ʹదళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటు పోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది...ʹ
రాగో చివరికి ఏమవుతుంది? ఎప్పటికైనా తను వెళ్లే దారి గురించి తెలుసుకుంటుందా? లేక అలాగే పోతుందా? నడక ఆపేస్తుందా?
వాళ్ల నడకలోని అర్థాలను తెలుసుకున్నప్పుడే సమాధానం దొరుకుతుంది. ʹమనిషిని గురించి కొన్ని పడికట్టు సూత్రాలు జేబులో పెట్టుకొని ఎదురైన ప్రతి ప్రశ్నకూ రెడిమెడీ జవాబులు చెప్పేʹ వాళ్ల దగ్గర సమాధానాలు ఉండకపోవచ్చు. అట్లాగే కనబడిన ప్రతి దాన్నీ రెడీమెడీ ప్రశ్నలుగా మలిచి సంధించే వాళ్లకు అసలే దొరకవు.
ఇంతకూ రాగో ఏమైంది?
ఆదివాసీ విప్లవ నాయకురాలు ఆర్క చైతు అలియాస్ సృజన మే 2వ తేదీ జరిగిన ఎన్కౌంటర్లో అమరురాలైంది. కరోనా అన్నిటినీ లాక్ డౌన్లో పెట్టేసింది. కానీ ఎన్ కౌంటర్ హత్యలను కాదు. అది గడ్చిరోలి కావచ్చు. కశ్మీర్ కావచ్చు. ఈ రెండు వేర్వేరు భూభాగాల మధ్య ఎప్పటికీ చెదరిపోని పోలికలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే వాళ్లు తక్కువే. గడ్చిరోలి జిల్లాలోని ఏటాపల్లె దగ్గర సినట్టి అటవీ ప్రాంతంలో చనిపోయిన చైతుకు 48 ఏళ్లు. ఆమెది అదే జిల్లా భామ్రాఘడ్ తాలూకా, లహిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనార్ గ్రామం.
ప్రముఖ విప్లవ రచయిత సాధన రాసిన రాగో నవలలోని ప్రధాన పాత్ర ఈమెనే అని తెలిసిన వాళ్లు అంటున్నారు. లేదా ఆ నవలకు ఆమెనే ప్రేరణ కావచ్చు. అలాంటి అనేక మందికి ఆమె ప్రాతినిధ్య మూర్తిమత్వం కావచ్చు. అట్లా అత్యద్భుతమైన కాల్పనిక రచన రాగోలోని నిజ పాత్ర ఆమెనే అని చెప్పగలం.
మనం ఇష్టపడే నవల, మనం ప్రేమించే రచయిత, అందులో మనల్ని కదిలించే పాత్ర, ఆ మనిషి గురించి ఇలా మరణం తర్వాత తెలుసుకోవడం విషాదం కదా.
ఇంతకూ రాగో ఏమవుతుంది? అనే ప్రశ్నకు ఆమె మరణంలో సమాధానం ఉందా? తెలిసీ తెలియని ప్రయాణం చేసి ఆమె అమరురాలైందనుకోవాలా? పోరాటం ప్రారంభించక ముందే వెనక్కి మళ్లి పరాజిత కాలేదని సంతోషించాలా?
రాగో ఏమవుతుందనే ప్రశ్నకు ఆమె మరణంలోనే సమాధానం లేదనుకుంటాను. ఆమె జీవితంలో ఉంది. అట్లాగే నిన్నటితో ముగిసిన ఆమె ఆచరణ ఆమె ఒక్కరిదే కాదు. విప్లవం చేయగల వర్గానిది. లేదా చైతన్యవంతమైన మానవులది. ఆ రకంగా రాగో ఏమవుతుందనే ప్రశ్నకు ఆమె మరణం తర్వాత కూడా కొనసాగే విప్లవాచరణలో సమాధానం ఉంది.
రాగో అమరురాలైందనే వార్త తెలియగానే చాలా మందికి బాలగోపాల్ గుర్తుకు వచ్చి ఉంటారు. 1993లో సృజన ప్రచురణగా రాగో నవల అచ్చయింది. అప్పుడు దాని కోసం ఆయన ఒక ముందుమాట రాశారు. అయితే ఆయనే చెప్పినట్లు రచయిత అభిప్రాయాలతో పూర్తిగా విభేదించేలా ఉన్నందు వల్ల అది అరుణతారలో విడిగా అచ్చయింది. అదే ʹమనిషి చరిత్ర మార్క్సిజంʹ అనే వ్యాసం.
ఈ నవల అచ్చయిన కాలానికి తెలుగు మేధో రంగం ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నది. అది సరిగ్గా రాగో తన పోరాటాన్ని తీవ్రం చేస్తున్న చారిత్రక సందర్భం. బాలగోపాల్ అన్నట్లు ʹసామాజిక పరిణామంలో కీలక స్థానంలో ఉన్న చారిత్రక సందర్భంʹ. అలాంటి నేపథ్యంలో వచ్చిన నవల అయినందు వల్లే రాగో నిలిచిపోయే నవల అయింది. అంతకుమించి ఆ చారిత్రక సందర్భంలో రూపొందిన మానవి కాబట్టి రాగో విప్లవోద్యమ నాయకురాలిగా కూడా ఎదిగింది. కానీ అప్పటి పరిస్థితి ఏమంటే - మార్క్సిజం స్త్రీల సమస్యలను వివరించలేదని ఫెమినిస్టులు సిద్ధాంతీకరిస్తున్నారు. దానికి స్త్రీవాదం కావాలని చెబుతున్నారు. మార్క్స్ కు అదనపు విలువ దోపిడీ తెలుసు కానీ, లైంగిక దోపిడీ గురించి తెలియదని వాళ్లు వాదిస్తున్నారు. వర్గపోరాటం ద్వారా స్త్రీల విముక్తి సాధ్యం కాదని ప్రకటిస్తున్నారు. తన వ్యాసంలో బాలగోపాల్ కూడా వాళ్లతో గొంతు కలిపారు. ఆ వివరాల్లోకి ఇప్పుడు వెళ్లలేం కాని, ఈ కాలంలోనే రాగో తన ప్రయాణం ఆరంభించింది. కానీ రాగో ఏమవుతుంది? అనే సందేహం బాలగోపాల్ కు కలిగింది.
ఇంకో వైపు నుంచి ఫెమినిజం ఏమైంది? రాగో ఏమైందనే ప్రశ్నలు కూడా వేసుకోవాల్సిందే. ఫెమినిజం నుంచి రాగో తనకు ఇష్టమైన విషయాలు నేర్చుకొనే ఉంటుంది. కానీ రాగో నుంచి ఫెమినిజం ఏమైనా నేర్చుకున్నదా? అనే ప్రశ్న కూడా తప్పించుకోలేదే. ఇప్పుడు ఇక మోమాటం లేకుండా అడగాల్సిందే.
విప్లవాచరణ నుంచే రాగో విప్లవ కార్యకర్తగా ఎదిగింది. దాని నుంచే రాగో నవల పుట్టింది. అంత నిర్దిష్టత విప్లవ సాహిత్యానికి ఉంది. సాహిత్యానికి, నిజ జీవితానికి మధ్య విప్లవం నిర్మించే కాల్పనిక సరిహద్దులు అద్భుతమైనవి. ʹఆదిమ కమ్యూనిస్టు సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమసమాజంగా, ఆదివాసీ జీవితాన్ని దానికి నమూనాగా భావించే మార్కిస్టులు ఈ నవల చదివితే మంచిదిʹ అని బాలగోపాల్ రెకమెండ్ చేశారు. ఆదివాసీ జీవితాన్ని వాస్తవికంగా చూసి దానిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న మార్క్సిస్టు రచయితలు, కార్యకర్తల మధ్యనే ఆ నవల తయారైంది. ఆ సంగతి ఆయన కావాల్సి మర్చిపోయినట్లుంది. రాగో జీవితాన్ని సాధన వాస్తవికంగా చూశారు. ఆమె చైతన్యవంతమైన క్రమాన్ని గుర్తించారు. ఆ అవగాహనకు చరిత్రతో ఉండగల సంబంధాన్ని కూడా నవలలోకి తీసుకొచ్చారు. 48 ఏళ్ల రాగో నిజ జీవితం చరిత్రతో ఆమెకు గల సంబంధాన్ని నిరూపించింది. అది ఎక్కాలపట్టీలోని గణక సంబంధం కాదు. ఎగుడుదిగుళ్లు లేని రూళ్ల కర్రలాంటిది కాదు. ఒక వర్గంగా రూపొందుతున్న చైతన్యవంతమైన మానవుల ఆచరణ అది. అందువల్ల దానికి చరిత్రతో సంబంధం ఉంది.
ఇప్పుడు రాగో అమరత్వం ముందు అందరూ తలవంచి నిలబడాలి. మార్క్సిస్టేతర ధోరణులు ఏ రూపంలో ఉన్నా ధైర్యంగా తలపడాలి. వర్గపోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టాలి. దేనికంటే పితృస్వామ్య అణచివేతను, కుటుంబ పీడనను, లైంగిక శ్రమ విభజనను వర్గపోరాటం ద్వారా రద్దు చేయలేం అనే ఫెమినిస్టుల వాదనను రాగో తిప్పి కొట్టింది. విప్లవంలో అతి ముఖ్యమైన పితృస్వామ్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో తన దృఢమైన ఆచరణ ద్వారా నిరూపించింది. పితృస్వామ్యం మీద పండిత చర్చ ఎంత చేసినా ఏమీ తేలదని స్పష్టం చేసింది. దాని కోసం కఠినమైన, సునిశితమైన ఆచరణకు సిద్ధం కావాల్సిందేనని రాగో కార్మికవర్గం పక్షాన నిలబడి తేల్చి చెప్పింది. ఎంత ఉదాత్తమైన సిద్ధాంతాలైనా ఆచరణ లేకపోతే పుక్కిటి పురాణాల్లా మారిపోతాయనే ఎరుకను రాగో అందించింది. విప్లవానికి అత్యవసరమైన సిద్ధాంత చర్చను తన ఆచరణ ద్వారా రాగో చాలా ముందుకు తీసికెళ్లింది. ఉత్పత్తి వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు నీవు ఎదుర్కొంటున్న పితృస్వామ్య సమస్య దానంతట అదే రద్దయిపోతుందని ఈ నవలలోని విప్లవకారులు రాగోకు చెప్పలేదు. రాగో ʹఅలాంటి పోరాటంʹ చేసుకుంటూ పోలేదు. అసలు ఉత్పత్తి సంబంధాల మార్పు పోరాటం రాజకీయ, సాంస్కృతి, నాగరికతా క్రమాల మార్పు పోరాటంగానే ఆరంభమవుతుంది. కొనసాగుతుంది.
ఇంత కీలకమైన పనిలో ఉన్నందు వల్లనే రాగో తన వ్యక్తిగత సమస్యకు - విప్లవోద్యమ లక్ష్యాలకు మధ్య ఉన్న సంబంధం తెలుసుకున్నది. ఏ సమస్యతో రాగో విప్లవంలోకి వచ్చిందో ఆ సమస్య భరించగల స్థాయికి తగ్గాక రాగో ఏమవుతుంది? అక్కడితో సంతృప్తి చెందుతుందా? ఇంటికి వెళ్లిపోతుందా? అనే సందేహం బాలగోపాల్ కు వచ్చింది. కానీ రాగో ఇంటికి వెళ్లిపోలేదు. దేనికంటే చరిత్రకు మనిషికి ఉన్న సంబంధం తెలుసుకొనే క్రమమే ఆమె ఆచరణ.
తక్షణ సమస్యలే మనుషులను పోరాటానికి పురికొల్పుతాయి. అది మానవ అస్తిత్వంలో భాగం. అట్లాగే విశాలమైన చారిత్రక ప్రపంచానికి సంబంధించిన ఊహలు చేయడం, ఆలోచనలను పెంచుకోవడం, ఆచరణకు సిద్ధం కావడం కూడా మానవ అస్తిత్వంలో భాగమే. గడచిన చరిత్రనంతా మానవులు తమ తక్షణ అవసరాలు, ఆలోచనలు, పోరాటాలతోనే నిర్మించలేదు. అతి సమీపం, అతి సుదూరం అయిన ఆలోచనలు, వైఖరులతో మానవ ఆచరణ కొనసాగుతున్నది. చరిత్ర నిర్మాణానికి ఈ రెండూ దోహదపడుతున్నాయి. ఈ రెంటిలో స్వేచ్చ అతి ప్రధానమైనది. స్వేచ్చాకాంక్ష మానవ నైజంలో భాగం. అందువల్ల ఇష్టం లేని పెళ్లి బెడద తీరగానే రాగో విప్లవంలోంచి వెళ్లిపోలేదు. విశాలమైన చారిత్రక ప్రపంచం గురించి స్వేచ్ఛగా ఆలోచించడం నేర్చుకుంది.
అట్లాగే మనిషికి చరిత్రకు ఉన్న సంబంధంలోని ఎగుడుదిగుళ్లను చూడ్డానికి రాగో భయపడలేదు. వాటిని చూస్తే విప్లవంలోని చారిత్రక ఆశావాదం ఎక్కడ దెబ్బతింటుందో అని బెదిరిపోలేదు. ఆ రెంటి మధ్య గతితార్కిక సంబంధం ఉంటుందని చెప్పి చేతులు ముడుచుకోలేదు. సమసమాజమనే ఆదర్శం సంక్షోభంలో పడిపోయిన వేళ ఈ నిరర్థక ప్రయాస ఎందుకని అభిప్రాయాలు మార్చుకోలేదు. బాలగోపాల్ సందేహాలకు ఎవరైనా సిద్ధాంతపరమైన సమాధానాలు వెతికే ప్రయత్నం చేయవచ్చు. కానీ రాగో మాత్రం తన ఆచరణ నుంచి పరిష్కారం వెతికే క్రమంలో సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసింది.
అందుకే రాగోకు విప్లవం ఆదర్శమా? అవసరమా? అని ప్రశ్నలు వేసి ఆమె ఆచరణను బండ చర్చలోకి కుదించలేం. మనుషుల అవసరాలంటే సొంత జీవితంలోని తక్షణ ప్రయోజనమే అని కుదించవచ్చునా? స్వేచ్ఛాయుతమైన ఊహ, సత్యాన్వేషణపట్ల ఆసక్తి మొదలైనవి జీవితంలోని అవసరాలు కావా? ఏ తక్షణ అవసరం కోసం వైజ్ఞానికవేత్తలు సజీవ దహనానికి సిద్ధమయ్యారు? దాని వల్ల తక్షణం వాళ్ల జీవితంలో ఏ సమస్య పరిష్కారమవుతుందని? ఏ లాభం కలుగుతుందని? కనీసం గుర్తింపు కూడా రాలేదే? ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలకు వాళ్ల మరణానంతరం ఎప్పటికీ గుర్తింపు వచ్చింది. జీవించి ఉన్న రోజుల్లో వాళ్లను దైవ ద్రోహులని నిందించారు. పిచ్చివాళ్లని అనుకున్నారు. అట్లాగే చరిత్ర గతికి మనుషుల్లోని ఏ ఆదర్శమూ చోదకం కాలేదా? ఆదర్శంలోని విలువలు చరిత్రను ఒక మెట్టు పైకి తీసికెళ్లలేదా?
చరిత్ర గురించిన విశాలమైన భౌతిక దృక్పథం, పదునైన ఆచరణ వల్లనే విప్లవంలో నూతన మానవ ఆవిష్కరణ సాధ్యమవుతున్నది. ఈ నవలలో ఒక చోట .. అన్నలతో నిలబడ్డ రాగోని కొత్త మనిషిని చూసినట్లు రూపి అదే పనిగా చూస్తోంది.. అని ఉంటుంది. ఇంకో సందర్భంలో స్వయంగా రాగోనే ʹఈ కొత్త ప్రపంచం నేనెలా ఉండాలో అనుకుంటుంది.
ఆ కొత్త మనుషులను, ఆ కొత్త ప్రపంచాన్ని వర్గపోరాటమే నిర్మిస్తోంది. నిజానికి మనం రాగో అని అంటున్నాం కానీ ఆమె విప్లవం తేగల చైతన్యం, సంసిద్ధత, ఆచరణ ఉన్న దండకారణ్య ఆదివాసీ మహిళా సమూహం. భారత కార్మికవర్గంలో ముఖ్యమైన భాగం. బాలగోపాల్ కూడా ʹరాగో అనే వ్యక్తి గురించి కాదు. ఒక వ్యక్తి గురించి సూత్రీకరణ చేయడం అసాధ్యం, అనవసరంʹ అంటారు. ʹఒక ప్రజా సమూహం గురించి..ʹ అని అంటారు. నిజమే. రాగో విషయాల్లాగే బాలగోపాల్ ప్రశ్నలు కూడా సమూహానికి చెందినవే. అవి విప్లవోద్యమం గురించిన అనేక మందిలో ఉండే ప్రశ్నలని అనుకోవచ్చు. పైగా ఆయనా అమరుడయ్యాడు. రాగోలాంటి మహిళల్లో కొందరు విప్లవంలోంచి వెనుదిరిగి ఉండవచ్చు. కాబట్టి ఆయన ప్రశ్నలు వాళ్లను ఉద్దేశించినవి కూడా కాదు. విప్లవోద్యమ క్రమానికి సంబంధించినవి. ఇలా చూస్తేనే రాగో ప్రాతినిధ్యం వహించే విప్లవోద్యమంలోని బలాన్ని చూడగలం.
వ్యక్తిగా రాగో పార్టీలోకి వచ్చే నాటికే విప్లవోద్యమంలో ఎందరో మహిళలు ఉన్నారు. రాగో వచ్చాక ఆ ఒరవడి పుంజుకుంది. దేనికంటే వర్గపోరాటం తన వాస్తవ తలంలో ఒక పెద్ద సాంఘిక సాంస్కృతిక ఉద్యమంగా ఎదిగింది. ఆదివాసీ మహిళల పితృస్వామ్య బంధనాలు కదలబారుతున్న సమయం అది. దీంతో రాగోలు విప్లవోద్యమంలో ఉసిళ్లపుట్ట అయ్యారు. వర్గపోరాటానికే ఆ శక్తి ఉంటుంది. దానిలో మిలిటెన్సీ లేకపోతే ఉత్తుత్తి పోరాటంగా మిగిలిపోయేది. అలాంటి పోరాటాల వల్ల కూడా ఏవైనా ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ విముక్తికి అవసరమైన వాతావరణం వాటి వల్ల ఏర్పడదు.
దండకారణ్య ఆదివాసీ అమ్మాయిల దగ్గరికి వెళ్లి ʹవిప్లవంలోకి ఎందుకు వచ్చారుʹ అని అడగండి.
ʹస్వేచ్ఛ కోసంʹ అని అంటారు.
దేనినుంచి స్వేచ్ఛ? తరతరాల పితృస్వామ్య బంధనాల నుంచి. సాంఘిక కట్టుబాట్లు నుంచి. ఈ స్వేచ్ఛ అంత మాత్రమేనా? కానే కాదు. అంతిమంగా అది మానవ ఊహాశక్తి. మానవ క్రియాశీలత. తద్వారా చరిత్రతో మనిషికి ఉండే సంబంధం. రాగో దాన్ని నిజం చేసింది. భారతదేశంలో మరే రాజకీయ పార్టీలో లేనంత మంది మహిళలు ఇవాళ మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు. మరే ఉద్యమంలో లేనంత క్రియాశీలంగా మావోయిస్టు ఉద్యమంలోనే ఉన్నారు. బహుశా మరెక్కడా కనిపించనంత నిర్ణయాత్మక స్థానంలో దండకారణ్య విప్లవోద్యమంలోనే ఉన్నారు.
రాగో వాళ్ల ప్రతినిధి. వాళ్ల నాయకురాలు. వాళ్ల నేస్తం. విప్లవమే అత్యుద్భుతమైన మానవ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని రాగోల గురించి తెలుసుకున్న వాళ్లకు నమ్మకం కలుగుతుంది. రాగో అమరత్వ సందర్భంలో మరోసారి సాధన నవలను చదవండి. బహుశా మానవ ఆలోచనా ప్రపంచంలో చలనం ఎలా ఉంటుందో మీరు గమనించగలరు. మనుషులు రూపొందడమనే అద్భుతం ఎలా ఉంటుందో మీ అనుభవంలోకి వస్తుంది. అదే ఈ నవల ప్రత్యేకత. అది విప్లవోద్యమంలోని ఆచరణ బలం. దృక్పథ బలం.
రాగో అంటే రామచిలక. వర్గపోరాటం వల్ల ఆ చిలక పంజరాన్ని చీల్చుకొని బైటికి వచ్చింది. స్వేచ్ఛా ఆకాశంలో ఎగురుతూ ఈ నేల మీద, ఈ ప్రకృతిలో ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తోంది. రాజ్యం ఆ చిలక రెక్కలు విరిచివేసింది. అంత మాత్రాన దాని స్వేచ్ఛాగానం అగిపోతుందా? అదేమైనా ఒంటరి గానమా? నిత్యావసరాల కోసం చేస్తున్న పోరాటమా? ఒక సామూహికశక్తి సాగిస్తున్న వ్యూహాత్మక ఆచరణ. చారిత్రక వికాస క్రమాన్ని ముందుకు తీసికెళ్లే పోరాటం.
ఈ నవల విడుదలయినప్పుడే రాగోల ఆచరణ మీద సందేహాలు మొదలయ్యాయి. వాళ్లు నిర్మించాలనుకుంటున్న భవిష్యత్ మీద ప్రశ్నలు వినిపించాయి. కానీ ఈ నవలా నాయకి తన సుదీర్ఘ విప్లవ జీవితాన్ని మృత్యువులో కూడా నిరూపించుకున్నది. కానీ ఇప్పటికీ ప్రశ్నలే, సందేహాలే. వాటిని స్వాగతిస్తూ తలపడితేనే రాగో స్వేచ్ఛాగీతానికి మనం గొంతు కలిపినట్టు.
అంతా అయిపోయిందని నిట్టూర్పులు విడిచేవాళ్లు, అన్నీ ప్రశ్నలే అని పాండిత్యాన్ని ప్రదర్శించేవాళ్లూ, తలుపుచాటున నక్కి రాళ్లు విసిరేవాళ్లు, జీవితంలో ఒక్కసారైనా పడక కుర్చీలోంచి లేచి బైటి ప్రపంచంలోకి రాకుండా మహిళా విముక్తి ఎలా అని తర్జనభర్జనకు గురయ్యేవాళ్లు.. ఎందరో ఉన్న ఈ వర్తమాన ప్రపంచంలో మనకు రాగో గడించిన అనుభవం, జ్ఞానం, ఆచరణ ఉన్నాయి. అలాంటి వేలాది లక్షలాది రాగోల సంసిద్ధత ఉన్నది.
దాన్ని ఎత్తిపట్టడమే రాగోకు నివాళి.
అయినా ఒక నవలా పాత్రధారి ఇలా తన నిజ జీవితంతో మన ముందుకు రావడం, అదీ మృత్యువులో మనల్ని పలకరించడం ఎంత విషాదం?
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
యాభై వసంతాల అజేయశక్తి నక్సల్బరీఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో విరసం బహిరంగసభ. కామ్రేడ్స్ వరవరరావు, పాణి, కాశీం వక్తలు. ... |
International Seminar on Nationality QuestionAIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్గా, పొలిటికల... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry..... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |