జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

| సాహిత్యం | వ్యాసాలు

జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

- | 16.06.2020 06:27:19pm

జూన్ 12, 2020,
గౌరవనీయ రామనాథ్ కోవింద్,
భారత రాష్ట్రపతి గారికి,

గౌరవనీయ శరద్ అరవింద్ బోట్టే,
భారత ప్రధాన న్యాయమూర్తిగారికి,

అంశం : జైళ్ళలో వున్న భారతీయ ప్రజామేధావులు, సామాజికన్యాయ కార్యకర్తల ప్రాణాలను కాపాడండి. మహారాష్ట్ర జైళ్ళలో కోవిద్ -19 ప్రబలిన నేపథ్యంలో అంగవికలుడైన ప్రొఫెసర్ జి.యన్. సాయిబాబాను, 80సం||ల వృద్ధుడు, కవి అయిన వరవరరావును విడుదల చేయాలని విజ్ఞప్తి.

కల్పిత ఆరోపణలపై అరెస్టు కాబడిన ప్రజామేధావులను, సామాజికన్యాయ కార్యకర్తలను విడుదల చేయాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. కిక్కిరిసిన మహారాష్ట్ర జైళ్ళలో వున్న కారణంగా వీళ్ళు కోవిద్-19 మహమ్మారికి లోనయ్యే ప్రమాదం వుంది. భారతీయ ప్రొ॥ జి.యన్.సాయిబాబా సరైన వైద్య సదుపాయంగానీ, చక్రాల కుర్చీగానీ లేకుండా జైల్లో మగ్గుతున్నారు. పోలియో వ్యాధి కారణంగా ఆయనకు తొంభైశాతం అంగవైకల్యం ఏర్పడింది. అయినా, ఆయన నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి అవసరమైన సహాయకుడిని నియమించడానికి జైలు అధికారులు పదేపదే తిరస్కరిస్తున్నారు. ఆయన (గుండె సంబంధమైన వ్యాధి, హైపర్ టెన్షన్, గాల్ బ్లాడర్ లో రాళ్ళు, అప్పుడప్పుడు స్పృహ తప్పడం వంటి) అనేక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నారు. జైలు నిర్బంధంలో వున్నప్పటి నుండీ ఆయన రెండు చేతులూ దాదాపుగా పనిచేయడం లేదు.

కోవిద్-19 మహమ్మారి ప్రబలిన ఈ తరుణంలో జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాస్తవానికి ఆయనకు ఉరిశిక్ష విధించినట్లయింది. సరైన వైద్య చికిత్స పొందడానికి, కరోనా వైరస్ నుండి రక్షణ పొందడానికి వీలుగా ఆయనకు మెడికల్ బెయిల్ ఇచ్చి తక్షణం ప్రొ॥ సాయిబాబాను జైలు నుండి విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని మేం కోరుతున్నాం.

ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆవరణ వెలుపల ప్రొఫెసర్ సాయిబాబాను మే 09, 2014న అపహరించి అరెస్టు చేశారు. భారతదేశంలో నిషేధిత రాజకీయ పార్టీ అయిన మావోయిస్టు పార్టీతో అతనికున్న సంబంధాలను రుజువుపరిచే డాక్యుమెంట్లు, ఉత్తరాలు ఆయనవద్ద వున్నాయని పోలీసులు ఆరోపించారు. అయితే సాయిబాబా పై కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ఈ ఆరోపణకు సంబంధించిగానీ, అతను ʹరాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడుʹ అనే ఆరోపణకు సంబంధించిగానీ స్పష్టమైన సాక్ష్యాలను వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు. ఆయనకు శిక్ష విధించడంపై వ్యాఖ్యానిస్తూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన ప్రకటనలో ఇలా పేర్కొంది. ʹజి.యన్.సాయిబాబాపై మోపబడిన ఆరోపణలు కల్పితాలనీ, ఆయనపై జరిగిన విచారణ అంతర్జాతీయ న్యాయబద్ధమైన విచారణ నియమాలకు అనుగుణంగా లేదనిʹ మేం భావిస్తున్నాం. విచారణ, శిక్ష న్యాయసమ్మతమైనవా, కావా అన్నది పక్కన పెట్టినా, ప్రొ| సాయిబాబా సరైన వైద్య సహాయానికి, మెడికల్ బెయిల్ కు అర్హుడు. అవి పొందే హక్కు ఆయనకున్నది. భారతదేశపు జైళ్ళలో కరోనా వైరస్ కారుచిచ్చులా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఆయనకు విధించబడ్డ యావజ్జీవ శిక్ష మరణ శిక్షగా మారే ప్రమాదం దాపురించింది.

ఆయనకు ఎప్పుడో వచ్చిన పోలియో వ్యాధి కారణంగా కాళ్ళు కదపలేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమై పోయారు. ఈ వైకల్యం వున్నప్పటికీ, ఆయన సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న కార్యకర్త. నిబద్ధతకల మానవ హక్కుల రక్షకుడు. సాయిబాబా, ʹస్థానిక ప్రజా సమూహాలను విస్తాపనకు గురిచేస్తూ ఆయా ప్రాంతాల నుండి వనరులను దోపిడీ చేయడానికి పనిచేస్తున్న దేశీయ, బహుళజాతి కార్పోరేషన్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న, వాటి ప్రజావ్యతిరేక కార్యకలాపాలను పరిశోధిస్తున్న కార్యకర్తలతో ఉద్యమాలతో కలిసి పనిచేసారనిʹ ʹప్రమాదంలో మేధావులుʹ (Scholars at Risk) అనే సంస్థ ఈ మధ్య కాలంలో తయారుచేసిన నివేదికలో పేర్కొంది. ఆయన కార్యకలాపాలు, అణచివేతకు గురైన ప్రజల హక్కుల రక్షణకు ధైర్యంగా కృషి చేస్తున్న కారణంగానే ప్రొ॥ సాయిబాబాను నిర్బంధించారని అరుంధతీ రాయ్ తో సహా అనేకమంది మేధావులు అభిప్రాయపడ్డారు.

దీనికి తోడు ఆయన తన మాతృభాష అయిన తెలుగులో ఉత్తరాలు రాయడానికిగానీ, ఉత్తరాలు అందుకోవడానికి గానీ జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఆయన తల్లి సాయిబాబాను కలవడానికి జైలుకు వస్తే ఆమెకు ఇంగ్లీషు రాదని తెలిసికూడా వాళ్ళు ఆయనతో ఆమె ఇంగ్లీషులోనే మాట్లాడాలని పట్టుపట్టారు. ఇప్పుడామె క్యాన్సర్ తుది దశలో మరణశయ్యమీద వున్నారు. ఆమె కొడుకు వైద్య సహాయం నోచుకోని ఒక రాజకీయ ఖైదీగా జైల్లో మగ్గుతున్నాడు. తాను ప్రేమించే, తనను ప్రేమించే వ్యక్తులతో సంభాషణ నెరపడానికి అవకాశం లేని దుస్థితిలో వున్నాడు.

ఈ మహమ్మారి వ్యాపించిన కాలంలో త‌న‌కు పెరోల్ ఇవ్వాల‌ని ఆయ‌న పెట్టుకున్న విన‌తిని న్యాయ‌స్థానాలు తిర‌స్క‌రించాయి. ఆయనకు బెయిల్ ఇస్తే తన తమ్ముడి ఇంట్లో వుంటాడని, ఆ ప్రాంతం కోవిద్-19 కంటైన్ మెంట్ జోన్లో వుందని వాళ్ళ వాదన. అయితే ఇది నిజం కాదు. ఆయన జైల్లోనే వుంటే కోవిద్-19 బారిన పడే ప్రమాదం తీవ్రంగా వుందనేది ఇంతకంటే వాస్తవం.

ప్రొ॥ సాయిబాబా ప్రస్తుతం జైల్లో వున్నారు. తరచుగా స్పృహ కోల్పోతున్నారు, సహాయం లేకుండా టాయ్ లెట్ కు కూడా వెళ్ళలేని స్థితిలో వున్నారు. ఆయనకు సాయమందించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు సాయిబాబా పట్ల అమలుచేస్తున్న క్రూరవైఖరి మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. జైలు అధికారులు ఆయనకు తగిన వైద్య సహాయాన్ని అందించడంలో తమ అశక్తతను, అయిష్టతను పదేపదే ప్రదర్శిస్తున్న కారణంగానూ, భారతీయ జైళ్ళల్లో కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగానూ ప్రొ| సాయిబాబాను జైలు నుండి తక్షణం విడుదల చేయాలని ఈ కింద సంతకం చేసిన మేం పిలుపునిస్తున్నాం.

80సం||ల వృద్ధుడైన కవి వరవరరావు సుప్రసిద్ధుడైన ప్రజామేధావి. పౌరహక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న సమరశీల కార్యకర్త. గత ఆరు దశాబ్దాలుగా అణగారిన ప్రజల పక్షాన కృత నిశ్చయంతో, నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తి. గత అనేక దశాబ్దాలుగా అనేక తప్పుడు కేసులలో ఇరికించడం ద్వారా ఆయన గొంతు నొక్కివేయడానికి రాజ్యం ప్రయత్నిస్తూ వుంది. గత 45 సం||లలో ఆయనపై 25 తప్పుడు కేసులుమోపారు. విచారణకు ఎదురుచూస్తూ ఆయన దాదాపు ఎనిమిది సంవత్సరాలు జైల్లో వున్నారు. అన్ని కేసులలోనూ విడుదలయ్యారు. నవంబర్ 2018లో వరవరరావును మరోసారి అరెస్టు చేశారు. కుట్రపూరితమైన భీమా కోరెగావ్ కేసును అడ్డం పెట్టుకొని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజామేధావులపై విరుచుకుపడిన సందర్భంలో ఆయనను మళ్ళీ అరెస్టు చేశారు. ఆయన విచారణ కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం మహారాష్ట్రలోని నవీ ముంబయ్ లో తలోజ జైలులో నిర్బంధంలో వున్నారు. పెన్ ఇంటర్నేషనల్ (PEN) లాంటి గుర్తింపు పొందిన సంస్థలతో సహా అంతర్జాతీయంగా అనేకమంది మేధావులు ఆయన విడుదల కోసం విజ్ఞప్తి చేశారు.

18 నెలలపాటు న్యాయస్థానం కస్టడీలో వున్నప్పటికీ ఆయనపై ఎలాంటి చార్జిషీటు దాఖలు కాలేదు. భారతదేశంలో కరోనా వైరస్ అత్యంత తీవ్రంగా వున్న కేంద్రంగా మహారాష్ట్ర గుర్తించబడింది. దీన్ని ప్రధానమైన అంశంగా చూడాలి. అంతేగాక ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ముంబై హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో, తలోజ జైలులో ఒక ఖైదీ కోవిద్-19 కారణంగా ఈ మధ్య కాలంలో చనిపోయాడని ప్రభుత్వం కూడా అంగీకరించింది. అనేక శారీరక రుగ్మతలతో బాధపడుతున్న వరవరరావు ఆరోగ్యం కోవిద్-19 నేపథ్యంలో తీవ్ర ఆందోళనకరంగా మారింది.

ఈ మధ్యనే మే 28, 2020నాడు వరవరరావు జైలులో స్పృహ తప్పి పడిపోయి, ఆయనస్థితి విషమంగా మారితే ఆయనను ముంబయిలోని జె.జె ఆస్పత్రిలో చేర్చారు. దీనిపట్ల ప్రభుత్వం తలబిరుసుతనంతో ప్రతిస్పందించింది. ఆయన ఆరోగ్యం కొంత నిలకడగా వుండడానికి అవరసరమైన ప్రాథమిక చికిత్స చేయించిన వెంటనే ఆయన్ను జూన్ 1, 2020న తిరిగి జైలుకు పంపించారు. ఆస్పత్రిలో వున్నప్పుడు ఆయనను కలవడానికి గానీ, ఆయనతో ఫోనులో మాట్లాడడానికి గానీ, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి ఆందోళనకర స్థితిలో ఆయనను బెయిల్ మీద విడుదల చేయాలని కోరుతూ వరవరరావు సహచరి జాతీయ పరిశోధనా సంస్థ (National Investigation Agency) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అయినా విడుదల చేయడానికి కోర్టు నిరాకరించింది. భారత రాజ్యాంగంలోని 21వ నిబంధన ఖైదీలతో సహా పౌరులందరికీ ప్రాణరక్షణ హక్కును గ్యారంటీ చేస్తుందని గుర్తించాలి.

జి.యన్. సాయిబాబా, వరవరరావుల ఆరోగ్య స్థితి క్షీణిస్తున్న అంశాన్ని, జైళ్ళలో కోవిద్-19 ప్రబలిన స్థితిని దృష్టిలో వుంచుకొని, వాళ్ళ ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం వుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. వాళ్ళ జీవించే హక్కును కాపాడడానికి వాళ్ళను తక్షణమే బెయిల్ మీద విడుదల చేయాలని మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.

కృతజ్ఞలతో...

1. నోమ్ ఛామ్ స్కీ (భాషా శాస్త్రవేత్త, అమెరికా) 2. గూగీ వా థీయాంగ్ (ఇంగ్లీష్ ప్రొఫెసర్, అమెరికా) 3. హోమీబాబా (మానవశాస్త్రాల ప్రొఫెసర్, అమెరికా) 4. జుడిత్ బట్లర్ (ప్రొఫెసర్, అమెరికా) 5. జాన్ బెల్లమీ ఫోస్టర్ (సోషియాలజీ ప్రొఫెసర్, అమెరికా) 6. పార్థా ఛటర్జీ (ఆంధ్రపాలజీలో సీనియర్ పరిశోధకుడు, అమెరికా) 7. జేమ్స్ స్కాట్ (రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్, అమెరికా) 8. బార్బారా ఎ. ఫ్రే (మానవహక్కుల ప్రోగ్రామ్ డైరెక్టర్, అమెరికా) 9. గ్యాన్ ప్రకాష్ (చరిత్ర ప్రొఫెసర్, అమెరికా) 10. వాల్డెన్ బెల్లో (సోషియాలజీ ప్రొఫెసర్, అమెరికా) 11. సుదీప్త కవిరాజ్ (ఆఫ్రికన్ అధ్యయనాల ప్రొఫెసర్, అమెరికా) 12. జావేద్ మజీద్ (ఇంగ్లీష్ ప్రొఫెసర్, బ్రిటన్) 13. జాన్ బ్రెమాన్ (ఎమరిటస్ ప్రొఫెసర్, నెదర్లాండ్స్) 14. డెరక్ గ్రెగోరీ (జాగ్రఫీ ప్రొఫెసర్, కెనడా) 15. ముకోమా వా గూగీ (ఇంగ్లీష్ లో అసోసియేట్ ప్రొఫెసర్, అమెరికా) 16. టెడ్ బెంటన్ (సోషియాలజీ ప్రొఫెసర్, బ్రిటన్) 17. రొనాల్డో మంక్ (ప్రొఫెసర్, ఐర్లాండ్) 18. సాంద్రో మెజ్ డ్రా (రాజనీతి సిద్ధాంతంలో అసోసియేట్ ప్రొఫెసర్, ఇటలీ) 19. ప్రియా చాకో (రాజనీతి శాస్త్రంలో సీనియర్ లెక్చరర్, ఆస్ట్రేలియా) 20. గ్రెగ్ ఆల్బో (రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్, కెనడా) 21. రాజు దాస్ (జాగ్రఫీలో ప్రొఫెసర్, కెనడా) 22.కామా మెక్లీన్ (ప్రపంచ చరిత్ర ప్రొఫెసర్, ఆస్ట్రేలియా) 23. మీరా అషక్ (సంస్కృతి, చరిత్ర భాషా శాస్త్రాల డైరెక్టర్, ఆస్ట్రేలియా) 24. హాన్స్ హార్డర్ (ఆధునిక దక్షిణాసియా భాషా విభాగంలో ప్రొఫెసర్, జర్మనీ) 25. ఇంద్రాణీ ఛటర్జీ (చరిత్ర ప్రొఫెసర్, అమెరికా)లతో కలసి మొత్తం 133మంది వివిధ దేశాల, విశ్వవిద్యాలయాల, శాస్త్రాల ప్రొఫెసర్లు, డైరెక్టర్లు, పరిశోధకులు.

No. of visitors : 308
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •