చనుబాలధార లాంటి ప్రేమను అందించిన కథ "అర్బనూరు"

| సాహిత్యం | స‌మీక్ష‌లు

చనుబాలధార లాంటి ప్రేమను అందించిన కథ "అర్బనూరు"

- ప‌ల‌మ‌నేరు బాలాజీ | 15.05.2020 11:18:54pm

కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రదేశాలు, కొన్ని సంఘటనలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని పేర్లు సైతం మనిషిని బ్రతికిస్తాయి. అది ఊరి పేరు కావచ్చు మనిషి పేరు కావచ్చు,చనిపోయిన వారిని సైతం మళ్ళీ బ్రతికిస్తాయి.

చాలా భాగం కథల్లో ఎక్కడో రచయిత దారి చూపుతుంటే పాఠకుడు గుడ్డిగా అనుసరించడం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మొదలయ్యామో, ఎక్కడికి ఎలా ఎందుకు వెడుతున్నామో, ఎప్పుడు గమ్యాన్ని చేరుకుంటామో కథ చదువుతున్నప్పుడు మొత్తం పాఠకుడికి స్పష్టంగా తెలిసిపోతుంది. పాఠకుడు సొంతంగా ఊహించడం గాని ఆలోచించడం కానీ మధనపడటం కానీ చాలా కథల్లో జరగదు. ఎందుకంటే పాఠకుడు ఆలోచించడానికి , అనుభూతి చెందడానికి కానీ, ప్రశ్నించడానికి కానీ అక్కడ ఎలాంటి ఖాళీలు ఉండవు. కొన్ని కథల్లో మాత్రమే పాఠకుడికి పని పడుతుంది. అతడి మేధకు కావచ్చు హృదయానికి కావచ్చు పని పడుతుంది. ఆలోచించడం అనుభూతి చెందడం బాధపడటం లేదా సంతోషపడటం, ప్రశ్నించడం ఒక దిగ్భ్రమకు గురి కావడం, జీవితం కొత్తగా లోతుగా తెలియటం, అంతకు ముందు తనకు ఏర్పడిన అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితి ఎదురు కావడం,తన భావాలను ,నమ్మకాలను ఆదర్శాలను, అభిప్రాయాలను కూడా పక్కకు పెట్టే పరిస్థితి ఎదురు పడటం కొన్ని కథల్లో మాత్రమే జరుగుతుంది. అట్లాంటి కథలను చదవటం పాఠకులకు ఉద్విగ్నతను కలిగిస్తుంది. పాఠకుడిలోని సృజనను ఇలాంటి కథలు వెలికి తీస్తాయి. సృజనాత్మక కథనం,కధలోని వాస్తవికత రచయిత కంఠస్వరం పాత్రల తీరుతెన్నులు పాఠకుడిలో సృజనాత్మకతను కలిగించడం లేదా పెంపొందించటం మొత్తం మీద అతడిని స్పందింపచేయడం మంచి కథ లేదా ఉత్తమ కథ లక్షణం.

తెలుగు సాహిత్యంలో పాఠకుడి మేథను, హృదయాన్ని గౌరవిస్తూ పాఠకుడి ఆలోచనలకు కూడా కథలో చోటు కల్పిస్తూ రచనలు చేస్తున్న చాలా కొద్దిమంది రచయితలలో వి.మల్లికార్జున్ ఒకరు. పత్రికా రంగంలో పనిచేసిన అనుభవం కావచ్చు, వాస్తవాలను వాస్తవాలుగా చూసే అతడి సునిశిత దృష్టి కావచ్చు, సాదాసీదాగా కనిపిస్తూనే బలమైన వాస్తవికతను చిత్రించే అతడి కలం ప్రత్యేకత కావచ్చు.. సమకాలీన తెలుగు రచయితల్లో వి మల్లికార్జున్ కు ప్రత్యేక స్థానాన్ని కలిగించాయని,అతడి కథలు చాలామందిని ఆకర్షించాయని అలజడికి గురిచేసాయని చెప్పక తప్పదు.

" ʹఉర్సుʹ కథ నా కథలన్నింట్లో నాకు బాగా ఇష్టమైనది. ఒక్క పూటలో రాసిన కథ ఇది. నాకైతే అంతధైర్యం లేదు కానీ, ఆ కథను ఎవరన్నా అమ్మకు చదివి వినిపిస్తే బాగుండని ఆరేడు నెలలుగా అనుకుంటూనే ఉన్నా.

.....నేను రాసిన ఈ కథల్లో ప్రేమ కథలున్నాయి. కొన్ని విషాదంగా మిగిలిపోయే కథలున్నాయి. నేననుకోవడం.. అది ఏ రూపంలో ఉన్న ప్రేమ అన్న దారంతో వాటిని కట్టిపడేశా." అని వి. మల్లికార్జున్ తన కథా సంపుటి "ఇరానీ కేఫ్" పుస్తకానికి రాసిన ముందుమాటలో అంటారు.

ఈ కథా సంపుటిలో 13 కథలు ఉన్నాయి. "దృశ్యాదృశ్యం , కారు చెప్పిన కథ, తను నేను, పాప్ కార్న్,మొన్నొచ్చిన కల, ఎంతెంత దూరం నుంచో.. ఇంతింత దగ్గరకు... ఆ ఒక్క మనిషి, రిప్లై , ఉర్సు ,ఇరానీ కేఫ్ ,ఆమె ఆకాశం, డ్రాఫ్ట్ బాక్స్ అర్బనూరు."

కథ చదివిన తర్వాత పాఠకుడు తనను తాను వెతుక్కోవడం ,తనను తాను కనుక్కోవడం జరిగితే ఆ కథ వస్తు శిల్పాల పరంగా విజయం సాధించినట్లే.నిజానికి మొత్తంగా ఇతడి కథల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వేరే ఉంది. ప్రస్తుతానికి కథావరణంలో ఒక కథను మాత్రం ఇప్పుడు ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

ఆదివారం ఆంధ్రజ్యోతిలో 2018 నవంబరులో మొదట ప్రచురితమైన ఈ కథ పేరు "అర్బనూరు". ఇరానీ కేఫ్ కథా సంపుటంలో చివరి కథ ఇదే. ఈ కథా సంపుటిలో పాఠకులు ఇదివరకే చదివి ఉద్విగ్నతకు గురైన ఎన్నో కథలున్నాయి.

ముందు ఈ కథలోకి వెళదాం.
*
అర్బనూరు:

"వెయ్యి తొంబై ఆరు మెట్లెక్కి వచ్చి ఈ దర్గా పక్కన కూర్చొని ఊరిని చూస్తూ ఉంటే, నీలం రంగు రేకులున్న పెద్ద థియేటర్ దగ్గర చూపు ఆగిపోతుంది. అక్కణ్నుంచి ఇంటిని లెక్కేసుకుంటూ పోతాను

ఇదంతా ఇలాగే జరిగి చాలా కాలం అయి ఉండాలి. మెయిన్ రోడ్డు మీదికి ఉన్న ఇంటి తలుపు తీసి మూడు మెట్లు దిగినా, అరుగు మీంచే దూకినా రోడ్డు మీద పడ్డట్టే. జేబులో ఇరవై ఆరు గోటీలున్నాయి. రోడ్డు మీదికొచ్చి కుడివైపు తిరిగి, చిన్న సందులోంచి పోతే, పోగా పోగా ఒక పెద్ద వేపచెట్టు వస్తుంది.దాని నీడ ఉన్నంత దూరం అందుకోవచ్చు. ఎండాకాలమది. మధ్యాహ్నం దాటింది...."

మనిషి తయారయ్యేది బాల్యంలోనే అంటారు. బాల్యస్నేహితుడు సంతోష్ గాడితో, పాషా తాతతో ఏర్పడిన అనుబంధం గురించి కథ మొదట్లోనే రచయిత చెబుతాడు. ఎప్పుడూ వాళ్ళు ఆడుకునే వేపచెట్టు కింద ఉండే పాషా తాత చనిపోయాడని వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు, ఆ పిల్లవాడు కదిలి పోతాడు.

...పాషా తాత నాకు పరిచయమైన రోజు నుంచి ఆ చెట్టు కిందే కూర్చొని కనిపించాడు.నాకు తెలిసి నేనాయనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేము - చుట్టుపక్కల ఆడుకుంటున్నామంటే, "అక్కడ అక్కడక్కడ్నే ఆడుకోండి" అని చెప్పి పంపించేది అమ్మ . ఎప్పుడైనా ఆడుతూ ఆడుతూ ఆయన దగ్గర దాకా వెళితే తప్ప ఆయన నవ్వినట్టు కనిపించలేదు నాకెప్పుడూ.

పాషా తాత చనిపోయాక కొన్నిరోజులు ఆ దారిలో వెళ్ళలేదు. సెలవులయిపోయి బళ్లు తెరిచాక ఐదో తరగతి మొదట్లోనే, వేప చెట్టుని వదిలేసి, కుంట చెరువు దగ్గర ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ చూశాడు సంతోశ్ గాడు. ఆ కుంట పక్కనే స్మశానం ఉండేది.

పాషా తాత వేపచెట్టు చుట్టే దెయ్యమై తిరుగుతున్నాడని ఎవరో చెప్పాక, అటు దిక్కు పోలేదు. కుంటే లోంచి. పట్టి తెచ్చిన ఒక బురదమట్టను మాత్రం బాగా ఇష్టంగా పెంచుకున్నా. అది పెద్దదవుతూ ఉంటే పేపర్లో సినిమా పోస్టర్లలో రోజులు మారడాన్ని చూసినట్లు రోజులు లెక్కబెట్టుకుంటూ వాడిని. ముప్పై ఎనిమిది రోజులు బతికిన ఆ బురద మట్ట ఆ అర్ధరాత్రి డబ్బా నుంచి ఎగిరి పడ్డట్టు ఉంది.అది చనిపోయాక ఆ డబ్బాను మూలకు విసిరి కొట్టి మళ్ళీ చేపలు పట్టలేదు.

అతడి వీపుమీద బాల్యంలో అమ్మ పెట్టిన చెయ్యచ్చు ఇంకా ఇప్పటికీ ఉందేమోనని తడిమి చూసుకుంటాడు.సంతోష్ గాడు ఊరువదిలి వెళ్లిపోయాక అతడికి అమ్మ తప్ప ఎవరు లేరు అనిపించేది.అన్ని కబుర్లూ ఆమెతోనే. "పెద్దోనివి అయిపోయినవురా" అనేది అమ్మ-ఉద్యోగం నుంచి ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు ఊరికి పోయి అమ్మకు అన్ని కబుర్లు చెప్పినప్పుడు.

అమ్మ చనిపోయాక చాలా రోజులు ఊర్లోనే ఉండి, నగరానికి వెళ్లిపోతాడు. ఎటూ, ఏదీ అర్ధం కాని రోజుల్లో ఒక సాయంత్రం చూశా వాడిని. అంటూ తన కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తాడు రచయిత. వాళ్ళ నాన్న తాగి అమ్మ ను కొట్టి చంపి, జైలుకు పోతే అతడు పారిపోయి వచ్చానని ఆ కుర్రాడు చెబుతాడు. తనను తప్పకుండా వాళ్ల ఊరికి తీసుకెళ్ళమని ఆ కుర్రాడిని అడుగుతాడు. పెంచుకున్న చేప చనిపోతే ఎవరిపైన కోపం వచ్చింది అని ప్రశ్నిస్తాడు?తనకు తెలిసిన ఒక స్త్రీని ఆమె ఆరేడేళ్ల బాబుని ఆ కొత్త స్నేహితుడు ఇతడికి పరిచయం చేస్తాడు.అక్కడ నుండి కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఆమెను ప్రేమిస్తున్నానని అతడు చెబుతాడు.

"సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లి అక్కడ ఓడిపోతే ఆ రోజే చస్తానని భయం అందుకే పోలేదు. ఇక్కడైతే ఓడిపోయినా భయం ఉండదు" అని అంటాడు.

గొప్ప రచయిత అయిన నువ్వు రాసింది ఆమె చదవదు. నువ్వు చెప్పే మాటలు ఆమెకు అర్ధమౌతాయా కానీ ఈ ప్రేమ ఎట్లా అని ప్రశ్నిస్తాడు?ఆమెను సరిగా చూడు ఆ కళ్లని చూడు అని ఆ స్నేహితుడు అంటే ఇతడికీ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది.. ఇక్కడ రచయిత వాడిన పదునైన పదాలు పాఠకుడిని సూటిగా చేరుతాయి.

" ఆమె అచ్చం అమ్మ లాగే ఉందనిపించాక వాడి మాటలు వినాలనిపించలేదు. మాతో మాట్లాడుతూనే పిలగాన్ని పట్టుకుని వాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండటం, చీర కొంగును బొడ్డులోకి దోపి మాకు అన్నం పెట్టడం, మేము వెళ్ళి పోతుంటే ఆమె అప్పటికీ చేస్తున్న పనేదో ఆపి, బయటి వరకూ రావడం గుర్తు తెచ్చుకుంటే అమ్మను చూసినట్టే ఉంది."

ఆ స్నేహితుడు చెన్నై వెళ్లి పోయాక ఇతనొక్కడే ఆమె ఇంటికి వెళతాడు. నిన్ను చూస్తే మా అమ్మను చూసినట్టు ఉంది అని ఆమెతోనే చెబుతాడు. వాళ్ళ అమ్మ గురించి ఎన్ని కబుర్లు చెప్పినా అచ్చం ఆ స్నేహితుడు విన్నట్లే వినేది.

అయితే ఆ తర్వాత ఆమె ఊరు వెళ్లి పోతుంది. తన భర్త చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుందని వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తున్నానని ఏదైనా ఉంటే ఫోన్ చేయమని ఒక ఫోన్ నెంబరున్న కాగితాన్ని ఇతడి చేతిలో పెట్టి వెళ్లి పోతుంది. ఆమె పిల్లవాడిని వాళ్ళ అక్క ముందుగా తీసుకు వెళ్లి పోయిందని చెబుతూ ఇక తను తిరిగి రాదని -అతని స్నేహితుడికి చెప్పమని చెబుతుంది.ఆమె కళ్ళల్లోకి చూసి ఇతడు ʹఅమ్మʹ అంటాడు.

ఆమె వెళ్ళిపోయిన కొన్ని రోజులకు అతని స్నేహితుడు చెన్నై వెళ్ళి పోతాడు. ఇతను బెంగళూరుకు వచ్చేస్తాడు . ఫోన్లు తగ్గిపోతాయి. స్నేహితుడు ఫోన్ వాడటం లేదని తెలుస్తుంది.ఒక అర్ధరాత్రి మాత్రం స్నేహితుడు ఫోన్ చేస్తాడు. ముంబై లో ఉన్నానని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే ఇతడు ఆమెకు‌ ఫోన్ చేసి తన మిత్రుడు ముంబైలోనే ఉన్నాడని సమాచారం అందిస్తాడు. మళ్లీ తన స్నేహితుడు ఫోన్ చేస్తే ఆమె నంబర్ ఇవ్వాలని అనుకుంటాడు. కానీ వారం తర్వాత ఒక ఫోన్ వస్తుంది 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరి చివర ఉన్న చెరువు దగ్గర లో తన స్నేహితుడు కనిపించాడని ఉన్న ఒకే ఒక్క కాగితంలో తన ఫోన్ నెంబర్ ఉందని అందుకే అక్కడి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని తెలుసుకుంటాడు.

ఆ చెరువు గురించి వాడితో ఎన్నిసార్లు మాట్లాడాడో గుర్తొచ్చాక 79 కిలోమీటర్ల ప్రయాణం భయపెడుతుంది.

ఇక్కడి నుండి రచయిత మాటల్లోనే..

నా టీనేజ్ చివర్లో పరిచయమైన ఈ చెరువు కట్ట దగ్గరిగి రోజూ వచ్చి కూర్చునేవాడిని అని వాడికి చెప్తే, "నేనొస్తా తీసుకపో" అని ప్రతిసారీ అనేవాడు.

" నువ్వు మీ ఊరు గురించి చెప్పినప్పుడల్లా నేను కనిపెట్టుకున్న పదం గుర్తొస్తుంది ఎప్పుడూ.. అర్బనూరు" అంటాడు నవ్వుతూ.వాడి మాటల శబ్దానికి కూడా ఒక అందమేదో ఉండేది. ప్రేమించే వారి ఎడబాటు సహించలేని వాడిలోని తత్వాన్ని అంచనా వేయడం నాకు సాధ్యం కాదేమో! వాడు అమితంగా ఇష్టపడ్డ మనుషుల్ని ప్రేమించకుండా ఉండలేని తనం వాడిలోపలే ఎక్కడో ఉండేమో!

ఇవాళ ఆ కొండ మీద నుంచి దూరంగా కనిపించిన ఈ చెరువు కట్ట మీద నిలబడి , ఈ సాయంత్రాన్ని చూస్తూ ఉంటే, చెరువులో కదులుతున్న ఒక పాము, కట్ట మీద కాస్త దూరంలో అరుస్తున్న కుక్క కనిపించాయి.సన్నగా వర్షం పడుతూనే ఉంది. ఒళ్లంతా వణుకు మొదలైంది. కాళ్ల వెంట్రుకలు ప్యాంటు ను అంటి పట్టుకున్నాయి.ఆ ప్యాంట్ లోకి ఇందాకటి పాము ఎక్కుతున్నట్టు అనిపించి వణికిపోయా. వాడు శవమై ఒడ్డుకు కొట్టుకొన్తున్నట్టు అనిపించింది. అక్కణ్నుంచి అప్పటికప్పుడు పారిపోవాలని పించింది. చేతిలోకి తీసి పట్టుకున్న ఆమె ఇచ్చిన కాగితాన్ని ఆ చెరువులోకి విసిరికొట్టా.

అక్కణ్నుంచి వెళ్లిపోతూ వెళ్లిపోతూ వాడు ఈ ఊరికిచ్చిన రోజు నేను చెప్పిన ప్రదేశాలన్నీ చూసుంటాడా అని ఆలోచిస్తా. చూసుంటే ఆరోజు నాకేమైనా చెప్పాలనుకున్నాడా ఆలోచిస్తా. నేను వాడ్ని ఎప్పుడూ ఇలాగే గుర్తు పెట్టుకోవాలనుకున్నాడేమో, మా ఊరి చెరువునే చివరి మజిలీగా ఎంచుకున్నాడు. ఎప్పుడైనా ఊరు గుర్తొస్తే వాడు ఆ వెంటనే గుర్తొస్తాడు. ముందు వాడ్ని గుర్తు తెచ్చుకున్నానా, ఊరిని గుర్తు తెచ్చుకున్నానా అని ఆలోచిస్తా. ఈ ఊరికి మళ్లీ రాలేనంత దూరంలో కూర్చుని.

*
కొన్ని కథలకు స్పష్టమైన అర్థాలు,ఆధారాలు ఉండవు. దుఃఖాన్ని ప్రేమల్ని జ్ఞాపకాల్ని ఎవరికి వాళ్ళు తరచి చూసుకోవాల్సిందే. మనుషులకన్నా పదిలంగా మనసుల్ని కాపాడుకోవాల్సిందే. జ్ఞాపకాలు అనుభూతులు వేదనలు కథలవుతాయా? ఇది కేవలం కథేనంటారా? ఏ మూలో మనం పోగొట్టుకున్న బాల్యం ,ఎక్కడో మనం పోగొట్టుకున్న స్నేహితుడు, గుర్తించని,నిరాకరించబడిన, నిరాదరించబడిన ప్రేమలు, మన ఊరు, మనలోని ఎదుటి మనిషి లోని ఒక అమ్మతనం ఈ కథలో లేదంటారా?

కొన్ని కథల్ని మనం బ్రతకడానికి చదవాలి. ఈ ప్రపంచంలో మనల్ని మన ప్రేమలని మన నమ్మకాలని మన విలువల్ని కాపాడుకోవడం కోసం మనల్ని మనం శుద్ధి చేసుకోవడం కోసం ఇలాంటి కథల్ని చదవాల్సిందే. రచయిత వదిలి వెడుతూ ఉన్న ఖాళీలను మనం పూరించుకోవాల్సిందే.ఎందుకంటే మనం బతకాలి కాబట్టి ;ఎందుకంటే మనం మనుషులం కాబట్టి; ఎందుకంటే మనం స్నేహితులం కాబట్టి. ఎందుకంటే మనం బిడ్డలం కాబట్టి, మనం తల్లులం కాబట్టి..

కథ నడిచే దారిలో నడుస్తూ ఏమరిపాటుకు గురి కాకుండా, అప్రమత్తంగాచదువుకోవాల్సిన విలక్షణ శైలి లో రాసిన ఇలాంటి కథలు కథకులకు కొత్త ఆలోచనలను కలిగిస్తాయి. పాఠకులకు కొన్ని కన్నీళ్ళనైనా గుర్తు చేస్తాయి.

No. of visitors : 511
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వర్తమాన కథ ప్రపంచంలో ఒక సహజమైన కథ "వారియర్"

పలమనేరు బాలాజీ | 18.02.2020 02:34:40pm

వారియర్ కథలో కథానాయకుడు ఎవరో కాదు, పాఠకుడే ఈ కథలో కథానాయకుడు.!...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •