కరోనా.. కరోనా
నువ్వు నాకు నచ్చలేదు..
గడిచిన కాలమంతా
విపత్తులలో మనుషులు
తాత్కాలికంగానాయినా
అంతరాలు పక్కనబెట్టి
కొద్ది కాలమయినా
కొన్ని క్షణాలయినా
అవసరంగానయినా
ఒకరి దగ్గరకు మరొకరు వచ్చారు..
ఒకరినొకరు గుండెలకు హత్తుకుని
బావురుమన్నారు..
కరోనా, నీ రాకతో
వ్యక్తిగత దూరం అనే మాట
మా దేశంలో వెంటనే
సామాజిక దూరంగానే అర్థమయింది..
ఉన్న దూరాలను
తేలిగ్గా పెంచడానికే
నీవు మరింత దోహద పడ్డావు..
అంతరాలెన్ని ఉన్నా
మనుషుల మధ్య ఉండే కనీస
కరచాలనాన్నీ నీవు రద్దు చేసావు..
ఇదే గొప్ప అవకాశమని
మీ షేక్ హ్యాండ్ కన్నా
మా దండమే గొప్పదనే
గుంపును ముందుకు ఎగదోశావు
నీ వల్ల ముఖానికి మాస్కులు వచ్చి
మనిషికి మనిషి కనబడితే
సహజంగా విప్పారే చిరునవ్వులనూ మాయం చేశావ్..
ఉన్న దూరాలకు తోడు
వేల సంవత్సరాల
సామాజిక అంతరాలకు
అంటరానితనాలకు
మనుషుల మధ్య ఇక్కడ
ఇప్పటికే ఉన్న దూరాలకు
మరో ఆరడుగుల దూరాన్ని కలిపావు..
మాస్కుల మాటున
అనుమానపు అభద్రతా
చూపులే మనుషులకు మిగిల్చావు..
కూచుని తినగలిగే
తీరిక వర్గాలకు అనుకూలంగా
దినసరి కూలి జీవుల
రెక్కాడితేనే డొక్కాడే జీవుల
బలిచేయడానికే వచ్చావు..
లాక్డౌన్ కొంతమందికి
విశ్రాంతి కావేచ్చేమోగాని
కష్టజీవులకు
చిన్న చిన్న అవసరాలకూ
ఎడతెగని వెతుకులాట
కన్నీటి బతుకులాట అయ్యింది
కరోనా నువ్వు సర్వ వ్యాపితంగా
ఉన్న ఈ తరుణానే
ఒక స్నేహితుడు గాయపడితే ,
మరో స్నేహితుని చెల్లి
ఇంకో స్నేహితుని తల్లి చనిపోతే కన్నీళ్లు
తుడవడానికీ వెళ్లలేకపోయాను
ఇక నీవే సోకి చనిపోతే
చివరి చూపే కాదు
శవం కూడా ఆత్మీయులుకు
దక్కకుండా చేస్తున్న
నీ దుర్మార్గం
నన్ను కలచివేస్తోంది..
మా దగ్గర మతమే కాదు,
మతం కుల విభజనతో
అంటరానితనంతో సహా
అనేక వివక్షలతో
మనుషుల మధ్య గోడలు కట్టింది
నువ్వు ఆ గోడలకు
అదనపు చేర్పుగా వచ్చేసరికి
అసలే కోతి, ఆపై
కరోనా మోసుకొచ్చిన స్థితయ్యింది మాది..
ఎప్పుడూ సమయంలేని
తీరికలేని ఈ పరుగు జీవితాన
కొంత సమయం చిక్కిందని
నా ప్రేయసికి,పిల్లలకి
ఒక ముద్దిద్దామన్నా
మా మధ్య ఒక అనుమాన
పొరగా ముసురుకున్నావు కదా కరోనా..
కానీలే, తాత్కాలికంగా
ఈ సమయం నీదే లే,
ఇంత బాధలోనూ
ఒక్క అందుకు సంతోషిస్తున్నాను
నీ దెబ్బకు
మతాలు, మత ప్రవక్తలూ
పీఠాలూ, పీఠాధిపతులూ
గుడులూ, మసీదులు, చర్చ్ లూ
పూజారులు, ముల్లాలు, పాస్టార్ల
ప్రభావానికి తాళాలు పడి
మనుషులు కొత్తగా
ఆలోచనలు చేయడానికి
సనయం చిక్కిందని
అనుకుంటున్నాను ..
పోతేపోయింది గానీ
మా పారిశుధ్య కార్మికుల
అవసరం, గొప్పదనం తెలిసొచ్చిందని
వీభూధులూ, తాయెత్తులూ
గోమూత్రం పేడలు కాదని
డాక్టర్లూ, నర్సులూ
శాస్త్ర, విజ్ఞానాల వెలుగులో
వెలిగిస్తున్న ప్రాణ దీపాలు చూసి
గర్వపడుతున్నాను..
మతములన్నీ మాసిపోయి
జ్ఞానం వర్ధిల్లుతుందని ఆశపడుతున్నాను..
సామ్రాజ్యవాదుల దోపిడీ నమూనాలు చెల్లవని
ప్రజలు కేంద్రంగా ప్రజా వ్యవస్థలు
మాత్రమే పరిష్కారమని
ఈ కష్ట కాల హెచ్చరికను
నా వంతుగా చాటి చెబుతున్నాను..
Type in English and Press Space to Convert in Telugu |
గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !తన జీవితం, ప్రేమ అన్నీ సమాజం లోని ప్రజలకోసమేనని, ఆ ప్రేమ కేవలం నీకు, కుటుంబానికి పరిమితమయ్యేది కాదని" చెప్పాడు..అది తన అంకిత భావం ఆ మాటను తను చనిపోయే...... |
నా ప్రియమైన... విప్లవమా !విప్లవమా నీవు చూడని
లోతులూ అగాథాలూ
ఎక్కని కొండలూ శిఖరాలూ
నడవని ముళ్ళ బాటలు
దాటని నదులూ సముద్రాలూ ఉన్నాయా ... |
వీరుల కన్నతల్లి, అమరుల బంధువు, స్నేహితురాలు కామ్రేడ్ సూర్యవతిప్రజా ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు చరిత్ర పొడవునా పిల్లలు చేసిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన అనేక మంది తల్లులు లాగానే , కొడుకు నుంచి ప్రేరణ పొంది ఆచరణకు..... |
ఆట - నీతిదోపిడి మర్మాన్ని విప్పి చెప్పే
ఆటలు ఇప్పుడిక కనుగొందాం
కొత్త తరాలకు ఉగ్గుపాలతో నేర్పిద్దాం
శ్రమ చేస్తున్న మనుషులు
ఇంకా ఊరవతలే ఉన్నారని
ఆడదంటే ఆట బొమ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |