సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?

| సాహిత్యం | వ్యాసాలు

సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?

- అశోక్ కుంబము | 17.06.2020 10:36:11pm

ʹహిమాలయ కవలలు" అని పిలువబడే ఇండియా, చైనాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతూనే వుంది. కవలలే కాని కలిసి సమస్యను పరిష్కారం చేసుకోవడంలో రెండు దేశాలు విఫలమయ్యాయి. ఇంతకి, అసలు సమస్యకు మూలాలు ఎక్కడున్నవి? ఈ సరిహద్దుల చరిత్ర ఏమిటీ? సమస్య ఇంకా ఎందుకు పరిష్కారం కావడం లేదు? రెండు దేశాల మధ్య వివాదం కొనసాగడంలో అమెరికన్, బ్రిటీష్ సామ్రాజ్యవాదం పాత్ర ఎంత? హిందూ మతోన్మాదులు సరిహద్దును అడ్డు పెట్టుకొని ప్రజల్లో యుద్ధాన్మాద భావనలను ఎలా రెచ్చగొడుతున్నారు? ఇవన్నీ అర్థం కావాలంటే సరిహద్దుల చారిత్రక పునాదులు తొవ్వి చూడాల్సిందే.
రెండు దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించుకోవాలంటే కనీసం మూడు ముఖ్యమైన ప్రక్రియలు జరగాలి. మొదటిది, పునర్విభజన (delimitation). అంటే ఒడంబడికల ద్వార సరిహద్దులను రాతపూర్వకంగా నిర్వచించుకోవడం. రెండవది, సరిహద్దులను చిత్రించి వివరించడం (delieanation). సంయుక్త సరిహద్దు సర్వేల ద్వార మ్యాప్ లను తయారుచేయడం. మూడవది, భూమి మీద సరిహద్దులకు సంబంధించిన గుర్తులు పెట్టుకోవడం (demarcation). ఇవన్ని చర్చల ద్వార, సంప్రదింపుల ద్వార జరిగే ప్రక్రియలు. వీటిలో ఇరు పక్షాలకు కొంత లాభం, నష్టం వుంటాయి. కాని, ఇండియా-చైనా సరిహద్దు విషయంలో ఈ ప్రక్రియలు ఏవి ఎప్పుడు కూడ జరగలేదు. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య నిర్వచిత సరిహద్దు (defined border) ఎప్పుడూ లేదు. వున్నదల్లా సహజమైన ఫ్రంటియర్స్ (natural frontiers) మాత్రమె. అంటే ఈ రెండు దేశాల భూభాగం కలిసే మధ్య వుండే విశాల ప్రాంతం. దీనర్థం వివాదం కేవలం విభజన రేఖకు సంబంధించింది కాదు. అది transitory zones కు సంబంధించింది.
చైనా ప్రపంచంలోనే అత్యధికంగా 16 దేశాలతో 22 వేల కిలోమీటర్ల పొడువున సరిహద్దును పంచుకుంటుంది. ప్రతి సరిహద్దు ఏదో వొక వివాదంతో మొదలై అధికంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. కేవలం, రష్యా, వియత్నాం విషయంలో సాయుధ సంఘర్షణ జరిగి చివరికి చర్చల ద్వారా ఒక పరిష్కారానికి వచ్చారు. ఈ రెండు సందర్భాలలో చైనా వివాదాస్పద భూభాగంలో కేవలం సగం వరకే పొందగలిగింది. కాని, ఇండియా-చైనా మధ్య వివాదం దాదాపు డెబ్బై ఏండ్ల కింద మొదలైనప్పుడు ఎలా వుందో, ఇప్పటికి అలాగే వుంది. రెండు దేశాలు తమదని చెప్పుకునే వివాదాస్పద భూభాగంలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే, ఈ సరిహద్దు వివాదం ఎన్నెన్నో మలుపులు తిరిగి చివరికి మొదటికే వచ్చింది. ఆ మలుపుల చరిత్రను అర్థం చేసుకుంటే కాని, ఇప్పుడు కొనసాగుతున్న సరికొత్త డోక్లాం ʹఎపిసోడ్ʹ అర్థం కాదు.
దాదాపు 4 వేల కిలోమీటర్ల పొడువున్న ఇండో-చైనా సరిహద్దును మూడు ప్రాంతాలుగా విభజించారు. 1. పడమరగ కాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతం. 2. మధ్యలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. 3. తూర్పున అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. ముఖ్యంగా తూర్పు, పడమర సరిహద్దులలో వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. వాటి చరిత్రను క్లుప్తంగా పరిశీలిద్దాం.
ముందుగా, పడమర కాశ్మీర్ సరిహద్దుల్లో కొనసాగుతున్న వివాదం చూద్దాం. చైనా తన సరిహద్దును ఇండియాకు కొంత దగ్గరగా వుండే కారకోరం రేంజ్ (పర్వత శ్రేణుల) వరకు చూపిస్తుంటె, ఇండియా కారకోరం దాటి పైన వున్న (అంటే చైనాకు దగ్గరగా వున్న) కున్లున్ పర్వత శ్రేణుల వరకు తన భూభాగ హక్కును ప్రకటిస్తుంది. అంటే, కారకోరం, కున్లున్ శ్రేణుల మధ్య ప్రాంతాన్ని రెండు దేశాలు తమ భూభాగంగా ప్రకటిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని ఇండియా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ రీజియన్లో భాగంగా ప్రకటిస్తూ వస్తుంది. అదే ప్రాంతాన్ని చైనా తన సిన్ జియాంగ్ రీజియన్‌లో భాగంగా ప్రకటించి తన ఆధీనంలో వుంచుకుంది. ఆ ప్రాంతం దాదాపుగ 33 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి వుంటుంది. 16 వేల అడుగుల ఎత్తులో వున్న ఆ ప్రాంతం ఎక్కువ శాతం నివాసానికి కాని, పంటలు పండించడానికి కాని పనికిరాని ఎడారి ప్రాంతం. మిగిలిన భాగమంతా ఎత్తైన పర్వతశ్రేణులతో నిండి వుంటుంది. అక్కడ ఇంత వరకు ఎటువంటి ఆదాయం తెచ్చే సహజ వనరుల నిలువలు వున్నట్లు కూడ బయటపడలేదు. కాకపోతే, చైనాకు మిలటరీ వ్యూహాల పరంగా, టిబెట్ ను చైనా భూబాగంలోని సిన్ జియాంగ్ కలపడానికి అనువుగా వుండే ఏకైక మార్గం. అనాదిగా వాళ్ళు వాడుతున్న దారి అదే.
ఇక చారిత్రిక వివరాల్లోకి చూస్తే కాశ్మీరకు ఉత్తరంలో, ఈశాన్య ఫ్రంటియర్ లో స్పష్టమైన సరిహద్దు ఎప్పుడూ లేదు. కాని, 1846లో కాశ్మీరు బ్రిటీష్ ఆధిపత్యం కిందికి వచ్చినప్పటి నుండి చేసిన మూడు ప్రముఖమైన ప్రయత్నాలు చరిత్రను మరింత గందరగోళపరిచాయి. అనేక అవకాశవాద వాదనలను ముందుకు తెచ్చే వెసులుబాటు కలిగించాయి. ఆ ప్రయత్నా లలో మొదటిది, the Johnson-Ardagh Line, 1897. జారిస్ట్ రష్యా తన రాజ్య విస్తరణ కాంక్షతో అఫ్ఘన్ ఫ్రంటియర్ వైపుగా తన సరిహద్దును ముందుకు జరపడాన్ని పసిగట్టిన బ్రిటీష్ ప్రభుత్వం దానిని కట్టడి చేయడం కోసం కాశ్మీర్ కు ఉత్తరంగా వున్న ప్రాంతాన్ని వీలయినంతగా తన భూభాగంలో భాగంగా చూపించే ప్రయత్నం మొదలు పెట్టింది. అందులో భాగంగానె, 1802 లో మొత్తం బ్రిటిష్ ఇండియాను సర్వే చేయడానికి ఏర్పాటు చేసిన ʹగ్రేట్ ట్రిగొనోమెట్రికల్ సర్వె ʹ అనే ప్రాజెక్ట్ లో పనిచేసే విల్లియం జాన్సన్ అనే సర్వేయర్ 1864లో లడఖ్ ప్రాంతాన్ని సర్వే చేయడానికి కాశ్మీర్ మహారాజు ఆహ్వానంతో వచ్చాడు. ʹకాశ్మీర్ సర్వే"గా పిలువబడే ఈ సర్వేలో అతను ఆక్సైచిన్ ప్రాంతమంతా తిరిగి 1865లో ఒక మ్యాప్ ను తయారుచేసాడు. అందులో ఆ ప్రాంతం మొత్తాన్ని ఇండియా భూభాగంలో కలిపేసి చూపించాడు. అతను సేకరించిన విషయాన్ని మెచ్చుకుంటూనే తమ అనుమతి లేకుండ ʹకారకోరం పాస్ʹ దాటి పోయినందుకు అతనిని బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. మరుసటి సంవత్సరమే అతను తన పదవికి రాజీనామా చేసి, కాశ్మీర్ మహారాజ గంబీర్ సింగ్ పాలనలో గవర్నర్‌గా 1871లో నియమితులయ్యాడు. ఈ నియామకం మూలంగా అతను ఎంతవరకు నిజాయితీగా సర్వే చేశాడు అనే విషయం మీద ఎన్నో అనుమానాలున్నాయి. కాని, జాన్సన్ గీసిన సరిహద్దు రేఖకు స్వల్ప మార్పులు చేర్పులు చేసి, బ్రిటీష్ మిలిటరీ అధికారి సర్ జాన్ అర్ధగ్ 1897లో గీసిన సరిహద్దు రేఖనే the Johnson-Ardagh Line అయ్యింది. దీని ద్వార బ్రిటీష్ ఇండియా మొత్తం ఆక్సై చిన్ పీఠభూమి, దాని చుట్టూ ఉన్న కున్లున్ వంటి పర్వత శ్రేణులను, యార్కండ్ మరియు కారకాష్ నదుల పరివాహక ప్రాంతం పై తన హక్కును ప్రకటించుకుంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ, చారిత్రిక ప్రమాణాలు వాడారో ఎక్కడ ప్రస్తావించిన ఆధారాలు లేవు. ఇప్పటికి ఇండియా the JohnsonArdagh Line ను తన హక్కుకు చారిత్రిక ఆధారంగా చూపుతుంది.
ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న చైనా తన అధికారి హంగ్ చున్ ద్వార బ్రిటిష్ కాన్సులేట్ జనరల్ జార్జ్ మకార్తినీకి తమ దగ్గర వున్న customary borders మ్యాపు 1893లో అందచేసింది. దానికి తన అంగీకారం తెలుపుతూ బ్రిటీష్ ఇండియా అధికారుల పరిశీలనకు పంపాడు. వాళ్ళు బ్రిటీష్ ఇండియా సరిహద్దును కారకోరం రెంజ్ వరకే చూపుతూ ఆ పర్వత శ్రేణుల ఉత్తర ప్రాంతాన్ని, కరకాష్ లోయ ప్రాంతాన్ని, ఆక్సైచిన్ ప్రాంతాన్ని రెండుగా విడదీసి ఇప్పుడు ఇండియా తనదని చెప్పుకుంటున్న దాదపు 18 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాలో కలుపుతు మరో సరికొత్త రేఖతో ఒక నోట్ ను క్లౌడె మక్ డోనాల్డ్స్ ద్వార 1899లో చైనాకి పంపించారు. ఈ సరిహద్దు రేఖనే the Macartney-MacDonald Line అంటారు. ఇది రెండవ ప్రక్రియ. దీనిలో బ్రిటిష్ ఇండియా ముఖ్య ఆలోచన ఏమంటే: ఒకటి కారకోరం పర్వతాలు బ్రిటీష్ ఇండియాకు ఒక సహజ సరిహద్దుగా వుంటాయి, మరొకటి ఆ పర్వతాల అవతల చైనాను ఉంచితె రష్యా ఒకవేళ తన భూభాగం విస్తరించుకుంటూ వస్తే ముందు చైనా భూభాగం దాటి రావాల్సి వస్తుంది. ఈ విధంగా రెండు ప్రయోజనాలు తీరుతాయని భావించింది. కాని, చైనా బ్రిటీష్ ఇండియా పంపిన నోట్ కు ఏవిధంగా కూడ స్పందిచలేదు. ఈ విధంగా బ్రిటీష్ ఇండియా చైనాల మధ్య ఎలాంటి అధికార అంగీకారం జరకుండ సమస్య అలాగే నాన్చుతూ వచ్చింది.
ఇక మూడవ ప్రక్రియ 1914లో గీసిన the MacMahon Line (ఇదే తెలుగు పాఠ్య పుస్తకాలలో ʹమక్ మహన్ రేఖʹగా వుంటుంది). ఇది తూర్పు సరిహద్దులో ఇంతకు ముందు, ఇప్పుడు కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి పునాది. తూర్పున సరిగ్గా నిర్వచించని సరిహద్దు మీద తన పట్టును పదిలం చేసుకోవడం కోసం బ్రిటీష్ ఇండియా 1910 నుండే దృష్టి సారించింది. దానికి 1911లో టిబెట్లో చైనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, చైనాలో విప్లవం ముందుకు సాగుతుండడంతో బలహీనపడుతున్న కొమింటాంగ్ ప్రభుత్వ పరిస్థిని తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం మొదలు పెట్టింది. అందులో భాగమే ఏప్రిల్ 1914లో సిమ్లాలో జరిగిన సమావేశం. దానికి బ్రిటిష్ ఇండియా తరపున విదేశీ వ్యవహారాల కార్యదర్శి హెన్రీ మక్ మహన్, కొమింటాంగ్ చైనా తరపున చెన్ ఇవాన్, టిబెట్ నుండి లాంచెన్ శాత్ర ప్రతినిధులుగా హాజరయ్యారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమంటే, మొత్తం చర్చలలో ఎక్కడ కూడ బ్రిటీష్ ఇండియా టిబెటను స్వతంత్ర దేశంగా పరిగణించలేదు, ప్రకటించలేదు. బ్రిటీష్ ఇండియా లక్ష్యం టిబెటన్ను స్వయం ప్రతిపత్తి కల్గిన దేశం చేయడం కాదు, కేవలం టిబెట్ ను రెండుగా (Inner Tibet మరియు Outer Tibet గా) విడదీసి ఔటర్ టిబెట్ ను బ్రిటీష్ ఇండియాకు, చైనాకు మధ్య ఒక బఫర్ జోన్‌గా ఏర్పాటు చేసుకోవడం. ఔటర్ టిబెట్ ను watershed principle ప్రకారం వీలయినంత వరకు తన భూభాగంలో కలుపుకోవడం. వాటర్ షెడ్ సూత్రమంటే ఒక దేశంలో నదులు, ఉపనదులు ప్రవహిస్తుంటే వాటి మూలాలైన అత్యున్నత పర్వత శ్రేణులు కూడ నదులు ప్రవహించే దేశానికే చెందుతాయి. అంటే, నదులను వాటి పుట్టుక నుండి విడదీసి చూడరాదు, మొత్తం నదీ వ్యవస్థను ఒక యూనిట్ గా చూడాలి అనే సూత్రం. అంతేకాదు, ఈ ప్రాంతంలోనే ఎన్నో నదులు (బ్రహ్మపుత్ర, సింధూ, యెల్లో నది, సల్వీన్, ఇంకా అనేకం) పుట్టి ప్రవహిస్తున్నవి. వీటి మీద తిరుగులేని అధికారం పొందాలంటే హిమాలయ పాదాల వరకు వున్న భూభాగంపై హక్కు కల్గి వుండాలి. దానిని, అమలు చేయడానికి సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి, సిమ్లాలో సమాంతరంగ రెండు సమావేశాలు జరిగాయి. ఒకటి, టిబెట్ విభజనకు సంబంధించి చర్చించడానికి త్రైపాక్షిక సమావేశం. రెండవది, చెన్ ఇవాన్ ను పక్కకు పెట్టి రహస్యంగా ఇండియా-టిబెట్ సరిహద్దు గురించి చర్చించడానికి మరో సమావేశం.
వాస్తవానికి, సిమ్లా సమావేశానికి ముందే మార్చ్ 24-25, 1914 న మక్ మాహన్ మరియు శాత్ర ఇద్దరు డిల్లీలో రహస్య చర్చలు జరిపి టిబెట్ ను ఎట్లా విడదీయాలి, టిబెట్ కు అస్సాంకు మధ్య సరిహద్దును ఎట్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. టిబెట్ ను విడదీసే సరిహద్దు రేఖనే తర్వాత మక్ మాహన్ రేఖ అయ్యింది. ఇదే సమావేశంలో ఒక మ్యాపును కూడ తయారు చేశారు. దానినే సిమ్లా సమావేశంలో చర్చకు పెట్టారు. ఈ సమావేశంలో రెండు ముఖ్యమైన అంశాలు చర్చించారు: ఒకటి, టిబెట్ మీద (చైనా కొనసాగిస్తున్న) విదేశీ పాలన (suzerainty) రెండు, టిబెట్‌ను రెండుగా విడదీయడం. చర్చ కొనసాగించడానికి తాము ముందే తయారు చేసి తీసుకొచ్చిన (మక్ మాహన్ రేఖను చూపించే) మ్యాప్ ను ఏప్రిల్ 27, 1914 సమావేశంలో ప్రతినిధుల ముందు పెట్టారు. ఆ మ్యాప్ లో రెండు లైన్స్ గీసివున్నాయి. ఒకటి ఎరుపు రంగులో, మరొకటి నీలం రంగులో, ఎరుపు రంగు లైన్ టిబెట్ ను ఒక భౌగోళిక, రాజకీయ యూనిట్స్ చూపిస్తుంది. నీలి రంగు లైన్ టిబెటను రెండుగా విడదీసి చూపిస్తుంది.
మక్ మహన్ రేఖతో ఏకమయ్యేల ఔటర్ టిబెట్ లైన్ ను హిమాలయ పర్వత పాదాల వరకు కుదించి అదే టిబెట్ సరిహద్దుగా చూపించారు. కానీ చైనా ఆ సరిహద్దు దాటి ఇంకా కిందికి వున్న అనేక ఆదివాసి ప్రాంతాలను (ముఖ్యంగా తవాంగ్, వలోంగ్ ప్రాంతాలు, లోహిత్ లోయా ప్రాంతం) తన భూభాగంలో భాగమని 1914 ముందు నుండే చూపిస్తూ వస్తుంది. ఇక్కడే సమస్య మొదలయ్యింది. బ్రిటిష్ ఇండియా తన ప్రాంతాన్ని పైకి మక్ మహన్ రేఖ వరకు (అంటే హిమాలయ పర్వత పాదాల వరకు) చూపిస్తుంది. చైనా తన సరిహద్దును కిందికి తవాంగను దాటి చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య 90 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఇండియాలో భాగంగా వున్న నార్త్ ఈస్ట్రన్ ఫ్రంటియర్ ఏజన్సీ (ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్. దీనినే చైనా దక్షిణ టిబెట్ అని అంటుంది) ఈ వివాదాస్పద ప్రాంతంలోనే ఉన్నది. అయితే, సిమ్లా ఒప్పందాన్ని చైనా ప్రతినిధిగా వచ్చిన చెన్ ఇవాన్ సూత్రప్రాయంగా ఒప్పుకొని మరుసటి రోజే (ఏప్రిల్ 28న) చైనా నుండి వచ్చిన ఆజ్ఞలతో దాని మీద సంతకం చేయడం లేదని, మొత్తంగా ఆ ప్రతిపాదిత విభజననే పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి చర్చల నుండి వైదొలిగారు. చివరకు, కేవలం బ్రిటీష్ ఇండియా మరియు టిబెట్ ప్రతినిధులే ఆ ఒప్పందం మీద సంతకం చేశారు. దీనితో చైనా ప్రకారం మక్ మహన్ రేఖకు ఆ దేశానికి ఎలాంటి సంబందం లేకుండాపోయింది. తర్వాత, దలైలామ కూడ టిబెటను ఒక దేశంగా పరిగణించంత వరకు తమ ప్రతినిధి పెట్టిన సంతకానికి, ఆ ఒప్పందానికి ఎలాంటి విలువ లేదని న్యూఢిల్లీలోనే ప్రకటించాడు. చివరికి సారాంశంలో సిమ్లా ఒప్పందం కేవలం ఏకపక్ష నిర్ణయం. దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఇదే విషయాన్ని చైనా వాదిస్తూ వస్తుంది.
బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం 1914 నుండి 1935 వరకు సర్వే ఆఫ్ ఇండియా ముద్రించిన ఏ మ్యాప్ లో కూడ మక్ మహన్ రేఖను చూపించలేదు. మొదటి సారిగా అన్ని బ్రిటీష్ ఇండియా ఒప్పందాలను రికార్డ్ చేసే ʹAitchison Treatiesʹ అనే పుస్తకంలో (వాల్యూం 14) సిమ్లా ఉప్పందం గురించి 1929లో ప్రస్తావించారు. చైనా ఆ ఒప్పందాన్ని తిరస్కరించినప్పటికి తవాంగ్ ప్రాంతం సగ భాగాన్ని బ్రిటీష్ ఇండియాలో కలిపిన వివరాలు పొందుపరిచారు. అయితే ఈ విషయాన్ని 1935లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి విదేశీ, రాజకీయ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఒలాఫ్ కరో తెలుసుకొని తవాంగ్ ప్రాంతాన్ని పూర్తిగా తమలో కలుపుకోపోతే భవిష్యత్ లో చైనా నుండి చొరబాట్లు పెరిగే ప్రమాదం వుందని భావించాడు. అతని ఆజ్ఞతో మొదటిసారిగా మ్యాప్ లలో మక్ మహన్ రేఖను అధికారికంగా చూపుతు తవాంగ్ మొత్తాన్ని బ్రిటీష్ ఇండియాలో కలిపేశారు. కాని ʹdemarcated boundaryʹ గానే గుర్తించారు. అయినప్పటికీ, 1929 రికార్డ్ పుస్తకాలను వెనుకకు తెప్పించి వాటిలో కూడ మార్పు చేసి వాటిని తిరిగి 1938లో ముద్రించారు. కాని ముద్రణ కాలాన్ని 1929 గానే చూపించారు. (1929 నాటి మొదటి పుస్తకం మూడు కాపీలు ఇప్పటికి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో, పీకింగ్ లిబ్రరీలో, భారత ప్రభుత్వ పూర్వకాలపు దస్తావేజులలో (archives) వున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు).
ఈ వివరాలకు చాలా ప్రాధాన్యత వుంది. ఎందుకంటే 1947లో అధికార బదలాయింపు జరిగిన తరువాత భారత ప్రభుత్వం మక్ మహన్ రేఖనే సరిహద్దుకు అత్యంత ప్రధానమైనదని, తూర్పున బ్రిటీష్ ఇండియాలో వున్న భూగమంతా తమదేనని ప్రకటించుకుంది. దీనిని ముందుగానే గ్రహించిన కొమింటాంగ్ ప్రభుత్వం జులై 1946 నుండి జనవరి 1947 నాటికే నాలుగు అధికార నోట్లో తన వ్యతిరేకతను బ్రిటీష్ ఇండియాకు పంపింది. కాని ఎలాంటి జవాబు తిరిగి పొందలేదు. దానికి బదులు, 1950 ఫిబ్రవరి నెలలో తవాంగ్ ను బలవంతంగా ఇండియా తన ఆధీనంలోకి తీసుకుంది. కాని 1949లో విప్లవం విజయవంతమై బలమైన ప్రజా విముక్తి సైన్యం కలిగి వున్న చైనా తన బలగాలతో టిబెట్ ను వెంటనే ʹవిముక్తిʹ చేయగలిగింది. అంతేకాదు, టిబెట్ ప్రతినిధులతో వారి జాతీయతను గౌరవిస్తూ, అన్ని జాతులతో సమానంగా ఉండేందుకు పెద్ద విప్లవ కుటుంబంలోకి స్వాగతమంటూ 17 అగ్రిమెంట్లను కుదుర్చుకుంది. ఇండియా మాత్రం చైనా మక్ మహన్ రేఖ దాటి రావడాన్ని టిబెట్ మీద ʹదాడిʹ గానే పరిగణించింది. తవాంగ్ చైనా చేతుల్లోకి పోవడం దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టే పరిణామమని భావించింది. ఈశాన్య ప్రాంతమే మునుముందు చొరబాటుదార్లకు రాజమార్గం అవుతుందని భావించింది. ఇదే విషయాన్ని వల్లభాయి పటేల్ చాలా స్పష్టంగా నెహ్రూకు రాసిన నోట్లో వివరించాడు.
కాని ఎంతోమంది చరిత్రకారులు టిబెట్-చైనా సంబందాల విషయంలో నెహ్రూ కొంత అమాయకంగా, మరికొంత భయంగా వ్యవహరించాడని ప్రస్తావించారు. టిబెట్ ఒక స్వతంత్ర్య దేశమని ఒకసారి, అదే సందర్భంలో అది చైనాలో అంతర్భాగమని ప్రకటించిన నెహ్రూ ద్వంద్వ పరిణామాలకు ఎందరో భారత అధికార ప్రతినిధులే నొచ్చుకున్నారు. చైనాతో వైరం ప్రపంచ శాంతికే విఘాతమని నెహ్రూ భావించాడని చరిత్రకారుల అంచనా. అయితే శక్తివంతమైన చైనా ఆధీనంలో టిబెట్ వుంటే లోడ్ చేసిన తుపాకి ఇండియా గుండె మీదికి గురి పెట్టినట్లేనని భయపడిన సందర్భాలు వున్నాయంటారు. నిజానిజాలు ఎలావున్నా, నెహ్రూ అమాయకుడు అనుకోవడం సరైన అవగాహన అనిపించదు. కాకపోతే, ప్రపంచం కన్నులలో ఒక శాంతికాముక దేశంగా, అహింసావాదులుగా మిగిలిపోవాలనే కోరిక మాత్రం నెహ్రూకు బలంగా వుండేది. దానిని బహిరంగంగానే అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు. ఏది ఏమయినా, చివరికి టిబెట్ చైనాలో అంతర్భాగమని 1954లో ఇండియా ఒప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత మిత్ర సంబంధాలు ఏర్పరుచుకోవడానికి, టిబెట్ ద్వార చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడాని, మొత్తంగా ఇరుదేశాలు శాంతియుత సహజీవనం చేయడానికి ఐదు సూత్రాలను (Five Principles of Peaceful Coexistence) ఏప్రిల్ 1954లో ఏర్పరుచుకున్నారు. అవే పంచశీల సూత్రాలు.
ఇంత వరకు పేపర్ మీద శాంతి సూత్రాలు బాగానే వున్నాయి కాని, ఆచరణలో ఇండియా టిబెట్లో జోక్యం చేసుకోవడం ఆపలేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి అమెరికన్ సామ్రాజ్యవాదంతో చేతులు కలిపి టిబెట్ ఆధారంగా విప్లవ చైనాను బలహీనపరిచే ప్రయత్నం మొదలు పెట్టింది. 1957 నుండే అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ (CIA) టిబెట్ తిరుగుబాటుదారులను రిక్రూట్ చేసుకొని భారత భూభాగంలో (డార్జిలింగ్ ప్రాంతంలో) శిక్షణా శిబిరాలు నడిపింది. ఆ మరుసటి సంవత్సరమే, మార్చ్-ఏప్రిల్ 1958లో టిబెట్ రాజధాని లాసాలో అల్లర్లు చెలరేగడంతో దలైలామ, అతనితో పాటుగ లక్ష మందికి రక్షణ కలిపించి, ఇండియాలో ఆశ్రయం ఇచ్చింది.
ఇదిలా వుండగా, పడమర సరిహద్దుల్లో చైనా తన ఆధీనంలో వున్న ఆక్సైచిన్ ప్రాంతంలో 750 మైళ్ళ పొడువున ఒక పెద్ద రోడ్ నిర్మాణాన్ని 1953లో మొదలు పెట్టి 1957లో పూర్తిచేసింది. ఆ విషయం 1959 వరకు నెహ్రూ ప్రభుత్వానికి తెలియదు. అప్పుడు తమ సైన్యాన్ని అక్కడికి పంపడంతో చైనా సైన్యంతో అగస్ట్ 1959లో లాంగ్డం దగ్గర జరిగిన పోరులో ఒక ఇండియన్ సైనికుడు చనిపోగ, మిగిలిన వాళ్ళు వెనుతిరుగాల్సి వచ్చింది. ఈ సంఘటన దేశ ప్రజలనే కాకుండ పాశ్చాత్య దేశాలను కూడ కలవర పెట్టింది. ఇదే విషయాన్ని చైనా పర్యటన సందర్భంగా సోవియట్ క్రుశ్చేవ్ కూడ ప్రస్తావించాడట. ʹఇండియన్ సరిహద్దులలో వాళ్ళ సైనికులను ఎందుకు చంపుతుండ్రు" అని క్రుశ్చేవ్ అడిగితే, ʹముందు వాళ్ళే మా సైన్యం మీదికి కాల్పులు జరిపారని" మావో సమాధానం చెప్పాడట. ʹమరి మీ వైపు నుండి ఎవ్వరు చనిపోలేదే" అని మరింత రెట్టింపుగా అడిగితే, పక్కనే వున్న చౌ ఎన్ లై ʹవాళ్ళు మా మీదికి కాల్పులు జరిపితే, మేము గాలిలోకి కాల్పులు జరపలేము కదా!" అని సమాధానం చెప్పాడట. ఆ కాల్పుల సంఘటన తర్వాత ఏప్రిల్ 1960లో చైనా ప్రీమియర్ చౌ ఎన్ లై ఇండియా వచ్చి ఒక ప్రతిపాదనను నెహ్రూ ముందు ఉంచాడు. అదేమంటే, పడమర ఆక్పై చిన్ లో ఇండియా చెప్పుకుంటున్న హక్కును వదులుకుంటే, తూర్పున ఇండియాకు కొంత అనుకూలంగా చైనా వ్యవహరిస్తుంది అనేది ముఖ్య సారాంశం. నెహ్రూకు ఆక్సైచిన్ ప్రాంతం ఇండియాకు అనుకూలమైనది కాదు, దాని వదులుకోవడం ద్వార పెద్దగా వచ్చే నష్టం ఏమి లేదు అనే విషయం తెలుసు. "ఆక్పై చిన్ మీద హక్కు ఇరు దేశాలు చేసే వాదన మీద ఆదారపడి ఉంటుంది" అని పార్లమెంట్లోనే ప్రకటించాడు. అంటే సమస్య వాదనకు సంబంధించే తప్ప వాస్తవానికి సంబందించింది కాదు. ఈ విషయం మీద స్పష్టత ఉన్నప్పటికీ, దేశంలో పెరిగుతున్న యుద్ధాన్మాద అసహన ఒత్తిడి ఒకవైపు ఆక్పై చిన్ సమస్యను చేతుల్లో ఉంచుకుంటేనే, ఈశాన్యంలో చైనా తన మాట కొంతైన వింటుంది అనే ఎత్తుగడతో చౌ ఎన్ లై ప్రతిపాదనను తోసిపుచ్చాడు.
ఇరుదేశాల మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత, అంతవరకు టిబెట్లో కోవర్ట్ ఆపరేషన్లకు పరిమితమైన ఇండియా నవంబర్ 1961లో ఇక సరిహద్దుల్లో ముందుకు దూసుకుపోయి చైనాను కట్టడి చేసే బహిరంగ పాలసీని (the "Forward Policy") తీసుకుంది. అమెరికన్ CIA మరియు ఇండియన్ ఇంటెలిజన్స్ బ్యూరో కలిసి చైనాకు వ్యతిరేకంగా పనిచేయడం ఉధృతపరిచాయి. ఇండియా 5000 మందితో ఒక సైనిక బలగాన్ని ఏర్పాటు చేసింది. దానికి Establishment 22 అని పేరు పెట్టింది. ఈ బలగానికి బ్రిటీష్ ఇండియా తరుపున రెండవ ప్రపంచ యుద్ధంలో 22వ రెజిమెంట్ కు కమాండర్ గా పనిచేసిన మేజర్ జనరల్ సుజాత్ సింగ్ ఉబానను చీఫ్ కమాండర్‌గా పెట్టారు. అందుకే ఆ బలగాలకు Establishment 22 అని పేరు పెట్టారు. కాని తర్వాత ఆ పేరును Special Frontier Force గా మార్చారు.
టిబెట్లో ఇండియా కొంచెం కొంచంగా ముందుకు పోవడాన్ని (the nibbling approach) తెలుసుకున్న చైర్మన్ మావో ʹఇండియా తన ఉరికి కావాల్సినంత తాడు తానే పేనుకునే వరకుʹ వేచివుండమని ఆదేశించాడట. ఆ తర్వాత ఇండియా మరో ముప్పై సంవత్సరాలు మనవైపు చూడకుండ గుర్తుండే దెబ్బ కొట్టండని ఆజ్ఞాపించాడట. దానితో అక్టోబర్ 20, 1962లో ప్రజా విముక్తి సైన్యం భారత సేనలపై మెరుపు దాడులు మొదలు పెట్టింది. బెంబేలెత్తిన ఇండియా అమెరికన్ ప్రత్యక్ష సహాయాన్ని కోరుతూ ప్రెసిడెంట్ కెన్నడీని వేడుకుంది. కేవలం పది గంటల వ్యవధిలోనే అమెరికా అన్ని రకాల సహాయం చేయడానికి మాట ఇచ్చింది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ను కూడ పంపింది. అమెరికన్ వాయుసైన్యం బంగాళాఖాతంలోకి ప్రవేశించే లోపె వెనక్కి పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే చైనా స్వచ్చందంగా నవంబర్ 21న (సరిగ్గా 31 రోజుల తర్వాత) యుద్ధ విరమణ ప్రకటించింది. అప్పటి వరకు అలీనోద్యమం అంటూ అప్పటి సూపర్ పవర్లకు సమాన దూరముంటూ (equi-distance) వచ్చిన ఇండియా అప్పటినుండి అమెరికా మరియు సోవియట్ కు సమాన దగ్గర (equal proximity) కావడం మొదలు పెట్టింది. దానితో ఇండియాకు అలీనోద్యమ నాయకత్వం వహించే నైతిక హక్కు లేదని ఎందరో ప్రపంచ నాయకులు బహిరంగంగానే విమర్శించారు.
యుద్ధం ముగిసిందే కాని యుద్ధవాతావరణం కొనసాగుతూనే వుంది. రెండు దేశాలు సైనిక బలాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. 1964లో చైనా మొదటి అణు పరీక్ష చేసింది. దానికి పోటీగా పదేండ్ల తరువాత ఇండియా 1974లో ʹబుద్ధుడు నవ్వుతున్నాడు" (the Smiling Buddha) అనే కోడ్ తో పోక్రాన్ లో మొదటి అణుపరీక్షను చేసింది. సరిహద్దులో వివాదం కొనసాగుతున్నా వ్యాపార, వాణిజ్య రంగాలలో రెండు
దేశాలు అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదే క్రమంలో తమ ఆయుధ శక్తిని పెంచుకున్నాయి. చైనా బూచిని చూపి వాజ్ పాయ్ ప్రభుత్వం రెండో అణుపరీక్షను మే 1998 లో "శక్తి" పేరుతో జరిపింది. ఒకవైపు కత్తులు దూసుకుంటూనే మరోవైపు కౌగిలించుకుంటూ వస్తున్నారు. 2006ను ʹఇండియా-చైనా స్నేహ సంవత్సరంగా ప్రకటించుకొని సంబరాలు జరుపుకున్నారు. 2009 నాటికి, చైనా ఇండియాకు అతి ముఖ్య వాణిజ్య భాగస్వామి అయ్యింది. అయినా కూడ రెండు దేశాలు నిరంతరంగా విస్తరణవాద ఎత్తుగడలను ఉపయోగించుకుంటూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధిలేని ప్రభుత్యాలు ఉన్నప్పుడు చరిత్రతో సంబంధంలేని వాదనలను పోగేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తారు. కొనసాగున్న డోక్లాం వివాదం అర్థం కావాలంటే రెండు దేశాల మధ్య ఉన్న విస్తారమైన, లోతైన చరిత్రను అర్థం చేసుకోవాలి. అవగాహనలేని ఆవేశంతో గుండెలు బాదుకొనే కాషాయపు దేశభక్తితో జరిగే ప్రయోజనం ఏమి వుండదు. సమాజాన్ని చీకటిలో వుంచి యుద్ధాన్మాదాన్ని పురికొల్పడం తప్ప. ఇక డోక్లాం ముగిసిందనో, ఇదే చివరిదనో అనుకుంటే, చరిత్రను తలకిందులుగా చూడడమే అవుతుంది!
(అరుణతార, సెప్టెంబర్ 2017)

No. of visitors : 499
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మద గజాన్ని నిలువరిస్తున్న గడ్డిపోచలు

అశోక్ కుంబము | 07.12.2016 11:22:16am

అంతరించి పోతుందనుకున్న జాతి చూపుతున్న తెగువ పోరాడె శక్తులన్నింటికి సంక్షోభ సందర్భంలో ప్రాణవాయువుగ మారనుంది. గెలుపు, ఓటమిల అంచనాలు ఏవైనా, రాజ్యం అండతో తెగబలి...
...ఇంకా చదవండి

అమరత్వం వెలుగులో

అశోక్ కుంబ‌ము | 16.08.2018 12:01:14am

అంతచిన్నవయసులోఆబిడ్డకుఎంతగొప్పఆలోచనలువున్నాయనిపించింది.ఆమె "మొత్తంసమాజాన్నిమనకుటుంబం" అనుకోవాలి అని అనగానే ఆపసిహృదయానికి మనసులోనె సల్యూట్చేసిన. పాలకవర్గ పల్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •