ఎల్జీ పాలిమర్స్ కంపెనీని శాశ్వతంగా మూసివేయాలి

| క‌ర‌ప‌త్రం

ఎల్జీ పాలిమర్స్ కంపెనీని శాశ్వతంగా మూసివేయాలి

- కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక కమిటీ | 15.05.2020 09:28:27pm


ప్రజలారా! ప్రజాస్వామికవాదులారా!

విశాఖలో మారణ హోమాన్ని సృష్టించిన ఎల్జ్ పాలిమర్స్ ఒక " గొప్ప ʹ కార్పొరేట్ కంపెనీ అని మన ముఖ్యమంత్రి జగన్ గారు విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటించారు. మరి ఆ మహా గొప్ప కంపెనీ స్టెరీర్‌ను ప్రమాదరహితంగా ఎందుకు నిర్వహించలేక పోయింది? లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలను తిరిగి ప్రారంభించేటపుడు పాటించాల్సిన నియమాలను పట్టించుకోకుండా క్షేత్రస్థాయిలో అనుమతులివ్వడంలో విజయసాయిరెడ్డి పాత్ర వుందనీ, వారి పెట్టుబడులు కూడా ఇందులో వున్నాయనే ఆరోపణలకు ప్రభుత్వం నుండి సమాధానం ఎందుకు లేదు. కంపెనీ యాజమాన్యం తనవైపు నుండి ప్రమాదానికి గల కారణాలను ఎందుకు ఇప్పటికీ బయటపెట్టలేదు? విలయాన్ని సృష్టించే అవకాశమున్న స్టెరీన్ ని భారీ నిల్వలతో భారీస్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ఒకవేళ విపత్తు సంభవిస్తే, విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్ మెంట్) గురించి ఆ ప్రాంత ప్రజలకు ఎందుకు అవగాహన కల్పించలేదు. ప్రభుత్వం గ్రీన్జోన్ కోసం కేటాయించిన 200 ఎకరాలను ఎల్జి కంపెనీ రియల్ ఎస్టేట్ గా ఎలా మార్చగలిగింది? దీనిలో ఎవరెవరి పాత్ర ఎంత?

పర్యావరణశాఖ, పరిశ్రమలశాఖ, కలెక్టర్ అధ్యక్షతన ఉన్న విపత్తుల నిర్వహణ కమిటీ నోరెందుకు మెదపడం లేదు? 7వ తేదీ తెల్లారి జామున కూడా ప్రజలు భయకంపితులై, తలోదిక్కు పిల్లలను, వృద్ధులను, బాలింతలను, వికలాంగులను మోసుకుంటూ హహాకారాలు చేస్తూ ఉంటే రాజకీయ నాయకత్వం, అధికార యంత్రాంగమూ కనీసం సకాలంలో ప్రకటన ఎందుకు చేయలేదు? కేవలం పోలీసు బలగాల తోనే ప్రజలను విపత్తుల కాలంలో కూడా నియంత్రించాలని ప్రభుత్వం ప్రయత్నించడం దేనికి సూచిక? వీటన్నింటికి సహేతుకమైన జవాబులు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర పాలకులకు ఉంది.

కానీ ఈ పాలకులు అందుకు సిద్ధపడలేదు. కాబట్టి ప్రభుత్వం కంపెనీకి కొమ్ముకాస్తున్నట్లుగా తేటతెల్లమయ్యింది. దానితో ప్రజలు నేరస్థ కంపెనీ యాజమాన్యంతోనే తేల్చుకోవడానికి కంపెనీ గేటు దగ్గర మృతదేహాలతో తే. 9-5-2020న ధర్నాకి దిగారు. కంపెనీని ఇక్కడ నుండి శాశ్వతంగా వెంటనే తొలగించాలని డిమాండ్ చేసారు. కానీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ వేశాము, వాటి రిపోర్టుల మీద ఆధారపడి తదుపరి చర్యలు తీసుకుంటాము అంటూ పోలీసుల చేత వారిని దౌర్జన్యంగా తొలగించింది. అదే సందర్భంలో కంపెనీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సాగించిన అక్రమాలనన్నింటిని తే. 10-5-2020 నాటి సాక్షి దినపత్రిక ద్వారా వెల్లడించింది. వారి పత్రిక బయటపెట్టిన నేరాలు ఆ కంపెనీని శాశ్వతంగా మూసివేయడానికి యాజమాన్యాన్ని, బాధ్యులైన అధికారులని, సంబంధిత వ్యక్తులని అరెస్టు చేయడానికి సరిపోవా? అంతేకాదు ఈ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో 2019లో, లాక్ డౌన్ తరువాత సడలింపుల క్రమంలో ఎఆ కంపెనీకి కూడా ఇచ్చిన అనుమతులని బయట పెట్టకుండా దాచేస్తున్నది. ఈ మొత్తం నేరంలో తమ పాత్రను కప్పిపుచ్చుకుంటూ కంపెనీని అక్కడే కొనసాగించడానికి అవసరమైన వాదనలు చేస్తున్నది. కంపెనీని అక్కడి నుండి శాశ్వతంగా తొలగించాలని స్థానికులు కోరుతున్నట్లుగా మరియు నిపుణులు, మేధావులు, ప్రజా సంఘాలు, పార్టీలు చేస్తున్న డిమాండ్ ను మోసపూరితంగా ప్రక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నది. స్టెరీన్ యొక్క విషతుల్య ప్రభావం నీటి వనరుల మీద, 15-20 కి.మీల పైగా రెడియలో నివాస ప్రాంతాల మీద ఏమేరకు ప్రభావం వుందో చేయాల్సిన సర్వేను ప్రక్కనబెట్టే ధోరణి వుంది.

ఈ సందర్భంలో విశాఖలోను, ఉత్తరాంధ్ర జిల్లాల్లోను విషతుల్య రసాయన పరిశ్రమల కారణంగా జరిగిన మారణకాండను, విధ్వంసాన్ని ఒక్కసారి చూద్దాం. 1997 సెప్టెంబర్ 14న హెచ్ పిసిఎల్ లో గ్యాస్ లీక్ తో భారీ ప్రేలుళ్ళు జరిగి మంటల్లో 60 మంది చనిపోగా, 2013లో అదే కంపెనీలో కూలింగ్ టవర్ కూలీ 30 మంది బలైపోయారు. 2013 జనవరి 5న హెటిరో డ్రగ్స్ కంపెనీలో రియాక్టర్ పేలి 4గురు చనిపోయారు. 2015 సెప్టెంబర్ లో పరవాడ సాయినాధ్ కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. 2015 ఆగస్టు 24న రాంకీ ఎఇజెడ్లో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. కార్మికులు బయటకు పరుగులు తీసి పెద్ద ప్రాణ నష్టం నుంచి బయట పడ్డారు. పాయకరావుపేట మండలం కేశవరం గ్రామంలోని డెక్కన్ ఫైన్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ ప్రేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. గ్లోకెం ఫార్మా కంపెనీలో రియాక్టర్లు ప్రేలి భారీ ప్రమాదాలు జరిగాయి. 2016 మార్చి 6న దివిస్ లేబొరేటరీస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అరబిందో ఫార్మా కంపెనీలో పలుసార్లు జరిగిన ప్రమాదాల్లో 8 మంది చనిపోయారు. 2012లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో గల ఎన్.ఏ.సి.ఎల్ ఎరువుల కర్మాగారంలో భారీ ప్రమాదంతో చుట్టు ప్రక్కల పలు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పరవాడ ఫార్మా సిటిలోని ఎడ్డుకో బయోఫోర్ కంపెనీలో ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు చనిపోయారు. ఇంకా అనేక ఘటనలు జరిగాయి.

దేశంలో, రాష్ట్రంలో మొత్తంగా ప్రపంచంలో అమలవుతున్న సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ప్రకృతి విలయాలను, విపత్తులను సృష్టిస్తున్నాయి. భారీ పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు భారీగా సంపదను కొన్ని కంపెనీల చేతుల్లోకి ప్రోగు చేస్తున్నాయి. అవి కార్పొరేట్ కంపెనీలుగా మారి ప్రకృతితో చెలగాటమాడుతున్నాయి. ప్రకృతిని, పర్యావరణాన్ని, జీవావరణాన్ని సమూలంగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే గాలిలో, నీటిలో, భూఉపరితలంపైన డెడ్ జోన్స్ (మృత్యు కుహారాలు) ఏర్పడే పరిస్థితి దాపురించింది. గ్లోబల్ వార్మింగ్ (భూగోళం వేడెక్కడం) ప్రకృతి విలయాలన్నింటికి కేంద్రంగా ఉంది. స్మార్ట్ సిటీగా, అందాల సిటీగా ప్రచారం చేసి పెట్టుబడులను సమీకరించి పర్యాటకాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేసే మార్గాన్ని అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు గత నాలుగు దశాబ్దాలుగా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో అమలు చేస్తున్న నూతన, ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు ఇప్పుడు గోపాలపట్నం ప్రాంతాన్ని తే. 7-5-2020న మృత్యు కుహరంగా మార్చివేసింది.

ఈ కంపెనీలు రోజూ గాలిలోకి, నీటిలోకి, భూమిలోకి వెదజల్లుతున్న విషతుల్య రషాయనాల వల్ల మనుషులు, ఇతర జీవరాశు లు, ఆహార పంటలు సమస్త ప్రకృతి కాలుష్యం బారినపడి ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు.

కేన్సర్ రోగం ఈ కాలంలోనే భారీగా విస్తరించి ఆరోగ్యశ్రీ తదితర మెడికల్ స్కీమ్ ల ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్ళ పంట పండిస్తుంది. ఇతర శ్వాసకోస, జీవకోశ, లివర్, కిడ్నీ, థైరాయిడ్, బిపి, షుగర్ తదితర దీర్ఘకాలిక జబ్బుల పీడితులుగా ప్రైవేటు ఆసుపత్రులకు, ఫార్మా కంపెనీలకు, డయోగ్నోస్టిక్ సెంటర్లకు రెగ్యులర్ కష్టమర్లుగా ప్రజలు మారి కాలం వెళ్ళదీస్తున్నారు. అనేక సంఘటనల సందర్భంలో ఈ విషయాలన్నీ చర్చలోకి వస్తూనే ఉన్నాయి. కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యం, ప్రభుత్వాధికారుల బాధ్యతారాహిత్యం , రాజకీయ నాయకత్వాల నిర్లిప్తత, న్యాయవ్యవస్థ ఉదాశీనతా నిరంతరం ప్రశ్నించబడుతూనే ఉన్నాయి. అయినా పాలకులు ఈ నాలుగు దశాబ్దాలలో కార్పొరేట్ శక్తులకే, భారీ పెట్టుబడులకే, భారీ పరిశ్రమలకే సమస్త వనరులు కట్టబెట్టారు. చట్టాల ప్రకారం ఉల్లంఘనలుగా పరిగణించినవన్నీ కాలక్రమంలో ఈ దోపిడీ విధానాలు పూర్తిగా పైచేయి సాధించిన నేపథ్యంలో చట్టబద్ద చర్యలుగా మారిపోయాయి.

ఈ నేపథ్యంలోనే ఒకవైపు తనిఖీలను నిరోధిస్తూ, పర్యవేక్షణను ఆటంకపరుస్తూ పర్యావరణ, పరిశ్రమల, కార్మికశాఖల అధికారాలను కత్తిరిస్తూ ఉంటే, మరోవైపు ఉనికిలో ఉన్న నిబంధనలను అమలుచేసే అధికారులను కూడా డబ్బుకి, రాజకీయ వత్తిళ్ళకు దాసోహం చేస్తుంటే అశేష ప్రజానీకమంతా బాధితులుగా, రోగపీడితులుగా నెట్టబడుతున్న స్థితి ఉనికిలోకి వచ్చింది.

మొత్తం ఈ దగాకోరు కుట్రపూరిత విధానాలను కప్పిపుచ్చుకోవటానికి, నేరస్తులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లను ముందుకు రానీయకుండా చేయటానికి అధికారంలో ఎవరున్నా అది మోడీ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా, సోనియా అయినా ఎవరైనా సరే పరిహారాల చెల్లింపులతో నేరాలను కప్పిపుచ్చుతున్నారు. అదే ప్రహసనం నేడూ నడుస్తున్నది. దోషులను గుర్తించి, వారిని శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలనే నిజాయితీని వీరెవ్వరూ ప్రదర్శించడం లేదు.

కరోనా విపత్తు ఒకవైపు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఎల్జి పాలిమర్స్ లో భారీ ప్రమాదం చోటు చేసుకున్నది. అదే కాలంలో వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రాలలో, దేశాలలో చిన్నవి, పెద్దవి ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే. ఉనికిలో ఉన్న నామామాత్రపు చట్టాల వర్తింపు లేక పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏ సంకోచం, బిడియం, భయం లేకుండా పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక తదితర పర్యవేక్షించాల్సిన చట్టాలనన్నింటిని అటకెక్కిస్తున్నారు. ఇది మరిన్ని ప్రమాదాలను సృష్టించే అవకాశమున్నది. పారిశ్రామిక ప్రమాదాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించరాదనే వైఖరిని ఇప్పటికే చట్టాల్లో ప్రభుత్వాలు చొప్పించాయి.

పాలకులు వెల్లువెత్తుతున్న ప్రజా నిరసనను ఒకవైపు నష్టపరిహారాల ప్రకటనలతోనూ, పోలీసు బలగాలతోనూ అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు మనం ఎదుర్కొంటున్న కరోనా విపత్తు అయినా, ఎజ్రా పాలిమర్స్ దక్షిణ కొరియా దేశానికి చెందిన బహుళజాతి కంపెనీ సృష్టించిన విపత్తు అయినా సామ్రాజ్యవాద దోపిడీ విధానాల నేపథ్యంలోనే ఉనికిలోకి వచ్చాయిని నిర్ధారణకు రావల్సి ఉంది. కనుక ఎల్జి పాలిమర్స్ కంపెనీ సాగించిన నేరానికి బాధితులుగా మారిన వేలాది కుటుంబాలకు మనం అండగా నిలబడాలి.

ఇప్పటికే ఉత్తరాంధ్రలో సాగిన వివిధ ప్రజా పోరాటాల నుండి స్ఫూర్తిని పొంది ఉద్యమించాలి. 1991 సరళీకృత ఆర్ధిక, పారిశ్రామిక విధానాల నేపథ్యంలో నెల్లిమర్ల కార్మికవర్గం సాగించిన ప్రాణత్యాగ వీరోచిత పోరాటం, గంగవరం పోర్టు వ్యతిరేక ఉద్యమం, పచ్చని పంట పొలాలను, చిత్తడి నేలలను థర్మల్ పవర్ ప్లాంట్ కు అప్పజెప్పడానికి వ్యతిరేకంగా సోంపేట, కాకరాపల్లి ప్రాంత ప్రజలు చేసిన రక్తతర్పణం, బాక్సైట్ త్రవ్వకాలు, శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ మరియు ఎస్.కోటలోని బొడ్డవర ప్రాంత ఆదివాసీలు సాగించిన ఉద్యమం మనకి ఆదర్శంగా నిలుస్తాయి.

ఈ ఉద్యమాలు చూపిన బాటలో ఎల్జి పాలిమర్స్ యాజమాన్యాన్ని, ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసి శిక్షించాలనీ, స్టెరిన్ ఆవిరి బాధితులందరిని సమగ్ర సర్వేతో గుర్తించి జీవితకాలం వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలనీ, విశాఖనగరం మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విధ్వంసకర, విషతుల్య రసాయనాలను వెదజల్లే పరిశ్రమలన్నింటిని శాశ్వతంగా మూసివేలనీ, వ్యవయాధారిత, పర్వావరణహిత, సమగ్ర-సమతుల్య-సమ్మిళిత, చిన్నతరహా, మానవాధారిత పరిశ్రమలను నెలకొల్పాలనీ, డిమాండ్ చేస్తూ ఉద్యమించాల్సి వుంది. దీనికోసం అన్ని శక్తులూ ఏకమై బలమైన విధ్వంసకర అభివృద్ధి వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాం!

పోరాడుదాం! పాలకులు సాగిస్తున్న విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా!

IFTU - POW - CLC - CMS - MNSS - AIKMS

అరుణోదయ - భానాస - దళిత విముక్తి - దళిత హక్కుల సమాఖ్య - ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక

కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక కమిటీ - రాజకీయ ఖైదీల విడుదల కమిటీ

11-05-2020

No. of visitors : 179
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
  వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
  కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  సర్వాంతర్యామి!
  నడవాలెనే తల్లి- నడవాలెనే

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •