రోజూలాగే ఆ రోజూ తెల్లవారింది.
రోజూలాగే ఆ రోజూ కళ్ళు తెరుస్తూనే దేవుణ్ణి చూశాడు.
కాని దేవుణ్ణి అలా చూసీ చూడడంతోనే నిద్ర వొదిలిపోయింది.
గోడమీది దేవుడు యెప్పటిలాగే నవ్వుతూ చూస్తున్నాడు. దేవుడి చూపులో యే తేడా లేదు. కాని తనకి మాత్రం తేడాగా వుంది. కాసేపటికి ఆ తేడా అర్థమయ్యింది. గుండె మీద జోడించిన చేతుల్ని మెల్లగా విప్పుతూ చూశాడు. చేతి వేళ్ళ కలువ రేకుల మధ్యనుంచి దేవుడు కనిపించాడు. రెండు చేతులూ రెండు పక్కలకు జారంగానే మళ్ళీ అదే దృశ్యం...
ఈ సారి రెండు కాళ్ళ మధ్యనుంచి అంటే రెండు పాదాల మధ్యనుంచి గోడమీది దేవుడు కనిపించాడు. బ్లడ్ సర్క్యులేషన్ కోసమని డాక్టరు చెప్పినట్టు కాళ్ళకింద తలగడ పెట్టుకోవడం వల్లేమో మడమలు దగ్గరగా వుండి యెడమవుతూ వున్న పాదాలు గోడమీది ఫోటోకి పూలదండలా వున్నాయి. అంతే- తలగడల్ని వొక్క తాపు తన్నాడు. మొకాలినొప్పులు జివ్వుమని మేమున్నాము అంటూ గుర్తు చేశాయి.
ఇప్పుడూ చూడబోతే తేడాలో పెద్ద తేడా రాలేదు. అదే పాదాల దండ. కాకపోతే కొద్దిగా కిందికి జారినట్టు వుంది. ఎందుకో చిన్నప్పుడు గీసిన బొమ్మ గుర్తుకు వచ్చింది. రెండు కొండలమధ్య నుంచి వుదయిస్తున్న సూర్యుడు. రెండు కాళ్ళ పాదాల మధ్యనుంచి దర్శనమిస్తున్న దేవుడు...
నిద్ర లేవగానే-కళ్ళు తెరవగానే- దేవుడి ముఖం చూస్తే మంచిదని, ఆ రోజంతా మంచి జరుగుతుందని దేవుడి ఫోటో అక్కడ పెట్టింది వాళ్ళావిడ. తూర్పు దిక్కుకి తల పెట్టుకు పడుకుంటున్నారు గనుక పడమటి గోడకి దేవుణ్ణి వేళ్ళాడదీసింది. లేవంగానే కనిపిస్తుందని. కాని యిలా కనిపించడమే యెలానో వుంది. టక్కున కాళ్ళు మడుచుకున్నాడు. మోకాలి కీళ్ళు కలుక్కుమన్నాయి. ధైర్యం చేసే సాహసం లేక కాళ్ళు తిన్నాగా చాపుకున్నాడు.
మళ్ళీ కాళ్ళ... పాద పద్మాల మధ్యనుండి దేవుడు...
లెంపలు వేసుకున్నాడు. లేచి కూర్చున్నాడు.
కళ్ళు మూసి తెరిస్తే అదే దృశ్యం. వాళ్ళావిడకు చెపుదామనుకున్నాడు. ʹపాపిష్టి మనిషిʹ అని తిడుతుందని ఆగిపోయాడు. అలాగని ఆ విషయం ప్రస్తావించకుండా వుండలేకపోయాడు.
వారం పొద్దయి తెల్లవారి లేస్తే దేవుడు అలాగే కనిపిస్తున్నాడు. అప్పటికీ కాళ్ళు దేవుడికి యెదురుగా కాకుండా ఆపక్కకో యీపక్కకో పెట్టుకొని పడుకుంటున్నాడు.
ʹనడిచి నడిచి బంగురుతున్నారేంటి? తిన్నగా పడుకోవడం కూడా రాదా? కొత్తగా యీ వొంకర వేషాలేమిటి?ʹ అని దులిపేసింది. ఈవిడ అర్థం చేసుకోదు. దేవుడయినా అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు. కాళ్ళు దేవుడి ముఖమ్మీద పెట్టినట్టే అనిపించింది. నాకు కళ్ళు పోతాయనుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. క్షమించమని కోరుకున్నాడు. అయినా మనసు కుదుట పడదే.
ఇంక లాభం లేదనుకున్నాడు. నాల్రోజులు కింద పడుకున్నాడు. చాప వేసుకొని గచ్చు మీద. అదేమని వాళ్ళావిడ అడిగితే నడుం నొప్పి అన్నాడు. కాని కింద పడుకుంటే లేవడం చాలా కష్టమయ్యింది. అలవాటు తప్పిందేమో మోకాళ్ళకి బాగా శ్రమయ్యింది. సహకరించలేదు. ఎంత కష్టమయ్యిందంటే యేదన్నా ఆధారం దొరికితే తప్ప నిల్చోలేక నానావస్థ అయ్యింది.
తిరిగి వెనక్కి వచ్చి దేవుడికి దండం పెట్టి బెడ్ యెక్కాడు.
నడుం నొప్పి తగ్గిపోయిందా అని నవ్వింది వాళ్ళావిడ.
వాళ్ళావిడను కూడా క్షమించమని దేవుణ్ణి మనసులోనే ప్రాధేయపడ్డాడు.
రెండు బల్లులు వొకదానివెంట వొకటి పడుతూ ఫోటో వెనుకనుండి పరుగులు తీశాయి.
ఒకరోజు పడుకుంటున్న వేళ గోడమీద దేవుణ్ణి యింకాస్త పైకి పెడదామని అన్నాడు.
గోడలు గట్టివని, మేకులు దిగవని తేల్చేసింది వాళ్ళావిడ. ఆ మేకు కొట్టడానికి యెంత కష్టమయిందో చెమటోడ్చాల్సి వచ్చిందో కూడా చెప్పింది. డ్రిల్లింగ్ మిషను తెస్తే కాని పని కాలేదంది.
అయినా మీరేం మోస్తున్నారా- భుజం కాస్తున్నారా- అని కూడా నిలదీసింది.
పాపం యిదీ అని చెప్పలేకపోయాడు.
మరొకరోజు పడమటికి తలపెట్టుకుందామన్నాడు.
ʹలేదు, తూర్పుకి మంచిదిʹ అంది వాళ్ళావిడ.
సరేనన్నాడు.
కాని మనసు మనసులో లేదు. ఏదో అపరాధం చేస్తున్నట్టే వుంది.
ఇంకొకరోజు బెడ్ రూమ్‌లో దేవుడెందుకన్నాడు.
వాళ్ళావిడ ʹమీకేం పోయేకాలమా?ʹ అనలేదు. అన్నట్టుగానే చూసింది.
ʹఅంటే... అంటే...ʹ అన్నాడు గాని యెందుకు వద్దో చెప్పలేకపోయాడు.
ʹపొద్దున్న లేచి యెవరి ముఖం చూసామో- అని తిట్టుకోకుండాʹ అని యెందుకో కారణం కూడా ఆవిడే చెప్పేసింది.
ఔనన్నట్టు తలాడించాడు. కాదన్నట్టూ తలాడించాడు. ʹమీకేమయింది?ʹ అని అడిగింది వాళ్ళావిడ.
ʹఅంటే... దాంపత్యం చేసే చోట...ʹ అంతకన్నా మాటలు రాలేదు.
ʹదేవుడి సాక్షిగానే పెళ్ళి చేసుకున్నాం. పిల్లల్ని కన్నాం. పిల్లల్ని యిచ్చిన దేవుడికి తెలీదా- మనం యేమి కార్యం చేశామో? అది ప్రకృతి కార్యం... అది దైవ కార్యం...ʹ అంది వాళ్ళావిడ.
మౌనం దాల్చాడు.
ʹమనం యేమేమి చేస్తున్నామో దేవుడు కన్నేసి చూస్తూ వుంటాడు. వెలుగులో చేసేవే కావు. చీకట్లో చేసేవి కూడా చూస్తాడుʹ అచ్చం చాగంటి కోటేశ్వర్రావల్లే చెపుతోంది వాళ్ళావిడ.
ఒకటో తరగతి పిల్లాడిలా తలాడించాడు.
ʹచీకటి కుహరం యేది? మన మనసు. మన మనసులో అనుకున్నవి కూడా దేవుడు చదివేస్తూ వుంటాడుʹ యీ సారి గరికపాటికి మల్లె నవ్వుతూ చెప్పింది. చెప్పి నవ్వింది.
దానికంత నవ్వు దేనికో అర్థం కాలేదు.
నిద్రలో పాసుకు వచ్చి లేస్తే అదే ఆలోచన. కాళ్ళు చాపుకుంటే వొక పట్టాన నిద్ర పట్టదే. అందుకని తలవేపు కాళ్ళు. కాళ్ళ వేపు తల పెట్టుకు పడుకున్నాడు.
నిద్ర పట్టింది. తృప్తిగా పట్టింది. కాని పొద్దున్నే వాళ్ళావిడ పీక పట్టుకుంది. నిద్రమత్తులో అని కవరు చేయబోయాడు. ఒప్పితేగా- ఆవిడ వొప్పలేదు.
డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళి గాని వదల్లేదు.
డాక్టరుకు నిజం చెప్పలేదు. చెపుదామని అనుకొని చెప్పలేకపోయాడు. నిద్రలో పొరపాటున జరిగి వుంటుందని, దానికి మీరు యింత వర్రీ కావలసిన పని లేదని డాక్టరు తన తరుపున
వకాల్తా పుచ్చుకు చెపితే అప్పుడు వొదిలింది వాళ్ళావిడ. ఇంకోసారి యిలా జరగదని డాక్టరు హామీయిచ్చి ధైర్యం చెపితే అప్పుడు కదిలింది.
ఇంటికొచ్చి నడుం వాల్చడానికి బెడ్ యెక్కాడు.
ʹదేవుడా యివి కాళ్ళు కావు... చేతులనుకోʹ అని మొక్కి యధావిధిగా కాళ్ళు చాపి పడుకున్నాడు.
దేవుడు యధావిధిగా నవ్వుతూ చూస్తున్నాడు.
ఎప్పట్లానే రెండు బల్లులు పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటో వెనుక దాక్కున్నాయి.
ఆలోచించగా చించగా తన మోకాళ్ళ నొప్పికి కారణం కూడా బోధపడింది. దాంతో నిద్ర పట్టక దొర్లుతుంటే వాళ్ళావిడ కారణం చెపితే కాని నిద్రపోనివ్వనంది. పీడ కలలు అన్నాడు.
ఎదురుగా దేవుడి ఫోటో వుందని, యే గాలీ ధూళీ రాదని, నిశ్చింతగా నిద్రపొమ్మని యెక్కువ వూహించుకోవద్దని చెప్పింది వాళ్ళావిడ. బల్లుల అరుపులు విని ʹసత్యంʹ అంది.
అప్పటికీ ప్రాణాయామం చేస్తున్నాడు. విపశ్యన కూడా చేస్తున్నాడు. మెడిటేషన్ చేస్తుంటే రెండు కనుబొమల మధ్య వెలుగు స్థానంలో తన కాళ్ళూ ఆ కాళ్ళ వెనుక దేవుని ఫోటోయే కనిపించేది.
ఇంట్లో ఆఫీసులో అవే ఆలోచనలు. తన మోకాళ్ళ నొప్పులకే కాదు- ప్రమోషన్ రాకపోవడానికి- కొడుకు చెప్పిన మాట వినకపోవడానికి- కూతురుకు చదువు మీద శ్రద్ధ లేకపోవడానికి-
అనుకున్న స్థలంలో యిల్లు కట్టుకోలేకపోవడానికి- అన్నింటికీ కారణం వొకటే- అని నిర్ధారణకు వచ్చాడు.
చూసి చూసి వొకరోజు తెలివిగా ʹయింట్లో సామాన్లు వాటి ప్లేసెస్ మారితే బాగుంటుంది, కొత్తగా వుంటుంది, చైనా వాస్తు చెప్పింది యేమిటంటే...ʹ చెప్పబోతే వాళ్ళావిడ అవకాశం యివ్వలేదు. మోకాళ్ళ నొప్పులతో అవసరమా అంది. అప్పటికీ తామంతా రుచిగా తింటూ- వుప్పు లేకుండా చప్పటి కూడు పెడుతున్నందుకు బాధపడిపోయింది. తగ్గడం లేదని
వాపోయింది.
ʹఎందుకు తగ్గుతుంది... తగ్గదుʹ గింజుకున్నాడు.
చెప్పేద్దామనుకున్నాడు.
మొదటే చెప్పుండాల్సింది. ఇప్పుడు చెపితే యెవరూ నమ్మరు. పైగా తనకి మెంటల్ అనుకుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిప్పుతారు. ఇప్పటికి వున్న అనుభవాలు చాలనుకున్నాడు.
ʹమీ పూర్వీకులకి తలకు సంబంధించిన సమస్యలు యేమైనా వున్నాయేమిటిʹ అని అడిగింది వాళ్ళావిడ. వారి వారసత్వమే నేనని తను అనుకుంటోందని అనుకున్నాడు. దాంతో మరింత మూగవాడైపోయాడు.
విసిగి వేసారి చివరకు వొకానొక రోజు దేవుడితో మూగగా వొక వొప్పందం చేసుకున్నాడు. ఈ బెడ్ రూమ్‌లో తప్ప అన్ని దగ్గర్లా నీ పట్ల వినయ విధేయతలను ప్రదర్శిస్తాను, యిక్కడొక్కదగ్గర నన్నొదిలేయ్- అని కాళ్ళు సారీ చేతులెత్తేశాడు.
కనపడ్డ యే రాయినీ రప్పనీ వదల్లేదు. చేతులు మొక్కే చోటుకి కాళ్ళు తీసుకెళుతున్నాయన్న విషయం మర్చిపోయాడు. ఆలయాలకు వెళితే చెప్పులు విప్పినట్టు కాళ్ళు విప్పే అవకాశమే వుంటే విప్పి వెళ్ళేవాడే. దేవుడికీ కాళ్ళున్నాయని వాటిని మొక్కినప్పుడు యెప్పుడూ యెందుకో గుర్తించలేదు.
కాని యెప్పుడు యెక్కడ కూర్చున్నా గాని అక్కడ అటువైపు దేవుడి పటమో విగ్రహమో గుడో గోపురమో యేదన్నా వుంటే చాలు తన కాళ్ళ డైరక్షన్ మార్చుకోనేవాడు. ఒకవేళ కాలు మీద కాలు వేసుకు కూర్చుంటే కూడా వెంటనే కాలు తీసేసేవాడు. మోకాళ్ళు నొప్పెట్టినా మనసుకు కాసింత తృప్తిగా వుండేది. బెడ్ రూమ్‌లో జరిగిన దానికి కాంపన్సేషన్లా వుండేది. ఆ యెరుక యెల్లవేళలా వుండి పాపపరిహారము వుపసంహారము జరుగుతున్నట్టుగా భావించేవాడు.
ఇప్పుడు కొంత వూరటగా వుంది.
పనిలో దేవుడు వుంటాడని వుద్యోగంలో చేరినప్పటినుండి వింటూనే వున్నాడు. కాని పనిని తిట్టుకుంటూనే పని చేశాడు. వర్క్ యీజ్ వర్షిప్- అని అన్నవాళ్ళు కూడా పనిలో వున్నప్పుడు ఆపని కానప్పుడు అమ్మనాబూతులూ తిట్టుకోవడం తెలుసు. బూతులు మాట్లాడుతూ పనిచేయడం వొక్క మోటార్ ఫీల్డులోనే కాదు, అన్ని చోట్లా అంతో యింతో చూశాడు. ఆడవాళ్ళు వుద్యోగాల్లోకి వచ్చాక పోలేదు. బాగోదని కొద్దిగా తగ్గింది. చాటుగా పెరిగింది. టంగ్ స్లిప్ అవ్వడం వల్ల తప్పితే బూతులు మాట్లాడం కూడా మానుకున్నాడు. నీకు భక్తి పెరిగింది అని తోటి వుద్యోగులు గుర్తించారు.
ప్చ్... దేవుడు మాత్రం గుర్తించలేదు. పైగా పరీక్షలు పెడుతున్నాడు.
ఒకరోజు టీవీ ఛానెల్ చూస్తుంటే ʹదేవుడు అంతటా నిండి వున్నాడు. అనంత కోటి బ్రహ్మాండమంతా తానై వున్నాడు. పంచభూతాల్లోనూ ఆ పరమేశ్వరుడేʹ అని చిన జియ్యరుస్వామివారు చెప్పుకుపోతుంటే మైమరచి వింటున్నాడు.
స్వామి పంచ భూతాల్ని అర్థ వివరణ చేస్తూ- భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము... వీటి అన్నిటినీ మనం అపవిత్రం చేస్తున్నామని చెప్పారు. అంటే భగవంతుణ్ణి అపవిత్రం చేశామన్న మాటే- అని, కాలితో తాకరాదని, తన్నరాదని- యెవరికి వారే పవిత్రతని పాటించాలని కోరారు.
ఆ కోరిక తననే కోరినట్టు తలూపాడు. ఆకాశం అందదు. గాలి చిక్కదు. అగ్ని కాలుతుంది. నీరు ముంచుతుంది. భూమి భరిస్తుంది. నేలను అంటే ఫ్లోర్‌ని కళ్ళకు అద్దుకున్నాడు. లేచి నిలబడ్డాడు. భూమి మీద కాలు పెట్టి నిల్చుంటున్నానా- అనుకోగానే గుండె ధడ్ మంది. కుప్ప కూలిపోయాడు. ఆ క్షణంలో మోకాళ్ళ మీద తిరుపతి కొండ యెక్కిన భక్తులు బారులు తీరుతూ కళ్ళముందు కనిపించారు. చేతులతో నడవడం ప్రాక్టీసు చేస్తే బాగుణ్ణు అనుకున్నాడు. చేతులు నేలమీద ఆనించాడు.
అయ్యో మోకాళ్ళు అంత నొప్పులు పెడుతున్నాయా- అని పరుగున వచ్చి ఆందోళన పడిపోయింది వాళ్ళావిడ.
చేతులతో తలక్రిందులుగా నడవనివ్వలేదు. చేయి అందించి సాయం చేసింది. కాదు, తను చేస్తున్న ప్రయత్నాన్ని తలక్రిందులుగా చేసేసింది.
బెడ్ రూమ్‌లోకి తీసుకు వెళ్ళింది. బెడ్ మీద కూర్చోబెట్టింది. డాక్టరు దగ్గరకు వెళదామా- అడిగింది. అడ్డంగా తలూపాడు.
మనసులో యెక్కువ బెంగ పెట్టేసుకున్నా మోకాలినొప్పులు వస్తాయని కళ్ళలో నీళ్ళు తిప్పుకుంది వాళ్ళావిడ.
బెడ్ మీద వెనక్కి వాలి బేలగా కాళ్ళు చాపి పడుకున్నాడు. గోడమీది దేవున్నే చూస్తున్నాడు. క్షమించమని కళ్ళతోనే అర్థిస్తున్నాడు. అదే సమయంలో మళ్ళీ రెండు బల్లులూ పోట్లాడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాయి. అప్పటికే ఫోటో గాలికి అటూ యిటూ వూగుతోంది.
బల్లులు బాగా తిని కొవ్వు పట్టిపోయాయని, బల్లులు బల్లుల్లా లేవని మొసలి పిల్లల్లా యెలా వున్నాయో చూడండని తిట్టుకుంటోంది వాళ్ళావిడ.
దేవుడు తనని విముక్తం చేస్తున్నట్టు- అలా అని చెప్పకనే చెప్పినట్టు- దేవుడు నవ్వుతూ కదులుతూ వున్నాడు.
రెండు బల్లులూ పోట్లాడుకొంటూ ఫోటో వెనక్కి చేరాయి. ఫోటో ముందుకి వచ్చిన అరక్షణంలోనే ఢామ్మని కింద పడింది. అద్దం బద్దలైన చప్పుడు...
ఉస్సురుమంటూ పగిలిన ఫోటో వుంచకూడదని తీసి తుడిచి పక్కన పెట్టింది వాళ్ళావిడ.
ఎందుకో ఖాళీ గోడను చూస్తుంటే మనసు నిండా తృప్తితో ముఖంమీద చిరునవ్వు విస్తరించిందే కాక ఆరాత్రి బాగా నిద్రపోయాడు.
ప్రతి రాత్రీ నిద్రపోయాడు.
అయితే అక్కడికి నెలతిరక్కుండానే మళ్ళీ మరొక దేవుడి ఫోటోని వేళ్ళాడదీసింది వాళ్ళావిడ.
Type in English and Press Space to Convert in Telugu |
నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథమన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........ |
మధు వడ్డించిన అన్నం!ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే... |
ʹనోట్ʹలో మట్టి!పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది.
వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద... |
దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని... |
ఈ పక్షం బుల్పికలు!రాజ్యాంగం ఏమయ్యింది?"
"చిరిగిపోయింది!"
"ఎలా..?"
"కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?... |
జై శ్రీరామ్!రాముడి పేరే పలుకుతూ పెట్రేగిపోతూ హిందూ సేనలు రాముణ్ణి తరిమి తరిమి కొట్టాయి! రాముడు ప్రాణభయంతో పరుగులు తీశాడు! తృటిలో తప్పించుకొని ʹబతుకు జీవుడాʹ అని వూపిరి ... |
నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ...... |
100% డిజబులిటి నీడెడ్!అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి... |
లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్... |
నరʹసింహం!ʹమనిషిలా మాట్లాడుతున్నావే?- అంది కుందేలు! ఏ సర్కస్ సింహం తిరిగి అడవికి వొచ్చి అంటించిందా? లేకపోతే అలనాడు నరసింహుడు అడవిలో అడుగు పెట్టడంవల్ల అబ్బిందా?... ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |