లెనిన్-లెనినిజం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

లెనిన్-లెనినిజం

- మడ్కం విజయ్ | 21.04.2020 11:26:59pm

లెనిన్ 150వ జయంతి సందర్భంగా

మార్క్స్, ఏంగెల్స్ ల తర్వాత లెనిన్ మొత్తంగా ప్రపంచంలోని శ్రామిక ప్రజలకు, పీడిత జాతులకు గొప్ప విప్లవ మహోపాధ్యాయుడు. సామ్రాజ్యవాద యుగపు చారిత్రక పరిస్థితులలో, సోషలిస్టు విప్లవ జ్వాలల నడుమ లెనిన్, మార్క్స్ ఏంగెల్స్ ల విప్లవ బోధనలను వారసత్వంగా స్వీకరించారు. వాటిని దృఢంగా పరిరక్షించారు. వాటిని సృజనాత్మకంగా అన్వయించి అభివృద్ధి పరిచారు. సామ్రాజ్యవాదం, కార్మికవర్గ విప్లవాల శకానికి సంబంధించిన మార్క్సిజమే లెనినిజం.

ఆయన మార్క్సిజం మౌలిక సూత్రాలను సామ్రాజ్యవాద యుగపు తొలిదశలో రష్యా విప్లవం, ప్రపంచ కార్మిక విప్లవాల నిర్దిష్ట ఆచరణకు సృజనాత్మకంగా అన్వయించారు. కామ్రేడ్ స్టాలిన్ లెనినిజాన్ని ఇలా సంక్షిప్తంగా క్రోడీకరించి చెప్పారు: ʹసామ్రాజ్యవాదం, కార్మికవర్గ విప్లవాల యుగానికి సంబంధించిన మార్క్సిజమేʹ లెనినిజం. స్టాలిన్ లెనినిజం యొక్క విశిష్ట లక్షణాలకు రెండు కారణాలను పేర్కొన్నారు : "..... మొదటిది, లెనినిజం కార్మికవర్గ విప్లవం నుండి ఆవిర్భవించిందన్న వాస్తవం. దాని ముద్ర లెనినిజం పైన ఉండకుండా ఉండజాలదు. రెండవది, అది వృద్ధి చెందింది, బలమైనదిగా పెంపొందింది రెండవ ఇంటర్నేషనల్ అవకాశవాదంతో జరిపిన పోరాటాలలో నుండే.ʹ

మార్క్సిజంలోని మూడు అంతర్భాగాలను సుసంపన్నం చేసే గొప్ప చేర్పులను కా. లెనిన్ చేశారు. కార్మికవర్గ పార్టీ, విప్లవ హింస, రాజ్యం, కార్మికవర్గ నియంతృత్వం, సామ్రాజ్యవాదం, రైతు సమస్య, మహిళా సమస్య, జాతుల సమస్య, ప్రపంచ యుద్ధం, వర్గపోరాటంలో కార్మికవర్గ ఎత్తుగడలు అనే అంశాలకు సంబంధించి మన అవగాహనను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. కామ్రేడ్ లెనిన్ సిద్ధాంత రచనలు, మార్క్స్ యొక్క గతితార్కిక పద్ధతిని అన్వయిస్తూ ఇంచుమించుగా సమస్త విషయాలను తడుముతాయి.

ఏంగెల్స్ తర్వాత నుండి తన కాలం వరకు జరిగిన అత్యంత ముఖ్యమైన శాస్త్ర విజ్ఞాన విజయాలను భౌతికవాద తత్వశాస్త్రపు ప్రాతిపదికపైన సాధారణీకరించే అత్యంత గురుతరమైన కర్తవ్యాన్ని లెనిన్ చేపట్టారు. అంతేకాదు, ఆ కాలంలోనే ఆయన మార్క్సిస్టులలోని భౌతికవాద వ్యతిరేక ధోరణుల పట్ల సమగ్రమైన విమర్శను సాగించారు. అనుభవవాద విమర్శపై ఆయన సాగించిన సుప్రసిద్ధమైన విమర్శ తత్వశాస్త్రంలో ముందుకొచ్చిన రివిజనిస్టు ధోరణికి వ్యతిరేకంగా సాగించినది, అది మౌలికంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్న గ్రంథం. ఆనాటి నుండి అది నేటి వరకు ఆధునిక బూరువా తత్వశాస్త్ర ధోరణుల పట్ల మార్క్సిస్టు విమర్శగా ఉపయోగపడుతూనే ఉంది. ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలపై ఆధారపడిన ʹనూతనʹ తాత్విక ధోరణుల పేరిట మార్క్సిజంపైన జరిగిన దాడిని ఆయన తాత్విక రంగంలోని వర్గపోరాటపు ప్రతిఫలనంగా పరిగణించారు. ఈ ʹనూతనʹ తాత్విక సిద్ధాంతాలు బర్క్ లీ, హ్యూమ్ ల పాత స్వీయాత్మక భావవాదం కంటే ఏ విధంగానూ భిన్నమైనవి కావని ఆయన నిరూపించారు. ఈ విధంగా లెనిన్, తత్వశాస్త్ర రంగంలో మార్క్సిజంపై జరిగిన దాడిని అత్యంత సమర్థవంతంగా ఓడించారు. ఆ క్రమంలో ఆయన మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని సృజనాత్మకంగా అభివృద్ధి పరిచారు.

లెనిన్, మార్క్సిస్టు ప్రతిఫలన సిద్ధాంతాన్ని సృజనాత్మకమైన రీతిలో అభివృద్ధిపరిచారు. ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణల పైన ఆధారపడి ఆయన పదార్థానికి ప్రతిఫలించే లక్షణం ఉందనీ, చైతన్యమంటే అత్యున్నత రూపంలో మెదడులో జరిగిన పదార్థ ప్రతిఫలనమేననీ వివరించారు. లెనిన్ అభివృద్ధిపరిచిన ఈ పదార్థ ప్రతిఫలన సిద్ధాంతం, పదార్థానికి ఆయన ఇచ్చిన నిర్వచనం మార్క్సిస్టు తాత్విక భౌతికవాదపు పునాదులను మరింతగా పటిష్టం చేశాయి. వాటిని ఏ రూపంలోని భావవాద దాడులకు చెక్కు చెదరని విధంగా నిలిపాయి. విప్లవకర గతితర్కాన్ని లెనిన్ మరింతగా ముందుకు తీసుకుపోయారు. ప్రత్యేకించి ఆయన వైరుధ్యాలను లోతుగా అధ్యయనం చేశారు. వైరుధ్యాన్ని ఆయన ʹగతితర్కానికి అంతస్సారంʹగా పేర్కొన్నారు. ʹఒకటి, విభజితం కావడమూ దానికి సంబంధించిన విరుద్ధ భాగాల జ్ఞానమే వైరుధ్యాల అంతస్సారంʹ అని ఆయన అంటారు. ʹగతితర్కాన్ని క్లుప్తంగా విరుద్దాంశాల ఐక్యతకు సంబంధించిన సిద్ధాంతంగా నిర్వచించవచ్చుʹ అని ఆయన నొక్కి చెప్పారు.

లెనిన్ రాజకీయ అర్థశాస్త్రానికి కొన్ని అతి గొప్ప చేర్పులను చేశారు. మార్క్స్, ఏంగెల్స్ లు పెట్టుబడిదారీ విధానం స్వేచ్చాయుత పోటీ దశలో ఉండినప్పుడు దానికి సంబంధించిన వివిధ అంశాలను వెల్లడి చేసి దాని పోకడలను, భవిష్యత్తు దిశను సూచించారు. ఆనాటికి పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అయిన సామ్రాజ్యవాదం ఇంకా వికసించనందున దానిని విశ్లేషించడం వారికి సాధ్యం కానిది. లెనిన్ మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రాన్ని మరింతగా అభివృద్ధిపరిచి సామ్రాజ్యవాదపు ఆర్థిక రాజకీయ అంతస్సారాన్ని విశ్లేషించారు.

మార్క్సిజానికి లెనిన్ చేసిన గొప్ప చేర్పయిన సామ్రాజ్యవాదం గురించిన అద్భుతమైన విశ్లేషణలో కామ్రేడ్ లెనిన్ పెట్టుబడిదారీ విధానం దాని గుత్త పెట్టుబడిదారీ పూర్వదశ నుండి గుత్తాధిపత్య దశకు పరివర్తన చెందడాన్ని గురించి, పెట్టుబడిదారీ విధానపు ఈ అత్యున్నత దశ ఎలా యుద్ధాలకు, విప్లవాలకు జన్మనిస్తుంది అనే దాన్ని గురించి శాస్త్రీయంగా వివరించారు. సామ్రాజ్యవాద యుద్ధం సామ్రాజ్యవాద రాజకీయాల కొనసాగింపేనని ఆయన ఎత్తి చూపారు. సామ్రాజ్యవాదులు ప్రపంచ మార్కెట్ కోసం, ముడిపదార్థాల వనరుల కోసం, పెట్టుబడి మదుపులకు రంగాల కోసం ఎన్నటికీ తీరని దురాశతో కుమ్ములాడుతారు. ప్రపంచాన్ని పునర్విభజించుకోవడం కోసం ప్రపంచ యుద్ధాలకు దిగుతూనే ఉంటారు. అందువల్ల ఈ ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉనికిలో ఉన్నంత వరకు యుద్ధానికి అవకాశం, వనరు ఉంటూనే ఉంటాయి. ఆయన దాని ప్రజాస్వామ్య భ్రమను పటాపంచలు చేశారు. ʹసామ్రాజ్యవాదం రాజకీయంగా ఎల్లప్పుడూ హింస, అభివృద్ధి నిరోధకత్వాల కోసమే ప్రయత్నిస్తుంది.ʹ

సామ్రాజ్యవాదమంటే గుత్తాధిపత్యం వహించే, పరాన్న బుక్కు లేదా క్షీణిస్తున్న, శిథిలమవుతున్న పెట్టుబడిదారీ విధానమని లెనిన్ నొక్కి చెప్పారు. అది పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిలోని అత్యున్నత, ఆఖరి దశ. అందువల్ల అది కార్మికవర్గ విప్లవపు తొలి సంజ అని చెప్పారు.

కామ్రేడ్ లెనిన్ చేసిన మరొక గొప్ప చేర్పు, దోపిడీ వర్గాల రాజ్య నిర్మాణాన్ని ధ్వంసం చేసి కార్మికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పడానికి సంబంధించినది. రాజ్యం ఎలా ఒక వర్గం మరో వర్గాన్ని అణచివేసేందుకు దోహదపడే సాధనమో, దోపిడీవర్గ రాజ్యాన్ని ఏ విధంగా విప్లవకర హింస ద్వారా మాత్రమే ధ్వంసం చేయగలమో ఆయన వివరించారు. కార్మికవర్గం బూర్జువా రాజ్య యంత్రాంగాన్ని తప్పక ధ్వంసం చేసి తీరాల్సిందేనని, దాని స్థానంలో కార్మికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పవలసిందేనని ఆయన పదే పదే నొక్కి చెప్పారు.

పారిస్ కమ్యూన్, రష్యా విప్లవాల అనుభవాల నుండి గుణపాఠాలను తీస్తూ ఆయన సోవియట్ రూపంలోని ప్రభుత్వం కార్మికవర్గ నియంతృత్వపు అత్యుత్తమ రూపమని కనుగొన్నారు. కార్మికవర్గ నియంతృత్వాన్ని ఆయన కార్మికవర్గానికి, దోపిడీకి గురయ్యే ప్రజాబాహుళ్యంగా ఉండే కార్మికవర్గేతర వర్గాలకు మధ్య, ప్రత్యేకించి రైతాంగానికిమధ్య ఏర్పడే వర్గ కూటమి యొక్క ఒక ప్రత్యేక రూపంగా నిర్వచించారు. ఆ వర్గ కూటమికి నాయకత్వం వహించేది కార్మికవర్గమే. కార్మికవర్గ నియంతృత్వం ఏ విధంగా అత్యున్నత రూపంలోని ప్రజాస్వామ్యమో, కార్మికవర్గ ప్రజాస్వామ్య రూపమో ఆయన వివరించారు. కార్మికవర్గ నియంతృత్వం ప్రజారాశులలోని అత్యధికుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కార్మికవర్గ నియంతృత్వమంటే పాత సమాజపు శక్తులకు, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిరంతరాయమైన పోరాటం – రక్తపాతంతో, రక్తపాతం లేకుండా, హింసాత్మకంగా, శాంతియుతంగా, సైనికంగా, ఆర్థికంగా విద్య పరిపాలనల పరంగా సాగే పోరాటం అని లెనిన్ వివరించారు. అంటే కార్మికవర్గ నియంతృత్వమంటే బూర్జువా వర్గంపైన సార్వత్రికమైన నియంతృత్వమని అర్థం. లెనిన్ ఆలోచనలో కార్మికవర్గ నియంతృత్వానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతటిదో లెక్కగట్టాలంటే ఆయన చేసిన ఈ సుప్రసిద్ధమైన వ్యాఖ్యను చూడాలి : ʹవర్గపోరాటాన్ని గుర్తించడమనేదాన్ని కార్మికవర్గ నియంతృత్వాన్ని గుర్తించడానికి విస్తరింపజేసే వారే మార్క్సిస్టు అవుతారు.ʹ

కార్మికవర్గం చిన్న సరుకుల ఉత్పత్తిని పూర్తిగా పరివర్తన చెందించక పోయినట్లైతే పెట్టుబడిదారీ విధానపు పునరుద్ధరణ ముప్పు ఉంటుందని కూడా లెనిన్ హెచ్చరించారు. లెనిన్ ఇలా అన్నారు : ʹచిన్నతరహా ఉత్పత్తి నిరంతరాయంగా, అనుదినము, గంట గంటకు, స్పాంటేనియస్ గా, భారీ యెత్తున పెట్టుబడిదారీ విధానానికి, బూర్జువా వర్గానికి జన్మనిస్తూనే ఉంటుంది.ʹ

అందువల్లనే లెనిన్ కార్మికవర్గ నియంతృత్వాన్ని నూతన బూర్జువా వర్గం వృద్ధిని నిరోధించడానికి ఆవశ్యకమైనదిగా పేర్కొన్నారు. పైగా పెట్టుబడిదారీ విధానంలోని అసమాన ఆర్థిక రాజకీయ అభివృద్ధి నియమాన్ని ప్రాతిపదికగా చేసుకొని లెనిన్ ఒక ముఖ్యమైన నిర్ధారణ చేశారు. వివిధ దేశాలలో పెట్టుబడిదారీ విధానం అసమానంగా అభివృద్ధి చెందినందున సోషలిజం ముందుగా ఒకటి లేదా కొన్ని దేశాలలో విజయాన్ని సాధిస్తుందనీ, అంతేగానీ అన్ని దేశాలలో ఒకేసారి విజయం సాధించజాలదని ఆయన నిర్ధారించారు. అందువల్ల ఒకటి లేదా కొన్ని దేశాలలో సోషలిజం విజయాన్ని సాధించినప్పటికీ ఇతర పెట్టుబడిదారీ దేశాలు ఇంకా అస్థిత్వంలోనే ఉంటాయి. అవి సోషలిస్టు రాజ్యాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద విద్రోహకర కార్యకలాపాలు తలెత్తడానికి కారణమవుతూనే ఉంటాయి. అందువల్ల ఈ పోరాటం దీర్ఘకాలికమైనదిగా ఉంటుంది. ఈ విషయాన్ని 1969లో చైనా కమ్యూనిస్టు పార్టీ తన సుప్రసిద్ధమైన జూన్ 14 లేఖలో ఇలా అతి వివరంగా చెప్పింది :

ʹఅక్టోబర్ విప్లవం తర్వాత లెనిన్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఎత్తి చూపారు :

a) కూలదోయబడిన దోపిడీదార్లు ఎల్లప్పుడూ తమ చేజారిన ʹస్వరాన్నిʹ తిరిగి సాధించుకోవడం కోసం వేయిన్నొక్క విధాల ప్రయత్నిస్తారు.
b) పెటీబూర్జువా వాతావరణంలో పెట్టుబడిదారీ విధానపు నూతన అంశాలు నిరంతరాయంగా, స్పాంటేనియస్ గా పుట్టుకొస్తూ ఉంటాయి.
c) బూర్జువా వర్గపు ప్రభావం వల్లనూ, సర్వత్రా వ్యాపించి ఉన్న పెటీబూర్జువా ఇతరులను చెడగొట్టే వాతావరణాల ఫలితంగానూ కార్మికవర్గ శ్రేణులలోనుండి, ప్రభుత్వ ఉద్యోగులలో నుండి రాజకీయ దిగజారుడు గాళ్లు, నూతన బూర్జువా శక్తులు తలెత్తవచ్చు.
d) అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానపు చుట్టివేత, సామ్రాజ్యవాదుల సాయుధ జోక్యం, హెచ్చరికలు, శాంతియుతంగా విచ్ఛిన్నం చేయడాన్ని సాధించడానికై వారి విద్రోహ కార్యకలాపాలు - ఇవి సోషలిస్టు దేశం లోపల వర్గపోరాటాన్ని కొనసాగించటానికి బాహ్య పరిస్థితులు.ʹ

సోషలిజం, పెట్టుబడిదారీ విధానాల మధ్య పోరాటం మొత్తంగా ఒక చారిత్రక శకమంతటా ఆవరించి ఉంటుందని చెప్పే ఈ లెనిన్ సిద్ధాంతం సోషలిజం, కమ్యూనిజాలను నిర్మించడానికి సంబంధించిన సిద్ధాంతానికి బ్రహ్మాండమైన చేర్పు.

పార్టీ నిర్మాణానికి సంబంధించిన భావనలో, ఆచరణలో నూతన మార్గాన్ని ఆవిష్కరించిన ఒక గెంతును లెనిన్ తీసుకు వచ్చారు. అది మార్క్సిజం ఆయుధాగారానికి ఒక గొప్ప చేర్పు. కార్మికవర్గం నిజంగా తనదైన స్వంత విప్లవ రాజకీయ పార్టీని ఏర్పరచుకోవడమనేది ప్రాథమిక ప్రాముఖ్యత కలిగిన అంశంగా ఆయన భావించారు. అలాంటి పార్టీ అవకాశవాదంతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న కమ్యూనిస్టు పార్టీయే. కార్మికవర్గ విప్లవాన్ని పూర్తిగా కొనసాగించాలంటే, కార్మికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పి సంఘటితపరచుకోవాలంటే అలాంటి పార్టీ అవసరం. ఆయన పార్టీ యొక్క అవసరాన్ని సుప్రసిద్ధమైన ఈ పదబంధం ద్వారా అద్భుతంగా సంక్షిప్తీకరించారు: ʹకార్మికవర్గం అధికారం కోసం సాగించే పోరాటంలో దానికి నిర్మాణానికి మించిన ఆయుధమేదీ లేదు.ʹ పార్టీ అంటే అత్యున్నత రూపంలోని వర్గ సంస్థనీ, అది ఇతర అన్ని రూపాలలోని ప్రజా నిర్మాణాలకు మార్గ నిర్దేశకత్వం వహిస్తుందనీ, కార్మికవర్గ పార్టీ ద్వారానే కార్మికవర్గ నియంతృత్వాన్ని సాధించగలమని ఆయన సూత్రీకరించారు. అలాంటి పార్టీకి అతి విస్తృతమైన పార్టీ సభ్యత్వపు యంత్రాంగం ఉండి దానికి ప్రొఫెషనల్ విప్లవకారులు అనే సుస్థిర కేంద్రకం (న్యూక్లియస్) ఉండాలి. అలాంటి రాజకీయ పార్టీ ప్రజలతో తప్పనిసరిగా మమేకమై, చరిత్ర నిర్మాణంలో ప్రజలు చూపే సృజనాత్మక చొరవకు గొప్ప ప్రాధాన్యతనివ్వాలి. విప్లవంలోనూ, సోషలిజం, కమ్యూనిజాలను నిర్మించేటప్పుడు కూడా అది ప్రజారాశులపై సన్నిహితంగా ఆధారపడాలి.

జాతుల సమస్య పైన లెనినిస్టు అవగాహన గుణాత్మకంగా ఒక ఉన్నత స్థాయికి చెందినది. ఆయన పీడక జాతి దురహంకారానికి వ్యతిరేకంగానూ, పీడిత జాతి సంకుచిత జాతీయ వాదానికి వ్యతిరేకంగానూ పోరాడారు. ఆయన కార్మికవర్గ పార్టీకి జాతుల సమస్యపైన ఒక సరియైన విధానాన్ని రూపొందించారు. అంటే అన్ని జాతులకు పూర్తి సమానత్వం, జాతులకు విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికార హక్కు, అన్ని జాతుల సమాఖ్య. జాతీయ, వలసల సమస్య అనేది ప్రపంచ కార్మికవర్గ విప్లవపు సాధారణ సమస్యలో ఒక అంతర్గత భాగంగా ఎలా ఉంటుందో ఆయన విడమర్చి చెప్పారు. కామ్రేడ్ లెనిన్ యొక్క జాతుల, వలసల థీసిస్ ప్రకారం పెట్టుబడిదారీ దేశాలలోని కార్మికవర్గ విప్లవోద్యమాలు, వలసలు పరాధీన దేశాలలోని జాతి విముక్తి ఉద్యమాలతో మైత్రిని ఏర్పరచుకోవాలి. ఈ కూటమి, వలసలు సకల పరాధీన దేశాలలోని సామ్రాజ్యవాదుల, భూస్వామ్య, దళారీ ప్రతీఘాతుక శక్తుల కూటమిని కూడా ధ్వంసం చేయగలుగుతుంది. అందువల్ల అది అంతిమంగా సామ్రాజ్యవాద వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా అనివార్యంగానే అంతం చేస్తుంది.

కార్మికవర్గానికి, రైతాంగానికి మధ్య మైత్రి గురించి మార్క్స్, ఏంగెల్స్ భావాలను లెనిన్ సృజనాత్మకంగా అభివృద్ధి పరిచి దానిని ఒక సమగ్రమైన సిద్ధాంతంగా రూపొందించారు. రష్యాలోని బూర్జువా ప్రజాస్వామిక విప్లవంలో కార్మికవర్గం తీవ్ర వామపక్ష, ప్రతిపక్షం పాత్రను మాత్రమే నిర్వహిస్తూ, నాయకత్వ పాత్రను బూర్జువా వర్గానికి అప్పగించాలని, రైతాంగాన్ని ఆ బూర్జువా వర్గం నీడనే ఉంచేయాలని వాదించిన ప్లెఖనోవ్ వంటి మెన్షివిక్కుల పంథాను ఆయన తిరస్కరించారు. లెనిన్ రష్యా విప్లవంలోని ఆ రెండు దశలకు వ్యూహాత్మక పథకాలను ఇలా రూపొందించారు : ʹకార్మికవర్గం రైతాంగ ప్రజారాశులతో కలిసి నిరంకుశత్వపు ప్రతిఘటనను బలప్రయోగంతో అణచివేసి బూర్జువా వర్గ అస్థిరతను నిర్వీర్యం చేసి ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తిగా కొనసాగించి తీరాలి. కార్మికవర్గం జనాభాలోని అర్ధ శ్రామిక శక్తులతో కలిసి బూర్జువావర్గ ప్రతిఘటనను బలప్రయోగం ద్వారా అణచివేసి, రైతాంగపు, పెటీబూర్జువా వర్గ ఆస్థిరతను నిర్వీర్యం చేసి సోషలిస్టు విప్లవాన్ని పరిపూర్తి చేసి తీరాలి.ʹ

సామ్రాజ్యవాద శకంలోని అంతర్జాతీయ, రష్యా అంతర్గత పరిస్థితులను విశ్లేషించి లెనిన్ ఈ విధంగా పూర్తిగా కొత్తదైన ఈ రెండు దశల విప్లవ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. బూర్జువా ప్రజాస్వామిక, కార్మికవర్గ సోషలిస్టు విప్లవాలు రెండూ అవిభాజ్యమైనవి. కార్మికవర్గమే వాటికి నాయకత్వం వహించాలి.

లెనినిజం, బెర్న్ స్టీనియన్ రివిజనిస్టులు, నరోద్నిక్కులు, ఆర్థికవాదులు, మెన్షివిక్కులు, చట్టబద్ద మార్క్సిస్టులు, లిక్విడేటర్లు (పార్టీని రద్దు చేయాలని కోరేవారు), కాట్ స్కెట్లు, ట్రాట్ స్కెట్లు వంటి వివిధ వర్గాల అవకాశవాదులకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా సాగించిన పోరాటం నుండి అభివృద్ధి చెందింది. మార్క్సిజాన్ని ఒక పిడివాదంగా గాక ఆచరణకు మార్గదర్శిగా స్వీకరించి లెనిన్ ఈ ఎత్తుగడలను రూపొందించారు. లెనిన్ రూపొందించిన ఎత్తుగడల నినాదాల విభ్రాంతికరమైన సుస్పష్టత, విప్లవ పథకాల విస్మయకరమైన సాహసం రెండవ ఇంటర్నేషనల్ లోని వామపక్ష శక్తులన్నింటిని, విప్లవ ప్రజారాశులందరినీ బోల్షివిక్కుల పక్షానికి ఆకర్షించాయి.

లెనిన్ రివిజనిస్టులను కార్మికవర్గ ఉద్యమ శ్రేణులలో దాగిన సామ్రాజ్యవాద ఏజెంట్లుగా పరిగణించారు. ʹ....సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, అది గనుక అవకాశవాద వ్యతిరేక పోరాటంతో విడదీయరానిదిగా ముడిపడి ఉండనట్లయితే, అది ఒట్టి బూటకం, దగా.ʹ

మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పలు సోషల్ డెమోక్రటిక్ పార్టీల విద్రోహం కారణంగా రెండవ ఇంటర్నేషనల్ పతనమైంది. ఆ పార్టీలు జాతీయోన్మాద విధానాన్ననుసరించి ʹమాతృభూమి పరిరక్షణʹ విధానాన్ని అనుసరించాయి. యుద్ధం ముగిసిన వెనువెంటనే కామ్రేడ్ లెనిన్ మూడవ ఇంటర్నేషనల్ ను ఏర్పాటు చేశారు. ఆయన దానిని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తివంతమైన అంతర్జాతీయ కార్మికవర్గ ఆయుధంగా మలిచారు.

పెట్టుబడిదారీ విధానం సాపేక్షికంగా శాంతియుతంగా అభివృద్ధి చెందిన యుగానికి సంబంధించిన సిద్ధాంతం మార్క్సిజం కాగా, లెనినిజం సామ్రాజ్యవాదం, కార్మికవర్గ విప్లవాలకు సంబంధించిన సిద్ధాంతం.

లెనినిజం ఆవిర్భవించిన పరిస్థితులను వర్ణిస్తూ, కామ్రేడ్ స్టాలిన్ ఈ విధంగా పేర్కొన్నారు: ʹ పెట్టుబడిదారీ విధానంలోని వైరుధ్యాలు ఒక చివరి అంచుకు చేరినప్పుడు, కార్మికవర్గ విప్లవం ఒక తక్షణమైన ఆచరణాత్మక సమస్యగా మారినప్పుడు, కార్మికవర్గ విప్లవానికి సన్నాహాలు జరిపే పాతకాలం గడచి పెట్టుబడిదారీ విధానం మీద ప్రత్యక్షంగా దాడికి దిగే కాలంగా - నూతన కాలంగా అది పరివర్తన చెందినప్పుడు, సామ్రాజ్యవాద పరిస్థితుల నడుమ లెనినిజం వృద్ధి చెంది, రూపుదిద్దుకుంది. ʹ ʹలెనినిజం ఆంటే సాధారణంగా కార్మికవర్గపు సిద్ధాంతం, ఎత్తుగడలు, ప్రత్యేకించి చెప్పాలంటే కార్మికవర్గ నియంతృత్వం యొక్క సిద్ధాంతం, ఎత్తుగడలు.ʹ

సామ్రాజ్యవాదం- కార్మికవర్గ విప్లవాలపైన, కార్మికవర్గ నియంతృత్వంపైన, యుద్ధం-శాంతిపైన, సోషలిజం, కమ్యూనిజాల పైన లెనిన్ చేసిన బోధనలు ఇప్పటికీ జీవత్వంతో తొణకిసలాడుతూ ఉంటాయి. మార్క్సిజం అనే విజ్ఞానశాస్త్రం మార్క్సిజం-లెనినిజం అనే దాని రెండవ ఉన్నత దశకు ఒక గుణాత్మకమైన గెంతును తీసుకుంది. పెట్టుబడిదారీ విధానపు సామ్రాజ్యవాద దశలో రెండవ ఇంటర్నేషనల్ అవకాశవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నుండి, కార్మికవర్గ విప్లవ క్రమం నుండి మార్క్సిజం-లెనినిజం అనే ఈ గుణాత్మకమైన గెంతు సంభవించింది.

No. of visitors : 990
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

లెనిన్ | 02.12.2019 11:46:32pm

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ......
...ఇంకా చదవండి

లెనిన్

స్టాలిన్ | 21.04.2020 07:47:01pm

లెనిన్ ఓటమి పాలయ్యాడని నేను అన్నాను. కానీ అది ఎటువంటి ఓటమి? మీరు ఆయన ప్రత్యర్థులను అంటే స్టాక్ హోం కాంగ్రెస్ విజేతలైన ప్లెహనోవ్, ఆక్సల్ రాడ్, మార్టోవ్.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •