పీడిత ప్రజల మార్గదర్శి నక్సల్బరీ
గనుల్లో కంపెనీల్లో, పొలాల్లో ధాన్యాగారాల్లో శ్రమజీవులు తమ యజమానుల లేదా పెట్టుబడిదారీ, జమీందార్, జోత్ దార్ వర్గాల చేత తీవ్రమైన దోపిడికి గురవుతున్నప్పుడు, దోపిడీ రధచక్రాల కింద పడి నలిగిపోయే శ్రమజీవులకు దాని నుండి బయటపడేందుకు ఎటువంటి మార్గం లేనప్పుడు, మధ్యతరగతి మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా సరిగ్గా తిండితిప్పల్ని సమకూర్చుకునే సాధానాలను పొందలేని స్థితిలో, సరైన మార్గాన్ని చూపే విప్లవ పార్టీ కూడా లేనప్పుడు, సరిగ్గా అటువంటి సమయంలో నక్సల్బరీ రైతాంగ ప్రజలు సరైన మార్గాన్ని చూపారు. అసంఖ్యాకమైన అత్యాచారాలకు గురైన శ్రమజీవులకు విప్లవకర మార్గపు వెలుగును చూపారు. శ్రమజీవి ప్రజానీకపు నిజమైన మిత్రులైన నక్సల్బరీ రైతాంగ ప్రజలు సాయుధమై అధికారాన్ని హస్తగతం చేసుకునే పోరాట మార్గాన్ని చూపి పీడిత శ్రమజీవుల ముందు సరైన విప్లవ మార్గపు మార్గదర్శులుగా అపూర్వమైన కృషి చేశారు.
రివిజనిజం, నయా రివిజనిజం రూపాల్ని బహిర్గతం చేయడం - దాని అంతర్జాతీయ లక్ష్యం
మరో విషయంలో కూడా నక్సల్బరీ రైతాంగం ప్రజల తోడ్పాటు తక్కువ వేమీ కాదు. కార్మికవర్గ పార్టీలుగా చెప్పుకునే వివిధ పార్టీలు కార్మికవర్గ పోరాటం పేరుతో సకల అవకాశవాద, విప్లవేతర మార్గాల్ని అనుసరిస్తున్నప్పుడు, ఆకర్షణీయమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు సిద్ధాంతం ద్వారా విప్లవ ప్రజానీకాన్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నప్పుడు, సరిగ్గా అదే సమయంలో, నక్సల్బరీ రైతాంగ మహత్తర, వీరోచిత పోరాటం కేవలం భారత అవకాశవాదుల, రివిజనిస్టుల లేదా నయా రివిజనిస్టుల ముసుగును తొలగించడమే కాక, దానితో పాటు కృశ్చేవ్ ʹశాంతియుత పరివర్తనʹ సిద్ధాంతాన్ని కూడా మరోసారి తిరస్కరించింది. ఈ విధంగా నక్సల్బరీ విప్లవ పోరాటం అంతర్జాతీయ లక్ష్యాన్ని కూడా కలిగి ఉన్నది. ఈ విషయంలో నక్సల్బరీ రైతాంగ పోరాటం వియత్నాం పోరాటం పట్ల ఐక్యత-సోదరభావాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విధంగా ప్రపంచ సోషలిస్టు విప్లవంలో ఒక విడదీయరాని భాగంగా అది నిలుస్తుంది. నక్సల్బరీ రైతాంగం మరోసారి మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోల విప్లవ సిద్ధాంతాలకు సంబంధించిన ఆచరణాత్మక వ్యక్తీకరణను ముందుకు తెచ్చింది. అది సామ్రాజ్యవాదం-రివిజనిజం కేవలం కాగితపు పులులని చాటిచెప్పింది. వారి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతం కూడా కాగితపు పులి చేసే బూటకపు గర్జనే. కార్మికవర్గ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేయడం ద్వారానే దోపిడీ పీడనలకు గురయ్యే శ్రమజీవి ప్రజానీకం వ్యవసాయ విప్లవం ద్వారా నయా వలసవాద దోపిడి-పాలన నుంచి విముక్తి లభిస్తుంది. ఇందుకు మరో మార్గం లేదు. నక్సల్బరీ పైన పేర్కొన్న విప్లవ బోధనను ఎత్తిపట్టింది. ఇక్కడే నక్సల్బరీ ప్రాధాన్యత, ప్రత్యేకత, యెల్లలులేని తోడ్పాటు ఇమిడి ఉన్నది.
నక్సల్బరీ పోరాటం జాతీయ పోరాటం
భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం. ఈ దేశంలో 70 శాతం మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రైతాంగ ప్రజలు నేడు ఆకలి చావులకు గురవుతున్నారు. జామీందార్ల, జోత్ దార్ల దోపిడి కారణంగా రైతాంగం బతుకులు తీవ్రమైన దురవస్థకు గురై భయంకరంగా తయారయ్యాయి. దేశాభివృద్ధిని కోరుకునేవారు తప్పకుండా రైతాంగ అభివృద్ధిని కోరుకోవాలి. ఎందుకంటే, దేశమంటే వారేనని (రైతాంగం) ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ దేశంలో చాలా వరకూ లేదా అత్యధిక మెజారిటీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుత ఈ స్థితిలో మార్పును తేవాలంటే ఒకే ఒక్క మార్గం సాయుధ వ్యవసాయ విప్లవ మార్గం. అంటే సాధారణ రైతుల కొనుగోలు శక్తి పెంచాలి. ఎందుకంటే కొనుగోలు శక్తి తక్కువైతే దేశంలో మెజారిటీ ప్రజలు ఎప్పటికీ కూడా పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధికి తోడ్పాటును అందించలేరు. జాతీయ పరిశ్రమలు అభివృద్ధి కాకపోతే దేశ అభివృద్ధి కూడా సాధ్యం కాదు. అందువల్ల రైతుల సమస్యతో పాటు నేడు కార్మికులు, మధ్యతరగతి మేధావులు, ఉపాధ్యాయులు విద్యార్థులు - అందరి సమస్య ఒక్కటే, వేర్వేరు కాదు. ఈ విధంగా రైతుల పోరాటం జాతీయ పోరాటం. ఈ ʹజాతీయ విప్లవ పోరాటంʹలో సాఫల్యం లభించకపోతే జాతీయ పరిశ్రమల్లో కొనసాగుతున్న సంక్షోభం కూడా తొలగిపోవడం సాధ్యం కాదు. అంటే, శ్రమజీవి ప్రజానీకపు కష్టాలు-కడగండ్లు కూడా తక్కువ కావు. నక్సల్బరీ రైతాంగ పోరాటం ఈ జాతీయ పోరాటంలో కూడా విడదీయరాని భాగం. పంజాబ్ నుంచి అసోం వరకూ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యావత్తు జాతీయత, ఉపజాతీయతా సమస్యలకు ఒకే ఒక్క మార్గం సాయుధ వ్యవసాయ విప్లవ మార్గం. అంటే రైతుల జాతీయ పోరాటమే యావత్తు జాతుల విముక్తికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నక్సల్బరీ రైతాంగ పోరాటపు ఈ జాతీయ ప్రాధాన్యతను కూడా ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి, ఇది చెప్పుకోదగిన అంశం కూడా. నక్సల్బరీ పోరాటం జాతీయ పోరాటంలో విడదీయరాని భాగమని చెప్పిన విధంగానే, నక్సల్బరీ శత్రువు యావత్తు జాతుల ఆగర్భ శత్రువు కూడా. అదే విధంగా, ఆ శత్రువుల, వారి దళారులందరి నిజమైన లక్షణాల్ని నక్సల్బరీ చాటిచెప్పింది, బహిర్గతం చేసింది.
మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు?
జమీందార్లు-జోత్ దార్లు, దేశ-విదేశీ పెట్టుబడిదారులు, వారి ప్రభువులైన అమెరికా సామ్రాజ్యవాదులు దేశ శ్రమజీవి ప్రజానీకానికి పరమ శత్రువులని నక్సల్బరీ దేశానికి స్పష్టంగా చాటిచెప్పింది. ఎందుకంటే, ఈ శత్రువులే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పోలీసునుమిలటరీని ఉపయోగించి రైతులపై, శ్రమజీవులపై అత్యాచారాలు చేస్తారు. దోపిడీని కూడా కొనసాగిస్తారు. అభివృద్ధి నిరోధక రాజ్యపు రాజ్యాంగయంత్రంలో భాగంగా ఏ మంత్రిమండలి అయినా, ఏ విప్లవకర పేరు ఉన్నా నిజానికి అది శ్రమజీవి ప్రజానీకంపై దోపిడిని కొనసాగించడం కోసం సోకాల్డ్ చట్టబద్ధ రూపం మాత్రమే. విప్లవ ముసుగులో అభివృద్ధి నిరోధక దళారీలు, దళారీ వామపక్ష పార్టీలను నక్సల్బరీ స్పష్టంగా బహిర్గతం చేసింది. దీంతో పాటు, కార్మికవర్గ నాయకత్వంలో కీలకమైన శక్తులైన రైతాంగం-మధ్యతరగతి మేధావుల సమైక్య శక్తి మాత్రమే సరైన అర్థంలో ప్రజల మిత్ర శక్తి అని కూడా స్పష్టం చేసింది. ఈ విధంగా, నక్సల్బరీ పోరాటం ప్రజల నిజమైన మిత్రులు ఎవరు, నిజమైన శత్రువులు ఎవరు అనేది చాటిచెప్పింది.
భూదాహం కాదు, గతిశీల చలన ప్రక్రియ
తెరాయి రైతాంగ పోరాటం మౌలికంగా భూదాహంతో కూడిన పోరాటమని అభివృద్ధి నిరోధకులు ప్రచారం చేస్తారు. అంటే కేవలం భూమి కోసమే పోరాటం అని అంటారు. స్పష్టంగా వారి ఉద్దేశ్యం ఏమిటంటే, ఆర్థికవాదం లేదా ఆర్థిక డిమాండ్లు అనే నాలుగు గోడల మధ్య ఉ ద్యమాన్ని పరిమితం చేయడం. అవకాశవాద వామపక్ష మార్గీయులు ఆర్థిక పోరాటం కాక మరేమీ కాదని అనుకుంటారు, అంతకు మించి మరేదీ కూడా అర్థం చేసుకోవాలని అనుకోరు.
ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా ఆర్థికవాదం కారణంగా ఈ విధమైన మాటల్నే వల్లిస్తూ ఉంటారు. నిస్సందేహంగా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకై భూమి అనేది ఒక పెద్ద వనరు. ఉత్పాదన కోసం కూడా అది ఒక పెద్ద శ్రమ సాధనం. జమీందార్-జోత్ దార్ వర్గం సాధారణ రైతులను భూమిపై యాజమాన్యం హక్కు లేకుండా చేసి దోపిడీ చేస్తూ ఉంటుంది, దోపిడీ చేస్తూ వచ్చింది. దేశంలోని 80 శాతం సాగుభూమి ఈ జోత్ దార్-జమీందార్ వర్గం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వడ్డీ వ్యాపారుల (మహాజన్లు) వద్ద వ్యవసాయ పనులు చేసే రైతుల అప్పు సుమారు ఒక వేయి కోట్ల రూపాయలకు చేరుకుంది. వాటికి వడ్డీ ఒక వంద కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ విధంగా అప్పు, వడ్డీల వల్ల రైతులు సర్వస్వం కోల్పోయి పేదలుగా మారిపోవాల్సి వస్తుంది. విశాల రైతాంగ ప్రజానీకంతో పాటుగా జోత్ దార్లుజమీందార్ల దోపిడీ రధచక్రం కింద కూలీలు-మధ్యతరగతి వర్గం, మేధావులు కూడా నలిగిపోతారు. శతాబ్దాల తరబడి భూస్వామ్య జోత్ దార్-జమీందర్ వర్గం కేవలం రైతులను తమ ఆస్తిగా మార్చుకోవడమే కాక, వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా భూదాసులుగా మార్చుకున్నారు. భూమికి చాలా అద్భుతమైన ప్రాధాన్యత ఉందని తెరాయి ప్రాంతంలోని రైతులకు చాలా మంచిగానే తెలుసు. అందువల్ల వారు మూలం మీదనే దెబ్బకొట్టారు. భూమిపై అధికారాన్ని సంపాదించుకునే పోరాటాన్ని ప్రారంభించారు. తాత్కాలికంగా భూమిని ఆక్రమించుకోవడం ద్వారా శాశ్వతంగా రైతుల భూమి సమస్య పరిష్కారం కాదు. అందువల్ల, నక్సల్బరీ రైతాంగం భూమిపై శాశ్వత అధికారాన్ని నిలబెట్టుకునే పోరాటంలోకి దూకింది. అది కేవలం అధికారం లేదా సామర్థ్యాన్ని సంపాదించుకోవడం ద్వారానే గ్రామ గ్రామాన శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలుగుతుంది. దీని ఫలితంగా రైతుల విముక్తి ప్రాంతాన్ని లేదా ప్రజల స్వతంత్ర మౌలిక స్థావర ప్రాంతం స్థాపించగలుగుతుంది. అక్కడి నుంచి మొదలై భారతదేశంలోని ఒక్కో పోరాట జాతి ప్రజలు నయా వలస పాలనా వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించగలుగుతారు.
కేవలం భూదాహమే నక్సల్బరీ ఆందోళనకు ఏకైక వనరు కాదు, ఇందుకు భిన్నంగా దాని వెనుక మరిన్ని సహేతుక కారణాలు ఉన్నాయి. కేవలం భూదాహమే సర్వం అయితే ప్రభుత్వం వైపు నుంచి గ్రామస్థులకు పాడుబడిన బంజరు భూములను పంచినప్పుడే ఈ పోరాటం నిలిచిపోయి ఉండేది. కానీ, వాస్తవానికి అలా జరగలేదు. ఇందుకు భిన్నంగా పోరాటం మరింత తీవ్రతరమైంది, అవుతున్నది. ఎందుకంటే, (ప్రభుత్వం) పైపై మెరుగుల కోసం తాత్కాలికంగా బంజరు భూమిని పంచి ప్రజలను మభ్యపెడుతుందని, అయినప్పటికీ రైతుల పరిస్థితి ఎప్పటి లాగానే ఉంటుందని తెరాయి రైతులకు స్పష్టంగా తెలుసు. జోత్ దార్ వర్గ రాజ్యాంగయంత్రాన్ని పూర్తిగా ధ్వంసం చేయనంత వరకూ రైతాంగం భూమిపై అధికారాన్ని కూడా సాధించుకోలేరు. ఇదే తెరాయి రైతుల మౌలిక నూతన ఉపదేశం. ఇవి నూతన రాజకీయాలు. సాయుధ ప్రతిఘటనకు చెందిన ప్రజాయుద్ధ సిద్ధాంతం. ఇది శతాబ్దాల నుంచి వస్తున్న పాత, కొత్త భూస్వామ్య ఆచరణను తుడిచి పెట్టే బెంగాల్ రైతాంగ నూతన చైతన్యం. సంపూర్ణంగా గుణాత్మకంగా మార్పు చెందిన చైతన్యం.
అయితే దీని అర్థం తెరాయి రైతాంగం సోషలిస్టు మానవులుగా మారిపోయారని కాదు. అవకాశవాద అభివృద్ధి నిరోధకులు చేసే అన్ని రకాల ప్రచారానికి భిన్నంగా మనం - మార్క్సిస్టు దృక్పథం ప్రకారం ఏ పదార్థాన్ని అయినా వేరుచేసి చూడకూడదనీ, ఇందుకు భిన్నంగా మొత్తం పదార్థాల సమూహంలో భాగంగానే చూడాలనీ, అంటే ఇక్కడి జరిగిన ఒక రైతాంగ పోరాటాన్ని (వివిధ పోరాటాలను) కొనసాగించే గతిశీల ప్రక్రియలో భాగంగానే చూడాలనే విషయాన్ని రెట్టించి చెప్పాలి. ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆరంభంగా చూడాలి - ప్రారంభంలోనే సంపూర్ణతను సాధించిందని చెప్పడం మార్క్సిస్టు దృక్పథానికి భిన్నమైన వ్యక్తీకరణ అవుతుంది. వస్తుగతంగా, ప్రపంచవ్యాప్తంగా మార్కిస్టులమని చెప్పుకునే వాళ్లు విశాల ప్రజానీకానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య ʹపాటʹను వినిపించి పూర్తిగా మంత్రముగ్ధులను చేస్తున్న సమయంలో, తెరాయి రైతాంగం నూతన చైతన్యంతో ప్రజల ప్రజాస్వామిక విప్లవాన్ని ప్రారంభించడం - ఇదే గుణాత్మకంగా నూతనమైనది. ఈ ఘటనా క్రమపు గతిశీల ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యత, చెప్పుకోదగిన స్థాయి ఉన్నది.
విప్లవ రాజకీయాలు - గ్రామీణ ప్రాంతాల్లో బీజప్రాయంలో విముక్తి ప్రాంతం
నక్సల్బరీ రైతాంగం పైన పేర్కొన్న విధంగా గుణాత్మకంగా మార్పు చెందిన రాజకీయాలను ఎత్తిపట్టింది. ఈ విప్లవ రాజకీయాలు మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోల భావజాలపు ఎర్రజెండానే ఎత్తిపట్టాయి. మార్క్స్ నుంచి మావో వరకూ బోధించిన విప్లవ సిద్ధాంత ఆచరణ - విప్లవం ద్వారానే అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రాథమిక వనరు తుపాకియే అని మరోసారి రుజువైంది. దీంతో పాటు, విప్లవ ప్రజలే అంతిమ నిర్ణయాత్మక శక్తి అని కూడా రుజువైంది. యావత్తు బూర్జువా, అభివృద్ధి నిరోధక రాజ్యాంగయంత్రం కాగితపు పులి మాత్రమే. విప్లవ రాజకీయాల నియంత్రణలో ఉండే సాయుధ శక్తి ద్వారా మాత్రమే అభివృద్ధి నిరోధక రాజ్యాంగయంత్రాన్ని సాయుధ శక్తి ద్వారా ధ్వంసం చేయడం ద్వారా మాత్రమే శ్రమజీవి ప్రజల విముక్తిని సాధించడం సాధ్యమవుతుంది - ఈ విషయన్నే మరోసారి ఉత్తర బెంగాల్ విప్లవ రైతాంగం ప్రామాణికంగా చాటిచెప్పింది.
ఈ విప్లవ సిద్ధాంతంపై ఆధారపడడం ద్వారానే అక్కడ విప్లవ నిర్మాణం కూడా ఏర్పడింది. కేవలం పైకి విప్లవకరంగా అంటే కేవలం సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి తమకు తాము పెద్ద విప్లవకారులుగా చెప్పుకోవడం కాక, మాటల్లో చేతల్లో ప్రామాణికమైన కఠిన మార్గంలో అక్కడి కార్యకర్తలు పరీక్షకు గురవుతున్నారు. మాటల్లో చేతల్లో శ్రమజీవి ప్రజానీకంతో పాటు మమేకమవుతున్నామా లేదా - కామ్రేడ్ మావో బోధించిన ఈ అమూల్యమైన సిద్ధాంతాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎవరు విప్లవకారులు, ఎవరు విప్లవ ప్రతీఘాతకులు, ఎవరు విప్లవానికి వ్యతిరేకులు అనే విషయాన్ని విశ్లేషణ చేస్తున్నారు.
పై ప్రామాణికాలపై పరీక్షకు గురైన కార్యకర్తలు (పార్టీ) నిర్మాణానికి చెందిన బీజప్రాయపు విముక్తి ప్రాంతాన్ని నిర్మించే పనిని ప్రారంభించారు. ప్రాథమిక విముక్తి ప్రాంతాల సమూహమే శత్రువును పెద్దెత్తున భయాందోళనలకు గురిచేసే ప్రాంతం. శ్రమజీవి ప్రజలకు రక్షణ ఉండే ప్రదేశం. నిజానికి దక్షిణ వియత్నాంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక విముక్తి ప్రాంతాల సమూహమే అత్యంత కరుడుగట్టిన అమెరికా సామ్రాజ్యవాదాన్ని ముప్పతిప్పలు పెడుతున్నది. ప్రస్తుతం భారతదేశంలో కూడా సామ్రాజ్యవాదాన్ని ఈ విధంగా నిజంగా భయాందోళనలకు గురి చేసే ప్రదేశాన్ని, పైన పేర్కొన్న విధంగా ప్రజల విముక్తి ప్రాంతాన్ని స్థాపించడం అత్యంత ఆవశ్యకమైన కర్తవ్యం. కార్మికవర్గ నాయకత్వంలో నక్సల్బరీ రైతాంగ ప్రజానీకం ఆ ప్రాథమిక కర్తవ్యాన్ని అమలు చేయడం ఆరంభించింది. ఆ విముక్తి ప్రాంతంపై ఆధారపడడం ద్వారానే సామ్రాజ్యవాదుల, వారి దళారీలు అణ్వాయుధాలతో కూడిన మొత్తం 32 కోరలను పెకిలిస్తూ వారి అధికారాన్ని కూలదోసే కార్యక్రమం ఆరంభమవుతుంది. నక్సల్బరీలో విముక్తి ప్రాంతాన్ని స్థాపించడం కోసం ప్రతిన బూనే సమయంలో మార్క్సిస్టు విప్లవ బోధన ప్రకారం శత్రు దోపిడీ, పీడనల్లో అత్యంత బలహీనమైన ప్రదేశం వద్ద వాడిని దెబ్బతీయాలనే విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. ఇటువంటి విముక్తి ప్రాంతమే విప్లవ శక్తుల కేంద్ర బిందువు అవుతుంది. ఈ విముక్తి ప్రాంత సమూహమే విప్లవ శక్తుల ధాత్రి (పాలిచ్చే తల్లి) లేదా జన్మనిచ్చే తల్లి అవుతుంది. ఆ తల్లే వాటిని పెంచి పోషిస్తుంది, వాటిని తన పిల్లల్లాగా ఒడిలోకి తీసుకొని, ఉ ద్భవించిన విప్లవ శక్తులను శక్తివంతులను గావిస్తుంది, యవ్వనోత్తేజం వాటిలో నింపేందుకు శక్తినంతా ధారపోస్తుంది. ఇదే సర్వస్వంగా మారిపోయి విప్లవ రాజకీయాలకు, నిర్మాణానికి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక శిక్షణకు ఒక్కొక్క పెద్ద పాఠశాల లేదా విద్యాలయం అవుతుంది. ప్రజాయుద్ధంలో ఒక్కొక్క శక్తివంతమైన కోటలాగా ఈ ప్రాథమిక విముక్తి ప్రాంతాలే అత్యంత విశాలమైన విముక్తి ప్రాంతాలను నిర్మిస్తాయి లేదా సృష్టిస్తాయి. దీని ఫలితంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని, దాని దళారులను భూస్థాపితం చేసే పని వేగవంతమవుతుంది. యావత్తు విప్లవ ప్రజానీకం అమెరికా సామ్రాజ్యవాదానికి, దాని దళారులకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని నడపడం నేర్చుకుంటారు. గతంలో అలా చేసిన అనుభవం లేకపోయినా కూడా ఇప్పుడు వాళు » తమ చేతుల్లోకి ఆయుధాల్ని అందుకుంటారు, యుద్ధాన్ని నేర్చుకుంటారు, ప్రజాయుద్ధాన్ని నడపడంలో దక్షులు లేదా నిపుణులు అవుతారు. అమెరికా సామ్రాజ్యవాదం పిచ్చికుక్కలాగా ఇక్కడో దెబ్బ, అక్కడో దెబ్బ తింటూ రగులుతున్న ప్రజాయుద్ధ మంటల్లో మాడిమసవుతుంది. అది (అమెరికా సామ్రాజ్యవాదం) తాను చేసిన కార్యాల ఫలితంగా అనివార్యంగా ప్రజాయుద్ధ మంట ముందు నిలబడి ఉంది. ఈ ప్రజాయుద్ధ ప్రాథమిక కోటను విశాల గ్రామీణ ప్రాంతాల్లోనే నక్సల్బరీ మార్గంలోనే నిర్మించడం సాధ్యం. కమ్యూనిస్టులమైన మనం అలాంటి వందలాది విముక్తి ప్రాంతాల ద్వారానే దోపిడీ పీడనలకు గురయ్యే భారత ప్రజలను విముక్తి చేయడంలో సమర్థులు కాగలుగుతామనే పాఠాన్ని నేర్చుకోవాలి. తద్వారానే అమెరికా సామ్రాజ్యవాదం, దాని తొత్తులను, సేవకులను భూస్థాపితం చేయడంలో సమర్థులు కాగలుగుతాం. అందువల్ల కార్మికవర్గ నేతృత్వంలో నక్సల్బరీ రైతాంగం నక్సల్బరీలోనే ఇటువంటి విముక్తి ప్రాంతాన్ని నిర్మించారు. ఈ విషయంలో వారు మావో ఆలోచనా విధానంతో దృఢంగా నిలిచారు. మావో ఆలోచనా విధానాన్ని ఆచరణలో అమలు చేసి, ఆ ఆలోచనా విధానపు విశ్వజనీన సత్యాన్ని మరోసారి ఎత్తిపట్టారు.
నక్సల్బరీ బోధించిన పాఠం కామ్రేడ్ మావో బోధనకు భౌతిక లేదా వాస్తవిక రూపమే. ఇదే ఆ పాఠానికి సంబంధించిన వాస్తవిక రూపం, గ్రామీణ ప్రాంతాల్లో విముక్తి ప్రాంతాలను నిర్మించాలనే పాఠం. ఈ విధంగా విప్లవ విముక్తి ప్రాంతాలు ఒకటి తర్వాత మరొకటిగా ఆవిర్భవించి యావత్తు పట్టణాల్ని చుట్టుముట్టే శక్తిని సంతరించుకుంటాయి. అవి ఎంతగా శక్తివంతమవుతాయంటే శత్రువుకు ఇక పారిపోవడానికి మార్గమే ఉండదు.
నక్సల్బరీలో రగులుకున్న మంటను కార్చిచ్చుగా మార్చడమే విప్లవ కమ్యూనిస్టుల ప్రస్తుత తక్షణ కర్తవ్యం. విశాల గ్రామీణ ప్రాంతాల్లో విముక్తి ప్రాంతాలను నిర్మించి పట్టణాల్ని చుట్టుముట్టడం కోసం విప్లవ ప్రతిఘటనను నిర్మించడం అవసరం. నక్సల్బరీ ఇటువంటి విప్లవ ప్రతిఘటనా మార్గాన్ని చూపించింది.
ప్రతిఘటన - గుణపాఠం సాధారణంగా రైతులు చేపట్టే బాగా ప్రచారమైన ప్రతిఘటనా రూపాలకు పూర్తిగా భిన్నమైనది నక్సల్బరీ రైతాంగ ప్రతిఘటన. ఈ ప్రతిఘటన కేవలం కొన్ని ఆర్థిక డిమాండ్లపై కాక, కేవలం భూమిని పొందడం కోసమే కాక, ఈ ప్రతిఘటనా లక్ష్యం చాలా విశాలమైనది, మహత్తరమైనది. ʹరాజకీయ ప్రతిఘటనʹ - సామ్రాజ్యవాదాన్ని కూలదోసే ప్రతిఘటన, దాన్ని కూలదోయడం కోసం భూస్వామ్య వ్యవస్థ ప్రభువులైన దేశ-విదేశీ పెట్టుబడిదారీ వర్గపు పోలీసు-మిలటరీకి వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన. అందువల్ల గుణాత్మకంగానే భిన్నమైన ఈ ప్రతిఘటనా పోరాటాన్ని యావత్తు బూర్జువా వర్గం, దాని దళారులు ఎంతగానో భయపడతారు. వాస్తవానికి, వాళ్లంతా ఎంతగానో భయాందోళనలకు గురయ్యారు. ఈ పనిశైలిని మార్చుకోవాలి ఒక వైపు భారతదేశంలో అభివృద్ధి నిరోధకుల సంక్షోభం చాలా తీవ్రమవుతుండగా, శ్రమజీవి ప్రజానీకపు సంక్షోభం కూడా తక్కువగా ఏమీ లేదు. నిజానికి శ్రమజీవి ప్రజానీకం సంక్షోభం విప్లవ సంక్షోభం అవుతుంది. అయితే ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఎందుకంటే, ఎన్ని రకాల ఉద్యమాలు, పోరాటాలు మొదలైనవి అభివృద్ధి చెందినప్పటికీ, అవన్నీ ఒకే ప్రవాహంలో ఐక్యం కావడం లేదు. అంటే, కార్మికోద్యమం, మధ్యతరగతి వర్గ ప్రజల సమస్యలు-పోరాటాలు మొదలైనవి భారతదేశంలో ప్రాథమిక పోరాటంతో అంటే రైతాంగ పోరాటంతో ఐక్యం కావడం లేదు. ప్రస్తుతం నక్సల్బరీ సమస్యాత్మకమైన ఈ మార్గాన్ని తిరస్కరించి సరైన మార్గాన్ని చూపించింది. విప్లవ సంక్షోభ స్థితిని ఉపయోగించుకొని ప్రజా పోరాటాలను, ఉద్యమాలను రైతాంగ పోరాటంతో మమేకం చేసింది. అక్కడే తెరాయి రైతాంగ కార్మికవర్గపు విప్లవ సిద్ధాంతంపై ఆధారపడిన విప్లవ నిర్మాణం ఆవిర్భవిస్తుంది. అయితే, ఆ నిర్మాణం ప్రాచుర్యం పొందిన పెటీబూర్జువా పనిశైలి వంటి దానిపై ఆధారపడిన నిర్మాణం కాదు. ఈ ప్రాంతంలో అత్యంత తెలివితేటలతో విప్లవకర పనిశైలి అమలు చేయబడింది.
పుస్తక జ్ఞానం, నాయకులు సుదీర్ఘ డాంబికమైన ఉపన్యాసాల ద్వారా కాకుండా, ప్రతి క్షణం భౌతికవాద దృక్పథాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి రోజు, ప్రతి క్షణం జరిగే యావత్తు మార్పుల భౌతిక పరిశీలన, విశ్లేషణే సరైన మార్క్సిస్టు గతితార్కిక భౌతికవాద దృక్పథం అవుతుంది. ఈ దృక్పథం ప్రకారం మాత్రమే అన్ని విషయాలను పరిశీలించాలి, ఆలోచించి విశ్లేషించాలి. కార్మికవర్గ నాయకత్వంలో నక్సల్బరీ రైతాంగం ఈ వాస్తవిక విధానంపై దృఢంగా నిలిచారు.
కార్మికుల్ని-రైతాంగాన్ని ప్రేమిద్దాం - వారి పట్ల శ్రద్ధ వహిద్దాం
వ్యవసాయ విప్లవ స్థాయిలో కమ్యూనిస్టులు కార్మికుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. కార్మికులు-రైతుల పట్ల శ్రద్ధ వహించాలి. నక్సల్బరీ రైతాంగాన్ని అక్కడి నిజమైన కమ్యూనిస్టులు ప్రేమించారు, వారి పట్ల శ్రద్ధ వహించారు. వారి పక్షాన నిలబడడం ద్వారానే తమ సర్వశక్తుల్ని ధారపోసేందుకు వాళ్లు సిద్ధం కాగలుగుతున్నారు. అయితే, కేవలం ప్రేమ, శ్రద్ధ మాత్రమే కాదు, నక్సల్బరీ వంటివి అనేకం నిర్మాణం చేయడం కోసం కమ్యూనిస్టులు మరొక విషయాన్ని నేర్చుకోవాలి. అదేమిటంటే, వాళ్లు రైతుల కింద విద్యార్థులుగా మారడం నేర్చుకోవాలి. అంటే ఉత్పాదక శ్రమను గౌరవించాలి, ఉత్పాదక వర్గానికి విద్యార్థులుగా మారడం నేర్చుకోవాలి.
నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా అయితే చదువుకునే విద్యార్థులు ఏమాత్రం నేర్చుకోలేరు. అదే విధంగా కమ్యూనిస్టులు కూడా అలానే అయితే సాధారణ ప్రజలను అర్థం చేసుకోవడంలో దక్షులు కాలేరు. మంచి ఉ పాధ్యాయులుగా తయారు కావాలంటే ఎలాగైతే మంచి విద్యార్థులుగా అవ్వాల్సి ఉంటుందో అదే విధంగా కమ్యూనిస్టులు నిజమైన కమ్యూనిస్టులుగా తయారు కావాలంటే మొదట జీవం ఉన్న డిక్షనరీ అంటే కార్మికులకు-రైతులకు విద్యార్థులుగా అవ్వాలి. అంధవిశ్వాసాల వల్ల ఏర్పడే అన్ని రకాల తప్పుడు అవగాహనలను వదిలించుకుంటూ పరిశుభ్రమైన హృదయంతో కార్మికుల-రైతుల వద్దకు వెళ్లాలి. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. వారి జీవన విధానంతో తమ జీవన విధానాన్ని మమేకం చేయాలి. ఉదయం నుంచి రాత్రి వరకూ అంటే కూర్చున్నప్పుడులేచినప్పుడు, అటూ ఇటూ తిరిగేటప్పుడు, నిద్రావస్థలో సైతం - ప్రతి క్షణం రైతుల ఆలోచనలు, రైతుల కష్టాలు-కడగండ్ల గురించి ఆలోచిస్తేనే భారతదేశంలో ప్రజల ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే పనిని వేగవంతం చేసేందుకు సరైన భూమికను పోషించగలుగుతారు. అప్పుడు మాత్రమే కమ్యూనిస్టులు రైతాంగాన్ని విముక్తి చేయడంలో, వ్యవసాయ విప్లవ తొలి కృషిని పరిపూర్తి చేయడంలో దక్షులు కాగలుగుతారు. రైతుల దైనందిన జీవన క్రమపు మౌలిక వాస్తవాన్ని తెలుసుకోగలిగితేనే వారితో మమేకమై చివరి వరకూ పోరాడగలుగుతారు. రైతులందరినీ ఆ పోరాటంలో భాగస్వాములను చేయగలుగుతారు. అందువల్ల కమ్యూనిస్టులు రైతుల జీవన క్రమంలో భాగంగా కావాల్సి ఉంటుంది. మన దేశంలో మార్క్సిజం శిష్యులు నిజానికి గాంధీయిజం శిష్యులుగా తయారయ్యారు. వారిలాగానే పెద్దెత్తున డాంబికాలు పోయే సోకాల్డ్ కమ్యూనిస్టులు రైతుల పట్ల, రైతాంగ ఉద్యమం పట్ల విశ్వాసఘాతుకత్వానికి ఒడిగట్టారు.
గతంలో అనేక రైతాంగ ఉద్యమాలు చివరికి పూర్తిగా విఫలమైపోయాయి - కాంగ్రెస్ నాయకత్వం, అభివృద్ధి నిరోధక దళారీలు వెన్నుపోటు పొడిచి ఆ ఉద్యమాలను అణచివేశారు.
ప్రస్తుతం కమ్యూనిస్టులమని చెప్పుకునేవారు గాంధీ పేరును కూడా పెద్ద బాధ్యతగా భావించి చాలా విధేయంగా, నిస్సిగ్గుగా రైతాంగ పోరాటాలకు వెన్నుపోటు పొడిచారు. వామపక్షానికి చెందిన ఈ యావత్తు పెటీబూర్జువా వర్గం రైతాంగ ఉద్యమాలను గౌరవించదు, రైతులను నూతన యుగపు ప్రాథమిక ప్రేరణా శక్తిగా కూడా గుర్తించదు. ఆచరణలో అడుగడుగునా వారంతా వాగాడంబరపు గుంపుగా తయారయ్యారు. విశాల రైతాంగానికి కూడా వారిపై ఎటువంటి విశ్వాసమూ లేదు. ఈ నాయకులు రైతులను చదువురాని వారనీ, దరిద్రులనీ, ʹఅయ్యా! చిత్తంʹ అంటూ తలలు ఊపే జడ పదార్థంగా అర్థం చేసుకుంటారు. పెట్టుబడిదారులు కూడా తాము ఎవరిని దోపిడీ చేస్తారో వారిని బానిసల మాదిరిగా అర్థం చేసుకుంటారు. వీరికీ సోకాల్డ్ కమ్యూనిస్టులకు ఎటువంటి తేడా లేదు. ఈ ఇద్దరు కుమ్మక్కు కావడంతో కొనసాగుతున్న దోపిడీ పాలన నుంచి విముక్తి పొందే మార్గాన్ని చూపించింది నక్సల్బరీ. కృషి చేసే మార్గాన్ని చూపింది, అంటే విప్లవ కృషికి గల ప్రాధాన్యతను గురించి చెప్పింది. విప్లవ కృషి చేయడం, దానిని సరిగ్గా చేయకపోతే విమర్శించడం అనేది ఆదర్శవంతమైన సైద్ధాంతిక పోరాట ప్రాథమిక-నిర్ణయాత్మక, దిశానిర్దేశం చేసే ఆయుధం. కార్మికులు-రైతుల పట్ల శ్రద్ధ చూపడం, వారిని ప్రేమించడం నిజమైన కమ్యూనిస్టుల పని. అది విప్లవ కృషి, మహత్తరమైన కృషి. ఈ కృషిని నిర్వహించడం ఎలాగో నేర్చుకోవాలి. ఈ కృషిని పురోగమింపజేయడం కోసం నేడు అలుపెరుగని యోధులుగా తయారు కావాలి. శ్రమజీవి ప్రజానీకం చెప్పే విషయాలను వినాలి, వారి అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం కూడా విప్లవ కృషిలో ఒక విడదీయరాని భాగం. అయితే కేవలం వారి మాటలను మామూలుగా వినడమే కాదు, పూర్తి శ్రద్ధతో వినాలి. ఆధ్యాత్మకవాదులు వేదాలు, మతానికి సంబంధించిన పురాణ కథల లాగా వినిడం, దానికి అనుగుణంగా కృషి చేయడం గురించి చెబుతారు. అదే విధంగా కమ్యూనిస్టులమైన మనం కార్మికుల-రైతుల మంచి కోసం సమస్త కృషి చేసే విధంగా ప్రాథమిక సిద్ధాంతాన్ని రూపొందించాలి. ఏ విధంగానూ మనం స్వంత అభిప్రాయాలను రైతులపై రుద్దరాదు. వారి మాటలకూ, అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. కార్మికవర్గ రాజకీయాలకు అనుగుణంగా కార్మిక-కర్షక ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూనే మనం కార్మికులను, రైతులను ఐక్యం చేసే కృషిని మన బాధ్యతగా భుజాలపైన మోపుకోవాలి. రైతుల పట్ల శ్రద్ధ వహించాలి, వారిని ప్రేమించాలి అంటే ఇదేనని అర్థం చేసుకోవాలి, అలాగే కృషి చేయాలి కూడా. ఏ ఉద్యమంలో అయినా అందరినీ భాగస్వాములను చేయాలంటే, అందరినీ సమీకరించి చర్చ-సమీక్ష నిర్వహించేందుకు కూర్చోవాల్సి ఉంటుంది. కేవలం స్వీయాత్మకంగా కాగితాల్లో రాసిన ఉద్యమ నిర్ణయాలు కాదు, ఇందుకు భిన్నంగా భౌతిక స్థితిపై ఆధారపడి వాస్తవిక ఉద్యమానికి సంబంధించిన నిర్ణయాలు చేయడం కోసం అందరి సహకారం అవసరం, అభిప్రాయాలు-భిన్నాభిప్రాయాలు అవసరం, నిర్ణయాలు అవసరం. అలా కాకుండా విడిగా కేవలం నాయకుల మాటలపై ఆధారపడి ఉ ద్యమ కార్యక్రమాన్ని రూపొందించకూడదు. మాటలకూ-చేతలకూ మధ్య మన లోపాలు-బలహీనతలను దిద్దుకోవడానికి ఇదే ఏకైక మార్గం.
నిరుపయోగమైన మాటలు, పుకార్లను వ్యాపింపజేయడం బంద్ చేయాలి. పని, కేవలం పని మాత్రమే అన్ని రకాల రోగాలనూ నిరోధిస్తుందని గుర్తుంచుకోవాలి. రహస్య పని విధానానికి, విషయాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలి. సకల పెటీబూర్జువా ఆచరణను, ఆలోచనలను, భావనలను మొత్తంగా మార్చుకుంటూ మన జీవితాన్ని కూడా నూతన రూపాల్లోకి పరివర్తన చెందించాలి. స్వయంగా నిజమైన కమ్యూనిస్టుగా తయారు కావాలంటే మనం కఠోర పరిశ్రమ చేయాలి, త్యాగనిరతిని కలిగి ఉండాలి, సాదాసీదా జీవనం గడిపే పద్ధతులను అవలంబించాలి. విలాసాలు లేకుండా; వృధా ఖర్చులు లేకుండా; పూర్తిగా సాధారణ కనీస ఖర్చుతోనే జీవనాన్ని గడపాలి.
నక్సల్బరీలోని సహచర కామ్రేడ్స్ ఈ విధంగానే తమను తాము తయారు చేసుకున్నారు. ఈ విధంగా తయారైన విప్లవ కమ్యూనిస్టుల పైనే ఎన్నో ఆశలు పెట్టుకొని - విప్లవ కమ్యూనిస్టు పార్టీని ఎవరు నిర్మాణం చేస్తారు, ప్రజల ప్రజాస్వామిక విప్లవాన్ని ఎవరు విజయవంతం చేస్తారు, సోషలిజాన్ని ఎవరు నిర్మిస్తారు, భారతదేశం నుంచి అమెరికా సామ్రాజ్యవాదాన్ని, దాని దళారులను ఎవరు పూర్తిగా నిర్మూలిస్తారు అని నేటి చరిత్ర ఎదురుచూస్తూ ఉంది.
విప్లవ పార్టీని నిర్మాణం చేద్దాం
నక్సల్బరీ రైతాంగ పోరాటం చివరికి మరో ప్రధాన పాఠాన్ని అందించింది. అది - భారతదేశంలో నేడు సర్వత్రా అభివృద్ధి నిరోధకులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వారి దోపిడీ పీడన వల్ల ఏర్పడిన సంక్షోభం స్వయంగా వారినే తీవ్రమైన కష్టాల్లోకి నెట్టివేస్తుండగా, అదే సమయంలో శ్రమజీవి ప్రజానీకం కోసం కూడా విప్లవ శక్తుల సంక్షోభం స్పష్టంగా ముందుకు వచ్చింది. నాలుగు వైపులా ఎండిన గడ్డి పరుచుకొని ఉంది, ఒక్క నిప్పురవ్వ ఇప్పుడు అవసరం, అది త్వరితగతిన కార్చిచ్చు సృష్టిస్తుందని నక్సల్బరీ చాటిచెప్పింది. ఈ నిప్పురవ్వ మరేదో కాదు, విప్లవ శక్తిని సమన్వయించడం, విప్లవ పార్టీని నిర్మాణం చేసే కృషి (subjective preparation), విప్లవ కార్యకలాపాలను-నిబద్ధతను చాటిచెప్పే కృషి. ఇది త్వరితగతిన భారతదేశంలో వందలాది నక్సల్బరీలను నిర్మిస్తుంది, నక్సల్బరీ నిప్పురవ్వను యావత్తు భారతదేశంలో నిప్పును వ్యాపింపజేస్తుంది. ఆ అగ్గిలో పడి దేశ-విదేశీ దళారీ పెట్టుబడిదారులు, జమీందార్-జోత్ దార్ వర్గం, వారి ప్రభువులైన అమెరికా సామ్రాజ్యవాదులు మాడిమసవుతారు.
(1968 జనవరి 6 దక్షిణ దేశ్ పత్రిక, 2వ సంపుటి, 16వ సంచిక "నక్సల్బరీ వ్యవసాయ విప్లవంʹ నుంచి)
Type in English and Press Space to Convert in Telugu |
నక్సల్బరీయే పీడిత ప్రజల విముక్తి పంథాశ్రీకాకుళం గిరిజన పోరాటం, సిరిసిల్ల - జగిత్యాల పోరాటాలు, గోదారిలోయ ప్రతిఘటనోద్యమం, ఇంద్రవెల్లి ఆదివాసి ఉద్యమం నుండి గోదావరి దాటి విస్తరించిన దండకారణ్య..... |
భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు యాభై ఏళ్లలో సాధించిన విప్లవోద్యమ పురోగతిని, విజయాలను, సమాజంలోని అన్ని జీవన రంగాలపై నక్సల్బరీ వేసిన ప్రభావాలనేగాక అంతిమ విజయం దిశగా సాగవలసిన నక్సల్బరీకి ఎద... |
Naxalbari Politics: A Feminist Narrativehose were terrible days. Like most others in the movement, I had no shelter and was staying anywhere and everywhere. I was toying with the idea of quitting ... |
All India Seminar on The Impact of Naxalbari on Indian SocietyRevolution is really a splendid concept. Itʹs a great confidence. Itʹs a great dream that will not die in the eyes even when the head is severed. Thatʹs why... |
భారతదేశంపై వసంత మేఘ గర్జనడార్జిలింగులో ప్రారంభమయిన గ్రామీణ సాయుధ పోరాటం భారత అభివృద్ధి నిరోధకులకు భయోత్పాతాన్ని కలిగించింది. తమకు కలగబోయే విపత్తును వాళ్ళు పసిగట్టారు. డార్జిలింగు...... |
The Impact of Naxalbari on Indian Society, Its Achievements and ChallengesNaxalbari made an indelible impact not only on the revolutionary movement in the
country but also has a tremendous influence on the social relations, emanci... |
చారిత్రాత్మక మే 25, 1967ఇది నక్సల్బరీకి యాభైవ వసంతం. భారత - నేపాల్సరిహద్దుకు సమాంతరంగా ప్రవహిస్తున్న మేచీ నదీప్రాతంలో ప్రారంభమైన అనన్య సామాన్యమైన ఆ పోరాటానికీ, దాని నిర్మాతలకూ....... |
భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావం (అఖిల భారత సదస్సు)9, 10 సెప్టెంబర్ 2017 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ʹభారత సమాజంపై నక్సల్బరీ ప్రభావం : విజయాలు - సవాళ్లుʹ విరసం అఖిల భారత సదస్సు ... |
Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |