రిజర్వేషన్లపై దాడి

| సాహిత్యం | వ్యాసాలు

రిజర్వేషన్లపై దాడి

- లక్ష్మణ్ గడ్డం | 15.05.2020 08:46:10pm

చరిత్ర చిత్రమైన మలువులు తిరిగి భారతదేశం బిజెపి పాలించే దశకు చేరుకున్నది. దాని స్వభావానికి అనుగుణంగానే పాలన సాగుతుంది. విచిత్రంగా బిజెపి తలంచిందే న్యాయస్థానాల తలంపై తీర్పులుగా వెలువడుతున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ వాదులు చాలా కాలంగా అణగారిన వర్గాల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. బిజెపి ప్రభుత్వాల చుక్కాని పట్టుకున్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్ల విషయాన్ని సమీక్షించాలని చాలా కాలంగా ప్రకటనలు చేస్తున్నాడు. రిజర్వేషన్ల కొనసాగింపుపై లోతైన చర్చ జరగటం కోసం ఓ వేదిక ఏర్పాటు చేయాలని, అందులో అనుకూల, వ్యతిరేక వర్గాలు రెండూ పాల్గొనాలని వాటిని ఎందుకు అమలు జరుపుతూ పోవాలో అనుకూలురు చెప్పాలని, వాటికి ఎందుకు ముగింపు పలకాలో వ్యతిరేకులు చెప్పాలని మోడీ మొదటి ప్రభుత్వానికి సూచించారు.

కులప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు పరచడం దేశ సమైక్యతకు భంగమని అగ్రకుల వర్గాలు భావిస్తున్నయి. దీనివల్ల దేశంలో కులతత్వం పెరుగుతుందని వింత ఆలోచన ముందుకు తెస్తున్నారు. ఒక్కసారి రిజర్వేషన్లు ఈ కులాల్లోని అట్టడుగు వారికి అందడం లేదని పరోక్షంగా అక్కసు వెళ్ళగక్కుతూ ఏదో ఒక రూపంలో రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. న్యాయస్థానాలు అందులో న్యాయాన్ని వెతుకుతున్నాయి. రిజర్వేషన్ల వలన రాజకీయ పదవులలో కొందరు దళిత, గిరిజనులు నాయకులవుతుండడం వలన, విద్య, ఉద్యోగాల్లో అధికారులవుతుండడం వలన ఆమేరకైనా సామాజిక నిర్మాణం తలకిందులవుతుంది. అందువల్లనే అగ్రకుల వర్గాలకు కోటా అంటేనే మంటగా ఉంది. ఆ మంట కోర్టుల వరకు అంటుకోవడమే విషాదం. సామాజిక న్యాయంపై ఆధిపత్య అన్యాయం దాడికి దిగుతుంది.

అయితే ఈ వేట ఈనాటిది కాదు. రిజర్వేషన్ల నెపంతో దేశ సంపదను దళితులు చేస్తున్న లూఠీగా, తప్పనిసరిగా భరించవలసిన రాజ్యాంగ తల నొప్పిగా మొదటి నుండి అగ్రకులాలు భావిస్తూ తమ వ్యతిరేకతను తీవ్రస్థాయిలో వెళ్లగక్కుతున్నారు. కోర్టుల్లో వ్యాఖానాలు నడుపుతున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే 1951లో తమిళనాడుకు చెందిన చంపక దొరై రాజన్ సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేశాడు. అయితే ఆ పిటిషన్ పై మద్రాసు హైకోర్టు, సుప్రీంకోర్టులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. ఆనాడు కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చొరవతో ఆ ప్రమాదం తప్పింది. దీనికి గాను మొదటి రాజ్యాంగ సవరణ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇటీవలి 7 ఫిబ్రవరి 2020 ఝార్ఖండ్ కేసు వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు దాఖలు చేయబడూనే ఉన్నాయి. ఒకటి రెండు కేసులలో తప్ప అనేక కేసులలో రిజర్వేషన్ల పట్ల న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది. అయితే ప్రభుత్వం అపుడపుడూ రాజ్యాంగ సవరణలకు దిగుతుంది. సుప్రీంకోర్టు సామాజిక న్యాయ పరిరక్షణ విషయంలో అనేక కోణాలను పరిశీలించి, స్థిమితంగా ఆలోచించి పెద్ద దిక్కులా స్పందించలేదని అణగారిన వర్గాలు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2012లో ఇంజనీరింగ్ ఉద్యోగాలకు రిజర్వేషన్లు పాటించడకుండా భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతో రిజర్వేషన్ల తేనెతుట్టే మరోసారి కుదుపులకు గురైంది. ʹదళిత, గిరిజన ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం ప్రాథమిక హక్కు కాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారాల కిందికి వస్తుందనిʹ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 7న తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలో 16 అధికరణ 4, 43 వ క్లాజుల ఆధారంగా ఈ తీర్పు వెలువరించినట్లు సుప్రీంకోర్టు ఉటంకించింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం పిడబ్ల్యుడి అసిస్టెంట్ ఇంజనీర్ల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేదని 2012 నవంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను ఎస్సీ ఉద్యోగులు రాష్ట్ర హైకోర్టులో ఛాలేంజి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ తరగతులకు తగిన ప్రాతినిధ్యం లేని పక్షంలో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో రిజర్వేషన్లు వారి కోటా ప్రకారం కావడం లేదన్న సందేహాం కూడా హైకోర్టుకున్నట్లు వెల్లడవుతుంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం రిజర్వేషన్లు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు అంటూ తీర్పునిచ్చింది. ప్రభుత్వోద్యోగ నియమకాలు, పదోన్నతులలో కోటా డిమాండు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టులో బిజెపి ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తనకనుగుణంగా తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో అణగారిన వర్గాలలో ఆందోళన మొదలైంది. ఈ తీర్పు న్యాయ నిపుణులను సైతం కలవడానికి పని చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ నుండి 30 వరకు ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయి.

అసలు రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ చోటు చేసుకోవడం కూడా ప్రజల సుదీర్ఘమైన పోరాటాల ఫలితమే. జ్యోతిరావుఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రామస్వామి నాయకర్ వంటి వారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో నిమ్న కులాల అభివృద్ధికి చేసిన కృషి ఫలితంగానే అన్ని రాజకీయ పార్టీలు నిమ్న కులాల అభ్యున్నతికి ప్రత్యేక రాయితీలు కల్పించవలసిన అవసరాన్ని గుర్తించాయి. తత్ఫలితంగా రాజ్యంగంలో పైన పేర్కొన్న ఆర్టికల్స్ పొందుపర్చారు.

నిజానికి ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రభుత్వోద్యోగాలలో నిమ్న కులాల ప్రాతినిధ్యం సరిపడునంతగా లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్టికల్ 16 (4ఎ) ప్రకారం అన్ని రకాల ప్రభుత్వోద్యోగాలలోని ఏ తరగతి ఉద్యోగాల్లోనైనా ఎస్సీ ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు పరిచి ప్రమోషన్లు ఇవ్వవచ్చు. ఇంకా ఈ ఆర్టికల్ లో స్పష్టత లోపిస్తే, ఏమైనా లోపాలుంటే సరిదిద్దాలి.

మళ్లీ 22 ఏప్రిల్ 2020న మోహన్ భగవత్ వాదనకు బలం చేకూరుస్తూ సుప్రీంకోర్టు మరో తీర్పు వెలువరించింది. జనవరి 10, 2000 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతంలో గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 3ను ఇప్పుడు కొట్టి వేసింది. బిసి, ఎస్సీ, ఎస్టీలకు అమలులో ఉన్న రిజర్వేషన్లను సమీక్షించాలని వ్యాఖ్యానించింది. రిజర్వేషన్ కులాల జాబితాలు పరమ పవిత్రమేమి కాదు, అది మార్చకూడదన్న సూత్రం ఏమీ లేదని అభిప్రాయపడింది. మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కులాల జాబితాను సమీక్షించాలని కూడా పేర్కొన్నది. లెక్క ప్రకారం ఎస్టీలకు ఇవ్వాల్సింది 6 శాతం రిజర్వేషన్ మాత్రమే, నూరు శాతం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం, పైగా షెడ్యూల్డు ఏరియాలో నివాసంలేని గిరిజనుల హక్కులకు భంగం కల్పించడమేనని నిర్ధారించింది. రిజర్వేషన్లంటేనే 50 శాతం మించకూడదని రూలింగ్ ఇచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యుల్లూ ఏరియాలోని టీచింగ్ పోస్టులను వంద శాతం గిరిజనులకు కేటాయిస్తూ 1986 నవంబరు 5న జివో నం 275ను జారీ చేసింది. ఈ జీవోను రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ కొట్టివేసింది. అయితే హైకోర్టు ఈ జీవోను సమర్థించగా చివరికి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పట్టువదలని రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లో గవర్నర్ కు గల ప్రత్యేక అధికారాలకు అనుగుణంగా షెడ్యూల్డు ప్రాంతంలో ఉపాధ్యాయ నియామకాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కలిస్తూ జివో నెం. 3 వి 10 జనవరి 2000న విడుదల చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ జివో రాజ్యాంగ విరుద్ధమని కొట్టి వేసింది. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేయకూడదని చురకలు పెట్టింది. ప్రస్తుతానికి ఖర్చుల కింద రూ. 5 లక్షలు చెల్లించాలని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మొత్తాన్ని చెరి సగం భరించాలని ఆదేశించింది. అంతటితో ఆగక రాజ్యాంగం పదేళ్ళ వరకే రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు పొడిగిస్తూ వస్తున్నారని చిరాకుపడింది. దీన్ని బట్టి సుప్రీంకోర్టుకు రిజర్వేషన్ల విషయంలో ఎంత కోపం వచ్చిందో అర్థమవుతుంది. ఈ జివోను అప్పట్లో సవాలు చేస్తూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామస్థుడు చేబ్రోలు లీలాప్రసాద్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 20 ఏళ్ల తర్వాత నేడు తీర్పు వెలువరించింది. లీలా ప్రసాద్ కిప్పుడు 40 ఏళ్లు నిండాయి. ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు అర్హత కూడా కోల్పోయాడు. ఆయన వ్యక్తిగతంగా పొందిన ప్రయోజనం ఏమీ లేదు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.

ఆదివాసీల, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం రాజ్యాంగంలో 244 (1) అధికరణం ద్వారా ప్రత్యేక రక్షణలను కల్పించింది. ఆర్థికంగా, సామాజికంగా దోపిడీకి గురి కాకుండా భద్రత కల్పించే సంకల్పంతో 5వ షెడ్యూలును ప్రకటించింది. సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని విధాల పాటు పడాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఆయా రాష్ట్ర గవర్నర్ల సహకారంతో భారత రాష్ట్రపతి ప్రత్యక్షంగా షెడ్యూల్డు ఏరియా ప్రాంతంలో నివసించే గిరిజనులను కాపాడే బాధ్యత నెరవేరుస్తారు. గిరిజన ప్రాంతాలను ప్రత్యేక మండలి ద్వారా గిరిజనులే పాలించే విధంగా, ఆ ప్రాంత భూములు వారికీ చెందే విధంగా ప్రత్యేక రాజ్యాంగ సదుపాయాలు కల్పించారు. షెడ్యూల్డు ఏరియాలకు మైదాన ప్రాంతీయులు ప్రవేశిస్తే భూములు అన్యాక్రాంతమవుతాయని, జీవనోపాధికి, సంస్కృతికి, మనుగడకు విఘాతం కలుగుతుందని అక్కడి ఉద్యోగాలు అక్కడి వారికే చెందాలని గవర్నరు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే జివో నెం. 3ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలువరించింది.

దళిత, గిరిజనులకు రాజ్యాంగం, చట్టాలు కల్పించిన ప్రత్యేక రక్షణ సదుపాయాలకు సంబంధించి సుప్రీం కోర్టు తరచుగా కుదుపులకు గురి చేస్తూనే ఉంది. 2018లో సుప్రీంకోర్టు అటవీ హక్కుల చట్ట ప్రకారం భూమి యాజమాన్యపు పట్టాలు లేని ఆదివాసీలను అడవి నుండి బయటకు నెట్టివేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో వెనక్కి తగ్గింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటిస్ చట్టం దుర్వినియోగం అవుతుందనే నెపంతో చట్టాన్నే నిరుపయోగం చేస్తూ తీర్పు ఇచ్చింది. దళితులు ప్రాణాలు బలిదానం చేస్తూ పోరాడటంతో తీర్పును సరిచేసుకుంది. దీంతో అసహనానికి గురైన మోదీ ప్రభుత్వం దళితులకు, ఆదివాసీలకు, గిరిజనులకు రక్షణగా నిలిచిన పౌరహక్కుల కార్యకర్తలను ఉపా చట్టం కింద జైళ్ళలో నిర్బంధించింది. అరుణ్ ఫెరేరా, సుధా భరద్వాజ్, సోమాసేన్, వెర్నన్ గోన్ సాల్వెజ్, సురేంద్రగాడ్లింగ్, మహేశ్ రౌత్, రోనా విల్సన్, సుధీర్ దాన్లే, వరవరరావులను అక్రమంగా 2018 నవంబర్ లో ఖైదు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు కరోనా రోగం సందర్భంగా ఖైదీలను జైలు నుంచి విడుదల చేస్తుంటే మన దేశంలో కక్షపూరిత మోదీ ప్రభుత్వం హక్కుల కార్యకర్తలైన ఆనంద్ తేల్ తుంబ్డే, గౌతం నవలాఖను 14, ఏప్రిల్ 2020న ఉపా చట్టం కింద జైలుకు పంపారు. తొంభై శాతం వికలాంగుడైన సాయిబాబా జైలులో ఆరోగ్యం పూర్తిగా క్షీణించినందున మరియు తన తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నందున పెరోల్ పై విడుదల చేయాలని పెట్టుకున్న పిటిషన్‌ను 27 ఏప్రిల్ 2020న తిరస్కరించారు. సుప్రీంకోర్టు, మోడీ ప్రభుత్వాల వైఖరుల్లో తేడా లేదని ప్రజలకు మరింత స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పాటికే 21 మంది ప్రజాసంఘాల కార్యకర్తలను ఉపా చట్టం కింద జైలుపాలు చేశారు.

రిజర్వేషన్ అనేది సామాజిక వివక్ష పునాదిపై ఏర్పడిన విధానం. సమాజంలోని ఆధిపత్య వ్యవస్థల ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న ఎస్సీ, ఎస్టీ, బిసి కులాలకు చెందిన మెజార్టీ ప్రజలకు ఊరట కలిగించడం కోసమే రాజ్యాంగ నిర్మాతలు ఈ రిజర్వేషన్లను కల్పించారు. వందల ఏళ్ళుగా సామాజిక వివక్షకు గురైన దళిత వర్గాన్ని కొంతమేరకైనా ప్రగతి పథం పట్టించేందుకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం సంకల్పించింది. హెచ్చుతగ్గుల కులాల సమ్మిళితమైన హిందూ సమాజంలో ఈ వర్గాలకు జరిగిన అన్యాయానికి పరిహారంగా ఈ రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది కాని 50 శాతం మించరాదని ఎక్కడా లేదు. అయినా కాని సుప్రీంకోర్టు 50 శాతం సీలింగ్ పెట్టింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి సమూహాలకు తీరని అన్యాయం జరుగుతుంది. శతాబ్దాలు గడుస్తున్నా కుల వివక్ష, అణచివేత, హింస హిందూ సమాజంలో ఇంకా సజీవంగానే కొనసాగుతుంది. అగ్రవర్ణాలకు దూరంగా దళితులు మురికివాడల్లో జీవిస్తున్నారు. దేవాలయాల ప్రవేశాలు నిరాకరించారు. దళితులు అత్యున్నత పదవులనలంకరించినా కూడా వివక్ష, దేవాలయాల ప్రవేశ నిరాకరణ కొనసాగుతుంది. ఈ వివక్ష తట్టుకోలేని కొంత మంది దళితులు ఇతర మతాలకు వెళ్ళిపోతుంటే ఆహ్వానించిన మత పెద్దలను చంపుతున్నారు. మరో వైపు ఘర్ వాపసీ పేరుతో వెంటాడి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వీరికి సేవకులు కావాలి కదా మరి? ఈ ప్రహసనం ఇన్నేళ్ళు కొనసాగుతున్న ఈ వివక్షపై ఎవరూ మాట్లాడరు, కోర్టులూ ప్రశ్నించవు. కాని సమీక్షల పేరుతో అగ్రవర్ణాలు, కోర్టులు నోటి కాడి బుక్కను కాలదన్నాలని చూస్తున్నాయి. రిజర్వేషన్లు ఎవరి బిక్షా కాదు. అణగారిన వర్గాలు పోరాడి సాధించుకున్న హక్కు. అగ్రవర్ణాలకు పోరాడిన చరిత్ర ఏనాడు లేదు. అయినా కూడా రిజర్వేషన్లు పొందారు.

అగ్రవర్ణాల్లోని పేదల ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు కావు. పేదరిక నిర్మూలన పథకం అంతకంటే కాదు. ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. ప్రభుత్వ అధికార హోదా ద్వార కుల వివక్షకు గురి కావాల్సిన వ్యక్తిగత హోదా పెరిగి కాలక్రమంలో కులమనే దురాచారం తొలుగుతుందనే రాజ్యాంగం సంకల్పం. అగ్ర కులాలలో పేదలుంటే పేదరిక నిర్మూలన పథకాలు అమలు పర్చాలి కాని ఏ ప్రాతిపదికన వీరికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు? దీనిని సుప్రీంకోర్టు ఎందుకు ప్రశ్నించలేదు? ఉన్న రిజర్వేషన్లనే సమీక్షించాలన్న మోహన్ భగవత్ కొత్త రిజర్వేషన్ల గురించి ఎందుకు పెదవి విప్పడం లేదు?

గత 70 ఏళ్ళుగా రిజర్వేషన్లు సరిగా అమలుపరచనందుకు ఏ ప్రభుత్వాన్నైనా సుప్రీంకోర్టు నిలదీయగలిగిందా? కోర్టు ధిక్కార నేరంగా పరిగణించిందా? ప్రపంచీకరణ ఫలితంగా సంభవిస్తున్న రిట్రెంచ్ మెంట్లు, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, ప్రైవేటీకరణ విధానాల ద్వారా సంక్షేమ స్వభావం నుండి రాజ్యం దళారీ రాజ్యంగా మారితే నష్టపోయేది పేద, దళిత వర్గాలే! దేశంలో ఈనాటికి ప్రభుత్వ రంగ సంస్థలలో పేరుకుపోయిన పోస్టుల భర్తీ చేస్తారని ఆశ పోయింది. సంవత్సరానికి కోటి ఉద్యోగాలిస్తామన్న కేంద్ర పాలకుల మాటలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర పాలకుల మాటలు నీటి బుడగలయ్యాయి. 6.83 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా పార్లమెంటులో ప్రకటించారు. కానీ భర్తీ చేసే హామీ ఇవ్వలేదు. పబ్లిక్ సెక్టార్ లోనే భర్తీ చేయని ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలుకు పాటు పడుతుందన్న నమ్మకం లేదు.

మన సాంఘిక వ్యవస్థలోని అసమానత, ఆధిపత్యం ప్రైవేటు రూపంలోని ఉద్యోగాలలో ప్రతిఫలిస్తుంది. దేశ విదేశాలలో ప్రైవేటీకరణ పెరిగే కొద్ది అప్రజాస్వామిక ధోరణి మరింత విస్తరిస్తుంది. వీటిని ఎదుర్కొనే ప్రజాతంత్ర కర్తవ్యం ప్రగతిశీలురందరి మీదా ఉంటుంది. రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పనిసరి బాధ్యత అని ఏ 16న అధికరణం శాసించలేదని సుప్రీంకోర్టు ఉటంకిస్తుందో అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఒక్క తాటి మీదికి వచ్చి ఆ అధికరణను మానవీకరించి రిజర్వేషన్లను రక్షించాలి. రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి పఠిష్టమైన రక్షణ కల్పించాలి.

No. of visitors : 181
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
  వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
  కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  సర్వాంతర్యామి!
  నడవాలెనే తల్లి- నడవాలెనే

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •