చారు మజుందార్ బెంగాలీలో రాసిన ఈ వ్యాసం మొదట దేశబ్రతి 1967 శరత్కాల సంచికలో, ఆ తరువాత లిబరేషన్ 1971 జులై-1972 జనవరి, 5వ సంపుటం, నెం.1 సంచికలో ప్రచురితమైంది.
భారతదేశ సామాజిక వ్యవస్థ అర్థ వలస అర్థ భూస్వామ్యం. ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవం అంటే వ్యవసాయ విప్లవం. భారతదేశంలో సమస్త సమస్యలూ ఈ ఒక్క కర్తవ్యంతో ముడిపడి ఉన్నాయి. ఈ వ్యవసాయ విప్లవ సమస్య గురించి ఈ శతాబ్ద ప్రారంభం నుంచి మార్నిసు సర్కిల్స్ లో భిన్నాభిప్రాయం ఉన్నది. మార్క్సిస్టులలో రెండు విదానాల మధ్య - ఒకటి విప్లవకరమైనది, మరొకటి విప్లవ ప్రతీఘాతుకమైనదాని మధ్య పోరాటం కొనసాగుతున్నది. రాజ్యాధికార సమస్య గురించి మెన్షివిక్కులు తప్పు తోవ పట్టించి మునిసిపలీకరణలో పరిష్కారం వెతికారు. దీనికి వ్యతిరేకంగా లెనిన్ ధర్మయుద్ధం ప్రకటించాడు. రాజ్యాధికార సమస్యను పక్కతోవ పట్టించడం వల్ల సమస్య పరిష్కారం సాధ్యం కాదని అన్నాడు. చట్టం ఎంత ప్రగతిశీలంగా రూపొందినప్పటికీ ప్రస్తుత రాజ్య స్వరూపం దానిని అమలు చేయలేదని నిరూపించాడు. రైతాంగం పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకనే కార్మికవర్గ నాయకత్వంలో కార్మిక కర్షకుల ప్రజాస్వామిక రాజ్యం మాత్రమే ఈ సమస్యను పరిష్కరిస్తుందని లెనిన్ అన్నాడు. ఈ మధ్యనే సోవియట్ పార్టీ రచయిత యుదిన్ నెహ్రు మౌలిక వైఖరిని విమర్శిస్తూ ఇంతవరకు నెహ్రు రైతాంగ సమస్యను పరిష్కరించలేకపోయాడని అన్నాడు. శాంతియుత పద్దతిలో ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో చూపించమని నెహ్రును సవాలు చేశాడు. నెహ్రు చూపించలేడని కూడా అన్నాడు. ఈ సమస్యను పరిష్కరించలేకపోగా, నెహ్రు చిన్నపాటి మార్పు కూడా తీసుకురాలేకపోయాడని చరిత్ర రుజువు చేసింది.
సోవియట్ ఇరవయ్యవ కాంగ్రెస్ తరువాత రివిజనిజానికి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. దీని ఫలితంగా సోవియట్ రాజ్యం సోషలిస్టు రాజ్యం నుంచి పెట్టుబడిదారీ రాజ్యంగా మారిపోయింది. ఆ ఇరవయ్యవ కాంగ్రెస్లో అవలంబించిన శాంతియుత పరివర్తన సిద్ధాంతాన్ని తమ మౌలిక మార్గదర్శక సూత్రంగా తీసుకుని మన దేశ రివిజనిస్టులు భూమి కోసం రైతాంగం చేసే పోరాటం ఆర్థిక డిమాండ్ల పరిష్కారానికేనని, రాజ్య యంత్రాంగం గురించి మాట్లాడడం సాహసికవాదం అని గొంతు చించుకుంటున్నారు. డాంగే, బసవపున్నయ్యలు చెప్పే దాని మధ్య విచిత్రమైన సాపత్యం!
బిశ్వనాథ్ ముఖర్జీ, హరేకృష్ణ కోనార్ల మధ్య ఏం చిత్రమైన సహకారం! ఇది అనుకోకుండా జరిగినది కాదు. దీని వనరు ఒకటే. అదే ప్రతీఘాతుక మెన్షివిక్కు సిద్ధాంతం. అందుకనే సోవియట్ రాజ్యపు మోసపు పాలకులు ఎరువులు, మెరుగైన విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాల వాడకం ద్వారా భారతదేశ ఆహార సమస్య పరిష్కారం అవుతుందని పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ రకంగా వాళ్లు భారత ప్రతీఘాతుక పాలక ముఠాను రక్షించడానికి ముందుకు వస్తున్నారు. భారతదేశ ఆహార, నిరుద్యోగ, పేదరిక, ఇతర సమస్యలను పరిష్కరించే మౌలిక, ప్రభావవంతమైన మార్గాన్ని వాళ్లు ప్రజల నుంచి దాస్తున్నారు. ఎందుకంటే ఇవాళ సోవియట్ రాజ్యం బ్రిటిషు-అమెరికా సామ్రాజ్యవాదులతో కుమ్మక్కవుతున్నది. భారత ప్రజలను దోపిడీ చేసే విధంగా రాజ్యాన్ని మార్చివేశారు. స్థానిక బూర్జువా వర్గం సహాయంతో సోవియట్ యూనియన్ కూడా మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. మన దేశంతో వ్యాపార, వాణిజ్య రంగంలో ప్రత్యేక సౌకర్యాలు అనుభవిస్తున్నది. అందుకనే ప్రతీఘాతుక పాలక ముఠా వాదనలు వారి అధికార ప్రతినిధి నుంచి నిరంతరంగా, నిరంతరాయ వేగంతో ప్రవహిస్తున్నాయి. అందుకనే బ్రిటన్, అమెరికాల కుమ్మక్కుదారుగా ఉన్న సోవియట్ రాజ్యం కూడా మనకు శత్రువే. వాటి రెక్కల కింద ఆశ్రయం పొందిన భారతదేశ ప్రతీఘాతుక ప్రభుత్వం ప్రజల మూపుల మీద పీనుగు మాదిరిగా బరువు వేస్తున్నది. అయినప్పటికీ నక్సల్బరి పుట్టింది. వందలాది నక్సల్బరీలు రగులుతున్నాయి. ఇది ఎలా జరిగిందంటే, భారత భూమి మీద ఉన్న విప్లవ రైతాంగం మహత్తర తెలంగాణా వీరోచిత విప్లవ రైతాంగానికి వారసులు. నాటి పార్టీ నాయకత్వం తెలంగాణా వీరోచిత రైతాంగ పోరాటానికి విద్రోహం చేసింది. మహోపాధ్యాయుడు స్టాలిన్ పేరును ఉపయోగించుకుని అది ఈ పని చేసింది. ఇవాళ పార్టీ నాయకుల స్థానంలో ఉన్న అనేక మంది ఆనాడు విద్రోహ చర్యలో భాగం ఉన్నవారే! తిరుగుబాటు ఎర్ర పతాకాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి బలం చేకూర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ విప్లవ అధికారంలో విశ్వాసం పెంపొందించుకోవడం కోసం కూడా మనం మోకాళ్ల మీద నిలబడి ఆ తెలంగాణా వీరుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అంతర్జాతీయ నాయకత్వం పట్ల వారికి అపరిమిత గౌరవం ఉన్నది. స్టాలిన్ పేరు విని వాళ్లు నిర్భయంగా భారత ప్రతీఘాతుక ప్రభుత్వానికి తమ ప్రాణాలను ఎదురొడ్డారు. విప్లవాలను నిర్వహించడానికి అన్ని కాలాలలో అన్ని రుతువులలో ఈ విప్లవ విధేయత అవసరం. తెలంగాణా వీరుల అనుభవం నుంచి మనం నేర్చుకోవాలి. స్టాలిన్ పేరును వాడుకుంటూ మార్క్సిజం-లెనినిజాన్ని వ్యతిరేకించే వారి ముసుగును మనం తీసివేయాలి. వారి చేతులలో నుంచి వందలాది కార్మిక కర్షకుల నెత్తురుతో తడిసిన ఎర్ర జెండాను గుంజుకోవాలి. ఈ జెండాను తమ చేతులతో ముట్టుకుని ఈ ద్రోహులు దానికి మచ్చ చేశారు.
నక్సల్బరి జీవిస్తున్నది, జీవిస్తుంది. అది అజేయమైన మార్క్సిజం-లెనినిజం-మావో సే టుంగ్ ఆలోచనా విధానం పునాదిగా ఉన్నది కనుక. ముందుకు సాగే కొద్దీ మనం అనేక ఆటంకాలు, అనేక కష్టాలు, అనేక విద్రోహాలు ఎదుర్కొంటామని మనకు తెలుసు. అనేక వెనకడుగులు కూడా ఉంటాయి. అయితే చైర్మన్ మావో ఆలోచనా విధానపు ప్రకాశవంతమైన సూర్యకిరణాలు దీవెనలా ప్రసరించాయి కనక నక్సల్బరి మరణించదు. ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మలయా రబ్బరు తోటల వీరుల నుంచి నక్సల్బరికి అభినందనలు అందాయి. తమ పార్టీ రివిజనిస్టు నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జపాన్ కామ్రేడ్స్ అభినందనలు తెలియజేసారు. అటువంటి అభినందనలే ఆస్ట్రేలియా విప్లవకారుల నుంచి కూడా వచ్చాయి. మహత్తర చైనాలో సాయుధ బలగాల కామ్రేడ్స్ నుంచి అభినందనలు అందాయి. వీటితో ʹప్రపంచ కార్మికులారా ఏకం కండిʹ అన్న అజరామర పిలుపు ప్రాధాన్యతను అర్థం చేసుకుంటున్నాం. అందరం ఒక్కటేనన్న భావం కలుగుతున్నది. సమస్త దేశాలలోనూ మనకు ప్రియమైన సంబంధాలు ఉన్నాయన్న మన నమ్మకం మరింత బలోపేతం అవుతున్నది. నక్సల్బరి మరణించలేదు. ఎన్నటికీ మరణించదు.
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |