రాజ్యాంగం లోని 341 అధికరణ కింద రాష్ట్రపతి ఎస్ సి, ఎస్ టి జాబితాలను నోటిఫై చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు మార్చాలన్నదే సుప్రీం కోర్ట్ తాజా నిర్ణయం. రిజర్వేషన్ కులాల జాబితాలు పరమ పవిత్రమైనవేమీ కాదని, అవి మార్చకూడదన్న రూలు కూడా ఏమీ లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు. మారుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కులాల జాబితాలను సమీక్షించాలి అని కూడా ఆయన అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలలో ఉపాధ్యాయ నియమాలకు సంబంధించి 2000 సం.లో ఎస్టిలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదలజేసిన జీ వో నెం.3 ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది.
ఈ సందర్భంలో కోర్టు చేసిన వ్యాఖ్యానాలు రిజర్వేషన్లను పొందుతున్న కులాలలోని పేదలపట్ల అత్యంత ప్రేమాభిమానాలు కురిపిస్తున్నట్లు కనపడతూ, అగ్రవర్ణాలలో వున్న అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఈ తీర్పు అమలు దారితీసే పరిణామాలను పరిశీలిస్తే దీని వల్ల ఎస్ సి, ఎస్ టి లకు తీరని అన్యాయం జరగబోతోందని అర్థమవుతుంది.
SC, ST, OBC లకు రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికన కల్పించలేదని తెల్సిందే. రిజర్వేషన్ల ఉద్దేశం తరతరాలుగా సామాజిక వివక్షతకు గురవతూ, సమాజ బహిష్కృతులుగా సభ్య సమాజం(?) వెలివేసిన కులాలకు విద్యా, ఉపాధి రంగాల్లో పురోగతికి అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక సమానత్వానికి దోహదం చేయడం, అణచివేయబడ్డ కులాల వారికి పాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా దేశ అభివృద్దిలో వారివంతుపాత్ర నిర్వహించే అవకాశం కలిగించడం.
ఇక్కడ కులమనేది వ్యక్తిగత లక్షణమో గుణమో కాదు. కులం అవశ్యముగా ఒక మానవ సంబంధం. (CASTE IS ESSENTIALLY A RELATIONSHIP AND NOT AN ATTRIBUTIVE).
అది ఒక వ్యక్తీ యొక్క పొడువు, బరువు కాదు. అది సామాజిక అంచెల విధానం, వివక్షత. పేదవాడు ఏ కులానికి చెందినా ఆర్థిక వివక్షతను గురవుతాడు. ఒక్కసారి ఆ ఆర్థిక వివక్షతను తొలగిస్తే, అగ్రకులాలవాళ్ళు సమానతను పొందుతారు. కాని నిమ్నకులాలని ముద్రవేయబడ్డవారు పేదరికంనుండి బయటపడినా, సామాజిక వివక్షతను ఎదుర్కుంటూనే వుంటారు. ఈ వివక్షత వ్యక్తులను, కులాలను తోటి మనుషులనుండి దూరం చేస్తుంది.
అందువల్ల రిజర్వేషన్ అనేది వ్యక్తుల పేదరికాన్ని తగ్గించెందుకో, తొలగించెందుకో ఉద్దేశ్యించినది కాదు. భౌతికపరమైన లబ్ది చేకూర్చేదీ కాదు. ఆయా కులాలను సమాజంలో అంతర్భాగం చేయడానికి, అందరితో పాటు గౌరవనీయ స్థానం కల్పించే ప్రయత్నం అది.
పై అంతరార్థానికి నేటి సుప్రీం కోర్ట్ తీర్పు పూర్తిగా వ్యతిరేకంగా ఉందనడంలో సందేహం లేదు.
సుప్రీం కోర్ట్ తీర్పు విశ్లేషించడానికి ముందుగా దేశంలో ఉన్నత ఉద్యోగ నియామకాల్లో SC,ST,OBC ల రిజర్వేషన్ల అమలును పరిశీలిద్దాం.
ప్రభుత్వం లోక్ సభలో 14 డిసెంబర్ 2016 లో చేసిన ప్రకటన ప్రకారమే గ్రూప్ A ఉద్యోగాలలో SC లు 15% కు గాను 12.5%, ST లు 7.5%కు గాను 4.7%, OBCలు 27% కు గాను 13.9% వున్నారు. సెక్రెటరీ స్థాయి ఉద్యోగులలో 85 మందిలో ఒక్క OBC లేకపోగా, SC లు ఇద్దరు, STలు ఇద్దరు వున్నారు. అడిషనల్ సెక్రెటరీలు 70 మందిలో SC లు నలుగురు, STలు ఇద్దరు వున్నారు. జాయింట్ సెక్రటరీలు 293లో 21 మంది SC, 7 మంది ST అధికారులు వున్నారు. డైరెక్టర్, ఆ పైఉద్యోగాలు 747 కు గాను 60 SC లు (8%), 24 ST లు(3%) వుండటం గమనార్హం. అంటే విధాన నిర్ణయ స్థానాల్లో తమకు కేటాయించబడ్డ వాటిని SC,ST లు పొందలేదు. ఇక UPSC ద్వారా 2009-2016 మధ్యకాలంలో జరిగిన 37,166 నియామకాల్లో SCలు 11%, STలు 6% మాత్రమే వున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ల ద్వారా జరిగిన 8,141 ఉద్యోగాలలో SC లు 14%, STలు 6% మాత్రమే నియమించబడ్డారు.
OBCల విషయానికొద్దాం. యిప్పటికి అందుబాటులో వున్న సమాచారాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ A, B, C, D కేటగిరిలో 79,483 ఉద్యోగులకు గాను OBC లు కేవలం 9,040 మంది మాత్రమే వున్నారు. యింకా విషాదకరమైనదేమంటే ఇ.మురళీధరన్ అనే చెన్నైకి చెందిన శాస్త్రవేత్త OBC రిజర్వేషన్ల అమలు విషయమై సమాచారహక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని 40 మంత్రిత్వశాఖలు, మరియు 48 డిపార్టమెంట్లు యివ్వడానికి నిరాకరించాయి.
40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలో 1,125 ప్రొఫెసర్ పోస్టులలో ఒక్క OBC చెందిన వారు లేరు. 7,741 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులలో 931(12.02%)SCలు, 423(5.45%) STలు, 1,113(14.30%) OBC లు వున్నట్టు సమాచారం. బోధనేతర సిబ్బంది విషయంలోనూ పైవిధమైన నిర్లక్ష్యం కనపడుతూంది. అందులో SC 8.96%, ST 4.25% OBC 10.17% మాత్రమే.
పై గణాంకాలను పరిశీలిస్తే మనకు ప్రభుత్వ వున్నత ఉద్యోగాలలో OBC, SC మరియు ST లకు కేటాయించి కోటా ఏనాడు పూర్తిగా భర్తీ కాలేదనేది చేదువాస్తవం.
రిజర్వేషన్ల కేటగిరికి చెందిన కులాల్లోని పెదల గురించి, ఆ కులాల్లోని పేదలకన్నా ఎక్కువుగా బాధ చెందుతున్నట్టు కనపడేది అగ్రకులాల వారే. దశాబ్దాలుగా రిజర్వేషన్ల వల్ల ఆ కులాలలోని సంపన్న కుటుంబాలే బాగుపడుతున్నాయని, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడనీ, ఆయా కులాలలోని పేదవారికి రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదని అగ్రవర్ణాల వాళ్ళు మొసలి కన్నీరు కార్చడం మనం చూస్తూనే వున్నాం. నిజమేననిపిస్తుంది. దాంతో, OBC కులాలకు ఆదాయ పరిమితి 1993-2004 మధ్యకాలంలో రూ.Iలక్ష, 2004-2008 రూ.2.5 లక్షలు, 2008-13 రూ. 4.5 లక్షలు, 2013-17 రూ.6,2017 లక్షలు, తర్వాత రూ.8 లక్షలుగా నిర్ణయించారు. పైవిధంగానే SC,ST లకు ఆదాయపరిమితి విధించాలని అగ్రవర్ణాల కోరిక.
ʹసంపన్నశ్రేణిʹ విధానం తో OBC కోటా పూర్తిగా భర్తీ కావడం లేదు. ఆయా ఉద్యోగాలకు అర్హత పొందాలంటే ఆయా కుటుంబాల ఆర్థికపరిస్థితి మెరుగ్గా వుండాలి. ఏవో ఉద్యోగస్తుల కుటుంబాలు తప్ప (వారు ఎక్కువమంది సంపన్న శ్రేణికి చెందినవారై వుంటారు) మిగతా మెజారిటీOBC లు వృత్తికులాలకు చెందిన వారో, లేక రోజువారి కూలీలుగా ఉన్నవారో. అందువల్ల వీరికి ఉన్నత చదువులు చదివే అవకాశం తక్కువ. దాంతో మెజారిటీ OBC లు ఉన్నత ఉద్యోగాలలో తమకు కల్పించిన రిజర్వేషన్ ఫలాలను పొందలేకపోతున్నారు. యిక SC,ST ల సంగతి మరీ ఘోరం. ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలుగా జీవనం చేస్తున్న వాళ్ళే. అత్యంత పేదరికంతో మగ్గుతున్న వీరు కనీసం 10 వ తరగతి వరకు చదువును కొనసాగించలేని స్థితి. అసలు విషయం ఏమిటంటే దేశ సంపద కొన్ని అగ్రవర్ణాల గుప్పిట్లో వున్నప్పుడు, సంపద పంపిణీ కాకుండా రిజర్వేషన్ రాయితీలు కేవలం కంటితుడుపు చర్యలే అవుతాయి.
ఈ నేపథ్యం లో సుప్రీం కోర్ట్ సలహాను అమలుజేస్తే OBC, SC, STలకు కేటాయించిన పోస్టులు ఏవో 4 వ శ్రేణివి తప్ప మిగతా వుద్యోగాలన్నీ ఖాళీలుగా మిగిలి పోతాయి. కొంతకాలం తర్వాత వాటిని ఓపెన్ కేటగిరిగా మార్చడంతో లబ్ది పొందేవారెవరో చెప్పనవసరం లేదు.
మొదటిగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ వెనుకబడిన కులాలకు, ఎస్ టి, ఎస్ సి లకు తాత్కాలిక ఉపశమనమే కాని, వారి కులవివక్షతకు శాశ్వత పరిష్కారం కాదని ఎనిమిది దశాబ్దాల దేశచరిత్ర స్పష్టం చేస్తూనే వుంది. అంతో, ఇంతో ఉపశమనం కల్గించే ఈ రిజర్వేషన్లకు కూడా గండికొట్టడానికి అగ్రవర్ణ మేధావులు ఆయా కులాలలోని పేదలపై మొసలి కన్నీరు కారుస్తూ కొత్త కొత్త వాదనలను ముందుకు తెస్తున్నారు. వారి వాదనలకు చట్టబద్ధత కల్పించేదే నేటి సుప్రీం కోర్ట్ సలహా.
దళితుల, వెనుకబడిన తరగతుల ఆర్థిక ప్రమాణాలు పెంచి, వారికి ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జేసేంతవరకు రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా వారికి అందవు. దీన్ని వ్యవస్తీకృత సమస్యగా పరిగణించినపుడే దానికి శాశ్వత పరిష్కారం కనుగొంటాం.అంతవరకూ రిజర్వేషన్లు రాజకీయ చదరంగంలో పావులే.
ఇక ఆదివాసీ ప్రాంతాల ( scheduled area)లో ఉపాధ్యాయ ఉద్యోగాలలో షెడ్యూల్డ్ జాతుల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% రిజర్వేషన్ల కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నెం.3 ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అది రాజ్యాంగ విరుద్దమని, అలా చట్టంచేసే హక్కు పార్లమెంట్ కే వున్నదని వ్యాఖ్యానించింది. అంతే కాదు, అది ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించే అధికరణ 16(1)ని ఉల్లంఘిస్తుందని, దాని అమలుకై పెట్టిన 26-01-1950 నుండి నివసిస్తున్న వారికే ఉద్యోగాలు అనే నిభందన వల్ల ఆతర్వాత వలస వచ్చిన వారికి అన్యాయం చేస్తుందని కోర్టు తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
రాజ్యాంగాన్ని, చట్టాలను తమకిష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యానించగల లాయర్లు అనేకులున్నారు. ఆ వ్యాఖ్యానాలు ఎవరి ప్రయోజనాలు కాపాడుతాయో, ఆ విశ్లేషణల వేనుకగల ఉద్దేశ్యాలను అర్థంచేసుకోవాల్సివుంటుంది. వలస వచ్చినవారి గురించి ఆలోచించినపుడు అస్సాంలో వలసదారుల పట్ల న్యాయస్థానం వహించిన తీరు, అదే కాశ్మీర్ ప్రజల హక్కులను హరించివేసి, వలసలను ప్రోత్సహించే 35-A రద్దుపై న్యాయస్థానం అవలంబించిన తీరు పరిశీలిస్తే ఆయా తీర్పులు ఎవరి ప్రయోజనాలు కాపాడుతాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే తీర్పును ఆదివాసీ ప్రాంతాల (scheduled area)లో భూమి కోనుగోలుకు, మైనింగ్ లీజ్ లకు వర్తింపజేస్తే 1/70 చట్టం నిర్వీర్యమవుతుందని ప్రముఖ సామాజికవేత్త నందిని సుందర్ అభిప్రాయ పడ్డారు. ఇది చాలా ప్రమాదకరమైంది.
ప్రభుత్వ ఉత్తర్వు నెం.3 విడుదల జేసేందుకు కేవలం ఆదివాసీల పట్ల ప్రభుత్వానికుండే ప్రేమేగాకుండా, ఆ ప్రాంతాలలో విప్లవోద్యమం బలపడకుండా, విస్తరించకుండా ఉండేందుకు కొందరు మేధావులు ఇచ్చిన సలహాలు కూడా కారణమని ఆమె అంటారు. అదేగాకుండా అక్కడ పనిజేస్తున్న ఆదివాసేతర టీచర్ల గైర్ హాజరు, ఆదివాసీ విద్యార్థుల పట్ల వారి ప్రవర్తన, ప్రాథమిక పాఠశాలల్లో భాషా మాధ్యమ సమస్య, ఆదివాసీ భాషల పట్ల ఈ టీచర్ల చిన్నచూపు, ఇవన్నీ ఆదివాసీల విద్యాభివృద్ధికి ఆటంకం కల్గిస్తున్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ చట్టపు ఆవశ్యకత వుందని రాష్ట్ర హైకోర్ట్ లో మానవహక్కుల వేదిక నాయకుడు బాలగోపాల్, ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధావన్, ఇతరులు వాదించారు. గెలిచారు.
చట్టాలనేవి పరమపవిత్రమైనవేమీ కావు. నిర్దిష్ట కాలపరిస్థితులలో, ఆయా ప్రభుత్వాలు, ప్రజా ప్రయోజనాల పేరుతో తమ వర్గప్రయోజనాల కాపాడుకునేందుకు పాలకులు చేసేవే చట్టాలు. ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు, వారికి కొంత ఉపశమనం కల్గించేందుకు చట్టాలు పాలకులకు ఉపయోగపడతాయి. చట్టలనేవి పరమపవిత్రమైనవేమీ కావని, రిజర్వేషన్ విషయంలో గౌరవ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు సెలవిచ్చారు కూడా. అసలు రాజ్యాంగమే పవిత్రం కానపుడు(ఇప్పటికే వందసార్లు సవరించబడింది) చట్టాలు పరమపవిత్రమైనవా? వాటిని చేసేహక్కు ఎవరిది? ఆదివాసి సలహా కమిటీ (Tribal Advisory Board) సలహా మేరకు చట్టంచేసే హాక్కు రాష్ట్ర గవర్నర్ కుందా? రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్ ఏమి చెబుతుందీ? ఇవన్నీ ఆదివాసీ సమాజానికి అర్థంగావు, అనవసరం కూడా. వారు కోరేది తమ జల్, జంగల్, జమీన్ లు దురాక్రమణకు లోనుగాకుండా, తాము స్వేచ్చ, స్వాతంత్రాలతో జీవించే హక్కు. వాటికి భంగం కలిగినపుడు, ఎన్ని ఉపశమన చట్టాలూ చేసినా వారిని పోరాట బాటనుండి మరల్చలేవు.
ఏమైనా కొవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ తీర్పు వెలువడ్డంలో అంతరార్థం కూడా స్పష్టమే. ఉద్యమాలకు అవకాశం లేని కాలంలో పొడిచిన చీకటి పోటు ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై తమ అభిప్రాయాలను కనీసం ప్రకటన రూపంలోనైనా వెల్లడించకపోవడం గమనార్హం. ʹకాగలకార్యం గంధర్వుడే తీర్చాడుʹ అన్నట్టుగా మౌనంగా వుండటంలో ఆశ్చర్యమేముంది? అంతా ఒక తాను ముక్కలే. అగ్రకుల సంపన్నవర్గాల పక్షాన ఇంత బాహాటంగా తీర్పులు చెప్పడానికి వారికి ఏ లాక్ డౌన్ అడ్డం రాలేదు. దీనిని ప్రజాస్వామికవాదులందరూ నిరసించాల్సిన అవసరం ఉంది.
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |