అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం

| సాహిత్యం | వ్యాసాలు

అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం

- పి.వరలక్ష్మి | 16.06.2020 10:45:46pm

కార్పోరేట్ అభివృద్ధికి మనం చెల్లిస్తున్న మూల్యం ఎంత వెలకట్టలేనిదో అస్సాం బాగ్జాన్ విస్ఫోటనం మరో హెచ్చరిక చేసింది. విశాఖ స్టైరిన్ గ్యాస్ లీకేజీ పచ్చి పండుగానే ఉంది. ప్రభుత్వ నష్టపరిహారం, నిపుణుల కమిటీ, హై కోర్టు, సుప్రీం కోర్టు విచారణలు సాంకేతిక విషయాల మాటున అసలు నేరాన్ని పాతిపెట్టే తంతు పూర్తి కానేలేదు. ఎల్.జి. పాలిమర్స్ కన్నా వంద రెట్లు ప్రమాదకరమైన విషాన్ని విసర్జించే పరిశ్రమలు విశాఖ చుట్టూ ఎన్నో ఉన్నాయి. గతంలోనూ ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈ సందర్భంలోనైన వీటి మీద కనీస చర్చ లేదు. ఫార్మా సిటీ రసాయనాల ఘాటు నడుమ ఊపిరి తిరగని ఉత్తరాంధ్ర ఘోష లోకానికి వినపడనే లేదు.

ఈలోగా ఇంకో మూల ఇంకో విస్ఫోటనం. ఈశాన్యాన ప్రకృతి గర్భాన చిచ్చురగిలింది. మే 27న అస్సాం టిన్సుకియా జిల్లా బాగ్జాన్ చమురు బావిలో సహజవాయువు (గ్యాస్) నియంత్రించలేనంతగా ఎగసి వచ్చింది. దీన్ని సాంకేతిక పరిభాషలో బ్లో అవుట్ అంటారు. ఇది అదుపు చేయడం ఏమాత్రంసాధ్యం కాకుండాపోయింది. పది అంతస్తులు ఎత్తు నల్లటి మేఘంలా ఎగిసిన గ్యాస్ సల్ఫర్, పెట్రోల్ కలగలిసిన ఘాటు వాసనతో, కుళ్ళిన గుడ్ల వంటి కంపుతో చుట్టుపక్కల ప్రజల గొంతు నులిమినంత పనిచేసింది. ఉన్నట్టుండి ఊపిరి తీసుకోడానికి కష్టపడాల్సి వచ్చింది. అంతెత్తున పైకి ఎగసిన గ్యాస్ గాలిలోని తేమతో కలిసి బొట్లుబొట్లుగా నూనె జిడ్డులా చట్టుపక్కల చెట్ల మీద, నీటిమీద ఇళ్ళ పైకప్పుల మీద కురిసింది. సుమారు 5 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు ఇలా చమురు కాలుష్యం వ్యాపించింది.
వరి పండించే పొలాలు, టీ తోటలు నాశనమయ్యాయి. జీవాలు, పశువులు చనిపోయాయి. చెరువులు కుంటలు, కాలువల్లో చమురు జిడ్డు చేరి చచ్చిన చేపలు తేలాయి. చర్మం ఊడిపోయిన అరుదైన గంగానది డాల్ఫిన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇట్లా 14 రోజుల పాటు ఘాటైన వాయువు వెలువడుతూ జీవావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చి చివరికి జూన్ 9 న ఒక్కసారిగా అది మంటలంటుకుంది. ఏది జరిగితే అత్యంత ప్రమాదమో అది జరిగిపోయింది. గ్యాస్ లీకేజీ భారీ అగ్నిప్రమాదంగా మారింది. గ్యాస్ లీకేజీని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఇద్దరు దారుణంగా చనిపోయారు. నిజానికి అప్పటికే గ్యాస్ ప్రభావంతో చుట్టుపక్కల ఊర్లు ఖాళీ అయ్యాయి. రెండువేల మందికి పైగా జనాన్ని శిబిరాలకు తరలించారు. అయిదు మంది గ్రామస్తులు చనిపోయారని కూడా స్థానిక పత్రికలు రాశాయి. అయితే ఈ మరణాలు గ్యాస్ లీకేజీ వల్లనే అని ఎలా చెప్పగలమని ఆయిల్ కంపెనీ వాళ్ళు చాలా మామూలుగా కామెంట్ చేస్తున్నారు.
తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలు తమ పంట పొలాల గురించి, పశువుల గురించి బెంగటిల్లి ఉన్నారు. ఇది మాత్రమే కాదు, కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంటున్న సమయంలో కిక్కిరిసిన శిబిరాల్లో ఉండవలసి రావడం వాళ్ళను మరింత భయపెడుతోంది. మంటలు వ్యాపించిన తర్వాత తమ ఇళ్ళు, పొలాలు ఏమయ్యాయోనని సమీప గ్రామాల వాళ్ళు అక్కడి పోయి చూసుకుంటే, ఇంకేముంది? ఏమీ మిగల్లేదు. ఇక ఆందోళన చేస్తున్న ప్రజల్ని అదుపు చేయడానికి పోలీసు బలగాల్ని పంపని కంపెనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని విధాలుగా కంపెనీ రక్షణ విధులను ప్రభుత్వం చేపడుతోంది.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) కంపెనీ 2006 నుండి ఈ ప్రాంతంలో సహజవాయువును వెలికి తీస్తోంది. 3,870 మీటర్ల లోతు నుండి డ్రిల్లింగ్ చేసి రోజుకు 80 వేల చదరపు మీటర్ల ప్రమాణంలో గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ప్రస్తుతం సాధారణ ఉత్పత్తి కన్నా అధిక మొత్తంలో నిల్వలు వెలికితీయడానికి ఎక్కువ పీడన ఉపయోగిస్తున్నారని నిపుణులు అంటున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సే ఉందని కంపెనీ అంటుంది. ఇదే కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తుండిన మరో చమురుబావిలో (దిబ్రుగడ్ జిల్లా దికో వద్ద) 2005లో ఇట్లాగే మంటలు వ్యాపించాయి. అప్పటికి ఆ చమురుబావిలో కార్యకలాపాలు ఆగిపోయి ఉన్నాయి. సెప్టంబర్ నెలలో వ్యాపించిన మంటలు ఎంత ప్రయటించినా 45 రోజుల వరకు అదుపులోకి రాలేదు. ఇటువంటి మంటలు అదుపుచేయడానికి అవసరయ్యే టెక్నాలజీ కంపెనీ వద్ద లేదు. 15 ఏళ్ళు గడిచినా అదే పరిస్థితి. ఇప్పుడు బాగ్జాన్ 5వ నంబర్ చమురుబావిలో ఎగిసిపడుతున్న మంటలు అదుపుచేయడానికి సింగపూర్ నుండి నిపుణుల బృందాన్ని పిలవాల్సి వచ్చింది. ఏమైనా మంటలు ఆర్పడానికి రెండువారాల సమయమైతే పడుతుంది. ఈలోగా పర్యావరణానికి జరిగే నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. జీవావరణం పాడైతే దాన్ని పునర్జీవింపజేయడం దాదాపు సాధ్యం కాదు. అటువంటి ప్రయత్నాలు కూడా అక్కడక్కడా జరుగుతున్నాయి గాని మనదేశంలో అమలవుతున్న అభివృద్ధి విధానానికి పర్యావరణం పట్ల కనీస బాధ్యత లేదు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కూడా దానికి లెక్కలేదు.

బ్లో అవుట్ వల్ల ʹమంగూరి మోటాపంగ్ బీల్ʹ అనబడే తడి నేల శాశ్వతంగా జీవాన్ని కోల్పోయింది. ఇది బ్లో అవుట్ ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. అరుదైన వలస పక్షులు, సరీసృపాలు, చేపలతో, చక్కటి నీటి వనరులతో అద్భుతమైన జీవవైవిద్యం ఉన్న ప్రాంతమిది. వలస పక్షులను చూడ్డానికి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడవన్నీ మాయమైనాయి. పచ్చిక మేయడానికొచ్చే పశువులు ఇక కానరావు. ఈ తడి నేల మాత్రమే కాదు, బ్లో అవుట్ కు ఒక కిలోమీటర్ దూరంలో దిబ్రు సైఖోవా నేషనల్ పార్క్ ఉంది. ప్రభుత్వమే ప్రకటించిన రక్షిత జీవావరణం ఇది. విభిన్న రకాల పశుపక్ష్యాదులు, మొక్కలతో జీవవైవిధ్యం పుష్కలంగా ఉండే ʹహాట్ స్పాట్ʹ గా ఇది ప్రపంచంలోనే పేరుగలది. ఫెరల్ గుర్రాలు ఇక్కడ కనిపించే అరుదైన జాతి. అరుదైన పక్షులు కూడా ఇక్కడ నివాసమున్నాయి. ఇటువంటి జీవావరణాన్ని ధ్వంసం చేయడం అంతర్జాతీయ పర్యావరణ చట్టాల ప్రకారం అతిపెద్ద నేరం.

ఇదిలా ఉండగా బ్లో అవుట్ తర్వాత కురిసిన వర్షంతో చమురు జిడ్డు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రవహించి పర్యావరణానికి మరింత కష్టం కలిగించింది.

భారతదేశ చట్టాలు, పర్యావరణ నిబంధనల ప్రకారం ఇటువంటి జాతీయ ఉద్యానవనాల చుట్టూ మనుషుల నివాసప్రాంతాలు కూడా ఉండకూడదు. కానీ పర్యావరణ శాఖ దీనికి అతి సమీపంలో సహజవాయు నిక్షేపాలు తవ్వుకోడానికి అనుమతినిచ్చింది. బ్లో అవుట్ సంభవించిన చమురు బావి అందులో ఒకటి మాత్రమే. గత నెలలోనే పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఇదే కంపెనీకి దిబ్రు సైఖోవా నేషనల్ పార్క్ చుట్టూ మరిన్ని చమురు నిక్షేపాలు వెలికి తీయడానికి అనుమతులిచ్చింది. స్థానిక ప్రజల అభ్యంతరాలు, ఆందోళనలు వాటిని ఆపలేకపోయాయి.

OIL ప్రభుత్వ రంగ సంస్థ. అయితేనేం, అది ప్రజా భద్రతను, పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసింది. ఇప్పుడీ నేషనల్ పార్క్ లో చమురు జిడ్డు తెట్టలులుగా వ్యాపించి ఉంది. ఇక్కడి పక్షులు, జంతుజాలం చనిపోయినవి పోగా, మిగిలినవి ప్రాణాలు కాపాడుకోను దూరంగా పారిపోయాయి. ఇది మనవాళ్ళ పర్యావరణ పరిరక్షణ.

అస్సాం ప్రజలను ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది. ఈశాన్య రాష్ట్రాల పట్ల ప్రభుత్వాల వైఖరి కూడా ఇప్పుడక్కడ చర్చనీయాంశం అయింది. ఎవరి అవసరాలకోసం అస్సాం మూల్యం చల్లించుకోవాలి అని వారు అడుగుతున్నారు. వారు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే అస్సాంలో చమురు నిల్వలను వెలికి తీయడానికి ప్రభుత్వం విచక్షనారహితంగా అనుమతులిచ్చింది. ʹమేం వ్యాపారాలు చేసుకోడానికి పర్యావరణ చట్టాలు అడ్డమొస్తున్నాయిʹ అని వాణిజ్య సదస్సుల్లో పెట్టుబడిదార్లు అడిగిందే తడవుగా అన్ని నిబంధనలు పక్కన పెట్టి అక్కడి ప్రకృతి సమతుల్యాన్ని ప్రభుత్వమే తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఇక్కడే కాదు ఇవాళ దేశవ్యాప్తంగా కార్పరేట్ పెట్టుబడికి పర్యావరణాన్ని బలి చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఎప్పుడు ఇటువంటి విధ్వంసక కంపెనీలకు అభ్యంతరం తెలిపినా ఇది మీ అభివృద్ధి కోసమేనంటారు. ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్త తీసుకుంటాం అంటారు. తీరా నష్టం జరిగాక ʹఇది ఊహించని ప్రమాదం. దీనికి ఎవరేం చేయగలరుʹ అని కంపెనీ యజమానులతో ప్రభుత్వం గొంతుకలుపుతుంది.

ఇదే అస్సాంలో ఎన్.ఆర్.సి. ప్రయోగం జరగడం, వేలాది మందిని డిటెన్షన్ క్యాంపులకు తరలించడం మనం చూశాం. పాలకుల మతోన్మాద క్రీడల వెనక దారుణమైన దోపిడీ పథకం ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు కార్పోరేట్ పెట్టుబడికి నోరెత్తకుండా కారు చవకగా చాకిరి చేసే జనం కావాలి. ప్రకృతి వనరులపై శాశ్వత అధికారం కావాలి. దాని ఇష్టాలకు ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసే ప్రభుత్వం కావాలి. సరిగ్గా ప్రభుత్వం అలాగే చేస్తోంది. నోరెత్తనీయని నిర్బంధం, తలచుకుంటే పౌరసత్వం కూడా రద్దు చేసే చట్టాలు, ప్రజల్ని విభజించే మతోన్మాద జాతీయవాదం –వీటి వెనక ప్రజల శ్రమను, ఉమ్మడి సంపదను దోచేసే వ్యూహం ఉందని గ్రహించాలి. ప్రకృతిని నష్టపోతే మాత్రం దాన్ని భవిష్యత్ తరాలు కూడా తిరిగి తెచ్చుకోలేవని గుర్తించాలి. నేడు పౌర ప్రజాస్వామిక హక్కులన్నీ కోల్పోతున్న రాజకీయ అత్యాయక స్థితినే కాదు, పర్యావరణ అత్యాయక స్థితిని (ఎమర్జెన్సీ) కూడా మనం గుర్తించాలి.

No. of visitors : 175
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •