న్యాయవిచారణ

| సాహిత్యం | క‌థ‌లు

న్యాయవిచారణ

- అవధేశ్ ప్రీత్ | 02.06.2020 11:01:28pm

కామ్రేడ్ విజయ్ మిత్ర మరణంతో ఉవ్వెత్తున లేచిన ప్రజాగ్రహాందోళనలు ప్రభుత్వాన్ని, హృద్రోగనిపుణుడు డా. సి.కె.భగత్ ను తత్కాలికంగా విధులనుంచి తప్పించకనూ,ఇంకా అతని ప్రవర్తనావైఖరులను క్షుణ్ణంగా తెలుసుకొనుటకు ఒక విచారణ కమిటీని నియామకం చేయక తప్పని పరిస్థితికి నెట్టింది. అదొక గంభీర సునిశిత అంశమని భావించి, పక్షం రోజుల్లో విచారణ నివేదికను సమర్పించమని కమిటీని ఆదేశించింది.

కమిటి:హృద్రోగనిపుణుడు డా.రజనీశ్ ఆచార్య, నాడీరోగనిపుణుడు డా.జీవన్ కాంత్ యాదవ్, మానసిక రోగ నిపుణుడు డా.రమాశిష్ దేవ్ లు సభ్యులుగా గల త్రిసభ్య కమిటీని నియామకం చేసి, ఈ క్రింద సూచించినఅంశాల వారీగ పరిశోధించమని కోరింది ప్రభుత్వం.
* విజయ్ మిత్రా మరణానికి గల అసలు కారణం ఏమి?
* జనవరి ఒకటి రాత్రి తన విధి గాకున్నా డా.సి.కె.భగత్ అత్యవసర విభాగంలోనున్న రోగి విజయ్
మిత్రాకు ఎందుకు వైద్యాన్ని అందించవలసి వచ్చింది.
* సీనియర్ ప్రభుత్వ వైద్యునిగా, డా.సి.కె.భగత్ ప్రవర్తనా వైఖరులేమి?
* సి.కె.భగత్ మరణ ధృవీకరణ పత్రం జారీచేయడంలో ఆయనది సరియైన వైఖరేనా? ఆ పత్రం పరిగణనలోనికి తీసుకోవలసిన స్థాయిలో ఉందా?

విజయ్ మిత్రా మరణించడానికి దారితీసిన తత్కాలిక పరిస్థితులను అవగాహన చేసుకోడానికి గాను, కమిటీ ఆధారాలను సేకరించుటకు గాను సాక్ష్యులను పిలిపించడానికి నిర్ణయించి, ఆ సాయంకాలరాత్రి ఆ సంఘటన సమయంలో విధుల్లోనున్న సంబంధిత విభాగంలోని ప్రతి ఉద్యోగినీ వేర్వేరుగ వ్యక్తిగతంగా పిలిపించుకొని నిజాలు చెప్పమని కోరింది.

కమిటీ ఆ వ్యక్తులు చెప్పిన వాగ్మూలాలను నమోదు చేసింది.

డాక్టర్ సి.కె.భగత్ వాగ్మూలం:
ఆ ఒకటవ జనవరి రాత్రి డ్యూటీ నిజానికి నాది కాదు. క్యాంపస్ ఆవరణలో నాకు కేటాయించిన క్వార్టర్ లో ఉన్నానపుడు నా భార్య పక్షవాత రోగంతో ఉండి, నిత్య పరిచర్య అవసరంలో ఉంది. ఇంటి ప్రధాన ద్వారం బైట కాలింగ్ బెల్ మోగినపుడు, నా భార్యను బాత్ రూమ్ లోనుండి పడక వద్దకు చేర్చే ప్రయత్నంలో ఉన్న. కాలింగ్ బెల్ వినిపించినా నేను నా పనిలో కొనసాగుతూ ఆమెను మంచంమీద కాళ్ళుచాపి కూచుండేవిధంగా సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉండగా దర్వాజా బైట కాలింగ్ బెల్ పదేపదే మోగడం, పైగా దబదబ తలుపులు బాదడం విని, వచ్చినవాళ్ళు అత్యవసరం ఆతృతలో ఉన్నరని గ్రహించి, నాభార్యను వదిలి పరుగున వెళ్ళి తలుపులు తెరిచి చూస్తే, నా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి డాక్టర్ సుజాత నిలబడి ఉంది. ఆమె బరువైన దీర్ఘమైన ఉఛ్వాస నిశ్వాసాలు చూసినపుడు, ఆవిడ తీవ్ర ఆందోళనలో ఉందనీ, కార్డియాలజీ వార్డునుండి నా క్వార్టర్ దాన్క పరిగెత్తుతూనే వచ్చిందనీ అర్థమైంది.

నేను తలుపులు తెరవగానే ఆమె, సీనియర్ పట్ల జూనియర్ మర్యాదపూర్వకంగా పలకరించే నమస్కారాన్నికూడా మరిచి, ʹసర్, సీరియస్ అనారోగ్య స్థితిలో వున్న రోగి ఇంతకు కొద్దిసేపు ముందే వస్తే, అత్యవసర విభాగంలోకి చేర్చుకున్న. వార్డ్ లో మరే సీనియర్ డాక్టరూ లేరు. కనుక మీ వద్దకు వచ్చి మిమ్మల్ను ఇబ్బంది పెట్టవలసివచ్చింది. దయచేసి రండి సర్, రోగిని పరీక్షించండిʹ అంటూ అభ్యర్థించింది.

సుజాత విన్నపాన్ని మామూలుగానే పరిగణించి, ʹడాక్టర్ సుజాతా, రోగితో మీకేమైనా సంబంధ బాంధవ్యమేమైనా ఉందాʹ అనడిగాను.
ʹఆ ఆ, లేదుసర్ʹ ఉలిక్కిపడి సమాధానమిచ్చింది సుజాత.
ʹఅట్లాంటప్పుడు మీరెందుకంత ఆందోళనతో ఉన్నరు!?ʹ
అంటే జవాబు లేక నీళ్ళునములుతూ, ʹక్షమించండి సర్ʹ అన్నది.
ʹఈ రాత్రి డ్యూటీ ఎవరిది?ʹ
ʹడాక్టర్ చౌదరిగారిదిʹ నిర్వికారంగా బదులిచ్చింది.
ʹఅతనెక్కడున్నడు? మీరాయనకోసం ఎందుకు ప్రయత్నించలేదు?ʹ కఠినంగానే అడిగాను.
ʹసర్, చౌదరిగారు ఇంతవరకూ డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు! వారి ఇంటికి ఫోన్ చేసాను. ఎవరూ స్పందించలేదు...ʹ ఆవిడ తన జవాబు పూర్తి చేయకముందే, ʹఆస్పత్రి ఆవరణలోనున్న మరెవరైనా సీనియర్ కార్డియాలజిస్ట్ కోసం ప్రయత్నించలేదా?ʹ
ʹనాకెవరూ దొరకలేదు సర్, సీనియర్ ఫిజిషియన్ ల నందరినీ వెంబడించుకొని, డైరెక్టర్ గారు ముఖ్యమంత్రిగారింటికి సాధారణ చెకప్ వెళ్ళారుʹ అంటూ డాక్టర్ సుజాతగారు, తను నా వద్దకు రావలిసివచ్చిన అగత్యాన్ని వివరించారు.
నా భార్య తీవ్ర అనారోగ్యస్థితి ఐతేనేం, డ్యూటీ నాదికాదన్న ఉదాసీనతోనైతేనేం సుజాత గారి పిలుపును తిరస్కరించదలిచాను.కాని, డాక్టర్ సుజాత గారి నిస్సహాయ కలత చెందిన స్థితి చూసి,అట్లా చేయడం నైతిక విలువలరీత్యా సరికాదనిపించింది. ʹఓ రెండు నిమిషాలలో వస్త. నా భార్యను మరికొంత సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోబెట్టి వస్తాను. మీకు తెలియందేమీ కాదు, ఆమెకు తోడు లేకుండా అసలు కదలలేదని. పనిమనిషి
కూడా ఇవాళ సెలవులో ఉంది. ʹసుజాతతో చెప్పి, ఆమెను దర్వాజా వద్దే ఉంచి లోనికెళ్ళి, మా ఆవిడను సౌకర్యవంత స్థితిలోకి సర్దుబాటు చేసి, నడుముదాన్క దుప్పటి కప్పి, టీవీ స్విచ్చాన్ చేసి, ʹఇదో నేను అత్యవసర విభాగంలో నున్న రోగిని చూడ్డానికి వెళ్తున్న. తొందరగనే వస్తʹ అని ఆమెతో చెప్పి, ఆమె ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా బైటకు నడిచాను.
అంతవరకు దర్వాజా వద్ద నాకోసం ఎదురుచూస్తున్న సుజాత ముఖంలో ఏదో నేరభావన, భయంను గమనించి, ʹసుజాతగారూ ఒక ఫిజిషియన్ కుండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసాʹఅన్నాను.
నా ప్రశ్నకు జవాబును నానుండే ఆశిస్తుందని గమనించి, ʹసెంటిమెంట్లు ఉద్వేగాలు, రోగి బాధతో మమేకం కావడాలు డాక్టర్ కు తగనివి.ʹ
ఆమెకట్లా చెప్పడానికి రెండు స్పష్టమైన కారణాలు; ఒకటి:మహిళలు సహజంగానే ఉద్విగ్న స్వభావులు, రెండు సుజాతను సమతుల్య యదాస్థితిలోనికి తేవడానికి.
నామాటలెంతవరకు పనిచేసినవో చెప్పలేను కాని, మేము ఆస్పత్రివైపు వడివడిగా దూసుకెళుతూంటే ఆమె నాతో, ʹఒక రోగిని వెంబడించివచ్చిన అంతపెద్ద జనసమూహం, పైగా వాళ్శ నిశ్శబ్ధం! ముందెన్నడూ చూడని ఆ దృశ్యమే నన్నిట్లా కంగారుకు గురిచేస్తుందేమో సర్ʹ అన్నది.
డాక్టర్ సుజాత తననేదో సమర్థించుకోడానికి ప్రయత్నిస్తున్నదేమో ననిపించింది. ఆమె ముఖంలోని భావాలను చదవాలనిపించినా మా వేగపు నడకలో అది కుదరలేదు. కనుక నిశ్శబ్దంగా ఉండిపోయాను.
నేను అత్యవసర విభాగంలోనికి ప్రవేశించేవరకు సిస్టర్ అల్విన్ రోగి నరాల్లోనికి ఇంట్రావీనస్ పైపునమర్చి ఉంది. ఆమె నన్ను చిరునవ్వుతో, ʹశుభసాయంకాలమʹని పలకరించింది. అటువంటి ప్రోటోకాల్ మర్యాదలను అలవాటుగానే పట్టించుకోకుండా రోగి కేస్ షీట్ ను తీసుకొని వివరాలకోసం చూశాను.
కేస్ షీట్ లో రోగిపేరు విజయ్ మిత్రాగ నమోదై ఉంది. ఆయన రక్తపు పోటు అధికంగా ఉండి, కష్టంగా శ్వాసిస్తూ ఉన్నడు. ECG మానిటర్ సూచిక, రోగి జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు చూపిస్తుంది.
ʹసర్,మీ రోగ నిర్ధారణేమి? అతడు నిజంగా గుండెనొప్పితో బాధ పడుతున్నాడంటరా?ʹ సుజాతగారి ఆ ప్రశ్న వెనుక గల ఉద్దేశమేమిటో అర్థం కాలేదు. ఆమె అమాయకత్వానికి ఆశ్చర్యపోయి, ఆమెవైపు తీక్షణంగా చూస్తూ, ʹఅదేమిటి! దానర్థమేమి?ʹ అన్న.
ʹనిజానికీ...ʹ ఏదో చెప్పబోయి ఆగిపోయిందామె. ఏదో సంకోచం అడ్డుపడిందామెకు.
ఆమె డోలాయమాన సంకోచస్థితినర్థం చేసుకోలేక, ఆమె అనవసరంగా వత్తిడికి గురౌతున్నదని అనిపించి, ʹసుజాతా మీకేమైనా ఇబ్బందిగా ఉందా?ʹ అడిగాను.
ʹఅహహ! అటువంటిదేమీ లేదు సర్ʹ నా ప్రశ్నకు బిత్తరపోతున్నామె ఏదో దాస్తున్నట్లనిపించింది.
అంతలోనే సర్దుకుంటూ, ʹఈ మనిషికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం లేదు సర్ʹ అంది.
ʹఅట్లెందుకనుకుంటున్నరు మీరు!ʹ మొదటిసారిగ అనిశ్చితంగా ECG మోనిటర్ పై తీక్షణంగా దృష్టిని కేంద్రీకరిస్తూ అన్న.
ʹసర్, హింసలో నమ్మకమున్న ఒక మనిషి, ఎవరినైనా నరకడానికి ఏమాత్రం సంకోచించని మనిషి, సామూహిక హననానికి పేరుబడ్డ మనిషులకెవరికైనా గుండె అదే హృదయమనే దొకటి ఉంటుందంటారా?ʹ సుజాత కంఠం వణికింది. నేనామెవైపు గాభరాతో చూసాను.
ఆవిడ కళ్ళలోని భావాలను చదవడానికి ప్రయత్నించాను.
బహుషా ఆమె కళ్ళలో అమాయకత్వం,దుఃఖం కన్పించి, ʹనాకమీ అర్థం కావట్లేదు. మీరసలు ఏమనుకుంటున్నరు?!ʹ
ʹసర్ ఈయనొక నక్సల్ నాయకుడు. మీకు కూడా తెలియందేమీ లేదు. నక్సల్స్ రక్తపిపాసులు.ʹ సుజాత కంఠం గాద్గదికమైనట్లు గమనించాను.
*
కమిటీ ముందు వాగ్మూలమిస్తున్న డాక్టర్ భగత్ హఠాత్తుగా మౌనంలోకి వెళ్ళాడు. సుజాత, ʹనక్సల్స్ రక్తపాతంలో విశ్వాసమున్నవాళ్ళుʹ అన్న సమయంలో తన స్థితిని స్పష్టంగా గుర్తుచేసుకోవడంలోకి వెళ్ళాడు.
కేస్ షీట్ లో నమోదైన రోగి పేరు, విజయ్ మిత్రా గుర్తుకు తెచ్చుకుంటూ ఆతని పేరును తనలో తను, ʹనక్సల్ నాయకుడు విజయ్ మిత్రాʹ అంటూ గొణుక్కుంటుండగా, ఆయనకేదో తట్టింది. వెంటనే రోగివద్దకు
పరుగున వెళ్ళాడు. మొదట చూసినపుడు, రోగి ముఖం ఆక్సీజన్ మాస్క్ తో కప్పబడి ఉండడంవల్ల సరిగ్గా
చూడలేకపోయాడు. అప్పుడది అంత ఆసక్తికరమైన విషయంకూడా కాదు కూడా. కానిపుడు!? వెంటనే రోగికతి సమీపంలో నిలబడి, దృష్టినంతా కేంద్రీకరించి రోగి ముఖంలోకి తీక్షణంగా చూశాడు. తన జ్ఞాపకాల పొరలను తవ్వుతూ ఆలోచనల్లోకి వెళ్ళాడు.
రోగికి, డాక్టర్ విజయ్ మిత్రాకు ఒకనాడు తెలిసిన సాధారణ ఒడ్డూ పొడుగూ శారీరక ఛాయలున్నా, వయసుమళ్ళుతున్న ముఖం, తెల్లబడుతున్న బూడిద రంగు వెంట్రుకలు, కదలిక లేని మూతబడిన కళ్ళు అతన్ని ఖచ్ఛితంగా పోల్చుకోలేకపోతున్నవి. ఐనా ఇరవయ్యైదేళ్ళ కిందటి విజయ్ మిత్రా ముఖాన్ని మరింత జ్ఞాపకంలోనికి తెచ్చుకొని చూసినాక, అతని కళ్ళు ఆశ్చర్యానందంతో విప్పారాయి.
డాక్టర్ భగత్ హఠాత్తుగా నిశ్శబ్ధమయేటప్పటికి, ఆతని ముఖం వింతగా కనబడి, విచారణ కమిటీలోని మానసిక రోగనిపుణుడు డాక్టర్ రమాశిష్ దేవ్, అతన్ని స్వప్నావస్తనుండి బయటపడేయడానికి, ʹడాక్టర్ భగత్ ఏమిటి విషయం!?ʹ అడిగాడు.
ʹఓహ్! నాకిపుడు గుర్తుకు వస్తోంది. డాక్టర్ సుజాత కూడా ఇదే విధంగా, ʹవిషయమేవిటి సర్ʹ అనడిగింది. ఆమెకు జవాబివ్వడానికి బదులు, సిస్టర్ అల్విన్ ను పిలిపించాను. సిస్టర్ అల్విన్ పరుగున వచ్చింది. వెంటనే, ʹసిస్టర్, రోగి రక్త సాంపిల్ ను ట్రాప్ టెస్ట్, బయోకెమిస్ట్రీ పరీక్షలకు పంపండి.ʹ ఆమెనాదేశించి రోగివెంట తోడుగ ఉన్న మనిషిని (attendant) ను పిలిపించాను.
సిస్టర్ అల్విన్, తనకిచ్చిన ఆదేశాన్ని అమలు చేయడానికి ఉద్యుక్తురాలైంది.
డాక్టర్ సుజాత అదివరకే రోగికి స్ట్రెప్టోకినాస్ ఇంజక్షన్ ఇచ్చిఉంది. ECGలో iv వ రేఖను చూసి కొంచెం స్థిమిత పడ్డాను. నేనక్కడే కూర్చొని ECG మోనిటర్ ను గమనిస్తూ కూర్చోడానికి నిర్ణయించుకొని, సిస్టర్ అల్విన్ రిపోర్ట్ కోసం వేచిచూస్తూ ఉన్నాను.
నేను దిగులుగా ఉన్నట్లు గమనించిందేమో, డాక్టర్ సుజాత, ʹమీ మనసునేదో పొడుస్తున్నట్టుంది సర్ʹ అనడిగింది.
ఆలోచిస్తున్న భగత్, విజయ్ మిత్రాతో తనకున్న గతపూర్వ అనుబంధ జ్ఞాపకాలను ప్రోదిచేసుకుంటున్నడు.
తను వైద్యకళాశాల మూడవ సంవత్సరంలోనున్నపుడు, విజయ్ రూమ్ మేట్ గ వచ్చాడు. సాధారణ ఒడ్డూపొడుగులో ఉండి కొంచెం చామనఛాయలో ఉండి, తరగతి గదిలో నిశ్శబ్ధంగా ఉంటూ, మనసొక చోట తనువొక చోట అన్నట్లుండేవాడు. రూమ్ మేట్ ఐనాకనే, అతడిని సమీపంగా చూసి తెలుసుకోవడం మొదలైంది. మొదట్లో అతి మామూలు గనే ఉన్న స్నేహం నడుమ గోడలు మెల్లగ కూలిపోతూ, ఆలోచనలను అభిప్రాయాలను పంచుకునేంత అరమరికలు లేని స్థితికి ఎదిగింది.
ఆ దినాల్లో విజయ్ మిత్రా రాత్రి పొద్దు పోయేవరకు టేబుల్ మీద దీప ముంచుకొని చదివేవాడు. అందుకు భిన్నంగా భగత్ తొందరగనే పడుకునే వాడు. భగత్ ఎపుడైనా రాత్రి మధ్యలో లేచినపుడు కూడా చదువుతూ కనిపించేవాడు. అటువంటి ఒకానొక రాత్రి, విజయ్ అసలు గదిలో కన్పించలేదు. బహుశా బాత్రూమ్ కు వెళ్ళి ఉంటడని మళ్ళీ పక్కపై ఒరిగాడు. ఎట్లైతేనేం అట్లా లేచిన ప్రతీరాత్రి వేళ అతను కన్పించకపోవడం గమనించాడు.
చివరకు, విజయ్ రాత్రుల్లో తరుచుగా గది విడిచి పోవడం వెనుకగల రహస్యాన్ని ఛేదించడానికి నిర్ణయించుకుని ఒకరోజు, ʹరాత్రుల్లో తరచుగా నీవెక్కడికెళుతున్నవ్ విజయ్! ఎవరితోనైనా ఏమైనా
సంబంధం?!ʹ అడిగాడు.
విజయ్ ఆ ప్రశ్నను తేలికగానే తీసుకున్నడు. తనేదో తప్పుచేస్తూ దొరికి పోయినట్లో, ఆశ్చర్యపోయినట్లుగానో కనిపించలేదు. తేలిగ్గా నవ్వుతూ, ʹగాభరా పడకు దోస్త్, అప్పుడపుడు అలిసిపోయినట్లనిపించి అట్లా వ్యాహ్యాళికి వెళుతుంటాను.ʹ
విజయ్ సమాధానం భగత్ నేమీ తృప్తి పరచలేదు. తన ఆసక్తులు తనవన్న విజయ్ వైఖరి గమనించి, అంతటితో ఊరుకున్నడు. ఇక ప్రశ్నలేమీ వేయలేదు.
ఎట్లైతేనేం రహస్యమనిపించే ఆ విషయం తొందర్లోనే స్పష్టంగానే తెలిసిపోయింది. విజయ్ మంచం పక్కనున్న పుస్తకాలు, వైద్యవిద్యకేమాత్రం సంబంధం లేనివని తెలిసింది. కమ్యూనిస్టు పార్టీప్రణాళిక, దాస్ కేపిటల్, మార్క్స్ లెనిన్ మావో రచనల సంకలనాలు చదవడంలో విజయ్ పూర్తిగా మునిగిపోయిండని అర్థమైంది. అట్లా చదువుతూ అలిసినపుడు, కళ్ళుమూసుకుని ఏవో ఆలోచనల్లోకి వెళ్ళి మత్తులో ఉన్నట్టు కనిపించేవాడు.
విజయ్ తన సమయాన్ని వృథా పరుస్తున్నట్లనిపించింది భగత్ కు. అట్లా విజయ్ తన లక్ష్యంనుండి దారితప్పడం భరించలేకపోయాడు. ఒకనాడు విజయ్ ను ,ʹవిజయ్ ప్రయోజనంలేని ఈ పుస్తకాలు చదువుతూ సమయాన్నెందుకు వృథా చేస్తున్నవ్?ʹ గంభీరంగానే నిలదీశాడు.
విజయ్ ఆ ప్రశ్నకుకూడా సిద్ధమయ్యే ఉన్నడు. సహనమేమీ కోల్పోకుండా నిమ్మళంగా, ʹభగత్ నీవనుకుంటున్నట్లు పనికిమాలిన ఈ పుస్తకాలే ఒకరోజున ఇప్పటి సమాజాన్ని, ఇంతకంటే మెరుగైన
దిగా మారుస్తవి.ʹ అన్నడు.
రోజులు గడుస్తున్నకొద్దీ విజయ్ మిత్రా లక్ష్యం,మార్గాలు స్పష్టమై రాటుదేలుతున్నవి. ఎక్కువ రాత్రులు కార్మిక వాడలల్లో గడుపుతున్నడు.
పగలు ప్రజాఉద్యమాల ప్రదర్శనలూ, సమావేశాలు, సెమినార్ లలో గడుపుతున్నడు. అట్లా రోజులతరబడి హాస్టల్ ముఖాన రాడు. అట్లా వైద్య చదువులకు దూరమౌతున్నడు.
విజయ్ నొప్పించడానికి యత్నించినపుడల్లా, తను జవాబివ్వజాలని సంక్లిష్ట ప్రశ్నలతో తనను ముంచివేయడం భగత్ కు బాగా గుర్తు. అప్పుడపుడు విజయ్, ʹవైద్యవిద్యార్థులెట్లా దోపిడికి గురౌతున్న, వాళ్ళెట్లా కట్టుబానిసలుగ పరిగణించబడుతున్న తీరుకు వ్యతిరేకంగా మనం గొంతు విప్పాలి. ఈ అరాచకాలకు వ్యతిరేకంగా మనం ఏకమవ్వాలిʹ అనేవాడు.
అపుడు భగత్ కు ఒళ్ళుజలదరించినట్లనిపించేది. తమ సంభాషణలను చాటుగా ఎవరైనా వింటున్నారేమోనని అనుమానంతో హాస్టల్ గదిచుట్టూ తిరిగివచ్చేవాడు. గదిలో అతనెల్లప్పుడూ రూమ్ మేట్ భయంతో ఉండేవాడు. విజయ్ ఉనికెప్పుడూ ఇరుకుగా, అభధ్రతలో ఉన్నట్లు అనిపించేది. అట్లా ఆపరిస్థితి ఎప్పుడూ ఆకర్శణ వికర్శణల నడుమ కొనసాగేది.
ఒకరోజున హఠాత్తుగా పోలీసులు సర్చింగ్ వారెంట్ తో హాస్టల్ గది లోనికి దూసుకొచ్చారు. విజయ్ మిత్రాను నిర్భంధించారు. రూమ్ మేట్ అరెస్టవుతాడనే వార్త భగత్ వెన్నులో వణుకు పుట్టించింది. మూగ బోయాడు. గుండె కుంచించుకపోయింది. పోలీసులు గదిని వెతుకుతుండగా భయవివ్హలుడయ్యాడు.
పోలీసులు విజయ్ మిత్రా మంచంమీదా కిందా, తలగడపక్కన, అల్మిరా, ట్రంక్ పెట్టెలోనున్న పుస్తకాలను ఎంపికచేసి మరీ, ʹఇది అభ్యంతరకర సాహిత్యంʹ అని తీసుకెళ్ళారు. వాళ్ళు గదిని వదలి వెళ్ళేటపుడు, భగత్ ను విజయ్ మిత్రాగురించి అనేక ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమన్నారు. భగత్ తనకేమీ తెలియదన్నాడు. అతని బ్యాచ్ మేట్లు సీనియర్లు, ప్రొఫెసర్లు కూడా, భగత్ ఒక మంచి నిబద్ధుడూ, ప్రతిభావంతుడూ ఐన విద్యార్థియనీ, కాకతాళీయంగా విజయ్ మిత్రాకు రూమ్ మేట్ అయ్యిండనీ, విజయ్ మిత్రా వ్యవహారాలతో అతనికేమీ సంబంధం ఉండే అవకాశం లేదనీ అన్నరు.
పోలీసులు వెళ్ళిన తర్వాత భగత్ పూర్వసాధారణ స్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది.
పదేపదే విజయ్ మిత్రాను గురించిన కలవరం అతని పేగులను మెలిపెట్ట సాగింది. ఈ భయంకర పరిణామాల జ్ఞాపకాలు తననెప్పుడైనా విడిచిపోగలవా అనిపించసాగింది. విజయ్ మిత్రా గంభీరమైన ముఖవర్ఛస్సు, కాంతివంతమైన కళ్ళు, ధిక్కార వైఖరి ఇవన్నీ ఆతని కళ్ళముందు తిరుగుతుండగా భగత్ తనలోతను ప్రశ్నలు వేసుకోక తప్పిందికాదు.
విజయ్ ను నక్సల్స్ వద్దకు చేర్చిందేమి? పోలీసులతన్నెందుకు అరెస్ట్ చేశారు? ఆయనెంచుకున్న లక్ష్యం, దారి సరియైందేనా?
ఆ రాత్రి భగత్ నిద్రించలేకపోయాడు. విజయ్ లేని ఖాళీ పడక అతన్ని భంగపరుస్తూంది. ఆయన ఆలోచనలనుండి బయటపడడానికెంత ప్రయత్నించినా సాధ్యం కాకుంది. అటువంటి స్థితిలో భగత్ లేచి,విజయ్
పడకవద్దకు చేరి, పోలీసులు తీసుకపోగా మిగిలి చిందరవందరగా పడిన పుస్తకాలను అల్మారాలో క్రమంగా సర్దాడు. ఆతని పక్కను దులిపి సర్దుతూండగా తలగడ గలీబులో ఏదో ఉన్నట్లు తగిలింది. లోపలికి చేతిని దూర్చి తీసిచూస్తే, ఎర్రని ప్లాస్టిక్ అస్తరులో ఒకదినచర్య పుస్తకం దొరికింది. పేజీలు తిరిగేసిచూస్తే అందులో ఎన్నో సంగతులు, సంఘటనలు, ఆలోచనలు, వ్యక్తిగత తీర్మానాలు, ఆయన తెలుసుకున్న కొత్త సంగతులు నమోదు చేయబడి ఉన్నవి.
భగత్ డైరీ చదవడం ఆరంభించాడు. ఆ రాతలు అతనిపై చాలా ప్రభావాన్ని చూపాయి. కొన్ని అతనిలో ఉత్కంఠను రేపాయి. ఆసక్తిని కల్గించినయ్. మరికొన్ని పారవశ్యంలో ముంచినయ్. కాగా మరికొన్ని అంతే భయపెట్టినయ్. ఒకచోట విజయ్, ʹవిశ్లేషణాయుత విచక్షణ లేక నా సహవాసులు చాలా మంది సంక్లిష్టమైన అంశాలలోతుల్లోకి వెళ్ళడానికి నిరాకరిస్తున్నరు. బదులుగా సమస్యలకు సులభసాధ్య పరిష్కారాలకు మళ్ళుతున్నరు. అటువంటి పరిష్కారాలు కొద్దిసార్లు సకారాత్మక ఫలితాలనిస్తున్నా, చాలా సార్లు నకారాత్మక ఫలితాలకే దారితీస్తున్నవి.౼మావోసేటుంగ్ʹ
ఈ వాక్యాలలో భగత్ తనను తాను ప్రతిబింబిస్తున్నవని అనుకున్నడు. విజయ్ ఆ వాక్యాలను తననుద్దేశించే రాశాడేమోననీ అనుకున్నడు. కాని చాలా సార్లు ఆ వాదనలు తననేమాత్రం ఒప్పించలేనివిగా ఉన్నవి. విజయ్ ను వెక్కిరించ గలిగేవిగా ఉన్నవి. ʹవిజయ్! ఊహాజనిత స్వర్గంలో విహరించడం ఆపు.ʹ అని తనతనితో అంటున్నట్లు అనిపించేది.ʹహూ! బుద్ధిహీనుడు!ʹ
గొణుగుతున్న భగత్ పెదవులను చూసి, నాడీరోగ నిపుణుడు జీవకాంత్, ఎక్కడో తప్పిపోయాడీమనిషి అనుకుని, ʹడాక్టర్ భగత్ మీకేమీ ఇబ్బంది లేదుగద! మీరు బాగే గద!ʹ అన్నడు.
భగత్ తనను తను సోయిలోనికి తెచ్చుకుంటూ, ʹ ఆ ఔను డాక్టర్ యాదవ్! నేనుపూర్తిగబాగున్న.ʹ అన్నడు. లేకుంటే కమిటి మెంబర్లు తన భావాలను కెలుకుతూ, తను బయల్పరచడానికిష్టపడని ఆలోచనాభిప్రాయాలకు సంబంధించి ప్రశ్నలు వేసి వృథా చర్చకు మళ్ళిస్తారని సాధారణ స్థితిలోనికి వచ్చి, తన వాగ్మూలాన్ని కొనసాగించాడు.
డాక్టర్ సుజాత, నేనేమనుకుంటున్నానని అడిగినప్పుడు జవాబుగ ఎదురు ప్రశ్నʹమీకీరోగి వ్యక్తగతంగా తెలుసా?ʹ వేశాను.
ʹఅట్లాంటిదేమీ లేదు సర్, ఆయనగురించి దినపత్రికలల్లో, పీరియాడికల్స్ లో చదివి చూసి తెలుసుకున్నదే. నిజానికసలు ఆయన వెన్నంటి వచ్చిన జనాల సంభాషణల ద్వారానే అతనొక నక్సలైట్ నాయకుడని రూఢీ ఐంది.ʹ
అంతలో నాకు సిస్టర్ అల్విన్ తిరిగి రాలేదనే విషయం స్ఫురించింది. రోగిని గురించి కొన్ని సూచనలిచ్చి, అత్యవసర విభాగంనుండి బైటకు వచ్చాను.
అట్లా బైటకు వచ్చినవెంబడే కారిడార్ లో కనిపించిన అల్విన్ వద్దకు పరిగెత్తాను. ఆమె మ్రాన్పడినట్లగుపించింది. నన్ను చూసిన వెంబడే చెప్పనారంభించింది, ʹసర్ అత్యవసర ల్యాబ్ లో ఎవరూ లేరు, దానికి తాళం వేసిఉంది.ʹ
ఎందుకట్లా?!ʹ ఆశ్చర్యంతో నేను. అటువంటి నిర్లక్ష్య నిర్వహణా వైఖరులు అక్కడ కొత్తవేం గాకున్నా, ఆరోజు నేను కలవరానికి గురయ్యాను. కోపం వచ్చింది. సిస్టర్ అల్విన్ ను ICCU లోనికి వెళ్ళండని చెప్పి, ఆస్పత్రి భవనంనుండి బైటకు నడిచాను.
బైట గంభీర నిశ్శబ్ధంతో ఆతృతలోనున్న జనసందోహం. వాళ్ళంతా నావైపే ఆసక్తిగా చూస్తున్నట్లనిపించింది. వాళ్ళకళ్ళల్లో ఆశ, సందేహంతో కూడిన ప్రశ్నలు, దీనంగా అర్థించే చూపులు! ఆ చూపుల తీక్షణతను భరించలేకపోయిన. ఆ చూపులనుంచి తప్పించుకునే ప్రయత్నంలో డాక్టర్ ఛేంబర్ లోనికి ప్రవేశించాను. హఠాత్తుగా ఆస్పత్రి మొత్తం చీకటి కమ్మేసింది. విద్యుత్ అంతరాయం ఏర్పడి, ప్రతిదీ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది.
చిమ్మచీకటి భయపెడుతూంది. నా మెదడులో రెండు ముఖాలు. ఒకటి నా భార్యది. రెండోది ICUలో ప్రాణం నిలుపుకోవడం కోసం పోరాడుతున్న విజయ్ మిత్రాది. రెండు ముఖాలూ కలగాపులగంగా కదులుతుంటే విద్యుత్ రాకకై వేచిచూస్తున్న.
హాస్పిటల్ వెనుక నున్న జనరేటర్ ఎందుకు స్విచ్ ఆన్ చేయలేదో అనిపించింది. అనుకోకుండానే
సహజాతాసక్తితో ICCU వైపు పరిగెత్తాను. దానిలోకి అడుగు పెట్టగానే, కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ, లైట్లు చమక్కుమని వెలిగినయ్. మరు క్షణమే ECG మోనిటర్ వైపు తదేకంగా చూశాను. కేవలం ఒక కాంతివంతమైన వెడల్పాటి రేఖమాత్రం కన్పించింది. రోగి గుండె ఆగింది. రోగి వద్దకు దూసుకవెళ్ళి నాడీని పరీక్షించదలిచాను. మణికట్టుపై వేళ్ళతో తాకలేకపోయాను.
నేనాయనను పునరుజ్జీవింపజేసే అప్రయత్నంగా, గుండెను తిరిగి పనిజేయించడానికి గుండె నాళాల్లోనికి అడ్రినలైన్ ను, ఇంకా పంపకమందే డాక్టర్ సుజాత, ʹసర్, మీది వృథా ప్రయాస, రోగి మరణించాడుʹ అన్నది.
అట్లా అంటున్న సుజాతలో ఎటువంటి ఆసక్తి, ఆందోళన కన్పించలేదు. నింపాదిగా అన్నదా
మాటలను. నా ఆందోళనాతృతలను ఉపశమింప చేయడానికే అట్లా ఉన్నదని అనిపించింది. కాని నేనింకా రోగి మరణించాడని అంగీకరించే స్థితిలో లేను. ఆ వ్యాకులతలో నేనామెతో, ʹఓహ్ ఛట్! మనం ఆయన్ని కాపాడలేకపోయాంʹ అన్నాను.
*
కమిటీ ముందు వాగ్మూలమిస్తూ మళ్ళీ నిశ్శబ్దంలోకి వెళ్ళి, చెమట పట్టిన నుదురును చేతిరుమాలుతో తుడుచుకొంటూండగా, గత జ్ఞాపకాల మేఘాలు కమ్మి వేసినయ్. వెకెనకటి సుదూర జ్ఞాపకాల్లోనికి వెళ్ళాడు.
విజయ్ మిత్రాను కళాశాల నుండి బహిష్కరణను ఆపడానికి, అతనిని జైలు నుండి విడిపించడానికి చేసిన ప్రయత్నాలేవీ పని చేయలేదు. విద్యార్థి సంఘం చేయవలిసినంతగా చేసింది. భగత్ తోపాటు అనేకమంది విద్యార్థులు కళాశాల అధికార గణం ముందు తమ వాదనలుంచారు. ʹఆయనకున్న రాజకీయా అభిప్రాయాలు ఆయనహక్కు, వాటినాధారంగా ఆయనను బహిష్కరించడం అన్యాయంʹ అన్నారు. కాని కళాశాల అధికారగణం వాళ్ళ వాదనలేవీ వినలేదు. విద్యార్థులగళం ఉద్యమరూపం దాల్చక ముందే వాళ్ళపై విరుచుకుపడ్డారు. కళాశాల ఆవరణలో పోలీసు క్యాంపు వెలిసింది. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి ఆచార్య వర్గమూ కఠిన నిర్ణయాన్నే తీసికున్నది.
విజయ్ మిత్ర బహిష్కరణ ఒక తీవ్ర వివాదాస్పదాస్పదమైంది. కాని క్రమంగా అది జ్ఞాపకాల పొరలమాటున మలిగిపోయింది.
కాని తన రూమ్ మేట్, స్నేహితుడూ ఐన విజయ్ జ్ఞాపకాలు భగత్ ను అంత సులభంగా వీడిపోలేదు. గదిలో విజయ్ పండిన ఖాళీ ప్రక్కమంచం, అతని పుస్తకాలు, ట్రంకు పెట్టె, టేబుల్ ల్యాంప్, అతని బట్టలు మొదలైనవి అతని జ్ఞాపకాలనుండి తుడిచిపెట్టి పోలేదు సరిగదా నిత్యం అతన్ని వెంటాడుతూనే ఉన్నవి. భగత్ విజయ్ తో తనకున్న అనుబంధ లోతులలోనుండి బైట పడలేకపోతున్నడు.
కొంతసమయం తర్వాత, విజయ్ తండ్రి తన కొడుకు సరుకు సరంజామాలను తీసుకపోడానికి వచ్చాడు. అతడు చాలా అలిసి నిరాశలో మునిగి ఉన్నడు.
అతనితో భగత్, అతికష్టంగా , ʹబాబాయ్, నేను చాలా ప్రయత్నించాను కానీ..ʹ ఇక మాటలు పెగలలేదు. ఆ తండ్రి కూడా, ఆ మాటలను పట్టించుకునే స్థితిలో లేడు. నిశ్శబ్ద నీరసస్థితిలో తన కొడుకు సామాను సరంజామాలను రిక్షా బండిలోనికి ఎక్కిస్తున్నాడు.
ఆ నిశ్శబ్దం వెనుక అంతులేని ఆవేదనాక్రందనలు ఉన్నవి. రూమ్ మేట్ తండ్రి, గేటు దాటి కనుమరుగయే వరకు చూస్తూ, భగత్ గేట్ వద్దే అచేతన స్థితిలో నిలబడి ఉన్నడు.
విజయ్ వస్తు సముదాయమంతా కనుమరుగు ఐనాక, భగత్ నిస్త్రాణకు గురయ్యాడు. ఏదో శూన్యం ఆవహించిందతనికి. కొన్ని సార్లు తన మితృడు పక్కనే ఉండి చెవిలో ʹమిత్రమా నాడైరీని నీవద్దే ఉంచుకున్నవు, మా నాన్నకు అప్పగించలేదెందుకు?ʹ అనడిగినట్లనిపించింది.
తలగడ గలీబు లోనికి జాగ్రత్తగా చేయిదూర్చి, డైరీని బైటకు తీసి చేతిలో పట్టుకున్నాడు,ʹఔనూ ఆ డైరీలో ఏముందో నాకు తెలుసు, నేనెందుకు విజయ్ తండ్రికి ఇవ్వలేదు!ʹ అని తనకు తానే ప్రశ్నించుకున్నడు.
తన ప్రశ్నకు తనవద్దే సమాధానం లేదు. సమాధానం కోసం డైరీ పేజీలను తిరగవేయడం మొదలుపెట్టాడు. అట్లా పేజీలు తిరగేస్తుండగా ఒకచోట, విజయ్ రాసిన, ʹపారిశ్రామిక కార్మిక రంగం, గ్రామాల్లోని రైతుకూలీలను కలుపుకొని, వాళ్ళ మద్దతుతో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలి. చిన్నరైతుకూలీ విప్లవ గ్రూపులుగా, సంఘాలుగ ఏర్పడి ఫ్యూడల్ బూర్జువా భూములను స్వాధీనం చేసుకోవాలి. విప్లవం వర్దిల్లాలంటే, శ్రామికుల చేతుల్లోకి పాలనాధికారం రావాలి. -లెనిన్ʹ
ఆ పేజీని చదువుతుండగా భగత్ కు భయమైంది. ఆ డైరీని తనవద్ద ఉంచుకోకూడదనుకున్నడు. డైరీని మూసి జేబులో ఉంచుకుని, రైలుస్టేషన్ కు పరుగున వెళ్ళాడు.
స్టేషన్ కు చేరేవరకు, అక్కడ ఒక బేంచీ మీద విజయ్ తండ్రి కూచుని ఆలోచనల్లో మునిగి రైలు కోసం వేచి ఉన్నాడు. భగత్ డైరీని అతని చేతికి అందించాడు. ఆ డైరీని అందుకుంటుంటే ఆ తండ్రి చేతులు, తన బిడ్డ శవాన్ని అందుకుంటున్నట్లుగా వణికినయ్.
*

డాక్టర్ భగత్ పలుమార్లు అదేపనిగా, నుదుటి చెమటను తుడుచుకుంటుండటం గమనించి, డాక్టర్ రజనీష్ ఆచార్య జోక్యం చేసుకుని, ʹడాక్టర్ భగత్, మీకేమైనా అసౌకర్యంగా ఉంటే, ఈ సమావేశాన్ని వాయిదా వేయొచ్చుʹ అన్నాడు.
భగత్ చేతి రుమాలును ముడిచి నలుపుతూ, ʹడాక్టర్ ఆచార్య,నేను బాగానే ఉన్న. వాయిదా వేయనవసరం లేదుʹ అన్నాడు.
తన ఆ మాటతో, ఆవరించిన నిశ్శబ్ధాన్ని చేయిస్తూ, నింపాదిగా ʹరోగి పార్థివ శరీరాన్ని ఆస్పత్రి బైటకు తేగానే, అక్కడే ఉన్న జనసందోహపు ʹకామ్రేడ్ విజయ్ మిత్ర అమర్ హైʹఅన్న నినాదాలు, ఆస్పత్రి ఆవరణ మొత్తాన్ని కంపింపజేసినయ్. ఆ పరిస్థితుల్లో ఎట్లా స్పందించాలో తోచక, మూగవోయి, డాక్టర్ ఛేంబర్ లోకెళ్ళి కూలబడ్డాను. డాక్టర్ సుజాత కూడా నన్ననుసరించి ఛేంబర్ లోనికే వచ్చి కూర్చున్నది.
ఆ రెచ్చిపోయిన జనం నినదిస్తూ ఆమెను చుట్టుముట్టారు. ఏంచేయాలో దిక్కు తోచని ఆమె ముఖం వివర్ణమైంది. ఆ సమయంలో ఆమెనట్లా ఒంటరిగా విడిచి వెళ్ళిపోవడం సరికాదనిపించి, అక్కడే అట్లే కూచుండిపోయాను. సిస్టర్ అల్విన్
కూడా అదే స్థితిలో ఉండిపోయింది.
అంతలో హఠాత్తుగా డాక్టర్ చౌదరి ఛేంబర్ లోకీ వచ్చాడు. నాకు కొంత ఉపశమనం అనిపించింది. తికమకగా దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో వచ్చిన ఆతను, ʹడాక్టర్ భగత్ ఏమిటిదంతా, అంత పెద్ద సంఖ్యలో జనం, దిక్కులు పిక్కటిల్లేలా ఆ అరుపులు...అంతా సరియేనాʹ అడిగాడు.
ʹఒక రోగి, నక్సలైట్ నాయకుడు మరణించాడు. వాళ్ళంతా ఆయన మద్దతుదార్లు, సానుభూతి పరులు.ʹ చెబుతూ ఇంటికెళ్ళాలని లేస్తూ, ʹడాక్టర్ మీరొచ్చారింక, నేనిక్కడ సెలవు తీసుకుంటాను. మరణ ధృవీకరణ పత్రాన్ని సిద్ధం చేయండిక.ʹ చెప్పాను.
డాక్టర్ చౌదరి అందుకు సిద్ధంగా లేడు. ఆయన ముఖం వాడిపోయింది. ఆయన, ʹనేనసలు రోగినే చూడలేదు. ఆయన క్లినికల్ నివేదిక కూడా చూడలేదు. ఆయన మరణ ధృవీకరణ పత్రం నేనెట్లా చేయగలను. అది నాకు తగనిది.ʹ అన్నాడు.
బిత్తరపోయి, చౌదరి గారి ముఖం లోనికి చూశాను, భావాలను వెతుకుతూ. బైట జనం ఘోష తగ్గుతూంది. లోపల పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఏం చేయాలో నాకంతు పట్టలేదు. చివరగా చౌదరి గారితో, ʹడాక్టర్ డ్యూటీ మీది, నిబంధనల ప్రకారం ఈ కేసు మీది..ʹ పరిస్థితిని ఆయనకర్థం చేయించడానాకి ప్రయత్నించాను.

డాక్టర్ చౌదరి ససేమిరా ఒప్పుకోలేదు. అపుడాయన ఎటువంటి తర్కాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. బైట మృతదేహంతోనున్నజనసందోహం నినాదాలు తగ్గినా నియంత్రణకు కష్ట సాధ్యంగా ఉన్నరు. పరిస్థితి ఏక్షణంలోనైనా చెయిదాటి వికటించవచ్చు. అదే సమయంలో ఇంటివద్ద ఒంటరిగా నిస్సహాయంగా నున్న నాభార్య గుర్తుకు వచ్చింది. నా నరాలు చిట్లుతాయే
మోననిపించిన స్థితిలో, నా ప్రశాంతతను కోల్పోకుండానే, మరణ ధృవీకరణ పత్రం రాయడానికి సిద్ధపడ్డాను.

డాక్టర్ సుజాత వాగ్మూలం:
డాక్టర్ సుజాత రాయ్ అనే నేను, ఆ 1వ జనవరి రాత్రి హృద్రోగ విభాగంలో విధులలో ఉన్న. అపస్మారక స్థితిలో రోగి విజయ్ మిత్రాను హాస్పిటల్ కు తీసుకవచ్చిన ఆ రోజు డాక్టర్ చౌదరి జట్టు (unit)విధులలో ఉండాలి. కాని వారప్పటి కింకా రాలేదు. రోగికి ప్రాథమిక పరీక్ష చేసినాక, రోగి స్థితి గంభీరంగా ఉందని గమనించాను. ఆ రోగి వెంబడి ఆందోళనలోనున్న పెద్ద జనసందోహం తోడుగా వచ్చారు. నాకేదో భయం వేసింది. నిస్సహాయ స్థితిలో ఉన్నాననిపించి, అతన్ని అడ్మిట్ చేసుకుని అత్యవసర విభాగంలో ఉంచమని ఆదేశించి డాక్టర్ చౌదరి గార్కి ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు కాంటాక్ట్ దొరకలేదు. అప్పటికే రోగి ఒక పెద్ద నక్సలైట్ నాయకుడని తెలిసింది. ఆయనకు తోడుగా వచ్చి బైట నున్న జనం ఆయన మద్దతుదార్లనీ తెలిసింది. నన్నేదో బలహీనత ఆవహించింది. వెంటనే హాస్పిటల్ వెనుక ద్వారం నుండి జారుకొని బైటపడి ఒక సీనియర్ డాక్టర్ కొరకు
వెతకనారంభించాను.
ఆవరణంతా భయంకర నిశ్శబ్దం ఆవహించి ఉంది. ఆ నిశ్శబ్దమో లేక భయమో నన్ను వణికిస్తున్నది ఏమో తెలియలేదు. అంతలోనే డాక్టర్ భగత్ గారి ఇంటిలో లైట్లు వెలగడం కనిపించింది. ఆ భంగపడిన స్థితిలో నేను పరుగున వెళ్ళి ఆయన ఇంటి దర్వాజ ముందు వాలి కాలింగ్ బెల్ మోగించాను.
డాక్టర్ భగత్ తలుపు తెరిచారు. ఆయనేమీ అడగకముందే నేనొక గంభీర స్థితిలో నున్న రోగిని అడ్మిట్ చేసికున్న. అతనికి మీ సహాయం కావాలి సర్ అని అడిగాను. నాఆందోళనాకరమైన స్థితిని చూసి నాతో రావడానికి అంగీకరించారు.
ఆ రోగి నక్సలైట్ నాయకుడు విజయ్ మిత్ర అని తెలియడం తోనే డాక్టర్ భగత్ మ్రాన్పడిపోయాడు. ఆయన దేన్నో గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపించాడు. మరుక్షణంలోనే రోగి బెడ్ వద్దకు చేరి, దీర్ఘంగా శ్వాసించి , ʹ డాక్టర్ సుజాత ఈ రోగి మీకు తెలుసాʹ అడిగాడు.
ఔను, నాకు తెలుసు. కేవలం నక్సలైట్ నాయకుడని మాత్రమే కాదు. నేనొకప్పుడు నక్సలైట్ ఉద్యమం పుట్టిన ప్రాంతంలో నివసించే సమయంలో, నా కుటుంబం, విజయ్ మిత్ర ఆగ్రహానికి బలైందని చెప్పి, విషయం లోతుల్లోకి వెళ్ళి కారణాలను పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే, డాక్టర్ భగత్ విజయ్ మిత్రతో ఏదో పరిచయం ఉన్నవాడని, రోగిపట్ల అతనికి ఆప్యాయతేదో ఉన్నట్లు, భగత్ గారి కళ్ళను చూసి తెలుసు కుంటుండగా, మరుక్షణమే ఆయన ముఖంలో ఒక విషాదచ్ఛాయను గమనించాను.

(ఇంకాఉంది...)

No. of visitors : 300
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


న్యాయవిచారణ

అవధేశ్ ప్రీత్ | 16.06.2020 05:28:58pm

మరణానికి కారణం పేర్కునే చోటులో భగత్, ʹవ్యవస్థ వైఫల్యం వల్ల మరణం సంభవించిందిʹ అని రాసాడు....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •