ఏది సత్యం ? ఏది అసత్యం ?

| సాహిత్యం | వ్యాసాలు

ఏది సత్యం ? ఏది అసత్యం ?

- పాణి | 17.04.2020 01:43:44pm

శరత్ చంద్ర ఎవరో నాకు తెలియదు. తెలుసుకుందామనే ఆసక్తి కూడా లేదు. అభిప్రాయాలే ముఖ్యం. ఆయన గత కొంత కాలంగా విరసం గురించి రాస్తున్నారు. అందులో ఆరోపణలు, అబద్దాలు ఉన్నాయి. ఒక పక్క విప్లవోద్యమం మీద, వివి మీద ప్రేమ ప్రకటించుకుంటూనే ఆయన ఇలా రాస్తున్నారు. ఈ యాభై ఏళ్లలో ఇలాంటి అనేక పద్ధతుల్లో విరసం మీద ఆరోపణలు చేసినవాళ్లెందరో ఉన్నారు. ఈ తేడాలను, ప్రత్యేకతలను గుర్తించి విరసం ఎదుర్కొంటున్నది. వాళ్ల ఉద్దేశాలతో సహా వాళ్ల రాతలను, వాటి అర్థాలను కూడా కలిపి విరసం సక్రమంగానే అర్థం చేసుకోగలదు. దేన్నయినా ఆచరణ పునాది మీదే పరిశీలించగల సంసిద్ధత విరసానికి ఉన్నది.

విరసం చుట్టూ అనేక వాద వివాదాలు ఉండటం సహజం. భావజాల రంగంలో ఘర్షణ కోసం విప్లవకర వైఖరితో పని చేస్తుండటమే దీనికి కారణం. అదీ నడుస్తున్న విప్లవోద్యమం పట్ల ఒక రాజకీయ వైఖరి దృఢంగా తీసుకున్నప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే తరచూ మిత్రులెవరో, ఇతరులెవరో ఇట్టే తేలిపోతూ ఉంటుంది. దాచుకోలేనంతగా బైటపడిపోతుంటారు. ఏది సరైన భావనో, వైఖరో నిర్ధారణ అవుతుంటుంది. ఈ క్రమంలో విరసం కూడా తన అవగాహనను, ఆచరణను నిరంతరం మెరుగులు దిద్దుకుంటోంది. ఇది భావజాల రంగంలో వర్గపోరాట రూపం. విప్లవోద్యమ సాంస్కృతిక ప్రతినిధిగా విరసం ఈ పోరాటంలో అనేక వాద వివాదాల మధ్య రాటుదేలుతూ విప్లవానికి దోహదం చేసే చర్చల్లో క్రియాశీలంగా ఉంటోంది. అన్ ప్రొడక్టివ్ చర్చలకు దూరంగా ఉంటోంది. శరత్ చంద్ర రచనలనుబట్టే ఆయనకు విప్లవోద్యమ గతం ఉందని తెలుస్తోంది. వర్తమాన ప్రజా జీవితం లేనివాళ్లతో, అందునా సొంత అభిప్రాయాలుగా ప్రకటించుకునే వాళ్లతో వాదనకు దిగడం మంచి పద్ధతి కాదు. పైగా అలాంటి వాటికి సత్యాన్ని, చరిత్రను తారుమారు చేసే శక్తి ఏమీ ఉండదు.

అందువల్ల ఆయన రచనలను పట్టించుకోలేదు. పైగా సంస్థగా విరసం ముందు అనేక సాహిత్య, భావజాల, రాజకీయ కర్తవ్యాలు ఎప్పుడూ ఉంటాయి. గత కొద్దికాలంగా తీవ్రమవుతున్న అణచివేత, నిర్బంధం సరేసరి. ఇప్పుడది మరిన్ని కొత్త రూపాల్లో పెరిగిపోయింది. లోకంలో ఎందరో రచయితలు ఉంటారు. శరత్ చంద్రలాగా వారందరికీ ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి. కానీ విప్లవాభిప్రాయాలు, విశ్వాసాలు ఉన్నందుకు సహజంగానే విరసం నిత్యం కత్తుల బోను మధ్య జీవించాల్సి వస్తోంది. రాజ్య వ్యతిరేకత, ఆధిపత్య వ్యవస్థల వ్యతిరేకత, మానవజాతి తన భవిష్యతను నిర్మించుకోడానికి సాగిస్తున్న అచంచల ప్రజా ఆచరణను సొంతం చేసుకోవడం విరసం బలం. కాబట్టి సాంస్కృతిక ఆచరణలో విప్లవోద్యమాన్ని, విరసాన్ని వేరు చేసి ఒక దాన్ని మెచ్చుకుంటూ మరోదాని మీద దాడి చేసే వ్యూహాన్ని ఎవరు పాటించినా దాని ఉద్దేశం గ్రహించడం తేలికే. అది అత్యంత ప్రమాదకరం. అభిప్రాయాల్లో, వైఖరుల్లో, సాంస్కృతిక ఆచరణలో విప్లవోద్యమానికి, విరసానికి మధ్య తేడా ఉండదు. ఏ దాపరికం లేకుండా ఎప్పుడూ చెప్పినట్లే మరోసారి ఈ మాట చెప్పాల్సి వస్తోంది.

విరసం ఆచరణ ఎంత పదునైనదో, పారదర్శకమైనదో పాఠకులకు, విప్లవాభిమానులకు తెలుసు. శరత్ చంద్ర ఆరోపణలతో అవి దెబ్బతినేవి కావు. విప్లవ రచయితల సంఘానిది గాజుమేడ జీవితం కాదు. వేలాది మంది ప్రజల బలిదానాలతో, లక్షలాది మంది కఠోరమైన ఆచరణతో భావజాలపరంగా ముడిపడిన సంస్థ. సాహిత్యంలో వర్గపోరాట సంస్థ అయిన విరసానికి శరత్ చంద్ర రాతల వల్ల ఏ నష్టం ఉండదు. నిజంగానే విప్లవ సాహిత్యోద్యమానికి మేలు చేద్దామనుకుంటే ఆయన విమర్శలు నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా ఉండాలి. కానీ ఆయన చర్చిస్తున్న పద్దతినిబట్టే ఆయన ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది.

కాబట్టి ఆయన రాస్తున్న విషయాలకు ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన పని లేదు. పైగా ఆయనేమీ విప్లవ సాహిత్యోద్యమం మీద సిద్ధాంత సంబంధమైన చర్చ చేయడం లేదు. కాబట్టి పదే పదే చర్చించాల్సినవి కూడా లేవు. గతంలో కూడా విరసం మీద ఇలాంటి రాతలను ఎన్నో చూశాం. అవి ఏమీ చేయలేకపోయాయి. దీనికి కారణం విరసానికి ఉండే విశ్వసనీయత. విరసం-విప్లవోద్యమ వైఖరులు, ఆచరణ తెలిసిన అసంఖ్యాక ఉద్యమాభిమానులు చుట్టూ ఉండటం, విప్లవోద్యమంలో అంతర్భాగంగా భావజాల సాంస్కృతిక ఉద్యమం కొనసాగుతుండటం మరో ముఖ్య కారణం.

కాకపోతే ఆయన మాటలకు చప్పట్లు కొడుతున్న వాళ్లు కొందరున్నారు. ఆయన వాదనలను మురిపెంగా ఇంకింత ముందుకు తీసికెళుతున్నవాళ్లున్నారు. ఆయన మాటలు విని ఔనా.. అని బుగ్గులు నొక్కుకుంటున్న వాళ్లు ఉన్నారు. శరత్ చంద్ర పోస్టుల అసలు ఉద్దేశం వీళ్లను గుంపు చేయడమే. నిజానికి ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తక్కువే. వాళ్లలో ఎవరైనా ఆలోచించగలవాళ్లు ఉంటే వాళ్లకోసం ఇలా రాయాల్సి వస్తోంది.

వీళ్లతోపాటు తటస్థులు, మిత్రులు ఎందరో ఉన్నారు. శరత్ చంద్ర చెబుతున్న విషయాలను క్రాస్ చెక్ చేసుకొనే అవకాశం లేని వాళ్లు ఉన్నారు. కొత్త తరం ఆలోచనాపరులు ఉన్నారు. ఇలాంటి వాళ్ల కోసమే ఈ ప్రయత్నం. ఇదే అసలు ఉద్దేశం.

శరత్ చంద్ర కొన్ని విషయాలు పదే పదే రాశారు. పాతిక, ముప్పై ఏళ్ల కిందటి నుంచి ఇప్పటి దాకా ఏ సాక్ష్యం, ఆధారం లేని విషయాలను ముందుకు తీసుకొచ్చారు. చివరికి కొందరి వ్యక్తిగత సంభాషణల్లో ఉండిపోయిన వాటిని కూడా బైటికి తీశారు. ఇలాంటి వాటి ఆధారంగా వ్యక్తులను, సంస్థలను లక్ష్యం చేసుకొని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి అనిపించుకోదు. నిజానికి ఆయన అక్కడక్కడా చూపిస్తున్న ఆధారాలు కూడా సత్యం కాదు. వాటికి మరెన్నో వాస్తవ కోణాలు ఎత్తి చూపించవచ్చు. కొన్నిటిని మిస్ లొకేట్ చేసి వాదన కొనసాగించారు. కొన్ని ఘటనలు, సందర్భాలు, వ్యక్తుల మధ్య అసమంజమైన సంబంధాలు కల్పించారు. అంతకు మించి, తనకు తెలుసని చెప్పడం తప్ప మరే ఆధారం చూపలేని వాటిని కూడా తీసుకొచ్చి పెద్ద పెద్ద సూత్రీకరణలు చేశారు. ఈ పద్ధతిని ఏమనుకోవాలి?

వీటికి విరసం సాధికారంగా, వివరాలతో సమాధానం చెప్పగలదు. దాని వల్ల విప్లవ సాహిత్యోద్యమానికి ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లకుండా ఆయన నిందలు, ఆరోపణల మీద అంశాల వారిగా మాట్లాడితే సరిపోతుంది.

అకాడమీలకు, పాత కాలంలోని రాజుల సాహిత్య కళా పోషణకు సారంలో పెద్ద తేడా లేదు. భాషా కళా సాహిత్యాలను ప్రజలు, ప్రజాపోరాటాలు మాత్రమే ఉన్నతీకరించగలవు. పాత రోజుల్లో కూడా రాజాశ్రయానికి బయటే గొప్ప సాహిత్య వ్యక్తీకరణలను చూస్తాం. ఆధునిక యుగంలో కూడా వర్గపోరాటాలు, ప్రజాస్వామిక పోరాటాలే సాహిత్యంలో మానవీయమైన, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాయి. అకాడమీలు వందల పుస్తకాలు అచ్చేసి ఉండవచ్చు. అవేవీ సాహిత్య స్వరూప స్వభావాలను ప్రభావితం చేయలేదు. ప్రజా ఆకాంక్షలను అంటి పెట్టుకున్న సాహిత్యోద్యమాలే ఆ పని చేస్తున్నాయి.

అకాడమీల దగ్గర ఉన్న డబ్బు ప్రజలదే కాబట్టి అవి చేసే పనులను ఎందుకు తప్పుపట్టాలనే వాళ్లున్నారు. ప్రజల సొమ్ము కాబట్టి అవార్డుల రూపంలో అకాడమీల నుంచి తీసుకోవడం తప్పెలా అవుతుందనే వాళ్లున్నారు. అకాడమీల్లో అభ్యుదయ భావాలు ఉన్న వాళ్లు చేరకపోతే రియాక్షనరీ, మత శక్తులు తిష్టవేస్తాయని, ప్రతీఘాతుక పనులకు అకాడమీలు కేంద్రంగా మారుతాయని అనే వాళ్లూ ఉన్నారు.

ఇవన్నీ స్వయం సమర్థనలే. ఈ విషయంలో తెలుగు సాహిత్యకారులతో మొదటి నుంచీ విరసం విభేదిస్తోంది. ఘర్షణ పడుతోంది. అకాడమీల కార్యకమాలకు దూరంగా ఉంటోంది. ఇలా అన్నిటికీ దూరమైతే ప్రజలకు, పాఠకులకు దూరమైపోతాం గదా అనే వాదన చేసే వాళ్లున్నారు. దీన్ని విరసం అంగీకరించదు. పాఠకులకు చేరువ కావడానికి ఇప్పటికి ఉన్న మార్గాలు మూసుకపోతే కొత్త మార్గాలు వెతుక్కోవాల్సిందే. అంతేగాని అకాడమీల వెంట పోవడం వల్ల సాహిత్యం, సాహిత్యకారుల క్రియాశీలత మొద్దుబారుతుంది. నిజంగానే ప్రజలతో దూరం పెరుగుతుంది. అకాడమీలతో కలిసి మిగతా సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు ఎప్పుడైనా సమాచార లోపం వల్ల హాజరయ్యేందుకు విరసం సభ్యులు అంగీకరించినా, విషయం తెలియగానే విరమించుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇక తానా, ఆటా లాంటి ప్రవాసాంధ్ర సంస్థల గురించి. విరసం వీటికి మొదటి నుంచి దూరంగా ఉంటోంది. రాజ్య పోషణలాంటిదే ప్రవాసాంధ్ర సంస్థల సాహిత్య పోషణ. ఈ మాట విదేశాల్లో ఉండే సాహిత్యకారులను ఉద్దేశించి అంటున్నది కాదు. వాళ్లు నిజంగానే అక్కడా, ఇక్కడా రాజ్యాన్ని, ఆధిపత్య ధోరణులను ప్రశ్నిస్తూ సాహిత్య సృజన చేస్తోంటే వాళ్లతో ఎవరికైనా పేచీ ఉండాల్సిన పని లేదు.

వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకులుగా మొదలైన కథా సీరీస్ కు విరసానికి ఎప్పుడూ ఏ సంబంధం లేదు. ఆరంభంలో ఎప్పుడైనా కథ సీరిస్ ఆవిష్కరణ సభల్లో విరసం సభ్యులు పాల్గొనేవాళ్లు. అప్పుడు కూడా ʹమంచిʹ కథ అనే వాళ్ల ప్రమాణాన్ని విరసం చర్చించేది. మంచి కథ అంటే ఏమిటి? అని. దేనికంటే వాళ్లు ఈ ప్రమాణంతో ప్రగతిశీల కథలను ఎంపిక చేస్తూ వీటికి భిన్నమైన కథలకు కూడా చోటు ఇచ్చినప్పుడు ఆ ʹమంచిʹ గురించి విరసం సభ్యులు వాళ్ల సభల్లోనే సీరియస్ గా చర్చించేవారు. ఆ సంపుటాల సమీక్షల్లో కూడా రాశారు. ఈ ʹమంచిʹని శిల్పంలో చూసి, ʹకొత్తదనంʹలో చూసి ప్రొమోట్ చేయడం సాహిత్య దృక్పథానికే విరుద్ధం. కథ అయితే చాలని, కొత్తదనం ఉంటే చాలనే ధోరణి తెలుగు కథకుల్లో కెరీరిజం పెరగడానికి కారణమైంది. ఇప్పుడు తెలుగు సాహిత్యరంగంలోని చాలా జాడ్యాలకు ఇదీ ఒక కారణం. అసలు వస్తువును, శిల్పాన్ని, దృక్పథాన్ని వేర్వేరుగా చూసి సాహిత్యంలో ʹమంచిʹని, కొత్తదనాన్ని వెదికే ధోరణిని విరసం తీవ్రంగా విమర్శిస్తూ వచ్చింది. ఇది పూర్తిగా సాహిత్య సిద్ధాంత అవగాహనకు సంబంధించింది. ఏ ధోరణికైనా దూరంగా ఉండటం మాత్రమే కాదు, దాన్ని కొంచెం సిద్ధాంత తలానికి తీసికెళ్లి ఘర్షించాలి. విరసం అన్ని సందర్భాల్లో, అందరి విషయాల్లో ఇలాగే చేస్తోంది.

బహుశా 2003 నుంచి అనుకుంటా.. కథా సీరీస్ తానా ఆర్థిక సాయం తీసుకోవడం మొదలు పెట్టింది. లిబర్టీ స్టాచ్యూ బొమ్మ అచ్చేసేవారు. దీన్ని విరసం సీరియస్ గానే చర్చించింది. బహిరంగంగానే అనేక సభల్లో మాట్లాడింది. చాలా చోట్ల రాసింది. ఎవరైనా అమెరికాలో ఉన్న సాహిత్య మిత్రుల నుంచి ఆర్థిక సాయం తీసుకోడానికి, తానా డబ్బు తీసుకోడానికి తేడా ఉంటుంది. అప్పటి నుంచి విరసం సభ్యులు కథలు ఇవ్వడం లేదు. ఇది వైఖరిని చెప్పే ఆచరణాత్మక అంశం. విరసం లాంటి సంస్థలు నిజానికి అచ్చయిన రచన మీద పేటెంట్ హక్కును ప్రకటించుకోవు. రచనను ఆస్తిగా భావించి తగాదాలకు దిగవు. ఇది అన్నిటికంటే ప్రమాదకర ధోరణి. ఏ విషయంలో అయినా ఆలోచనాపరమైన చర్చ వల్లనే మేలు జరుగుతుంది.

ఇక ప్రజాస్వామిక రచయిత్రులు వేదిక సందర్భంలో శరత్ చంద్ర విరసం గురించి చాలా రాశారు. తెలుగులో ఎన్నో సాహిత్య కళా మేధో బృందాలు, వేదికలు, సంఘాలు పని చేస్తున్నాయి. ఇందులో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కూడా ఒకటి. అది విరసానికి అనుబంధ సంస్థ అనడం అబద్ధమే కాదు, దుర్మార్గం. మామూలుగా పోలీసులు దానికి ఇది అనుబంధం, దీనికి అది అనుబంధం అంటుంటారు. ఆ మధ్య తెలంగాణలో 23 ప్రజాసంఘాలను జాబితా వేసి ఇవన్నీ మావోయిస్టుపార్టీ అనుబంధ సంఘాలని, అవి నిషేధితం అని పోలీసులు ప్రకటించారు. కార్యకర్తగా అలాంటి వాటికి వ్యతిరేకంగా తలమునకలై ఉన్న సమయంలో విరసానికి ప్రరవే అనుబంధం అనే శరత్ చంద్ర మాట వినిపించింది. నాకెందుకో ఆ కంఠస్వరమే వినిపించింది. అసలు కొందరు మహిళలు కలిసి ఒక వేదిక పెట్టుకుంటే దాని వెనుక ఎవరో పురుషులు ఉన్నారని, వాళ్లే దాన్ని నడిపిస్తున్నారని అనడం ఎంత పితృస్వామికం? ఆ మహిళలు ఎవరైనా కావచ్చు, వాళ్ల అభిప్రాయాలు ఏవైనా కావచ్చు. వాటిని చర్చించాల్సిందేగాని వాళ్ల వ్యక్తిత్వాన్ని ఇలా తక్కువ చేయవచ్చా?

ప్రరవే అనే కాదు, అలాంటి సంస్థల వల్ల సమాజానికి అవసరమైన కొన్ని పనులు జరుగుతుంటాయి. కొందరు వ్యక్తులు తమ పరిధిలో విడిగా కృషి చేస్తుంటారు. దాని వల్ల కొన్ని పనులు అవుతుంటాయి. వాళ్ల అవగాహన సరిగా లేకపోతే నష్టం కూడా జరగవచ్చు. ఆ సంగతి చెప్పడానికి వెనుకాడాల్సిన పని లేదు. ఈ విషయంలో వాళ్లు పాటించే పద్ధతులు, విలువలనుబట్టే ఇతరులకు సంబంధాలు ఉంటాయి. విరసానికి ప్రరవేతో సహా మిగతా అన్ని సాహిత్య బృందాలతో, వేదికలతో ఇలాంటి సంబంధాలే ఉన్నాయి. గతంలో సాహిత్య రంగంలో ప్రజానుకూల ప్రాతిపదిక మీద విరసం ఎన్నో వేదికలను ఏర్పాటు చేసింది. మరెన్నో వేదికల్లో కలిసి పని చేసింది. ఇంతకు మించి ప్రరవేతోగాని, మరే సాహిత్య సంస్థతో తనకు సంబంధాలు ఉంటే ఆ సంగతి విరసం చెప్పుకోగలదు. నిర్దిష్టంగా ప్రరవే ప్రస్తావన శరత్ చంద్ర చేస్తున్నారు కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వస్తోంది.

నిజానికి ప్రజాస్వామిక శక్తుల అవగాహనల్లో ఎన్ని పరిమితులైనా, ప్రత్యేకతలైనా ఉండవచ్చు. అవన్నీ తమ పరిధిలో పని చేయాల్సిన సమయం ఇది. ప్రరవే ఆరంభ సమావేశం వైజాగ్ లో జరిగినప్పుడు విరసం మహిళా సభ్యులు అందులో పాల్గొన్నారు. అప్పటికి దానికి ఆ పేరు కూడా లేదు. ఆ తర్వాత ఒకరిద్దరు ఆ నిర్మాణంలో సభ్యులయ్యారు. ఇలాంటి వాటిని చూపి ఆ సంస్థ విరసానికి అనుబంధమని అనడం, ఆ సభ్యులు విప్లవాన్ని వదిలేసుకొని అందులోకి వెళ్లిపోయారని అనడం, అసలు విరసమే తన స్వభావాన్ని వదులుకొని ప్రరవేగా మారిందని అనడం శరత్ చంద్ర ఆరోపణ మాత్రమే. ఇది ఆయన వ్యూహంలో భాగం. అసలు ప్రరవే సంఘం కాదు. ఒక వేదిక.

నిజానికి ఈ యాభై ఏళ్లలో విరసం సభ్యులు తెలుగు ప్రాంతాల్లో, దేశస్థాయిలో అనేక రకాల ప్రజాస్వామ్య వేదికల్లో ఆయా కాలాల్లో పని చేశారు. సంస్థగానే కొన్ని వేదికల్లో భాగమైంది. ఆ వేదికలేవీ విప్లవ లక్ష్యం ఉన్నవి కాదు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రజాస్వామిక శక్తుల ఆధ్వర్యంలో పని చేసే వేదికలు. ఆ వేదికల్లో ఉన్న వాళ్లు స్థూలంగా ప్రజల గురించి ఆలోచించే వాళ్లు. అలాంటి వాళ్లతో తన వర్గపోరాట దృక్పథంలో భాగంగానే కలిసి పని చేయడం విప్లవోద్యమ విధానం. దాన్నే విరసం కొనసాగిస్తోంది. అంత మాత్రాన విరసం స్వభావం మారిపోయినట్లు కాదు.
ప్రరవే సహా తెలుగులో ఉన్న కొన్ని సాహిత్య కళా సంస్థలు, కథా సీరీస్ వంటి ప్రచురణ సంస్థలు, ప్రగతిశీల పత్రికలు విప్లవాన్ని లక్ష్యంగా ప్రకటించుకోలేదు. అయినా కొన్ని సమస్యల మీద విరసం వాళ్లతో కలిసి పని చేస్తోంది. ప్రజా ఆచరణలో ఉన్న వాళ్లకు నానాటికీ తీవ్రమవుతున్న రాజ్యహింస, హిందుత్వ, సామ్రాజ్యవాద దోపిడీ, పితృస్వామ్యం, అగ్రకులతత్వం వంటి విపత్తులు సహజంగానే ముఖ్యమవుతాయి. విరసంలాంటి సంస్థలు ఈ ఉమ్మడి క్షేత్రంలో కామన్ ఇష్యూస్ మీద పని చేయాలి.

ఈ పని చేయడమంటే విరసం తన దృక్పథాన్ని పలుచన చేసుకోవడం కాదు. నిజానికి ఇప్పుడు విప్లవాన్ని కోరుకొనే వాళ్లంతా మారిన పరిస్థితుల్లో వర్గపోరాట రాజకీయాలను బలంగా ప్రచారం చేయాలి. కామన్ ఇష్యూలో కనిష్ట స్థాయి నుంచి కలిసి రాగల వాళ్లందరితో పని చేయడానికి సిద్ధం కావాలి. కామన్ ఎనిమీ ఉన్నాడని అనుకుంటే ఒక రకమైన వైఖరి తీసుకుంటాం. ఇతరులందరూ మనకు శతృవులే అనుకున్నప్పుడు మరో వైఖరి తీసుకుంటారు. ఉమ్మడి క్షేత్రం గురించి తెలిసి ఉండటం దీనికి తొలి షరతు. ఇది సిద్ధాంత విషయమే కాదు. ఆచరణకు సంబంధించింది. ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. విరసం ఆచరణ మీద అనేక అనుమానాలకు దారి తీసేలా శరత్ చంద్ర రాశారు. అవి చదివినంత మాత్రాన విప్లవాభిమానులకు విరసం మీద అనుమానం ఏమీ కలగదు. కానీ మరోసారి ఇలా ఈ విప్లవోద్యమ వైఖరిని గుర్తు చేసే అవకాశం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. అంత మాత్రాన ఇది ఒట్టి ఐక్యతే కాదు. ఘర్షణ కూడా ఉంటుంది. ఇతరులతో అవసరమైన ఘర్షణ పడటానికి సిద్ధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇది విప్లవోద్యమ విధానం. దీన్నే విరసం సాహిత్య రంగంలో అనుసరిస్తోంది. ఈ పనులు సరే, విప్లవోద్యమం కోసం పని చేయడం అసలు కర్తవ్యం. విరసం ఉన్నది దాని కోసమే.

సాహిత్యరంగంలో పోలీస్ ఏజెంట్లు, రాజాశ్రయంలో ఉన్న వాళ్లు, అవార్డులు తీసుకునేవాళ్లు, అకాడమీల్లో ఉంటున్న వాళ్లు.. ఇలా ఎందరో మన చుట్టూ ఉంటారు. అందరూ ఒకటి కాదు. అందరూ ఒకటే అనడానికి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఏ లక్ష్యం ఉండక్కర్లేదు. మొరటుదనం చాలు. వీళ్లలో కొందరితో పూర్తి ఘర్షణే ఉంటుంది. అక్కడ ఐక్యతకు చోటు లేదు. అయితే సాల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్, విప్లవ రచయితలు, మేధావుల అరెస్టు, సామాజిక దుర్మార్గాలు జరిగినప్పుడు ఎందరో తెలుగు రచయితలు, కళాకారులు, మేధావులు కలిసి వచ్చారు. అనేకసార్లు సంతకాల సేకరణ దగ్గరి నుంచి ఏదో ఒక స్థాయిలో సభల్లో, ఆందోళనా కార్యక్రమాల్లో కూడా భాగమయ్యారు. కలిసి పని చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమోదనీయమైన ఆలోచనలు ఉన్న ఇతరుల పుస్తకాలకు విరసం సభ్యులు ముందుమాట రాస్తుంటారు. తమ పుస్తకాలకు రాయించుకుంటున్నారు. ఈ మొత్తానికి ఐక్యత ఘర్షణ ఐక్యతే ప్రాతిపదిక.

అస్తిత్వవాదాలకు విరసం లొంగిపోయిందని శరత్ చంద్ర మరో ఆరోపణ. అస్తిత్వవాదుల్లో ముఖ్యులే ఎన్జీవోల్లోకి వెళ్లిపోవడాన్ని, బూర్జువా పార్లమెంటరీ మార్గంలో కూరకపోవడాన్ని విరసం చాలా తొలి రోజుల్లోనే గుర్తించింది. వాటితో ఉన్న పేచీల్లో ఇవి ప్రధానమైనవి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీల ఏర్పాటు, వాటి పాత్ర విప్లవోద్యమం చాలా దశాబ్దాల కిందే గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టు ఆర్థిక, సాంస్కృతిక సిద్ధాంతకారులు చాలా వివరంగా చెప్పారు. స్త్రీవాద శిబిరంగా పూర్తి దెబ్బతినిపోవడానికి ఎన్టీవో భావజాలం ఒక కారణం. అందుకే వాళ్లలో కొందరికి మొదటి నుంచీ వర్గపోరామన్నా, పోరాట సంస్థలన్నా, మిలిటెంట్ పోరాట రూపాలన్నా వ్యతిరేకత ఉండేది. ఎన్జీవోల పాత్ర తెలిస్తే వాటి మీద వర్గపోరాట విమర్శ ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈ విషయంలో విప్లవోద్యమానికి ఏ సందేహాలూ లేవు. వివరాలు అక్కర్లేదు కాని ఒక్క ఉదాహరణే చెబుతాను. ఎన్జీవోల భాగస్వామ్యంతో వరల్డ్ సోషల్ ఫోరం హంగామా నడిచినప్పుడు విప్లవ, ప్రగతిశీల శక్తులు కలిసి ముంబై రెసిస్టెన్స్ నిర్వహించాయి. అందులో విరసానిది క్రియాశీల పాత్ర. ఆచరణాత్మకంగా ఉండటమంటే అదీ..

అస్తిత్వవాదాల పరిమితులను విమర్శిస్తూనే సాంఘిక విముక్తి భావనను అవి ముందుకు తీసుకొచ్చాయని విరసం, విప్లవోద్యమం భావిస్తున్నాయి. అలాంటి విషయాల్లో సమాజంలో సున్నితత్వం పెరగడానికి అస్తిత్వవాదాలు దోహదం చేశాయి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ప్రమాదం ఇంతగా పెరిగిపోయినప్పుడు సాంఘిక విముక్తి దిశగా ఆలోచించే పీడిత అస్తిత్వ శక్తులు, వర్గపోరాటశక్తులు కలిసి పని చేయాలి. ఇదే సరైన ఐక్య కార్యాచరణ విధానం. విప్లవానికి ఇది అత్యవసరం. అస్తిత్వవాదాలకు విరసం లొంగిపోయిందని చెప్పదల్చుకుంటే శరత్ చంద్ర సిద్ధాంత చర్చ చేయవలసి ఉంటుంది. సాంఘిక అస్తిత్వాల విషయంలో మార్కిస్టు విశ్లేషణకు సంబంధించిన విషయం ఇది. దాని దగ్గరికి పోకుండా అస్తిత్వవాదాలకు విరసం లొంగిపోయిందని అనడంలో శరత్ చంద్ర ఉద్దేశం ఏమిటి? ఒక వేళ ఈ పద్ధతిలో బ్లాక్ మెయిల్ చేయదల్చుకున్నారా? అనుమానించాల్సి వస్తోంది. అయినా భయపడేది లేదు. దేనికంటే గత ముప్పై ఏళ్లలో బ్లాక్ మెయిల్ చేయడమే ఒక రాజకీయ విధానంగా, వ్యూహంగా ఉన్న శక్తులను ఎన్నిటినో చూశాం. ఎన్జీవోలను ఏమన్నా, బ్రాహ్మణీయ పార్లమెంటరీ విధానాన్ని ఏమన్నా, రాజ్యాంగాన్ని ఏమన్నా దాడులు చేసిన వాళ్లున్నారు. బ్లాక్ మెయిల్ చేసిన వాళ్లున్నారు. అయినా విరసం, విప్లవోద్యమం చెప్పవలసిన మాటే చెప్పాయి. ఇప్పుడు శరత్ చంద్రకు కూడా అదేమాట.

విరసం ఆచరణలో లోటుపాట్లు ఉన్నాయని శరత్ చంద్ర అనుకుంటే, తాను విప్లవాభిమాని అయితే వాటిని సంస్థకు తెలియజేయవచ్చు. విరసం నిరంతరం అలాంటి సూచనలను గౌరవంగా స్వీకరిస్తూనే ఉంది. విరసం గమనంలో వాటి పాత్ర చాలా విలువైనవి. కానీ శరత్ చంద్ర తన రచనలతో పనిచేసే వ్యక్తుల మానసిక, నైతిక సైర్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారా? ఇది నిజమే అయితే ఎన్నటికీ అది నెరవేరదు. విరసం చరిత్ర ఎంతో కొంత తెలిసిన వాళ్లెవరూ ఈ సాహసం చేయలేరు. ప్రజా జీవితంలోనే ఏ విషయాన్నయినా తేల్చుకోగలమని విరసం నమ్మకం. ఆర్గనైజేషన్ డైనమిక్స్ తెలిసి ఉంటే ఏ నిర్మాణమైనా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం సులభమే. నిరంతర వర్తమాన ఆచరణలో ఉన్న వాళ్లకు ఈ విషయాలు తేలిగ్గానే తెలుస్తాయి. సంస్థాగత వైఖరులకు భిన్నంగా విరసం సభ్యులు ప్రవర్తించినప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. లోటుపాట్లను ఎలా చూస్తాం, ఆచరణలో ఎలా దిద్దుబాటు చేస్తామనేవి ఆర్గనైజేషన్ ప్రిన్సిపుల్స్ లో ముఖ్యం. దృక్పథానికి కట్టుబడి, దాన్ని విస్తరించుకుంటూ లక్ష్యం దిశగా సాగిపోవడానికే ఇదంతా. అవగాహన కల్పించడం ద్వారానే సమస్యను పరిష్కరించగలం అని నిర్మాణాత్మకంగా పని చేసే వాళ్లకు అర్థమవుతూ ఉంటుంది. ఇందులో ఉదారవాదం, పెడవాదం అనే రెంటికీ భిన్నంగా ఎలా వ్యవహరించాలో విరసానికి చాలా ఓపిక ఉంది. స్పష్టత, విప్లవ వైఖరి ఉన్నాయి. తప్పులు జరిగితే గుర్తించి సవరించుకొనే వినయం ఉంది. పైగా విప్లవోద్యమంతో ఉండే భావజాల సంబంధం వల్ల అనేక విషయాల్లో నేర్చుకొనే అవకాశం ఉంటుంది.

చివరగా ఒక మాట. తెలుగు సాహిత్య రంగంలో కొంత చీదర ఉన్న మాట నిజం. అయితే అంతా అదే కాదు. తెలుగు సాహిత్యాన్ని తేలిక చేసి మాట్లాడేవాళ్లున్నారు. దాన్ని వాళ్లు విశ్లేషణాత్మకంగా నిరూపించాల్సి ఉంటుంది. మరి కొందరు ఇతర భాషా సాహిత్యాలతో అసమంజసమైన పోటీ తెచ్చి తెలుగు సాహిత్యాన్ని తక్కువ చేస్తుంటారు. అసలు ఏ భాషా సాహిత్యమైనా మొత్తం ప్రపంచంలో భాగంగా తన సమాజ అవసరాలకు తగినట్లు ఉందా? లేదా అనేదే గీటురాయి. దీని కోసం నిరంతరం ఏది ప్రగతి? అనే చర్చ చేసుకుంటూ ఆ దిశగా సాహిత్య సృజన చేయాలి. శక్తివంతమైన సాహిత్య విమర్శ రావాలి. రచయితలు కార్యకర్తల్లాగా ప్రజా ఆందోళనల్లో పాల్గొనాలి.

అయితే ఉత్తమ ప్రమాణాలతో తెలుగులో సాహిత్యం వస్తున్నప్పటికీ రచయితలందరికీ అంత ఉన్నత ప్రమాణాలు లేవు. అవార్డులు, అకాడమీలు, పైరవీలు, రాజాశ్రయాలు, రచనను కెరీర్ గా మార్చుకొనే తప్పుడు ధోరణులు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ సమస్య ఉంది. ఇది తీవ్రమైనది. చీదర ఇంటే ఇదే. భూస్వామ్య సమాజంలోని సాహిత్య జాడ్యాలకు ఇప్పుడు పెటుబడిదారీ జాడ్యాలు బలంగా తోడయ్యాయి. ఇవి మరింత ప్రమాదకరం. ఈ వాతావరణంలో రచన సరుకు అవుతుంది. దాన్ని ప్రమోట్ చేసుకోడానికి రచయితలు కెరీర్ కోసం పాకులాడుతారు. ముఖ్యంగా కొంత మంది రచయితలు తమ గుర్తింపు కోసం ʹక్రియాశీలంʹగా ఉన్నంత ప్రజా జీవితంలో ఉండటం లేదు. వ్యక్తివాదపు చీడ అంటే ఇదే.

అంత మాత్రాన అంతా అయిపోయిందని పోరాటచేవ లేని వాళ్లు మాత్రమే అంటారు. తెలుగు ప్రగతిశీల, విప్లవ సాహిత్యానికి ఇలాంటి వాటిని ఎదుర్కోగల శక్తి, సాహసం, దృక్పథ స్పష్టత, నైపుణ్యం కూడా ఉన్నాయి. నిరంతరం సునిశిత సంవాదంతోనే ఈ పనులు చేయగలం. రూపొందుతున్న సమాజాన్ని, దాని పురోగతిని చిత్రిస్తూ రచన చేయడం ద్వారా కూడా ఈ స్థితిని ఎదుర్కోగలం. అంతకుమించి నేరుగా ఆచరణలో ఎదుర్కోడానికి వ్యవస్థతో, రాజ్యంతో సాహసోపేతంగా తలపడాల్సిందే. ఈ క్రమంలో అక్రమ నిర్బంధాలు ఎదురవుతాయి. అనేక కూటవాదాలు దాడులు చేస్తాయి. వాటిని ఎదుర్కోవాల్సిందే.

వాస్తవానికి ఇది వ్యక్తుల మీది పోరాటం కాదు. వ్యవస్థలోని మార్పులతో ముడిపడిన ధోరణులు సాహిత్య కళారంగాల్లోకీ వస్తున్నాయి. ఆ రకంగా ఇది తప్పుడు భావజాలం మీది పోరాటం. సమస్యను వ్యవస్థతో, ఆచరణతో ముడి పెట్టి చూస్తేనే ఎదుర్కోగలం. బలమైన రాజకీయ శక్తి, లోతైన అంతర్మథనంతో కూడిన నైతిక శక్తి కూడా తెలుగు సాహిత్యరంగానికి ఉన్నాయి. ఇది పూర్తిగా ఆచరణాత్మకం.

అంతేగాని, ఏ వాదనకు నిలవలేని, ఏ మాత్రం సూత్రబద్ధం కాని పద్ధతుల వల్ల ఎవ్వరూ ఏమీ సాధించలేరు. శరత్ చంద్ర తెలుగు సాహిత్యరంగంలోని చాలా మంది వ్యక్తుల మీద ఇలా రాశారు. వ్యక్తిగత విషయాలూ రాశారు. సాహిత్యం ఆలోచనా రంగం. సునిశితమైన పరిశీలనా దృష్టితో సంయమనంతో వ్యవహరించాలి. శాస్త్రీయ విమర్శ పద్ధతులను పాటించాలి. శరత్ చంద్ర ఎలా రాసినా ఆయనతో కూడా హుందాగా మాట్లాడాల్సిందే. దాన్ని తాను పాటిస్తున్నదీ లేనిదీ ఆయనే పరిశీలించుకోవాలి. తన రాతల వల్ల సాహిత్యరంగానికి మేలు చేస్తున్నానని నమ్మకం ఆయనకు ఉండొచ్చు. కానీ ఆయన రాతల్లో ఆ ఛాయలేవీ లేవని తెలిసిపోతూ ఉన్నది. అంతగా బయటపడేలా ఆయన రాస్తున్నారు. ఇలా రాయడం వల్ల ప్రయోజనం ఏమిటో ఆలోచించుకోవాలి.

No. of visitors : 1428
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •