నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?

- పాణి | 25.05.2020 10:17:31am


(యాభై వసంతాల సందర్భంగా రాసిన ʹనక్సల్బరీ : మన కాలం- మన అన్వేషణʹ పుస్తకంలోని ఒక భాగం)

నక్సల్బరీని విశాలమై, విస్తృతమైన, వైవిధ్యభరితమైన, సంక్లిష్టమైన ఆవరణలో మాత్రమే అర్థం చేసుకోగలం. బహుశా ఇలాంటి అంశాలు ఇంకా ఎన్నో ఉండే అవకాశం ఉంది. పరిశీలకులు వీటన్నిటిని కలిపి చూడటంలోనే ఒక సంవిధానం రూపొందుతుంది. దీనితోపాటు నక్సల్బరీకి స్వతహాగా ఉన్న మౌలిక ప్రాతిపదికలు తప్పక గుర్తించాలి. వ్యవస్థల సమూల మార్పు, దీర్ఘకాలికం, సంస్కృతి-విలువల స్థాపన అనే చట్రం నక్సల్బరీకి ఉన్నది. ఈ మూడూ దాని లక్ష్యం, లక్షణాలు. బైటి నుంచి విప్లవోద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఎలాంటి పద్ధతి పాటించాలి? అనేది ఒక అంశమైతే... అది వీలైనంత సమగ్రం కావడానికి నక్సల్బరీ ఎంచుకున్న మౌలిక చట్రంలోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి ఉద్యమానికి ఏదో ఒక స్థాయిలో ఇలాంటి లక్ష్యాలు, లక్షణాలు ఉంటాయి.

ప్రజాస్వామికంగా ఉండాలని, ఉన్నామని అనుకునే కొందరు ఉద్యమ ఫలితాలను కీర్తిస్తూనే వాటి లక్ష్యాలు, లక్షణాల మీద సందేహాలు ప్రకటిస్తూ ఉంటారు. ఆ లక్ష్యాలు, లక్షణాల్లో భాగంగా కాకుండా మరోలా ఈ ఫలితాలు వస్తే బాగుండు కదా? అనుకుంటారు. నిజానికి ఉద్యమ లక్ష్యాలకు, ఫలితాలకు మధ్య కూడా ఒక వైరుధ్యం ఉంటుంది. ఫలానా నిర్దిష్ట ఫలితాలని అనుకోనివి కూడా ఉద్యమ క్రమంలో వస్తుంటాయి. అవి ఆ ఉద్యమ గతిని వేగవంతం చేస్తాయి. ఒక్కోసారి ఉద్యమ గతికి సవాల్‌గా మారే ఫలితాలు కూడా ఆ ఉద్యమం నుంచే పుట్టుకరావచ్చు. తక్షణ స్వభావం ఉన్న పోరాటాలకు, ఈ వ్యవస్థ పరిధిలో జరిగే పోరాటాలకు ఈ సమస్య అంతగా ఉండకపోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యం ఉన్న పోరాటాల్లో ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం వ్యవస్థ.

దాని సంక్లిష్టత. అందువల్ల ఒక లక్ష్యం, దానికి తగిన కార్యక్రమం నిర్దేశించుకొని పని చేసే ఉద్యమాలు ఇలాంటి అనుభవాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. ఇవి దృష్టిలో ఉండగానే సరిపోదు. దీర్ఘకాలిక లక్ష్యం కాబట్టి ఈ అనుభవాలను సిద్ధాంతీకరించాలి. అంటే సాధారణీకరించాలి. దాని వెలుగులో మళ్లీ ఆచరణలో నిర్దిష్టంగా పని చేయాలి. నక్సల్బరీ ఉద్యమంలో ఈ లక్షణం ఉంది. అందువల్లే యావత్ భారత సమాజం దశాబ్దాల తరబడి దాని ప్రభావంలో కొనసాగుతున్నది.

వ్యవస్థల సమూల మార్పు:

విప్లవోద్యమం వల్లే చాలా పాత వ్యవస్థలు అతలాకుతలమైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మన కళ్లెదుటే అవి కుప్పకూలిపోయాయి. కొత్త వ్యవస్థల నిర్మాణ ప్రయత్నం సాగుతున్నది. ఈ కల్లోలంలో వర్గ ప్రయోజనాలు బాహాటంగా తలపడ్డాయి. ఆధునిక భారత దేశ చరిత్రలో తమ ప్రయోజనాల కోసం వర్గాలు ఇట్లా నేలమీద ఎదురుచదురుగా నిలబడి కత్తులు దూసిన సందర్భం లేదు. ఇదంతా భౌతికంగానే కాదు. తీవ్ర భావజాల, ఆలోచనా సంఘర్షణకు దారి తీసింది. అంటే.. వ్యవస్థల్లోని అనేక తలాలలో, మానవ జీవితంలోని బహు పార్శ్వాల్లో నక్సల్బరీ వెల్లువలు దశాబ్దాల తరబడి సాగుతున్నాయి.

సరిగ్గా నక్సల్బరీ క్రియాశీలతను పాత కాలపు ఆర్థిక సంబంధాలు, సాంఘిక బంధనాలు, కట్టుబాట్లు, సంస్కృతి, ఆలోచనారీతులపై సాగిన దండయాత్రలో గుర్తించాలి. నక్సల్బరీ ప్రవేశించిన అన్ని ప్రాంతాల్లో కాకపోయినా.. చాలా ప్రాంతాల్లో నిజంగానే పాత వ్యవస్థ మీద దాడి జరిగింది. కొన్ని చోట్ల అయితే ఆ పాత వ్యవస్థలకు ఆత్మరక్షణకు కూడా అవకాశం ఇవ్వకుండా ధ్వంసం చేసింది. నక్సల్బరీ ప్రవేశంతోనే కొన్ని ప్రాంతాల్లో గతాన్ని అంటిపెట్టుకొని ఉన్న శక్తులు భీతావహం అయ్యాయంటే అతిశయోక్తి కాదు. గతంపై ఇంతగా సంఘర్షించిన ఉద్యమం మరొకటి లేదు. గత కాలానికి చెందిన దేన్నీ నక్సల్బరీ వదిలి పెట్టలేదు.

పాత మీద నక్సల్బరీ ఆగ్రహానికి చాలా విశాలమైన అర్థం ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవడంలోనే చాలా మంది పొరబడుతుంటారు. అస్తవ్యస్థమైన వాదనలు చేస్తుంటారు. పాత మీద నక్సల్బరీ ఆగ్రహంలో కొంచెం అతివాద ధోరణి అప్పట్లో ఉన్నమాట వాస్తవమే. అయితే అందులోని సునిశితత్వాన్ని తప్పక గుర్తించాలి. దీనికి ఒక ఉదాహరణ చాలు. పాతకాలపు సంప్రదాయ సాహిత్యాన్ని, గ్రాంధికాన్ని, అలంకార శాస్త్రాలను ధ్వంసించినంత పని చేసి, అంతకంటే వెనుకటి జానపదాలను, మాండలికాలను, దేశీయ సంప్రదాయాలను ముందుకు తీసుకొని వచ్చింది. ప్రచండమైన రాజకీయ శక్తిగా ప్రవేశించిన నక్సల్బరీ సాహిత్య కళా రంగాల్లో సహితం ఇంతగా పాత సంప్రదాయాల మీద దాడి చేయడం ఎప్పటికీ ఆశ్చర్యకరమే. దానికి ఇంత విస్తారమైన సామాజిక దృష్టి ఉన్నది. దాని చూపు ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు. అనేక రంగాలకు అన్వయం కాగల పరిభాషను ముందుకు తీసుకొని వచ్చింది. అలాంటి మౌలిక ప్రాతిపదికలను అందించింది. మార్పు గురించి నిజంగానే ఎవరైనా మాట్లాడదల్చుకుంటే నక్సల్బరీ అందించిన పరికరాలను, ప్రాతిపదికలను కాదనడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మార్పు దిశగా అన్ని రంగాల్లో పాత మీద విప్లవాత్మక వైఖరి తీసుకొచ్చింది. మారుమూల గ్రామాల నుంచి ఆధునిక శాస్త్ర రంగాల దాకా, విశ్వవిద్యాలయాల దాకా పాత ఆలోచనల మీద తిరుగుబాటు సాగింది. కొత్త ఆలోచనలు తుఫానులా వీచాయి. వాటి తాకిడికి గురి కాని రంగాలే లేవు. అందువల్లే అనేక వైపుల నుంచి, అనేక పొరల నుంచి సమాజాన్ని నక్సల్బరీ కల్లోలపరిచింది. అన్ని వ్యవస్థలను, వాటిలోని అన్ని రకాల శక్తులను, విధానాలను పట్టి కుదిపింది. ఎవరు ఎలా అర్థం చేసుకున్నా ఈ యాభై ఏళ్లలో నక్సల్బరీ అప్రతిహతమైన రాజకీయ శక్తి.

పాత వ్యవస్థ మీద తిరుగులేని పోరాటం చేసి దాన్ని నేల మట్టం చేసిన నక్సల్బరీకి ప్రగతి అనే భావన కేంద్ర స్థానంలో ఉ ంటుంది. ఆధునిక భారత దేశ చరిత్రలో మిగతా ప్రజా సంచలనాలకు నక్సల్బరీకి తేడా ప్రగతి భావనను అర్థం చేసుకోవడంలోనే ఉన్నది.

దాన్ని ఆచరించడంలోనే ఉన్నది. బహుశా ఇది సన్నిహితులే కాదు, శతృవులు సహితం గుర్తించే విషయం. అన్ని రంగాల్లో ప్రగతి వ్యతిరేక, యధాతథ వాద శక్తులు ఇప్పటికీ నక్సల్బరీ అంటే భయపడిపోయేది ఇందుకే. ప్రగతి అనే గీటురాయి మీద సమాజ పరివర్తన గురించి ఆ రోజుల్లో భగత్సింగ్ మాత్రమే కొంత గుర్తించాడు. బ్రిటీష్ వారు వెళ్లిపోవాలి అని మాత్రమే కాక మన సామాజిక వ్యవస్థలో కీలక మార్పులు రావాలని ఆయన కోరుకున్నాడు. అలా కొన్ని విషయాల్లో ఆయనకు తిరుగులేని స్పష్టత ఉండింది. ఆ కాలంలో చాలా మంది కంటే ఆయనలో బలంగా ప్రగతి భావన ఉండేది. పార్లమెంటరీ విధానం ఈ వ్యవస్థలో మౌలిక ప్రగతికి దోహదపడకపోగా ఏ రూపంలో సాగే ప్రగతినైనా అది అడ్డుకుంటున్నది. వ్యవస్థలో భాగంగా సాగే మార్పులను మాత్రం విస్తరించుకుంటూ పోతున్నది. కొందరు ఈ మార్పులను సహితం ప్రగతిగా గుర్తిస్తారు. ఆ రోజుల్లోనే భగత్సింగ్ లో పార్లమెంటరీ ఛాయలు లేకపోవడం ఆయన ఆశించిన ప్రగతికి గీటురాయి.

ఆరోజుల్లో సాంఘిక విముక్తి గురించి ఆలోచించిన వాళ్లలో సమానత్వం, ప్రగతి అనే భావనలు ఉండేవి. అసలు సాంఘిక విముక్తి అనేదే ప్రగతిదాయకం. అయితే వాళ్లలో పార్లమెంటరీ భావనలు అంతకంటే ఎక్కువగా ఉండేవి. ఆ రకంగా చూస్తే భారత సమాజాన్ని సమగ్రంగా పరిగణలోకి తీసుకొని దాని ప్రగతిదాయక పునర్నిర్మాణం ఎలా ఉండాలనే విషయంలో భగత్సింగ్ తర్వాత గుణాత్మకంగా ఆలోచించింది నక్సల్బరీ మాత్రమే.

ఒక స్పష్టమైన సిద్ధాంతం, నిర్మాణం, పోరాట రూపాలు, రాజకీయ పంథా, విప్లవానికి కావాలసిన వ్యూహం, ఎత్తుగడలు తొలిసారిగా నక్సల్బరీ ముందుకు తెచ్చింది. విస్తృత పోరాట రూపాలు, ప్రజల భాగస్వామ్యం, ఐక్య సంఘటనలాంటి విషయాల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిస్సందేహంగా ఒక గొప్ప ఉదాహరణ. అయితే అవేవీ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం చైతన్యవంతమైన నిర్ణయాలు కావు. విప్లవం చేయాలనే ఆ పార్టీ అనుకోలేదు. భౌతిక పరిస్థితులు అనుకూలించి ప్రజా సంచలనాలు వెల్లువెత్తడంతో పైన చెప్పినవన్నీ ఆ ఉద్యమంలో వ్యక్తమయ్యాయి. ప్రజలు పోరాటానికి సిద్ధమై నాయకత్వం నెత్తిన ఆ బాధ్యత పెట్టారు. తెలంగాణతోసహా ఇతర తెలుగు ప్రాంతాల్లో సహితం పార్టీ కింది శ్రేణులన్నీ దాన్ని అందుకున్నాయి. ప్రజలు, కింది స్థాయి నాయకులు రాజ్యాధికారం దిశగా తమ ఆచరణ సాగించారు. స్థానిక నాయకత్వం దీనికి గ్రామ విప్లవ కమిటీల రూపాన్ని ఇచ్చింది. అందుకే బీజరూపంలో ఎర్రరాజ్యం గురించిన ఆలోచనలు ఉండేవి. ఇవన్నీ సాధించడానికి ప్రజలు, కార్యకర్తలు, స్థానిక నాయకులు అనన్య త్యాగాలు చేశారు. పార్టీ అగ్రనాయకత్వానికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. ఉన్నవి కూడా 1946 నుంచే నీరుగారిపోవడం మొదలైంది. అందుకే వీలు చూసుకొని, సాకు చూసుకొని ఉద్యమాన్ని దించేసింది. -

ఈ రెండు ప్రస్తావనలు ఎందుకంటే వలస వ్యతిరేక పోరాట దశ నుంచి ఇవ్వాల్టి దాకా నడిచిన, నడుస్తున్న అన్ని ప్రజాస్వామిక పోరాటాలకు - నక్సల్బరీకి ఒక తేడా ఉన్నదని చెప్పడానికే. ఆ తేడా చాలా మౌలికమైనది కూడా. సంక్షోభ భరితమైన ఈ వ్యవస్థలో దోపిడీ పీడనలు అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యక్తరూపాల మీద ప్రజలు అనేక పోరాటాలు చేస్తున్నారు. వాటిని నిర్మూలించి న్యాయం పొందడానికి ఉద్యమిస్తున్నారు. అయితే నక్సల్బరీ ఈ దోపిడీ వ్యవస్థను మౌలికంగానే రద్దు చేసి దాని స్థానంలో విప్లవకరమైన కొత్త వ్యవస్థను నిర్మించాలని బయల్దేరింది. అంటే భారత సామాజిక రాజకీయార్థిక వ్యవస్థ సారాన్ని గుర్తించి, దానిపై తలపడటం అనే పరిణతి నక్సల్బరీకి ఉన్నది. దీన్ని ప్రగతి అనే గీటురాయి మీద పరీక్షించాలి. ప్రగతిని గత కాలపు బంధనాల విధ్వంసం వైపు నుంచే గాక భవిష్యత్ వ్యవస్థ నిర్మాణం దిశగా దాని ప్రయాణం ఎలా సాగుతున్నది? అనే కొలమానంతో అర్థం చేసుకోవాలి.

ఈ యాభై ఏళ్లలో మూడు తరాలుగా లక్షలాది మంది నక్సల్బరీ ఉద్యమంలో భాగమవుతున్నారు. వేలాది మంది ప్రాణత్యాగం చేస్తున్నారు. అనేక కొత్త ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నది. అంటే నక్సల్బరీ ఆగిపోకుండా ఏదో ఒక చోట అప్పుడప్పుడూ సాగుతూ ఉన్న తిరుగుబాటు కాదు. ఆధునిక భారత దేశ చరిత్రలో బలమైన సిద్ధాంత పునాది ఉన్న పోరాటం. ఉద్యమం ఏం చేయాలో, ఎందుకు చేయాలో, చేసిన వాటిలో తప్పులేవో, లక్ష్యాలకు తగినట్లు ఇంకా ఏమి చేయాలో... ఇలా ప్రతి చిన్న అంశానికి ఒక సిద్ధాంత క్షేత్రం ఉన్న ఉద్యమం అది. ఆ సిద్ధాంత అవగాహనలో, ఆచరణలో లోటుపాట్లు ఎన్నయినా ఎత్తి చూడవచ్చు. ఆ పని చేయడానికి కూడా తగిన సిద్ధాంత ఆవరణ ఉన్న ఉద్యమం అది. అదీ దాని బలం. ఇంత సిద్ధాంత వైశాల్యం సంతరించుకున్న ఉద్యమం భారతదేశంలో మరొకటి లేనేలేదు.

నక్సల్బరీ కొన్ని ప్రాంతాల్లో వెనకడుగు వేసినా, పూర్తిగా దెబ్బతినిపోయినా తిరిగి రాజుకోడానికి ప్రజలు పేదరికంలో, వెనుకబాటుతనంలో ఉండటం మాత్రమే కారణం కాదు. లేదా పాతకాలపు బంధనాల్లో మగ్గుతున్నందు వల్లే కాదు. ప్రజలకు కష్టాలు ఉ న్నంత వరకు ఎక్కడో ఒక చోట ఇలాంటి పోరాటాలు జరుగుతూ ఉంటాయని అనే వాళ్లుంటారు. ఈ మాటల్లో అక్షరం కూడా నిజం లేదని అనలేం. అనేక కారణాల వల్ల ఇవాళ ప్రధానంగా అలాంటి ప్రాంతాల్లోనే ఉద్యమం కేంద్రీకరించి ఉన్నది. ఈ పరిశీలనలతోపాటు ఉద్యమానికి ఉన్న సైద్ధాంతిక బలాన్ని గుర్తించాలి. అది ఉన్నందు వల్లే ఆచరణలో ఓటములు ఎన్ని ఎదురైనా ప్రాసంగికత కోల్పోలేదు. ఎన్ని సార్లు దెబ్బతిన్నా పూర్తిగా ఆరిపోలేదు. మళ్లీ మళ్లీ తిరిగి రాజుకోవడం వెనుక దాని దార్శనికత ఉన్నది. అందుకే దాని రాజకీయ ప్రాధాన్యత తగ్గలేదు.

దాని ముందున్న సవాళ్లను, అది ఎదుర్కొంటున్న ఓటములను లేదా వెనక్కిపోవడాలను కూడా సిద్ధాంతపరంగానే చర్చించాల్సినంత పటిష్టమైన పోరాటమది.

అట్లని మిగతా ఉద్యమాల్లో ఏ సిద్ధాంత పునాది ఉండదని ఎవ్వరూ అనబోరు. ఉదాహరణకు సెల్ టవర్ల రేడియేషన్కు జనావాసాలు, పర్యావరణం అతలాకుతలమైపోతుంటాయి. సెల్ టవర్లకు, వాటి కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు. అందులో ఒక బలమైన వాదన ఉంటుంది. అది నైసర్గిక, పర్యావరణ వాదనగా కూడా విస్తరించవచ్చు. ఇదిగాక సమస్య ఇంకాస్త పెద్దది అయితే ఏదో ఒక స్థాయిలో సామాజిక, రాజకీయార్థిక కోణంలో వాదన ఉంటుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు రాజకీయార్థిక వ్యవస్థతో ఉన్న సంబంధం గాఢపడే కొద్దీ ఆ వాదనకు సిద్ధాంత స్థాయి వస్తుంది. ఆ సమస్యకు వ్యవస్థలో వేళ్లు ఎంతగా విస్తరించి ఉంటే అంతగా భిన్న తలాల్లోంచి దాన్ని వివరించాల్సి వస్తుంది. అప్పుడు అదొక పరిశీలనా చట్రాన్ని డిమాండ్ చేస్తుంది. ఆ ఉద్యమంలో ఉంటూ సమస్య లోతుపాతులు తెలిసినవాళ్లు ఆ సమస్యను తక్షణ విషయంగా, వ్యక్తుల దుర్మార్గంగా చూడరు. వ్యవస్థ పని తీరులో కారణాలు వెతుకుతారు. దానికి తప్పక కొంత గతం ఉంటుంది. భవిష్యత్తు లక్ష్యం ఉంటుంది. కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకొని ఒక పరిశీలనా చట్రాన్ని రూపొందిస్తారు. అక్కడి నుంచి మాట్లాడే మాటలు సిద్ధాంత లక్షణం సంతరించుకుంటాయి. అలా ఏ డిమాండ్ కు అయినా వ్యవస్థలో ఎంతగా వేళ్లు ఉంటే అంతగా దాని విశ్లేషణ సిద్ధాంత లక్షణం సంతరించుకుంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాలికత ఎంత ఉంటే అంతగా సిద్ధాంత స్వభావం ఉంటుంది.

నక్సల్బరీ అవగాహనను, ఆచరణను దాని సిద్ధాంత ఆవరణలోంచే చర్చించాలి. అవాకులు చవాకులు, అనుభవవాదాలు, ఏదో ఒక కోణం దొరకబుచ్చుకొని తోచిన వ్యాఖ్యలు చేయడం జర్నలిస్టిక్ గా చదువుకోడానికి బాగానే ఉంటాయి. నక్సల్బరీ సిద్ధాంత అవగాహన నచ్చని వారు చేసేది కూడా ఒక సిద్ధాంత చర్చే కావాలిగాని దినపత్రికల కథనాలు కాకూడదు.

ఉదాహరణకు నక్సల్బరీ భూమి సమస్య దగ్గర మొదలైంది. కోట్లాది మంది ప్రజలకు భూమి లేదు. అది ఈ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్త రూపం మాత్రమే కాదు. వ్యవస్థ లక్షణాల్లో అత్యంత కీలకం. అసమానత, దోపిడీ, పీడన, అంటరానితనం అనేవి వ్యవస్థ వ్యక్తీకరణలే కాదు, వ్యవస్థ లక్షణాలు. మూలం అవే అని నక్సల్బరీ గ్రహించింది. అంటే నేరుగా వ్యవస్థ గర్భాన్ని ఛేదించే పోరాటాన్ని ఎన్నుకున్నది. ఈ సమస్యలకు సుదీర్ఘ గతం ఉన్నది. అది రాజకీయార్థిక సాంఘిక సంస్కృతిక రంగాలకు సంబంధించింది. అంత మాత్రమే కాదు. భూమి లేని వాళ్లకు భూమి ఇవ్వడమే తమ ఎజెండా అనుకొని ఉంటే అనేక ప్రజాస్వామిక పోరాటాల్లో నక్సల్బరీ కూడా ఒకటి అయ్యేది. దున్నేవారికి భూమి పంచడం అనే కీలకమైన రాజకీయార్థిక కార్యక్రమం చేపట్టే క్రమంలో ఈ వ్యవస్థను కూలదోయాలని, కార్మిక కర్షక రాజ్యం కొనసాగే ఒక కొత్త వ్యవస్థను నిర్మించాలని, దాన్ని సోషలిస్టు వ్యవస్థగా పరివర్తన చెందించాలనే లక్ష్యం ప్రకటించుకున్నది. అంటే దీర్ఘకాల చారిత్రక అవధికి సంబంధించిన రాజకీయార్థిక కార్యక్రమాన్ని ఎంచుకున్నది.

దీర్ఘకాలికం:

కమ్యూనిస్టులు తలపడుతున్న వ్యవస్థ అత్యంత బలీయమైనది. వాళ్ల లక్ష్యం వ్యవస్థను పరిరక్షించే పాలక వర్గాలను ఎదుర్కోవడం ఒక్కటే కాదు. వ్యవస్థలో ఆధిక్యతలో ఉన్న ఉత్పత్తి సంబంధాలను, అంతక ముందట నుంచి కొనసాగుతున్న ఉత్పత్తి సంబంధాలను, వందల వేల ఏళ్ల కిందటి సాంఘిక మూలాలను పెకలించడం. శాస్త్రీయ వ్యూహం లేకుండా ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. సంఖ్యా బలం తక్కువ ఉన్నా సిద్ధాంతబలం ఉన్నందు వల్లే ఇలాంటి దీర్ఘకాలిక వ్యూహం కమ్యూనిస్టులు అనుసరిస్తారు. కాబట్టి ఆ వ్యూహంలో భాగంగా - ఏ చిన్న పని అయినా, భావన అయినా సిద్ధాంత భూమిక నుంచి చర్చనీయాంశం అవుతాయి.

ఈ దీర్ఘకాల స్వభావం రాజకీయ, సైనిక కార్యక్రమమే కాదు. ఏ దేశంలో అయినా సామాజిక పరివర్తనను దీర్ఘకాలికంగానే సాధించాల్సి ఉంటుందనే సిద్ధాంత అవగాహనగా గుర్తించడం మంచిది. అసలు ఇప్పుడు ఉనికిలో ఉన్న వ్యవస్థలు ఏ అర్ధరాత్రో ఆకాశంలోంచి ఊడిపడినవి కావు. సామాజిక చరిత్రలో ఏ వ్యవస్థ కూడా అలా ఏర్పడలేదు. ప్రతి వ్యవస్థకూ సదీర్ఘమైన చరిత్ర ఉంటుంది. వాటితో వ్యవహరించడం, మార్చడం కూడా దీర్ఘకాలికమే. అలాగే కొత్త వ్యవస్థ నిర్మాణం కావడం కూడా అలాగే ఉంటుంది. అందువల్లే నక్సల్బరీ పోరాట పంథాకేగాక, దాని లక్ష్యానికి కూడా దీర్ఘకాలిక స్వభావం ఉన్నది. ఇది సిద్ధాంత సంబంధమైనది.. అంటే భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించేదని అర్థం. వర్తమాన పోరాటాల్లో జయాపజయాల మాట ఎలా ఉన్నా కమ్యూనిస్టులు భవిష్యత్ సమాజానికి ప్రతినిధులు. మానవజాతి చరిత్రను సుదీరగతం నుంచి సుదూర భవిష్యతు దాకా శాస్త్రీయంగా ఊహించగలుగుతారు. అది కేవలం ఊహగా మిగిలిపోకుండా నిజం చేయగల సిద్ధాంతం, ఆచరణ వాళ్ల దగ్గర ఉంటుంది. రోజువారీ ప్రజా కార్యక్రమాల్లో భాగంగా వీధి కొళాయిల్లో నీళ్ల కోసం చేసే తక్షణ పోరాటాన్ని కూడా భవిష్యత్ అనే దృష్టితో చూస్తారు. ఇలాంటి విషయాల్లో సహితం సమాజ పరివర్తనకు సంబంధించిన వ్యూహం విప్లకారులను నడిపిస్తూ ఉంటుంది.

ఈ విషయంలో భారతదేశ చరిత్రలోనే నక్సల్బరీ వేసిన ప్రభావం అసాధారణమైనది. ఒక స్వప్నాన్ని నిజం చేసే కార్యక్రమంలో ఒడిదుడుకులు ఎన్నయినా ఉండవచ్చుగాని బలమైన భవిష్యత్ ప్రాతినిధ్య శక్తిగా నక్సల్బరీ అప్పటికీ ఇప్పటికీ తిరుగులేనిదే. అనేక ఉ త్థాన పతనాల్లో సహితం అ శక్తి సన్నగిల్లలేదు. నక్సల్బరీ పంథాలోని విశిష్టతల్లో ఇది చాలా ముఖ్యమైనది. నక్సల్బరీ వర్తమానంలో ఏం సాధిస్తున్నది అనే దానితోపాటు అది భవిష్యతకు ప్రాతినిధ్యం వహించే శక్తిగా పురోగమిస్తున్నదా? అదొక ఆకాంక్షగానే కాక చారిత్రక శక్తుల వికాస క్రమంగా గుర్తించి, భవిష్యత్ గురించిన ఒక నమూనా ఆధారంగా మాట్లాడుతున్నదా లేదా ? అనే గీటురాయి కూడా దాన్ని అర్థం చేసుకోడానికి ప్రమాణం కావాలి..

నిజంగానే ఈ యాభై ఏళ్లలో విప్లవోద్యమం ఒక్కోసారి చాలా నిరాశాజనకంగా ఉండింది. నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలో స్పష్టత లేకుంటే అలాంటి దశలో ఉద్యమాన్ని గట్టెక్కించడం కష్టం. వ్యక్తులుగా కొందరికి అలాంటి వర్తమానంలోనే గుండె జారిపోయేది, నిరాశ కమ్ముకునేది. ఉద్యమం ఉజ్వలంగా ఉన్నంత కాలం క్రియాశీలంగా ఉండి అది ఆటులోకి పడిపోగానే పలాయనం చిత్తగించడం వ్యక్తిగత దౌర్బల్యం ఒక్కటే కాదు. నక్సల్బరీ తన దీర్ఘకాలిక స్వభావంలో భాగంగా నిరంతరం భవిష్యత్తు దిశగా సాగుతున్న రాజకీయశక్తి అనే చిన్న ఎరుక లోపించడం ప్రధాన కారణం.

ఇలాంటి వాళ్లలో చాలా మంది అలా ట్రాక్ తప్పాక ఇక దానికి సమర్థనగా అనేక వాదనలు తెస్తుంటారు. కొందరైతే ఉ ద్యమాలన్నీ ఫేడౌట్ అయిపోయాయని వగచే ఒక తరహా కవిత్వ ఒరవడిని భుజానేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకొందరు ఇప్పటికీ ఉద్యమాన్ని ఒక అద్భుతమైన నాస్టాల్జియాగా ప్రకటించుకుంటూ ఉంటారు. నిజానికి నాస్టాల్జియాకు ఏ సమర్థనా అక్కర్లేదు. మనుషుల్ని అలరించే శక్తి దానికి సహజంగానే ఉంటుంది. కానీ ఈ తరహా పురాస్మృతివాదులు ఏమంటారంటే ఏ ఉద్యమంలో అయినా.. అందునా నక్సల్బరీలో అయితే.. ప్రారంభంలో గొప్ప బ్యూటీ ఉండేదని దాన్ని తలచుకొని పరవశించిపోతుంటారు.

నక్సల్బరీ ఉద్యమం వర్తమానంలో ఎన్ని ఆటుపోట్లకైనా గురవుతూ ఉండవచ్చు.. కాని అది భవిష్యత్తుకు ప్రతినిధి అనే వాస్తవాన్ని గుర్తించిన ప్రజల మధ్య అది కొనసాగుతున్నది. ఇప్పటికే లోపలా బైటా ఎన్నో సంక్షోభాలను అధిగమించి ప్రజలు ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతున్నారు. ఒక సుందరమైన భవిష్యత్తు కోసమే ఇవాళ వేలాది మంది తమ వ్యక్తిగత జీవితాన్ని తృణప్రాయంగా అర్పిస్తున్నారు. తమ సొంత భవిష్యత్తును వదులుకుంటున్నారు. నక్సల్బరీని అర్థం చేసుకోడానికి ఒక శాస్త్రీయ సంవిధానం ఉంటే ఈ సంసిద్ధత వెనుక ఉన్న భవిష్యదాశ ఏమిటో తెలుస్తుంది. అది ఎలా ఒక వాస్తవ చిత్రంగా ఎలా ప్రేరేపిస్తున్నదో అర్థమవుతుంది. ఆ రకంగా అది తక్షణ వాస్తవంగా బీజరూపంలో అయినా సరే ఉన్నదని అంగీకరించడం వీలవుతుంది. ఇదంతా భవిష్యత్తు పట్ల ఆశ కేవలం ఆశగానేగాక తాను ఎంచుకున్న నిర్దిష్ట కార్యక్రమం ద్వారా రాబోయే సమాజ నిర్మాణం సాధ్యమే అనే హేతుబద్ధత వల్ల కలుగుతుంది. కమ్యూనిస్టుల భవిష్యదాశ చారిత్రక భౌతికవాదంలోని శాస్త్రీయతకు సంబంధించింది. ఈ కోణం విస్మరించిన వాళ్లకే నక్సల్బరీలో అనేక పెడ ధోరణులు, అనవసర ప్రాణ నష్టాలు కనిపిస్తుంటాయి. నిజానికి ఇదే ఒక పెడ ధోరణి. అనుత్పాదక మేధో శ్రమ నుంచే ఇలాంటి శుష్క వాదనలు పుట్టుకొస్తుంటాయి. నిన్నటి దాకా చారిత్రక వికాసం ఎలా జరిగిందో తెలియని వారు చేసే వాదన ఇది.

తక్షణ - దీర్ఘకాలిక భావనలను విడివిడిగా అర్థం చేసుకోవడం తేలికే. సమతూకంలో చూడటం కూడా తేలికే.
కానీ కమ్యూనిస్టుల పని అది కాదు. దీర్ఘకాలికమనేది ఎల్లవేళలా ఇంజన్‌గా నడిపిస్తూ ఉండాలి. ఆ ఇంజన్ తాను ఎంచుకున్న దిశలో, వేగంలో, చలనంలో ఉంటుంది. అలాంటి చలన స్థితిలోనే తక్షణ భావనతో సమన్వయం సాధించాలి. దీర్ఘకాలికమనే ఇంజన్ దిక్కు తెన్ను లేనప్పుడు, మందకొడి చలనంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులకు రోజువారి పని అలసటే మిగులుతుంది. తక్షణ పనులన్నీ నిద్రాహారాలు మాని చేసినా దీర్ఘకాలికమనే ఇంజన్ వేగం పుంజుకోదు. ఒకవేళ అది పట్టాలు తప్పి ఉంటే కనీసం ఎక్కించడం కూడా రోజువారీ పని సాయం చేయదు. నక్సల్బరీ ఏ క్షణం కూడా తన దీర్ఘకాలిక లక్ష్యం విషయంలో అజాగ్రత్తగా లేదు. నిజానికి తొలి రోజుల్లో దీర్ఘకాలిక లక్ష్యాల ముందు తక్షణ సమస్యలపట్ల అశ్రద్ధ ఉండేది. ఇది కొద్ది కాలమే. ఆ తర్వాత తక్షణ, దీర్ఘకాలిక ప్రజా అవసరాలు గుర్తించింది. ఉ ద్యమానికి ఉండలవలసిన తక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకునే సుగుణాన్ని పెంచుకున్నది. అసలు వర్తమానం ఎల్లప్పుడూ తక్షణ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఉంటుంది. దాన్ని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం సాధ్యం కాదు. నక్సల్బరీ ప్రజల మధ్య నిత్య ఆచరణలో ఉన్న ఉద్యమం కాబట్టి తొలినాళ్ల పెడ ధోరణిని తొందరలోనే వదిలించుకున్నది.

విప్లవోద్యమానికి ఒక ఎజెండా స్పష్టంగా ఉన్నట్లే పాలకవర్గాలకూ ఈ వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాలో ఒక నిర్దిష్ట ఎజెండా ఉంటుంది. ఆ దిశగా అది క్రియాశీలంగా పని చేస్తున్నప్పుడు వ్యవస్థలో ఎదురయ్యే సంక్షోభాలపై పోరాటాలే కమ్యూనిస్టుల నిత్య ఎజెండా అవుతుంది. పాత విప్లవోద్యమాలు చాలా మందకొడిగా, సరళంగా ఉన్న వ్యవస్థల్లో జరిగాయి. పాలకవర్గాలు, రాజ్యం ఆ వ్యవస్థలను అలాగే పట్టి ఉంచాలని బలంగా ప్రయత్నించాయి. అవి సాపేక్షంగా తక్కువ గతిశీలత ఉన్న వ్యవస్థలు. కాబట్టి పాలకవర్గాలకు ఆ వ్యవస్థలను కొత్తగా ఎలా తీర్చిదిద్దాలనే లక్ష్యానికంటే కూడా ఉన్నదాన్ని అలాగే నిలబెట్టాలనే ఉద్దేశమే ప్రధానంగా ఉండేది. దానికోసం తీవ్రమైన హింస ప్రయోగించాయి. ఆ హింసను ప్రతిఘటించి ముందుకు పోయినందు వల్ల ఆ ఉద్యమాలు గొప్ప ముందంజలతో విస్తరించినట్లు మనకు కనిపిస్తుంది.

కానీ మన వ్యవస్థ ఒక క్రమంలో చాలా గతిశీలంగా మారింది. ఈ మాట ఎవరైనా అంగీకరించేదే. ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థను తీర్చిదిద్దాలని రాజ్యం అనుకున్నాక అందులో వేగం పెరిగింది. దానితోపాటు సంక్లిష్టత కూడా పెరిగింది. వేగం, సంక్లిష్టతలు ఏకకాలంలో విస్తరిస్తున్నాయి. రాజ్యం ఎంచుకున్న ఈ వ్యూహం వల్ల ఎదురవుతున్న సంక్షోభాలే విప్లవోద్యమానికి ఎజెండా అవుతున్నాయి. సాపేక్షంగా మందకొడి వేగం ఉన్న భూభాగాల్లో పురోగమించిన విప్లవోద్యమం పైన చెప్పిన మార్పులు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నది. ఇలాంటి లోతైన అనుభవాలు ఉద్యమానికి ఎన్నో ఉన్నాయి. అయినా సరే సుదూర భవిష్యత్ ఆశయ సాధన అనే లక్ష్యం చుక్కానిగా విప్లవోద్యమానికి ఉన్నది. దీని కోసం మూడు తరాలుగా నిండు జీవితాన్ని బలి ఇచ్చే సంసిద్ధతను ప్రదర్శిస్తోంది.

ఇంకో పక్క దీర్ఘకాల ఆశయ సాధన కోసం తమ తక్షణ ప్రయోజనాలను ఎందుకు వదులుకోవాలి? అనేవాళ్లున్నారు. అసలు దీర్ఘకాల లక్ష్యాలనే పేరుతో తక్షణ ప్రయోజనాలు పొందవలసిన తమకు అవి అందడమే లేదనే తీవ్ర విమర్శ కూడా నక్సల్బరీ మీద పెడుతున్నారు. ఇది చాలా విచిత్రమైన వైరుధ్యం. ఇది ఇంకా ముందుకుపోయి ఓట్ల రూపంలో మెజారిటీ సంఖ్య సాధించి అధికారానికి రావడానికి సుఖవంతమైన పార్లమెంటరీ మార్గం ఉండగా ప్రాణాలు బలిపెట్టే దీర్ఘకాలిక పోరాటం దేనికి? అనే నిరసన కూడా ఉన్నది. ఈ క్రమంలో భారత పార్లమెంటరీ విధానం ఎంత గొప్పదో చెబుతూ ఉంటారు. చాలా మంది బూర్జువా దళితవాదులు తాము సహజంగానే పార్లమెంటరీ పంథాలో ఉండటమేగాక మావోయిస్టులను కూడా ఓట్ల రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇస్తూ ఉంటారు. ఇంతగా తక్షణ, సులభ మార్గం ఉన్నదనే భ్రమ కలుగుతున్న చోటనే పరాయీకరణ వల్ల మనిషికి దూరమౌవుతున్నవన్నీ తిరిగి చేరువ చేసినప్పుడే మానవసారం వెల్లివిరుస్తుందనే చరిత్రకకు సంబంధించిన దీర్ఘకాలిక దృక్పథం నిలబడి ఉన్నది. ఈ మార్గంలో లక్షలాదిగా విప్లవంలో భాగం కావడం మన కళ్ల ముందున్న వాస్తవం. అంటే సుదూర చరిత్రపట్ల మనిషి ప్రకటించే ఆశావాదం ఇది. ఈ క్రమంలో నేరుగా భాగం కాలేకపోయినా దీన్ని విశ్వసిస్తూ, అభిమానిస్తున్న వాళ్లూ అసంఖ్యాకంగా ఉన్నారు.

అయినా దీర్ఘకాలిక లక్ష్యాలు - ప్రయోజనాల పట్ల వ్యతిరేకతతో ఏ ఉద్యమానికి లేనంత మంది అసమ్మతివాదులూ నక్సల్బరీకి ఉన్నారు. మూడు తరాల నాయకత్వాన్ని, శ్రేణులను, విప్లవ మేధావులను, అభిమానులను కూడ గట్టుకున్న విప్లవోద్యమానికి మూడు తరాల దృఢమైన వ్యతిరేకులు, తీవ్ర విమర్శకులు కూడా ఉన్నారు. ఈ యాభై ఏళ్లలో విప్లవోద్యమం సంక్షోభంలో పడ్డ ప్రతిసారీ పోలీసులు ఊపిరి తీసుకున్నట్లే, ఇక ప్రశాంతంగా పార్లమెంటరీ రాజకీయాలు కొనసాగించవచ్చని పాలకశక్తులూ అనుకున్నాయి. గత ఇరవై ఏళ్లలో దళిత బూర్జువా శక్తులు కూడా అలా అనుకుంటున్నాయి.

దీర్ఘకాలిక ఉద్యమం కావడంలోనే దాని బలం, విశిష్టత ఉన్నట్లే పైన చెప్పినట్లు చాలా ప్రత్యేకతలు, అననుకూలతలూ ఉన్నాయి. గతంలో జరిగిన విప్లవాలతో పోల్చితే నక్సల్బరీ యాభై ఏళ్లు సుదీర్ఘకాలమే. నిజానికి గత శతాబ్దిలో జరిగిన విప్లవాలను, ఇప్పుడు జరుగుతున్న భారత విప్లవోద్యమాన్ని ఏ రకంగానూ పోల్చలేం. పూర్తి భిన్నమైన స్థలకాలాల్లో, చారిత్రక ఆవరణలో నక్సల్బరీ కొనసాగుతున్నది. అది పూర్తిగా వేరే చర్చ. అయితే నక్సల్బరీని అర్థం చేసుకోడానికి ఇది చాలా అవసరం.

దీన్నుంచే భారత వ్యవస్థను మార్చాలని దీర్ఘకాలిక వ్యూహంతో నడుస్తున్న నక్సల్బరీ చర్చనీయాంశమవుతున్నది. ఎందుకంటే వ్యవస్థ క్రియాశీలమయ్యే కొద్దీ ప్రజలను తక్షణ సమస్యల్లోకి నిరంతరం తోసేస్తూ ఉంటుంది. అంతే కాదు. తక్షణ, తాత్కాలిక పరిష్కారాలను కూడా వ్యవస్థ తానే ప్రజల ముందు పెడుతూ ఉంటుంది. దీర్ఘకాల సమస్యలు అర్థం చేసుకోవడానికి, తక్షణ-దీర్ఘకాలిక సమస్యల సంబంధం గుర్తించడానికి, దానికి అవసరమైన సిద్ధాంత బలం కూడగట్టుకోడానికి, ఉద్యమాల్లోకి దిగడానికి వెసులుబాటే కల్పించదు. నిజానికి రోజువారీ జీవితంలో తక్షణ సమస్యల పరిష్కారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది గడ్డు వాస్తవం. బతుకుతెరువు మీద రోజువారి సమస్యల ఒత్తిడి చాలా ఎక్కువ. దీర్ఘకాలిక వ్యూహంతో పని చేసే కార్యకర్తల పని విధానాన్ని అది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రజలకు వస్తున్న రోజువారి సమస్యలను, ప్రత్యేక సమస్యలను పట్టించుకోకుండా వాళ్ల దగ్గరికి వెళ్లడం కుదరదు. ఇంకో వైపు నుంచి చూస్తే ఇది దీర్ఘకాలిక ఉద్యమాలకు సమస్య కాజాలదు. దీర్ఘకాలిక ఉద్యమాల్లోకి ప్రజలను సమీకరించడానికి ఒక మంచి మార్గం. అయితే వ్యవస్థలో వేగం పెరిగే కొద్దీ నిత్యం సామాన్యులను జీవన్మరణ సంక్షోభ వెల్లువలు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ స్థితి గతంలో కూడా ఉన్నదే అయినా ఇప్పుడు తీవ్రమైంది. తక్షణం అవి పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటారు. అప్పుడే జీవితం కొంచెం కుదుటపడుతుంది. లేదా మెరుగుపడుతుంది.

ఒక్కోసారి దీర్ఘకాలిక ఉద్యమాలు అనేక కారణాల వల్ల వీటిని పట్టించుకోలేని స్థితి కూడా రావచ్చు. ఉదాహరణకు నిర్బంధం. దీని వల్ల తక్షణ సమస్యలపై ప్రజలను సంఘటితం చేసే వేదికలు నడపడం, తగిన పోరాట రూపాలను అందివ్వడం, లేదా ప్రజలు చేపట్టిన పోరాట రూపాలను అందుకోలేకపోవడం అనే పరిమితి ఏర్పడుతుంది. అలాగే తక్షణంగా వచ్చిపడ్డ సమస్యను మొత్తం వ్యవస్థ పనితీరుకు సంబంధించిన అంశంగా నిర్దిష్ట సాధికార సమాచారంతో విశ్లేషణ ప్రజలకు అందివ్వడంలో కూడా పరిమితి ఏర్పడుతుంది. తద్వారా ఆ సమస్యపై విస్తృతస్థాయిలో ప్రజా సమీకరణ చేసి, సంఘటితం చేసి పాలకవర్గాలను ఇబ్బంది పెట్టడం వీలుకాదు. సహజంగానే ఇలాంటి అవకాశాలను పాలక వర్గంలోనే మరో బృందం తన రాజకీయ క్రీడకు ఉపయోగించుకుంటుంది. అప్పుడు సాధారణ ప్రజా జీవితంలో విప్లవ రాజకీయాల ప్రాబల్యం తగ్గిపోతుంది. బూర్జువా రాజకీయాల జోక్యం పెరిగిపోతుంది. ఆ రాజకీయాల వల్ల సమస్యలు తీరకపోయినా అవి మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయాలవుతాయి. ఇదొక తీవ్ర సమస్య. ఇంకో వైపు శక్తి మేరకు విప్లవ శక్తులు రోజువారీ పనుల్లో పడిపోతే ఏ రోజు పని ఆ రోజు చేయడంతోనే సరిపోయే స్థితి కలుగుతుంది. ఒక అవసరంగా మొదలై అదే పరిమితిగా మారిపోతుంది. మార్కిస్టు రచయితలు కూడా ఏ రోజు సమస్య మీద ఆ రోజు రాసేసే వాళ్లుగా తయారవుతారు. దీర్ఘకాలిక ప్రయాణంపై టార్చ్ లైట్ ప్రసరించే రచనలు చేయడం తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీర్ఘకాల వ్యూహాత్మక ఆచరణకుతక్షణ సమస్యలపై ప్రతిస్పందనకు మధ్య కమ్యూనిస్టులు నిత్యం ఎదుర్కొనే టెన్షన్ అంతా ఇంతా కాదు.

ఇలా ఎన్నో తలాల్లో దీర్ఘకాలిక ఉద్యమం సవాళ్లను, వొత్తిళ్ళను ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ క్షణం శతృవు ఇచ్చిన ఎజెండా ప్రకారం అనివార్యంగా విప్లవోద్యమ కార్యకలాపాలు నడిచే పరిస్థితి వస్తుంది. ʹ1990 తర్వాత శతృవు ఇచ్చిన ఎజెండా మీద పోరాడటమే మన ఎజెండా అయిందిʹ అనే పరిశీలన వెనుక ఇది ఉన్నది. ఇది చాలా విలువైన పరిశీలన. వాస్తవానికి ఇది తక్షణ - దీర్ఘకాలిక భావనల సమస్యగా కూడా మారిపోయింది. 1990కి ముందు నక్సల్బరీ ఈ సమస్య ఎదుర్కోలేదు. ఆ రోజుల్లో వెనుకబడిన ప్రాంతాల్లో అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు విప్లవోద్యమమే విముక్తి మార్గంగా కనిపించింది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ కాలంలో ఇది నిజం. ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. అత్తింటి వేధింపులకు రోజువారి జీవితంలో, చుట్టూ ఉన్న సంస్థల నుంచి ఏదో ఒక పరిష్కారం దొరకడం మొదలైంది. ఇది ఒక పాజిటివ్ విషయమే. మన సమాజంలో ప్రజా కార్యక్షేత్రం విస్తరిస్తున్నదనడానికి ఇది సూచిక. అయితే పెరుగుతున్న ప్రజా కార్య క్షేత్రానికి దీర్ఘకాలిక స్వభావం ఉన్న విప్లవంతో ఎలాంటి సంబంధం ఉంటుంది? ఉండాలి? అనే ప్రశ్న ఎదురవుతుంది. దీర్ఘకాలిక ఉద్యమాలు ఇక్కడ ఒక టెన్షన్ ఎదుర్కొంటాయి.

దీర్ఘకాలిక ఉద్యమాలు ఇంకో ప్రత్యేక పరిస్థితిని కూడా ఎదుర్కొంటాయి. దశాబ్దాలపాటు ఒక సుదూర, సమగ్ర లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో వ్యవస్థలో కూడా ఏదో ఒకరకమైన మార్పులు వస్తుంటాయి. అవి ఎలాంటివనే చర్చలోకి ఇక్కడ పోనవసరం లేదు కాని, తప్పక అవి దీర్ఘకాలిక పోరాటాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి మార్పులు ఏమీ జరగడం లేదనుకునే వాళ్లు కూడా వాటి ప్రభావానికి లోనవుతుంటారు.

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలికం కావడం వల్లే దాని ప్రభావాల్లోంచి ప్రత్యేకతలనూ గుర్తించాలి

No. of visitors : 933
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •