షావ్‌శాంక్ జైలు నుంచి విముక్తి!

| సాహిత్యం | స‌మీక్ష‌లు

షావ్‌శాంక్ జైలు నుంచి విముక్తి!

- శివ ల‌క్ష్మి | 15.05.2020 09:54:32pm


ʹఇది చాలా విచిత్రమైన, తమాషా అయిన విషయం. బయట ప్రపంచంలో నేను చాలా నిజాయితీపరుణ్ణి. తెరిచిన పుస్తకాన్ని. ప్రజల మనిషిని. ఏ వంకరా లేని బాణం లాంటి వాణ్ణి. కానీ నేను హత్యలు చేసే హంతకుడిగా, పరమ దుర్మార్గుడిగా, వంకరగా ఉండటానికి జైలుకి రావలసివచ్చిందిʹ!-అని ఈ సినిమా కథానాయకుడు తనలో తాను అనుకుంటాడు. ఈ వాక్యాలు మనకి ఎంతో ఆప్తులైన, జీవితమంతా అట్టడుగు ప్రజల కోసం పోరాడుతూ అన్యాయంగా జైలు పాలైన ఎందరో మన ప్రజల్ని గుర్తుకి తెస్తున్నాయి కదూ?

చీకటి రోజుల్లో భవిష్యత్తు మీద అపరిమితమైన ఆశనూ, భరోసానూ కలిగించే అపూర్వమైన జైలు చిత్రం "ది షావ్‌శాంక్ రిడంప్షన్" (Shashaw Redemption). ʹఆండీ డుఫ్రెస్నేʹ అనే వ్యక్తి రెండు హత్యలు చేశాడనే నేరం మోపబడి, రెండు జీవిత ఖైదులు విధించబడి జైలు పాలవుతాడు. జైలులో అతనికి భరింపరాని భయంకరమైన పరిస్థితులెదురైనప్పటికీ, తన విశ్వాసాల పట్ల దృఢంగా ఉండి, ఆశా వహంగా జీవించి, అత్యంత సాహసోపేతంగా విముక్తిని సాధిస్తాడు. అంతేగాక మరొక జీవిత ఖైదు ననుభవిస్తున్న ʹరెడ్ʹ అనే అతనితో గాఢమైన స్నేహబంధంలో ఉండి ఇద్దరూ నిజమైన స్వేచ్చను అనుభవంలోకి తెచ్చుకోవడమే ఈ చిత్ర సారాంశం! ఈ చిత్రానికి ʹఫ్రాంక్ డారాబాంట్ʹ స్క్రీన్ రైటింగ్ తో పాటు దర్శకత్వం కూడా నిర్వహించారు. దీని నిడివి 142 నిమిషాలు.

ఈ చిత్ర కథలోకి వెళ్తే: ʹఆండీ డుఫ్రెస్నేʹ(టిమ్ రాబిన్స్) ఒక బ్యాంక్ అధికారి. 1947లో అతను, అతని భార్యనీ, ఆమె ప్రియుణ్ణీ ఇద్దర్నీ హత్య చేశాడనే అభియోగాన్ని న్యాయస్థానం మోపుతుంది. తాను నిర్దోషినని ఆండీ ఎంత మొత్తుకున్నప్పటికీ రెండు హత్యలు చేసిన కౄరమైన నేరస్థుడిగా కోర్ట్ నిర్ధారించి, రెండు జీవిత ఖైదులు విధించి, మైనే లోని షావ్‌శాంక్ స్టేట్ జైలుకి పంపుతుంది.

అదే జైల్లో మరొక జీవిత ఖైదు ననుభవిస్తున్న ఎల్లిస్ ʹరెడ్ʹ రెడ్డింగ్ (మోర్గాన్ ఫ్రీమాన్) అనే అతనుంటాడు. ఒక రోజు ʹరెడ్ʹ, అతని తోటి ఖైదీలు, బస్సు నిండా వచ్చిన కొత్త ఖైదీలను చూస్తారు. వారిలో ఆండీ కూడా ఉంటాడు. జైలులో వారి మొదటి రాత్రి సమయంలో ఎవరు ఏడుస్తారో, ఎవరు ఏడవకుండా నిబ్బరంగా గడుపుతారో చూద్దామని పాత ఖైదీలు పందెం వేసుకుంటారు. వారందరిలో ʹఆండీ డుఫ్రెస్నేʹ అనే పొడవైన, సన్నని, అందమైన వ్యక్తి, రెడ్ దృష్టి నాకర్షిస్తాడు. అతనికి ఆండీ పసికందులా కనిపిస్తాడు. ʹబలంగా గాలి వీస్తే పడిపోయే టట్లున్నాడు. ఈ రాత్రి జైల్లో ఆండీ ఏడుస్తాడు, అతనిక్కడ బతక లేడంʹటూ రెడ్, ఆండీ మీద పందెం కాస్తాడు రెడ్. కానీ ఆ రాత్రి ఆండీ ఏడవలేదు, తాను నిరపరాధి ననే గొప్ప నమ్మకంతో ఎదురైన సవాళ్ళ నెదుర్కొంటూ కట కటాల వెనక ఓపిగ్గా కాలం గడుపుతాడు. ʹరెడ్ʹ ఓడిపోయి పందెంలో కాసిన సిగరెట్లను కోల్పోతాడు. ఆవిధంగా ʹఆండీʹ, మొదటిసారి ʹరెడ్ʹ కి పరిచయమవుతాడు. షావ్‌శాంక్ జైలులో ఆండీ డుఫ్రెస్నే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు.

ఒక అవినీతి వార్డెన్ ʹశామ్యూల్ నార్టన్ʹ (బాబ్ గుంటన్) ని, కౄరుడైన ʹకెప్టెన్ బైరాన్ హాడ్లీʹ (క్లాన్సీ బ్రౌన్)నీ, అతని నేతృత్వంలోని శాడిస్టిక్ గార్డులతో సహా రకరకాల మనస్తత్వాలున్నవాళ్ళతో పడరాని కష్టాలు పడతాడు ఆండీ. జైలు జీవితం లోని భయంకరమైన, వికారమైన వాస్తవాలు త్వరలోనే ఆండీకి పరిచయమవుతాయి. కొంతమంది మొరటు ఖైదీలు అత్యాచారం, కొట్టడం లాంటి వికృత చేష్టలతో ఇతరులను హింసించడంలోనూ, ఆధిపత్యం చెలాయించడంలోనూ ఆనందిస్తూ తమ పెత్తనాన్ని చెలాయించేవారు తారసపడతారు. వార్డెన్ నార్టన్ ఆండీని జైలు లాండ్రీలో పని చేయడానికి నియమిస్తాడు. అక్కడ తరచుగా ఆండీ ʹబోగ్స్ʹ, అనే దుర్మా ర్గుడు, అతని గాంగ్ చేత లైంగిక వేధింపులకు గురవుతాడు ఆండీ. బోగ్స్ బృందం ఆండీని దాదాపు చనిపోయేంత భీకరంగా కొట్టి హింసిస్తారు. కానీ ఆండీ బెదిరిపోకుండా నిగ్రహంగా ఉంటాడు. అతని దృఢ నిశ్చయం, ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది!

ఆండీ మీద జరిగిన దాడి తర్వాత కెప్టెన్ బైరాన్ హాడ్లీ, బోగ్స్‌ గాంగ్ ను కొట్టి వికలాంగులను చేస్తాడు. తర్వాత అతన్నీ అతని గాంగ్ నీ మరొక జైలుకు బదిలీ చేస్తాడు. తర్వాత జైలు లైబ్రరీకి ఇన్ చార్జ్ గా పనిచేస్తున్న వృద్ధ ఖైదీ ʹబ్రూక్స్ హాట్లెన్ʹ కి సహాయకారిగా పని చెయ్యమని ఆండీని నియమిస్తాడు వార్డెన్ నార్టన్. ఒకసారి కెప్టెన్ బైరాన్ హాడ్లీ 1949లో వారసత్వ పన్ను గురించి, వార్డెన్ నార్టన్ కి ఫిర్యాదు చేస్తుండగా ఆండీ వింటాడు. వాటి గురించి తనకు తెలుసునని చెప్పి, ఆండీ తన బ్యాంక్ అకౌంటింగ్ నైపుణ్యాలతో ఆ డబ్బును చట్టబద్ధంగా సంరక్షించడంలో వార్డెన్ నార్టన్ కి సహాయం చేస్తాడు. ఇక అది మొదలుకొని వరసగా ఆండీకి పనులప్పగిస్తాడు వార్డెన్. జైలు సిబ్బంది ఆర్థిక విషయాలను నిర్వహించమని ఆండీని ఆదేశిస్తాడు. ఆండీ క్షీణిస్తున్న జైలు లైబ్రరీని మెరుగు పరచడానికి నిధులను కోరుతూ, రాష్ట్ర శాసనసభకు ప్రతి వారం క్రమం తప్పకుండా లేఖలు రాస్తాడు. ఆండీ లేఖలకు స్పందించిన శాసనసభ లైబ్రరీకి విరాళాలు పంపుతుంది. ఆ విధంగా జైలు గ్రంథాలయాన్ని మెరుగు పరుస్తాడు ఆండీ. అతని చిత్తశుద్ధితో నెమ్మదిగా గార్డులు, తోటి ఖైదీల ఆదరాభిమానాలను సంపాదించుకుంటాడు. ʹరెడ్ʹ తో సహా - అతను చేస్తున్న ఈ పనుల వల్ల చాలా మంది ఖైదీలకు కొంత గౌరవాన్ని తెచ్చిపెట్టి వారందరూ ఆత్మగౌరవంతో జీవించేలా చెయ్యగలుగుతాడు! క్రమంగా జైలులో ʹరెడ్ʹ తో స్నేహం బలపడడమే గాక తన సుదీర్ఘ కాలంలో ఇతర ఖైదీలందరి ప్రశంసలు పొందుతాడు. వారు ఆండీలో ఒక ధైర్యాన్ని, సమగ్రతను అనుభూతి చెందుతారు!

షావ్‌శాంక్ జైల్లో చాలాకాలం నుంచి ఉంటున్న రెడ్ బయట నుంచి సిగరెట్లు, మిఠాయి, జియాలజిస్ట్ ఆండీ అడిగిన రాళ్ళు - ఇలా ఏవస్తువునైనా తెప్పించగల వ్యవహార దక్షత గలవాడు. ఆండీ కోరిక ప్రకారం ఆయన కోసం ఒక రాతి సుత్తి, ʹరీటా హేవర్త్ʹ అనే హీరోయిన్ యొక్క పెద్ద సినిమా పోస్టర్‌ను తెప్పించి ఇస్తాడు రెడ్! క్రమంగా ఆండీ- రెడ్ ల మధ్య రోజు రోజుకీ స్నేహం బలపడి, ఇరవై సంవత్సరాల జైలు జీవితంలో వారిద్దరూ విడదీయరాని ఆత్మీయ స్నేహితులవుతారు! తర్వాత కాలంలో ఏవిషయాన్నైనా నిస్సంశయంగా పంచుకోగల గాఢమైన ప్రాణస్నేహితులవుతారు!

వార్డెన్ కోసం పని చేసే టప్పుడు, బుక్కీపింగ్ పుస్తకాల ద్వారా అతను లంచాలు తీసుకుంటున్నట్లు గమనిస్తాడు ఆండీ. వార్డెన్ అక్రమ వ్యాపార పథకాలను రికార్డు చేస్తూ, జైలు సిబ్బందిలో ఎక్కువ మందికి వస్తున్న రాబడులపై ప్రత్యేకమైన నిఘా ఉంచుతాడు ఆండీ! వార్డెన్ కి ఆండీ చేస్తున్న పని గురించి అందరికీ తెలుసు. అతని చట్టపరమైన ఆర్ధిక చతురత వల్ల, అత్యంత అవినీతి పరుడైన వార్డెన్ కూడా కొంత కాలం తర్వాత అతన్ని లైబ్రరీలోని జైలు ఉద్యోగం నుండి తొలగించి తన కార్యాలయానికి కేటాయిస్తాడు. అక్కడ వార్డెన్ అక్రమ సంపాదనలపై ట్యాబ్‌లతో గుర్తులు పెడతాడు. స్థానిక జైలు వ్యవస్థలో చాలా మంది అధికారులకు పన్నులు, పెన్షన్ ప్రణాళికలు చేస్తున్నందువల్ల అతని పేరు, కీర్తి వ్యాప్తి చెందుతాయి. ఖైదీల శ్రమకు లాభం చేకూర్చ డానికి అన్ని రకాల పథకాలను వార్డెన్ అనధికారిక భాగస్వామిగా రూపొందింస్తుంటాడు. ఆండీ ప్రతిభ, తెలివితేటలు రెండువైపులా పదునైన కత్తిలా, ఒకే సమయంలో వార్డెన్ కి వనరుగానూ, సవాలుగా కూడా పనిచేస్తాయి. అయితే ఆండీ వార్డెన్ రక్షణను అవసరమున్నంత వరకు మాత్రమే పొందుతాడు. ఈ సెటప్ వార్డెన్ కి కూడా అవసరమే గనుక ఈ జైలులోనే ఆండీని ఖైదీగా ఉంచడంలో అతని స్వార్ధం అతనికి ఉంది!

50 సంవత్సరాలు జైలులో పనిచేసిన తరువాత ʹబ్రూక్స్ హాట్లెన్ʹ 1954 లో విడుదలవుతాడు. కానీ అతను బయటి ప్రపంచంలో సర్దుకుని బతకలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు! 1963 లో వార్డెన్ జైలు కార్మికులను అన్ని పనులకూ ఉపయోగించు కుంటూ, శ్రమ దోపిడీ చేయడం ప్రారంభిస్తాడు. నైపుణ్యం కలిగిన కార్మికుల వ్యయాలను తగ్గించి, లంచాలు తీసుకుంటూ లాభం పొందుతుంటాడు. అది గమనించిన ఆండీ "రాండాల్ స్టీఫెన్స్" అనే అలియాస్ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, అందులో వార్డెన్ అక్రమ సంపాదనలో వచ్చిన డబ్బును జమ చేస్తుంటాడు!

జైలు కాపలాదారుల నుంచి మెప్పు, వార్డెన్‌ అనుగ్రహం పొందిన తర్వాత కొంత స్వేచ్ఛగా ఆఫీసు లోపలికి వెళ్ళి, లోపలినుంచి తాళాలు వేసుకుంటాడు. తన సీట్ లో కూర్చుని ʹది మ్యారేజ్ ఆఫ్ ఫిగరోʹ అనే ఒపెరా లోని సంగీత నాటకపు గ్రామఫోన్ రికార్డు లోని ఒక భాగాన్ని ఆన్ చేసి చొరవగా తోటి ఖైదీలందరికీ వినపడేటట్లు పెద్దగా పెడతాడు. ఆ మనోహరమైన సంగీత ప్రభావానికి ఖైదీలందరూ ఎక్కడికక్కడ స్థాణువుల్లా నిలిచిపోయి తన్మయంగా వింటుంటారు. కళ్ళు మూసుకుని మైమరిచి వింటున్నప్పుడు అతని ముఖ మంతా స్వచ్ఛమైన ఆనందంతో విప్పారుతుంది. ఆ క్షణంలో, అతను స్వేచ్చా జీవి. కానీ జైలు ప్రశాంతత కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, అంతలోనే వార్డెన్‌ తన సిబ్బందితో రంకెలు వేస్తూ వస్తాడు. తలుపులు దబదబా బాదుతాడు. ఆండీ ఇంకా వాల్యూం పెంచుతాడు. వార్డెన్‌ గాజు తలుపులు బద్దలు కొడతాడు. అప్పుడు నింపాదిగా తన పరవశం నుంచి బయటి కొస్తాడు ఆండీ. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ ను అనధికారికంగా వాడినందుకు ఆండీని ఒంటరి సెల్ లో నిర్బంధిస్తాడు వార్డెన్. కొంత కాలం తర్వాత ఆండీని విడుదల చేస్తాడు.

1965 లో ʹటామీ విలియమ్స్ʹ అనే ఒక చురుకైన యువకుడు దొంగతనం చేసి, జైలుకొస్తాడు. ఆండీ, రెడ్ లు అతనితో స్నేహం చేస్తారు. ఆండీ అతనికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించటానికి సహాయం చేస్తాడు. ఒక సంవత్సరం తర్వాత, టామీ మరొక జైలులో ఉన్న అతని సహ నిందితుడు, ఆండీ దోషిగా నిర్ధారించబడిన హత్యలకు బాధ్యుడనే వాస్తవాన్ని భోజనాల సమయంలో అందరిముందూ ఆండీ, రెడ్ లకు వెల్లడిస్తాడు. ఈ సమాచారంతో ఆండీ వార్డెన్‌ ను సంప్రదిస్తాడు, కాని అతను వినడానికే నిరాకరిస్తాడు. ఆండీ కోపంగా వార్డెన్‌ నార్టన్ లంచాల గురించి ప్రస్తావిస్తాడు. నార్టన్ రెచ్చిపోయి, గార్డులను పిలిచి, ఆండీ ఈ హత్యలు చెయ్యలేదనే వాస్తవాన్ని నోరెత్తి మాట్లాడకుండా చెయ్యడానికి అతన్ని తిరిగి ఒంటరి సెల్ కి దౌర్జన్యంగా తరలిస్తాడు. తర్వాత టామీ ఎక్కడ నిజం చెప్తాడోనని పనుందని పిలిపించి, హాడ్లీ చేత హత్య చేయిస్తాడు వార్డెన్‌. పైగా అన్యాయంగా టామీ నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని నింద మోపుతాడు. టామీ హత్యతో నిర్దోషినని నిరూపించుకునే ఆశ అడుగంటి పోవడంతో ఆండీ లంచాలను నిలిపి వేస్తానంటాడు. కాని నార్టన్ లైబ్రరీని నాశనం చేస్తాననీ, ఆండీ రక్షణను కాపలాదారుల నుండి తొలగించి, అతనికి అధ్వాన్నమైన పరిస్థితుల్ని కల్పిస్తాననీ బెదిరిస్తాడు!

ఆండీ రెండు నెలల తర్వాత ఒంటరి సెల్ నుండి విడుదలవుతాడు. ʹరెడ్ʹ తో తన కలను నిజంచేసుకునే ప్రయత్నం చేస్తానని అంటాడు. జ్ఞాపకశక్తి లేకుండా బాధల్ని మరిపించి, మనమీద మనకి శ్రాద్ధాసక్తులు కలిగించి స్వేచ్చగా జీవించడానికి అనువైన ప్రదేశమైన, మెక్సికన్ తీరప్రాంత పట్టణం ʹజిహువాటానెజోʹ(Zihuatanejo) లో నివశించటం తన కల అని ఆండీ, రెడ్‌ తో చెప్తాడు. రెడ్‌ సందేహాస్పదంగా చూస్తూ ʹఇది చాలా ప్రమాదకరమైన ఆలోచనʹ అని వారిస్తాడు. ఆండీ పట్టించుకోకుండా బక్స్ టన్ (Buxton) సమీపంలో ఉన్న ఒక నిర్దిష్ట హేఫీల్డ్ గురించి చెబుతాడు, విడుదలయ్యాక, అక్కడ తను పాతిపెట్టబోయే ఒక ప్యాకేజీని తీసుకోమని కూడా ఆండీ, రెడ్ కి చెబుతాడు. ఆండీ మానసికంగా కుంగిపోతున్నాడని, మరీ ముఖ్యంగా తోటి ఖైదీని 6 అడుగుల తాడు కోసం అడిగాడని తెలిసినప్పుడు, ఆండీ శ్రేయస్సు గురించి, ఆత్మహత్య చేసుకుంటాడేమోనని రెడ్ బాగా వ్యాకుల పడతాడు!

మరుసటి రోజు ఆండీ చనిపోలేదు, కానీ అతనక్కడ అతని సెల్ లో ఉండడు! రోల్ కాల్ వద్ద, గార్డులు ఆండీ సెల్ ఖాళీగా ఉన్నట్లు కనుక్కుంటారు. వార్డెన్‌ ఆగ్రహంతో ఊగిపోతూ ఆండీ సెల్ గోడపై వేలాడుతున్న హీరోయిన్ ʹరాక్వెల్ వెల్చ్ʹ(Raquel Welch) పోస్టర్ మీద ఒక రాతిని విసురుతాడు. ఆశ్చర్యం! గత 19 సంవత్సరాలుగా తన రాతి సుత్తితో ఆండీ తవ్విన సొరంగం కనిపిస్తుంది. ముందురోజు రాత్రి జైలు మురుగునీటి పైపు ద్వారా తప్పించుకోవడానికి తాడును ఉపయోగించి, ఆండీ తప్పించుకున్నాడని అక్కడున్న వారికి అర్ధమవుతుంది. వార్డెన్‌ నార్టన్ సూట్, బూట్లు, లంచాలకు సంబంధించిన లెడ్జర్ బుక్ కూడా తీసుకొని, 500 అడుగుల దూరం మల మూత్రాలలో ఈదుకుంటూ వెళ్ళి, పసిఫిక్ సముద్రంలో స్వేచ్చగా రెక్కలల్లార్చుకుని ఈది స్వచ్చమైన స్పటికంలా తేలి మెక్సికో తీర ప్రాంతానికి చేరుకుంటాడు!

నార్టన్ ఆజ్ఞ ననుసరించి, గార్డులు అతని కోసం వెతుకుతున్నప్పుడు, ఆండీ ఎవరూ గుర్తు పట్టకుండా ఉంటా ʹరాండాల్ స్టీఫెన్స్ʹ వేషంలో ఉంటాడు. నార్టన్ లంచాల ద్వారా పొందిన డబ్బును అనేక బ్యాంకుల నుండి ఆండీ విత్ డ్రా చేసుకుంటాడు. షావ్‌శాంక్ జైల్లో జరిగిన అవినీతి, హత్యలకు సంబంధించిన లెడ్జర్, ఇతర ఆధారాలను రుజువులతో సహా స్థానిక వార్తాపత్రికలకు విడుదల చేస్తాడు! రాష్ట్ర పోలీసులు షావ్‌శాంక్ వద్దకు వచ్చి హాడ్లీని అదుపులోకి తీసుకుంటారు. నార్టన్ కోసం వచ్చేముందే ఆత్మహత్య చేసుకుంటాడు!
40 సంవత్సరాల జైలు జీవితం తర్వాత, రెడ్ విడుదలవుతాడు. అతను జైలు వెలుపల సర్ధుకుని ఎప్పటికీ జీవించలేనేమోనని ఆత్మహత్య చేసుకున్న బ్రూక్స్ ని తల్చుకుని భయపడతాడు. ఆండీకి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసుకుంటూ, అతను బక్స్ టన్ ను సందర్శిస్తాడు. అక్కడ ఒక కవర్ లో డబ్బును, ఆండీ ʹజిహువాటనేజోʹ కు రావాలని కోరుతూ రాసిన ఒక లేఖను చూస్తాడు. టెక్సాస్‌లోని ఫోర్ట్ హాంకాక్‌కు ప్రయాణించి, మెక్సికో సరిహద్దును దాటి జిహువాటనేజోలోని ఒక బీచ్‌లో ఆండీని చూస్తాడు. తిరిగి కలిసిన ఇద్దరు స్నేహితులు సంతోషంగా ఆలింగనం చేసుకుంటారు! ఇదీ కథ. కానీ దృశ్యమాధ్యమాన్ని మాటల్లో వర్ణించలేం! ఎవరికి వారు ఈ చిత్రీకరణను చూచి ఆస్వాదించాలే తప్ప భాషకి ఒదగదు!

1982 లో ʹస్టీఫెన్ కింగ్ʹ(Stephen King) రాసిన పెద్ద కథ ʹరీటా హేవర్త్ అండ్ షావ్‌శాంక్ రిడంప్షన్ʹ అనే చిన్న నవల ఆధారంగా పదునైన అంతర్దృష్టులతో జైలు శిక్ష సంస్థాగతీకరణ స్వభావాన్ని ప్రతిభావంతంగా, అత్యంత నేర్పుగా దృశ్యీకరించాడు దర్శకుడు ఫ్రాంక్ డారాబాంట్. ఈ చిత్ర కథ 1947 నుండి 1967 వరకు క్రమబద్ధమైన రీతిలో రెండు దశాబ్దాల పాటు నెమ్మదిగా గడిచినట్లు ప్రతిబింబి స్తుంది. ఈ చిత్రంలో కీలకమైన సంఘటనలు జరిగినప్పుడు, ఎవరి స్వంత జీవితం వారికి ఉన్నట్లు అనిపిస్తుంది.

ʹషావ్‌శాంక్ రిడంప్షన్ʹ అనేది మామూలు అర్ధంలో ఇది "జైలు నాటకం" కాదు. ఇది హింస, అల్లర్లు లేదా శ్రావ్యమైన నాటకం గురించి కాదు. ఒక మనిషి జీవితంలో 10, 20, 30-ఇలా సంవత్సరాల తరబడి మార్పులేని రోజువారీ దినచర్యలో జైలు జీవితం ప్రవహించడం ప్రేక్షకుల ముందు సాక్షాత్కారమవుతుంది! అందుకే ట్టారు"విముక్తి" అనే పదాన్ని శీర్షికగా పెట్టారు.
షావ్‌శాంక్ జైల్లో చాలాకాలం నుంచి ఉంటున్న రెడ్ ఈ సినిమా కథనాన్ని తన గొంతు ద్వారా హృద్యంగా ప్రేక్షకులకు వినిపిస్తాడు. రెడ్ కథనంలో ఒక మేజిక్, కనుకట్టువిద్య కూడా ఉంది. ఆండీని సంవత్సరాలుగా, దగ్గరగా పరిశీలించి, మైమరపించే చురుకైన స్వరంతో టూకీగా ఆండీ జీవితం గురించి రెడ్ సహానుభూతితో వినిపిస్తుండటం వల్ల చిత్రం మొత్తం ఆండీ- రెడ్లతో ప్రేక్షకుల భావోద్వేగ సంబంధాన్ని బిగువు సడలకుండా పట్టి ఉంచుతుంది. వాయిస్‌ ఓవర్ నుండి, సన్నివేశాలను నాటకీయ శక్తితో మధురంగా వెలిగించాడు. రెడ్ స్వేచ్చగా చెప్పడం వల్ల చుట్టుపక్కల వారికీ, ప్రేక్షకులకీ కూడా అతని ప్రభావాన్ని అంచనా వేసే ఒక మార్గం ఏర్పడుతుంది. ప్రపంచ సినీ విమర్శకులందరూ వల్ల మోర్గాన్ ఫ్రీమాన్ వల్ల ఈ సినిమా మరింత రక్తి కట్టిందని ప్రశంసించారు! ప్రధాన పాత్రలలో నటులు టిమ్ రాబిన్స్, మోర్గాన్ ఫ్రీమాన్ ఇద్దరూ అత్యుత్తమ మైన నటనతో, అద్భుతంగా ఖైదీల్లో ఇమిడి పోయారు.

ఈ చిత్రం లోని దృశ్యాలు చాలా సంగతులు చెప్తాయి! కొంతమంది జీవితాంతం జైలే అయినప్పుడు వాళ్ళు ఆ జీవితానికే అలవాటు పడడాన్ని ఈ చిత్రం ప్రతిభావంతంగా చూపిస్తుంది. ఆండి భోజనంలో పురుగు కనిపిస్తుందొకచోట. ఆ పురుగుని ఖైదీ బ్రూక్స్ తీసుకొని తన జేబులోని పక్షికి తినిపిస్తాడు. అలాంటి తిండిని తింటున్న సమయంలో కూడా ఖైదీలు సహచరులతో సంతోషంగా గడపడం కనిపిస్తుంది. ఆండీ, రెడ్ పాత్రల మధ్య భాగస్వామ్యమే కీలకంగా కథను విప్పి చెబుతుంది. వారి స్నేహంలో ఒకరితో ఒకరు ఆనందం, హాస్యాన్ని పంచుకోగలగడంలోనే వారి నిజమైన స్వేచ్ఛ ఉందనిపిస్తుంది. ఈ చిత్రం లోని నచ్చిన సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ చూస్తున్న ప్రతిసారీ, ప్రతి డైలాగ్, జీవితం గురించిన విలువైన పాఠాలు నేర్పుతూనే ఉంటుంది!

ఈ చిత్రంలో చాలా చిరస్మరణీయ దృశ్యాలున్నప్పటికీ ఆండీ తన హద్దులను అధిగమించి ఆఫీస్ గదిలో తన్మయత్వంలో పడిపోతాడు. అంతేగాక మొత్తం జైలు జనాభాకు లౌడ్ స్పీకర్స్ లో ఒపెరా సంగీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఖైదీలందరూ విస్మయంతో వినే సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో ఒక మెరుపు మెరిపించి దేదీప్యమానమైన అనుభూతినిస్తుంది! వారి స్మృతిపధం లోంచి ఈ దృశ్యం ఎప్పటికీ చెరిగిపోదు. జైలు కాంక్రీట్ గోడలు మాత్రమే కాదని ఆండీ మానసిక స్థితిని వ్యక్తీకరించిన ఆ క్షణం ప్రాముఖ్యత చాలా గొప్పది. ఈ కీలకమైన సన్నివేశాన్ని డారాబాంట్‌ తన స్వీపింగ్ కెమెరాతో అత్యంత అద్భుతంగా చిత్రీకరించాడు. ఈ చిత్రంలోని ఈ కీలకమైన సన్నివేశాలలో ఆండీ విస్తృతంగా మంచీ చెడులను అంగీకరించే విధానం జైలులో ఉన్న ప్రతి ఒక్కరినే గాక చూస్తున్న ప్రేక్షకుల్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది! అతని భావాలను అతిగా అతిగా ప్రదర్శించడం వల్ల, అతను మరింత మనోహరంగా ఉంటాడు.

ఈ సినిమాలో గొప్పవారేమీ లేరు గానీ దుష్టులూ, కౄరులూ ఉన్నారు. వారిలో ముఖ్యుడు వార్డెన్ నార్టన్. కెప్టెన్ బైరాన్ హాడ్లీ నార్టన్ ముఖ్య అనుచరుడు. ఎముకలు విచ్ఛిన్నం చేయమన్నా, హత్య చేయమన్నా అక్షరాలా అమలు చేస్తాడు. అత్యాచారాలకు పాల్పడే ముఠా నాయకుడు బోగ్స్(మార్క్ రోల్స్టన్), అతని ముఠా ఖైదీలలో బలహీనమైన, ఒంటరిగా ఉన్నవాళ్ళను వేటాడుతుంటారు. అలాగని ఈ జైలులో ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవారు కాదు. లైబ్రరీని నడుపుతున్న వృద్ధ ఖైదీ బ్రూక్స్ (James Vitmore), టామీ విలియమ్స్(Gil Bellows) చాలా సహృదయులు. టామీని అన్యాయంగా హత్య చేసినప్పుడు మన ప్రాణాలు గిల గిలా కొట్టుకుంటాయి! ఆండీ అందరితో స్నేహంగా ఉంటాడు. రూఫింగ్ ఉద్యోగంలో పనిచేస్తున్న తన స్నేహితుల కోసం కొన్ని కోల్డ్ బీర్లను తెప్పిస్తాడు. అతను పాత జైలు లైబ్రేరియన్ (జేమ్స్ విట్మోర్) తో అపురూపంగా స్నేహం చేస్తాడు.

ఈ చిత్రానికి ఆండీ హీరో అయినప్పటికీ, ఈ సినిమా అతని దృష్టికోణంలోంచి ఎప్పుడూ కనిపించదు. జైలు జనాభాకు ఒక రకంగా న్యాయాధిపతిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రెడ్ దృష్టికోణం నుంచి చిత్రాన్ని వీక్షిస్తారు ప్రేక్షకులు. ముగింపు సమయానికి ప్రేక్షకులు కూడా జైల్లో ఉన్న అనుభూతికి లోనవుతారు. క్లైమాక్స్ కి ముందు సన్నివేశంలో శూన్యంలోకి చూస్తున్నట్లు, నిరాశలోకి కుంగిపోతున్నట్లు, ఆత్మహత్యకు పూనుకుంటాడేమో నని భయపడతాడు రెడ్. తుఫాను ముందు ప్రశాంతతను గొప్పగా సృష్టించాడు దర్శకుడు.
అసలు ఆండీ- రెడ్లు సంభాషిస్తున్న దృశ్యాల్ని చూచి తీరాల్సిందే! ఆండీ పొట్టి చిన్న వాక్యాల్ని వినిపించీ వినపడనట్లు మాట్లాడతాడు. సినిమాని శ్రద్ద పెట్టి చూడకపోతే చాలా మిస్సవుతాం! ʹబిజీగా జీవించండి.లేకపోతే బిజీగా చనిపొండిʹ అంటాడు. ఆండీ నోరెత్తి ఏది మాట్లాడినా అది జీవితానికి పనికొచ్చే ఒక కొటేషన్ అవుతుంది.

సినిమా చూస్తున్న ప్రేక్షకులలో ఏదో జరుగ బోతోంది, ఏదో రహస్యం ఉంది అనే ఉత్కంఠ చివరివరకూ కొనసాగుతుంది. అది చివర్లోనే తెలుస్తుంది గానీ ప్రేక్షకుల ఊహకందదు. సాధారణ సినిమాల్లో ఉండే జనాల్ని ఆకర్షించే సన్నివేశాలేమీ లేవు. కానీ ఈ చిత్రం ఆద్యంతమూ చక్కని సన్నివేశాలతో, ఊహించలేని పతాకస్థాయితో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. దానికోసం ఎవరైనా సినిమా చూడాల్సిందే!

శాడిస్టిక్ వార్డెన్ జైలును తన స్వంత రాజ్యం వలె నడుపు తాడు. అతన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో పోల్చారు! పరమ పవిత్రంగా బైబిల్ గ్రంధాన్ని పట్టుకుని అందులోని నీతివాక్యాలు వల్లిస్తూ, బైబిల్ కొటేషన్ల వెనుక తన బండారం బయట పడకుండా దాక్కుంటాడు. ఇది మనకు మన పాలకుల్ని గుర్తుకి తెస్తుంది!

"ది షావ్‌శాంక్ రిడంప్షన్" లో కొన్ని దారుణమైన సంఘటనలు కనిపిస్తాయి, అయినప్పటికీ ఈ చిత్రం మానవాళిని నెమ్మదిగా చెడుకు వ్యతిరేకంగా తిప్పికొట్టే భావనలతో ఆకట్టుకుంటుంది.

జైలు లోపల జీవితం మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అపరిమిత శక్తిని నిచ్చి మనల్ని వాళ్ళలో సభ్యులుగా చేస్తుంది. వారి చిన్న, చిన్న రోజువారీ జీవనోపాధి విజయాలు అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. చాలా సినిమాలు మనకు ప్రమాదకరమైన అనుభవాలను శీఘ్ర, ఉపరితల భావోద్వేగాలను అందిస్తాయి. కానీ "ది షావ్‌శాంక్ రిడంప్షన్" మన భావాలకు ఒక ఊతాన్ని అందిస్తుంది. అపురూపమైన స్నేహాన్నీ, భరోసానిచ్చే ఆశనూ లోతుగా జీవితాంతం కొనసాగించినట్లు చూపించిన సినిమా!

ఈ సినిమాని ఒహియోలోని మాన్స్ ఫీల్డ్స్ మాజీ జైలులో చిత్రీకరించారు. 20, 30 మరియు 40 సంవత్సరాల తర్వాత మూడు పెరోల్ విచారణలలో ప్రేక్షకులు రెడ్ ని చూస్తారు. సినిమాలో ఎక్కువ భాగం జీవితం గురించిన తాత్విక చర్చలు ఉంటాయి. ఇది అంచుల చుట్టూ చీకటి ముసురుకుని ఉన్న, మానవ స్వభావాల గురించి చెప్పే ఆకర్షణీయమైన సరళమైన, మంచి హృదయపూర్వక చిత్రం.

సాంకేతికాంశాలన్నీ చక్కగా అమిరాయి. సినిమాటోగ్రాఫర్ రోజర్ డికెన్స్ పనితనం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. థామస్ న్యూమాన్ సంగీతం మురిపిస్తుంది.

ఆండీ కోసం రెడ్ సేకరించిన రెండు వస్తువులు ఈ కథాంశానికి కీలకమైనవి. పోస్టర్లు పాతబడి చిరగడం వల్లనో ఏమో ʹరీటా హేవర్త్ʹ తర్వాత ʹమార్లిన్ మన్రోʹ (Marilyn Manroe), ఆ తర్వాత ʹరాక్వెల్ వెల్చ్ʹ (Raquel Welch) సినిమా పోస్టర్లు ఒక దాని తర్వాత ఒకటి రీటా హేవర్త్ ఉన్న స్థానంలో కొస్తాయి. ఈ ముగ్గురు హీరోయిన్లూ పోస్టర్ల రూపంలో ఆండీకి గొప్ప సహాయమే చేశారని చిత్రం చివర్లో ప్రేక్షకులకు తెలుస్తుంది!

ఈ చిత్రంలో ఒక చోట ఆండీ "నేను నిర్దోషిని" అని రెడ్ తో అంటాడు. దానికి రెడ్ "ఇక్కడున్న వాళ్ళందరూ నిర్దోషులేʹ అని అంటాడు. నిజంగానే ఈ నేరాల వెనకున్న సామాజిక కారణాలను శోధిస్తే అందరూ నిరపరాధులే! మేము ఒకసారి మహిళా ఖైదీలున్న ఒక జైలుకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాం," ఎంతెంత చిన్న చిన్న కారణాలకు అన్యాయంగా జైలు పాలయ్యారో కన్నీటి పర్యంతమవుతూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎవరెవరి నేరాలో వారిమీద అన్యాయంగా మోపారు! నేరాల నేపధ్యాలను తరచి చూస్తే ఇవి మనందరికీ, సమాజానికీ, ప్రభుత్వాలకీ చెందుతాయి. నిన్న మొన్నటి వరకూ మన మధ్య తిరిగిన ప్రజల మనుషులు, మేధావులూ అయిన సాయిబాబా, సుధీర్ ధావ్లే, అరుణ్ ఫెరేరా, వెర్నన్ గొంజాల్వెస్, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, సుధా భరద్వాజ్, వరవర రావు, రోనావిల్సన్, మహేష్ రావత్, గౌతమ్ నవ్ లఖా, ఆనంద్ తేల్ తుండే- వీళ్ళందరూ ప్రస్తుత కరోనా భయంకరమైన పరిస్థితుల్లో కిక్కిరిసిన జైళ్ళలో ఉన్నారు. ఎటువంటి ప్రాణ రక్షణ బాధ్యతలు తీసుకోవడంలేదు. మాస్కులూ, సామాజికదూరం గురించి పట్టించుకోవడంలేదు. దేశం మొత్తంలో వీళ్ళున్న మహారాష్త్రలోనే కరోనా చాలా వేగంగా దావానలంలా వ్యాపిస్తుంది. వయసు, అనారోగ్యాలు వేటినీ పాలకులు పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ళలో ఖైదీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో? అవి గుర్తొస్తే ఊపిరి సలపదు. ఈ సినిమా తీసి పాతికేళ్ళు దాటినా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ దారుణమైన పరిస్థితులే తప్ప విముక్తి కనిపించడంలేదు!

మానవాళి సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ ఓ అనూహ్యమైన వ్యక్తిత్వం ఏదో బయటపడుతుంది.సమస్యకు దారి చూపించడమే కాదు... రాబోయే శతాబ్దాలకు మార్గదర్శిగా నిలబడుతుంది. చివరికి వార్డెన్లూ, హాడ్లీలూ అంతమవుతారనీ, నిర్దోషులు స్వేచ్చాజీవులవుతారనీ ఈ సినిమా బోధిస్తుంది.

ఈ సినిమా ప్రత్యేకతలు!

"ది షావ్‌శాంక్ రిడంప్షన్" సెప్టెంబర్ 1994 లో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఉత్తమ చిత్రంతో సహా ఏడు ఆస్కార్ ఆస్కార్ నామినేషన్లను గెలుచుకుంది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రోజర్ డికెన్స్, ఉత్తమ నటుడుగా మోర్గాన్ ఫ్రీమాన్ ఎంపికయ్యారు.

1994 లో ఈ చిత్రం హ్యూమానిటాస్ బహుమతి, హార్ట్ ల్యాండ్ ఫిల్మ్ ఫెస్ట్ నుండి క్రిస్టల్ హార్ట్ అవార్డును కూడా గెలుచుకుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ టాప్ టెన్ ఫిల్మ్స్ లో ఒకటి.

2015 లో, యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ చిత్రాన్ని నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, సౌందర్యపరంగా ముఖ్యమైనదʹని సంరక్షణ కోసం ఎంపిక చేసింది. "ది షావ్‌శాంక్ రిడంప్షన్" ఇప్పుడొక స్పష్టమైన క్లాసిక్. అందుకే ఫిల్మ్ స్కుల్స్ లో కూడా పాఠ్యాంశంగా బోధిస్తున్నారు.

No. of visitors : 511
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •