చి ఏమి ఇంట్లోనే ఉండవే..ఒంట్లో బాగాలేదా అంటారు .ఊరు దాటినామంటే మనుషులే కాదు, చెట్టూ చేమా గొడ్డు గోదా రాయి రప్పా.. ఏదైనా సరే నాతో మాట్లాడతాది. నేనూ వోటితో మాట్లాడతా.నాదంతా చాదస్తం అంటావు. నాకు పిచ్చంటావు. చెట్లు మాట్లాడతాయా అంటావు .ఎందుకు మాట్లాడవురా నాయనా.. కని పెంచి పోషిస్తే మాట్లాడకుండా
పోయేది మనిషే. ఇంత తిండి పెడితే చాలు ,ఈ భూమ్మీద ఇంకే జీవి అయినా కృతజ్ఞతతో ఉంటాది . కొన్నైతే సచ్చేంత విశ్వాసంతో కూడా ఉంటాయి."

" తీసుకోవటమే కానీ ఇచ్చేది తెలీని మనుషులకు.. ఇచ్చినా తాము వద్దనున్నది తప్ప ఎదుటి వారికి అవసరమైంది.. ఇచ్చేదానికి మనసొప్పని మనుషులకు ఇచ్చినా తీసుకున్నా లాభనష్టాలతో బేరీజు వేసుకునే మనుషులకు కపటం లేని ప్రేమ విలువేం తెలుస్తుంది? ఎలా అనుభవంలోకి వస్తుంది? " ఈ ప్రశ్నలకు సమాధానం ఆర్థిక సమానత్వం , సామాజిక సమానత్వం లోపించిన సమాజమే చెప్పాలి.

" నువ్వు పెంచిన మొక్కలు నీతో మాట్లాడ్డం లేదూ.. వేల మొక్కల ఆత్మలన్నీ ఒకటై నీ ఒక్కడి ఆత్మ వేల ఆత్మలుగా మారి ,మొక్కలూ నువ్వూ ఒక్కటిగా మారి పచ్చగా ప్రపంచాన్ని బతికించడం లేదూ.. ఇలాంటి నీ ఆనాటి పచ్చని అనుభవం ఎండి నలిగి పొడిగా మారి గాలిలో ధూళిలో కలసిపోయినా.. ఇంకా నీకు పొలం స్వాగతం పలుకుతూనే ఉంది. తన గర్భంలో దాచుకుని పెంచి పెద్ద చేసి మొలకెత్తించి చిగుర్లు తొలగించి రెమ్మలేసి కొమ్మలొచ్చి ఆకుపచ్చని మనిషిలా నిన్ను మార్చేందుకు ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడో వదిలి వెళ్ళిన నీ కోసమే ఇంతగా ఎదురు చూసే ఈ నేల ...ఎప్పుడూ పలకరించే నా కోసం ఎంతగా తనకలాడుతుందో
తెలుసా? సందేళ మేత నుంచి ఇంటికొచ్చే ఆవు కోసం ఎదురు చూసే లేగదూడలా, నాకోసం మన పొలం ఎదురుచూస్తా ఉంటుంది. పొలం స్పర్శతో నాలో పెరిగే జీవనోత్సాహం... నా స్పర్శతో తనలో కలిగే ఆనందం ..నా అడుగు అడుగునా తెలుస్తూనే ఉంటుంది. నేలతల్లి మాట్లాడుతుంది..నిజం.." రైతు గుండె చెప్పిన ఈ నేలతల్లి కథ వినాలంటే విశ్లేషణలు,వివరణలు అవసరం లేదు కానీ, ఇలాంటి కథల్ని ఎవరికీ వాళ్ళు మనసుతో చదువుకోవలసిoదే!

"... గంగా నేల మొక్కా నాకు కృతజ్ఞతలు చెబుతుంటాయి. నేను ఆ మూడింటికి శిరస్సు వంచి వందనం చేస్తుంటా. నీరూ నేలా పైరూ నేనూ .. నాలుగు నుంచి ఒక్కటిగా మారిపోతాం. నేల నాకోసం ఉంది. నీరూ నాకోసం ఉంది. ఆ రెండిటిని ఉపయోగించి పైరు పెంచేందుకే నేను భూమి మీదకి వచ్చాను. నీరు నేలా ఉనికి తెలిపేందుకే నేనున్నాను. నా మనుగడ కొనసాగేందుకు అవి ఉన్నాయి. నీరు నేల మనిషి కలిసి చెట్టుకు అల్లుకునే తీగలా కొనసాగితే ఈ ప్రపంచం మొత్తం పచ్చగానే ఉంటుంది."

ఏకత్వం , అనుభూతి ఐక్యత , క్లుప్తత మొదలైన ఆధునిక కథా లక్షణాలన్నీ ఐక్యంగా కూడిన సున్నితమైన ఈ కథను చదువుతున్న పాఠకులు ఉలిక్కిపడతారు . ఆ ప్రశ్నలకు జవాబులు వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు. కథను ఎక్కడా ఆపకుండా చదివించే బిగితో రాసిన ఈ కథ మధ్యలోనో, కథ చివర్లోనో పాఠకులు తప్పనిసరిగా ఆగుతారు. ఆగి ఆలోచింపక తప్పని పరిస్థితి లోకి ఈ కథ పాఠకుల్ని తీసుకు వెడుతుంది.

కథకుడు ప్రశ్నిస్తాడు.. చిన్నోడా నువ్వు నేనూ తినే తిండి ఒకటే అయినా నీకు నాకు ఎంత తేడా? మనిషికి చెట్టుకు ఉన్నంత తేడా ఉంది అంటాడు. రైతు ఆకు పచ్చని చెట్టు లాంటి వాడు అని చెబుతూ నువ్వు అన్నీ మర్చిపోయిన మనిషివని అంటాడు. ప్రకృతి ఒడిలో మొక్కలా, పొలంలా ఉండి పోయిన కథకుడు- పొలానికి పల్లెకు దూరమై ఒంటరిగా మిగిలిపోయిన మనిషిని చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తాడు. నేటి సమాజంలో ఆధునిక మానవుడుగా రూపం మార్చుకున్న మనిషి తప్పని సరిగా జవాబు చెప్పి తీరాల్సిన ప్రశ్నలవి.

కథను చదివించడంలో ఇదొక ఉత్తమ పద్ధతి ! కథలో పాఠకుల్ని ఏమరిపాటుకు గురిచేయకుండా, కథ మొత్తాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ చదివించేలా రాయటం అనే టెక్నిక్ ను ఈ కథలో రచయిత చక్కగా వాడుకున్నారు. ఈ కథని చెప్పటానికి ఇది మాత్రమే సరైన పద్ధతి అనిపిస్తుంది. ఇలా అనిపించడమే శిల్ప రహస్యం. ఈ కథను ఈ ధోరణిలో కాకుండా ఇంకేవిధంగానైనా చెప్పి ఉంటే ఇందులోని కథాంశం పాఠకుడిని ఇంత బలంగా , సూటిగా తాకి ఉండేది కాదనిపిస్తుంది.

"నేను ఒక్కడినే శాశ్వతం అనుకోకు .ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చని చెట్టులా ఉండు. పచ్చని చెట్టులా మారితే ఎక్కడున్నా నీకు నాకూ సంబంధం ఉంటుంది. పచ్చని చెట్టులా మారాక నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ ప్రేమల చిగుర్లు తొడుగుతాయి. స్నేహాల పూలు పూస్తాయి. శ్రమల పిందెలు వస్తాయి.ఆశల కాయలు ఎదుగుతాయి. స్వేచ్ఛగా పండ్లు మాగుతాయి. ఆ పండ్లతో నువ్వూ నేను చుట్టూ ఉన్న ప్రపంచం సంతోషంగా బతికేస్తాం. లోకమంతా పచ్చగా మారి నింగి మేఘమై.. చినుకు చెరువై నేలంతా ఆనంద భాష్పమై.. భూమిలోకి పాదాల వేర్లు విస్తరించి దేహం చేవదేళి తల ఆకాశం గొడుగై నిలబడే ఆకుపచ్చని మనిషిగా మారు..
వేర్లున్న మనిషిగా జీవించు. లోకానికి వెన్నెముకగా నిలబడు."

పర్యావరణానికి సంబంధించి , ప్రకృతి విలువ, మానవ జీవితం విలువ, రైతు ఆత్మని ,ఆక్రోశాన్ని , రైతు జీవిత కాంక్షని తెలియచెప్పే ఒక మంచి కథలో ఇంతకంటే తెలియ చెప్పాల్సిన సత్యం కానీ , ఆచరణాత్మకమైన సందేశం కానీ ఇంకేమీ ఉండదు. సున్నితత్వం మరచిపోయిన, కోల్పోయిన పాఠకులకు వాళ్లు కోల్పోయింది ఏమిటో, కోల్పోకూడనిది ఏమిటో తెలుస్తుంది. ఈ రైతు కథ అందరిదీ. రైతు అందరి వాడూ కాబట్టి, ఈ కథ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అందరిదీ. ఎందుకంటే అందరం మట్టిమనుషులమే కాబట్టి. అనాదిగా లోకం లో మనుషులందరూ రైతు బిడ్డలే కాబట్టి.

ఎప్పుడూ కొత్తగానో, కొత్త విషయాలనో కథల్లో చెప్పాలని తపన పడే రచయితల్లో దేవేంద్ర ఒకరు. ప్రేమ ఆర్ధతతో నిండిన బాధ్యతాయుతమైన కంఠస్వరంతో "ఆకుపచ్చని రాగం " కథను వినిపిస్తాడు రచయిత. కథ చెప్పే పాత్రలోని ధర్మాగ్రహం పాఠకులకు అర్థం అవుతుంది,ఆలోచింపజేస్తుంది. కథనంలో వాచ్యత లేకపోవడం నిరాడంబర శిల్పం ఈ కథను మంచి కథగా మలచాయి.

కథ దానికదే ఒక ప్రశ్న. కథ దానికదే ఒక ఊరడింపు. కథ దానికి ఒక సందేశం. కథ దానికదే ఒక సంతృప్తి లేదా అసంతృప్తి. ఈ కథలో ప్రశ్నలు ఉన్నాయి. ఊరడింపు ఉంది. మంచి సందేశం ఉంది. ఉంటున్న జీవితం పట్లా, ఉండాల్సిన జీవితం పట్లా బాధ్యతతో కూడిన జాగ్రత్తలు , ప్రేమతో నిండిన హెచ్చరికలు ఉన్నాయి. మానవజీవితంలో వచ్చిన సమూలమైన మార్పులపట్లా , ఆధునికత పేరుతో, అభివృద్ధి పేరుతో ప్రకృతికి మనిషికి దూరమైన మనిషి ఏకాకితనం పట్లా, దగా పడుతున్న రైతు జీవనం పట్లా, పట్టణాలవుతున్న పల్లెల పట్లా, వర్తమాన జీవావరణం పట్లా, మాయమవుతున్న మనిషి - ప్రకృతి అనుబంధాల పట్లా నిశితమైన
పరిశీలనా, లోతైన విమర్శా ఉన్నాయి ఈ కథలో.

మనుషులు ఎందుకు ప్రకృతికి దూరంగా ఉంటారు ?ఎందుకు పట్టణీకరించబడుతున్నాడు? అనేది రెండు వేర్వేరు ప్రశ్నలు కావు.దయగా మంచిగా సౌకర్యవంతంగా ఉండాలని, పదిమందిలో మంచి అనిపించుకోవాలనే తపన అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి ప్రవర్తన కి స్పందన కి సంబంధించిన ప్రతి ఒక్క దానికి ఎవరికి తగిన కారణాలు వారికి బలంగా ఉంటాయి.పరిస్థితులు సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి ఉద్వేగాలు ఉద్రేకాలుగా, నవ్వులుగా,సంతోషాలు గా, దుఖాలుగా మారుతూ ఉంటాయి.సమాజంలోని దౌర్జన్యాలకు , ప్రలోభాలకు, నిర్వేదనలకు, మోసాలకు, కుళ్ళు రాజకీయాలకు -ఎవరు ఎంత కాదన్నా, కాదనుకున్నా అంతో ఇంతో అందరం బాధ్యులమే. సమాజంలోని అసమానతల తో పాటు మానవ సంబంధాల లోని సంఘర్షణలతో పాటు మనిషిని విపరీతంగాకలవరపెడుతున్న అంశం మనిషి మనిషికే కాదు ప్రకృతికి సైతం దూరం కావడం.
మనుషులకు దూరమవుతున్నప్పుడు ఎవరో ఒకరు ఆ ఖాలీల గురించి మాటమాత్రం మాట్లాడగలరేమో! కానీ,మట్టికి పల్లెకు,వ్యవసాయానికి , ప్రకృతికి,పర్యావరణానికి దూరమైన మనిషికి ఆ దూరాల గురించి, ఆ ఖాలీల గురించి చెప్పటానికి ప్రకృతే ముందుకు వస్తూ ఉంటూ ఉంటుంది. ప్రకృతి చెప్పే మాటల్ని వినాలంటే, ప్రకృతి హెచ్చరికల్ని తెలుసుకోవాలంటే మనిషిలో కొంతైనా సున్నితత్వం, మనిషితనం మిగిలి ఉండాలి. వ్యవసాయానికి ప్రకృతికి పర్యావరణానికి హాని చేయడం అంటే మానవ సమాజానికి హాని చేయడమే అని ; మనిషిలోని స్వార్థం,ఆధునికత ముసుగులో, పట్టణీకరణ పేరుతో ఒక బీభత్స వాతావరణాన్ని చిత్రించిoదనే వాస్తవాన్ని మనిషి అంగీకరించి తీరాలి. అనేక కల్లోలాలకు , కష్టాలకు, విధ్వంసాలకు, విపరీత పరిణామాలకు మనిషి పల్లెకు, ప్రకృతికి దూరం కావడమే ప్రధాన కారణమని ఒప్పుకోవాలి.

అందరూ బాగుండాలి అనే మానవత్వం నుంచి -ఏదేమైనా తాను బాగుంటే చాలు అనుకునే స్వార్థపూరితమైన మనస్తత్వాన్ని మనిషి ఏర్పరచుకోవడానికి మధ్య మనసులో వచ్చిన, మనిషి ఆలోచనల్లో వచ్చిన, మనిషి వ్యక్తిత్వం లో వచ్చిన మార్పులకు అతడు ప్రకృతి నుండి విడిపోవడమే ముఖ్య కారణం అని ఈ కథ చెపుతుంది .

మనిషిలోని దుర్మార్గo, కపటత్వo, మంచితనo, రాజకీయమే, దళారీ తనమే సమాజంలో కనబడుతూ ఉంటుంది. ఇది ఒప్పుకోవాలంటే నిజాయితీ కావాలి .గుండె ధైర్యం , చిత్తశుద్ధి కావాలి. నిజాయితీ గుండె ధైర్యం చిత్తశుద్ధి కలిగిన రచయితలు రాసే కథలు మంచిని మంచి అని చెబుతాయి, చెడును చెడు అని చెబుతాయి. భ్రమల్ని ,సందేహాలను పోగొట్టి సత్యాన్ని మరింత దగ్గరగా , స్పష్టంగా చూపించటం మంచి కథ లక్షణం. ఆ రకంగా చూసినప్పుడు ఈ కథ ఉన్నత శ్రేణికి చెందిన కథల వరుసలోకి చేరుతుంది.

మనల్ని బాధపెట్టకుండా, కలవర పెట్టకుండా, కొత్త ఆలోచనల్ని కలిగించకుండా, ఒక ఎరుకని కలిగించకుండా నిబ్బరంగా ఉంచగలిగేవి మంచి కథలు కావు.ఒకసారిమంచి కథ చదివిన తర్వాత ఆ మంచి కథ రాసిన రచయిత పైన పాఠకులకు ఎంతో నమ్మకం కుదురుతుంది. ఆ కథకుడి కలం నుండి ఎన్నో మంచి కథల్ని పాఠకులు ఆశిస్తూనే ఉంటారు. అట్లా మంచి కథల్ని ఆశించే కలం నుండి మంచి కథలు వచ్చినప్పుడు
సంతోష పడతారు. ఆ రచయిత వెంటే తిరుగుతారు. అలా ఎంత కఠోరమైన వాస్తవాన్నయినా అర్థవంతంగా, కళాత్మకంగా చెబుతూనే మనల్ని మనం ప్రక్షాళన చేసుకునే దిశగా మనల్ని మనం తడిమి చూసుకునేలా విభిన్న కథా వస్తువులతో, మనస్తత్వ విశ్లేషణతో, ఆసక్తికరంగా, అనుభూతి ఇక్యతతో , వైవిధ్యభరితంగా , చురుకైన కథనంతో మేలిమి రకం కథలు రాసిన సృజనాత్మక రచయితల్లో సుంకోజిదేవేంద్రాచారి తప్పక ఉంటారని ఈ కథ తేల్చి చెపుతుంది.. జీవితం లోతుపాతులు కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడు కాబట్టి, బడుగు జీవుల సుఖసంతోషాలు సంతృప్తి కోసం వాళ్ళ మొహాల్లో వెలుతురు కోసం కాసిన్ని నవ్వుల కోసమే కథలు, నవలలు రాసాడు.వాటితో బాటూ పిల్లల పైన వున్న ఇష్టంతో ఈ తరానికి తెలియని, పెద్దలు మరచిపోయిన ఎన్నో చిన్న పిల్లల ఆటల్ని ఏరికూర్చి సంకలనంగా వెలువరించాడు. ప్రకృతి, మనిషి, రైతు, పిల్లలు, పల్లెటూర్లు
ఇతడికి చాల ఇష్టమని ఇతడి రచనలు చెపుతాయి .

బహుజన జీవితాన్ని వాస్తవికంగా చిత్రించి, కరువు కాటకాలు,పేదరికం ,ఉపాధి లేకపోవడం , ఆర్థిక అసమానతలు, కులమత బేధాలు,మనుషుల మధ్య ఏర్పరిచే కల్లోలాలను నవలలుగా, కథలుగా అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన తెలుగు రచయితల్లో సుంకోజి దేవేంద్రాచారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వడ్రంగి వృత్తికి సంబంధించిన ఆచారుల కుటుంబానికి చెందిన సుంకోజి దేవేంద్రాచారి చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం, గుడ్రెడ్డి వారి పల్లి కి చెందిన గ్రామీణ రచయిత. విశ్వవిద్యాలయాల చదువు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలు ,ఆర్థిక సుస్థిరత జీవితంలో పొందని వాడు. వడ్రంగి పని లోనే కాదు, జీవితాన్ని చిత్రించటంలో కూడా నేర్పరితనం కలిగినవాడు.

అతనికి ఆకలి తెలుసు. అన్నం విలువ తెలుసు. వృత్తిని గౌరవించడం తెలుసు. కష్టపడి పని చేయడం తెలుసు, నిజాయితీగా బ్రతకడం తెలుసు. ఎక్కడా తలవంచక పోవడం, ఎవరిని భుజాలమీద మోయక పోవడం - బహుశా కొందరికది అహంకారంగా కనిపించవచ్చు,కానీ- నిజానికి అది అతడి వ్యక్తిత్వం. అతని వ్యక్తిత్వం మొత్తం అతని సాహిత్యంలో అడుగడుగునా కనబడుతుంది.అతడి జీవితమే అతడి సాహిత్యం. కులం మతం ఏదైనా పేదరికమే కులమై, బ్రతకడానికి పోరాడక తప్పని రాయలసీమ ప్రాంతపు గ్రామీణ రైతు , రైతు కూలీ కుటుంబాల్లోని అల్లకల్లోలాలు, కరువు తెచ్చిన కష్టాలన్నీ అతడికి అనుభవపూర్వకంగా తెలుసు.
పట్టుపట్టి వడ్రంగి పని అతను నేర్చుకోలేదు ఎందుకంటే అది అతడి జీవితం. కథలు రాయడం కూడా అతను పట్టుబట్టి నేర్చుకోలేదు. ఎందుకంటే రాయడం కూడాఅతని జీవితమే! అతడి జీవితమే అతడి సాహిత్యం. అతడి సాహిత్యమే అతడి వ్యక్తిత్వం.

పల్లె నుంచి మట్టి పాదాలతో పట్టణానికి వచ్చినా, కొత్త ఉపాధిని పట్టణంలో వెతుక్కున్నప్పటికీ పల్లె మూలాలు మరువని వాడు. అతని పాదాలకు మట్టి ఇంకా అంటుకునే ఉంది. నగరం మాయలో కానీ, వ్యామోహంలో కానీ పడని బలమైన గ్రామీణ వ్యక్తిత్వం కలిగిన నికార్సయిన పల్లెటూరి మనిషి కాబట్టే , అతని హృదయం మానవసంబంధాలపట్ల ఆర్తితో నిండి ఉంది. అందరూ బాగుండాలని, మనుషుల మధ్య అంతరాలు ఉండరాదని, కులం మతం ఆస్తులు అంతస్తులు మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించకూడదనే తపన , ప్రకృతి పట్ల పర్యావరణం పట్ల, మనిషి పట్ల,రైతు పట్లా అతడికి ఉన్న గౌరవం అతడి రచనల్లో కనబడుతుంది. మంచి నుడికారం, పరిశుద్దమైన బాషతో బాటు, చిత్రకారుడికుండే ఓర్పు నేర్పు తన రచనల్లో కనిపిస్తాయంటే అందుకు కారణం దేవేంద్ర మంచి కథకుడు మాత్రమే కాదు , మంచి చిత్రకారుడు, కవి కూడా!

మొదటి కథ ʹ బంగారు పంజరం ʹ ( 1997 ) మొదలు ఇప్పటి వరకూ సుమారు వంద కథలు , రెండు వందల కవితలు , ఏడు నవలలు దేవేంద్ర రాశారు . 25 మంది ప్రముఖ సాహితీవేత్తలను ఇంటర్వ్యూ చేశారు . (నవ్య నీరాజనం- నవ్య వారపత్రిక ). అనేక కథలకు నవలలకు కవితలకు చాలా పోటీలలో దేవేంద్ర బహుమతులు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ యువరచయిత పురస్కారం, భారతీయ బాషా పరిషత్ యువ పురస్కారం ( కలకత్తా) ,రంగినేని యల్లమ్మ సాహితీ పురస్కారం, బీఎస్ రాములు విశాల సాహితీ పురస్కారం ,గురజాడ కథాపురస్కారం, పెద్దిభొట్ల సుబ్బరామయ్య స్ఫూర్తి పురస్కారం పురస్కారాలు అందుకున్నారు. రచయితగా మాత్రమే కాకుండా,ఉత్తమ జర్నలిస్టుగా ఎ . ఎస్ . సుందరరాజులు స్మారక పురస్కారం (2018) అందుకున్నారు. గ్రామీణ క్రీడల పై రాసిన కథనాలతో 2006లో వెలువరించిన ʹ మనమంచి ఆటలు ʹ పుస్తకం పిల్లలకు మంచి విలువైన కానుక .ʹ అన్నంగుడ్డ ( 2017) , "దృశ్యాలు మూడు . ఒక ఆవిష్కరణ " (2011), ) ʹ ఒక మేఘం కథ ʹ (2015) కథా సంపుటాలను, నీరు నేల మనిషి ʹ నవల తానా నవలల పోటీలో
ప్రోత్సాహక బహుమతి (2012), ʹరెక్కాడినంతం కాలం ʹ. నవల ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో బహుమతి (2018) వెలువరించారు. ఇంకా ʹవెన్నెముక, అమ్మానాన్నకు...,మిస్సింగ్ , సహవాసి , మనిషి " నవలలు రాశారు. ప్రపంచీకరణ పరిణామాల్లో వ్యవసాయానికి రైతుకి ప్రత్యమ్నాయం లేదని , అందుకే అందరూ అన్నదాత అయిన రైతుకు మద్దతు ఇవ్వాలని, వేర్లున్న మనిషిలా జీవించి, లోకానికి వెన్నెముకలా నిలబడాలన్నదే ఈ కథాంశం.

గ్రామీణ కథకుడు సుంకోజి దేవేంద్రాచారి చెక్కిన ఈ రైతు కథాశిల్పం, ఆలపించిన " ఆకుపచ్చని రాగం " దుఃఖితుడైన రైతుకు ఒక భరోసా అనడం లోసందేహం లేదు.!

No. of visitors : 425
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •