చీమకుర్తి వలస కార్మికుల పోరాటం

| సంభాషణ

చీమకుర్తి వలస కార్మికుల పోరాటం

- శిల్పి | 17.05.2020 10:06:38pm


నేను పనిచేసే చీమకుర్తి గనుల్లో చాలామంది హిందీ కార్మికులు ఉన్నారు. సుమారు ఇరవై ఏళ్ళ నుండి వారి మధ్య ఉంటున్న గానీ, హిందీ నేర్చుకోలేని తెలివిమాలినవాడిని నేను. కాకపోతే కొన్ని పదాలు అర్థం అవుతాయి. హిందీ, తెలుగు రెండు కలిపి వాళ్ళతో మాట్లాడుతూవుంటా... వాళ్ళతో నవ్వుతూ కలసిపోవడానికి ప్రయత్నిస్తాను.

అయితే హిందీ వాళ్ళలో ఎందుకో గానీ, ఎక్కువ మంది హిందువులే నాకు పరిచయం అయ్యారు. చాల తక్కువ మంది ఇతర మతస్థులు కనపడ్డారు. వాళ్ళతో సరదాగా నేను రాజకీయాలు చర్చ చేస్తుంటా! కొందరి దేవుళ్ల మీద చర్చలు చేసే క్రమంలో నాకు అర్థమైంది ఏమంటే, వాళ్ళు రాముడంటే విపరీతమైన నమ్మకం కలిగివుంటారనీ, రావణాసురుడిని రాక్షసుడిగా చూస్తుంటారని. నేను వాళ్ళకి పరిచయం అయిన సందర్భంలో నువ్వు హిందువేనా అని అడిగారు. నేను కావాలనీ రావణాసుర సంతత్ అని చెప్పాను.
వాళ్ళు రావణాసుర సంతంత్ రాక్షస సంతత్ అని నవ్వుతారు. అయితే ఎక్కడా వాళ్ళు ఇతర మతస్తులను ద్వేషించేంత మూర్ఖత్వంతో లేరు. చాలా గౌరవంగా మర్యాదతో ఉంటారు. నేను చూసిన వాళ్ళలో చదువుకున్నవాళ్ళు చాలా తక్కువ. కానీ, వాళ్ళకున్న ధైర్యం, ఓపిక ఇతర ప్రాంతం వాళ్ళకి ఉండదు.

రాజకీయ విషయాలలో ఎక్కువ మంది బిజెపికి, తర్వాత కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నారు. కానీ హిందువులుగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మోడి, అమిత్ షా లను గొప్ప నాయకులుగా చెబుతున్నారు.

రాజస్థాన్ నుండి వచ్చిన హిందీ వాళ్ళు మాత్రం "బాబా రామ్ దేవ్" ని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపి, స్థానిక ప్రాంతీయ పార్టీలు ఏవైనా అధికారంలోకి వచ్చినా అక్కడి వాళ్ళందరూ హిందూ "బాబా" ల భావాజాలంతోనే ఉంటారు.భాషా ఇబ్బంది వల్ల వాళ్ళతో సుదీర్ఘ చర్చలు చేయను గానీ, అసలు మాట్లాడకుండా ఉండలేను.

ఎందుకు వాళ్ళకు బిజెపి ఇష్టం అని అడిగితే, ప్రధానంగా వాళ్ళు చెప్పే విషయం హిందుత్వం గురించే. రామ మందిరం, ఆటంక్ వాదులను, అణిచివేయడం, పాకిస్థాన్ తో యుద్ధం, కాశ్మీర్ లో సర్జికల్ స్టైక్ లో 400 మందిని ఆటంకవాదులను చంపడం గురించి చెబుతారు. అంతేగానీ, మాకు ఉద్యోగాలు వచ్చాయి, భూములు, ఇళ్ళు కట్టించారు, మా కోసం ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు అని ఒక్కరు కూడ చెప్పడం నేను ఇన్నాళ్ళుగా వినలేదు.

రాజ్యాధికారం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడంలో, బిజెపి జాతీయవాదం పేరుతో ఎంత విచ్ఛిన్నం చేస్తుందో, రాజకీయంగా ఎలా విజయం సాధించిందో, వీళ్ళకు తెలియదు. ఎందుకంటే వీళ్ళల్లో అధిక శాతం నిరక్షరాస్యులు. భగవాన్ తప్ప మానవత్వం విలువలు బొత్తిగా తెలియకుండా పెరుగుతారు. రధయాత్రలు చేసి మారణహోమం ఎందుకు సృష్టించారో, బాబ్రీ మసీదు ఎందుకు కూల్చారో, గుజరాత్లో ముస్లింలను ఊచకోతకు ఎందుకు గురిచేశారో, కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి ఎందుకు తీసివేశారో, పాకిస్థాన్ తో ఎందుకు యుద్ధం చేస్తామని అంటున్నారో, నోట్ల రద్దు ఎందుకు చేశారో, స్విస్ బ్యాంకు నుండి డబ్బు తెచ్చి ఎందుకు పంచలేదో, బి.యస్.యన్.ఎల్. ని దిబ్బతీసి జియోకు ఎందుకు సహకరిస్తూన్నారో ఇవేవి వాళ్ళు చర్చించుకోరు.

వాళ్ళకు తెలిసిందల్లా ఎక్కడ గుడి కనపడ్డా మూక్కుమ్మడిగా "జై శ్రీరామ్" అని, "జై భజరంగభళీ- అని నినాదం ఇవ్వడమే. వాళ్ళు ఉండే తాత్కాలిక నివాస ప్రాంతంలో చిన్న గుడికట్టి పూజలు చేస్తారు. హోలీకి, గణేశ్ నిమర్జనానికి కుంకాలు, రంగునీళ్లు చల్లుకుంటూ మత్తులో మునిగితేలతారు.

ఎక్కువ మంది, ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం నుండి వచ్చినవాళ్లు చీమకుర్తి చుట్టు ప్రక్కన ప్రాంతంలో సుమారు 8000 మంది ఉన్నారు. మిగతా వాళ్ళకంటే రాజస్థాన్ వాళ్ళు అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు.

60 గ్రానైట్స్ గనులు, వాటి అనుబంధంగా 450 కటింగ్ ఫ్యాక్టరీలలో పనులు చేస్తూ ఉంటారు. గనుల్లో wiresaw ఆపరేటర్లుగా (రాయినికోసే మిషనరీ) Jockey లేబరుగా, కొందరు మిషనరీల పనిచేస్తుంటారు. అంటే క్వారీలో ప్రధానమైన 50% పనూల్లో వీళ్ళు ఉన్నారు. ఇక "కటింగ్ ఫ్యాక్టరీ" పనుల్లో 80% వీళ్ళే కీలకంగా ఉన్నారు. పెద్ద రాళ్ళను చిన్న పీసులుగా కోసి, వాటిని గెలాక్సీ కనపడేదాక పాలిష్ చేసి, ఎక్స్ పోర్ట్ అయ్యేదాక వీళ్ళు లేని చోటు ఉండదు.

స్థానికులైతే వెట్టిచాకిరి చేయించలేమని, ఏదైన జరిగితే స్థానికులు సంస్థలకు నష్టం చేస్తారనే ఆలోచనలతో స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఎక్కువగా హిందీ వాళ్ళకే యజమానులు అవకాశాలు కల్పించారు.

వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క బ్యాచ్చీగా వాళ్ళ సొంత రాష్ట్రాలలో ఇంటికిపోయి రెండు నెలలు కుటుంబ సభ్యులతో గడిపి వస్తుంటారు.

రాష్ట్రంలోపల పాడేరు ప్రాంతంవాళ్ళు లేబర్ (రోజువారి కూలీలు) వస్తుంటారు. పాపం వీళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. బండెడు చాకిరీ చేస్తుంటారు గానీ, వాళ్ళ ముఖంలో ఆనందమూ, కోపమూ అస్సలు కనిపించదు. ఒక్కోసారి డిగ్రీలు చేసినవాళ్ళు కూడ వస్తారు. అక్షరముక్కరానీ స్లాటరు, రిగ్గు ఆపరేటర్ల అమ్మనాబూతులకు బలౌతుంటారు.

కానీ హిందీవాళ్ళు అలా ఉండరు, చాలా ఐక్యతగా ఉంటారు. ఒకర్ని ఎవరినైనా కోప్పడినా, దూషించినా అస్సలు ఊరుకోరు. ఒకరి కోసం అందరూ పని ఆపేసి ఇంటికిపోతారు. క్వారీ మేనేజ్ మెంట్ చచ్చినట్లు నచ్చజెప్ప మళ్ళీ తెచ్చుకుంటారు. పైగా లేబర్ మేస్త్రీలు యూనియన్ గా ఉండడం వల్ల కూడ ఉపయోగం అయ్యింది. ఒక మేస్త్రీ ముఠాను వద్దనుకుంటే ఆ మేస్త్రీకి రావలసిన బకాయిలు చెల్లించేంత వరకు మరో మేస్త్రీ తన వాళ్ళని పంపరు. 50% మిషనరీలతో పనినడుస్తున్నా 50% లేబర్ మీద ఆధారపడాల్సిందే. అందుకే క్వారీ స్టాఫ్ కార్మికులను తొలగించినంత తొందరగా రోజువారి కూలీలను తొలగించలేరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా "కరోనా వైరస్" ప్రపంచం మీదకు రావడం, రాత్రికి రాత్రే గవర్నమెంటు "లాక్ డౌన్" చెప్పడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కనీసం ఒక వారం రోజులు ముందుగా చెప్పివున్నా కార్మికులు ఇన్ని అగచాట్లు పడేవారు కాదు. విదేశాల్లో చదివే, ఉద్యోగాలు చేసే వాళ్ళందర్నీ ప్రత్యేక విమానాలు నడిపి తీసుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను వాళ్ళ సొంత ప్రదేశాలకు పంపే ఆలోచనలు చేయలేదంటే ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది.

దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా చీమకుర్తిలో కూడ లాక్ డౌన్ అయ్యింది. వివిధ రాష్ట్రాలలోని కార్మికులు ఇక్కడే చిక్కున్నారు. చాలా ఇరుకుగా వుండే లేబర్ తాత్కాలిక రేకుల ఇళ్ళల్లో మగ్గిపోయారు.

దేశ వ్యాప్తంగా చాలామంది కార్మికులు కాలినడకన తమవారి దగ్గరకు బయలుదేరారు. ఆకలితో అలమటించారు. కొంతమంది మార్గమధ్యంలో తనువు చాలించారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మూడు విడతల "లాక్ డౌన్" ల తర్వాత దేశంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నాక కేంద్ర ప్రభుత్వం వలసకార్మికులను స్వస్థాలాలకు పంపుతామని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో చీమకుర్తిలో చిక్కుకున్న వలస కార్మికులకు ఆశలు చిగురించాయి. తమ సొంత వాళ్ళను చూసుకోబోతున్నందుకు సంబరపడ్డారు.

3.5.2020 నాటికి ఆథార్ కార్డులు చూయించి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటించగానే స్థానిక ఎమ్మార్వో దగ్గరకు తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి సంతోషంగా వెళ్లారు. ఇక్కడే వారి ఆశలమీద నీళ్ళు చల్లారు అధికారులు. మీరు పనిచేసే గనుల యజమానులు దగ్గర నుండి అనుమతులు తెస్తేనే మీరు ఊరు వెళ్లడానికి పర్మిషను ఇస్తామని మెలిక పెట్టారు.

3.5.2020 నుండి కేంద్రం రాష్టాల పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెడ్, గ్రీన్, ఆరంజి జోన్ల వారీగా వర్గీకరించి ఆరంజి జోన్ వున్న చీమకుర్తిలో గ్రానైట్స్ పరిశ్రమలు నడుపుకోవచ్చని సడలింపు ఇచ్చింది.

40 రోజులు గ్రానైట్స్ కార్మికులు ఎక్కడ ఉన్నారో, ఏం తింటున్నారో, ఎలా ఉన్నారో పట్టించుకోని యజమానులు ప్రభుత్వ ప్రకటనతో హుటాహుటిన బయటకువచ్చారు. కార్మికులు తమ సొంత ప్రాంతాలకు పోకూడదని శాయశక్తులా ప్రయత్నించారు. ప్రభుత్వ అధికారులతో కుమ్మకై 8000 మంది ఒక్కసారి పోతే మా పరిశ్రమలు మూతపడతాయని, వలస కార్మికులను అప్పుడే పంపవద్దని ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను వాళ్ళ స్వస్థలాలకు పంపే విషయంలో మాట తప్పడంతో ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు తేల్చిచెప్పడంతో కార్మికులు, ఆవేదనకీ, ఆగ్రహానికి గురయ్యారు. తాము నలభై రోజులుగా చావు బతుకుల మధ్య బిక్కు బిక్కుమంటూ బతికామని, మేము ఎలా ఉన్నామోనని మా బంధువులు ఆందోళనలు చెందుతున్నారని, ఒక్కసారి ఇంటికివెళ్ళి వాళ్ళను చూసుకొని వస్తామని వేడుకున్నారు.

నలభై రోజులు యజమానులు మాకు తిండి పెట్టలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు. అలాంటిది ప్రభుత్వం మమ్మల్ని పంపడానికి సిద్ధపడితే, యజమానులు ఇప్పుడు బయటకు వచ్చి, మమ్మల్ని సొంతూర్లకు పోకుండా అడ్డుకోవడం అన్యాయమని వాపోయారు.

ఎవరి మద్దతు, నాయకత్వం లేకుండానే మొత్తం కార్మికులు సమూహంగా ర్యాలీగా బయలుదేరి చీమకుర్తి ఎమ్మార్వో ఆఫీసు ముందు ఘెరావ్ చేశారు. ఎమ్మార్వో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సాయంత్రం దాకా అక్కడే బైటాయించారు.

రెండవ రోజు నుండి వరుసగా వేలమంది ఒక్కసారి రోడ్డు మీదకు రావడంతో పోలీసు, మిలట్రీ వచ్చినా, అదుపు చేయలేకపోయారు. సొంత ఊర్లకు వెళ్ళాలనే కార్మికుల సంకల్పం ముందు ఏదీ పనిచేయలేదు. ఒక దశలో రోడ్డు మీద వేలాది మంది కార్మికులను కంట్రోల్ చేయడం కష్టమై అందర్ని స్థానిక హైస్కూలు గ్రౌండ్ లోకి పంపించారు. అంత ఎండలో కార్మికులందరూ ఆ గ్రౌండ్ లో కూర్చున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పట్టుదలగా ఉండిపోయారు. ఎవరెన్ని నచ్చచెప్పబోయినా వినలేదు. మధ్యాహ్నం భోజనం తీసుకొస్తే, తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు భోజనం చేయమన్నారు. అలా ఒక్కరు కూడ తిండి తినలేదు.

వీళ్ళందరికి నాయకత్వం, మార్గదర్శకం చేసినవాళ్ళు ఒరిస్సా కార్మికులు. వాళ్ళకు అంత తెగింపు, పట్టుదల ఎలా వచ్చిందో తెలియదుగానీ, మొత్తం ఎనిమిది వేలమందిని ఒక్క తాటిపై నిలిపారు.

ఒక దశలో వీళ్ళను తెచ్చిన మేస్త్రీలు కొందరు నచ్చచెప్పడం, బెదిరించడం చేశారు. దాంతో మేస్త్రీల మీదికి దాడికి దిగారు. తమను బలవంతంగా పనుల్లోకి పొమ్మని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కంప్లయిట్ చేసి వచ్చారు.

ఎవరి అండదటడలు లేకుండా అమాయకంగా కనిపించే కార్మికులు స్వచ్ఛందంగా తమకు తామే నాయకత్వం వహించుకొని ఐదు రోజులు మహా ఉద్యమం చేయడం వెనుక బలమైన కారణమేవుంది. చచ్చినా, బతికినా తమ వాళ్ళందరితో ఉండాలనే దృడ సంకల్పం వారిని ఎంతకైనా తెగించేలా చేసింది. అంటే ఈ నలభై రోజుల కరోనా సమయంలో వాళ్ళెంత మానిసికవేదనకు గురైవుంటారో అర్థమవుతుంది.

ఈ సమయంలో వీళ్ళు విపరీతంగా ఆరాధించే రాముడు, కృష్ణుడు ఆదుకోలేదు, ఆ హిందుత్వం పేరుతో ఓట్లు రాల్చుకొనే బిజెపి వాళ్ళు రాలేదు. రాజస్థాన్ కార్మికులు పూజించే బాబా రామ్ దేవ్ రాలేదు.

స్థానిక చీమకుర్తి గ్రానైట్స్ యూనియన్ నాయకత్వం తోడవడంతో, ఆందోళనలు ఉధృతం అయ్యి లోకమంతా తెలియడంతో ఆరు రోజులు తర్వాత ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

ఆరు రోజుల ఆందోళన సమయంలో చీమకుర్తి పట్టణంలో 144 సెక్షన్ విధించారు. చివరకు కార్మికుల పట్టుదలను చూసి ప్రభుత్వం దిగి వచ్చింది. హైస్కూలు ఆవరణలో "కారోనా వైరస్" బ్లడ్ శాంపిల్స్ తీసుకొని కార్మికులను వాళ్ళ స్వస్థలాలకు పంపుతామనే హామితో కార్మికులు ఆందోళన విరమించారు. కానీ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయిన కార్మికులు తామే రక్త పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వాహనాలు రాకపోవడంతో చిన్నగా కాలినడకన తమ గమ్యస్థానానికి చేరుకోవాలని ఒరిస్సా కార్మికులతో సహా సుమారు 2000 మంది 9.5.2020 రాత్రి బయలుదేరారు.

కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను తరలించే కార్యక్రమం ఎందుకు వెనక్కి తీసుకుందంటే, దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ప్రభుత్వం దగ్గర సమాచారం కూడా లేదు. కానీ ప్రభుత్వం వాళ్ళందర్నీ సొంత ఖర్చులతో గమ్యస్థానానికి చేర్చాలి. ముందు కార్మికులు కొంత చెల్లించాలని చెప్పంది, విమర్శలు రావడంతో నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నారు.

మరొక అంశం ఏమిటంటే పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చే నిర్ణయంలో భాగంగా పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారు. ఇక్కడ ఉండాలా, పోవాలా అనేది ఆ వ్యక్తీ ఇష్టం. తను పని చేయాలా, వద్దా అనేది కూడ అతని ఇష్టమే. కాదు, నువు పోకూడదు, నువు ఇక్కడుండే పనిచేయాలి అని నిర్ణయించడం బానిసత్వం అవుతుంది.

బానిస యజమానులుగా నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నందువల్లే వలస కార్మికుల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారాయింది.

No. of visitors : 597
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


క్వారీలు - మహిళా కార్మికులపై సామాజిక పరిశీలన

శిల్పి | 16.06.2020 05:17:10pm

చీమకుర్తిలోని కొన్ని క్వారీలు పేరుకే లిమిటెడ్ సంస్థలు గానీ, ఇక్కడ కనీస సౌకర్యాలు ఉండవు....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •