హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష

| సాహిత్యం | స‌మీక్ష‌లు

హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష

- మా సత్యం | 16.06.2020 10:53:22pm

ప్రొఫెసర్ సాయిబాబా నాగపూర్ జైలు అండా సెల్ నుండి యుద్ధ కవిగా ఆవిర్భవించిన యోధుడు, హ్యాపీ వారియర్. ఒక భీతావహమైన వర్తమానం సవాలు చేస్తున్న క్లిష్ట పరిస్థితులలో నిశ్చితమైన దృక్పథంతో ఆయన నుండి రచన వెలువడిన క్రమాన్ని వివరించడానికి ముందు వారి అరెస్టు వెనక భారత పాలకుల కుట్ర మూలాల గురించి చెప్పాలి. 1926లో కేంద్ర శాసన సభ లో బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు కమ్యూనిస్టుల అణచివేతలకై ʹప్రజా భద్రత చట్టాన్నిʹ ప్రవేశపెట్టినప్పుడు స్వాతంత్ర సమరయోధుడు, ఉగ్రజాతీయవాదిగా పేరుపొందిన లాలాలజపతిరాయ్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అన్న మాటలు ఈ సందర్భానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ʹవిప్లవోద్యమం ఉంది అంటే ఆ దేశ ప్రభుత్వ విధానంలో ఏదో పెద్ద లోపం ఉంది అన్నమాట. అటువంటప్పుడే ప్రజలు విప్లవ పద్ధతులకు దిగుతారు. వీరులైన కమ్యూనిస్టు దేశభక్తులు క్షమాభిక్ష కోరాలనడం వారిని అవమానించినట్లే అవుతుంది. బోల్షివిజం వల్ల కాని (bolshevism) కమ్యూనిజం (communism) వల్ల కానీ మనకేమి బెడద లేదు. మనకు ముప్పుగా తయారయింది స్వప్రయోజన కారులైన పెట్టుబడిదారులు.ʹʹ లాలా లజపతి రాయ్ అన్న మాటలు నేటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజల పైన అణచివేత, భారత సర్వోన్నత న్యాయస్థానంపైనా ఆధిపత్యం స్వాతంత్రానంతర భారతదేశ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ఉంది.

ప్రధాని మిత్రద్వయం అనేక నూతన నిర్బంధ రూపాల్లో ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణగదొక్కుతున్నారు. బ్రిటిష్ పాలన నాటి చట్టాలతో ʹఆంతరంగిక దేశ భద్రతʹ పేరుతో, హిందుత్వ తీవ్రవాదంతో తమ అభద్రతను, పిరికితనాన్ని తమ పాలనలోని దుర్మార్గం ద్వారా చూపుతున్నారు. ఐపీసీ 1860 నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక చట్టం)తో పాటు సెక్షన్ 120 బి 124 ఎ కింద ప్రజా ఉద్యమకారులపై మేధావుల పై కేసులు నమోదు చేస్తూ తమ పాలన కొనసాగిస్తున్నారు. 1967లో సామ్రాజ్యవాద దేశాల ఆజ్ఞలకు తలవొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నేర్పుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఎపిఎ (uapa) 1967 (37 ఆఫ్ 1967) లో పార్లమెంట్ సభ్యులు వారి యొక్క అవినీతి ,అక్రమాలను రాజ్యహింసను కాపాడుకోవడానికి చాలా అత్యవసరంగా సెక్షన్ 153ఎ 153 బి, భారతీయ శిక్షాస్మృతిలోని కోడ్ (45 ఆఫ్ 1860) చట్టాన్ని, వలస పాలకుల చట్ట మూలాలను మార్పులు చేయకుండా మక్కీకి మక్కీగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నాటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ కొంత గడువు అడిగినప్పటికీ లెక్కచేయక 30-12-1967 లో ఆమోదముద్ర వేయించి సెక్షన్ 120 ఎ 120 బి సెక్షన్లు 13 18 20 38 39 తో అనుసంధానం చేశారు.
నేడు బిజెపి ప్రభుత్వం దానిని మరింత దుర్మార్గంగా అమలు చేస్తోంది. ప్రొఫెసర్ సాయిబాబా ఉద్యమ నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. 1994లో ఆలిండియా పీపుల్స్ రెసిస్టన్స్ ఫోరం (ఏఐపీఆర్ ఎఫ్) స్థాపించి దానికి కార్యదర్శిగా 1996 దాకా ఉన్నారు. 2005లో అతను రెవల్యుషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ (ఆర్ డి ఎఫ్) లో చేరాడు. ఇంగ్లాండ్, హాలండ్, జర్మనీ బ్రెజిల్, అమెరికా మరియు హాంకాంగ్ దేశాల్లో పర్యటించారు. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఛత్తీస్ ఘడ్ లోని సల్వాజుడుంకు వ్యతిరేఖంగా మానవహక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా సాయి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని నిర్మించిన క్రమంలో 2013 నుంచి కేసు ప్రారంభమైంది. మొదటిసారి మే 9 -2014 లో అరెస్టు చేశారు. జూన్ 2015 లో బాంబే హైకోర్టు అతనికి వైద్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేసింది. జూలై 2015 లో విడుదల అయ్యాడు. డిసెంబర్లో మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు వెళ్లిన తర్వాత తిరిగి సుప్రీంకోర్టు ఆర్డర్ తో 2016 ఏప్రిల్ లో విడుదలయ్యాడు. మళ్లీ 7-3- 2017 లో సాయిని అరెస్ట్ చేసి నాగపూర్ అండా సెల్ జైల్లో నిర్బంధించారు.

ఆయనతోపాటు ప్రశాంత్ రాహి (జర్నలిస్ట్) పాండు, మహేష్, విజయ్ టిర్కీ, (ఆదివాసులు) హేమ్ మిశ్రా (జేఎన్యూ పరిశోధక విద్యార్థి) -వీరందరిని నిర్బంధించారు. భారతదేశంపై యుద్ధం చేయడానికి కుట్రపన్నారని నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, ఆర్ డి ఎఫ్ లో సభ్యులని, ప్రభుత్వాన్ని కూల్చడానికి రహస్య కుట్ర చేశారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ- ఊపా) కింద కేసు నమోదు చేశారు.
గడ్చిరోలి సెషన్స్ జడ్జి సూర్య కాంత్ షిండే సామ్రాజ్యవాద దృష్టితో ఆలోచిస్తూ ఇచ్చిన 827 పేజీల తీర్పులో సత్యాన్వేషణ, చారిత్రక దృష్టి లోపించాయి. ఏదైనా విప్లవభావాలు గల వ్యక్తుల గురించి అవగాహన చేసుకోవాలంటే, శిక్ష అమలు చేయాలంటే ముందుగా వారు నమ్ముకున్న సిద్ధాంతంతో కనీస పరిచయం కలిగి ఉండడం ఎంతైనా అవసరం.
ఇటలీ నియంత ముస్సోలిని కాలములో, ఇటలీ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడైన గ్రామ్స్కీ పై జరిగిన కోర్టు విచారణలో న్యాయమూర్తి అన్న మాటలు, ʹమేము ఈ మెదడు ఇరవై సంవత్సరాలు పని చేయకుండా నిరోధించాలిʹ. (The prison note book) నాటి ఇటలీ న్యాయమూర్తిలో ఎక్కడో కొంత మానవత్వం దాగి ఉండటం వల్ల గ్రామ్స్కీ కొన్ని సంవత్సరాల శిక్షతో బయటపడ్డారు. కానీ సాయిబాబా కేసులో గడ్చిరోలి సెషన్స్ జడ్జి గారి అనాగరిక తీర్పు వల్ల ఏకంగా యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యాడు. ʹమరణశిక్ష వేయాల్సింది కానీ నాకు ʹజీవిత శిక్షʹ వేసే అధికారం మాత్రమే ఉన్నందుకు చాలా విచారిస్తున్న అని క్రూరంగా వ్యాఖ్యానించాడు.

బ్రిస్టల్ ఎన్నికల సందర్భంలో 1780 లో Edumund Burke అన్న మాట ʹBad laws are the worst sort of Tyrannyʹ నాగపూర్ సెషన్ జడ్జి గారి తీర్పు కి అద్దం పడుతుంది. 1919లో గాంధీ గారు న్యాయస్థానాల్లోని తీర్పు పట్ల ఎంతో ఆవేదనతో ʹకోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే సాక్షాలలో అబద్ధం అత్యంత శక్తివంతమైనదిʹ అన్నారు. (The role of Central legislative in the freedom struggle) మేధావుల పట్ల, విప్లవ కవుల పట్ల, భారత న్యాయస్థానాల మానసిక స్థితిని, ముఖ్యంగా గడ్చిరోలి సెషన్స్ జడ్జి మానసిక స్థితిని పరిశీలించినట్లయితే ఫాసిస్ట్ పాలకులలో నిక్షిప్తమైన మానసిక దౌర్బల్యం, జాత్యహంకార దృక్పథం (Xenophobia) నియో ఫాసిజం రూపంలో మార్క్సిజం, కమ్యూనిజం, సోషలిజం పట్ల తీవ్ర ద్వేషం కనపడతాయి. న్యాయస్థానాలు నియంతృత్వ పాలనకు చట్టపరమైన పునాది ఏర్పరుస్తున్నాయి. సత్యశోధన విస్మరించి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్లో దశాబ్దాలుగా పాలకుల్లో దాగిఉన్న ఆందోళనతో కూడిన కంపరం, భయం కనపడుతున్నది.
అంతర్జాతీయ కమ్యూనిస్టు కవుల జీవితాలు, అరెస్టులు, వారిపై మోపబడిన కుట్ర కేసులను పరిశీలించినట్లయితే వాళ్ల జీవితాలతో మన భారత విప్లవ కవులు విప్లవకారుల జీవితాలకి చాలా దగ్గరగా పోలికలున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించిన భారత ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులైన అహ్మద్ అలీ సజ్జాద్ జహిర్, అహ్మద్ నదీం ఖాస్మి, మౌలానా హస్రత్ మోహాని, అలీ సర్దార్ జాఫ్రీ క్రూరమైన జైలు శిక్ష అనుభవించారు. అలాగే అంతర్జాతీయంగా తత్వవేత్త వాల్తేర్. క్యూబన్ విప్లవ కవి సీజన్ జోస్ మరియా, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వెలుగులో ఫిలిప్పీన్స్ పీడిత ప్రజల విముక్తికై పోరాటం చేశారు, ఒంటరి నిర్బంధం అనుభవించారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ , నాజిం హిక్మత్, దార్విష్ -వీళ్ళందరూ రాజద్రోహం, కుట్ర కేసులతో శిక్షలు అనుభవించినట్లుగానే నేడు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావు, వారి సహచరులు కుట్రపూరిత ఆరోపణలతో శిక్ష అనుభవిస్తున్నారు.

సాయి అంతర్జాతీయ దృక్పథాన్ని కలిగి ఉన్నకవి. నలువైపులా వ్యాపించి ఉన్న క్రూరత్వాన్ని కవి /రచయిత కళారంగంలో ఉన్న ఎవరు కూడా చూస్తూ తటస్థంగా ఉండలేరు. 1930 లలో ప్రపంచం రెండు విరుద్ధమైన ధోరణుల మధ్య -ఒకటి ఫాసిస్టు రెండు కమ్యూనిస్టు –ఘర్షణపూరితంగా ఉన్నప్పుడు, ఏకైక చారిత్రక అవసరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు మేధావులు కమ్యూనిస్టుల వైపు తమ మద్దతు, సంఘీభావం చూపిస్తూ నిలబడ్డారు. ప్రత్యక్షంగా యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఈనాడు మరో భిన్న సన్నివేశంలో మనందరికీ అటువంటి పరీక్షా సమయం వచ్చింది.

ఇక సాయిబాబా కవిత్వంలోకి వద్దాం.
నేను చావును నిరాకరిస్తున్నానుʹ ( అనువాదం: వరవరరావు) కవిత తాత్విక మూలాల అర్థాన్ని తరిచి చూస్తే కవిగా కావ్యానికి పేరు నిర్ణయం చేయడంలోనే ఒక తీవ్రత కనిపిస్తుంది. సత్యాన్వేషణ, విప్లవ ఆచరణతో నేలతల్లి పీడన విడే దాకా ʹఆశయంʹ పట్ల ఉన్న నిబద్ధత వ్యక్తమవుతోంది. మావో అన్నట్లు ʹసాహిత్యానికి మూలకందం మానవాళిపై ప్రేమ.ʹ
వస్తువును, భాష, ప్రతీకలు సామాజిక చైతన్య అనుభవం యొక్క సూక్ష్మరూపాలు. విప్లవోద్యమాలతో ఏకీభావం ప్రకటిస్తూ పాలకవర్గ కుట్రలకు, రాజ్య హింసకు వ్యతిరేకంగా, నియో- ఫాసిస్టు అసంబద్ధమైన జాత్యహంకార విషరూపాన్ని, కార్పొరేట్ నియంతృత్వాన్ని ప్రతిఘటిస్తూ కవిగా ధిక్కరణ సందేశాన్నిచ్చారు సాయిబాబా. ఈ కవిత్వం అంతా కూడా ప్రపంచాన్ని తాత్వికంగా అన్వేషిస్తుంది. ఈ అన్వేషణ విభిన్న వ్యాఖ్యానాలతో, ప్రశ్నలతో ఉంటుంది. ఇది ఒక మేధో మేలుకొలుపు. అంతర్గత నమ్మకాలతో పాటు శక్తివంతమైన అంతర్లీన సందేశాన్ని తెలియజేస్తుంది. కవిత్వంలో కొత్త సంభాషణ రూపాలతో తన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడనే విషయం పాఠకులకు తోచదు.

అంతర్జాతీయ దృక్పథం, శక్తివంతమైన కవిత్వ భాష, లయ (rhythm), సౌందర్యం తన ఆంగ్ల కవిత్వంలో కనిపిస్తాయి. ఆయన కవిత్వంలో గతాన్ని భవిష్యత్తును, గతితార్కికంగా లింక్ చేస్తాడు. ఆంగ్లంలో రాసిన 35 కవితలు ఆంగ్ల/ తెలుగు సాహిత్యం మీద విస్తృతమైన ప్రభావాన్ని చూపగలవు. ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ పేరుతో ఆయన ఇంగ్లీష్ కవిత్వాన్ని తెలుగులోకి అనువాదం చేసిన కవులంతా పేరొందిన కవులే. పాఠక హృదయాన్ని తెలిసిన అనువాదకులు. సాయి కవిత్వ హృదయాన్ని ఆవిష్కరించారు. ఇంగ్లీషు కవితల మూల అర్థం పాడవకుండా, మూలమేదో అనువాదమేదో చదివే పాఠకులు పోల్చుకోలేనంతగా అనువదించారు. నిజానికి అనువాద ప్రక్రియ చాలా కష్టమైంది.

అనువాద కవుల్లో ఒక్కొక్కరిదీ ఒక ప్రత్యేకమైన శైలి. మృదు మధుర గంభీర భాష సంపద కనపడుతుంది. అర్థ స్ఫూర్తి, భావ శిల్పం, లయ, పద ప్రయోగం, పద శిల్పం, శబ్ద ప్రయోగం మొదలు సమగ్ర కవితా నిర్వహణలో అనువాద కవుల్లోని ప్రతిభ కవిత్వంలో ఎంతో భావ అనుభూతి కలిగిస్తూ ఆవేదన, ఆనందం, ఆలోచన ఆవేశంతో ఉత్తేజితమవుతాము.

అనువాద కవులు/ కవయిత్రులు అనువదించిన కవితలలో భాషను మించిన భావం, అర్థం, గుర్రము ఒక వేగముతో పరుగుతున్నప్పుడు ఆ పరుగులో గిట్టల చప్పుడులో కూడా, అపశృతి ఎట్లయితే వినిపించరాదో, అట్లా అనువాద కవితలన్నింటిలో కూడా ఒక వేగముతో భాష, భావము పరుగు కనిపిస్తుంది. కాడికి కట్టిన జోడెద్దులు ఒకే రీతిగా అడుగులు వేసినట్లుగా అనువాదకుల కవితల్లో లయ తప్పలేదు. కవిత్వం అంతా కూడా పక్షి పాటకు మల్లె సహజమైంది. అనువాదకులకు కవి ఆలోచనతో ప్రత్యక్ష ప్రవేశం ఉన్నందున అవి అంతే కళాత్మకంగా రూపాంతరం చెందాయి.

సాయిబాబా వాడిన కవిత్వ భాషలో వస్తువు, శైలి, పొయెటిక్ రిథమ్ బావోద్వేగ ఉద్రిక్తతను కలిగిస్తుంది. కవిత్వ ధ్వని ప్రతిధ్వనించడానికి పదునైన పదప్రయోగం చేస్తాడు. ఆయన కవితా నిర్మాణం కవితా పద్ధతులూ భాష, పారడాక్స్ తో మెటాఫిజికల్ గా వర్తింపచేస్తాడు. జీవితఖైదీగా ఉన్నప్పటికీ వారి అంతర్జ్వాలను ఎవర్పాగలరు? వారి జీవితం ప్రజలను విముక్తి చేయడానికి అంకితం చేయబడింది. ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ
అన్న శీర్షిక చూడగానే పూర్వపు ప్రసిద్ధ మెటాఫిజికల్ ఆంగ్ల కవి జాన్ డోన్ 1609 లో రాసిన డెత్ బి నాట్ ప్రౌడ్ (death be not proud) జ్ఞాపకం వస్తోంది. వారి నుంచి ఎన్నో భావాలు, ఎన్నో టెక్నిక్స్ తీసుకున్నట్లు కనబడుతుంది. జాన్ డోన్ మానవాళి కోసం యేసు క్రీస్తు తన ప్రేమతత్వంతో జీవితాన్ని, ప్రాణాలని అర్పించిన వాస్తవికతను తన కవితలో చర్చిస్తాడు. జాన్ డోన్ ప్రభావం సాయి పై చాలా గాఢంగా ఉంది. 1821లో P.B.Shelly చేసిన ప్రసిద్ధ వ్యాఖ్య గుర్తుకొస్తోంది ʹPoets are the unacknowledged legislators of the world.ʹ యొక్క అర్థ ఛాయలు కవిత్వంలో అంతర్లీనంగా కనబడుతాయి. ఒక నిశ్శబ్ద సరస్సులో ఒక భారీ రాయి పడిపోయినట్లుగా ఇది చాలా దూరతీరాలకు భంగం కలిగించే తరంగాలుగా, ప్రజలలో నిద్రాణమైన మానవ శక్తి విప్లవంద్వారా సమాజంలోని అత్యంత అణగారిన పొరలలో స్వేచ్ఛ యొక్క కొత్త అర్థస్ఫూర్తిని రేకెత్తిస్తుంది. గతితార్కిక చారిత్రక భౌతికవాదంతో కవిత్వాన్ని జైలు నిర్బంధము నుంచి తన ప్రజలతో ప్రత్యకంగా మాట్లాడడానికి ప్రయోగించాడు. ఇది ఒక నూతన ప్రయోగం. ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించిందో
ఆ ప్రయోజనాన్ని అది సాధించినట్లుగా కనబడుతోంది. ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం నిజమైన స్వతంత్ర భారత నిర్మాణం కోసం, అండాసెల్ నిర్బంధం నుంచి ఒక ఆంగ్ల కవిగా ప్రతిబంధం ఎదిరించి, ఝంఝా సమీరమై ప్రపంచ సాహిత్యంలోకి ప్రవేశించారు. ఆయన కవిత్వం ఒక ప్రత్యేక శైలితో, పద విన్యాసాలతో విప్లవ భావావేశం కలిగిస్తు ఆధునిక కవితా లోకములో కొత్త వెలుగుతో విశిష్టస్థానం ఏర్పరచుకుంది.

శ్రీశ్రీ కవిత గుర్తు చేసుకుంటూ...
ʹరావోయి !నవక వి!
నిజంగా
ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే
నీ సందేశం కోసం విశ్వం
తన చాతక వదనం తెరుచుకున్నది!...
నువ్వు రావాలి! రావాలి!"
సాయి కవిత్వంలో సృజనాత్మకత, సింబాలిజం, ఆగ్రహం పీడిత ప్రజల పట్ల ఆవేదన ఉన్నాయి. ప్రకృతిని, ప్రపంచ చరిత్రను మన ఎదుట ఎంతో స్వభావసిద్ధంగా చూపిస్తారు. ప్రతి నియమాన్ని ప్రశ్నించే ధీరత్వం చూపుతాడు. సామాజిక మార్పుకోసం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజంను తన వ్యక్తిత్వంగా చేసుకున్న హ్యాపీ వారియర్ కవి. రా.రా అన్నట్లు ʹశిల్పగతమైన శక్తులు యెన్ని వున్నాకవికి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చేవి అతని విశ్వాసాలూ అభిప్రాయాలే.ʹ (సంవేదన పత్రిక)

పాణిగారు సాయి కవిత్వానికి ముందు మాటలో "ఆధునిక తెలుగు కవిత్వపు స్థాయిని సాయి చాలా పైకి తీసుకెళ్లారు. మానవ అనుభవంలోంచి, మనిషి అంతఃసారంలోంచి, చారిత్రక సమయ సందర్భాల్లోంచి కవిత్వంగా మారగలదాన్నంతా సాయి కవితామయం చేశారు. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చుʹ అంటాడు.

రాజ్యం సాయిని తన కుటుంబం నుంచే కాదు ఏకంగా నేలతల్లి నుండి వేరు చేసింది. ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ (అనువాదం: వివి) కవిత పాలకుల శక్తికి వ్యతిరేకంగా ఒక గొప్ప వాదనను ప్రదర్శిస్తుంది.

తన విశ్వాసం సైద్ధాంతిక నిబద్ధత ముందు రాజ్యం యొక్క శక్తిహీనతను గురించి ఇలా అంటున్నారు.

ʹనేనింకా మొండిగా చావడానికి ససేమిరా అన్నాను
విషాదం మేమిటంటే
నేను చనిపోయేలా ఏంచేయాలో
వాళ్లకు తెలియడం లేదు,
ఎందుకంటే
నాకు మొలకెత్తే గడ్డి సవ్వడులు
చాలా ఇష్టంʹ
మొలకెత్తే గడ్డి పరక ప్రతీక వర్గ చైతన్యాన్ని సూచిస్తుంది. గడ్డిపూల సవ్వడి సామూహిక శక్తికి ప్రతీక. అతి సామాన్యంగా కనిపించే గడ్డిపువ్వు, గడ్డిపరక మనోహరంగా కనిపించడమే కాదు, కవి వాడిన సింబాలిజం వల్ల శక్తివంతంగా కనిపిస్తుంది. ప్రకృతితో ఆనందం పొందుతూ గడ్డి పూల సవ్వడి నుండి ఉత్తేజాన్ని ప్రేమను పెంచుకుంటూ తన గమ్యం చాలా చాలా దూరం ఉన్నప్పటికీ విప్లవం మాత్రం రోజురోజుకు గాఢతరం అవుతన్న నేపథ్యంలో పోరాటమే ఏకైక మార్గమని గ్రహించి రాజ్యానికి వ్యతిరేకంగా చావుని (చావుకు ప్రతీక రాజ్యం) /పాలకులను హెచ్చరిస్తాడు. చావు వాస్తవంగా భయపెడుతుంది. సాయి చావును భిన్నంగా చూస్తాడు. అతను దాని గురించి జాలిపడి తనదైన శైలిలో తాత్విక కోణంలో దానిని జయిస్తాడు.

ʹజైలంటేʹ కవితలో (అనువాదం: పి.వరలక్ష్మి) ʹమిత్రమా అది ఎతైయిన న్యాయ పీఠాలపైన అబద్ధాల సమూహంʹ అంటాడు. న్యాయస్థానాలు ఎంత పేలవమైనవో తేల్చేస్తాడు. బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు 1818లో భారతదేశంలో న్యాయస్థానాల ఏర్పాటు దగ్గర నుంచి నేటి వరకు భారత సర్వోన్నత న్యాయస్థానల తీర్పులు అనుమానాస్పదంగానే ఉన్నాయి.

ʹనా ఒంటరి జైలుగదిని జయించిన నీ ఉత్తరాలుʹ (అను: డాక్టర్ గీతాంజలి) కవితలో తన సహచరి వసంత రాసిన ఉత్తరాల గురించి తన సున్నిత హృదయంతో ఎంతో కవితాత్మకంగా ఇలా అంటున్నాడు.
ʹప్రియతమా
ఈ బందిఖానాలోని శిక్షను
నీ ప్రేమలేఖల్లో
నన్ను నేను ముంచుకోవడం ద్వారా జయిస్తానుʹ అంటాడు.
ఎంతో దృఢ సంకల్పబలం ఉంటే తప్ప అంత శక్తివంతమైన వ్యక్తీకరణ సాధ్యపడదు.

సాయిబాబా తన ఆంగ్ల కవిత్వంలో అనేక రకాల అలంకారిక భాషా రూపకాలను (మెటాఫర్) ఉపయోగించాడు. నైరూప్య (abstracts) భావనలతో, వ్యంగ్య సాహిత్య అర్థాలతో ప్రయోగాలు చేసాడు.
ʹభయానక శూన్యం లోలోపలʹ (అనువాదం: రివేరా) అన్న కవితలో
ʹతత్వశాస్త్రాలు విఫలమయ్యాయి
అర్థశాస్త్రాలు కూలిపోయాయి
విద్వేషమే అంతటా వెలిగిపోతోంది
అప్పుడే జీవం దాల్చుతోన్న కీటకాలను
ఉక్కు పాదం కింద నలిపివేస్తున్న
చప్పుడు మూగగా మూలిగే నాగరికతల్లో వినపడదు.ʹ
ప్రతి అక్షరం వెనుక రక్తపు ఆటు పోటుతో కూడిన గుండె సవ్వడి వినిపిస్తుంది. ఉద్వేగభరితమైన భావంతో అణచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటించమని అంతర్లీనంగా తెలియజేస్తుంది.

మరొక కవిత ʹఅమ్మ నాకోసం దుఃఖించకుʹ (అనువాదం: వివి)
ʹప్రియమైన అమ్మ
జైలు నాకు మరణం కాదు
పునర్ జననం అని నేను అర్థం చేసుకున్నాను
నేను ఇంటికి తిరిగి వస్తాను
నాకు ఆశను ధైర్యాన్ని ఇచ్చి పోషించిన నీ ఒడిలోకిʹ.
అంటూ అమ్మకి యుద్ధ ఖైదీగా ధైర్యం చెబుతూ తన ఒడిలోకి చేరుతా అంటున్నాడు.
నిజంగా! అమ్మ చూడటానికి వచ్చి చూడలేకపోవడం, అమ్మ మది గాలపు చేపకు మల్లె ఎంత తల్లడిల్లి పోయిందో. తొమ్మిది నెలలు గర్భగోళము నందుమోసి, దుర్భరమైన ప్రసవ వేళలో ప్రాణ సంకటమైన పరిస్థితిని సహించిన అమ్మ, అలసట తెలియని అమ్మ, ఎన్నో కష్ట సుఖాలను అనుభవించి ఆపదల నుండి కాపాడిన అమ్మను తన కొడుకును చూసుకోనివ్వకపోవడం భారత న్యాయవ్యవస్థ బలహీన మానసికతనే వ్యక్తీకరిస్తుంది.

నాగపూర్ అండాసెల్లులో జీవితఖైదుగా ఒంటరిగా ఉన్న భౌతిక స్థితిలో కవిత్వం మోనోలాగ్ రూపంలో ఉద్భవించింది. ఈ క్రియాశీల మోనోలాగ్ లో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి వారి కథనం నిర్బంధాన్ని సవాలు చేస్తుంది. మోనోలాగ్ ఒక పాత్ర యొక్క మనసులో అంతరంగికంగా కదిలే ఆలోచనలు, భావాలు, అనుబంధాలను బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది.

సాయి 90% అంగవైకల్యంతో, విభిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా 90 శాతం ప్రపంచ పీడిత ప్రజల పట్ల దృఢ సంకల్పంతో ఉన్న హ్యాపీ వారియర్, యోధుడు. విలియం వర్డ్స్ వర్త్ 1806లో వ్రాసిన హ్యాపీ వారియర్ గేయంలో "ఒకే లక్ష్యంతో విశ్వాసముతో భయంకరమైన సవాళ్లను అననుకూల వాతావరణాన్ని కూడా ఎదిరిస్తూ, పాలకులకు తలొగ్గక సైనికులకు మల్లె వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణాలను పణంగా పెడుతున్న యోధులు" అంటాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో సమురాయ్ జపానీస్ సైనికులు యుద్ధాలకు ముందు కవితలు రాసేవారు. సాయి పట్ల ప్రపంచ ప్రజలు మేధావులు ఆందోళన చెందుతూ ఉంటే అండా సెల్ నుండి హ్యాపీ వారియర్ గా భరోసా ఇస్తున్నాడు. అసంఖ్యాక శతాబ్దాల ముందు చూపుతో తన సృజన శక్తి ద్వారా సాహిత్యాన్ని కొత్త శిఖరాలపై తీసుకపోతున్నాడు.

నేడు భారత ప్రధాని మిత్రద్వయం బెనిటో ముస్సోలిని సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తూ హిందూ తీవ్రవాదంతో మిలితం చేసుకుని అతనన్నట్లుగానే ʹమాతో విభేదించే వారితో మేము వాదించము. మేము వారిని నాశనం చేస్తాముʹ అంటున్నారు. ʹశాంతి అసంబద్ధం, ఫాసిజం దానిని నమ్మదుʹ అనే ముస్సోలినీ సిద్ధాంతాన్ని తమ నియోఫాసిస్టు ప్రణాళికతో పార్లమెంట్లో ప్రకటించి అమలు చేస్తున్నారు. మెకార్తీయిజంతో పాలన కొనసాగిస్తున్నారు.
ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ అన్న శీర్షికలో ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది. తీవ్రమైన అణచివేత సందర్భంలో ఏమి చేయాలి అంటే మరింత సాహసంతో, త్యాగంతో ముందుకు వెళ్లాలనే సందేశం ఉంది.

No. of visitors : 659
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •