ఆన్ లైన్ విద్యపై ఇంతవరకు ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. ప్రజాదృక్పథం గల చాలమంది మేధావులు ఎన్నో వ్యాసాలూ రాసారు.. కుల, వర్గ, లింగ అంతరాలు, వివక్షత వున్న నేటి సమాజంలో ఈ ఆన్ లైన్ విద్య, ఆ అంతరాల, వివక్షతలను మరింత పెంచుతాయని తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అయితే, ఈ ఆన్ లైన్ విద్య సమాజ పురోగతికి, మార్పుకు అవసరమైన యువతరాన్ని ఎలా నిర్వీర్యంజేస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.
ఈ ఆన్ లైన్ విద్యకు బీజం 1961లో కొటారి కమీషన్ ప్రతిపాదనలోనే వుంది. వివిధ కారణాలవల్ల నియత విద్యకు దూరమైన వారికి దూరవిద్య ద్వారా విద్యనందించి, వారిని సమాజాభివృద్దిలోనే గాక, ఆ అభివృద్ధి ఫలాలకు భాగాస్వాములను చేయాలనే సంకల్పం నాటి కొటారిదిగా చెప్పవచ్చు. దేశం స్వపరిపాలనలోకి వచ్చినా తొలి దశాబ్దాలలో అందరికీ ఉచిత విద్యనందించే మౌలిక సదుపాయాల కలిగించేందుకవసరమైన ఆర్థిక పరిపుష్టి లేకపోవడం మరొక కారణంగావొచ్చు. ఉన్నతవిద్యకు అర్హతగల వయసులో వున్న 10.5 కోట్లమందిలో 75% మందికి అంటే 7.5 కోట్లకు పైగా ఉన్నతవిద్యకు అందుబాటులో లేదని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. తొలుత డిల్లీ విశ్వవిద్యాలయంలో 1962లో బిఎ కోర్సుతో దూరవిద్య ప్రారంభమయింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయమ(IGNOU), మరియు రాష్ట్ర స్థాయి ఓపెన్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. దాంతో, 2005 నాటికి వున్నతవిద్యనభ్యసించే విద్యార్థులలో 1/3 పై విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసిస్తున్నారు. అందులో 90% వెనుకబడిన కులాల, వర్గాల కుటుంబాలవారే గావడంలో ఆశ్చర్యమేముంది. 2008 UPA-1 ప్రభుత్వం సామూహిక సార్వత్రిక ఆన్ లైన్ కోర్సులను తన విధానంగా ప్రకటించింది. అయితే, ఈ తరహా దూరవిద్య, తరగతి గది విద్యకు అనుబంధంగా వుండేబదులు, నేడు నియతవిద్య స్థానాన్ని ఆక్రమించింది.
1990ల తర్వాత నూతన ఆర్ధిక విధానాల అమలు, గాట్ ఒప్పందంలో విద్యా, వైద్య రంగాలను వాణిజ్య రంగాలుగా పరిగణించడంతో విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడులు క్రమేపి తగ్గుతూ వచ్చాయి. ఆ ఖాళీలను ప్రైవేట్ రంగం భర్తీ చేసింది. దాంతో ప్రభుత్వ సంస్థలు తగినన్ని లేకపోవడం, వున్నవాటిల్లోనూ అధ్యాపకుల కొరత, విద్యాపరికరాల కొరత ఏర్పడంతో పాటు, ప్రభుత్వ విద్యాసంస్థల పట్ల మీడియా దుష్ప్రచారం, ప్రజల్లో వాటి పట్ల విముఖత, ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల మోజు ఏర్పడింది. విద్యార్జనలో వాసికన్నా, రాశికి ప్రాధాన్యత ఎక్కువయ్యింది. ప్రైవేట్ విద్యాసంస్థలు కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అంతో ఇంతో ఆర్థిక స్థోమత గలవారే గాక, ఇతరులూ, అప్పో-సప్పో జేస్తూ తమ పిల్లల్ని ప్రైవేట్ విద్యాసంస్థలలో చేర్చడం మొదలెట్టారు.
ఇక దూరవిద్య స్థానంలో ఆన్ లైన్ విద్య వస్తున్నది. దాని దుష్ప్రభావం కుల, వర్గ, లింగ వివక్షతో కూడిన మన సమాజంలో, ఇప్పటికే పై వివక్షతలకు గురవుతున్న కుటుంబాల పిల్లలపై, ప్రధానంగా విద్యార్థినులపై పడుతుంది. నియతవిద్యద్వారా కుటుంబ శ్రమ నుండి కొంతమేరకైన విద్యార్థినులకు విశ్రాంతి లభించేది. ఆన్ లైన్ విద్యవల్ల వాళ్ళు గృహంలోనే వుండవలసి వస్తుంది. దాంతో విద్యార్థినులు విద్యా వ్యాసంగంతో పాటు కుటుంబ పనులలో పాలుపంచుకోవలసి వస్తుంది. ఇక గృహిణులు కుటుంబ భారంతో పాటు, పిల్లల ఆన్ లైన్ చదువుపై కాలం కేటాయించక తప్పదు.
అంతర్జాలపు అందుబాటు:
ఆర్థిక అంతరాలుగల మనదేశంలో internet అందుబాటు అందరికీ సమాన స్థాయిలో ఉండదు. మెకిన్సి నివేదిక ʹడిజిటల్ ఇండియా (2019)ʹ ప్రకారం, 5.253 కోట్ల అంతర్జాల వినియోగదారులలో, 3.990 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులే. అంతేగాక, ప్రపంచ ఆర్థిక వేదిక (WORLD ECONOMIC FORUM) అధ్యయనం లో 2030 సంవత్సరానికంతా అంతర్జాల వినియోగదారులలో 80% మొబైల్ ఫోన్ వినియోగించేవారే వుంటారని తేలింది. మొబైల్ ఫోన్ ద్వారా పాఠాలు ఎక్కువసేపు వినడం కష్టం. అంతేకాదు, దానిపై ఎక్కువ సమయం ఏకాగ్రత నిలపడం మరీ కష్టం. దాని దుష్ప్రభావం విద్యార్థుల కనులపైనే గాక, చెవులపైనా పడుతుంది. హైదరాబాదు విశ్వవిద్యాలయం (UOH) లాంటి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులలోనే 50% మందికి కూడా లాప్టాప్ లేకపోవడం, వారిలో 45% మందికే internet అందుబాటు లో వుండటం, 18% విద్యార్థులకు internet అందుబాటు లో లేదంటే, ఇక సాధారణ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విద్యార్థుల సంగతి చెప్పాలా? గ్రామాల్లో నివసించే విద్యార్థుల సంగతి ఇంకా దారుణంగా వుంటుంది. గ్రామాల్లో internet అందుబాటు లో ఉండదు. గ్రామీణ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరుకై చెట్లెక్కి ప్రయత్నించడం దిన పత్రికలలో చూస్తూనే ఉన్నాము. internet అందుబాటులో వున్నా, తరచూ ఆటంకానికి గురవుతూ వుంటుంది. అపరిమితమైన డేటా కొనగలిగే శక్తి చాలామందికి లేదు. వారి ఇండ్లలో కూడా వారికి ప్రశాంతమైన వాతావరణం ఉండదు. చిన్న ఇండ్లలో, కనీసం 5 మంది కుటుంబ సభ్యులున్నచోట, విద్యార్థులకు ప్రశాంతంగా ఆన్ లైన్ క్లాసులు వినే అవకాశం దుర్లభమే. ఒకరికి మించి విద్యార్థులున్నచోట ఒకే మొబైల్ ను వినియోగించాల్సి వుంటుంది. అప్పుడావకాశం మగపిల్లలకే వుంటుంది. ఇవన్నీ పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు. అంతేగాదు, అనియత విద్యకు, డిగ్రీలకు గౌరవం లేదు, ఉద్యోగ నియామకాలలో అవకాశాలు తక్కువ.
ఇక కులీనవర్గాల విద్యార్థుల కోసం పాలకులు 100 INSTITUTES OF EXCELLENCE ను(అందులో జిందాల్ లాంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకే ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు) ఏర్పాటుచేస్తారు. అంతేగాక, కేంద్రప్రభుత్వం నిధుల కేటాయింపులో కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకే ప్రాధాన్యత నిస్తుంది. అందులో చదివే విద్యార్థులు మెజారిటీ ఏ వర్గం వారో చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు 2015-16 సం.నికి ప్రణాళిక గ్రాంట్లలో 56%, ప్రణాలికేతర గ్రాంట్లలో 88% కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు UGC విడుదలచేసింది. కేవలం, 522 విద్యార్థులు, 56 అధ్యాపకులున్న SOUTH ASIAN యూనివర్సిటీ కి 2015-16 లో రూ.260 కోట్లు విడుదలచేయగా, 10 వేలమంది విద్యార్థులు, 600 అధ్యాపకులున్న జాదవపూర్ విశ్వవిద్యాలయాలనికి కేవలం రూ.226 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
తరగతి గది:
తరగతి గది అంటే కేవలం నాలుగు గోడలు, పైకప్పు కాదు. అది మినీసమాజం (society in miniature). రక్తమాంసాలతో సజీవంగా, జీవకళతో వుట్టిపడుతున్న విద్యార్థీ, విద్యార్థినులతో నిండిన ఒక సమాజం. విభిన్న కులాల, వర్గాల, సంస్కృతుల, భాషల సమాహారం. రేపటి పౌరులను తీర్చిదిద్దే ఒక సమున్నత సామాజిక ప్రక్రియకు స్థానం తరగతి గది. స్పందన, ప్రతిస్పందనలతో, వాదోపవాదాలతో, వాగ్వివాదాలతో జీవిత సత్యాలను తెలుసుకొనే చోటు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు నవయవ్వనంతో, మహోన్నతమైన ఆశయాలు, ఆకాంక్షలు కలిగిన యువతీయువకులతో రేపటి ఉజ్వల భారతదేశానికి బీజం వేసే సుక్షేత్రాలు. విద్య అంటే సమాచార సేకరణ కాదు. బట్టీపట్టి ర్యాంకుల సంపాదనా కాదు. విద్య విద్యార్థికి తన చుట్టూ వున్న సమాజం గురించిన శాస్త్రీయ అవగాహన కల్పించాలి. గతాన్ని విశ్లేషించి, వర్తమానాన్ని పరిశీలించి, ఉజ్యల భవిష్యత్తుకు దారిచూపించే కాగడా విద్య. ఆ వెలుగులో పయనించాల్సిన విద్యార్థులను, కేవలం యాంత్రికంగా నడిచే రోబోలుగా తయారు చేసేందుకే ఈ ఆన్ లైన్ విద్య. పాలకులకు, వారిని శాసిస్తున్న స్వదేశి, విదేశీ కార్పోరేట్లకు కావల్సినదదే. ఆలోచించే మెదడు, ప్రశ్నించే చైతన్యంగల యువతరం అంటే నేటి పాలకులకు భయం. 1960 దశకంలో దోపిడీపీడనలకు వ్యతిరేకంగా ప్రపంచమంతటా అగ్నికెరటాలై ఉవ్వెత్తున ప్రజ్వరిల్లింది యువత. ʹ యువతరమా, నవతరమా, ఇదే అదను కదలి రమ్ము/ నీరక్తం పుష్ఫించగా ఈ దేశం ఫలియించునుʹ అంటూ విప్లవకవి, అమరుడు చెరబండ రాజు పిలుపునందుకున్న మన యువతరం, గనులనుండే గాకా, బడుల నుండీ వెళ్ళిన వారే. ఆ తర్వాత, నూతన ఆర్థిక విధానాల అమలుతో, సమాజం లో సమిష్టితత్వం నశించి, వ్యక్తివాదం పెరిగింది. అన్యాయాలను, సామాజిక వివక్షతను, దోపిడీని ప్రశ్నించి ఎదురుతిరిగే చైతన్యాన్ని నీరుగార్చేందుకై, నూతన విద్యావిధానమంటూ కేవలం సాంకేతిక విజ్ఞానమే పరమావధిగా, చరిత్రను వక్రీకరిస్తూ, మత జాడ్యాన్ని మెదళ్ళకెక్కించే విద్యను పాలకులు నేటి యువతరానికందిస్తున్నారు. అయినా, కళ్ళముందు జరుగుతున్న, దోపిడీ, పీడనలకు, అణచివేతలకు విద్యార్థులు స్పందించక మానలేదు. రోహిత్ వేముల (ఆత్మ)హత్యానంతరం దేశంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో కులోన్మాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డుకెక్కారు. ఆ సామూహిక నిరసనలు సహజంగానే పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయి. మరో విప్లవకవి వివి ప్రశ్నించినట్టు, ʹసత్యాన్ని చాటిచెప్పే పుస్తకాల్ని (సంఘటనలను) నిషేధించగలరు(దాచగలరే)గాని/ సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేయగలరు?ʹ రోహిత్ వేముల హత్యపై ఎన్ని తప్పుడు ప్రచారాలు జేసినా, మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా నేటి సమాజంలోని అగ్రవర్ణ దురహంకారాన్ని, ఆధిపత్యాన్ని, దాడులను దాచలేరుగా.
ఆ తర్వాత కొంత కాలానికే మైనారిటీ వ్యతిరేక CAA, NRC, NPA లకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. యువతరం, అదీ విద్యార్ధి లోకం కుల, మత, ప్రాంత తేడాలు లేకుండా, నేటి పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పింది. సమాజాన్ని మేల్కొలిపే ప్రక్రియలో అగ్రభాగాన తొలి నుండి నిలిచింది విద్యార్థులే. 1960 దశకంలో ఈ అర్దవలస-అర్దభూస్వామ్య సమాజాన్ని కూకటి వేళ్ళతో పెకలించే ప్రజావుద్యమాలకు ఊపిరినిచ్చింది విద్యార్థులే. కలకత్తా, ఉస్మానియా, కాకతీయ తదితర విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రామాలకు తరలి ప్రజల్ని చైతన్య పరచి, వారిని విప్లవోద్యమంలో భాగస్వాముల చేయడమేగాక, ముందుండి నడిపించిన చరిత్ర కళ్ళముందు వుంది. ఆ విద్యార్థుల చైతన్యానికి కారణం, భిన్న వర్గాల, కులాల, యువకుల మధ్య క్యాంపస్ జీవితమిచ్చిన సమిష్టితత్వం. గ్రామాల్లో పేరుకపోయిన కులవివక్షతతో నలిగిన యువతరానికి, ముఖ్యంగా కింది కులాల, వర్గాల వారికి, మరీ ముఖ్యంగా మహిళలకు, క్యాంపస్ జీవితం స్వేచ్చా, స్వాతంత్రం, సౌభాతృత్వం అనే వాటిని అనుభవంలోకి తెచ్చింది. సమిష్టిజీవితం, సహకారం, సంఘీభావంతో తాము ఏదైనా సాధించవచ్చనే విశ్వాసం యువతీ, యువకులకు కల్గించింది వారి క్యాంపస్ జీవితమే. అయితే, ఆ క్యాంపస్ జీవితానికి మొదటి షరతు తరగతి విద్యనే. ఈ యువలోకపు చైతన్యం, ఆదర్శాలు, ఆవేశ, ఆగ్రహాలు, ఆత్మవిశ్వాసం, తిరుగుబాటుతత్త్వం, త్యాగనిరతి తమ దోపిడీ పాలనకు అడ్డుకట్టవేస్తాయని తెలిసిన పాలక వర్గం, వాటికి మూలమైన క్యాంపస్ జీవితాన్ని, దానికవసరమైన తరగతి విద్యనూ యువకులకు దూరం జేసే కుట్రనే ఈ ఆన్ లైన్ విద్యా విధానపు అమలు. పుస్తకాలలోని అక్షరాలను మక్కికిమక్కీ బోధించే వుపాధ్యాయులేగాక, ఆ అక్షరాల వెనుకనున్న భావాలను సమాజానికి వర్తిస్తూ, నేటి సమాజపు మేడిపండు స్వరూపాన్ని విప్పిజెప్పే వుపాధ్యాయులూ వుండటమే పాలకులకు కంటగింపయ్యింది. యువలోకపు చైతన్యం, ఆదర్శాలు, ఆవేశ, ఆగ్రహాలు ఆత్మవిశ్వాసం, తిరుగుబాటుతత్త్వం, త్యాగనిరతిని సమాజ మార్పుకు తరలించే ఆ వుపాధ్యాయులూ పాలకుల కంటిలో నలుసులే. అందుకే వారిపై ఉపా చట్టాలు, సంకెళ్ళు, జైళ్ళు.
ఒకవైపు కుల, వర్గ, లింగ వివక్షతల, పీడనల అనుభవాలు కల్గిన యువతరం మరోవైపు అప్రజాస్వామిక వ్యవస్థ గుట్టువిప్పి, విద్యార్థులని భాద్యతాయుతమైన, చైతన్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే గురువులు సంగమించే భావాల రణక్షేత్రం తరగతి గది. ఆ తరగతి గదికి యువతను దూరం చేయడం ద్వారా, ఈ దోపిడీ వ్యవస్థ తనకు పొంచివున్న ప్రమాదాన్ని తాత్కాలికంగానైనా తప్పించోకోజూస్తున్నది.
బడుగుబలహీన వర్గాలకు విద్యను దూరంజేసి, క్రమంగా సమాజ మార్పులో, అభివృద్ధిలో వారి పాత్ర, వాటా లేకుండా చేయడమే ఈ ఆన్ లైన్ విద్య లక్ష్యం. అంతేగాక విద్యారంగపు బాధ్యతలనుండి ప్రభుత్వం పూర్తిగా తొలిగి, దాన్ని కార్పోరేట్లకు అప్పగించే క్రమం కోవిడ్ సమయంలో వేగం పుంజుకుంటున్నది. విపత్తులను పెట్టుబడి తన ప్రయోజనాలకు ఎలా వినియోగించుకుంటుందో ఈ విధాన అమలు మనకు తెలియజేస్తుంది. దీన్ని ఉపాధ్యాయులు విద్యారంగ భాగాస్వాములుగానేగాక బాధ్యతాయుత పౌరులుగా, ప్రజలను చైతన్యపరచి, భాగస్వాముల జేసి ఉద్యమించాల్సిన అవసరం నేడు ఎంతైనా వుంది.
Type in English and Press Space to Convert in Telugu |
సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకైʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,... |
వీళ్లు చేసిన నేరం ఏంటి?హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్... |
ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని ..... |
ప్రత్యేక హేళనఅవును మరిచాను
మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది
వలసల ,ఆత్మహత్యల తో
సీమ దాహం, దాహం అంటూ
అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది
అమరావతి నుండి ... |
దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్తఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా?గతం లో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ.వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మం గా వుండే... |
ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం చావు సమవర్తి. అవును, కాదనలేని వాస్తవమే. రాజూ పేదా, నవాబూ గరీబు, మంత్రులూ బంట్రోతులూ ఎవరయినా సరే, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా.... |
నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు, అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేవలం పాలనా వికేంద్రీకరణ అంటూ కార్యాలయాలనన్నటినీ ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల జరగేదేమీ ఉండదు. అది పాలనా...... |
నేరమే అధికారమైన వేళతూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు
బాంబులను పంచాలేధతడు
బావాలను పంచాడతడు
బావాలను బంధించాలనుకోకు
అవి తేనేటీగలై
ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి... |
పాలకులకు అందివచ్చిన వరం కోవిడ్ 19తనకు తాను పెట్టుబడిదారివ్యవస్థ మలినాలనుండి శుబ్రపరుచుకొనే ప్రయత్నాలలో భాగమే ఈ కోవిడ్ వైరస్ అని వైరాలజిస్ట్(వైరస్ అధ్యయన వేత్త) లు అంటున్నారు.... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |