క్వారీలు - మహిళా కార్మికులపై సామాజిక పరిశీలన

| సంభాషణ

క్వారీలు - మహిళా కార్మికులపై సామాజిక పరిశీలన

- శిల్పి | 16.06.2020 05:17:10pm

చీమకుర్తిలోని కొన్ని క్వారీలు పేరుకే లిమిటెడ్ సంస్థలు గానీ, ఇక్కడ కనీస సౌకర్యాలు ఉండవు. దుమ్ము, ధూళీలో కార్మికులు కార్మికులు పనిచేస్తున్నా రోజూ నీళ్ళు కొట్టించాలనే నింబంధనలు పాటించరు. తాగునీరు కార్మికులు పనిచేస్తున్నచోట అందుబాటులో ఉంచాలనే కనీస సదుపాయం కల్పించరు.
పొద్దున్నే టిఫిన్ పెట్టరు, "టి" కూడ ఇవ్వరు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించరు.

ఎనిమిది గంటల నుంచీ సాయంత్రం ఐదు దాక జనరల్ షిప్ట్ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం మాత్రమే పెడతారు. అది కూడ ఊర్లో హోటల్ నుండి చాలీ చాలని పార్శిల్ భోజనం. అట్లాఅయితేగానీ, ʹఅది లేదు, ఇది లేదని కార్మికులు గొడవలు పెడతారని క్వారీ ఓనర్లు పిసినారి బుద్దులతో ఉంటారు. మధ్యాహ్నం భోజనం చేయడానికి కనీసం నీడ ఉండే పాక గానీ, విశ్రాంతి గది గాని ఉండదు. అక్కడే చెట్లక్రింద బండలమీద కూర్చుని తినాల్సిందే.

కొన్ని లిమిటెడ్ క్వారీలల్లో మాత్రం అలా కాదు. క్వారీలోనే క్యాంటీన్పె ట్టించి, టిఫిన్, భోజనం, మధ్యలో రెండుసార్లు "టి" లు ఇస్తారు. అది కూడ కార్మికులకు అందరికి అందేలా చూస్తారు. అంతేకాదు, కార్మికుల సంక్షేమం గురించి, ఆ క్వారీలు నిబంధనలనూ అనుసరిస్తూ పని చేస్తాయి. కార్మిక చట్టాల నిభంధనల ప్రకారం వారాంతపు సెలవు దినాలు, మెడికల్ సెలవులు ఎరన్డ్ లీవులు, పి.యఫ్.లు, బోనస్, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంటు, కార్మికులకు విశ్రాంతి గదులు, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, ఓ.టి. సౌకర్యాలు తప్పనిసరిగా కలిగించాల్సివుంది.

ఎక్కువ క్వారీలు మాత్రం ఎలాంటి నిబంధనలేవి పాటించకుండా, కేవలం వచ్చిన రోజులకు జీతాలు కట్టి ఇస్తారు. సమయపాలన అనేది లేకుండా డ్యూటీ చేయిస్తారు. అట్టాంటి ఏ సౌకర్యాలు లేని క్వారీలు చీమకుర్తి ప్రాంతంలో చాలా ఉన్నాయి.తనిఖీలు చేసి, కార్మిక సంక్షేమం కోసం జీతాలు తీసుకుంటున్న కార్మిక శాఖ అధికారులలో చాలామంది వాళ్ళ ముడుపులకే గానీ, కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవాదం లేదు. వాళ్ళు ఏనాడూ క్వారీలవైపు తొంగిచూడరు.

ఇక ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎలక్షన్ ఖర్చులకోసం క్వారీ యజమానుల నుంచీ విరాళాలు దండుకోవడమే గానీ, కార్మికులకు హక్కులున్నాయి అవి సరిగ్గా అమలవుతున్నాయా! లేదా! అనేది వాళ్ళకు సంబంధం లేని విషయంగా భావిస్తుంటారు.

క్వారీలో వంట చేయడానికో, ఆఫీసు రూములు శుభ్రం చేయడానికో క్వారీలో పనిచేసేవాళ్ళకు నీళ్ళు, ʹటిʹలు అందించడానికో కొంత మంది ఆడవాళ్ళు ఉంటారు. క్వారీ ఉత్పత్తి పనులకు వీళ్ళను వినియోగించరు. కార్మికుల డ్యూటీలు ఎక్కువగా "పిట్" (గని)లోపల పనిచేస్తుంటారు గనుక, మహిళా కార్మికులు వాళ్ళకు నీళ్ళు, ʹటిʹ అందివ్వడానికి అప్పుడప్పుడు గనుల వద్దకు వచ్చిపోతుంటారు.

చాలా క్వారీల సరిహద్దులు ప్రక్కన ప్రక్కన కలసి ఉంటాయి. మా ప్రక్కన క్వారీ వాళ్ళకి ప్రతిరోజూ ఉదయం పదకొండున్నరకి, సాయంత్రం మూడున్నరకి నెత్తిమీద నీళ్ళ క్యాను, చేతిలో ప్లాస్కులు పట్టుకొని చాలా జాగ్రత్తగా ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, నీళ్ళు, "టి"లు ఇచ్చిపోతుంటారు. మా క్వారీ కార్మికులను రోజా చూస్తూవుంటారు గనుక, అడిగిన వాళ్ళకి నీళ్ళు, టీ అందిస్తుంటారు.

ఆ విధంగా అందించే ఇద్దరు స్త్రీలను కలిసి మాట్లాడేను. వాళ్ళలో ఒకామె పేరు సుజాత గుడ్రటి ముఖం ఎత్తుగా లావుగా, ధృఢంగా ఉంటుంది. మాట చాలా కరకుగా ఉంటుంది. ఎవరు పలకరించినా ధీటుగా సమాధానం చెబుతుంది. మరొకామె పేరు శశిరేఖ బక్క పలచగా నిదానంగా చక్కగా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నదానిలా ఎప్పుడూ ఉసూరుమంటూ ఉంటుంది. వాళ్ళిద్దర్నీ మిగతా కార్మికులు ఎలా పిలిచినా, వాళ్ళను నేను మాత్రం నేను ʹఅక్కా...అక్కాʹ అనే సంభోధిస్తాను. "అక్కా" అనగానే శశిరేఖ ముఖం వెయ్యి కాంతులతో వెలిగిపోతుంది నేను రోజూ అడగకపోయినా పిలిచి మరి నీళ్ళు, ʹటిʹ ఇచ్చి పోతుంది. సుజాత మాత్రం అలా కాదు. అక్కా ʹటిʹ ఇయ్యవా అంటే...అదేదో బూతు మాటలాగా నా వైపు కొర కొర చూస్తుంది. సమాధానం కూడ చెప్పకుండా వెళ్లిపోతుంది. దగ్గరకు పోయి అడిగితే "మా వాళ్ళందరికీ ఇచ్చినాక మిగిలితే ఇస్తాలే"... సూటిగా, కఠినంగా చెప్పిపోతుంది. ఒక్కొక్కసారి అసలు సమాధానమే ఇవ్వదు. తర్వాత నీళ్ళు, టీ మిగిలితే ఇస్తుంది లేకుంటే లేదు. బహుశా నేను అక్కా అనడం
ఆమెకు నచ్చలేదేమో!

ఒక రోజు నేను లేనప్పుడు మాతో పనిచేసే అతనితో అందట "ఆయనేంది వెటకారంగా "అక్కా, తొక్కా" అంటుంటాడు" అతను నాకు చెప్పగానే ఇద్దరం నవ్వుకున్నాం.

క్వారీల్లో పనిచేసే స్త్రీలను ఎవ్వరూ, అక్కా..అమ్మా... అని పిలవరు. పేర్లు పెట్టి పిలిచేవారు కూడ చాలా అరుదు. అంతా ఏయ్..అనో, ఓయ్...అనో బెదిరింపుగా, దౌర్జన్యంగా పిలుస్తారు. అందుకే అక్కా అనే పదం ఆమెకు వెటకారంగా వినబడింది.

క్వారీలలో ఒక్కో మేనేజరు ఆఫీసుకు విడి విడిగా ఒక పని మనిషి ఉంటుంది. ఆమె వాళ్ళ కంటికి నచ్చేవిధంగా వుండాలి. కొత్త చీరలతో, సొమ్ములు, సోకులు చేసుకురావాలి. పూలు పెట్టుకొని రోజూ క్వారీలో పూజలు చేయాలి. అలా తమకు నచ్చినట్టు ఉండని స్త్రీలను వెంటనే పనిలో నుండి తీసి వేస్తారు. వీళ్ళు ఆఫీసుకు సంబంధించిన వర్కర్లు. అలా ప్రతి క్వారీ ఆఫీసులో నలుగురు స్త్రీలు ఉంటారు.

కొంతమంది స్త్రీలు ఫోర్ మన్ స్ధాయి నుండి దిగువ వారికి ʹటిʹ లు నీళ్ళు అందిస్తారు. పాపం క్వారీ మొత్తం తిరిగి ఇవ్వాలి. ఒక్కోసారి తుంటరి ఫోర్ మన్, మేట్, ఇన్ఛార్జ్ లు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు వస్తున్నారని ముందుగా చూసి, చాలా దూరంగా క్వారీ అంచుల దగ్గరకు వెళ్లి నిలబడతారు. వీళ్ళు చచ్చినట్లు అక్కడకు వెళ్లి ʹటిʹ నీళ్ళు ఇవ్వాలి. అక్కడకు వెళ్లినాక వాళ్ళేదో వెకిలిమాటలు ఏవో మాట్లాడతారు. లైంగికంగా వేదిస్తారు. తిరిగి వస్తూ వీళ్ళు నోట్లో ఎదో గొనుక్కుంటూ జాలి ముఖాలతో వస్తుంటారు. అలా అన్నిటికి సిద్ధపడి, రాజీపడి మహిళా వర్కర్లు తట్టుకోని క్వారీలో పనిచేస్తున్నారు.

కొంతమంది స్త్రీలయితే క్వారీలో మేనేజరుకో, ఫోర్ మన్ కో, క్వారీ ఇన్ఛార్జ్ కో కమిట్ అయ్యి ఉంటారు. అప్పుడు వాళ్ళని ఎవరూ కదిలించరు. మనమీద సార్ కి కంప్లయింట్ చేస్తుందేమో అనే భయం కూడ ఉంటుంది. వాళ్ళు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా వాళ్ళ సార్లు చూసుకుంటారనీ అంటుంటారు. వాళ్ళు గాక వంట దగ్గర మరో నలుగురు ఉంటారు. రకరకాల మనస్తత్వాలు ఉన్నా కార్మికుల పిలుపులకి, చిలిపి చేష్టాలకు మానసికంగా మొద్దుబారి ఉంటారు.

అందుకే నాలాంటి వాళ్ళు ఎవ్వరైనా అక్కా అంటే వాళ్ళకు వెటకారంలాగా కనపడతారు. ఇలాంటి దుఖ్ఖ భరితమైన, అవమానం, లైంగిక వేదింపుల మధ్య వీళ్ళెందుకు పనిచేస్తున్నారో మొదట్లో అర్థం కాలేదు. నీడ పట్టున పని గనుక, క్వారీలో పనిచేయడాని చాలామంది మహిళలు ఇష్టపడతారు. పొలాల్లో కూలికిపోతే పొద్దంతా ఎండలో చాకిరీ చేయాల్సి వస్తుంది . మధ్యాహ్నం అన్నం, రెండు పూటలా "టీ" ఉంటుంది. ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లి, సాయంత్రం నాలుగు గంటలకు రావచ్చు. మిగిలిన కూరలు ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటన్నింటికంటే ముఖ్యం నెల జీతం పదివేలు ఒక్కసారిగా చేతికివస్తాయి. కాసేపు ఎండలో క్వారీలోకి దిగి నీళ్ళు, టి ఇచ్చినా తర్వాత అంతా నీడపట్టున ఉండమే. అందుకే అన్ని అవమానాలను పంటి బిగువున భరిస్తారు కొందరు. మరి కొందరయితే భాధను గుండెల్లో దిగమింగుకుని, ఏమి మాట్లాడకుండా అమాయకంగా, చెవిటివాళ్ళుగా నటిస్తూ తమపై చేసే వెకిలి వ్యాఖ్యానాల్ని పట్టించుకోకుండా,వెళుతూవుంటారు.

ఇలా యజమానులు క్రింద అణిగి,మణిగి లొంగిపోనందుకే 1992 లో చీమకుర్తి క్వారీలో ముగ్గురు దళిత మహిళా హత్యలు జరిగాయని చెప్పుకుంటారు. ఒకే కుంటుబానికి చెందిన యేసుమ్మ, వాళ్ళ మేనత్తలు స్థానిక శిద్దా వాళ్ళ క్వారీలోకి పని మనుషులుగా వెళ్లారట. ఆ క్వారీ ఓనరు. వాళ్ళ స్నేహితులతో కలిసి బాగా తాగి అక్కడే వాళ్ళకు సేవలు చేస్తున్న యేసుమ్మ అనే పదహారేళ్ళ అమ్మాయిని, ఆమె మేనత్త అంజమ్మని బలవంతంగా చెరిచారని, . ఆ అమ్మాయి పెద్దగా అరవడంతో, సమయానికి అటు వచ్చిన మరో మేనత్త రాములమ్మ చూసిందని, ఆమె ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడితే ఏమవుతుందోనని భయంతో, మొత్తం ముగ్గురు మహిళలనూ చంపేసి లోతైన నీళ్ళ గుంటలో పడేశారని చెప్పుకున్నారు. వీళ్ళు ముగ్గురూ నీళ్ళ గుంటలో నిర్జీవంగా ఉన్న సమాచారం గనికాపలాదారు ద్వారా వాళ్ళఇంటికి కబురు అందింది. యేసుమ్మ బంధువైన ఆ వాచ్ మన్ వేంకటేశ్వర్లును యజమానులు తీవ్రంగా కొట్టి బెదిరించడంతో ప్రమాదం శాత్తు నీళ్ళ కుంటలో పడిపోయారని వాళ్ళ బంధువులకు చెప్పాడట.

అప్పుడు చీమకుర్తి మాల, మాదిగ పల్లెల్లోని ఆడ, మగ మొత్తం కదిలి క్వారీల దగ్గరకు వచ్చారు. ఒడ్డున ఉన్న యేసుమ్మ, అంజమ్మ మీద అత్యాచారం జరినట్టు స్పష్టమైన ఆధారాలు కనపడ్డాయి. జాకెట్లు, చీరలు ఊడిపోయాయి. రాములమ్మ ప్రతిఘటించినందుకు రాడ్డుతో బలంగా బాదడంతో చనిపోయింది. ఆమె నీళ్ళగుంటలోనే ఉండిపోయింది.

వీళ్ళ మీద అత్యాచారం చేసి చంపింది తమిళనాడు చెందిన కూలీలని యజమాని వర్గాలు పథకం ప్రకారం ప్రచారం చేశారు. కోపోద్రేకంతో వున్న యువకులు తమిళనాడు చెందిన వాళ్ళను దొరికినోడినల్లా దొరికనట్టు కొట్టారు. తమిళులు పారిపోయేలాగ చేశారు. ఈ ముగ్గురు క్వారీకి తీసుకెళ్ళిన బంధువు బూరగ వేంకటేశ్వర్లు ప్రమాదశాత్తు క్వారీ గుంటలో పడి చనిపోయారని వాగ్మూలం ఇప్పించారు. అదే ఎఫ్.ఐ.ఆర్. అయ్యింది. తర్వాత రోజుకొక పుకారు బయటకు వచ్చింది. హంతకులు శిద్దా వాళ్ళ అనుచరులు అని
పల్లెల్లో యువకులకు తెలిసింది. క్వారీలో వాహనాలు మాల, మాదిగ పల్లెల ఆగ్రహానికి దగ్దమయ్యాయి. వాళ్ళకు ప్రజాసంఘాలు, దళిత, విప్లవ సంఘాల మద్దతు తోడయ్యింది.

హంతకులకు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి, మంత్రి కొణిజేటి రోశయ్య అండదండలు ఉన్నాయని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆరోపణలు చేశాయి. రెండు సంవత్సరాలు ఆందోళనలు జరిగాయి. హంతకులు దొరకలేదు, శిక్షలు పడలేదు.

మృతుల బంధువు బూరగ వెంకటేశ్వర్లు ఇచ్చిన మొదటి వాగ్మూలమే కేసయ్యింది. యజమానులే హంతకులనే రెండవ వాగ్మూలానికి కట్టుబడిన అత్యాచారానికి, హత్యకూ గురైన మహిళల బంధువులు ఎంత పట్టుపట్టినా ఫలించలేదు. హంతకులు ఎవరో తేల్చలేదు. హంతకులకు కోర్టు ద్వారా శిక్షపడలేదు. ప్రజా కోర్టులో శిక్ష తప్పదని బావించిన అనుమానితుడు, హంతకులకు కొమ్ము కాసిన "శిద్దా" వాళ్ళు కొన్నేళ్ళుదాక విదేశాల్లోనే గడిపాడు.

అప్పటి నుండి మాల, మాదిగ స్త్రీలను క్వారీ పనులకు పెట్టుకోవాలంటే భయపడేవారు. పల్లెల్లో యువకులకు ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. కానీ, చీమకుర్తి గ్రానైట్స్ప్ర పంచవ్యాప్తంగా పేరు రావడంతో అనేక రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుండి వచ్చిన ఓనర్లు ఇక్కడ గ్రానైట్స్ మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మాత్రం కాస్త కుల పట్టింపులు లేకుండా మాల, మాదిగ పల్లెల్లోవాళ్ళని తీసుకొనేవారు. అంతే గాకుండా స్త్రీల పట్ల వాళ్ళు మిగతావారికంటే కాస్త గౌరవభావంతో ఉండేవారు.

1997 లో తమిళనాడు నుండి వచ్చిన ఒక యజమాని మానవత్వం నిండిన ఒక మంచి మనిషిని చూశాము. ఆయన కార్మికులందరిపట్ల చాలా ప్రేమతో ఉండేవాడు. అలాగే స్త్రీల పట్ల, గౌరవభావంతో చూసేవాడు. ఆయన చీమకుర్తి గ్రానైట్స్ చరిత్రలోనే మొట్ట మొదట కార్మికుల సంక్షేమం కోరి, గవర్నమెంటు నిబంధలను నూటికి నూరు శాతం అమలు చేశాడనే పేరుంది.

ఆయన క్వారీలో ఒక నడి వయస్సు గల "హనుమాయమ్మ" అనే ఆమె ఉండేది. ఆఫీసు గదులు ఊడ్చడం, ఆఫీసులో వాళ్ళకు నీళ్ళు, ʹటిʹలు అందించడం, భోజనం సమయంలో అందరికి వడ్డించడం ఆమె పని. ఆమె కాస్త అమాయకంగా ఉండేది. అయితే ఆమెను కొందరు అసభ్యంగా ఒసే, తుసే, అని పిలుస్తూ,తిట్టేవాళ్ళు. వయసుతో సంబంధం లేకుండా ఆమెతో సరసాలాడేవాళ్ళు, కొడుకు వయస్సున్నవాళ్లు కూడ ఆమెకు కన్ను గీటేవాళ్ళు. ఒంటరిగా కనబడితే వేయరాని చోట చేతులేసేవారు. ఎవరికి అవకాశం కుదిరితే వాళ్ళు ఆమెపై అత్యాచారం చేసేవారు.

ఆమె అప్పటి వరకు గోలచేసినా కోప్పడినా, ఏడ్చినా, తిట్టినా ఎవ్వరికీ చెప్పకునేదికాదు. ఎందుకంటే ఇలాంటి చోట స్త్రీలు పనిచేయడమే తప్పు. ఇక తప్పదనుకున్నప్పుడు ఇవన్ని భరించాలి. లేదంటే క్వారీ మానేసి వేరే కూలి పనులకు పోవాలి. అందుకే అన్ని ఆలోచించుకునే చేసుకొని, బతుకు తెరువుకై తప్పని పరిస్థితుల్లో ఇక్కడ పనికి ఉంటున్నారు.

అనేక మంది మహిళల మాన ప్రాణాలకు క్వారీలో ఎలాంటి రక్షణా ఉండదు. కానీ సరైన యజమానులున్న చోట కొంత న్యాయం జరుగుతుంది. ఒక రోజు నైటు ఇన్ఛార్జ్ఒ కాయన ఆమె మీద అత్యాచారం చేశాడని ఎవరి ద్వారానో తమిళనాడు నుంచీ వచ్చిన ఓనరుకు తెలిసింది. వెంటనే ఆ వ్యక్తిని
ఉద్యోగం నుండి తీసివేశాడు.

తర్వాత రోజు ఆమెను ఆయన తన ఆఫీసుకి పిలిపించుకొని, "అమ్మా... ఇంతమంది మగాళ్ళు మధ్య నువొక్క దానివి ఎందుకమ్మా! ఇక్కడ మానేసి ఏదైన పనిచూసుకోరాదా!" అని అన్నాడు.

ఆమె బోరున ఏడ్చింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు సారూ... వాళ్ళని ఎట్టా పెంచుకోవాలి సారూ... అని దండం పెడుతూ ఏడ్చింది. అమ్మా... నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేశావు గనుక, నీకు కొంత డబ్బు ఇస్తాను. దానితో నువ్వు ఏదొకటి చేసుకోని బ్రతుకు అన్నాడు. ఆమె కాసేపు ఆలోచన చేసుకొని "పాడిబర్రె" ను కొనుక్కోని మేపుకుంటాసారూ... అంది.

ఒకే...దానికి ఎంత కావాలో చెప్పు అన్నాడు. పదివేలు అవుతది సారూ...అది. వెంటనే మేనేజర్ ని పిలిచి పదిహేను వేలు ఇప్పించాడు ఓనరు. అప్పటి రోజులకు పదిహేను వేలు అంటే ఎక్కువేఆమె కన్నీళ్ళతో దండం పెట్టి వెళ్ళింది.అలా ఆ యజమాని ఆమెతో పాటు ఆ కార్మికుల మనసు గెలుచుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ క్వారీలో ఆడవాళ్ళు లేకుండా చేశాడు.తర్వాత ఆమె పాడిబర్రె కొనుక్కుని కూతురుకు పెళ్లి చేసింది. కొడుకులను కాస్త చదివించుకోగలిగింది.

మొన్నటి దాక నాతోటి వర్కర్లతో పాటు కలసి భోజనం చేస్తూ, మాట్లాడుకొనేవాళ్ళం, ఇప్పుడు ఆఫీసు రూములో కూర్చుని సార్ల ముందు కూర్చుని భోజనం చేయాల్సివచ్చింది. మాకు భోజనం పెట్టే జయమ్మ అని ఒకామెవుంది. ఆమె తెల్లగా, నలబైఏళ్ళలోపు ఉంటుంది. కొత్త చీరలు కట్టి, బాగా అలంకరించుకోని, పూలు పెట్టుకొని వస్తుంది. అందరితో చాలా ధైర్యంగా చాక చక్యంగా మాట్లాడుంది. ఆమెతో మా తోటి సార్లు అతిగా మాట్లాడుతుంటారు. అది డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు. చేతులు పట్టుకుంటారు, పైటలు లాగుతుంటారు. ఎందుకు అలా చేస్తారని కాస్త చనువుతో నవ్వుతూ వాళ్ళని అడిగితే "ఇవన్ని క్వారీ ఫీల్డ్ లో మామూలు సార్!" మీరు పట్టించుకోకూడదు అంటారు.

ఒక రోజు మాటల సందర్భంలో జయమ్మతో మాట్లాడితే వాళ్ళది సొంతూరు కనిగిరి అని, అక్కడ తమకు మంచి ఇల్లు కూడ ఉందని, వాళ్ళాయన తాగుతూ పని చేయకుండ తిరుగుతుంటే, ఎన్నిసార్లు గొడవపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసిన మారలేదని, ఎన్నోసార్లు అలిగి పుట్టింటికి వెళ్ళానని అయినా మారకపోతే, ఎదుగుతున్న పిల్లల కోసం ఆయనతో ఉంటున్నానని, పిల్లల్ని చదివించుకోవడం కోసం కనిగిరిలో అందర్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చామని దిగులుపడుతూ చెప్పింది పాపం. అమ్మా... ఇంటి దగ్గర విషయాలు చెప్పమాకు. ముఖ్యంగా మీ ఆయన త్రాగుబోతు అనే విషయాలు ఇక్కడవారికి తెలిస్తే నిన్ను చులకనగా చూస్తారు. దాన్ని అడ్వాంటేజీగా తీసుకొని నీతో అమర్యాదగా ప్రవర్తిస్తారు. నువు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అని తోచిన సలహా ఏదో ఇచ్చాను. అయినా మా సార్లు ఆమెతో చనువుగా ఉంటారు. అప్పుడప్పుడు ఆమె కోసం వంట గదిలోకి వెళ్తారు.

అయితే కొంత కాలంగా ఒక సమస్య నన్ను పదే పదే ఆవేదనకు గురిచేస్తున్నది. అక్కడ అజమాయిషీ చేసే మా పదిమందిమి ఓకే టేబుల్మీద భోజనం చేస్తాం. అందరికి ఆమె వడ్డిస్తుంది. భోజనం అయ్యాక ఎంగిలి కంచాలు అక్కడే వదిలి బయటకువెళ్ళి చేతులు కడుగుతారు. నేను వారం రోజులు వాళ్ళలాగే చేశాను. అందుకు పశ్చాత్తాప పడుతూ నా ఆత్మీయ మిత్రుడు ఒకనికి ఫోన్ చేశాను. ఆ కమ్యూనిస్టు మిత్రుడు "అలా మనం తిన్న ఎంగిలి కంచం మనం కడగకపోవడం కరెక్ట్కా దు. ఎలాగైన నువ్వే కడుగు" అన్నాడు.

మరుసటి రోజు అలాగే కడిగేందుకు ఎంగిలి కంచంతో బయటకు నడిచాను. ఆమె ʹఅదేంటి సార్ నేను కడుగుతాను అక్కడ పెట్టండిʹ అంది. ఆమె మాటలు వినిపించుకోకుండా నేను నా ఎంగిలి కంచం కడుక్కోని వచ్చాను.మిగిలిన తోటి వారు నా వైపు వింతగా చూసారు. లోపలికొచ్చాక ఆమె ఇలా అంది.

సార్.. నేను మీరొక్కరి కంచం కడగటం లేదుగా వాళ్ళందరివి కడుగుతాను. మీరు మాత్రం ఎందుకు ప్రత్యేకం అంది. నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళమద్య చెప్పలేకపోయాను.

No. of visitors : 203
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


చీమకుర్తి వలస కార్మికుల పోరాటం

శిల్పి | 17.05.2020 10:06:38pm

పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చే నిర్ణయంలో భాగంగా పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారు....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •